Friday, 6 March 2020

యుద్ధ కాండము-50

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-50
ఫలశ్రుతి
ధన్యం యశస్య మా౭౭యుష్యం రాజ్ఞాం చ విజయావహం
ఆది కావ్య మిదం త్వా౭౭ర్షం పురా వాల్మీకినా కృతం 6.131.104
య: పఠే చ్ఛృణుయా ల్లోకే నర: పాపా ద్విముచ్యతే
పుత్ర కామ స్తు పుత్రా న్వై ధన కామో ధనా న౭పి 6.131.105
లభతే మనుజో లోకే శ్రుత్వా రామా౭భిషేచనం
మహీం విజయతే రాజా రిపూం శ్చాప్య౭ధి తిష్ఠతి 6.131.106
రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణే న చ
భరతేన చ కైకేయీ జీవ పుత్రా స్తథా స్త్రియ:                       6.131.107
(భవిష్యంతి సదా నందా: పుత్ర పౌత్ర సమన్వితా:)
శ్రుత్వా రామాయణ మిదం దీర్ఘ మా౭౭యు శ్చ వి౦దతి 6.131.108
రామస్య విజయం చైవ సర్వమ౭క్లిష్ట కర్మణ:
శ్రుణోతి య ఇదం కావ్య మా౭౭ర్షం వాల్మీకినా కృతం 6.131.109
శ్రద్ధదానో జిత క్రోధో దుర్గాణ్య౭తి తరత్య౭సౌ
సమా౭౭గమం ప్రవాసా౭న్తే  లభతే చా౭పి బాన్ధవై: 6.131.11౦
ప్రార్థితాం శ్చ వరా న్సర్వా న్ప్రాప్నుయా దిహ రాఘవాత్
శ్రవణేన సురా: సర్వే ప్రీయ౦తే సంప్రశ్రుణ్వతాం    6.131.111
వినాయక శ్చ శామ్యంతి గృహే తిష్ఠంతి యస్య వై
విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్               6.131.112
స్త్రియో రజస్వలా: శ్రుత్వా పుత్రా న్సూయు ర౭నుత్తమాన్
పూజయంశ్చ పఠ౦శ్చేమ మితిహాసం పురాతనం 6.131.113
సర్వ పాపై: ప్రముచ్యేత దీర్ఘ మా౭౭యు: అవాప్నుయాత్
ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియై ర్ద్విజాత్ 6.131.114
ఐశ్వర్యం పుత్ర లాభ శ్చ భవిష్యతి న సంశయ:
రామాయణ మిదం కృత్స్నం శ్రుణ్వత: పఠత: సదా                         
ప్రీయతే సతతం రామ: స హి విష్ణు: సనాతన:    6.131.115
ఆది దేవో మహా బాహు: హరి: నారాయణ: ప్రభు:
సాక్షా ద్రామో రఘు శ్రేష్ఠ: శేషో లక్ష్మణ ఉచ్యతే      6.131.116
కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిమ్
స్త్రియ శ్చ ముఖ్యా: సుఖ ముత్తమం చ
శృత్వా శుభం కావ్యమిదం మహా౭ర్థం
ప్రాప్నోతి సర్వాం భువి చా౭ర్థ సిద్ధిం                   6.131.117
ఆయుష్య మా౭౭రోగ్య కరం యశస్యం
సౌభ్రాతృకం బుద్ధి కరం శుభం చ
శ్రోతవ్య మేత న్నియమేన సద్భి:
ఆఖ్యాన మోజస్కర మృద్దికామై:                       6.131.118
ఏవ మేతత్ పురా వృత్త మాఖ్యానం భద్రమ౭స్తు వ:
ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణో: ప్రవర్ధతాం                       6.131.119
దేవా శ్చ సర్వే తుష్యంతి గ్రహణా చ్ఛ్రవణా త్తథా
రామాయణస్య శ్రవణా త్తుష్యంతి పితర స్తథా       6.131.120
భక్త్యా రామస్య యే చేమాం సంహితాం ఋషిణా కృతాం
లేఖయం తీహ చ నరా స్తేషాం వాస స్త్రివిష్టపే       6.131.121
వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యమైన ఈ రామాయణము శుభప్రదమైనది, ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను పెంపొందించునది. ఇది రాజులకు విజయమును చేకూర్చునది. దీనిని పఠించువారు, వినువారు సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. రామపట్టాభిషేక ఘట్టమును వినువారికి సంతానము కలుగును. సంపదలు వృద్ధి అగును. ఈ రామాయణ గాథ వినువారు దీర్ఘాయువులు అగుదురు. జిత క్రోధులై, దరిద్రాది దుఃఖముల నుండి విముక్తులగుదురు. బంధువులు దూరమైన వారు బంధువులను కలుసుకొందురు. శ్రీరాముని కృప వలన వారి కోరికలు అన్నియు నెరవేరును. రామాయణ శ్రవణముచే దేవతలు ప్రసన్నులై ఆ శ్రోతల యొక్క కుటుంబములకు దుష్ట గ్రహ బాధలు తొలగిపోవును. స్త్రీలు గర్భవతులై ఉత్తమ పుత్రులు పొందుదురు. పాపములు పటాపంచలగును. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క అవతారము. కనుక రామాయణము పఠించువారికి, వినువారికి రామానుగ్రహము ప్రాప్తించును. ఈ రామాయణ కావ్యము సర్వ శుభకరము. సమస్త ప్రయోజనములు సిద్ధించును.ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను, సౌభ్రాతృత్వమును,బుద్ధి కౌశలమును, సుఖ శాంతులను, తేజోవైభవములను ప్రసాదించును. కావున సమస్త సంపదలను అభిలషించెడి సత్పురుషులు నియమ నిష్ఠలతో దీనిని శ్రవణము చేయవలెను.

