Tuesday, 24 September 2019

🌼🌿మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు.!🌼🌿
సుందరకాండ అద్భుతమైన పారాయణం,
ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..
ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం
కాండం మొత్తం పారాయణ చేయలేరు,
అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది.
పారాయణ నియమాలతో ఉంటుంది.
ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.
1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..
శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||
21 దినములు ,
108 సార్లు ,
శక్తి కొలది తమలపాకులు,
అరటిపళ్ళు నివేదన చేయాలి.
2. విద్యాప్రాప్తికి.
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను .
3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన
3. భూతబాధ నివారణకు.
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు
30 దినములు పారాయణ చేయవలెను .
1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.
4. సర్వ కార్య సిద్దికి.
64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు
40 దినములు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
5. శత్రు నాశనముకు.
51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.
6. వాహనప్రాప్తికి.
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.
7. మనశాంతికి.
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
8. స్వగృహం కోరువారికి.
7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి
40 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.
9. యోగక్షేమాలకు.
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.
10. ఉద్యోగప్రాప్తికి.
63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.
11. రోగ నివారణకు.
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.
12. దుఃఖనివృత్తికి.
67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.
13. దుస్వప్న నాశనానికి.
27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.
33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి ,
21 దినములు నిష్ఠతో పఠించవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
15. ధనప్రాప్తికి.
15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి
40 దినములు పఠించవలెను.
అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు
రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము
32 వ సర్గ 1 సారి ,
40 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).
16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.
38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు
27 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.
17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.
19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి
1 సంవత్సరము పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.
సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి
మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి
68 రోజులు చదువవలెను.
నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.
19. కన్యా వివాహమునకు.
9 దినములలో ఒకసారి పూర్తిగా
68 దినాలలో పఠించవలెను.
సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు
ప్రతిరోజు పఠించవలెను.
అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.
20. విదేశీ యానమునకు.
1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు
30 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
21. ధననష్ట నివృత్తికి.
55వ సర్గ నిష్ఠతో 3 సార్లు
30 దినములు పఠించవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.
22. వ్యాజ్యములో విజయమునకు.
42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు ,
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.
23. వ్యాపారాభివృద్ధికి.
15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
24. పుత్ర సంతానానికి.
ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో
68 రోజులు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను.
శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.
25. ఋణ విముక్తికి.
28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి
41 రోజులు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
🌼🌿శ్రీరామ జయరామ జయ జయరామ..🌼🌿

Wednesday, 18 September 2019

రామాయణం -1 
పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.
దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.
ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.
దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని ముఖ్య పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, వారిని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........
సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం | 

ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||
పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.
అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.
వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.
ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........
తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |

వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||
ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.
కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.



సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.
మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.
తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం | 

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.
నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........

ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః| 

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.
ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......
"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.
బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు.


Thursday, 22 August 2019


ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

మదిలో మెదిలే స్వప్నమా
కలలో కదిలే మేఘమా
కథలో మెదిలే మోనమా
కళలే తెలిపే కాలమా

బంధాలను త్రెంచు కొని బ్రతక లేమా యీలోకంలో
బాధ్యతలతో  నలిగి పోవటమేనా యీజీవితంలో
గమ్యం ఏదో తెలియక తిరగటమేనా యీ ప్రేమ బంధాలలో
గుర్తించే వారు లేక ఉండి పోవటమేన యీ సంసార చక్రములో

గానానికి మరిచే హృదయమా
శబ్ధానికి చెదిరే నిశ్శబ్దమా
గాయానికి మెరిసే ఔషధమా
ప్రాయానికి వలపే ప్రణయమా

హృదయానికి హృదయం తాకుట దోషమే అనే ప్రేమలలో
నిశ్శబ్దంగా పనిచేసు కోవటం నేరమే దీపపు వెలుగులలో
గాయానికి మందువాడటం లోపమే చితికిన బతుకులలో
ప్రాయానికి ప్రాయం అనుటయే కోపమే పేళ్ళి బంధాలలో

తరుణానికి మనసే మందిరమా
వినయానికి వయసే కారణమా
ప్రళయానికి ప్రెయసే లోలకమా
స్త్రీ తో స్నేహమే అవాంతరమా

తరించటానికి తపమే మూలమా
లోభించటానికి ధనమే మూలమా
శాశించటానికి ప్రేమయే మూలమా
ఆరోగ్యానికి దైవమే మూలమా



#భవ'దారిద్య్రం - #భావ'దారిద్య్రం
భోజనం వడ్డించమని అడిగాడు పోతన తనభార్యతో. ఆమె చోద్యంగా చూస్తూ ‘అదేమిటండీ! ఇప్పుడే కదండీ భోజనంచేసి వెళ్లారు. మళ్లీ భోజనం అంటున్నారు? మళ్లీ అప్పుడే ఆకలయిందా’ అని నవ్వుతూ అడిగింది, ఆ సాధ్వీమణి.
దిగ్భ్రమ చెందాడు పోతన. ఇదేమిటి? ఈవిడ ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశాడు భార్య వైపు. ‘నేను భోంచేశానా?’ అని అడిగాడు. ‘అవును. కూర్చుని ఒక పద్యం కాబోలు వ్రాశారు. ఆపైన నేను భోజనం చేయమంటే చేశారు. మీరు తిన్న తర్వాత అలవాటు ప్రకారం, నేను మీరు తిన్నవిస్తరిలోనే భోంచేశాను’ అంది.

