Thursday, 18 September 2025

రెండవ సర్గ

 1. చంll  మనమున నెంచుకార్యములు మాన్యత నందక గాసిలేలనో   

క్షణములు వచ్చు నింకను సకాలము జేరగ వేచియుండినన్   

గుణముల నెన్న సంగతుల కూరిమి భాగ్యము లెన్నొ గల్గగన్ 

మనసగు  రామకార్యమున మారుతి లంఘన జేసె లంకకున్

2. ఉ౹౹ తల్లియుఁ దండ్రియున్ గురవు దారుల సర్వము నాకు నీవెగా 

కల్లలు కావు నీ కరుణ కాన్కలు  సంబర సమ్మ తమ్ము; నే 

నొల్లను వేరు దైవమును నోచగ మిమ్ముల నిత్యసత్యమై 

యుల్లము నందునీ స్మరణ యుండగఁ దీర్చుము జానకీ పతీ


3. త:: సమయ చిత్తము లేనిదూతల సత్వ తత్త్వము ప్రశ్నయై 

సమరమైనను గాని, కల్పన సంధి యైననుఁ గష్టమే 

అమలు కాల ప్రవృత్తి ధర్మ ము అంధకారములై గనన్  

ప్రముఖులైనను ధర్మమార్గమె బాధ్యతేయగు నిత్యమున్


4. ఉ:: చంద్రుని కాంతి పుంజములు చంద్రిక ప్రాపున వెల్గు దారులై  

చంద్రుని కున్నమచ్చపొడ సాతము జూపగ లంక శోభిలన్ 

చంద్రుడు విష్ణుమూర్తి కర చక్రముగా తనరించు సూచికన్ 

చంద్రుని సోయగమ్ములనిజమ్ములు తోడన సీత శోధనన్


5. త. దిగుడు బావులు పెక్కులై నట తేలగిల్లిన నాచుతో  

మొగలి పువ్వులు కొండమల్లెలు మొగ్గలే విరబూయగా  

ఎగయు సన్నటి కొండ వాగులు ఇప్ప పూవులు మంకెలూ  

సొగసుగా శిఖరాగ్ర శొన్నపు శోభ లున్నవి లంకలో


6. ఉ.  భోగవతీపురాధిపతి పూజ్య కుబేరుని రాజ్యమేయగున్ 

యోగము రాక్షసుండునిట యోగ్యత చెందగ సమ్మతమ్మునన్ 

భాగము రావణుండు తన పాలిట జేయగ దీర్చెలంకనున్ 

త్యాగ కుబేరు సంచిత వితానము కాంచన లంకయే యగున్


7. ఉ:: వచ్చిన కార్యమున్నడరు వాటున దీక్షగ నెట్లు  తేర్చెదో 

కచ్చిత బుద్ధి సూక్ష్మతల కారణ నిర్ణయ శోధనా ప్రతుల్  

మెచ్చిన రామ కార్యమున మీరిన లంఘన శక్యతా తతుల్  

హెచ్చిన తేజమున్ హనుమ హేమపు లంకను జేరె నప్పుడున్


8. ఉ:: శక్యము కాదు రాక్షసుల సన్నిధి సీతను గాంచ నేరికిన్  

శక్యము సూక్ష్మ రూపముల సంచిత  చేతల హన్మ కేయగున్     

శక్యము కానిదా విహిత సంహత కార్యము సూనృతమ్ము గా  

శక్యము వాయు పుత్రునకు సాధ్యము గాదన నన్యమెక్కడన్


9. చ: అనయము సీత జాడ గను యంకిత సేవల లంక జేరగన్ 

ఎనదగు మంచి మార్గమున, హెచ్చిన సంవిధ ప్రత్యయమ్ము లన్ 

ఘనతర! జానకీ సతిని గాంచగ లంక సమీక్షలెన్నగన్ 

అణకువ లైన విద్యలలొ అంజని పుత్రుడు మంగళాత్ముడై


: 10. ఉ. విస్తరణమ్ము నన్ తిరిగి విగ్రహ రూపముఁ బెంచి లంకనున్ 

శస్తము లైనకార్య ములు జానకినిన్ గను సంగతుల్ వినన్  

మస్తము నందు ముఖ్యముగ మారుతి దల్చిన ధర్మకార్యమై   

ప్రస్తుత రామ సేవలకు ప్రాంజలి యొగ్గి ప్రయాణ మందగన్


 11. శా: విశ్వాసమ్మున వాయు నందనుడు వైవిధ్యమ్ము లెన్నోగనన్

విశ్వాసమ్మును వీడకన్ కడిమితోవేసారు సాధ్యమ్ములన్

విశ్వాసాద్య గుణమ్ములన్ మదిని సంవేద్యమ్ము లౌ దీవెనల్

విశ్వాశాభినివేశసాధనలు విశ్వేశానతిన్ బొందగా