యుద్ధ కాండము-49


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-49
శ్రీరామ పట్టాభిషేకము
తతః స ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ
రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్ 6.131.59
వసిష్ఠో వామదేవ శ్చ జాబాలి: అథ కాశ్యపః
కాత్యాయనః సుయజ్ఞ శ్చ గౌతమో విజయ స్తథా 6.131.60
అభ్యషి౦చన్ నర వ్యాఘ్రం ప్రసన్నేన సుగన్ధినా
సలిలేన సహస్రా౭క్షం వసవో వాసవం యథా 6.131.61
మహర్షులలో శ్రేష్ఠుడు, వంశ పురోహితుడు ఐన వసిష్ఠ మహర్షి ఋత్విజులైన బ్రాహ్మణులతో గూడి సీతాసహితుడైన రామచంద్రుని రత్న సింహాసనముపై ఆసీనుని గావించెను. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలమైన సుగంధ జలములతో, సహస్రాక్షుడగు ఇంద్రుని అష్టవసువులు అభిషేకించినట్లు అభిషేకించిరి. ఆకాశము నందు నిలిచిన లోకపాలకులు, దేవతలు సకల ఓషధీ రసములతో అభిషేకించిరి. పూర్వము మనువును రాజుగా ప్రతిష్టించునప్పుడు బ్రహ్మ రత్న శోభితమగు కిరీటమును నిర్మింప జేసి ధరింప జేసినాడు. ఆ కిరీటమునే వసిష్ఠ మహర్షి శ్రీరామునికి ధరింప జేసెను.
ఛత్రం తస్య చ జగ్రాహ శత్రుఘ్నః పాణ్డురం శుభమ్
శ్వేతం చ వాల వ్యజనం సుగ్రీవో వానరేశ్వరః 6.131.65
అపరం చన్ద్ర సంకాశం రాక్షసేన్ద్రో విభీషణః
సింహాసనముపై కూర్చున్న శ్రీరామునకు శత్రఘ్నుడు శ్వేత ఛత్రమును, సుగ్రీవుడు తల్లటి వింజామరను, విభీషణుడు చామరమును పట్టుకొనిరి. ఇంద్రుని ప్రేరణచే వాయుదేవుడు నూరు బంగారు కమలములు గల మాలను, వివిధ రత్నములలో, మణులతో భాసిల్లుతున్న ముత్యాల హారమును రామునికి సమర్పించెను. శ్రీరామ పట్టాభిషేక సమయములో దేవ గంధర్వులు పాడిరి. అప్సరసలు నృత్యము చేసిరి. లోకమంతయు హర్షపారవశ్యములో యుండిరి. శ్రీరాముడు ఆ సమయములో బ్రాహ్మణులకు భూరి విరాళములు ఇచ్చెను. సుగ్రీవునకు దివ్య బంగారు మాలను ఇచ్చెను. అంగదునికి చంద్ర కిరణాలు గల రెండు కేయూరములను ఇచ్చెను. తనకు వాయుదేవుడు ఇచ్చిన ముత్యాల హారమును సీతాదేవి మెడలో వేసెను. 
తామ్ ఇ౦గితజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకా౭౭త్మజామ్ 6.131.77
ప్రదేహి సుభగే హారం యస్య తుష్టా౭సి భామిని
పౌరుషం విక్రమో బుద్ధి ర్యస్మి న్నేతాని సర్వశ:                   6.131.78
దదౌ సా వాయు పుత్రాయ తం హారమ్ అసితేక్షణా
సీతమ్మ తన మెడలో రాముడిచ్చిన ఆ హారమును తీసి చేతపట్టి వానరుల వైపు, రాముని వేపు పరి పరి చూచుచుండెను. అప్పుడు సీత అభిప్రాయమును చూపులచే గుర్తించిన రాముడు, సీతతో కల్యాణీ! నీకు పౌరుషముచే, పరాక్రమముచే, బుద్ధిచే ఎవరు నీకు సంతోషమును కలిగించిరో వారికి ఆ హారమును ఒసగమని చెప్పెను. ఆ శుభాంగి ఆ హారమును హనుమకు ఇచ్చెను. హనుమ ఆ హారముతో అధికముగా శోభించెను. ఈ విధముగా వాయుదేవుడు ఇచ్చిన హారము, వాయుసుతుడైన హనుమకు చేరెను. శ్రీరాముడు - విభీషణుడు, సుగ్రీవుడు, హనుమ, జాంబవంతుడు మొదలగు శ్రేష్ఠమైన వారికి మనోవాంఛితములగు వస్తువుల ద్వారా, అనేకమైన రత్నముల ద్వారా సత్కరించెను. వానరులు, సుగ్రీవుడు ఆనందముతో రామునికి నమస్కరించి కిష్కింధకు ఏగిరి. విభీషణుడు మాత్రము లంకారాజ్యము లభించినను తృప్తి నొందక నిలిచి యుండెను. శ్రీరాముడు అతని మనోరథమును ఎరిగి లంకకు అతనిని మరలించవలెననే యోచనతో బ్రహ్మచే ఒసగబడిన శ్రీరంగము అను పేరుగల రంగనాధుడు వేంచేసి యుండెడి విమానమైన తమ కులదైవమును విభీషణునికి ఇచ్చెను.  లబ్ధ్వా కుల ధనం రాజా లంకాం ప్రాయాన్మహా యశా: ఇక్ష్వాకు ప్రభువుల కులదైవమైన శ్రీరంగనాథ మూర్తిని గ్రహించి తన ఆరాథ్య దైవమైన శ్రీరాముని తన హృదయము నందు నిలుపుకొని లంకకు విభీషణుడు బయలుదేరెను. (శ్రీరాముడు, విభీషణుని తో సూర్యచంద్రులు, భూమండలం, రామాయణ గాథ ఉన్నంతవరకు దర్మనిరతితో రాజ్యపాలన చేయమని, అప్పటివరకు ఇక్ష్వాకుల కులదైవం ను అరాధించమని చెప్పెను. హనుమ, విభీషణుడు ప్రళయ కాలము వరకు ఉందురని చెప్పెను. ..ఉత్తరాకండము: 108 వ సర్గ) 
అయితే లంక కు వెళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు. కానీ సూర్యునికి అర్ఘ్యము ఇచ్చే సమయము కావడముతో ఈ విగ్రహాన్ని శ్రీరంగము, కావేరి నది ఒడ్డున పెడతాడు. కాసేపయినాక తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తుతాడు. కానీ ఆ విగ్రహం లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు. అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు (లంక దక్షిణ దిక్కున కలదు). ఈ అర్చామూర్తి ఉభయ కావేరి మధ్య భాగమున ఉండి పోయెను. లంక వైపు చూచుచు రంగనాధుడు ఆలయములో శయనించి యుండును. ఆ విమానము ప్రణవాకారముగా యుండును. విమానము పైన కూడా శ్రీరంగనాథుని మూర్తి లంకను చూచుచు వేంచేసి యుండును. ఈ క్షేత్ర మహత్యము, విభీషణుని చిరంజీవత్వము గురించి పూజ్యశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు రామాయణ ప్రవచనము చెపుతూ ఇలా తెలియ జేశారు. విభీషణుడు ఇప్పటికిని సముద్ర గర్భములోని కాంచన లంకలో చిరంజీవిగా యున్నారని అందుకు ఉదాహరణ చెపుతూ .. శ్రీరంగము యొక్క గుడిలో ఒకాయన రాత్రి నిద్రపోగా, విభీషణుని రామపూజకై  రాక్షసులు ఆ గుడిలోని పూలు తీసుకొని వెళుతూ పొరపాటున పూలతో పాటు నిద్రపోతున్న ఆ వ్యక్తిని కూడా తీసుకొని వెళ్లి పూజా మందిరములో పెడతారు. విభీషణుడు రామపాదములను ఆ పూలతో పూజ చేయుచుండగా వాటిలో ఈ వ్యక్తి కూడా వచ్చాడు. అపుడు విభీషణుడు హడలిపోయి, వాని దీనావస్థను చూచి జాలిపడి మరల రాక్షసులు విభీషణుని ఆదేశముతో శ్రీరంగములో దిగబెట్టి వచ్చారు. 
వానరులు రాక్షసులు అందరూ వారివారి స్థానములకు ఏగిన తర్వాత శ్రీరాముడు పరమ ఔదార్యముతో, పరమానందముతో రాజ్యమును పరిపాలించాడు. లక్ష్మణుడు యువరాజ్యపదవిని నిరాకరించగా, శ్రీరాముడు భరతుని యువరాజుగా చేసెను. శ్రీరాముడు పౌండరీకము, అశ్వమేథము, వాజపేయము మొదలగు యజ్ఞములను తరచుగా నిర్వహించెను. శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకూ వధవ్యము లేకుండెను. ప్రజలకు క్రూరమృగముల బాధ లేదు. రోగగ్రస్తులు గాకుండిరి. దొంగల భయము లేకుండెను. ఎటువంటి అనర్థములు లేకుండెను. పెద్దలు బ్రతికి యుండగా వారి పిల్లలు మృత్యువాత పడకుండిరి. ప్రజలెల్లరు ధర్మనిరతులై యుండిరి. ప్రజలందరూ దీర్గాయువులై, సంతాన సమృద్ధి కలిగి, శోక రహితులై, ఆరోగ్యముతో వర్ధిల్లిరి. వృక్షములు పుష్ప, ఫల భరితములై యుండెను. సకాలములో వర్షములు గురియు చుండెను. వాయువు హాయిని గొల్పుచు వీచుచుండెను. అన్ని వర్ణముల వారు దురాశ లేక తమ తమ కర్మలచే ప్రవర్తిల్లుచు, సంతుష్టులై యుండిరి. ఎవరి నోటా విన్నాను రాముని గాధలు, రామనామము మాత్రమే వినబడుచుండెను.
రామో రామో రామ ఇతి ప్రజానా మ౭భవన్ కథా:
రామభూతం జగద౭భూ ద్రామే రాజ్యం ప్రశాసతి 6.131.99
రాముడు పాలించు కాలము నందు ప్రజలందరూ "రాముడు, రాముడిని" రాముని గూర్చియే ముచ్చటించుకొనిరి. అంతారామ మయం, జగమంతా రామమయం
దశ వర్ష సహస్రాణి దశ వర్ష  శతాని చ
భ్రాత్రుభి: సహిత: శ్రీమాన్ రామో రాజ్య మ౭కారయత్  6.131.103
ఈ విధముగా శ్రీరాముడు 11,000 సంవత్సరములు (9,974 సంవత్సరముల 10 నెలలు సీతాదేవితో కూడి, 1,025 సంవత్సరముల 2 నెలలు సీతా వియోగముతో) సోదరులతో కూడి  రాజ్య పాలన చేసి వైకుంఠమునకు ఏగెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Wednesday, 4 March 2020

