Thursday, 9 January 2020

సుందర కాండము-17




శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-17

అశోకవన విధ్వంసము, రాక్షస వధ
కార్యే కర్మణి నిర్దిష్టో యో బహూన్య౭పి సాధయేత్
పూర్వ కార్య విరోధేన స కార్యం కర్తుమ్ అర్హతి    5.41.5

న హ్యేకః సాధకో హేతుః స్వల్ప స్యా౭పీ హ కర్మణః
యో హ్యర్థం బహుధా వేద స సమర్థోఽర్థ సాధనే     5.41.6 

చేయవలసిన పని పూర్తియైన తర్వాత ఆ పనికి విరోధము కలుగకుండా దానికి సంబంధించిన అనేక కార్యములు చేయగలవాడే నిజమైన కార్యకర్త, సేవకుడు, దూత.  హనుమ చేయవలసిన ప్రధమ కార్యము సీతా దర్శనము. ఈ సందర్శన కార్యము రావణాసురుని శక్తి సామర్థ్యములు తెలుసుకొన్నప్పుడే ఆమెను రక్షించుట ద్వారా పూర్ణత చెందును. కావున సీతను చూచుట యను ప్రధమ కార్యమునకు హాని కలుగకుండా రావణ బలాదులను తెలుసుకొనుట వంటి ఇతర కార్యములను చేయుట అవసరమని హనుమ భావన. ఈ ప్రపంచమున పని స్వల్పమైనను ఒకే ఒక్క మార్గము ద్వారా దానిని సాధించుట కష్టము. కాబట్టి కార్యమును సాధించుటకు అనేక ఉపాయములను చూడగలిగిన వాడే సమర్ధుడైన సాధకుడు.

ఈ విధముగా హనుమ శత్రు బలము తెలుసుకొనగోరి, యుద్ధము జరిగినచో వారి బలములు తెలియగలవు అని  నిశ్చయించుకొనెను. అందుకు రావణునికి ప్రీతిపాత్రమైన ఈ అశోక వనము యొక్క ధ్వంసమే మేలు అని ఆలోచించి ఆ వనమును ధ్వంసము చేసెను. అక్కడ కాపలా యున్న రాక్షస స్త్రీలు పరుగు పరుగున సీతమ్మ దగ్గరకు వచ్చి ఆ మహాబలుడైన కోతి ఎవరని అడిగిరి. అందుకు సీత "అహి రెవ హ్యహేః పాదాన్ విజానాతి న సంశయః" (పాము జాడ పామే ఎరుగును. కామ రూపముతో వచ్చిన రాక్షసుడే అనుకొంటిని). ఇచ్చట సీత అసత్యము ఆడ వచ్చునా? హనుమ సీతకు ప్రాణ రక్షకుడు. సత్యము పలికినందువలన అతనికి అపాయము కలుగును కావున అట్లు చెప్పినది. ఇట్లే రాముడు కూడా అయోధ్య నుండి బయల్వెడలునప్పుడు దశరథుడు సుమంత్రుని రథము ఆపుమని అనెను. కానీ రాముడు సందడిలో వినపడలేదని మరునాడు రాజుకు చెప్పమని సుమంత్రునికి చెప్పెను. ఈ విధముగా రాముడు కూడా అసత్యము ఆడినాడు కదా. ఇది దోషము కాదా అను సందేహము వచ్చును. ఇచ్చట గమనించితే తండ్రి ఇచ్చిన సత్యవాక్యమును నిలుప వలెను. దశరథుడు ఆ దేశమునకు రాజు. అట్టి రాజు అసత్య వచనుడు కారాదు. అతని సత్యమును నిలుపుటకై కుమారుడైనను, మంత్రియైనను అసత్యమాడుటలో దోషము లేదు.  ఒక గొప్ప సత్యమును నిలబెట్టుటకు అవసరార్థము ఒక అసత్యము చెప్పుటలో దోషము లేదు. కానీ సీత మాత్రము హనుమను కాపాడవలెననే ఆదుర్దాతో, అతని శక్తి సామర్థ్యముల మీద పూర్తిగా నమ్మిక లేక అసత్యము ఆడి తన స్త్రీ సహజమైన బేలత్వమును చాటుకొన్నది. అంతియే గాక అరణ్య కాండలో మారీచుని మాయా అక్రనాదము విన్న తర్వాత రాముని శక్తి సామర్థ్యములపై రవ్వంత అపనమ్మకంతో, సంశయముతో రామునికి సహాయము చేయవలసినదిగా సీత, లక్ష్మణుని ఆదేశించి పరుష పదజాలంతో దూషించి కష్టములను కొనితెచ్చుకొన్నది. అట్టి సంశయమును రావణుడు తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. ప్రస్తుత కాలములో ఎదుటివాని శక్తిని తగిన అంచనా వేయకుండా  స్త్రీ స్వతంత్రముగా వ్యవహరించినచో ఇట్టి కష్టములే తనకు తన కుటుంబమునకు కలుగును. దేశ కాల పరిస్థితులను బట్టి స్త్రీ స్వభావము మారుతుండునని, మెరుపు లోని చాంచల్యము స్త్రీకి సహజము కానీ సీతకు అట్టి దోషములు లేవని అగస్త్య మహర్షి అరణ్య కాండలో శ్రీరామునికి చెప్పి యున్నాడు.  కానీ మాయా ప్రభావము వలన సీత కూడా అందుకు అతీతురాలు కాదని తెలియు చున్నది. తరువాత రాక్షస స్త్రీలు రావణుని వద్దకు యేగి ఒక మహావానరము అశోక వనమును ధ్వంసము చేసినదని, అది సీతతో మాట్లాడినదియని చెప్పిరి. ఆ మాటలు విన్న రావణుడు "దీప్తాభ్యా మివ దీపాభ్యాం సార్చిషస్నేహ బిందవః" కోపము కలిగిన అతని నేత్రములు నుండి కన్నీటి బిందువులు మండుచున్న దీపముల నుండి మంటతో నూనె బొట్లు పడినట్లు పడెను. వెంటనే రావణుడు హనుమను నిగ్రహించుటకు ఎనుబదివేల కింకరులను నియమించెను. వారిని చూచి తన మహాకాయమును పర్వతములాగా పెంచి తోరణముపై నుండి ఈ విధముగా జయధ్వానము చేసెను. (ఇది జయమంత్రము. నిత్యము చదువుకొన్నచో శత్రుబాధలు లేక విజయము చేకూరును).

