Thursday, 6 February 2020

యుద్ధ కాండము-21

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-21
రావణ పరాభవము
రణరంగమున మూర్ఛితుడై యున్న రావణుడు స్పృహలోకి వచ్చెను. పిమ్మట వాడియైన తన శరములను, ధనస్సును గ్రహించి భీకరముగా పోరుసల్పగా వానర వీరులందరు పలాయనం చిత్తగించిరి. అప్పుడు హనుమ శ్రీరాముని వద్దకు వెళ్లి విష్ణుభగవానుడు, గరుత్మంతుడిపై కూర్చొని దైత్యులను సంహరించినట్లు, నా (హనుమ) భుజములపై కూర్చొని రావణునకు దండన ఒసగమని కోరెను. అందుకు సమ్మతించిన శ్రీరాముడు హనుమ భుజములపై నెక్కి ధనుస్సు టంకారనాదము గావించెను. ఆ టంకారము వానరులలో ఉత్సాహమును, రాక్షసులు లో భీతిని గొల్పించెను.  శ్రీరాముడు రాక్షసరాజగు రావణునితో ఇట్లు పలికెను.
య దీన్ద్ర వైవస్వత భాస్కరాన్ వా
స్వయమ్భు వైశ్వానర శంకరాన్ వా
గమిష్యసి త్వం దశ వా దిశో వా
తథా౭పి మే నా౭ద్య గతో విమోక్ష్యసే     6 59131
తతో రామో మహా తేజా రావణేన కృత వ్రణమ్
దృష్ట్వా ప్లవగ శార్దూలం క్రోధస్య వశ మేయివాన్  6.59.136
యో వజ్ర పాతా౭శని సన్నిపాతాన్
న చుక్షుభే నా౭పి చచాల రాజా
స రామ బాణా౭భిహతో భృశా౭౭ర్తశ:
చచాల చాపం చ ముమోచ వీరః          6 59139
రావణా! నీవు ఇంద్రుడు, యముడు, సూర్యుడు - వీరి యొద్దకు కానీ, బ్రహ్మ, అగ్ని, శంకరుడు - వీరి సమీపమునకు గాని, లేక దశ దిక్కులకు గాని పరుగిడి పోయినను ఇప్పుడు నా చేతి నుండి కాపాడబడజాలవు. శ్రీరాముని వచనములు విని రావణుడు రాముని మోయుచున్న హనుమను తీవ్రమగు బాణములతో కొట్టెను. రావణ బాణములతో దెబ్బతిన్న కొలది సహజమగు తేజస్సు గల హనుమ అంతకంతకును తేజస్వంతుడయి విజృంభించు చుండెను. రాముడు సుందరమగు రూపము గలవాడు. ఇతరులకు ఆనందం గలిగించువాడు. అట్టివాడు రావణుని దెబ్బలు తిని రక్తముతో తడిసి యున్న హనుమను జూచి కోపమునకు వశుడయ్యెను. ఈ శ్లోకము రామ స్వభావమును నిరూపించును. ఎప్పుడు పడితే అప్పుడు అతనికి కోపము రాదు. కోపము వచ్చినను అతని మాటలలో పౌరుష్యముగాని, అశ్లీలముగాని కనబడదు. తనకంటే, తనవారికి బాధ కలిగినప్పుడు సహింపజాలడు. కొట్టినవాడు రావణుడు. దుష్టమైన మాటలు మాటలాడుటయే అతని స్వభావము. "రావయతి అసత్ ప్రలాపాన్ కారయతి" చెడుమాటలను పలికెడివాడు, పలికించెడివాడు రావణుడు. సేవకునికి కలిగిన వేదనను చూచి రాముడు క్రోధుడాయెను. ఇది రామ స్వభావము. కోపము వచ్చెడి పద్ధతి ఇది. పిదప శ్రీరాముడు రావణునిపై ఆక్రమణ సలిపి రథము, గుఱ్ఱములు, ఛత్రము, పతాకం, సారథి మున్నగు వాటితో కూడిన అతని రథమును చేధించెను. ఏ రావణుఁడైతే వజ్రము యొక్క అఘాతముచే కూడా క్షోభ పొందకుండెనో, అట్టి రావణుడు శ్రీరాముని బాణఘాతములచే గాయపడి కంపితుడై పోయి సాయంకాలమున ప్రభ తగ్గిన సూర్యుని వలననే తేజోరహితుడయ్యెను. అట్టి స్థితి యందు యుద్ధభూమిలో రాక్షసరాజైన రావణునితో శ్రీరాముడు ఇట్లు చెప్పెను.
కృతం త్వయా కర్మ మహత్ సుభీమం
హత ప్రవీర శ్చ కృత స్త్వయా౭హమ్
తస్మాత్ పరిశ్రాన్త ఇతి వ్యవస్య
న త్వం శరై ర్మృత్యు వశం నయామి   6.59.142
గచ్ఛా౭నుజానామి రణా౭ర్దిత స్త్వం
ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం
ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ
తదా బలం ద్రక్ష్యసి మే రథస్థ:  6.59.143
రావణా! ఇతరులకు అసాధ్యమైన రీతిలో నీవు యుద్ధము చేసి యుంటివి. ఫలితముగా నా పక్షమున యున్న పెక్కు గట్టి వీరులు నెలకొరిగిరి. ప్రస్తుతము నీవు మిగుల అలసి యుంటివి.అందువలన నేను ఇప్పుడు నిన్ను మృత్యుముఖమునకు పంపను. కావున నీవు లంకకు వెళ్లి సేద తీర్చుకొనుము. పిమ్మట రథముపై ధనుర్బాణములను తీసుకొని రణరంగమునకు తిరిగి రమ్ము. అప్పుడు నీకు నా బలమెంతయో తెలియగలదు అని చెప్పెను. రావణుడు, గర్వమును, సంతోషమును కోల్పోయినవాడై లంకకు పోయెను. ఆ రాక్షసరాజు లంకలో ప్రవేశించిన పిమ్మట రాముని బాణములకు మిక్కిలి భీతిల్లి ఆందోళన పడ సాగెను. ఇది మన భాగ్యము. రాముడు ఆయుధము లేనివానిని, పరిగెత్తుచున్న వానిని, వెనుతిరిగిన వానిని, రక్షించు అని అనక పోయినను తనను రక్షించుకొను ప్రయత్నము చేయని వాడిని తగిన ఆయుధ సామాగ్రి లేక నిర్వీర్యుడై చలించి పోవుచు నేలపై యున్నవానిని కొట్టడు. లోకములో అందరి ద్వేషమును పొంది జీవించు చున్నాడు రావణుడు. పొందవలసిన శ్రీరామసన్నిధి పొందుటకు అవకాశము లభించియు జారవిడుచుకొన్నాడు. ఇది అంతయు మన జీవితములో జరుగుచునే యుండును.
(ఈ 59 వ సర్గ మకుట భంగము అనగా కిరీటము విరుగుట ప్రధానముగా నిరూపించిన సర్గ కావున దీనిని పారాయణ చేసినచో దీర్ఘకాలం నుండి చికిత్సకు లొంగక భాధించుచున్న రోగములు తప్పక తగ్గును. ఎన్నడును నేలపడని కిరీటము ఎట్లు నేలపడెనో, అదే విధముగా ఎప్పటి నుండియో వదలని రోగములు శరీరమును వీడిపోవును. సందేహము లేదు అని ప్రవచన శిరోమణి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు సెలవు ఇచ్చి యున్నారు).
త్రేతాయుగ ధర్మము ప్రకారము రాముడు నిరాయుధుడైన రావణుని సంహరించకుండా విడిచి పెట్టెను. ద్వాపరయుగములో మహాభారత యుద్ధములో నిరాయుధుడైన కర్ణుని యొక్క అకృత్యములను గుర్తుచేస్తూ కర్ణుని సంహరించమని అర్జునుని ప్రోత్సహించాడు భగవానుడైన శ్రీకృష్ణుడు. ఈ యుగ ధర్మము ప్రకారము అకర్మణత్వము అనగా శత్రువుపై జాలితో అతనిని వదులుట మంచిది కాదు. భారతీయ రాజనీతి యందటువంటి నిస్సహాయ అహంకారము మరియు అకర్మణత్వము చరిత్రలో చోటుచేసుకున్నది. ఈ అకర్మణత్వమును పృద్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీ పట్ల ప్రదర్శించెను. పదహారు పర్యాయములు మహమ్మద్ ఘోరిని  పృద్వీరాజ్ చౌహాన్ ఓడించెను. మరింత కఠినముగా ఉండకపోవుట వలన అనేక మార్లు తిరిగి తిరిగి భారత దేశముపై దండయాత్ర చేసి పదిహేడవ పర్యాయము ఘోరీ పృద్వీరాజ్ చౌహాన్ ను ఓడించి చివరకు సంహరించెను.  వ్యూహాలకు మారుపేరైన చాణక్యుడు, ఈతనినే కౌటిల్యుడు అని అంటారు. ప్రజారంజకంగా పాలించని నందులను రాజ్యభ్రష్టులను చేసి చంద్రగుప్తుని సింహాసనము అధిస్టింప జేశాడు. గొప్ప మహోన్నత మానవతా వాది. ప్రజలకు పాలన దగ్గర కావాలని చెప్పిన ఆయన ప్రజలే రాజ్య నిర్మాతలని తెలిపారు.  ప్రజారంజకము కానీ రాజులను కుటిల నీతితోనైనను సంహరించవచ్చు అని చెప్తాడు.  విదేశీయులు పరిపాలిస్తే ధనం వారి దేశానికి తరలించుకుని పోతారు... కాబట్టి మంత్రులు, ఉన్నతాధికారులుగా విదేశీయులకు అవకాశం ఇవ్వరాదని అన్నారు.
శ్రీరామ జయరామ జయజయ రామ