-యుద్ధ కాండము-48

[04:46, 05/03/2020] +91 96180 14862: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-48
శ్రీరామ పట్టాభిషేకమునకై నదీ, సముద్ర జలములను తెప్పించుట
తదుపరి హనుమ మథుర వాక్యముల ద్వారా శ్రీరాముని వృత్తాంతమును విని భరతునికి చాల సంతోషము గలిగినది. అప్పుడు భరతుడు, శత్రుఘ్నునికి ఈ విధముగా ఆజ్ఞ యొసగెను. "జనులు శుచిర్భూతులై నగరమందలి దేవస్థానములను అలంకరించి వాయిద్యములను వాయించుచు సుగంధ పుష్పములతో దేవతలను పూజించుదురు గాక". రాజాజ్ఞచే, శత్రుఘ్నుడు నందిగ్రామము నుండి అయోధ్య వరకు మార్గము అంతయు చల్లటి నీటితోను, సుగంధ పుష్పములతోను ఏర్పాటు గావించెను. అప్పుడు అయోధ్య ప్రముఖులు, మంత్రులు, తల్లులు, మొదలగు వారు ఉత్సాహముగా నందిగ్రామమునకు చేరిరి.  తదుపరి భరతుడు ప్రజాసహితముగా, శిరస్సుపై రామపాదులలు ధరించి, శ్వేత ఛత్రమును దాల్చి రాముని కొరకై ఎదురు చూడగా హర్షపరవశమగు వానరుల ధ్వని, ఆ వెనుకనే పుష్పక విమానము, అందు సత్యపరాక్రముడైన సీతాలక్ష్మణ సహితముగా శ్రీరాముడు కనబడినారు. భరతుడు ఆనందముతో శ్రీరాముని చెంతకు వెళ్లి సాష్టాంగము చేయగా శ్రీరాముడు ఆనందముతో భరతుని కౌగలించుకొని తన ఒడి యందు కూర్చుండ పెట్టుకొనెను. పిమ్మట భరతుడు, వానర రాజగు సుగ్రీవుని కౌగలించుకొని ఇట్లనెను..
త్వ మ౭స్మాకం చతుర్ణాం తు భ్రాతా సుగ్రీవ పంచమ:  6.130.45
సౌహృదా జ్జాయతే మిత్ర మ౭పకారో౭రి లక్షణం
సుగ్రీవా! మీరు మా నలుగురికి ఐదవ సోదరులు. ఏలయన స్నేహపూర్వకమగు ఉపకారము చేయుటచే మిత్రుడగు చున్నారు. అపకారము చేయుట శత్రువు యొక్క లక్షణము.
పిమ్మట భరతుడు విభీషణునితో; "రాక్షస రాజా! మీ యొక్క సహాయమును పొంది శ్రీరాముడు మహాదుష్కరమైన కార్యమును పూర్తి చేసెను. ఇది చాలా సౌభాగ్యదాయకమైన విషయము. అనంతరము ధర్మజ్ఞుడగు భరతుడు స్వయముగానే శ్రీరాముని పాదుకలను తీసుకొని వెళ్లి ఆ మహారాజగు శ్రీరాముని పాదములకు తొడిగి చేతులు జోడించుకొని ఇట్లు చెప్పెను. "ప్రభూ! నాకు అప్పగించిన ఈ సమస్త రాజ్యమును నేడు మీ చరణములందు తిరిగి సమర్పించుచున్నాను." అటుపిమ్మట శ్రీరాముని ఆజ్ఞను పొంది పరమోత్తమగు ఆ పుష్పక విమానము ఉత్తర వైపునకు పోయి కుబేరుని స్థానమును చేరెను. అపుడు భరతుడు, శ్రీరామునితో రాజ్య పరిత్యాగం, వనవాసమునకు కారణము దైవ ప్రేరణయే గాని, కైకేయి నిమిత్తమాత్రురాలు. (కైకేయి ధీర వనిత. ఆమె వరముల యొక్క అంతరంగమును మరియు మంథర యొక్క యోగ రహస్యమును గూర్చి *అయోధ్య కాండము-4 & 6 లో వివరించడమైనది). అన్నా! రాజ్యపరిత్యాగము చేసి వనవాసమును అంగీకరించుటచే మా అమ్మ నీచే ఆరాధింపబడినది. ఆమె మనసు సంతసించినది. (శ్రీరాముడు కైకేయి అంతరంగమును అర్థము చేసుకున్నట్లుగా ఎవరును అర్థము చేసుకోలేదు. కైకేయి సంతసించుటలోని భావార్థము గ్రహించవలెను). చిత్రకూటమి నందు ఈ రాజ్యమును నాకు న్యాసముగా అప్పగించారు. మీరు వచ్చువరకు ఈ రాజ్యమును కాపాడినాను. ఇప్పుడు మీకు సమర్పించవలసిన బాధ్యత నాపై యుండినది. లోకమునంతను గుణములచే వశపరచుకొనినవారు. మీ రాజ్యమును మీరే పరిపాలించవలెను. మీ యొక్క రాజ్యాభిషేకము ప్రజలందరూ చూచి తరించుదురు అనెను.  
యావ దా౭౭వర్తతే చక్రం యావతీ చ వసుంధరా
తావత్ త్వమ్ ఇహ సర్వస్య స్వామిత్వమ్ అభివర్తయ 6.131.11
ఎంతవరకు జ్యోతిష్య చక్రము పరిభ్రమించు చుండునో, ఎంతవరకు ఈ భూమండలము ఉండియుండునో, అంతవరకు మీరీ భూమండలమునకు ప్రభువుగా ఉండుదురు గాక!. (అనగా ఇప్పుడు కూడా శ్రీరాముడు అద్రుశ్యముగా యుండి ఈ భరత దేశమును పరిపాలించు చున్నారు అని భావము. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యములో ఈ భరత దేశము ప్రజల మన్ననలు పొందిన వారితో  పరిపాలింప బడుట విదితమే కదా! శ్రీరాముడు కూడా ప్రజా పాలకుడు. ప్రజాభిప్రాయం మేరకే సింహాసనాధీష్టుడు అయినాడు) భరతుడు స్వయముగా రామలక్ష్మణులకు వనవాస దీక్ష విరమింప జేసినాడు. వానర స్త్రీ సమూహముతో సహా సీతమ్మ సర్వాలంకారణ భూషితయై అయోధ్యా నగరమునకు బయలుదేరిరి. సహస్రాక్షుడగు ఇంద్రుడు పచ్చని గుఱ్ఱములను అధిరోహించినట్లు శ్రీరాముడు శ్రేష్ఠమైన రథమును నందిగ్రామములో అధిరోహించి బయలుదేరెను. ఆ రథమునకు భరతుడు సారథ్యము వహించెను. శత్రఘ్నుడు ఛత్రమును ధరించెను. లక్ష్మణుడు వ్యజనము వీచుచుండెను. విభీషణుడు కూడా తెల్లని చామరమును పట్టుకొని ముందు నిలిచెను. ఆకాశమున దేవ, గంధర్వులు స్తోత్రము చేయుచుండిరి. సుగ్రీవుడు శత్రుంజయము అనెడి ఏనుగును అధిరోహించెను. రాముడు అయోధ్యా పురములో ప్రవేశించెను. అయోధ్యాపుర ప్రజలు హర్షముతో పొంగిపోవుచుండిరి. మహాత్ముడగు శ్రీరాముడు తల్లులకు నమస్కరించెను. అనంతరము భరతుని విన్నపముపై సుగ్రీవుని ఆజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు, గవయుడు, సుషేణుడు, నలుడు  జలపూర్ణములగు కలశములతో సముద్రజలములను, ఐదు వందల నదులలో జలములను సేకరించి తీసుకొనిరాగా శత్రఘ్నుడు వానిని రామపట్టాభిషేకము నిమిత్తము పురోహితులకు అప్పగించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
Only admins can send messages