జయ త్య౭తి బలో రామో లక్ష్మణ శ్చ మహా బలః
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణా౭భిపాలితః    5.42.33

దాసోఽహం కోసలేన్ద్రస్య  రామ స్యా౭క్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతా౭౭త్మజః 5.42.34

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్
శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః        5.42.35

అర్దయిత్వా పురీం ల౦కా మ౭భివాద్య చ మైథిలీమ్
సమృద్ధా౭ర్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ 5.42.36

మహాబల సంపన్నులైన రామలక్ష్మణులకు జయము. రాముని రక్షణలో యున్న సుగ్రీవునకు జయము. అట్టి రామునకు నేను దాసుడను. శత్రుసైన్యములను దునుమాడ సమర్థత గల వాయుపుత్రుడనైన నేను హనుమంతుడను. వేయిమంది రావణులు వచ్చినను నన్ను యుద్ధములో ఎదిరింపలేరు. వారిని శిలలతో, వృక్షములతో సకల రాక్షసులను నాశనము చేసి లంకాపురిని మర్దించి, మైథిలికి నమస్కరించి కార్యమును సాధించి అందరూ చూచుచుండగా వెళ్లెదను.  ఈ విధముగా ఘోషణము చేసి గరుత్మంతుని వేగమున వారి నందరిని హతమార్చెను. శత్రువులను చంపుట అను కార్యము చేయువాడను తాను కాదనియు, ఆ కర్మ తనది కాదనియు, దాని వలన కలుగు కష్టనష్టములు తనివి కాదనియు భావించుతూ, అహంకారమును వీడి హనుమ కర్మ చేయుచుండెను. భగవద్గీత లో కూడ శ్రీక్రుష్ణుడు నిష్కామ కర్మ చేయమని చెప్తాడు. భగవాన్ రమణులు చెపుతూ .. "నేను" అనే అహంకారము ను వదలి మౌనము, శాంతి (limitless contentment) అనే సాధనాలతో అత్మస్వరూపమును ఎరిగి, ఆత్మసాక్షాత్కారము పొంద వలసి ఉన్నది. దీనినే భగవత్ స్వరూపము, భగవత్ సాక్షాత్కారము అనవచ్చు. జీవుని యొక్క సహజ ప్రశాంత స్థితియే"శివము" గా గుర్తించవచ్చు. ధాన్యము యొక్క పొట్టును వేరు చేస్తే, దానినే బియ్యము గా గుర్తించవచ్చు. Similarly, so long as one is bound by karma one remain as "jiva". When the bond of ignorance is broken, one shines as "SIVA", కావున జీవునికి, శివునికి బేధము లేదు. దీనిని సూచించుటకు హనుమ తోరణముపై కూర్చుండెను. మానవునికి విరోధులు ముఖ్యముగా మువ్వురు. అవి నేను స్వతంత్రుడను అనుకొనుట, తనను తాను రక్షించుకోగలను అనుకొనుట, తాను చేయు కర్మలు తనకొరకు అనుకొనుట. ఈ మూడింటిని జయించుటయే విరోధి విజయము. గుమ్మమునకు గల నాలుగు కమ్ములలో హనుమ పై కమ్ముపై నిలిచి యుండును. అదియే తోరణమునకు చిహ్నము. ఆ తర్వాత యుద్ధమునకు వచ్చిన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలినిని, మంత్రి సుతులైన ఏడుగురిని, విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘసు, భాసకర్ని మొదలగు సేనాగ్ర నాయకులను వారి వారి సైన్యముతో సహా సంహరించెను. అప్పుడు రావణుని ఆజ్ఞ మేరకు అక్షకుమారుడు యుద్ధమునకు బయలుదేరెను. అక్షకుమారునికి హనుమను చూడగానే అతనిపై గౌరవమేర్పడెను. అప్పుడు అతను హనుమ వేగమును, బలమును, పరాక్రమమును నిర్ధారించుకొని హనుమతో యుద్ధమునకు పూనుకొనెను. మహాపరాక్రమముతో పోరాడుతున్న బాలుడైన ఆ అక్షకుమారుడిపై జాలిగల్గినా, శత్రువుపై జాలి గూడదని తలచి, హనుమ అతని పాదములు పట్టుకొని గరుత్మంతుడు పామును కొట్టినట్లు, ఆ అక్షకుమారుడిని పలుమార్లు నేలకేసి కొట్టి చంపెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

సుందర కాండము-16





శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-16
 
సీతాదేవిచే కాకాసుర వృత్తాంతము, చూడామణి ప్రధానము
సీతాదేవి ఆనందించినదియై హనుమతో రామలక్ష్మణుల కుశలములు, వారి కార్యసన్నద్ధత గురించి అడిగెను. జనస్థానములో శ్రీరాముడు ఒక్కడే పదునాలుగు వేల మంది రాక్షసులను సంహరించెను. అట్టి పురుష శ్రేష్ఠుడు ఆపదలచే చలించు వాడు కాడు. నాకు ఇంకా రెండు నెలల సమయము మాత్రమే యున్నది. కావున రాముని త్వరగా తీసుకొని వచ్చి నన్ను చెర నుంచి విడిపింపుము అని అనెను. అప్పుడు హనుమ సీతతో నీ అనుమతి అయితే ఇప్పుడే నేను నిన్ను రాముని దగ్గరకు చేర్చగలను అని అనగా సీత రవ్వంత హనుమ శక్తి సామర్థ్యములకు శంకించినను, తరువాత అతని శక్తిని చూసి ఉత్తమ పతివ్రత అయిన సీత అందుకు మృదువుగా నిరాకరించెను.
 
