Tuesday 26 March 2019

***శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - ***{001/102}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - {001/102}

శ్రీ రామం త్రి జగద్గురుం సురవరం సీతామనోనాయకం
శ్యామాంగం శశికోటిపూర్ణవదనం చంచత్కలాకౌస్తుభం
సౌమ్యం సత్యగుణోత్తమం సుసరయూతీరే వసంతం ప్రభుం
త్రాతారం సకలార్థసిధ్ధిసహితం వందే రఘూణాం పతిం

సీ.
ముల్లోకగురువుని మోక్షసురవరుని
అవనిజాహృదయేశు ననఘశరుని

అసితాంగఘన పూర్ణశశికోటిపూర్ణుని
శాంతకౌస్తుభవిభాక్రాంతమణిని

సౌమ్య సత్య సుగుణ సౌశీల్యసుమనుని
సరయూనదీవాస సత్ప్రభుడని

రక్షించిమమ్మేల రఘుపతీ! శరణను
రక్షార్థహృదయపారక్ష రామ!

తే.
నమ్మకంబుంచి నళినాక్షు నంతజూడ
చిమ్మచీకటి దొలగించి చింతదీర్చు
నెమ్మికొకటని నామము నేర్చినంత
రామ రామ రామమయము రామపదము!

సీ.
ముజ్జగంబునకొక్క ముఖ్యగురుడు పూజ్య
దేవతాపూజిత దేవవరుడు!

నేలపట్టెడదకు నెయ్యంపు చెలికాడు
నలుపునప్పెడిమేని నరవరుండు

కోటిచంద్రులకాంతి కూడిన ముఖనేడు
కౌస్తుభమణికాంతి గమ్మువాడు

నిజలాలిత్యుడు నిత్యసత్యగుణుడు
నిను నను రక్షించు నిజపురేడు

తే.
సారసరయూనదీతీర సదనుడనుచు
సకలసిద్ధార్థసహితుని సన్నుతులిడ
రాఘవపదప్రణతి లోకరక్షయైన
రామ రామ రామమయము రామపథము!

(ముఖ్య తాత్పర్యము : మూడులోకాలకు గురువు, దేవతాశ్రేష్ఠుడు, సీతాదేవి పెనిమిటి,నల్లని శరీరము , కోటిచంద్రులకాంతితో ముఖము , అద్భుత కాంతి,కౌస్తుభమణి తో శాంతుడు, సత్యవ్రతుడు, సరయూతీరమందు వసించు ప్రభువు, మనలందర్నీ రక్షించు సర్వకార్య సిధ్ధులతో కూడిన రఘువంశరాజుల కధిపతి అగు శ్రీ రాముని కి నమస్కరించుచున్నాను )

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {002/102}

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘువరాన్వయరత్న దీపం
ఆజాను బాహు మరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి.

సీ.
రఘువంశసంజాత రాఘవాయందును
దశరథాత్మజుడందు ధర్మధరుని

ఏలెక్క లేనట్టి ఏకాకి నీవందు
అవనిజాపతివందు అవనిపతిని

రవివంశరత్నంబు రాత్రదీపంబందు
రజనీచరులజంపు రక్షణుడని

మోకాటిజేతుల మోక్షకరుడవందు
తామరాకులకన్ను తారకమని

తే.
ఎంతబొగడుదు రామయా చింతనమున
చింతదీర్చుము రామయా అంతరమున
అంతులేనిది రామయా ఎంతయనిన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శ్రీ రఘువంశసంజాతుడు,దశరథాత్మజుడు,
అప్రమేయుడు, {ఇంతటివాడని ప్రమాణించశక్యముగానివాడు} సీతాపతి,
సూర్యకులప్రదీపకుడు, ఆజానుబాహుడు, సారసపత్రనేత్రుడు, నిశాచరవినాశకరుడు, పుణ్యచరిత్రుడు, జగత్పవిత్రుడు, శృంగారగుణాభిరాముడైన, శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {003/102}

శ్రీ రామం బలవైరినీలచికురం స్మేరాననం శ్యామలం
కర్ణాంతాయతలోచనం సురవరం కారుణ్యపాథోనిథిం
శోణాంభోరుహ పాదపల్లవయుగం క్షోణీ తనూజాయుతం
రాజత్కుండలగండభాగయుగళం రామం సదాహం భజే