Tuesday, 3 March 2020

యుద్ధ కాండము-47

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-47
శ్రీరాముడు భరద్వాజాశ్రమమునకు చేరిన సంగతి హనుమ ద్వారా భరతునికి తెలియజేయుట
శ్రీరాముడు, సీతమ్మకు ఉత్తర తీరమున చిత్ర విచిత్రములగు కాననములతో నిండిన సుగ్రీవుని కిష్కింధ రాజధానిని చూపెను. సీతమ్మ అప్పుడు శ్రీరామునితో చనువుతో సుగ్రీవుడు మనకెంతయో మేలుచేశాడు కావున వారి భార్యలు, అంతఃపుర స్త్రీలతో అయోధ్యకు వెళ్లవలెనని కోరికను తెలియజేయగా శ్రీరాముడు అందుకు అంగీకరించెను. అప్పుడు విమానమును క్రిందకు దింపగా వారందరు విమానమును అదిరోహించిరి. తరువాత ఋష్యమూక పర్వతము వద్దకు విమానము రాగా సీతకు అక్కడనే తాను సుగ్రీవునితో మైత్రిని చేసుకొని వాలిని సంహరించితినని శ్రీరాముడు చెప్పెను. తరువాత శ్రీరాముడు, ధర్మచారిని యగు శబరిని చూచిన ప్రదేశమును, కబంధుడు సంహరించిన ప్రదేశము, ఖరదూషణాదులను సంహరించిన జనస్థానమును, పంచవటిని, శరభంగాశ్రమమును, అగస్త్యాశ్రమమును, విరాధుడు నేలకూలిన ప్రదేశమును, చిత్రకూటమిని, భరద్వాజాశ్రమమును, దూరమున నున్న అయోధ్యను సీతమ్మకు చూపెను. ఆనాడు చైత్ర శుద్ధ పంచమి. పదునాలుగు సంవత్సరముల క్రితము వనవాసము ప్రారంభమయ్యెను. షష్ఠి నాడు  శృంగిభేరపురము, సప్తమి నాడు వటవృక్ష మూలమున నివాసము, అష్టమి నాడు భరద్వాజాశ్రమమున, నవమి నాడు యమునా నాదీ తీరమున యుండి దశమి నాడు చిత్రకూటమికి బయలుదేరిరి. వనవాసము పదునాలుగవ సంవత్సర ప్రారంభమున రావణుడు, సీతమ్మను పంచవటిలో అపహరించాడు. చైత్ర మాసములో సీతాపహరణము, వైశాఖంలో సుగ్రీవ సమాగమము, ఆషాడములో వాలి వధ, ఆశ్వయుజములో సీతాన్వేషణ, ఫాల్గుణ అమావాశ్య నాడు రావణ వధ, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు రావణ సంస్కారము, విదియనాడు విభీషణ పట్టాభిషేకము, తదియనాడు లంక నుండి తిరుగు ప్రయాణము, చవితినాడు కిష్కింధలో ఆగుట, పంచమినాడు భరద్వాజాశ్రమమునకు వచ్చిరి. ఈనాటికి పదునాలుగు సంవత్సరములు నిండినవి. మరునాడు తెల్లవారేసరికి భరతుని చూడవలెను. భరద్వాజాశ్రమమున శ్రీరాముడు మహర్షికి నమస్కరించి అయోధ్యాపుర విషయములు, భరతుని రాజ్యపాలన, తమ తల్లుల క్షేమము అడిగెను. అప్పుడు మహర్షి శ్రీరామునితో అందరూ క్షేమమేనని చెపుతూ భరతుడు మీ ఆగమమునకై వేచియున్నాడు, మీరు ఈరోజు మా ఆతిథ్య సత్కారమును స్వీకరించుడు, మేము మీకు ఒక వరము ఈయగలను అనెను. అప్పుడు శ్రీరాముడు ఇచట నుండి అయోధ్యకు పోవు మార్గమంతయు వృక్షములన్నియు సమయము కానప్పటికీ ఫలములు, మధువు ఉత్పన్నమవవలెనని కోరగా మహర్షి అందుకు అంగీకరించెను. పిమ్మట తేజస్వియగు, శ్రీరాముడు తనలో విచారణ సలుపుకొని హనుమతో శీఘ్రముగా అయోధ్యకు వెళ్లి వారి క్షేమసమాచారములు తెలుసుకొని, శృంగిభేరపురమున గుహుని కలుసుకొని అతని కుశలం తెలుసుకొని, భరతుని కుశలం తెలుసుకొని నేను సీతాలక్ష్మణ సహితముగా తిరిగి వచ్చిన వార్తను తెలియజేయమని చెప్పెను. రామాజ్ఞను గైకొని గుహునికి శ్రీరాముని క్షేమ వార్త తెలియ జేసి, దీనుడై, కృశించి, ఆశ్రమవాసియై, జటాధారియై యున్న భరతుని చూచెను.  