‘ఏదీ నువ్వు తిన్న విస్తరి?’

‘బైట తొట్లో వేశాను’ అంది ఇల్లాలు.

బయటికి వచ్చి కుప్పతొట్లో చూశాడు. అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోటిలోకి లాక్కుని దొరకకుండా పరుగెత్తి పోయింది. ఇంట్లోకి వచ్చి కూర్చుని తను వ్రాస్తున్నచోట కూర్చుని చూశాడు. అక్కడ ఒక త్రాటియాకుపైన-
అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా/ పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో/ త్పల పర్యంక రమావినోదియగు నాపన్న ప్రపన్నుండు వి/ హ్వల నాగేంద్రము పాహిపాహి యన కుయ్యాలించి సంరంభియై’
మొసలితో యుద్ధం చేస్తూ శక్తులుడిగి చేష్టలుల కోల్పోయిన నాగేంద్రము (గజశ్రేష్ఠుడు) ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తుంటారో వారు కాపాడాలి అని ‘ఎవ్వనిచే జనించు’ ‘జగమెవ్వని లోపల నుండు లీనమై’ అని అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది, అపుడు
‘ఆ వైకుంఠ నగరంలో సౌధంలో మూలన మందార వనామృత సౌరభంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్బాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క మొర వినిపించి, వెంటనే పూనుకుని ఉన్నపళాన ఆపద్రక్షకుడు పక్రమించినవాడై రక్షణకు!
దిగ్భ్రమతో పోతన కళ్ల వెంట ఆనందభాష్పాలు! ఆనందాతిరేకం! అంతలోనే దుఃఖాతిరేకం!
పరుగు పరుగున వచ్చి, దిగ్భ్రమతో నిశే్చష్టుడయిన పోతనను చూసి కుదుపుతూ ‘స్వామీ స్వామీ!’ అని పిలిచింది ఆ పతివ్రతామతల్లి. తేరుకుని ఆమె భుజంపై తలవాల్చి మళ్లీ అమిత రోదనకు గురయ్యాడు పోతన. కాసేపు అతడిని దుఃఖింపనిచ్చి, ఆపైన ఓదారుస్తూ ‘ఏం జరిగింది నాథా! ఎందుకంతగా దుఃఖిస్తున్నారు’ అని అడిగింది ఇల్లాలు. ‘శ్రీరామచంద్రుడు! శ్రీరాముని దర్శనభాగ్యం పొందావు నువ్వు! అనంత భాగ్యరాలివి! ధన్యాత్మవు. నాకా భాగ్యం కలుగలేదు’ అని చెపుతూ ఉన్నాడు పోతన. ఏడుస్తూ ఉన్నాడు మళ్లా వెంటనే దుఃఖాభ్యాగ్నుడై!
‘అవునా స్వామీ! నిజమా! ఇంతక్రితం వచ్చి వ్రాసి, భోజనం చేసి వెళ్లినవారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రమూర్తియా?’
‘అవును దేవీ! ఇది శ్రీరాములవారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం! విను’ అని ఆ పద్యాన్ని వెక్కిళ్ల మధ్యనే పాడుతూ, చెపుతూ, ఏడుస్తూ ‘చూడు - నువ్వు భగవంతుడి దర్శనం పొందావు - వారు వ్రాస్తున్నది చూశావు - నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు - వారి స్పర్శనం పొందావు! నాకేదీ ఆ భాగ్యం? ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా!’ అని మళ్లీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు పోతనామాత్యుడు.
‘స్వామీ! మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నానరు. శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి, మీరు వ్రాసినట్లుగా వ్రాసి, మీరు తిన్నట్లుగా తిని, నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు. మీరే తానై స్వామి వస్తే, మళ్లా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం? ఇంత గొప్ప ‘మహా భాగవత కావ్యాన్ని’ తెనిగిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి, ఆనందం పట్టలేక, మీ రచనలో తానూ, పాలుపంచుకోవాలని నిశ్చయించుకుని, మీకు భ్రమ కలిగించి బయటకు పంపి, తాను మీ రూపంలో వచ్చి, ‘తనను గురించి తానే’ గొప్పగా వ్రాసుకున్నాడు. ఇంత మహాభాగ్యులు మీరు. మీరు తెనిగిస్తున్న ‘మహాభాగవతం’ ఆచంద్రార్కం ప్రసిద్ధ పొందుతుంది. మీ రాముడు మీలోపల ఆత్మారాముడై ఉన్నాడు. దుఃఖం మాని, ప్రశాంతంగా కూర్చుని ధ్యానమగ్నులుకండి! మీకే అర్థం అవుతుంది’ అంది.
వెంటనే ధ్యానమగ్నుడయ్యాడు పోతనామాత్యుడు. తన ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, తన ఉచ్ఛ్వాసనిశ్వాసలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయాడు. తన హృదయ కుహరంలో కొలువైవున్న ఆత్మారాముడిని చూసి, పరమానంద భరితుడయ్యాడు ‘రామదాసు’లాగా!