Tuesday, 4 February 2020

యుద్ధ కాండము-20*

*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-20*

*రావణుని శక్తిచే లక్ష్మణుడు మూర్ఛ నొందుట*

రావణుడు స్వయముగా గొప్ప సేనతో యుద్ధమునకు వచ్చుట చూచి శ్రీరాముడు విభీషణునితో ఆ వచ్చువారెవరని అడిగెను. అంత విభీషణుడు అందులోని ముఖ్యులైన అకంపనుడు, ఇంద్రజిత్తు, అతిరథుడు, అతికాయుడు, మహోదరుడు, పిశాచుడు, త్రిశిరసుడు, కుంభ నికుంభులు, నరాంతకుడు మొదలగు రాక్షస ప్రముఖులను గురించి చెపుతూ భూతములతో వచ్చుచున్న రుద్రుని వలె వచ్చువాడు రాక్షస రాజైన రావణుడు అని చెప్పెను. రాముడు రావణుని చూడగనే మహాతేజస్సుతో యున్న అతనిని చూచి ఆశ్చర్యము నొంది ఈ నాటికి ఈ పాపాత్ముడు నా కంట పడినాడు కావున నా మనసులో కలిగిన కోపమును వీనిపై చూపెదను అని విల్లు ఎత్తి సంధించి నిలిచెను. అప్పుడు రావణుడు మహాసర్పము వంటి మృత్యుతుల్యమైన ఒక బాణమును సుగ్రీవునిపై ప్రయోగించగా అతను నిలబడెను. వానర ప్రముఖులు పెద్ద పెద్ద పర్వతములతో రాగా వాటిని రావణుడు భగ్నము చేసెను. పెద్ద చేప సముద్రములోకి చొచ్చుకుపోయినట్లు వానర సైన్యము అనెడి సముద్రములోకి రావణుడు ప్రవేశించుచున్నాడు. రావణుని చూచి సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరమును పెళ్ళగించి రావణునిపైకి విసరగా దానిని రావణుడు చిన్నాభిన్నము చేసెను. అప్పుడు రావణుడు ఒక పదునైన బాణముతో సుగ్రీవునిపై వేయగా అది సుగ్రీవుని వేధించెను.సుగ్రీవుడు ఆ బాణపు దెబ్బతో అరచుచు నేలపై బడెను. వెంటనే మిగతా వానర వీరులు రావణునునిపై దండెత్తగా రావణుడు వారిని తమ బాణపు దెబ్బలతో తూట్లు పొడిచెను. వారందరు అప్పుడు రాముని శరణు జొచ్చిరి. శరణన్న వారిని రక్షించుటలో సమర్థుడు, సర్వలోకములకు శరణ్యుడైన శ్రీరాముడు వారికి భయము ఇచ్చెను.  అంత లక్ష్మణుడు రావణునిపై యుద్ధము చేయుటకు అనుమతించవలసినదిగా కోరగా అందుకు రాముడు సమ్మతించెను.  రావణుడు బాణవర్షముతో వానరుల శరీరములను చీల్చుతుండగా హనుమ వాని బాణములను అడ్డుకొని అతనిపై పరుగిడి అరచేతితో ఒక్క దెబ్బ కొట్టెను. కొంతసేపటికి రావణుడు తేరుకొని ...