తం ధర్మమ్ ఇవ ధర్మజ్ఞం దేహవన్తమ్ ఇవా౭పరమ్
ఉవాచ ప్రా౦జలి ర్వాక్య౦ హనూమాన్ మారుతా౭౭త్మజః        6.128.34

దేహమును ధరించి వచ్చిన ధర్మము వలె కనబడే ఆ ధర్మజ్ఞుడైన భరతుని యొద్దకు వెళ్లి హనుమ చేతులు కట్టుకొని శ్రీరాముడు రావణుని సంహారము చేసి, సీతమ్మను పొంది, మహాబలశాలురగు మిత్రులతో కూడి సీతాలక్ష్మణులతో కూడి ఈ ముహుర్తములోనే మిమ్ములను చూచుటకు వచ్చుచున్నాడు. మీ కుశలం అడిగినాడు అని చెప్పెను. భరతుడు హనుమ చెప్పిన వార్తను విని సంతోషముతో ఇట్లు చెప్పెను.

కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే
ఏతి జీవన్తమ్ ఆనన్దో నరం వర్ష శతా ద౭పి 6.129.2

"మనుష్యుడు జీవించి యుండినచో ఎపుడో ఒకపుడు నూరేండ్ల అయిన పిదప కూడా ఆనందము సంప్రాప్తించును". అను ఈ శుభ ఆర్యోక్తి యదార్థమని తెలియు చున్నది. (సుందరకాండ 34 వ సర్గ లో హనుమ రామలక్ష్మణుల కుశల వార్త చెప్పినప్పుడు ఈ ఆర్యోక్తి చెపుతుంది) భరతుని కోరికపై హనుమ, వనవాసము మొదలుగా రావణ సంహారము, విభీషణ పట్టాభిషేకము వరకు రామచరితమును సంగ్రహముగా వివరించెను.  
శ్రీరామ జయరామ జయజయ రామ

Monday, 2 March 2020

యుద్ధ కాండము-46

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-46
శ్రీరాముడు సీతకు ఉత్తర తీరము వరకు గల ప్రదేశములు వివరించుట
ఆ వానరులందరికి విభీషణుడు రత్నధనాదులుచే సత్కరించటం చూచి సంతోషముతో శ్రీరాముడు సిగ్గుతో నున్న సీతను వెంటబెట్టుకొని, పరాక్రమవంతుడు, ధనుర్ధరుడు, సోదరుడుయగు లక్ష్మణునితో గూడి అచ్చట నున్న పుష్పక విమానమును అధిరోహించెను. విమానమున కూర్చుండి వానరులందరిని ఆదరించుచు శ్రీరాముడు విభీషణ సహితముగా యున్న సుగ్రీవునితో ఇట్లు పలికెను.
య త్తు కార్యం వయస్యేన స్నిఘ్దేన చ హితేన చ
కృతం సుగ్రీవ తత్ సర్వం భవతా ధర్మ భీరుణా 6.125.15
సుగ్రీవా! హితైషియు, ప్రేమియునగు ఒక మిత్రునకు చేయదగిన కార్యమంతయు మీరు పరిపూర్ణముగా చేసి చూపించితిరి. ఏలయన మీరు అధర్మమునకు భయపడువారు. వానరరాజా! ఇక మీరు మీ సేనతో గూడ శీఘ్రముగా కిష్కింధ నగరమునకు పోవుడు. విభీషణా! మీరును లంకకు పోయి నాచే నొసఁగఁబడిన రాజ్యమున స్థిరముగా నుండుడు. ఇపుడు ఇంద్రాది దేవతలు కూడా మీకు అపకారము చేయజాలరు. శ్రీరాముడిట్లు పలుకగా వానర సేనాపతులు, రాక్షస రాజగు విభీషణుడు చేతులు జోడించి; రాజశ్రేష్టా! మేమందరము అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం సమయమున మంత్రపూరితమగు జలములచే తడిసిన మీ యొక్క స్వరూపమును దర్శించి, మాతృదేవియైన కౌసల్య చరణములపై శిరస్సు వంచి తదుపరి శీఘ్రముగా మా ఇండ్లకు తిరిగి వెళ్ళెదము. విభీషణ సహితముగా వానరులందరూ ఈ విధముగా విన్నవించగా అపుడు శ్రీరాముడు వారితో; మిత్రులారా! ఇది నాకు మహాప్రియమైన విషయము. మిత్రులగు మీ అందరితో గూడి నేను అయోధ్యాపురమునకు పోగల్గుచో, అది నాకు పరమ ప్రియమైన వస్తువు లభించినట్లే భావించగలను. నాకు చాల సంతోషము గల్గును. తదుపరి వారందరు విమానము ఎక్కగా, కుబేరుని ఆ పుష్పక విమానము శ్రీరాముని ఆజ్ఞను పొంది ఆకాశమున ఎగిరెను. అందరూ ఆ విమానంలో ఇరుకు లేకుండా హాయిగా కూర్చొండిరి. విమానంపై నుండి శ్రీరాముడు సీతమ్మకు ఆయా ప్రదేశములు వివరములు చెప్ప దొడగెను. సీతా! త్రికూట పర్వతముపై కైలాస శిఖరము వలె నున్న లంకను చూడుము. ఇది విశ్వకర్మ నిర్మించియున్నాడు. యుద్ధ భూమిని చూడుము. ఎంతమంది రాక్షస వీరులు చనిపోయినారో చూడుము. ఇక్కడే రావణకుంభకర్ణులు నీ కొరకై చంపబడినారు. రావణ పుత్రులైన ఇంద్రజిత్తు, అతికాయుడు, ప్రహస్తులను లక్ష్మణుడు సంహరించాడు. దేవాంతకుడును హనుమ సంహరించాడు. నరాంతకుడిని అంగదుడు, త్రిశిరుడ్ని నీలుడు  సంహరించారు. సముద్రమును దాటి ఆ రాత్రి మేము విడిది చేసిన ప్రదేశము ఇదియే. సముద్రములో నీ కొరకై నలుని వలన సేతువు నిర్మింపబడినది చూడుము. అదిగో ఆ కన్పించుచున్నది హిరణ్యనాభము అను పేరుగల మైనాక పర్వతము. ఇది బంగారు కాంతులీనుచున్నది. హనుమ నిన్ను అన్వేషించుటకై సముద్రమును లంఘించునప్పుడు ఆ మారుతికి విశ్రాంతి నొసగుటకై సముద్రమును చీల్చుకొని బయిటకు వచ్చినది. ఇది సముద్ర మధ్య భాగమున సేతువు మీద సేన విడిది చేసిన భాగము. సేతుబంధమని వ్యవహరింపబడు పవిత్రమగు తీర్థము. మూడు లోకములలో ఇది పూజింపబడుచుండును. సముద్రముపై సేతువు నిర్మించుటకు సముద్రుని అనుమతిని పొంది సేతు నిర్మాణము చేసితిమి. ఈ దర్భశయన స్థానము పరమ పవిత్రము. మహా పాతక నాశనము.
అత్ర పూర్వం మహా దేవః ప్రసాద మ౭కరోత్ ప్రభుః              6.126.16
అత్ర రాక్షస రాజోఽయమ్ ఆజగామ విభీషణః
పూర్వము ఈ పవిత్ర ప్రదేశము నందే పరమ శివుడు నన్ను అనుగ్రహించెను. రాక్షస రాజైన విభీషణుడు నన్ను శరణు జొచ్చినదియు ఈ ప్రదేశమే! కూర్మ పురాణములో శ్రీరాముడు ఇచ్చట సేతు నిర్మాణమునకు పూర్వమే లింగ ప్రతిష్ట చేసినట్లు కనబడుచున్నది. (సేతుమధ్యే మహాదేవం ఈశానమ్ కృత్తివాసనమ్, స్థాపయామాస వై లింగం పూజయామాస రాఘవః). అంతట పరమేశ్వరుడు పార్వతీసహితుడై ప్రత్యేక్షమయి ఈ లింగ దర్శనము సర్వ పాప క్షయకరము. ఈ భూమండలం, ఈ సేతువు స్థిరముగా యున్నంతవరకు అదృశ్య రూపమున ఉండి ఇచ్చట స్నానము, జపము, దానము, శ్రాద్ధము మొదలగు విధులను ఆచరించిన వారు అక్షయ పుణ్య పాహలములు పొందుదురని పరమశివుడు  వరము ఇచ్చెను. అదియే పద్మ పురాణము నందు అయోధ్యకు తిరిగి వెళ్లునప్పుడు శివ లింగ ప్రతిష్ట చేసినట్లు తెలియు చున్నది. ఈ క్షేత్రమే "రామేశ్వరము" అను పేరుతో నేటికిని కీర్తింపబడుచున్నది. ఇతిహాస పురాణములలో, పురాణముల కంటే ఇతిహాసము వేదము వలె ప్రమాణము. వాల్మీకి నుండి వెలువడిన ఈ రామాయణము ఇతిహాసము. పురాణములకు, ఇతిహాసములు విరోధము ఏర్పడినప్పుడు ఇతిహాసమును ప్రమాణముగా తీసికొనవలెను. ఇచ్చట "మహాదేవ" శబ్దము ”సముద్రుడు” అని కొందరు వ్యాఖ్యాతలు తెలుపు చున్నారు. శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-12 లో శ్రీరాముడు నిర్మించిన సేతువు ఈనాటి రామేశ్వరము వద్ద కాదని, కన్యాకుమారి అగ్రమున ఉండవచ్చునని విశ్లేషణాత్మకంగా తెలియజేయడమైనది. శ్రీరాముడు నిర్మించిన సేతువు పది యోజనముల వెడల్పు, నూరు యోజనముల పొడవు కలదు.  అనగా 49.2 మైళ్ళ వెడల్పు, 492 మైళ్ళ పొడవు కలదు.  Space images taken by NASA reveal a mysterious ancient bridge in the Palk Strait between India and Sri Lanka. This is also popularly known as "Rama Sethu" or named as Adam’s Bridge, approximately at a distance of 30 miles and 1.87 miles width. Archeological studies reveal that the first signs of human inhabitants in Sri Lanka date back to the primitive age, about 1,750,000 years ago and the bridge’s age is also almost equivalent since, Ramayana, was supposed to have taken place in treta yuga (more than 1,700,000 years ago). So, there is much debate whether the Rama Sethu at Rameswaram is built by Bhagavan Srirama or not. I am not going into controversy into it. అన్నియు ఎవరి నమ్మకము. ఎవరి అభిప్రాయము వారివి.
శ్రీరామ జయరామ జయజయ రామ