*🙏🏻ధన్యవాదములు🙏🏻*


💐🐒 *రామాయణం ఒక భూగోళ శాస్త్రము*🐒💐
రామాయణం ఒక భూగోళ శాస్త్రము. సీత * వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.

తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:
ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;
నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,
అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)
తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)
యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, - బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.
తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )
అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)
తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)
ఋషభము అని పర్వతము
మధుర జలధి (జపనీస్ సి )
ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)
13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము
ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )
తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)
అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.
దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.
నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా
దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,
పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక
మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)
అది దాటాక భూమి సరిహద్దు
పశ్చిమ దిక్కుకు సుషేణుడు
వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము
మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ
60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు
మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)
10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )
తరువాత సరిహద్దు
ఉత్తర దిక్కుకు శతవాలి
ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము
దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )
లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు
అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.
ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి.
ఎవరన్నారండి మన వాజ్మయం పుక్కిట పురాణాలు అని, వాటిలో నిజాలు లేవని?

Tuesday, 23 April 2019

ధరిత్రి' దినోత్సవం (22-04-2019)



ధరిత్రి' దినోత్సవం అంటే ఏమిటి?

ఏప్రిల్ '22' వ తేదీని 'ధరిత్రి' దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ దినం యొక్క నేపథ్యాన్ని, ఇది సాధకునికి ఎందుకు విశేషమైనదన్న విషయాన్ని వివరిస్తూ సద్గురు చెప్పిన ఓ కధను ఇక్కడ మీకు అందిస్తున్నాం .
ఏప్రిల్ '22' వ తేదీన ప్రపంచ 'ధరిత్రి' దినోత్సవం. ఈ సందర్భంగా ఈ దినం యొక్క నేపథ్యాన్ని, ఇది సాధకునికి ఎందుకు విశేషమైనదన్న విషయాన్ని వివరిస్తూ సద్గురు చెప్పిన ఓ కధను ఇక్కడ మీకు అందిస్తున్నాం .

1969వ సంవత్సరంలో అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని శాంటా బార్బరలో చమురు విస్పోటనం వల్ల జరిగిన విపరీతమైన నష్టాన్ని చూసిన తరువాత అమెరికా పార్లమెంట్ సభ్యుడు గేలార్డ్ నెల్సన్ (Gaylord Nelson) ఏప్రిల్ 22 వ తేదీని ధరిత్రి దినోత్సవంగా  ప్రకటించారు. తొలి ధరిత్రి దినోత్సవం United States Environmental Protection సంస్థ ఆవిర్భవానికీ,  పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ చట్టాల రూపకల్పనకూ దారి తీసింది.

ప్రతి సంవత్సరం దాదాపు ఒక నూరుకోట్ల మంది జరుపుకునే అతి పెద్ద వేడుకలలో ఈ ధరిత్రి దినోత్సవం ఒకటి. ఈ సంవత్సరం మనం జరుపుకునేది '45'వ ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఈ వారం మొత్తం, అలాగే ఏప్రిల్ 22వ తేదిన పర్యావరణ పరిరక్షణ పట్ల  సామాజిక స్పృహను,  స్పందనను పెంపొందించేందుకు ప్రపంచంలోని భిన్న జాతుల వారు, భిన్న విశ్వాసాలకు చెందిన వారు, భిన్న నేపధ్యం  కలిగిన వారు, అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులు,  కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ధరిత్రి దినోత్సవం రోజున మనం చేయగలిగిన పనులు

1) ఒక చెట్టు నాటడం

2) మనం సొంత నీటి సీసాను,కిరణా సంచిని మన వెంట తీసుకునిపోవటం

3) శాఖాహారిగా మారటం

4) స్థానికంగా పెరిగే కూరగాయలు కొనటం

5) 'ముద్రణ' (ప్రింటింగ్‌) ని  తగ్గించటం

6) మోటారు వాహనాలకు వాడకుండా నడవడం, సైకిల్ తొక్కడం

7) ప్రతి రోజునీ ధరిత్రి దినోత్సవంగానే భావించి, పై వాటిని పాటించడం

మానవ చైతన్యం(Consciousness), పర్యావరణ పరిరక్షణల గురించి సద్గురు

ఆద్యాత్మిక పథంలో ఉన్నవారు ప్రతి దాని గురించి ఎరుక(అవేర్‌నెస్)తో ఉండటం ఎంత ముఖ్యమో సద్గురు ఈ కథలో వివరించారు.

ఓ జెన్ గురువుకి సంబంధించిన ఒక అందమైన కథ ఉంది. ఆసియా ఖండంలో ప్రజలు సాధారణంగా  చన్నీటి స్నానం చేస్తారు. ఎప్పుడో ఒకసారి వేడి నీటితో స్నానం చేస్తారు.  అలా వేడి నీటితో స్నానం చేసేటప్పుడు కుర్చీపై  కూర్చొని ఒంటిని నూనెతో బాగా మర్దన చేయించుకుంటారు. దీనికి ఒకరిద్దరి సహాయం అవసరమౌతుంది.