*అథా౭౭శ్వాస్య మహాతేజా రావణో వాక్యమ౭బ్రవీత్* 6 59 64
*సాధు వానర వీర్యేణ శ్లాఘనీయోఽసి మే రిపుః*

*రావణే నైవ ముక్త స్తు మారుతి ర్వాక్య మ౭బ్రవీత్* 6 59 65
*ధి గ౭స్తు మమ వీర్యేణ య స్త్వం జీవసి రావణ*

 బాగు బాగు. నీవు నాకు సరియైన ప్రతిద్వందివి అనెను. రావణుడిట్లు చెప్పగా హనుమ రావణునితో "రావణా! నీ వింకను జీవించి యున్నావు. కావున నా పరాక్రమమునకు ధిక్కారం" అనగా రావణుడు మెరుపు వేగముతో హనుమ వక్షస్థలముపై మెరుపు వేగముతో మొదగా హనుమ స్పృహ తప్పి పడిపోయెను. అత్తరి నీలుడు ఒకప్పుడు రావణుని ధ్వజము మీదను, ఒకప్పుడు కిరీటము పైనను కూర్చొనియుండుట చూచి శ్రీరామునకు, లక్ష్మణునకు, హనుమకు చాలా ఆశ్చర్యము కలిగెను. రావణునకు కూడా చాలా విస్మయము కలిగెను. రావణుడు అప్పుడు మిగుల క్రోధముతో ఆగ్నేయాస్త్రమును నీలునిపై ప్రయోగించెను. నీలుడు వివశుడై రణరంగమున పడిపోయెను. అయినను తండియైన అగ్ని మహిమాప్రభావము వలన మోకాళ్లపై నిలువరించుకొనెను. పిదప రావణుడు రణోత్సాహముతో లక్ష్మణుని పైకి ఉరికెను. లక్ష్మణుని బాణములచే రావణుని ధనుస్సు విరిగిపోయెను. శరీరముపై దెబ్బలు తగిలి రక్తసిక్తమయ్యెను. అట్టి స్థితి యందు రావణుడు బ్రహ్మదేవుడొసగిన "శక్తి"ని ప్రయోగించెను. ఆ శక్తి ప్రహారముచే విహ్వలుడైన లక్ష్మణుడు భూమిపై పడి పోయెను. వెంటనే రావణుడు వేగముగా వెళ్లి లక్ష్మణుని తన రెండు చేతులతో పైకి ఎత్త దొడగెను.

*తామ్ ఆపతన్తీం భరతా౭నుజోఽస్త్రై:*
*జఘాన బాణై శ్చ హుతా౭గ్ని కల్పైః*
*తథా౭పి సా తస్య వివేశ శక్తి:*
*భుజా౭న్తరం దాశరథే ర్విశాలమ్* 6 59 109

ఏ రావణుడు దేవతలతో కూడిన కూడిన హిమవత్పర్వతమును, మందరాచలమును, మేరుపర్వతమును లేక ముల్లోకములను తన భుజబలముతో లేపగలిగిన శక్తి యుండునో, ఆ రావణుడు లక్ష్మణుని పైకెత్తుటకు సమర్థుడు కాలేక పోయెను. కైలాస పర్వతమును చలింపజేసిన బలశాలి గనుక హిమవత్పర్వతమును కూడా లేపగలడు. మంథర పర్వగతముచే సాగర మథనమును  దేవతలు చేసినారు కావున అట్టి దేవతలను రావణుడు ఓడించాడు గావున మంధర పర్వతము రావణునికి ఒక లెక్కలోనిది కాదు. సకల కుల పర్వతములకు కేంద్రమైనది మేరుపర్వతము. దాని శిఖరమును సముద్రమున నిక్షిప్తము చేసినవాడు వాయుదేవుడు. అట్టి వాయువుదేవుడను తన అధీనములో ఉంచుకొన్నాడు కావున మేరుపర్వతము అతనికి లోకువే. ముల్లోకములు అధిపతియైన దేవేంద్రుని జయించాడు గావున ముల్లోకములు అతనికి అధీనములే. కానీ సమస్త భువన భారములను మోసువాడు ఆదిశేషుడు. లక్ష్మణుడు అట్టి ఆదిశేషుని అవతారము గావున  రావణుడు లక్ష్మణుని ఎత్త లేకపోయినాడు. పాయసం విభాగము చేసినప్పుడు సగభాగము కౌసల్యకు ఇచ్చెను. కావున శ్రీరాముడు విష్ణువు అంశములొ సగ భాగము. అలానే లక్ష్మణుడు చతుర్థ అంశము. అట్టి లక్ష్మణుని కదల్చలేకపోయిన రావణుడు రాముని ఏమి చేయగలడు? కానీ అవివేకము ఆలోచనలను ప్రసరింపజేయనీయదు. సత్యభామ అహంకార రూపమైన ధనమునకు గాక రుక్మిణి భక్తి భావముతో ఒక్క తులసి దళముతో శ్రీకృష్ణుడు తూగినాడు. ఆ సమయమున వాయుపుత్రుడగు హనుమ క్రోధుడై తన పిడికిటిచే రావణుని వక్షస్థలమున గట్టిగా కొట్టెను. దానితో రావణుడు భూమిపై మోకాలు ఆనించి క్రింద పడెను. పిమ్మట హనుమ రావణ పీడితుడగు లక్ష్మణుని రెండు చేతులతో ఎత్తుకొని శ్రీరాముని వద్దకు తీసుకొని వెళ్లెను.

*వాయు సూనోః సుహృత్త్వేన భక్త్యా పరమయా చ సః*
*శత్రూణామ్ అప్రకమ్ప్యోఽపి లఘుత్వ మ౭గమ త్కపేః* 6 59 120

*ఆశ్వస్త శ్చ విశల్య శ్చ లక్ష్మణ శ్శత్రు సూదన:*
*విష్ణోర్భాగ మ౭మీమా౦స్య మా౭౭త్మానం ప్రత్య౭నుస్మరన్*   6 59 122

హనుమంతుని యొక్క సౌహార్థము, అత్యంత భక్తి భావముల వలన లక్ష్మణుడు తేలిక అయ్యెను. అంతట శత్రుసూదనుడైన లక్ష్మణుడు అచించ్యమైన విష్ణువు యొక్క చతుర్థఅంశమైన తనను గూర్చి స్మరించుటతో అతని గాయము లన్నియు తొలగి పోయెను.