Sunday, 1 March 2020

యుద్ధ కాండము-45

: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-45

అగ్నిదేవుడు సీతాదేవి పాతివ్రత్య వైభవమును వెల్లడించుట
బ్రహ్మదేవుడు వచించిన ఈ శుభవచనములు విని అగ్నిదేవుడు విదేహనందిని యగు సీతను ఒడిలో నిడుకొని చితి నుండి పైకి లేచెను.

అబ్రవీ చ్చ తదా రామం సాక్షీ లోకస్య పావకః
ఏషా తే రామ వైదేహీ పాపమ్ అస్యా౦ న విద్యతే      6.121.5

నైవ వాచా న మనసా నైవ బుధ్యా న చక్షుషా
సువృత్తా వృత్తశౌణ్డీరా న త్వామ్ అతిచచార హ     6.121.6

అపుడు లోకసాక్షియగు అగ్ని శ్రీరామునితో "శ్రీరామా! ఈమె మీ ధర్మపత్నియగు విదేహరాజకుమారి యైన సీత. ఈమె యందు ఏ పాపమును, ఏ దోషమును లేదు. ఉత్తమ ఆచరణ గల ఈ శుభలక్షణమగు సీత మనస్సు, బుద్ధి, వాక్కు, నేత్రములు వీని ద్వారా మిమ్ము తప్ప మరియొక పురుషుని ఆశ్రయించ లేదు.  ఈమె సదా సదాచారపరాయణుడవగు మిమ్ములనే ఆరాధించింది. సత్యమును ఆశ్రయించి యున్నవాడవగుటచే ఈమె అగ్నిహోత్రములో ప్రవేశించుచున్నను, మూడు లోకములను నమ్మించుటకై ఊరుకొంటివి. పిదప మహాతేజస్వియు, ధైర్యవంతుడు, గొప్ప పరాక్రమము కలవాడును, ధర్మాత్ములలో శ్రేష్ఠుడగు శ్రీరాముడు అగ్నిదేవునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

అన౭న్య హృదయాం భక్తాం మ చ్చిత్త పరివర్తినీమ్
అహ మ౭ప్య౭వగచ్ఛామి మైథిలీం జనకా౭౭త్మజామ్  16.121.15

మిథిలేశనందినియైన, జనక కుమారి యగు సీత యొక్క హృదయము సదా నా యందే లగ్నమై యున్నదని నాకు తెలియును. నానుండి ఎప్పుడును వేరుగా నుండదు. ఆమె ఎల్లప్పుడూ నాయందే మనస్సును నిలుపును. నా ఇచ్చానుసారమే ప్రవర్తించును. కానీ ముల్లోకములు యందలి ప్రాణుల మనంబున విశ్వాసము కలుగజేయుట కొరకు ఏకమాత్రమగు సత్యమును తీసుకొని అగ్నియందు ప్రవేశించుచున్న విదేహాకుమారి యగు సీతను అడ్డు పెట్టలేదు. ఈ ప్రకారముగా చెప్పి తన పరాక్రమము వలన ప్రశంసితుడగు మహాబలశాలియు, మహాయశస్వియు, విజయవంతుడును, వీర్యుడు అగు శ్రీరాముడు తన ప్రియురాలగు సీతను బడసి పరమ సుఖమున నుండెను. శ్రీరాముడు చెప్పిన ఈ శుభ వచనములు విని, ఇంతకంటే మంగళకరం వాక్యములను మహేశ్వరుడు పలికెను. శ్రీరామా! మీరు ధర్మాత్ములలో శ్రేష్ఠులు, మీరు రావణవధయను కార్యమును ఒనర్చితిరి. ఇది చాలా సౌభాగ్యకరమైన విషయము. ఇంకా నీవు దీనుడగు భరతుని ఓదార్చి, అయోధ్యలో రాజ్యమును స్వీకరించి ప్రజలను ఆనందింప జేయుము. అశ్వమేథ యాగమును జేయుము. మీ తండ్రి దశరథ మహారాజు విమానంలో నిన్ను చూచుచున్నాడు. నీవు అరణ్యమునకు రాజ్యమును వదలి వచ్చినావని ఖేదముచే వెనుకకు మరలిరాని పరమపదమునకు వెళ్లక ఇంద్రలోకములో రావణ వధ చేసిన నిన్ను చూచుటకై ఇంతకాలము వేచియున్నాడు. ఇట్లు మహేశ్వరుడు చెప్పగానే విమానము నందున్న తండ్రికి లక్ష్మణునితో కలసి నమస్కరించెను. విమానంలో కూర్చున్న దశరథ మహారాజు ప్రియమైన పుత్రుని దగ్గరకు చేర్చుకొని, ఒడిలో కూర్చుండబెట్టుకొని గాఢముగా ఆలింగనము చేసుకొనెను. అప్పుడు శ్రీరాముడు అంజలి ఘటించి దశరథ మహారాజుతో, భరతుని, కైకేయిని నీచే ఆదరింపబడవలెనని కోరగా అందుకు సమ్మతించాడు. తరువాత స్వస్వరూపముతో ప్రకాశించుతూ విమానంలో ఏగెను. దశరథ మహారాజు వెడలిన పిదప ఇంద్రుడు అంజలి ఘటించి శ్రీరామునితో - శ్రీరామా! మేము నీ యడల చాలా ప్రసన్నులమైతిమి. కావున నీ మనస్సు నందు ఏ కోరిక కలదో దానిని నాకు చెప్పుడు. అపుడు శ్రీరాముని మనంబున చాలా సంతోషము కలిగెను. వారు హర్షాన్వితులై ఇట్లు చెప్పిరి.