ఇటువంటి పనినే ఒక ఇద్దరు శిష్యులు ఆ జెన్ గురువు గారికి చేసారు. స్నానం అయిపోయిన తరువాత మిగిలిపోయిన నీటిని ఆ శిష్యులు పారబోసారు. అది చూసిన ఆ జెన్ గురువు  ఆ నీటిని ఎందుకు పారబోసారని ప్రశ్నిస్తూ ఒక కర్రతో వారిద్దరిని దండించారు.

అప్పుడు ఆ శిష్యులు, "కొంచెం నీరే కదా ? మీరెందుకు గొడవ చేస్తున్నారు?" అని అడిగారు.

ఆ గురువు గారు “ఆ కొంచెం నీటిని ఒక చెట్టుకి పోయవచ్చు కదా” అని బదులిచ్చారు. “మీరు పోయమంటే మేము చెట్లకి నీరు పోసేవాళ్ళం కదా. ఆ కొంచెం నీటితో మునిగేదేముంది?" అని ఆ శిష్యులు ప్రశ్నించారు. అప్పుడు ఆ గురువు గారు “విషయం ఏమిటంటే  మీరు నడిచే భూమి, పీల్చే గాలి, త్రాగే నీరు అన్ని జీవాన్ని రూపొందించే పదార్దాలు. మీరు ఎప్పుడూ కూడా మీ చిన్న వేలుని, 'ఇది చిన్నవేలే కదా' అని విరిచి పారవేయలాని అనుకోరు. మీరు నిజంగా అన్నిటిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనుకుంటే(include చేసుకోవాలనుకుంటే) మీరు అన్నిటిని సమదృష్టితో చూడటం నేర్చుకోవాలి. ఇందుకు చైతన్యాన్ని(consciousness) పెంపొందించుకోవాలి. అది చాలా ముఖ్యం” అని సెలవిచ్చారు

ఇది లైట్‌ని ఆర్పటం, వేయటం గురించి కాదు. నీటిని, ఆహారాన్ని  పరిరక్షించటం గురించి కాదు. చేతనతో  జీవించటం ఎంత ముఖ్యమో తెలుసుకోవడం గురించి. మీ చుట్టూ ఏమి ఉన్నా, అది ఫ్యాన్ అయినా, బల్బ్ అయినా, ఏదైనా ఎరుకతో ఉపయోగించండి. ఎరుకతో ఉండడం మీకు ముఖ్యం. అంతేకానీ కరెంటు, ఫ్యాన్‌లకు కాదు.


Friday, 5 April 2019

శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ?



శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ? (1)

గమనిక : కొంత మంది మిత్రులు వారి విజ్ఞత మేరకు రామాయణం లో కూడా మానవత్వ రహిత చర్యలు , వర్ణ వర్గ విబేధాలు వుండినవి అన్న అభిప్రాయం వెలిబుస్తుండటం చూసి , నొచ్చుకుని , నా మాటలు కొన్ని వారి ముందు ఉంచుతున్నాను. 
_/\_






శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ?

శ్రీ రామునికి ఏనాడూ తాను విష్ణువు యొక్క అవతారమని తెలియదు. తాను దైవాంశ సంభూతుడనని యే నాడు చెప్పుకోలేదు.

కేవలం ఒక మానవ జన్మ నెత్తిన పురుషుడు సత్యం న్యాయం ధర్మం పాటిస్తూ జీవితం ఎలా జీవించాలి అన్న దానికి ప్రతీకగా, ఉపమానం గా నిలిచి పోయాడు , ఈ వసుధ మీద అడుగు బెట్టిన ప్రతి ఒక్క మానవునకు. నిజం ఒప్పుకోవాలి అంటే, వీరి చరిత్రకు దగ్గరగా వుండేది ఒక్క జీసస్ క్రీస్తు చరిత్ర మాత్రమే.

శ్రీ రాముడిని , ఒక్క మాట లో వర్ణించాలి అంటే చెప్పినది, " రామో విగ్రహాన్ ధర్మః " .
మామూలు వాడుక భాషలో చెప్పాలి అంటే , ధర్మము అన్న పదానికి ఒక రూపం అంటూ ఇస్తే అది రాముని రూపం లా వుంటుంది అని.

అయితే , కాల మాన పరిస్థితుల బట్టి ధర్మం , న్యాయం అన్న వాటి కొలమానం కొద్దిగా మార వచ్చు. ఇది సమాజ సహజ గుణం.

