Monday, 6 February 2017

సౌందర్యలహరి



సౌందర్యలహరి

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)
శ్రీ దేవీ సౌందర్యం , స్వరూప, సంస్థితి, గుణ, చేష్టా, ప్రభావ
తత్వ సౌందర్యముల స్థూల, సూక్ష్మ , సూక్ష్మ తర, సూక్ష్మ తమ, 
భేదాలతో అత్యంత మనోహరంగా వర్ణన చేయడం వలన 
శ్రీ శంకర భగవత్పాద విరచిత ఈ దేవీ స్తుతి " .సౌందర్య లహరి"
అయ్యింది .

దేవీ భక్తులకు ఇది ఎంతో ప్రయోజన కారి కావాలని
ఆకాంక్షిస్తున్నాను.


శ్లోకము (1)
శివ శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పన్దితు మపి
అతస్త్వా మారాధ్యాం హరిహర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి !!


ప్రతిపదార్థము
శక్త్యాః= శక్తితో, యుక్త= కూడియుండగా, శివ= శివుడు, ప్రభవితుం= సృష్టిచేయ,
శక్తః = సమర్థతగలవాడు (అవుతున్నాడు), ఏవం = ఇట్లు, నచేత్ = కాకున్నట్లయితే
దేవః = శివుడైనా, స్పందితుం అపి = చలింౘడానికి, నకుశలః = సామర్థ్యం గలవాడు
కాడు, అతః = అందుచేత, హరిహరవిరించాది భిరపి = బ్రహ్మ, విష్ణు, శివులచేత
సైతం, ఆరాధ్యం = పూజింౘుటకుతగిన, త్వాం = నిన్ను, ప్రణంతుం= నమస్కరింౘడానికిగాని, స్తోతుంవా= స్తుతింౘడానికిగాని, అకృతపుణ్యః = పుణ్యం
చేయనట్టివారికి, కథం = ఎట్లు, ప్రభవతి = శక్తి వస్తుంది ?


అమ్మా, ఓ భగవతీ! సర్వ మంగళ సహితుడైన శివుడు జగన్నిర్మాణ శక్తివయిన నీతో కూడితేనే కానీ జగాల
ను సృజించటానికి సమర్థుడు కాడు. అలా నీతో కూడక పోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. కాబట్టి హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికి గాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడు అవుతాడు ? కాడు.

పుణ్యం లేనివారెవ్వరూ ఆజగన్మాతను స్తుతింౘడానికి అర్హులుకానేరరు. " నాకుశక్తి ఉంది " అనటం మనం తరుచూ వింటుంటాం. ఆ శక్తి అనేకరకాలు. కొందరికి రాసేశక్తి, కొందరికిమాట్లాడేశక్తి, కొందరికి అభయనించే శక్తి . ఇలా ఏ శక్తి యైనా ఆ ఆదిశక్తి అంశ అని తెలుసుకోవాలి.
--((**))--


1 శ్లో|| శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి |
అతస్త్వా మారాధ్యాం హరిహర విరఞ్చాదిభిరపి
ప్రణంతుం స్తో్తుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి ||

అమ్మా, ఓ భగవతీ! సర్వమంగల సహితుడయిన శివుడు జగన్నిర్మాణశక్తివయిన నీతో కూడితేనేకాని జగాలను సృజించడానికి సమర్థుడు కాడు; నీతో కూడకపోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికిగాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు? కాడు.
*************
 
సౌందర్యలహరి
2 శ్లో|| తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకా నవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ||

ఓ మాతా! బ్రహ్మదేవుడు నీ చరణకమలాలలో పుట్టిన కించిత్తు పరాగాన్ని గ్రహించి లోకాలను ఎలాటి వైకల్యం లేకుండ సృజిస్తూన్నాడు. ఈ ఇంచుకపదరజస్సునే మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన వేయి శిరస్సులతో భారంగా మోస్తున్నాడు. దానినే శివుడు చక్కగామొదిపి తన శరీరానికి విభూతిగా అలదు కొంటున్నాడు.
*************