(ఇక్కడ గమనించితే రావణుడు సీతను బలముతో తీసుకొని వచ్చెను కానీ తనంతట తానుగా పరపురుషుని స్పర్శ ఇష్టపడదు. ఆధ్యాత్మిక శాస్త్ర దృష్టితో సీత నిర్ణయము సరియైనదే. పరపురుషుడనగా ఇచ్చట పరధర్మము లేదా పరవృత్తి. అటువంటి పరధర్మము యొక్క భుజములపై కూర్చొని స్వస్థానమునకు వెళ్ళుట యోగ్యము కాదు. గీతలో ఈ పరధర్మ స్వీకారం నిషేధించబడినది.
 
శ్లో|| శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
      స్వధర్మో నిథనం శ్రేయః పరధర్మో భయావహః
 
పరవృత్తి రూప హనుమానుని స్పర్శ సీత స్వీకరించదు. రామ రావణుల వృత్తి సంఘర్షణ జరిగి, రావణ వృత్తిని జయించి, రాముడు తనదైన సీతావృత్తిని స్వీకరింప వలెను. అదియే శ్రేయస్కరమైనది).
అందుకు హనుమ మిక్కిలి సంతోషించి రాముడు గుర్తింపగల ఏదైనా అబిజ్ఞానమును ఒసగమని కోరెను. అప్పుడు సీత గద్గద స్వరముతో కాకాసురుని కథను రామునికి గుర్తుగా ఈ విధముగా తెలియ చేయు చున్నది.
 
శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా                 5.39.12
తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుణ్డయత్
తమ్ అహం లోష్టమ్ ఉద్యమ్య వారయామి స్మ వాయసం  5.39.15
 
దారయన్ స చ మాం కాక  స్త త్రైవ పరిలీయతే
న చా౭ప్యుపారమ న్మాంసా ద్భక్షా౭ర్థీ బలి భోజనః          5.39.16
ఆసీనస్య చ తే శ్రాన్తా పున రుత్స౦గమ్ ఆవిశమ్
 
క్రుధ్యన్తీ చ ప్రహృష్టేన త్వయా౭హం పరిసాన్త్వితాః     5.39.19
బాష్ప పూర్ణ ముఖీ మన్దం చక్షుషీ పరిమార్జతీ
లక్షితా౭హం త్వయా నాథ వాయసేన ప్రకోపితా            5.39.20
 
పరిశ్రమాత్ ప్రసుప్తా శ్చ రాఘవా౭౦కే ప్య౭హమ్ చిరం
పర్యాయేణ ప్రసుప్త శ్చ మ మా౭౦కే భరతా౭గ్రజః          5.39.21
స తత్ర పునరే నాథ వాయస స్సముపాగమత్
 
తత సుప్తప్రబుద్దాం మాం రామాస్యాంకా త్సముత్థితామ్  5.39.22
వాయస స్సహసాగమ్య విదధార స్తనాంతరే
పునః ్పున రథోత్పత్య విదధార స మాం భృశమ్    5.39.23
స దర్భ సంస్తరా ద్గృహ్య బ్రహ్మణోఽస్త్రేణ యోజయత్ 5.39.30
స దీప్త ఇవ కాలా౭గ్ని ర్జజ్వాలా౭భిముఖో ద్విజమ్
స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి         5.39.31
 
తత స్తం వాయసం దర్భ స్సో౭మ్బరే౭నుజగామ హ
అనుసృష్ట  స్తదా కాకో జగామ వివిధాం గతిమ్               5.39.32
న శర్మ లబ్ధ్వా లోకేషు త్వా మేవ శరణం గతః              5.39.35
మత్కృతే కాక మాత్రేఽపి బ్రహ్మా౭స్త్రం సముదీరితమ్   5.39.39
 
కస్మా ద్యో మాం హరే త్త్వత్తః క్షమసే తం మహీపతే
తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్   5.39.69
ప్రదేయో రాఘవా యేతి సీతా హనుమతే దదౌ
 
"చిత్రకూటమిలో ఒకనాడు నేను అలసి రాముని తొడపై పరుంటిని. అప్పుడు మాంసము నందు ఆసక్తి గల ఒక కాకి నా గుండెలపై గీరుచు కొరికెను. ఈ విధముగా అది నేను ఎంత ప్రయత్నించినను పోకుండెను. ఆ విధముగా అలసి పోతిని. కొంతతడవకు రాముడు నా ఒడిలో పరుండెను. మరల ఆ వాయసము ఎగిరి వచ్చి నా వక్ష స్థలమును గోళ్ళతో గీరగా, నా గుండెల నుండి వచ్చిన రక్త బిందువులతో తడిసి రాముడు మేల్కొనెను. అందుకు రాముడు మిగుల కోపించి అక్కడి ఒక దర్భను (గరిక) బ్రహ్మాస్త్రమున అభిమంత్రించి వాయసముపై వదిలెను. ఇంద్రుని కుమారుడైన ఆ వాయసమునకు ముల్లోకములలో ఎవరును రక్షించ లేకపోయిరి. చివరకు అది తిరిగి రాముని శరణు జొచ్చినది. శరణు పొందిన కాకము ఒక కంటిని మాత్రమే ఆ అస్త్రమునకు ఇచ్చి దాశరథునికి నమస్కరించి వెడలి పోయెను. అట్టి కాకము మీద నాడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన రాముడు ఈనాడు నన్ను రక్షించుటలో జాగు యేల?".  ఇట్లు చెప్పి వస్త్రములో దాచి యుంచిన దివ్యమగు చూడామణిని[1] తీసి రామునికి ఒసగమని సీత హనుమకు ఇచ్చెను అట్లా మణిని పుచ్చుకొని హనుమ సీతకు నమస్కరించి వెనుకకు వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను. 
 