సీ.
నీలమణులు తలనీలాలమని గూడు
చిరునవ్వు ముఖవీథి చిందులాడు

నీలమేఘశ్యాము నిడివికన్నులజూడ
విప్పారువిరులుగా వీనులమరు

చెవిపోగు వెలుగులే చెంపకాంతిగజేరు
పదపల్లవంబుల పద్మమలరు

కాశ్యపేయవరుని కరుణాసముద్రుని
కపినాథు కీర్తనే కాలమనుచు

తే.
రామనామంబు జిహ్వపై రాజ్యమేల
రామమూర్తిని కనులందు రాశిబోసి
రామపదముల శిరముంచి రక్షణడుగ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: ఇంద్రనీలమాణిక్యములవలె నల్లనికేశములుకలిగినవాడు,
చిరునవ్వుమోమున చిందులాడెడివాడు, శ్యామలవర్ణదేహమువాడు,
చెవులంటు కన్నుల చెలువుకల్గినవాడు, దేవతాశ్రేష్ఠుడు ,దయాసముద్రుడు,
శోణాంభోరుహ పాదపల్లవయుగుడు, ధాత్రీతనూజాధిపుడు,
రాజత్కుండలలసద్గండస్థలుడు, దివ్యుడు, మాధవుడైన శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము- {004/102}

శ్రీ రామం జగదేక వీర మమలం సీతా మనోరంజనం
కౌసల్యా వర నందనం రఘుపతిం కాకుత్ స్థ వంశోద్భవం
లోకానా మభిరామ మంగళ ఘన వ్యాపార పారాయణం
వందేహం జనఘోర పాప నికర ధ్వంసం విభుం రాఘవం.

సీ.
జగదేకవీరుడు జడిగొను అమలుడు
నాతిహృద్రంజనా నాయకుండు

కౌసల్య కొమరుడు కాకుత్స్థకులజుడు
రఘుపతినాముడు రామవిభుడు

లోకాభిరాముడు లోకశుభకరుడు
పాపవిధ్వంసక పాదశుభుడు

చిన్మయాకారుడు చిద్సుందరాద్యుడు
చరణాంబుజమూలశరణుడనుచు

తే.
శరణుకోరిన శిరమందు కరమునుంచి
కరుణజూపుచు హృదయాద్యకమలమునను
చరణముంచుము శ్రీరామ! జన్మ నీది
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: జగదేక వీరా ! సీతామనోరంజనా !కౌసల్యా వరనందనా !
రాఘవా !కాకుత్ స్థ వంశోద్భవా! సర్వలోకపవిత్రా ! జనఘోరపాపనికరవిధ్వంసా ! చిన్మయాకారా ! సుందరా ! శ్రీరామా శరణు శరణు శరణు }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {005/102}

శ్రీ రామం జగదీశ్వరం జనకజాజానిం జనానందనం
జంతూనాం జనకం జనార్తి హరణం లోకేశ్వరం శాశ్వతం
ఆబాల్యాదిమునీశ్వరై: పరివృతం జాజ్వల్యమానం సదా
జంఘాలం జమదగ్నిసూనుహరణం జాతానుకంపం భజే

సీ.
జగదీశ్వరుండని జనకజాపతియని
జననందనుండని జానియనుచు

జంతుజీవంబుల జన్మకారకుడని
జగదార్తిహరణుడు జహ్నువనుచు

లోకేశ్వరుడని ముల్లోకశాశ్వతుడని
మునివరావృత బాలమోక్షకుడని

జాజ్జ్వల్యమాన తేజార్చితుండని
జంఘాలుడే కరుణాజలధి రామ!