సౌందర్యలహరి
3 శ్లో|| అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ |
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||
అమ్మా! నీ పాదరేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టే సూర్యద్వీప నగరం. ఆ నీ పాదలేశం మందబద్ధులైన జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం; లేమిచేత కుంగిపోయే దరిద్రులకు, సకలసంపదలనిచ్చే చింతామణుల శ్రేణి. అంతేగాక జనన మరణ సంసారరూపమైన సాగరంలో మునిగి దరిగానక తపించే వారికి - విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామియొక్క కోర అవుతోంది. అంటే ఉద్ధరించేది; సంసార సాగరాన్ని తరింపజేసేది అని భావం.సౌందర్యలహరి

4 శ్లో|| త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |
భయాత్త్రాతుం దాతుం ఫలమపిచ వాఞ్చాసమధికం
శరణ్యే లోకానాం తవహిచరణా వేవ నిపుణౌ ||

భగవతీ! లోకశరణ్యా! ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయ వరముద్రలను ధరించి వరాలను, అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వరాభయముద్రలను ధరించవు కదా! కారణం, ఓ అంబా! భక్తులను భయం నుంచి రక్షించడానికి వారు కోరిన దానికన్నా అధిక ఫలాన్నిఒసగడానికి, ఆడంబరమైన బాహ్యప్రదర్శ లేని నీ పాదసరోజములే చాలును.
*************

సౌందర్యలహరి
5 శ్లో|| హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ |
స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ||

ఓ జగన్మాతా! ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను, పూర్వం శ్రీహరి ఆరాధించి సుందరాంగియై, త్రిపురాలను తెగటార్చి క్రోధావిష్టుడైన శివుడి మనసులో సైతం కామవికారాన్ని కలిగించి క్షోభపెట్టగలిగాడు. అలాగే మన్మథుడు నిన్ను కొలిచి, తన సతి రతీదేవి కన్నులను రంజింపచేయగల సౌందర్యాన్ని పొంది, ఆ రూపుతో అరణ్యాలలోతపస్సు చేసుకునే మునుల మనస్సులలో కామాభిలాష కలిగించటానికి సమర్థుడైనాడు. ఔరా! నీ ప్రసాద మహత్తు అద్భుతం కదా!

సౌందర్యలహరి
6 శ్లో|| ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసంత స్సామంతో మలయమరు దాయోధన రథః |
తథా ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాజ్గాత్తే లబ్ధ్వా జగదిద మనజ్గో విజయతే ||

ఓ హిమగిరి కుమారీ! మన్మథుడి విల్లు పువ్వులతోరూపొందించబడినది; వింటినారి తుమ్మెదల శ్రేణి; పుష్ప నిర్మితమైన బాణాలూ ఐదు అతడి అమ్ముల పొది; కాలబద్ధుడై మళ్ళీ మళ్ళీ వచ్చే వసంతుడు అతడి సామంతుడు; అతడి యుద్ధరథం నిరంతరం చలించే రూపులేని మలయమారుతం; ఇలా పనికిరాని పరికరాలు కలిగిన మన్మథుడు అంగ రహితుడు; బలిష్టమైన మేనులేని వాడు. అయిననూ, నిన్నారాధించి, నీ కడగంటి కటాక్షంతో ఈ జగత్తును తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్నాడు.
*************

సౌందర్యలహరి
7 శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా |
ధనుర్బాణాన్ పాశం సృణి మపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా ||

గణగణమని మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన మొలనూలు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే కుచముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడి వంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని, పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్నిచేతుల్లో ధరించినదీ, త్రిపురాలను మట్టుపెట్టిన శివుడి శౌర్యస్వరూప ఐన భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!.

సౌందర్యలహరి
8 శ్లో|| సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే|
శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ||

తల్లీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, కల్పవృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూలతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై, మంగళరూపమైన ( త్రికోణపు) పానుపుపై, నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులుమాత్రం సేవిస్తున్నారు. (అందరికీ సామాన్యంగా నీ సేవ లభించదని భావం).