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] రత్నాకరం నందు పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు, వరుణనునికి ఇవ్వగా అతడు జనకునికి ఇచ్చెను. జనకుడు ఈ మణిని వివాహకాల సమయమున తన భార్య ద్వారా సీతకు ఇచ్చెను
--(())--

Monday, 6 January 2020

సుందర కాండము-15




"మిత్రులకు, శ్రేయోభిలాషులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు"
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-15

సీత కోరికపై హనుమ శ్రీరాముని రూపమును  వివరించుట
శ్రీరాముని ఆత్మ గుణ గుణములను వర్ణించిన తరవాత, హనుమ, శ్రీరాముని రూపమును ఈ విధముగా వర్ణించు చున్నాడు.
 
విపులా౭౦సో మహా బాహుః కమ్బు గ్రీవః శుభా౭౭ననః
గూఢ జత్రుః సుతామ్రా౭క్షో రామో దేవి జనై శ్శృతః  5.35.15
 
దున్దుభి స్వన నిర్ఘోషః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్
సమ స్సమ విభక్తా౭౦గో వర్ణం శ్యామం సమాశ్రితః  5.35.16
 
త్రిస్థిర స్త్రిప్రలమ్బ శ్చ త్రిసమ స్త్రిషు చోన్నతః
త్రి తామ్ర స్త్రిషు చ స్నిగ్దో గంభీర స్త్రిషు నిత్యశః   5.35.17
 
త్రి వలీవాం స్త్ర్యవణత శ్చతు ర్వ్య౭౦గ స్త్రి శీర్షవాన్
చతుష్కల శ్చతు ర్లేఖ శ్చతు ష్కిష్కు శ్చతు స్సమః  5.35.18
 
చతుర్దశ సమ ద్వన్ద్వ శ్చతుర్ద౦ ష్ట్ర శ్చతుర్గతిః
మహౌ ష్ఠ హను నాస శ్చ ప౦చ స్నిగ్ధో౭ష్ట వంశవాన్  5.35.19
దశ పద్మో దశ బృహ త్త్రిభి ర్వ్యాప్తో ద్వి శుక్లవాన్
షడు న్నతో నవ తను స్త్రిభి ర్వ్యాప్నోతి రాఘవః   5.35.20

సీతా మాతా! శ్రీరాముడు విశాలమైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము, సుందరమగు ముఖము, దుందుభి దానిని పోలిన కంఠస్వరం, మెఱయుచున్న దేహచ్చాయతో అన్ని అవయవములు సమముగా కలవాడు, నీలమేఘశ్యాముడు.
 