*శ్రీరామ జయరామ జయజయ రామ*
*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-19*
*రాక్షస వీరులలోని ముఖ్యులు మరణించుట*
నాగాస్త్రబంధము రామలక్ష్మణులకు విడిపోయినదనే ఆనందముతో వానరులు గర్జించిన ధ్వని రావణుడు వినెను. నాగాస్త్ర బంధనము విడిపోయినదని తెలుసుకొన్నాడు. తరువాత జరిగిన యుద్ధములో లక్ష్మణునిచే విరూపాక్షుడు, శ్రీరామునిచే అగ్నికేతువు, రష్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, హనుమచే ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదునిచే వజ్రదంష్ట్రుడు వధింపబడిరి.  అప్పుడు లంకాపురము నలువైపులా శత్రుసైన్యము చుట్టుముట్టెను. అది చూచి రాక్షసరాజగు రావణుడు తన హితైషియు, యుద్ధ కళాకోవిదుడు అగు ప్రహస్తునితో శీఘ్రమే సైన్యమును తీసుకొని వెళ్లి విజయమునకు బయిలుదేరుమని చెప్పెను. అప్పుడు సేనాపతియగు ప్రహస్తుడు శుక్రాచార్యుడు అసుర రాజగు బలికి సలహా ఇచ్చినట్లు రావణునికి తన అభిప్రాయము ఇట్లు తెలియ జేసెను.
*రాజన్ మన్త్రిత పూర్వం నః కుశలైః సహ మన్త్రిభిః*   6 57 13
*వివాద శ్చా౭పి నో వృత్తః సమ౭వేక్ష్య పరస్పరమ్*
*ప్రదానేన తు సీతాయాః శ్రేయో వ్యవసితం మయా*    6 57 14
*అప్రదానే పున ర్యుద్ధం దృష్ట మేతత్ తథైవ నః*
రాజా! ఇదివరలో ఈ విషయము గూర్చి మంత్రిమండలిలో చర్చించి యుంటిమి కానీ భేదాభిప్రాయములు తలయెత్తినవి.సీతను తిరిగి రామునకు ఇచ్చివేయుటచేతనే మనకు శ్రేయస్సు కలుగుననియు, ఇవ్వనిచో యుద్ధము తప్పక జరుగుననియు నాకు మొదట నుండి నిశ్చితాభిప్రాయము కలదు. ఆ అభిప్రాయము ప్రకారమే ఇప్పుడు యుద్ధరూప సంకటము ప్రాప్తించింది. కానీ ఇంతకుముందు ప్రహస్తుడు పదునాలుగవ సర్గలో ఈ విధముగా తెలియ జేసినాడు.
*నిశమ్య వాక్యం తు విభీషణస్య*
*తత: ప్రహస్తో వచనం బభాషే*
*న నో భయం విద్మ న దైవతేభ్యో*
*న దానవేభ్యో ప్య౭థ తవా కుతశ్చిత్*
*న యక్ష గ౦ధర్వ మహోరగేభ్యో*
*భయం న సంఖ్యే పతగోత్తమేభ్య:*
*కథం ను రామా ద్భవితా భయం నో*
*నరేంద్ర పుత్రా త్సమరే కదాచిత్*        
దేవతల వలన గాని, దానవుల నుండి గాని, యక్ష, గంధర్వుల నుండి గాని, గరుత్మంతుడు మొదలగు పక్షీంద్రముల వలన గాని మనకు ఎట్టి భయములేదు అట్టిచో ఒక మానవమాత్రుడైన శ్రీరాముని వలన భయమెందుకు?
సత్యము ఎల్లప్పుడూ ఒకే విధముగా యుండును. దేశకాల పరిస్థితులను బట్టి మారదు. కానీ ఇచ్చట ప్రహస్తుడు సమయానుకూలంగా చెపుతున్నాడు. అటువంటి వారి యెడల రాజు కడు జాగరూకతతో యుండవలెను. కానీ రావణుడు అహంకారి, మూర్ఖుడు.
రావణాజ్ఞచే ప్రహస్తుడు యుద్ధమునకు వెడలగా భయంకర వేగశాలి యగు మహాకపి యైన నీలుడు ప్రహస్తుని సంహరించెను. ప్రహస్తుని మరణవార్త విని రావణుడు శోకముతో వ్యాకులమై తానే యుద్ధభూమికి వెడలెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