తే.
పరశురామ గర్వాంధతాపరశు హరము
తిరము దెలిపిన శ్రీరామ తీర్థపదము
స్వరము నిశినాశశ‌రమను వరముదెలియ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: జగదీశ్వరా ! జనకపుత్రీనాథా ! జనాహ్లాదా !
సకలజంతుసృష్టికారకా ! సకలజంతురక్షకా ! సజ్జానార్తిహరా !
లోకేశ్వరా ! శాశ్వతా ! జననమాది మౌనీంద్రసంఘారూఢావృతా !
జాజ్జ్వల్యమానతేజస్వుడా !జంఘాలుడా ! భార్గవగర్వాపహరా!
రఘువరా ! శ్రీ రామ రక్షమాం రక్షమాం రక్షమాం !}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {006/102}

శ్రీ రామో రఘునాయకో రఘువరో రాజీవ నేత్రాంచితో
రాజేంద్రో రఘుపుంఘవో రఘుకులోత్తంసో రఘూణాం పతి:
రామో రాక్షస నాశకో~ మిత బలో రాకేందు పూర్ణాననో
రాజత్కింకిణి కంకణాంకిత కరో రామ స్సదా పాతు న:

సీ.
రఘువంశనాయక! రఘువర! రాజేంద్ర!
రాజీవదళనేత్ర! రామచంద్ర!

రఘువరాగ్రేసర! రఘుకులోత్తమ!
రాక్షసమదహర! రాఘవేంద్ర!

రక్షణాశ్రితజనారక్షణామితబల!
రాకేందుమహపూర్ణ రాజితముఖ!

రాజతకింకిణీరవ కంకణాంకిత
రక్షహస్తుభజన రక్షరక్ష!

తే..
రమము రామనామము శబ్దబ్రహ్మరసము
శశిసుధారసాప్లుత మనశ్శమనరవము
ప్రబలసత్పుణ్యఫలదము ప్రథమపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రఘువంశరాజ రత్నము, రఘుకులోత్తముడు, రాజీవనేత్రుడు, రాజేంద్రుడు, రాజశ్రేష్టుడు, {విశేషణములు నాల్గును అదరోక్తులు} నిశాచరధ్వంసకుడు, అప్రమేయుడు,
రాకేందుపూర్ణాననుడు, రాజత్కింకిణికంకణాంకితకరుడు ( ప్రకాశించు మువ్వలుగల కంకణములచే అలంకరింపబడిన హస్తముములుగలవాడు} సీతామన:కుముదచంద్రుడైనట్టి శ్రీ రామచంద్ర ప్రభువు సదా మమ్ము రక్షించుగాక ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {007/102}

శ్రీ రామచంద్ర కరుణాకర రాఘవేంద్ర
రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్రచంద్ర,
సుగ్రీవనేత్రయుగళోత్పలపూర్ణచంద్ర
సీతామన:కుముదచంద్ర నమో నమస్తే:

సీ.
శ్రీరామచంద్ర! ఆశ్రితకరుణాసంద్ర
రాకాప్రభాచంద్ర! రాఘవేంద్ర!

రాజరాజేంద్రశిరోమణిస్థితచంద్ర!
రఘువంశకులసంద్రరాత్రచంద్ర!

రవిసూనునేత్రసరసిజాయుగ్మస్థిత
పూజితసుగుణేంద్ర పూర్ణచంద్ర!

రత్నగర్భసూను రమణీయహృదయాంత
రాంతర కువలయరాజచంద్ర!

తే.
హృదయనిర్మలతాదీప్త హృద్యచంద్ర!
సదయగుణసారసరసిజా సఖ్యచంద్ర!
ఉదయరవికాంతినమసిత ఉర్విచంద్ర!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రాఘవా ! దయాకరా ! రాఘవేంద్రా ! రాజేంద్రచంద్రా !
రఘువంశసముద్రచంద్రాల ! సుగ్రీవనేత్రయుగళోత్పలపూర్ణచంద్రా !
( సుగ్రీవునినేత్రద్వంద కలువలకు పూర్ణచంద్రుడు) శోభనగుణు రామచంద్రుని విభాకరజాక్షియుగాబ్జచంద్రా ! {సీతామన:కుముదచంద్రా } కువలయేశా ! నిర్మలాత్మా ! శ్రీ రామ చంద్రా ! నమో నమస్తే ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {008/102}

శ్రీరామం కరుణాకరం గుణనిధిం సీతాపతిం శాశ్వతం
పారావారగభీర మజ్జనయనం ప్రావృఢ్ఘనశ్యామలం
వీరశ్రేష్ఠ మనామయం విజయినం విశ్వప్రకాశాత్మకం
ఘోరారిప్రకరాధిజప్రహరణం కోదండరామం భజే !