1. త్రిస్థర; వక్షం, మనిబంధము, పిడికిలి స్థిరముగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
2. త్రిప్రలంబ: కనుబొమలు, బాహువులు, వృషణములు పొడవుగా యున్నవాడు. ఇవి సంపన్నుల లక్షణములు,
3. త్రిసమః: కేశాగ్రములు, వృషణములు, జానువులు సమముగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
4. త్రిషుచోన్నత: ఉదరము, నాభి చుట్టుభాగము, హృదయము ఎత్తుగా గలవాడు. ఇవి రాజ లక్షణములు,
5. త్రితామ్రః: నేత్రాంతములు, గోళ్లు, అరచేతులు ఎర్రగా నున్నవాడు. ఇవి సుఖపురుషుని లక్షణములు,
6. త్రిషుస్నిగ్ధః: పాదరేఖలు, శిరోరుహములు, లింగము ఈ మూడును నునుపుగా నున్నవాడు. ఇవి భాగ్యవంతుని లక్షణములు,
7. త్రిషు గంభీరః: స్వరము, నడక, నాభి ఈ మూడును గంభీరంగా నున్నవాడు. ఇవి ప్రసంశాపాత్రుని లక్షణములు,
8. త్రివలీవాన్: కడుపుపై మూడు మడతలు కలవాడు,
9. త్రవ్వనతః: స్థనములు. చూచుకములు, పాదరేఖలు లోతుగా యున్నవాడు,
10. చతుర్వ్యంగః: నరములు తేలని పాదములు, ఒక్కొక్క వెంట్రుక కల రోమ కూపము, దీర్ఘముగా లేని లింగము, మాంసము కాని పొత్తికడుపు కలవాడు, 
11. త్రిశీర్షవాన్: మూడు సుడులు గల్గిన శిరస్సు కలవాడు,
12. చతుష్కలః: బొటన వ్రేలి మొదట నాలుగు రేఖలు కలవాడు. ఇవి ఎన్ని రేఖలు ఉండునో అన్ని వేదముల యందు ప్రావీణ్యము యుండును,
13. చతుర్లేఖః: నుదిటి యందు నాలుగు రేఖలు, పాదము నందు చేతి యందు నాలుగు రేఖలు కలవాడు. లలాటముపై నాలుగు రేఖలు యున్నచో 200 యేండ్లు ఆ పైన, మూడు రేఖలు యున్నచో 100 యేండ్లు, రెండు రేఖలు యున్నచో 60 యేండ్లు, ఒక రేఖ యున్నచో 20 యేండ్ల లోపు ఆయుర్దాయము యుండును,
14. చతుష్కిష్కుః: తొంబదియారు అంగుళముల ఎత్తు కలవాడు,
15. చతుస్సమః: బాహువులు, జానువులు, ఊరువులు, గండ స్థలములు సమముగా యున్నవాడు,
16. చతుర్దశసమద్వన్ద్వః: కనుబొమలు, ముక్కుపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్థనాగ్రములు, ముంజేతులు, మణికట్లు, మోకాళ్ళు, వృషణములు, పిరుదులు, చేతులు, పాదములు మడమలు. ఈ పదునాలుగు సమముగా యున్నవాడు,
17. చతుర్దంష్ట్రః: దంతములు మెరియుచు గట్టివై, వాడివై, సమములై ఉండువాడు. రెండు పలువరసలలో మధ్యగల నాలుగు దంతములకును పక్కనున్న నాలుగు పండ్లకును 'దంష్ట్రలు' అని పేరు. కాంతి గలవి, నునుపైనవి, పెద్దవి, మొనదేలినవి, సమములు ఐన దంష్ట్రములు మంగళకరములు,
18. చతుర్గతిః: సింహము, శార్ధూలము, గజము, వృషభము అను నాలుగు జంతువుల నడక వంటి నడక గలవాడు,
19. మహౌష్ఠహనునాసః: పెదవి, దౌడ, ముక్కు, ఎత్తుగా బొద్దుగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
20. ప౦చస్నిగ్ధః: చూపులో, దంతములో, చర్మములో, కేశములలో, పాదములలో స్నిగ్ధత కలవాడు,
21. అష్టవంశవాన్: వెన్నెముక, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్లు, చేతులు, ముక్కు, కన్నులు, చెవులు, లింగము. పొడవైన ఈ ఎనిమిది అవయవములు గలవాడు,
22. దశపద్మ: ముఖము, నేత్రములు, పెదవి, అంగుడు, స్థానములు, గోళ్లు, చెవులు, పాదములు. పద్మాకారములగు అవయవములు ఈ పది గలవాడు,
23. దశబృహత్: శిరస్సు, లలాటము, చెవులు, మెడ, గుండెలు,  ఉదరము, చేతులు, పాదములు, వీపు, హృదయము అను పది అవయవములు పెద్దవిగా యున్నవాడు,
24. త్రిభిఃవ్యాప్తః: తేజస్సు, యశస్సు, కాంతి అను ఈ మూడిటిచే అంతటా వ్యాపించినవాడు,
25. ద్విశుక్లవాన్: దంతములు, నేత్రములు తెల్లగా యున్నవాడు,
26. షడున్నతః: కక్షము లేదా చంక, కక్షి, వక్షస్థలం, ముక్కు, మూపు, నుదురు అను ఈ ఆరు అవయవములు ఎత్తుగా యున్నవాడు,
27. నవతమః: కేశములు, గోళ్లు, చర్మము, లింగము, వ్రేళ్ళు, గుంపులు, బుద్ధి, గడ్డము, వెంట్రుకలు అను ఈ తొమ్మిది సూక్ష్మముగా యున్నవాడు,
28. త్రిభిః వ్యాప్నోతి: ధర్మార్థకామములను మూడింటిని పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్ణవముల యందు అచ్చరించు వాడు.
ఇట్లు సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన సర్వ లక్షణములు గలవాడు శ్రీరాముడు. ఇట్టి లక్షణములు గల రామునకు అన్ని విధముల సమానముగా యుండు వాడు లక్ష్మణుడు.
అమ్మా! రామలక్ష్మణులు ఇద్దరు నిన్ను చూడవలెనని చాలా కుతూహలంతో యున్నారు. వారు వానర రాజైన సుగ్రీవునితో మైత్రి చేసుకొని యున్నారు. అమ్మా! హనుమ అను పేరుగల నన్ను ఇచ్చటికి దూతగా పంపినారు. రాత్రివేళ లంకలో ప్రవేశించి రావణుని చూచితిని. శోకముతో బాధపడుచున్న నిన్ను చూచితిని. దేవి! నేను రామదూతను. సుగ్రీవ సచివును. కార్యార్థినై వచ్చిన నాతో మాట్లాడుము. అమ్మా! నీవు దిగులు వీడుము. నీకెట్లు ఇష్టమైన అట్లు చేయుము. ఈ విధముగా చెప్పి సీతమ్మకు నమ్మకము కలుగుటకై వినయముతో ఇట్లు పలికెను.
 
వానరో౭హం మహాభాగే దూతో రామ స్య ధీమతః
రామ నామా౭౦కితం చేదం పశ్య దేవ్య౭౦గుళీయకమ్  5.36.2
 
ప్రత్యయా౭ర్థం తవా౭౭నీతం తేన దత్తం మహాత్మనా
సమా౭౭శ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖ ఫలా హ్య౭సి      5.36.3
 
అమ్మా! నేను వానరుడను. రామ దూతను. రామనామాంకితమగు ఈ అంగుళీయకమును చూడుము. నీకు విశ్వాసము కలుగుటకై శ్రీరాముడు ఒసగిన దీనిని తెచ్చినాను. అశ్వాసము నందుము. నీ దుఃఖము పోవుచున్నది. నీకు మంగళము అగుగాక. అని హనుమ సీతతో విన్నవించి ఊరకుండెను. సీతమ్మ ఆ ఉంగరమును గ్రహించి రామదర్శనము అయినట్లు మిక్కిలి ఆనందించింది.
శ్రీరామ జయరామ జయజయ రామ
--(())--