ఉదాహరణకు , దశరథ మహారాజు గారికి ముగ్గురు పత్నులు. అంటే ఆ రోజుల్లో వున్న సమాజం లో బహుభార్యలు వుండటం నేరం కాదు. దానికి కారణం , స్త్రీ జనాభా యెక్కువ గా వుండి, పురుష జనాభా తక్కువ గా వుండటం కావచ్చు. నేటికీ , ఆధునిక సమాజాలు కొన్నిటి లో ఇది నేరం కాదు గదా. నిజాం గారికి , మైసూర్ మహారాజా గారికి ఇలా కొందరు 300 పైచిలుకు భార్యలు వున్న వారిని మనం చూశాం. అలాగే తరువాతి యుగం లో ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండటమూ మనం ఎరిగిన విషయమే. ఏదో దుర్యోధనుడు, " పాంచాలీ , పంచ భర్త్రుకా ," అని స్వగతం లో సంబోధించి నట్లు చదివాము కానీ , ఆ నాటి సమాజం దీనిని నిందించినట్లు ఎక్కడా లేదు. అలాగే పరుల వల్ల సంతానం పొందటం కూడా, తప్పు కాదు.

ఇవన్నీ ఇక్కడ ఉదహరించడం కేవలం , ధర్మము , సామాజిక న్యాయము అన్నవి కాల మాన పరిస్థితుల బట్టి , కొద్దిగా రూపాంతరం చెందుతూ వుంటాయి అని వక్కాణించడం కోసమే.

శ్రీరాముడు , తన జన్మ కాలంలో వున్న ఋజు వర్తనను , ఇంకా మెరుగు పరిచి చూపించాడు. దీనికి తార్కాణం, ఏక పత్నీ వ్రతం , పశు పక్ష్యాదుల మీద, ఆఖరికి పశ్చాతాపం పొందిన రాక్షస జాతికి శిక్ష నివ్వక , శరణు ఇవ్వటం లాంటివి.

విమర్శ చేసే వారు, కేవలం ఆ దృష్టి తో చూస్తూ వుంటే చాలా ఉదాహరణలు కనిపించ వచ్చు. విమర్శకు ముందు, నాటి సమాజ పరిస్థితి, మనుగడ , ప్రవృత్తి , సత్య న్యాయ ధర్మాల కొలమానాలు బేరీజు వేసుకుంటూ పోతే , విమర్శకు అసలు తావు వుండక పోవచ్చు .

కాక పొతే కొందరు కేవలం రంగుటద్దాలతో మాత్రం చూడటం అలవరుచుకుని , అదే రంగు ఆపాదించడం జరుగుతున్నది, ఎక్కువగా నేటి రోజుల్లో...

ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇవ్వ వచ్చు , మద్యం మత్తులో ఒక చాకిలి వాడు పలికిన మాటకు మానవ చరిత్రలో నేటి దాకా యే రాజ్యాధి నేతా విలువ ఇవ్వలేదు ... దీనికీ , విమర్శా వాదులు, స్త్రీ కి అన్యాయం చేశాడు అంటూ మొదలు పెడ్తారు. రాజ్యాధినేతకు మచ్చ వుండకూడదు అన్న నియమం పాటిస్తూ , ఆ రాజు గారి భార్యకు కూడా ధర్మ పాలనలో భాగం వుంటుంది అని చెప్తూ , స్వార్థాన్ని , సుఖాన్ని త్యాగం చేయటం , ఈ విమర్శకుల దృష్టి కి రాదు.

ఇహ రాక్షస జాతి ద్రావిడులు , ఆర్యులు అంటూ నేటి అభ్యుదయ వాదుల వాదన. నేడు వచ్చిన ఆర్యులు , ద్రావిడులు అన్న బేధం ఆ రోజుల్లో ఎక్కడా వున్నట్లు లేదు, యే చరిత్ర లోనూ. దశరధుల వారు కొన్ని వేల సంవత్సరాల రాజ్యం చేశారట , మరి వారి వంశ పూర్వజులు...అంటే కనీసం వేల సంవత్సరాల మాట అన్న మాట నే గదా. అంత కాలం లో ఆర్యులు , ద్రావిడులు అన్న బేధం సమసిపోకుండా వుంటుందా ?
ఈ నాటికీ , ఎవరైనా ఒక అఘాయిత్యపు పని చేస్తే , రాక్షస చర్య అని మనం వర్ణించటం లేదూ ? అంటే ద్రావిడులు ఆర్యుల మీద దాడి చేసినట్లా ?

( సశేషం )

శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ? (2)
గమనిక : కొంత మంది మిత్రులు వారి విజ్ఞత మేరకు రామాయణం లో కూడా మానవత్వ రహిత చర్యలు , వర్ణ వర్గ విబేధాలు వుండినవి అన్న అభిప్రాయం వెలిబుస్తుండటం చూసి , నొచ్చుకుని , నా మాటలు కొన్ని వారి ముందు ఉంచుతున్నాను. 
_/\__

రాముడు మనూవాది !!!!
కులబేధం పాటించాడు !!!!
అన్న మాటకు..

నమ్మకం : ముందుగా మనిషి ఎంత విజ్ఞాన ఖనుడు అయినా, తనకి తెలియని విషయాలు, తను తన జీవితకాలం లో తెలుసుకోలేని విషయాలు ఈ విశ్వం లో చాలా వున్నాయి అన్నది గుర్తుంచుకుని , దానిని బట్టి అభిప్రాయాలు ఏర్పరుచుకునే అప్పుడు తగు జాగ్రత్త వహించాలి. అంటే కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మాలి. జన్మ ఇచ్చిన తల్లి ఒక పురుషుడిని చూపించి ఇతను నీ నాన్న అంటే నమ్మినట్లు. డీ యన్ ఏ పరీక్ష చేయించి గానీ నమ్మను నేను అని ఎంత మంది అంటారు ?