Sunday, 2 February 2020

యుద్ధ కాండము-18

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-18
నాగపాశ బంధములోని యోగ రహస్యము
సువేల పర్వతము యొక్క శిఖరము (ఉచ్చ అవస్థ) పై ఆరూఢుడై భగవానుడైన రాముడు మాయారూప లంకను ఏ విధముగా నష్టపరచ వలెనో సంకల్పించుకొనెను. అదృశ్య రూపములో రావణుడి పుత్రుడైన ఇంద్రజిత్ రాముని సేనలో శస్త్ర వర్షమును గురిపించెను. ఏ మంత్రముతో అతడు రాముని సేనపై శస్త్ర వర్షమును గురిపించెను?  “మన నాత్ త్రాయతే ఇతి మంత్రః”  అని మంత్ర పదానికి నిర్వచనం. మననము చేసిన కొలదీ రక్షించే దాన్ని మంత్రం అంటారని దీని అర్ధం. ‘ నిరంతర శ్రవణ, స్మరణ, మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్యదేవతా స్వరూపంగా మార్చగలిగే వర్ణ సంపుటాన్ని’ (అక్షరాల కూర్పును) ‘మంత్రం’ అనవచ్చును. ఏ మంత్రమైనా అక్షరాలతోనే రూపొందింపబడుతుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ధ్వని, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం వుంటాయి. ధ్వని – నాదాత్మకమైతే, అర్థం – జ్ఞానాత్మకం. అమ్మవారు ‘నాదరూపిణీ’ 'జ్ఞాన జ్ఞేయ స్వరూపిణీ’ గూడా కాబట్టి – సర్వమంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతాయి. అంతేకాకుండా మనస్సు నందలి శక్తిని రక్షించునదియే మంత్రము. మనస్సు బలమైనది అయినచో అన్నియు ప్రాప్తించుకొనవచ్చును. "మన ఏవం మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" . బంధనము లేదా మోక్షము అనేది మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది." కేవలం శారీరిక యాంత్రిక భక్తి సరిపోదు; మనస్సుని భగవత్ ధ్యాస లో నిమగ్నం చేయాలి. మంత్రం విషయములో రామాయణ కాలము నందు కూడా మూర్ఖమైన కల్పనలు యున్నవి. మంత్ర సిద్ధులు, మోసముతో కూడిన మాయాజాలం అతిధిగా గల కల్పనలతో సమాజము భ్రష్టమయ్యెను. వాస్తవికమైన శారీరక , మానసిక బలము సమాజము నందు ఉత్పన్నమవాలి. దేశములోని మానసిక బానిసత్వము నిర్మూలింపబడి జ్ఞానమయము కావాలి. ఇంద్రియములను సంయమము నందుంచి ఆత్మజ్ఞానము పొందవలెననెడి కోరిక గల ఆధ్యాత్మిక సాధకుడు ఇంద్రజిత్. ఇంద్రియ దమనమము వలన సంయమము నొందిన మనస్సును, ధ్యానము, సమాధులకై ఉపయోగించి ఆత్మజ్ఞానము వైపు పురోగించవలెను. అట్లుగాక ఇంద్రియములను అణచి ఆత్మజ్ఞానము పొందామనుకొన్న సాధకులు తమ అజ్ఞానపు చీకట్లలో చిక్కుకొన్నట్లే. వారు అంధులని చెప్పవచ్చు. తమ దోషములను కండ్ల నుండి, మనస్సు నుండి చూడక అదృశ్యముగా యుంచి తమ అజ్ఞానమయ అవస్థ యొక్క కర్మ రూప బాణములను బ్రహ్మ వైపు గురిపెట్టువాడు అదృశ్యముగా శరవర్షమును కురిపించు ఇంద్రజిత్ వంటి వాడు. సాధక రాముడు తన యందు అంతర్గతమై యున్న ఇంద్రజిత్ మాయాజాలమును పసిగట్టి, ఏ స్థానము నుండి శరవర్షము కురియుచున్నదో నిర్ధారణ చేసి ఆ స్థానంపై తన రామ బాణ వర్షమును పంపించుటలో ఇంద్రజిత్ పరారగును. కానీ ఇంద్రజిత్ బహు మాయావి. రాక్షస వృత్తి రూపమగుట వలన రామలక్ష్మణులను మట్టుబెట్టవలెనని యోచనతో మరియొక శక్తివంతమైన మాయాస్త్రము అనగా నాగాస్త్రమును ప్రయోగించెను. నాగాస్త్ర ప్రభావము వలన రామలక్ష్మణులు బందీలైరి. గరుత్మంతుడు అక్కడకు వచ్చి వారిరివురిని బంధవిముక్తులను చేసెను. నాగపాశమనగా కుండలిని జాగృత్త అవస్థ. నాగపాశమున పుట్టిన విషమువలె కుండలిని జాగృత్త ఆ సమయమున అత్యంత తాపము ఉత్పన్నమగును. కుండలిని జాగృతము తర్వాత సాధకుని శరీరము, మనస్సు శుద్ధమై బలవర్థకమగును. అందుండి సాధకునకు ఉత్కృష్ణ జ్ఞానము ప్రాప్తించును. ఆ అవస్థ నుండి మరింత పురోగతి సాధించుటకై ఉన్నతమైన వాయుతత్వ అవస్థమును పొందాలి. ఈ వాయుతత్వ అవస్థకు చిహ్నము గరుత్మంతుడు. నాగపాశము లేదా సర్పముపై గరుత్మంతుడు విజయం సాధించును.  అదేవిధముగా వాయుతత్వ అవస్థ ప్రాప్తించినచో కుండలిని జాగ్రత్త అవస్తయూ శాంతించును. మరియొక కోణములో గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనము. రాముడు విష్ణు అవతారంగా భావింతురు. పూర్వపు జన్మ వాహనమైన గరుత్మంతుని సహాయము స్వీకరించడమైనది. ఈ విధముగా సాధనా పరంపర అనేక జన్మల కర్మగతి నుండి ఉద్భవించును.
శ్రీరామ జయరామ జయజయ రామ