Saturday, 4 January 2020

సుందర కాండము-14



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-14
సీత కోరికపై హనుమ శ్రీరాముని గుణగణములను వివరించుట
సీతాదేవి కోరికపై శ్రీరాముని శరీర చిహ్నములను, గుణగణములను ఈ విధముగా వివరిస్తున్నాడు.
జానన్తీ బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి
భర్తుః కమల పత్రా౭క్షి సంఖ్యానం లక్ష్మణ స్య చ  5.35.6
రామః కమల పత్రాక్షః సర్వ భూత మనోహరః
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకా౭౭త్మజే  5.35.8
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకా౭౭త్మజే                              
తేజసా౭౭దిత్య సంకాశః క్షమయా పృథివీ సమః
బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః  5.35.9
రక్షితా జీవలోక స్య స్వజన స్య చ రక్షితా
రక్షితా స్వస్య వృత్త స్య ధర్మ స్య చ పరంతపః 5.35.10
రామో భామిని లోక స్య చాతు ర్వర్ణ్య స్య రక్షితా
మర్యాదానాం చ లోక స్య కర్తా కారయితా చ సః  5.35.11
అర్చిష్మాన్ అర్చితో౭త్య౭ర్థం బ్రహ్మచర్య వ్రతే స్థితః
సాధూనామ్ ఉపకారజ్ఞః ప్రచారజ్ఞ శ్చ కర్మణామ్   5.35.12
రాజ విద్యా వినీత శ్చ బ్రాహ్మణానామ్ ఉపాసితా
శ్రుతవాన్ శీల సంపన్నో వినీత శ్చ పరంతపః  5.35.13
యజుర్వేద వినీత శ్చ వేదవిద్భిః సుపూజితః
ధనుర్వేదే చ వేదే చ వేదా౦గేషు చ నిష్ఠితః      5.35.14
సత్య ధర్మ పరః శ్రీమాన్ సంగ్రహా౭నుగ్రహే రతః
దేశ కాల విభాగజ్ఞః సర్వ లోక ప్రియం వదః   5.35.21
తల్లీ! రామలక్ష్మణుల రూపములను, వారి చిహ్నములను నీకు తెలిసినను నన్నడిగావు కనుక చెపుతున్నాను. రాముడు తామర పూరేకుల నేత్రములు గలవాడు, సమస్త ప్రాణులకు ఆనందమును చేకూర్చువాడు, పుట్టుకతోనే చక్కని దేహ సౌందర్యము, గుణ సంపద గలవాడు. తేజస్సును సూర్యుడివంటివాడు, సహనము నందు భూదేవి, బుద్ధి యందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. సర్వ ప్రాణులకు రక్షకుడు, శరణాగతి వత్సలుడు, ధర్మ రక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు. లోక మర్యాదలను పాటించుతూ ఇతరులచే పాటింప చేయువాడు, నాలుగు వర్ణములను రక్షించువాడు. జ్ఞాన సంపన్నుడు, లోక కళ్యాణమునకై తాను కర్మలను ఆచరించుతూ ఇతరులచే ఆచరింప చేయువాడు. (యద్యదా చరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే .. భ.గీ. 3 /21 శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తనని లోకులు పాటింతురు) సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రు భయంకరుడు. మూడు వేదములు, వేదాంగముల యందు నిష్ణాతుడు, వేద పండితులచే పూజింప బడువాడు. బ్రహ్మచర్యా దీక్షితుడు. (వివాహమైన తర్వాత కూడా ఋతుకాలమున తప్ప, స్త్రీతో రమింపకుండుట బ్రహ్మచర్యము. శివ గీత అష్టమాధ్యాయము లో ఈ విధంగా చెప్పారు.  స్త్రీ ఋతుస్నానము నాలుగవ రోజున చేయును. ఆ రోజు నుండి పదునారవ రోజు వరకు ఋతుకాలముగా నిర్ధేశించబడినది. అప్పుడు మాత్రమే సంతానము కల్గును. మిగిలిన రోజులలో సంతాన ప్రాప్తి ఉండదు. అంటే ఋతుకాలములో స్త్రీ సంగమము వంశాభివృద్ధి కొరకుగానే పరిగణించబడినది). శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు, సత్య భాషణము నందును, ధర్మాచరణము నందును నిరతుడు, ధర్మ మార్గమున ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు. అందరితోడను ప్రియముగా మాట్లాడు వాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ

Friday, 3 January 2020

సుందర కాండము-13





] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-13
 

సీతాదేవికి వినబడునట్లు హనుమ రామకథను వినిపించుట
ఏవం బహువిధాం చిన్తాం చిన్తయిత్వా మహా కపిః   5.31.1
 

సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ
తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠ స్తారా౭ధిప నిభా౭౭ననః
 

రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వ ధనుష్మతామ్       5.31.6
రక్షితా స్వస్య వృత్తస్య స్వజన స్యా౭పి రక్షితా
 

రక్షితా జీవ లోకస్య ధర్మస్య చ పరంతపః               5.31.7
తస్య సత్యా౭భిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః
 

తస్య సత్యా౭భిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః
సభార్యః సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్      5.31.8
 

జనస్థాన వధం శ్రుత్వా హతౌ చ ఖర దూషణౌ
తత స్త్వ౭మర్షా౭పహృతా జానకీ రావణేన తు           5.31.10
 

వంచయిత్వా వనే రామం మృగ రూపేణ మాయయా
స మార్గమాణ స్తాం దేవీం రామ స్సీతాం అనిన్దితాం  5.31.11
 

ఆససాద వనే మిత్రం సుగ్రీవం నామ వానరం
తత స్స వాలినం హత్వా రామ: పర పురంజయః     5.31.12
 

ప్రాయచ్ఛ త్కపి రాజ్యం త త్సుగ్రీవాయ మహా బలః                         
సుగ్రీవేణా౭పి సందిష్టా హరయ: కామ రూపిణః        5.31.13
 

దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతి సహస్రశః
అహం సంపాతి వచనా చ్ఛత యోజన మా౭౭యతం    5.31.14
 