ఓ రెండు మూడు రోజుల క్రింద వార్తా పత్రికల లో వచ్చిన వార్త ఒకటి ఉదహరిస్తాను. విదేశాలలో ఒక స్త్రీ కి కవలలు అయిన ఇద్దరు పురుషులతో శారీరక సంబంధం వుండింది. ఒక రోజు ఆమె గర్భం దాల్చి కొడుకు పుట్టాడు. తరువాత వారితో ఆమె కు బెడిసింది. ఇప్పుడు ఆ కలిగిన కొడుకుకి తండ్రి మైంటేనన్స్ ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళింది. అయితే ఆ ఇద్దరిలో తండ్రి ఎవరూ అని నిర్ధారించు కోవడానికి డీ యన్ ఏ పరీక్ష చేయించారు..కవలలు కాబట్టి ఇద్దరి డీ యన్ ఏ ఒకటే విధం గా వుండి , తండ్రి ఎవరో తేల లేదు. చివరికి కోర్టు ఆ ఇద్దరూ ఇవ్వాలి అని తీర్పు ఇచ్చింది.
అంటే , శాస్త్రానికి కూడా అంతుబట్టని విషయాలు ఉన్నట్లేగా..
ఇంకో ఉదాహరణ , అంతరిక్ష శాస్త్రం , టెలిస్కోప్ లు, పెరిస్కోపులు , ఇవన్నీ రాక ముందే భారతీయులు ఏ పరికరం యొక్క సహాయం లేకుండా , భూమి కి సూర్యుడి కీ వున్నదూరం 4 కిలో మీటర్ల వ్యత్యాసం తో చెప్పారు . ఎలా సాధ్యం అయింది ?

ఆ రోజుల్లో ఈ రోజు లలో వున్న అతి సందేహ పీడితులు లేరు కాబట్టి , యెట్లా చెప్పారు అని అడగలేదు.

ప్రతి దానికీ శాస్త్రీయ రుజువు అడిగే వారు ఈ విషయాలను గమనించాలి.

పోనీ శాస్త్రీయం గానే అనుకున్నా , నాసా వారు ఉపగ్రహాల ద్వారా పరిశోధన చేసి , రామసేతు వారధి వుందని, మహా భారత కథ క్రీస్తుపూర్వం మూడు వేల పైచిలుకు సంవత్సరాల క్రిందట జరిగింది అని చెప్తున్నారు .
ఇది కూడా నమ్మము అంటే ...తివిరి ఇసుమున ...అన్న పద్యం జ్ఞాపకం చేసుకో వలసి వస్తుంది.

ఇటీవలే ఫేస్బుక్ లో ఒక జోకు చదివాను. అవటానికి జోకు అయినా , ఆలోచించాల్సిన విషయం అందులో వుంది.

" ఒక విద్యార్థి మాస్టారును అడుగుతాడు...ఆర్యభట్టు సున్నాను కనుగుంటే , ఆర్యభట్టు కలికాలం లో పుట్టాడు కాబట్టి, ద్వాపర త్రేతా యుగం లో పది, వంద అన్న సంఖ్యలు యెట్లా లెక్కబెట్టారు ,అని.."

ఆలోచిస్తే , శివునికి మూడు కళ్ళు , సహస్ర నామాలు , నాలుగు చేతులు ఇత్యాది ఎప్పడి నుంచో వున్నాయి లెక్కలో కాబట్టి , మిగతా ప్రపంచానికి నేటి సంఖ్యా శాస్త్రం భారతీయులు అందించిందే కదా అన్నది గ్రహించ వచ్చు.

వెరసి , ప్రశ్నించే ముందు , నమ్మకం వుండాలి. ప్రశ్నించే వారు వారి విజ్ఞత పరిధి ఎంతో ఎరిగిన వారు అయి వుండాలి.

అప్పుడే వారి ప్రశ్నల్లో తార్కిక ఆలోచన ప్రతిబింబిస్తుంది , ఒట్టి మూర్ఖత్వం కన్నా...

మనువు , మనువాదం :

మనువు చతుర్ వర్ణాలను సిద్ధాంతీ కరించింది యాదార్ధమే..అయితే ఈ వర్ణాలు వృత్తిని బట్టి విభజీకరించినవి.

దానికి చిలువలు , పలువలు కలిపి , అంటరానితనం , ఆనగదొక్కటం చేసింది మనువు కాదు.