యుద్ధ కాండము-17*

*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-17*
*లంకపై వానరయోధుల దండయాత్ర, నాగపాశ బంధ విముక్తి*
శ్రీరాముడు, రాక్షసులచే పీడింపబడుతున్న సీతను మరల మరల తలంచుకొనుచు ధర్మాత్ముడగు శ్రీరాముడు శత్రువులగు రాక్షసులను వధించుటకై వానరులకు ఆజ్ఞ ఒసగెను.
*జయ త్య౭తి బలో రామో లక్ష్మణ శ్చ మహా బలః*
*రాజా జయతి సుగ్రీవో రాఘవే ణా౭భి పాలితః* 6 42 20
*ఇత్యేవం ఘోషయన్త శ్చ గర్జన్త శ్చ ప్లవంగమాః*
*అభ్యధావన్త ల౦కాయాః ప్రాకారం కామ రూపిణః* 21
కామరూపులైన ఆ వానరులు తిరుగులేని పరాక్రమశాలియైన శ్రీరామునికి జయము, మిక్కిలి బలవంతుడైన లక్ష్మణునికి జయము. శ్రీరాముని అనుగ్రహమునకు పాత్రుడైన వానర రాజైన సుగ్రీవునికి జయము అని జేజేలు పలుకుతూ, సింహగర్జనలు చేయుచు లంకాపుర ప్రాకారములు మీద విరుచుకు పడిరి. మిక్కిలి బలశాలియైన 'కుముదుడు' పదికోట్ల మంది వానర యోధులతో ఈశాన్య దిశను, 'శతవలి' ఆగ్నేయ దిశను, 'సుషేణుడు' నైరుతి దిశను, సుగ్రీవుడు వాయువ్య దిశను ఆక్రమించిరి. (ఇచ్చట శ్రీరాముడు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తర ద్వారముల వద్ద ఎవరు ఉండాలని నిర్ధేశించారు. ఇప్పుడు ఆయా కోణములందు (మూలలు) మిగిలిన వీర్యవంతులైన వానరులు వారికి అండగా యున్నారు. అంతియే గాక ఇంద్రజిత్తు లంకా నగరము యొక్క పశ్చిమ ద్వారమును, రావణుడు ఉత్తర ద్వారములను రక్షించుతున్నారు. కావున వారి ఇరువురి దృష్టి వాయువ్యముపై పడును కాన ఈ దిశ యందు దండెత్తు బాధ్యత సుగ్రీవునకు శ్రీరాముడు అప్పచెప్పెను). అప్పుడు జరిగిన వానర, రాక్షసుల సమరం దేవాసుర సమరమును పోలి యున్నది. వారి యుద్ధముచే ఆ ప్రాంతమంతయు రాక్షసుల, వానరుల రక్తమాంసములతో బురదగా యుండెను. ఈ విధముగా వానరులు రాక్షసులతో యుద్ధము చేయుచుండగా ఒకరిపై ఒకరు జయించవలెననెడి పట్టుదల ఎక్కువ అగుచుండెను. వాలిపుత్రుడగు అంగదుడు ఇంద్రజిత్తుతో తలపడెను. ఇంద్రజిత్తు అంగదుని గట్టిగ గదతో మోదగా, అంగదుడు కోపించి వాని రథమును గుఱ్ఱములు సారధితో సహా కూల్చెను. లక్ష్మణుడు విరూపాక్షుని, శ్రీరాముడు అగ్నికేతువు, రష్మికేతువు, సుపతఘ్నుడు, యజ్ఞకోపుడు లను సంహరించిరి. అందుకు ఇంద్రజిత్తు క్రోధముతో రామలక్ష్మణులను నాగాస్త్రముచే బంధించెను. రామలక్ష్మణులు అవతార పురుషులు. వారు మృత్యువుకే మృత్యుదేవతలు. అట్టివారిని ఎవరు బంధింపగలరు? వారు మానవరూపములో యున్నారు గావున బంధితులైనారు. ఇంకను ఇంద్రజిత్తు అనేకమైన పదునైన శరములు శ్రీరామునిపై ప్రయోగించెను. అవి ఏవనగా ..
*రుక్మ పుంఖైః ప్రసన్నాగ్రై రధో గతిభి రా౭౭శుగైః*
*నారచై ర౭ర్ధనారాచై ర్భల్లై ర౦జలికై ర౭పి*
*వివ్యాధ వత్ సదన్తై శ్చ సింహ దంష్ట్రైః క్షురై స్తథా* 6 45 23
నారాచములు (సూటిగా నుండి వర్తులాకారము గలవి), అర్థనారాచములు (మధ్యభాగమున నారాచమువలె యుండునవి), భల్లములు (గండ్రగొడ్డలి వంటి మొనలు కలవి), అంజలికములు (దోసిళ్లవంటి అగ్ర భాగములు గలవి), వత్సదంతములు (దూడల దంతములు వంటి అడుగు భాగములు గలవి), సింహ దంష్ట్రములు (సింహముల కోరల వంటి అగ్రభాగములు గలవి), క్షురములు (కత్తుల వంటి మొనలు గలవి) అను వివిధములగు బాణములచే శ్రీరాముని గాయపరచెను. అంత ఇంద్రజిత్తు సంతోషాతిరేకమున లంకానగరమును ప్రవేశించెను. అంత రావణుడు సంతోషముతో త్రిజట మొదలగు వానర స్త్రీలతో సీతను పుష్పక విమానము ద్వారా యుద్ధభూమికి తీసుకొని వెళ్లి రామలక్ష్మణులను చూపమని ఆజ్ఞాపించెను. సీత రామలక్ష్మణులను చూచి అయ్యో! నన్ను ఇదివరకు ఋషులు, పెద్దలు నీ చేతిలో, కాళ్లలో పద్మ రేఖలున్నాయి కావున నీవు సౌభాగ్యవతివి, మహాసామ్రాజ్యమునకు పట్టమహిషివి, వీరులైన పుత్రులను పొందుదవు అని అన్నారు. కానీ అవి అన్నియు నిష్ప్రయోజనములు అయినవి అని దుఃఖించెను. సీత వారి దేహములను చూచి దుఃఖించగా, త్రిజట సీతను అనునయిస్తూ శ్రీరాముడు జీవించియే యున్నాడు అని చెప్పెను. త్రిజట సీతకు చెపుతూ అమ్మా! నీవు పుష్పక విమానము లో కొనిరాబడినావు అనగా పుష్పకము సౌభాగ్యవతులు కానీ వారు ఎక్కుటకు అనర్హులు కావున నీ పతి జీవించియే యున్నాడు అని గమనించుము. నాగపాశముచే బంధింపబడిన రామలక్ష్మణుల శరీరములు, అంగప్రత్యంగములు బాణములచే నిండియుండుట చూచి సుగ్రీవుడు దీనత్వమును వహించెను. అప్పుడు విభీషణుడు వానర రాజుతో స్వస్థత చెందమని, దుఃఖము పడవలదని చెప్పెను.
*పర్యవస్థాప యా౭౭త్మాన మ౭నాథం మాం చ వానర* 6 46 33
*సత్య ధర్మా౭నురక్తానాం నా౭స్తి మృత్యు కృతం భయమ్*