హనుమ పలువిధములుగా ఆలోచన చేసి సీతాదేవి మాత్రమే శ్రద్ధగా వినునట్లుగా మధుర వచనములు పలికెను. ఇక్ష్వాకు వంశజులలో కీర్తిమంతుడు, శౌర్య పరాక్రములు కలవాడు అయిన దశరథుడు కలడు. అట్టి దశరథుని జ్యేష్ఠ కుమారుడు అయిన రాముడు సర్వధర్మములలో శ్రేష్టుడు. తన ధర్మములను తాను రక్షించుకొనుచు, తన వారిని, జీవలోకము నంతను రక్షించువాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి సీతాలక్ష్మణులతో కలసి అరణ్యములకు వెడలెను. అక్కడ పెక్కు రాక్షసులను సంహరించెను. రాముని చేతిలో ఖర, దూషణ, త్రిశురులు హతమైరి. అప్పుడు రావణుడు మాయలేడి సహాయముతో జానకిని అపహరించెను. రాముడు సీతాన్వేషణ చేయుచు సుగ్రీవునితో మైత్రి చేసి వానర రాజైన వాలిని సంహరించి సుగ్రీవుని రాజును చేసెను. సుగ్రీవుని ఆదేశము మేరకు నేను సీతను వెతుకుచు నూరు యోజనములు సముద్రమును దాటి రాముని వలన విన్న శుభలక్షణ సంపన్నురాలైన సీతను చూచితిని. ఈ విధముగా పలికి హనుమ మిన్నకుండెను. అప్పుడు కేశములచే కప్పబడియున్న సీత  చెట్టుపై బాలభానుని వలె వెలుగొందుచున్న మారుతిని గాంచెను. సీతాదేవి తేజోమూర్తియైన ఆ మారుతిని చూడగానే ఒకింత స్పృహ కోల్పోయి ఇది స్వప్నము కాదుకదా అని ఆలోచన చేసెను. అయినను నిద్రలేని నాకు స్వప్నము ఎట్లు వచ్చును? ఇట్లా ఆలోచించి సీత దేవతా సమూహమునకు ఇట్లు ప్రార్థించెను.
 

నమో౭స్తు వాచస్పతయే సవజ్రిణే
స్వయమ్భువే చైవ హుతా౭శనాయ చ
అనేన చోక్తం య దిదం మమా౭గ్రతో
వనౌకసా త చ్చ తథా౭స్తు నా౭న్యథా    5.32.14
 

బృహస్పతికి, ఇంద్రునకు, బ్రహ్మకు, అగ్నిదేవునకు నమస్సులు. ఈ వానరుడు మాటలు తథ్యములు అవుగాక! అప్పుడు నెమ్మదిగా హనుమ చెట్టు దిగి సీతకు నమస్కరించెను (అప్పుడు రాక్షస స్త్రీలు నిద్రలో యుండిరి) సీతాదేవితో హనుమ సాద్వీ నీవెవరవు? రామపత్నివియే అని నా విశ్వాశము. అప్పుడు ఆమె తన్ను సీతగా చెప్పుకొని, దుష్ట రాక్షసుడైన రావణుడు నన్ను అపహరించి తెచ్చినాడు. ఇంకా నాకు రెండు మాసములు మాత్రమే గడువు యున్నది అనెను. అంత హనుమ రామలక్ష్మణుల కుశల వార్తలు చెప్పెను. అందుకు సీత ఎంతయో సంతోషించి ..

కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా
ఏతి జీవన్తమ్ ఆన౦దో నరం వర్ష శతా ద౭పి      5.34.6
 

లోకములో వాడుకలో నున్న సామెత నా కెంతయో శుభకరముగా కనబడుచున్నది. జీవించియున్న మానవునికి నూరేండ్లకైనను ఆనందము కల్గును అను మాట నా విషయములో సత్యమైనది. (ఈ వాక్యము చాలా ముఖ్యమైనది. పెద్దవారు పిల్లలకు చెప్పవలసినది). అయినను సీతమ్మ మదిలో యున్న చిన్న సంశయమును గూడ తీర్చుటకై రాముని గుణగణములను, పరాక్రమమును, రూప లావణ్యములను అదే విధముగా లక్ష్మణునివి చెప్పగా సీత మారుతిని విశ్వసించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Thursday, 2 January 2020

సుందర కాండము-12



*శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-12*
*సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడుట*
సీత మనస్సు రాక్షస రాజైన రావణుడు క్రూరముగా పల్కిన మాటలకు బెదిరినదియై విలపించు చుండెను.
*నై వా౭స్తి దోషమ్ మమ నూనం అత్ర*
*వధ్యా౭హమ్ అస్యా ప్రియ దర్శన స్య*
*భావం న చా స్యా౭హ మ౭నుప్రదాతుమ్*
*అలం ద్విజో మన్త్రమ్ ఇవా౭ద్విజాయ* 5 28 5
*నూనం మ మా౭౦గా న్య౭చిరా ద౭నా౭౭ర్యః*
*శస్త్రైః శితై శ్ఛేత్స్యతి రాక్షసేన్ద్రః*
*తస్మి న్న౭నాగచ్ఛతి లోక నాథే*
*గర్భస్థ జన్తో రివ శల్య కృన్తః*                 5 28  6
ఈ భయంకరుడైన రాక్షసుడు ఎట్లయినను నన్ను సంహరించును కావున నేను ఆత్మహత్య చేసుకొనుటలో దోషము లేదు. శ్రీరాముడు రెండు నెలలలోపు రాకున్నచో గర్భములో యున్న బిడ్డ సుఖప్రసవం గాకున్నచో శల్యముతో చేధించునట్లు నన్ను ఈ రాక్షసుడు తప్పక మ్రుక్కలు చేయును. ఈ విధముగా సీత పరిపరి విధములుగా శ్రీరాముని తలచుకొని దుఃఖించుతూ ..
*శోకా౭భితప్తా బహుధా విచిన్త్య*
*సీతా౭థ వేణ్యుద్గ్రథనం గృహీత్వా*
*ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్రమ్*
*అహం గమిష్యామి యమ స్య మూలమ్* 5 28 18
 తన జడనే ఉరిగా వేసుకొని తనువును చాలించెదను అని నిర్ణయించుకొనెను. అప్పుడు మరల ఆమెకు పెక్కు శుభశకునములు కనబడినవి. అప్పుడు సీతకు ఆందోళన దూరమై మనస్తాపము శాంతించెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

Wednesday, 1 January 2020

సుందర కాండము-11



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-11
త్రిజట స్వప్నము
సీతాదేవి ఆ రక్కసుల మాటలకు మిగుల పరితాపము చెందుచు ..