మనువే చేసి వుంటే , రాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళను తినే వాడు కాదు. అలాగే తనను పడవ లో నదిని దాటించిన భద్రుడిని కావలించు కుని కృతజ్ఞతలు తెలిపే వాడు కాదు. తను తెగటార్చిన రాక్షసుల అంత్యక్రియలు చేసే వాడు కాదు. చివరికి , రావణుడు వధింప బడిన తరువాత విభీషణుడు ని అన్న అంత్యక్రియలు చేయ మని చెప్పి, అతను సంశయిస్తూ వుంటే , నీవు చేయక పోతే నేను చేస్తాను అని చెప్పేవాడు కాదు.
అలాగే శ్రీకృష్ణుడు యాదవ కులం లో పెరిగే వాడా ? విదురుని ఆతిథ్యం స్వీకరించే వాడా ?
అంతకు ముందు వామనావతారం లో బలి చక్రవర్తిని నాశం చేసినాక కూడా అనుగ్రహించే వాడా ?
గోవర్ధన పర్వతానికి పూజలు చేయించింది ఎవరు , దేవేంద్రుడికి గాక ? వరాహ అవతారం ఎత్తింది ఎవరు ?

అంటే అనాది హిందూ ధర్మం లో ఈ అంటరానితనం అవీ లేవు. కుల విబేధాలు కూడా లేవు.

తరువాతి అగ్రకులాల వారు , వారి ఆధిక్యత నిలుపుకోవడానికి, ఏర్పరిచిన విభేదాలు మాత్రమే . ( ఈ మాట నేను అంటే కొందరు అగ్రకులాల వారికి కూడా నేను చెడ్డవాడినే అవుతాను అని తెలుసు నాకు. )
సత్యము ఏనాటికి అయినా సత్యమే... వకుళా దేవి, గోదాదేవి , బీబీ నాంచారమ్మ , సతీ సక్కుబాయి , మీరా , తూకారం , తులసీదాస్ , కబీర్...ఇంకా చాలామంది...వీరి కులాలు చెప్పండి ఎవరైనా...వీరి కన్నా యే అగ్రకులపు మనిషి ఉన్నతులు ?

దానిని సరిచేయటానికే, ఆది శివుడు అంతటి వాడు, అహం బ్రహ్మాస్మి అని చాటిన ఆది శంకరులకు కనువిప్పు గావిస్తారు...

వీటన్నిటి ఆధారం తో...ఘంటాపథంగా ఒక్కటి చెప్పవచ్చు..

కులాల మధ్య తేడాలు వచ్చింది , మనూవాదం తో కాదు...భగవంతుడి వల్ల కాదు..

కాబట్టి , రాముడిని మనూవాది అని అనే వారు ముందర , కొద్దిగా తమలో తాము తర్కించు కుంటే , ఇటువంటి తప్పు ఇంకోసారి చేయరు , ......
ఆధారం లేని నింద వేయరు....

( సశేషం )

శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ? (3)

గమనిక : కొంత మంది మిత్రులు వారి విజ్ఞత మేరకు రామాయణం లో కూడా మానవత్వ రహిత చర్యలు , వర్ణ వర్గ విబేధాలు వుండినవి అన్న అభిప్రాయం వెలిబుస్తుండటం చూసి , నొచ్చుకుని , నా మాటలు కొన్ని వారి ముందు ఉంచుతున్నాను.

_/\__

రాముడు ధర్మం పాటించ లేదు !!! సీతమ్మ పట్ల అన్యాయం చేశాడు !!!

అతి కొద్ది మంది మాత్రం అనే మాట ఇది. కొద్ది మందే అయినా , నాకు తెలిసిన రామ చరితతో , వున్న కొద్ది పాటి వివేకం తో కొన్ని వాదనలు తమ ముందుకు, ఆలోచిస్తారు అన్న నమ్మకం తో... తమరూ విజ్ఞులు , ఒక భావానికి మూఢత్వపు బానిసలు కారు అన్న ఆశ తో....

రాముని ధర్మ నిరతి కి ఒక ఉదాహరణ , మొత్తం రామాయణం లో , తాను అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అల్లా , ముందుగా కైకేయి , తరువాత సుమిత్ర , చివరికి కౌసల్య వద్దకు వెళ్లి వందనం చేసి కుశలం కనుక్కుని ఆశ్వీర్వాదం తీసుకోవటం..ఇక్కడ నిరూపింప బడేది తన వారు , పరాయి వారు అన్న వ్యత్యాసం చూపక పోవటం. అంతే కాక తనవారి కన్నా బయటి వారికి ప్రాధాన్యత ఇవ్వటం..నేటి రాజకీయ కుటుంబాలకు సమర్థత ఇచ్చేవారు ఇది గమనించాలి.

తనకు పట్టాభిషేకం కాకుండా ఆపిన , కైకేయి మీద, మందర మీద ఏనాడూ ఒక చిన్న మాట అన్నట్లు వాల్మీకి రామాయణం లో ఎక్కడా లేదు. పైగా వారి దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు అనే వుంది.

ఆ రోజున అయినా , నేటికీ అయినా , వివాహేతర సంబంధాన్ని సమాజం గౌరవం గా చూడదు అని అందరూ ఒప్పుకునే మాటే.

అట్లాంటిది , అన్ని వేల సంవత్సరాల క్రిందట , అహల్యకు శాప విమోచనం కలిగించటం చిన్న విషయం కాదు. రాముడి క్షమా గుణానికి, దయా గుణానికి పెద్ద నిదర్శనం ఇది.