సీ.
నెనరుగుణాకరా ! నికరగుణార్ణవా!
నాతిసీతాపతే! నాథనాథ!

నీరధిగంభీరా! నీలోత్పలనయనా!
నీలనీరదదేహ! నైకరూప!

నిజవీరశిష్టేష్ట! నైరుధ్యనిజరూప!
నిఖిలలోకప్రకాశ! నిత్యవిజయ!

నర అరిషడ్వర్గనాశకా! నుఱుమాడు
నాదుచింతల వింటినారిబట్టి!

తే.
నాదు మనమున సాకేతనాథుడుండి
నాదు పథమని పదమందు నడకనేర్ప
నాదు హృన్నాద "శ్రీరామ"నామ శ్రుతుల
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: కరుణాకరా ! గుణనిధీ ! సీతేశా ! వారిధి గంభీరా ! కంజనయనా ! వర్షాంబుద శరీరా ! వీర శ్రేష్ఠా ! అనామయుడా ! విజయా ! విశ్వప్రకాశాత్ముడా ! సుందరాంగా ! సార్వభౌమా ! సౌమ్య నామా ! రమ్యగుణధామా ! ఘోరారిప్రకరాధిజప్రహరణుడా ( ఘోర శత్రువులు అరిషడ్వర్గములు) గుండెనుపిండే మనోవ్యధను హరించు ) శ్రీ రామా! కోదండధారివై నాచింతలు పోగొట్టి నన్నుధ్ధరించి నా ప్రార్థనలను ప్రణామములను అంగీకరించు మా ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {009/102}

శ్రీ రామచంద్రేతి సలక్ష్మణేతి
నీలోత్పల శ్యామలకోమలేతి
ఆక్రోశయుక్తా~ స్వధునైవ జిహ్వా
సీతాపతే రాఘవ రాఘవేతి!

సీ.
శ్రీరామచంద్రు డాశ్రితజనాభయుడని
లక్ష్మణసహిత సలక్షణుడని

నల్లకలువమేని నరరూపవిష్ణుడు
నళినకోమలదేహనాథుడనియు

రమణిసీతానాథ! రఘురామ! రాఘవా!
రక్షమాం రక్షమాం రామ! యనుచు

నాదు చింతలదీర్చు నామమందిన జిహ్వ
నా రాముపదములే నాకమనుచు

తే.
అన్ని నీవని దెలియంగ అమరపదము
ఎన్నిమారులు బలికెనో ఎదను కదిపి 
ఎన్నిమారులు కొలిచెనో ఎదను నిలిపి
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శ్రీ రఘురామ ! రాఘవ ! శ్రీ రామచంద్రా!
సుమిత్రసుతానుయుక్తా ! ఉత్పల శ్యామల శరీరా ! ఉజ్జ్వలాంగా !
ధాత్రీరమణీసుతాధిపా ! సత్యబృందారాకనాథ ! సుధీజ నవందితపాదపద్మశృంగారనిధీ ! "రామా రామా రామా" అని నాజిహ్వ సదా నీ నామస్మరణ చేయుగాక ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {010/102}

శ్రీ రామచంద్రే రమతాం మనో మే రమాంగవామే విపదాం విరామే
జితారిరామే ప్రణతారిరామే గుణాభిరామే భువనైకరామే

సీ.
రమరూపజానకి వామాసనారూపు
రాక్షసాపద్రక్ష రామరూపు

రాక్షసారిజయము రాముని రణనీతి
రణపరాజిత అరిప్రణతి ప్రణతి

రమణించు సుగుణాభిరాముడే రమణము
రమణంబు సుందరరామసౌరు

రామచంద్రు కొలువై ప్రణతిల్లు మనమున
రాముడొక్కడు చాలు రక్షసేయ

తే.
రామ రామయే నర్తించు రసనగతిని
రామ రామయే నడిపించు హృదయగతిని
రామ రామయే జేర్చును ప్రణవపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: వామభాగంలో లక్ష్మీ దేవి కలిగి, మాఅపదలను పారద్రోలి,
శత్రువులను జయించి, వారిచే ప్రణతులందుకొని,వరసుగుణాభిరాముడు భువనైక మనోహరుడు శ్రీ హరియైన రామునియందు నా చిత్తము రమించుగాక ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {011/102}