హా రామేతి చ దుఃఖా౭౭ర్తా పున ర్హా లక్ష్మణేతి చ
హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామినీ 5 25 11
 
లోక ప్రవాదః సత్యో౭యం పణ్డితైః సముదా౭౭హృతః
అకాలే దుర్లభో మృత్యుః స్త్రియా వా పురుష స్య వా      5 25 12           
 
య త్రా౭హ మేవం క్రూరాభీ రాక్షసీభి: ఇహా౭ర్దితా
 
జీవామి హీనా రామేణ ముహూర్తమ్ అపి దుఃఖితా         5 25 13
ధిగ్ అస్తు ఖలు మానుష్యం ధిగ్ అస్తు పర వశ్యతామ్
న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మ చ్ఛన్దేన జీవితమ్    5 25 20
 
సీతాదేవి రామా, లక్ష్మణా, కౌసల్యా, సుమిత్రా అనుచు దుఃఖించెను. స్త్రీ, పురుషులలో ఎవ్వరికైనను తాము కోరుకొన్నప్పుడే మరణము సంభవించదు అను ప్రాజ్ఞుల మాట సత్యము. ఇట్టి రాక్ష స్త్రీలచే బాధింపబడుతూ ఒక్క క్షణమైనను జీవించి యుండరాదు. మరల స్వస్థత తెచ్చుకొని నా జీవితము శ్రీరాముని అధీనములోనిది కావున ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశము లేదు[1].  ఈ విధముగా జానకి అధోముఖియై నిరంతరము కన్నీరు కార్చుచు విలపించుచుండెను. అప్పుడు ఆ రాక్షస స్త్రీలలోని త్రిజట తనకు కలిగిన స్వప్న వృత్తాంతము చెపుతూ శ్రీరాముని విజయము, రాక్షసుల వినాశనం సూచించింది అని చెపుతుంది.
 
చన్ద్ర సూర్యౌ మయా దృష్టా పాణిభ్యాం పరిమార్జతీ
తత స్తాభ్యాం కుమారాభ్యామ్ ఆస్థితః స గజోత్తమః       5.27.16
 
సీతయా చ విశాలా౭క్ష్యా ల౦కాయా ఉపరి స్థితః
పాణ్డు రర్షభ యుక్తేన రథే నా౭ష్ట యుజా స్వయమ్        5.27.17
 
ఆ స్వప్నములో ఏనుగు అంబారీపై శ్రీరామునితో గూడి సీత ఊరేగుచుండగా, సీత తన పతి యొడినుండి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుట చూచితిని. (ఆదిత్య మండలం వాతు, చంద్రమండలం మేవ వా| స్వప్నే గృహ్ణతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్మహాత్|| ఆరోహణం గోవృషకుంజరాణాం ప్రాసాదశైలాగ్ర నానస్పతీనాం| స్వప్నమున సూర్యమండలముగాని, చంద్రమండలముగాని తన చేతులతో స్పృశించిన మహారాజ్యము ప్రాప్తించును. ధ్రువమండలము, శైలాగ్రమునకు చేరుకొనుట, గజారోహణము తప్పకుండ సంపదలు కల్గును). త్రాగుచు, యెర్రని  వస్త్రములు ధరించి, నూనె పూయబడిన దేహముతో గన్నేరు దండలు దాల్చి   పుష్పకముపై నుండి రావణుడు పడిపోవుటను స్వప్నములో గాంచితిని. (బలి పశువు మెడలో గన్నేరు దండలు అలంకరించుట ఆచారము). శ్రీరాముడు దివ్యమైన పుష్పక విమానమును ఎక్కి ఉత్తర దిశకు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లెను. (ఈ విషయము అనంతరము శ్రీరాముడు అయోధ్యకు రాజుకాగలడని సూచిస్తున్నది).రావణుడు శిరోముండనం గావించుకుని, నల్లని వస్త్రములు ధరించి, నూనె త్రాగుచు, పిచ్చివాడివలె గాడిదలు కట్టిన రథముపై దక్షిణ దిశకు వెడలెను. రావణుని సుతులు, కుంభకర్ణుడు నూనె పూసిన దేహములతో దక్షిణ దిశకు వెడలిరి. ఒక్క విభీషణుడు మాత్రము దివ్య గజమును అధిరోహించి ఆకాశమునందు యుండెను. ఈ విధముగా త్రిజట తన స్వప్న వృత్తాంతమును తెలిపి రాక్షస స్త్రీలతో సీత యెడల జాగరూకతతో, మర్యాదగా మెలుగుడు, ఆమెను శరణు వేడుడు అని చెప్పింది. అంత సీతకు శుభశకునములు కంబడినవి.
శ్రీరామ జయరామ జయజయ రామ
 
[1] మానవ జన్మను ఇచ్చినది భగవంతుడు, కావున ఇది భగవధీనమైనది. కావున జీవితమును త్యజించుటకు  ఎవ్వరికిని అధికారములేదు కావున ఎవ్వరును ఆత్మహత్యకు పాల్పడరాదు.