అలాగే , రాక్షస స్త్రీల పట్ల కూడా , యే మాత్రం కఠోరత లేకుండా ప్రవర్తించటం. తాటకి తో కూడా నేను స్త్రీలతో యుద్ధం చేయను అని చెప్పటం , శూర్పణఖ తో నూ అనుచితంగా వ్యవహరించి నట్లు వాల్మీకి రామాయణం లో లేదు. ఆమె శ్రుతి మించి ప్రవర్తిస్తూ వుంటే శిక్షించిన వాడు లక్ష్మణుడు కానీ , రాముడు కాదు.

రాముడికి అందరికన్నా పెద్ద శత్రువు రావణుడు కదా,

నిర్వివాదంగా. మరి అటువంటి రావణుని కూడా క్షమిస్తాను అన్న మాట అనగలిగిన వాడు రాముడు. సరే యుద్ధం జరిగి , రావణ వధ అయినాక , మండోదరి తో రాముడు రావణుడి గురించి ఒక్క పరుష మాట అనలేదు , సరికదా , అతని అంత్యక్రియలు విభీషణుని తో జరిపించాడు.

అయోధ్యకు తిరిగి వచ్చినాక కూడా , కౌసల్య మాత అడిగితే, సాటి లేని శివ భక్తుడు తన అహం కారణం చేత వధింపబడ్డాడు అని చెప్తాడు కానీ , నా వల్ల చంప బడ్డాడు అని చెప్పడు...

దీనినే హ్యూమిలిటి ,

హాంబల్నెస్ కు పరాకాష్టగా భావిస్తే అతిశయోక్తి కాదు....

మనకు తెలిసిన మానవ చరిత్రలో ఇంత హంబల్ గా వున్న ఇంకొక వ్యక్తి జీసస్ మాత్రమే...గౌతమ బుద్ధుడు , మహావీర్ జైన్ ఉత్తమ పురుషులే కానీ , వారు వీరిరువురు పడ్డ కష్టాలను ఏనాడూ పడలేదు , యే పరీక్షను ఎదుర్కోలేదు.

ఇహ పోతే వాలి వధ.... దేవుడు కావల్సినంత వ్యవధి ఇస్తాడు , అయితే తప్పు గ్రహించి బాగు చేసుకోవడానికి కానీ , లేక తన చేతితో తన మరణం తెచ్చుకోవడానికి కానీ. అహంకార భరిత , స్వార్ధపు కోరికలతో యే తపస్సు , యే ప్రార్థన , యే పూజ చేసినా , దేవుడు కనికరించి వరం ఇచ్చినా , చివరి ఫలితం మాత్రం విషపు గుళిక గానే వుంటుంది. అదే రావణుడి విషయం లో కానీ , వాలి విషయం లో కానీ జరిగింది.

రావణుడు అహం తో వరం కోరినప్పుడు మానవ , వానరాలను చేర్చ లేదు. వారి కారణం గా నే నాశనం అయ్యాడు.

వాలీ అంతే...నా ముందు ఎవరు నుంచున్నా వారి బలం నాకు రావాలి , వారు నా చే ఓడింపబడాలి అని వరం పొంది, నీతి న్యాయం ధర్మం లేక పొగరుతో చరించాడు, అందుకే చెట్టు చాటు నుంచి చంపబడ్డాడు . వాల్మీకి రామాయణం ఆధారంగా తీసుకుంటే.....దృష్టి లోపం వున్న ఇతరులవి కాదు ...వాలి కూడా చనిపోయే ముందు రాముడి ధర్మ నిరతిని మెచ్చుకుంటాడు..శిక్ష పొందిన వాడు , శిక్ష న్యాయపరంగా వుంది అని ఒప్పుకున్నా , నేటి మన సంస్కారం విజ్ఞత ఆ శిక్షను ప్రశ్నించటం హాస్యాస్పదం.

చివరి గా సీతమ్మ వారిని అడవికి పంపటం....

ఆహా...ఆ అమ్మ వారికి లేని న్యాయ సందేహం , మన నేటి విజ్ఞులకు కలుగుతుంది , మానవత కాదని విమర్శ....

ప్రామాణికం....వాల్మీకి రామాయణం మాత్రమే...యే శ్లోకం లో కానీ ఆమె రాముని ధర్మ నిరతి ని ప్రశ్నించిందా , నిందించిందా ? లేదు...

ఒక పరిపాలించే ప్రభువుకు , తన పర బేధం వుండకూడదు , చిన్న పెద్ద అన్న తారతమ్యం వుండకూడదు , రాజు కు మచ్చలేని , మచ్చపడలేని నడవడిక , చరిత్ర వుండాలి అని ఆ దంపతులు ఇరువురికీ తెలుసు.

నేటి స్వార్థ పూరిత రాజకీయ నాయకులను కుల మత ఇతర కారణాల వల్ల సమర్థించే వారి కి ఈ విషయం అర్ధం చేసుకునే విజ్ఞత వుండదు అని వేరే చెప్పనవసరం లేదు అని భావిస్తున్నాను....

( ఇప్పటికి....సమాప్తం )