మమ హేతోః పరాక్రాన్తా యే గతా యమ సాదనమ్
తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠన్తు వానరాః           6.123.5

దేవేశ్వరా! నా కొరకు యుద్ధమున పరాక్రమము చూపి మరణించిన ఆ వానరులందరూ మరల జీవించునట్లు చేయుము. ఎందుకనగా వారు నా కొరకై పరాక్రమించి మృతి చెందినవారు. అంతియేగాక వారు సంతోషముగా తమ బంధువులతో కలసి ఆనందించునట్లు, వారికి ఏ శారీరక పీడలు, వ్రణములు లేక బలపౌరుషములతో ఉండునట్లు అనుగ్రహింపుము. అట్లే వారు ఎక్కడికి ఏగినను, కాలము కాకపోయినను, వారికి తృప్తినిచ్చు వృక్ష మూలములు, ఫలములు సమృద్ధిగా ఉండునట్లు అనుగ్రహింపుము. రాముడిట్లు చెప్పగానే ఇంద్రుడు పరమ ప్రీతితో ఆయా వరములను అనుగ్రహించెను. అప్పుడు వానరులందరూ గాయములు మానినవారై నిద్ర నుండి లేచినట్లు లేచిరి. అప్పుడు శ్రీరాముడు విభీషణునితో ఈ వానరులు యుద్ధము నందు అనేక విధములుగా విజయమునకై కష్టపడ్డారు గావున వారికి అమూల్యమైన రత్నములు, ధనము మొదలగు వానితో సత్కరింపుము అని చెప్పగా విభీషణుడు అట్లే చేసెను. మరునాడు విభీషణుడు  రామునకు జయము పలికి స్నానము చేసి, తగిన ఆభరణములను, చందనమును పూసుకోను వలసినదిగా కోరగా అందుకు శ్రీరాముడు సున్నితముగా తిరస్కరించి, భరతుడు నాకొరకై వేచిచూస్తున్నాడు కావున వెంటనే ప్రయాణమునకు తగు ఏర్పాటు చేయమని అడిగెను. అప్పుడు విభీషణుడు పుష్పకమును సిద్ధముచేసినాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-44
బ్రహ్మకృత రామ స్తోత్రము
లోకపాలురు ఈ విధముగా చెప్పగా ధర్మాత్ములలో శ్రేష్ఠుడును, లోకనాధుడగు శ్రీరాముడు ఇట్లు చెప్పెను.

ఆత్మానం మానుషం మన్యే రామం దశరథా౭౭త్మజమ్            6.120.11
యోఽహం యస్య యత శ్చా౭హం భగవాం స్త ద్బ్రవీతు మే

నేను దశరథుని కుమారుడగు రాముడనని, మనుష్యుడనని తలంచుచున్నాను. పూజ్యుడగు బ్రహ్మ నేను ఎవడినో, నేను ఎవరికీ చెందిన వాడినో నేను ఎవరి వలన వచ్చిన వాడినో వివరింపగోరుచున్నాను. అని పల్కెను.

బ్రహ్మకృత రామ స్తోత్రము

శ్రీరాముడిట్లు అడుగగా బ్రహ్మదేవుడు ఈ విధముగా చెప్పెను.
భవాన్ నారాయణో దేవః శ్రీమాం శ్చక్రా౭౭యుధో విభుః             6.120.13

ఏక శృ౦గో వరాహ స్త్వం భూత భవ్య సపత్నజిత్
అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చా౭న్తే చ రాఘవ                   6.120.14

లోకానాం త్వం పరో ధర్మో విష్వక్సేన శ్చతు ర్భుజః
శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః                           6.120.15

అజితః ఖడ్గ ధృద్విష్ణుః కృష్ణ  శ్చైవ బృహ ద్బలః
సేనానీ ర్గ్రామణీ శ్చ త్వం బుద్ధిః సత్తం క్షమా దమః                  6.120.16

ప్రభవ శ్చా౭ప్యయ శ్చ త్వమ్ ఉపేన్ద్రో మధుసూదనః
ఇన్ద్రకర్మా మహేన్ద్ర స్త్వం పద్మనాభో రణా౭న్తకృత్                  6.120.17

శరణ్యం శరణం చ త్వామ్ ఆహు ర్దివ్యా మహర్షయః
సహస్ర శృ౦గో  వేదాత్మా శత జిహ్వో మహర్షభః                     6.120.18

త్వం త్రయాణాం హి లోకానా మా౭౭ది కర్తా స్వయం ప్రభు:
సిద్ధానా మ౭పి సాధ్యానామ్ ఆశ్రయ శ్చా౭సి పూర్వజ:              6.120.19

త్వం యజ్ఞ స్త్వం వషట్కార స్త్వమ్ ఓంకారః పరంతప
ప్రభవం నిధనం వా తే న విదుః కో భవాన్ ఇతి                        6.120.20

దృశ్యసే సర్వ భూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ
దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ                             6.120.21

సహస్ర చరణః శ్రీమాన్ శత శీర్షః సహస్రదృక్
త్వం ధారయసి భూతాని వసుధాం చ సపర్వతామ్                 6.120.22

అన్తే పృథివ్యాః సలిలే దృశ్యసే త్వం మహోరగః
త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవ గన్ధర్వ దానవాన్                 6.120.23

అహం తే హృదయం రామ జిహ్వా దేవీ సరస్వతీ
దేవా గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ: ప్రభో                       6.120.24

నిమేష స్తే భవే ద్రాత్రి: ఉన్మేష స్తేఽభవ ద్దివా
సంస్కారా స్తే భవే న్వేదా న త ద౭స్తి త్వయా వినా                  6.120.25

జగత్ సర్వం శరీరం తే స్థైర్యమ్ తే వసుధా తలమ్
అగ్నిః కోపః ప్రసాద స్తే సోమః శ్రీవత్స లక్షణ                                           6.120.26

త్వయా లోకా స్త్రయః క్రాన్తాః పురాణే విక్రమై స్త్రిభిః
మహేన్ద్ర శ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహా౭సురమ్             6.120.27