సత్యముపై విశ్వాసము గల వారికిని, ధర్మనిరతులకు మృత్యు భయముండదు. తన శరీరము యొక్క ధృఢత్వము చేతను, అకుంఠిత శక్తి చేతను శ్రీరాముడు మూర్ఛ నుండి తేరుకొని సోదరుడైన లక్ష్మణుని చూచి దుఃఖించెను. అప్పుడు రెండు ఘడియలలో మహాబలశాలియగు గరుత్మంతుడు అచటికి వచ్చెను. అతని రాకతోనే మహాబలవంతమైన బాణరూపమున యున్న ఆ సర్పరాజములు పారిపోగా రామలక్ష్మణుల గాయములన్నియు సమసి పోయి వారి శరీరములు సుందర కాంతితో ఆరోగ్యవంతములై అలరారెను. గరుత్మంతుడు రామలక్ష్మణులను రోగరహితులను చేసి వారికి ప్రదక్షణ చేసి వాయువేగమున వెడలి పోయెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-16*
*అంగద రాయబారము*
మహానుభావుడైన ధనుర్ధరుడగు శ్రీరాముడు విశాలమైన సేనతో గూడి శుభముహూర్తమున లంకాపురము వైపునకు ముందుకు సాగెను. శ్రీరాముడు సేనను యధాస్థానమున నిలబెట్టి చేయవలసిన కర్తవ్యమును గురించి అందరితో ఆలోచించెను. ముందుగా యుద్ధమునకు సిద్ధపడుట తగదని దూతచే వర్తమానము పంపుట రాజధర్మమని శ్రీరాముడు నిశ్చయించెను. అప్పుడు అంగదుని పిలిచి రాముడిట్లు చెప్పెను. సౌమ్యా! అంగదా! నీవు భయము చెందకుండా ఈ ప్రాకారములను దాటి లంకలో ప్రవేశింపుము. నా మాటగా రావణునితో ఇట్లు చెప్పుము.
*భ్రష్ట శ్రీక గతైశ్వర్య ముమూర్షో నష్ట చేతనః*
*ఋషీణాం దేవతానాం చ గన్ధర్వా౭ప్సరసాం తథా*  6.41.61
*నాగానా మ౭థ యక్షాణాం రాజ్ఞాం చ రజనీచర*
*య చ్చ పాపం కృతం మోహా ద౭వలిప్తేన రాక్షస* 6.41.62
*నూన మ౭ద్య గతో దర్పః స్వయమ్భూ వరదాన జః*
*యస్య దణ్డ ధర స్తేఽహం దారా హరణ కర్శితః*
*ద౦డ౦ ధారయమాణ స్తు ల౦కా ద్వారే వ్యవస్థితః* 6.41.63
*పదవీం దేవతానాం చ మహర్షీణాం చ రాక్షస*
*రాజర్షీణాం చ సర్వేషాం గమిష్యసి మయా హతః* 6.41.64
*బలేన యేన వై సీతాం మాయయా రాక్షసా౭ధమ*
*మా మ౭తిక్రామయిత్వా త్వం హృతవాం స్త ద్విదర్శయ* 6.41.65
*అరాక్షస మిమం లోకం కర్తా౭స్మి నిశితైః శరైః*
*న చే చ్ఛరణ మ౭భ్యేషి మా ముపాదాయ మైథిలీమ్* 6.41.66
*ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోఽయం విభీషణః*
*ల౦కై శ్వర్యం ధ్రువం శ్రీమాన౭యం ప్రాప్నో త్య౭కణ్టకమ్* 6.41.67
*న హి రాజ్య మ౭ధర్మేణ భోక్తుం క్షణ మ౭పి త్వయా*
*శక్యం మూర్ఖ సహాయేన పాపే నా౭విదితా౭౭త్మనా*  6.41.68
*యుధ్యస్వ వా ధృతిం కృత్వా శౌర్య మా౭౭లమ్బ్య రాక్షస*
*మ చ్ఛరై స్త్వం రణే శాన్త స్తతః పూతో భవిష్యసి* 6.41.69
*య ద్యా౭౭విశసి లోకాం స్త్రీన్ పక్షి భూతో మనోజవః*
*మమ చక్షు ష్పథం ప్రాప్య న జీవ న్ప్రతి యాస్యసి *  6.41.7౦
*బ్రవీమి త్వాం హితం వాక్యం క్రియతామ్ ఔర్ధ్వదేకికమ్*
*సుదృష్టా క్రియతాం ల౦కా జీవితం తే మయి స్థితమ్* 6.41.71
“రావణా! నీ రాజ్యలక్ష్మి నీ నుండి తొలగి పోవుచున్నది. నీ నియమంగా శక్తి పోయినది. చనిపోవదలచి యున్నావు. చైతన్యము పోయినది. పూర్వము గర్వముతో ఋషులకు, దేవతలకు, గంధర్వులకు, అప్సరసలు, యక్షులకు బాధలు కలిగించి కలిగించి పాపము చేసి యుంటివి. బ్రహ్మ వరము ఇచ్చినాడనే గర్వము ఇప్పుడు తొలగి పోవుచున్నది. ఎవరి భార్యను అపహరించినావో అతడు దండధరుడై నిన్ను శిక్షించుటకు లంకాద్వారమున నిలిచి యున్నాడు. ఏ బలము చూచుకొని నన్ను లెక్కచేయక మాయతో నేను తొలగిపోవునట్లు చేసి సీతను అపహరించి తెచ్చితివి? నీ బలమెట్టిదో యుద్ధరంగమున నా ఎదుట చూపుము. నీవు వెంటనే సీతను తీసుకొని వచ్చి నన్ను శరణు పొందుము. లేనిచో ఈ లోకములో నా వాడి బాణములతో ఈ లోకములో రాక్షసులు లేకుండా చేసెదను. అధర్మముతో ఒక్క క్షణమైనను నీవు రాజ్యము అనుభవించజాలవు. కామరూపముతో మూడు లోకములలో నీవు ఎచ్చటికే ఎగినను నీవు బ్రతుకుట అసాధ్యము. నీ తరువాత నీ శ్రాద్ధకర్మలు పెట్టుటకు కూడా ఎవ్వరు మిగిలి ఉండరు.  నీ శ్రాద్ధము నీవే నిర్వర్తించుకొనుము. నీ జీవితము నా అధీనమున యున్నది . చివరిసారిగా లంకను, నీవారిని ఒక్కసారి చూచుకొనుము" అని ఇట్లు సందేశము ఇచ్చెను.
ఆ సందేశమును తీసుకొని అంగదుడు ఆకాశములోనికి ఎగిరి ఒక్క ముహూర్తములో మంత్రులతో కొలువు తీరియున్న రావణ మందిరమును చేరి తాను వాలి సుతుడనైన అంగదుడనని, రాముని దూతనని చెప్పి,  ఏ ఒక్కటి ఒదలకుండా రావణునకు రామ సందేశమును విన్పించెను. అందుకు క్రుద్ధుడైన రావణుడు ఈ రామదూతను సంహరింపుమని ఆజ్ఞ ఈయగా భయంకరులైన నలుగురు రాక్షసులు అంగదుని పట్టుకొనిరి.బలశాలియైన అంగదుడు వేగముగా వారిని నొక్కిపట్టి ప్రాకార పైభాగమునకు ఎగిరి, ప్రాకార శిఖరమును తన పాదముతో పడదోసి,  అంతరిక్షము నుండి ఆ రాక్షసులను పడవేచెను. సమస్త వానరులకు ప్రీతి చేయుచు అంగదుడు వానరసేన మధ్య యున్న శ్రీరాముని చెంతకు చేరెను. అంగదుని వైఖరిని జూచి విషయము గ్రహించిన శ్రీరాముడు యుద్ధము అనివార్యమని నిర్ణయించుకొనెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-15*
*శ్రీరాముని యుద్ధ వ్యూహము*