 12. ఉ.: వ్యాకుల మున్న కార్యములు వాటముగానగు సంశయమ్ములన్  

స్వీకరణమ్ము లైన ఘన స్నేహిత సేవన సంవిధమ్మునన్    

సాకములీవివేకపద సాధన శోధన కార్య సూత్రముల్  

ఏకమె సీతజాడలకు హేతువు లెన్నగ నిశ్చయమ్ము నన్


 13. ఉ:: గర్వము హెచ్చి కళ్ళనెటు గానక రాక్షస రావణుండిలన్ 

నిర్వచనమ్ము లీయదగు నిశ్చల పుత్రిక జానకీ సతిన్ 

ఉర్వికె కీడుగా చెరల నొగ్గున నుంచగ పట్టు కొచ్చినన్ 

ఖర్వము వానికిన్ నణచు కార్యము జేయగ శోధనార్థమై


 14. చం. మనసున దైత్యమాయలకు మ్లానములై తడబాటు చెందగా  

తనరగు కార్య పాటవము తప్పిన వాలున నిర్గుణమ్మునన్ 

ఘనమగు శౌర్య తేజములు కాంచన లంకను జూడ వశ్యమై 

తనరగ నాంజనేయుడు నుదారత జెందగ లంక శోభలన్


 15. చం:: మలుపులదీర్చి లంకనటు మారుతి పట్టిన పట్టు వీడకన్

కలనగు విద్య లన్ సమయ కారణ తీరులు సమ్మతమ్ముగా 

చెలిమికి వశ్యమైన తగు సేవలు నిశ్చిత ధర్మ నీమమై 

నెలవుల శోధనల్ విధుల నేర్పుగ జేయగ లంకనందునన్

 16. శా:: నాదమ్ముల్ నినదించ సాగె నటగా నాలంక రాజ్యమ్మునన్ 

క్రోధమ్మున్ హనుమయ్య గట్టి ప్రకటాక్రోశమ్ము నెట్టించగా   

శోధింపుల్ తనరించ నంత ప్రతిగా శోభించు లంకన్ గనన్  

బాధించన్ స్వగతాన లంక సిరులన్ ప్రాకాశ్యమున్ మెచ్చి నన్

 17. ఉll  నమ్మక ముంచగా నియత న్యాయము లన్ సరి దీర్చగా నగున్

నమ్మిన విశ్వ నీతినిట నర్తన జేయగ నీశుడుండగన్

నెమ్మనమున్ పరాకుగొన నిశ్చయముల్ విధి వశ్యమే యగున్

నమ్మగ ధర్మమున్ చెడిన నల్వజనుండిల లేడు సత్యమై


 18. మll   ప్రకటించన్ గడు భావ్య చింతనల సంప్రాప్తమ్ము సంధిల్లమై 

సకలానుగ్రహ సేవలన్ సహనమే సామర్థ్య సంభావనై  

ఒకటే బాస నొకే శరంబనగ విద్యోతమ్ము ప్రాబోధికన్ 

ముకులమ్మై విరులంతటా పరచ నా భూమాత రామార్థికిన్


  1. మll కలలన్నీ కదిలించమానసమునన్ గాలాను గుణ్యమ్ముగా
    ఫలితమ్ముల్ మును ముందుగా గదియ సంప్రాప్యమ్ము లెచ్చించగా
    అలవోకై గలుగన్ విశేషముగ ప్రహ్రాదమ్ము కల్గించగా
    అలలన్నీ పరుగందుచర్యలనగా జ్ఞానాతి రేకమ్ములన్

: 20. :: చంll విషయము లంకనందునవివేకము జూపగ సీతజాడలన్
మిషలుగ నెంచి రాక్షసులు మిథ్యల జూపగ జంకు లేకనే
కషణము లైన తీర్పులను గాదిలి శోధల నించ రాదనన్
మిషములనెన్ని జూపభయ మెన్నక జాగృతి జూపి దీటుగా

21ఉ:: మేడలు స్వర్ణ కాంతుల ప్రమేయమునన్ ప్రభవించ లంకనన్
వాడలు రత్న రాసులుగ వాకిట ముంగిల రంగవల్లులై
జాడలు వజ్ర కాంతుల ప్రసారము లెన్నిన శోభనా తతుల్
నీడల మచ్చుకే గనని నిశ్చల కాంతుల లంక నుండగన్

22మ. కో. ఏమి జెప్పిన తక్కువే నన యింపు లెచ్చిన లంకలో
స్వామి కార్యము నాదరింపగ సంశయమ్మును మానగా
రామ నామము మంత్రముల్ సడి రాక్షసమ్ముల గూల్చగా
ఏమి జేసిన సీత మాతను ఏరి జూచుట నిక్కువమ్

సుందర కాండ 2 వ సర్గ (వృత్త పద్యమాల ) సమాప్తము 

No comments:

Post a Comment