సీతా లక్ష్మీ ర్భవాన్ విష్ణు: దేవః కృష్ణః ప్రజాపతిః
వధా౭ర్థం రావణ స్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్                    6.120.28

త దిదం నః కృతం కార్యం త్వయా ధర్మ భృతాం వర
నిహతో రావణో రామ ప్రహృష్టో దివ మా౭౭క్రమ                      6.120.29

అమోఘం బల వీర్యం తే అమోఘ స్తే పరాక్రమః
అమోఘం దర్శనం రామ న చ మోఘ: స్తవ స్తవ:                     6.120.30

అమోఘా స్తే భవిష్యన్తి భక్తిమన్త శ్చ యే నరాః
యే త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమమ్             6.120.31

ప్రాప్నువంతి సదా కామాన్ ఇహ లోకే పరత్ర చ                       6.120.32

ఇమా మా౭౭ర్ష స్తవం నిత్య మితిహాసం పురాతనం
యే నరాః కీర్తయిష్యన్తి నాస్తి తేషాం పరాభవః                          6.120.33

 మీరు చక్రమును ధరించు సర్వ సమర్థులగు నారాయణుడివి. ఒక కోర కలిగి భూమిని భరించు వరాహరూపులు. దేవతల యొక్క భూత, భవిష్యత్ శత్రువులను జయించువారు. రఘునందనా! మీరు నాశరహితమగు పరబ్రహ్మ. సృష్టియొక్క ఆదిమధ్యాంతముల యందు మీరు సత్య రూపమున విరాజిల్లుతున్నారు. మీరీ లోకముల యొక్క పరమ ధర్మము. మేరే విష్వక్సేనులు మరియు నాలుగు భుజములు గల శ్రీహరి. మీరు శార్ఙ్గధన్వులు, హృషీకేశులు, అంతర్యామియగు పురుషులు, పురుషోత్తములు. మీరెవరిచేతను ఓడింపబడరు. మీరు నందకమను ఖడ్గమును ధరించు విష్ణువు మరియు మహాబలశాలియగు కృష్ణుడు అయి యున్నారు. మీరే దేవతల సేనాపతియు అయి యున్నారు. బుద్ధి, సత్వము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, సృష్టి, ప్రళయము - వీనికి కారణ భూతులు మీరే. మీరే ఉపేంద్రులు, మధుసూధనులు. ఇంద్రుని కూడా ఉత్పన్నమొనర్చు మహేంద్రులు. యుద్ధమును సమాప్తము చేయు శాంత స్వరూపులగు పద్మనాభులు మీరే. దివ్య మహర్షులు మిమ్ములను శరణదాతగాను, శరణాగతవత్సలునిగా చెప్పుచున్నారు. వేలకొలది శాఖలనే కొమ్మలు, వందల కొలది విధి వాక్యములను మస్తకములతో కూడిన వేదమను మహావృషభము మీరే. మూడు లోకములకు ఆదికర్త. స్వయంప్రభువు మీరే. మీరు సిద్ధులకు, సాధ్యులు ఆశ్రయులు మరియు పూర్వజులు. యజ్ఞము, వషట్కారము, ఓకారమున్ను మీరే. మీరు శ్రేష్ఠులలో శ్రేష్ఠులగు పరమాత్మ. మీ యొక్క ఆవిర్భావ తిరోభావములను ఎవడును తెలుసుకొనలేరు. మీరెవరో అదియు ఎవనికిని తెలియదు. సమస్త ప్రాణులయందును, గోవులందును, బ్రాహ్మణులు యందును మీరే కానిపించుచున్నారు. సమస్త దిక్కుల యందు, ఆకాశము నందు, పర్వతముల యందు, నదుల యందు, మీ యొక్క సత్తమే కలదు. మీకు వేలకొలది పాదములు, వందల‌ కొలది శిరస్సులు, వేలకొలది నేత్రములు కలవు. మీరే సమస్త ప్రాణులను, భూమిని, సమస్త పర్వతములను ధరించుచున్నారు. భూమి అంతమైనపుడు మీరే జలము పైన గొప్ప సర్పమగు శేషనాగుని రూపమున కన్పించుచున్నారు. శ్రీరామా! మీరే మూడు లోకములను, దేవతలను, గంధర్వులను, దానవులను ధరించు విరాట్పురుషుడగు నారాయణుడవు. అందరి హృదయమున రమించు ఓ పరమాత్మా! బ్రహ్మనగు నేను మీ యొక్క హృదయము. సరస్వతి దేవి మీ యొక్క జిహ్వ. ప్రభూ! బ్రహ్మనగు నేను సృష్టించిన దేవతలందరును మీ యొక్క విరాట్ శరీరమున రోమములు వంటి వారు. మీ యొక్క నేత్రములను తెరచుట పగలు. మూయుట రాత్రి అయి యున్నవి. వేదములు మీ యొక్క సంస్కారములు.మీరు లేనిచో ఈ జగత్తు యొక్క అస్థిత్వము లేదు. విశ్వమంతయు మీ యొక్క దేహము. భూమి మీ యొక్క స్థైర్యము. అగ్ని మీ యొక్క కోపము. చంద్రుడు మీ యొక్క ప్రసన్నత్వము. వక్షస్థలమున శ్రీవత్సమను చిహ్నమును ధరించు భగవంతుడగు విష్ణువు మీరే. పూర్వ మీరే (వామనావతారమున) మీ మూడు పాదములచే మూడు లోకములను కొలిచితిరి. మీరు మహాభయంకరుడైన దైత్యరాజగు బలిని బంధించి ఇంద్రుని ముల్లోకములు రాజుగా చేసితిరి. సీత సాక్షాత్ లక్ష్మి. మీరు సాక్షాత్ విష్ణుభగవానులు. మీరే సచ్చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ భగవానుడు, మరియు ప్రజాపతి. ధర్మాత్ములలో శ్రేష్ఠుడగు రఘువీరా! మీరు రావణుని వధించుట కొరకే ఈ లోకమున మనుష్య శరీరమున ప్రవేశించితిరి. మా యొక్క కార్యమును మీరు చక్కగా నెరవేర్చితిరి. శ్రీరామా! మీచే రావణుడు చంపబడెను. ఇక ఇప్పుడు మీరు ప్రసన్న పూర్వకముగా మీ దివ్య ధామమునకు దయచేయుడు. దేవా! మీ బలము అమోఘము. మీ పరాక్రమము వ్యర్థమగునది కాదు. శ్రీరామా! మీ దర్శనము అమోఘమైనది. మీ యొక్క స్తోత్రమును అమోఘమైనది. మీ యందు భక్తి కలిగి యుండు మనుజులున్ను ఈ భూమండలమున అమోఘములై యుందురు. మీరు పురాణ పురుషోత్తములు. దివ్యరూప ధారులగు పరమాత్మ . ఎవరు మీ యందు భక్తి కలిగియు యుందురో, వారు ఈ లోకమున, పరలోకమున సమస్త వాంఛితములను పొందుదురు. 

ఇది పరమ ఋషియగు బ్రహ్మదేవుడు చెప్పిన దివ్య స్తోత్రము. పురాతన ఇతిహాసము. ఎవరు దీనిని పాటించుదురో, వారికి ఎప్పుడును పరాభవం రాదు. 
శ్రీరామ జయరామ జయజయ రామ