శ్రీరాముడు సమస్త వానరసేనతో సహా లంకలో విడిది చేసిన తర్వాత యుద్ధ వ్యూహము గురించి ఆలోచన చేయ సాగిరి. అప్పుడు విభీషణుడు ఈ విధమైన సూచన చేసెను. "నాతో  (విభీషణుడు)  వచ్చిన నలుగురు రాక్షసులు నా ప్రేరణచే పక్షులుగా మారి లంకకు వెళ్లి వారు చూచి వచ్చిన విషయము వివరించెదను. తూర్పు ద్వారము వద్ద ప్రహస్తుడు, దక్షిణ ద్వారము వద్ద మహోదర మహాపార్షులు, పశ్చిమ ద్వారము వద్ద ఇంద్రజిత్తు, రావణుడు స్వయముగా ఉత్తర ద్వారము వద్ద, పట్టణ మధ్యమమున విరూపాక్షుడు అశేష సేనానితో యున్నారు. రావణుడు కుబేరునితో యుద్ధమునకు వెడలినప్పుడు అరువది వేల మంది మాహావీర్యులైన సైన్యము యున్నది. అప్పటి బలము కంటే ఈనాడు రావణుడు సిద్ధపరచిన సైన్యము చాలా అధికముగా యున్నది" అని చెప్పెను. శ్రీరాముడు అప్పుడు విభీషణుని సూచనతో ఈ విధముగా యుద్ధ వ్యూహమును రచించెను. అనేక వానరులతో కూడి నీలుడు లంక యొక్క తూర్పు ద్వారము వద్ద ప్రహస్తుని, అంగదుడు దక్షిణ ద్వారము వద్ద మహాపార్షుని, మహోదరుని, హనుమ పడమటి ద్వారమును, రావణుని వధకై ధృడ నిశ్చయముతో నున్న నేను (శ్రీరాముడు) లక్ష్మణునితో కూడి ఉత్తర ద్వారమును కబళించవలెను. సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు నగరము యొక్క మధ్య భాగమును ఆక్రమించ వలెను. వీరందరూ మహావీర్యులైన అనేక మంది వానర భల్లూక సేనలతో అప్రమత్తముగా యుండవలెను. యుద్ధము జరుగుతున్నంతసేపూ వానరులలో ఎవ్వరును మనుష్య రూపమును స్వీకరించరాదు. రాక్షసులు గూడ కామరూప ధారులే కానీ వారి దృష్టిలో నర, వానరములు హీనమైనవి. అందులోనూ వానర రూపము చాలా నిక్రుస్టమైనదిగా వారు భావించెదరు. అందుచే మనవారు గుర్తించుటకు వానరులు వానర రూపముతోనే యుండవలెను. మేము ఏడుగురము నేను (శ్రీరాముడు), లక్ష్మణుడు, విభీషణుడు మరియు వారి నలుగురు మంత్రులు తప్ప ఎవ్వరును మానవ రూపములో యుండరాదు.
*ఏకో హి కురుతే పాపం కాల పాశ వశం గతః*
*నీచే నాత్మా౭౭పచారేణ కులం తేన వినశ్యతి*  6.38.7
కాలము యొక్క పాశమున బంధింపబడిన ఏ ఒకానొకడో పాపము చేయుచున్నాడు కానీ ఈ నీచుని స్వకీయ దోషముచే కులమంతయు నశించి పోవుచున్నది. ఈ విధముగా సైన్య విభాగము చేసి సువేల పర్వతమును ఎక్కి లంకనంతయును చూడవలెనని సంకల్పించెను. ఇట్లు ఆలోచించి చిత్రములగు సానువుల గల సువేల పర్వతమును లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమ ఇత్యాది మహావీరులతో కూడి అధిరోహించిరి. ఆ రాత్రి యంతయు వారు ఆ పర్వత శిఖరముననే యుండి లంకానగర శోభను తిలకించిరి. సువేల పర్వత శిఖరమున నిలిచి రెండు యోజనముల విస్తారము గల ఆ పట్టణమును వానరులతో గూడి రామలక్ష్మణులు చూచిరి. ఆ పట్టణము విశ్వకర్మచే నిర్మింపబడినది. సువేలమున నిలచిన వీరికి త్రికూట పర్వతమున నిలచిన రావణుడు కనబడెను. అతను సంధ్యాకాలమందలి నల్లని మేఘము ఆకాశములో నిలిచినట్లున్నది. వానర రాజైన సుగ్రీవుడు ఇతర వానరములతో చెప్పకుండా రోషావేశుడై పర్వతాగ్రము నుండి ఎగిరి గోపురాగ్రమున దూకి రావణుని ఎదుట నిలిచెను. అంతే ఆవేశముగా అతని తలపై నున్న కిరీటమును క్రింద పడవైచెను. అప్పుడు రావణుడు సుగ్రీవుని చేతులతో పట్టుకొని క్రింద పడవైచెను. సుగ్రీవుడు నిలపడి బంతిలాలేచి ఒకరినొకరు పెనుగులాడుకొని బాహుయుద్ధమును చేసిరి. ఇంతలో రావణుడు తన మాయాబలమును ప్రదర్శించుటకు ప్రారంభించెను. అది గమనించి సుగ్రీవుడు వానిని వంచించి ఆకాశమున ఎగిరి రాముని వద్దకు వచ్చి నిలబడెను. అప్పుడు రాముడు నీవు సాహసివే అయినను ప్రభువులు ఇట్లు చేయరాదు అని చెప్పెను.
*త్వయి కించి త్సమా౭౭పన్నే కిం కార్యం సీతయా మమ*
*భరతేన మహా బాహో లక్ష్మణేన యవీయసా*
*శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వ శరీరేణ వా పున:*
నీవేమైనా అయినచో నాకు సీతమ్మతో ఏమి పని? భరతుడు గాని, శత్రుఘ్నుడు గాని, లక్ష్మణుడు గాని ఎందుకు? నీవు లేనినాడు నా శరీరమే అక్కరలేదు.  ఇది శ్రీరామునికి వానరుడైన వానితో గల మైత్రీ బంధమును సూచించును. *"ఆత్మానం సర్వదా రక్షేత్ దారైరపి, ధనైరపి"* భార్యను, ధనమును త్యజించి అయినను శరీరమును కాపాడుకొనవలెను. ధర్మాచరణమునకు మొదటి సాధనము శరీరమే! మిత్రుడు లేనిచో అట్టి శరీరము కూడా కాదనుకొనినాడు. ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు. "సుగ్రీవా! నేను మనసులో ఇట్లు నిశ్చయించుకున్నాను. నీవు మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడివని ఎరుగుదును. కానీ భయముచే శంకించితిని. ఒకవేళ నీవు మరలి రాకపోయినచో రావణుని పుత్రులతో, సైన్యముతో సహా చంపి విభీషణుని రాజుగా చేసి అయోధ్య యందు భరతుని రాజుగా నిలిపి నేను శరీరము త్యాగము చేయదలచుకొన్నాను. నీవు లేని నాకు ఈ దేహము ఏల?" అప్పుడు సుగ్రీవుడు రామునితో రామా! రావణుని చూడడముతో నాలోని ఆవేశమును ఆపుకొనలేకపోతిని. నేను ఒక వ్యక్తిగా యుండుటకు నీ దాస్యమే కదా! మన్నింపుము అని అనెను. తరువాత పర్వతమును దిగి యుద్ధమునకు సన్నద్ధమైరి.
*శ్రీరామ జయరామ జయజయ రామ*