శ్రీ రామచంద్ర రఘుపుంఘవ రాజవర్య
రాజేంద్ర రాజ సురనాయక రాఘవేశ
రాజాధిరాజ రఘునందన రామభద్ర
దాసోస్మ్యహం చ భవత శ్శరణాగతోస్మి

సీ.
రామచంద్ర! రఘువరేంద్ర! రాకాచంద్ర!
రాజరాజేంద్రవరార్యచంద్ర!

రాజాధిరాజ! సురవరహృదయరాజ!
రఘురాజనందనా! రాఘవేంద్ర!

రామభద్రా! "రక్షరక్ష శ్రీరామ" భజనల
రామదాసుడనైతి రక్షగోరి

రామనామమను ఆరక్షణాగతిజేర్చి
రక్షజూడుము రామ! రక్షనామ!

తే.
రాముడే వార్థిదాటించు రాయినిలిపి
రాముడే ఆర్తిదొలగించు రాకదెలిపి
రామపదరక్ష దొరుకుటే హృదయవరము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శ్రీ రామచంద్రా ! రఘూత్తమా ! రాజవర్యా !రాజరాజేంద్ర !
రఘునాయకా ! సురరాజ! రాఘవేశా ! రాజాధిరాజ ! రఘునందన !
రామభద్రా ! నేను నీకు శరణుజొచ్చిన దాసుడను ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 12/102

శ్రీ రామం సరసీరుహాక్షమమలం దూర్వాంకుర శ్యామలo
విద్యుత్కోటినిభ ప్రభాంబర ధరం వీరాసనాధిష్ఠితం
వామాంకో పరిసంస్థితాం "జనకజామాలింగ్యతాం బాహునా
తత్వం చాపరపాణినా మునిగణా నాజ్ఞాపయంతం భజే "

సీ.
నల్లకలువకళ్ళు నప్పు తేటంజుట్టి
నీవార కొనమూలనీలి మేని

నిప్పుమేఘజ్యోతి నీ పోతగా కట్టి
నడిమిని వీరాసనమున నిల్చి

నాతిసీతను ప్రేమనమ్మికగా బట్టి
నాదను పురజేయి నెమ్మినేర్పి

నామజపమునుల జ్ఞానబోధనుబెట్ట
నిలిచిన కుడిజేయి నేర్పునేర్ప

తే.
నేను భవసాగరమునంటి నిన్నుగంటి
నేను భవదీయమతిగంటి నన్నుగంటి
నేను భవనాసిపదమంటి నిత్యముంటి
రామ రామ రామమయము రామపథము!

సీ.
నిప్పులుంజంపని నీవారవరివేఱు
నిత్యమై జూపెడి నీలవర్ణ!

ముక్కోటిమెఱుపుల ముప్పేటవస్త్రంబు
ముచ్చటంగట్టిన మోహనాంగ!

ఒకజేత సతిసీత నొదలక కనిబెట్టి
మరుజేత మునిబోధ మహితదెల్పు

వీరాసనాశీన విమలపద్మాక్షుని 
విరిసిన హృత్పద్మవిరిగ గొలుతు!

తే.
సతిని విడువక జూపునే సఖ్యనియతి!
మునులకొదలక జెప్పునే ముఖ్యనియతి!
మానసేంద్రియంబుల జూడ మరులుగొలుపు
రామ రామ రామమయము రామపథము!

(ముఖ్యార్థము - వీరాసనముతో వామాంకముపైకూర్చున్న సీతా దేవిని ఎడమచేయితో కౌగిలించి కుడిచేతితో బ్రహ్మ తత్వాన్ని మునులకు భోధించుచున్న సారసపత్రనేత్రునికి శ్రీ రామునికి నమస్కరిస్తున్నాను )

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - శ్లోకము 13/102

శ్రీ రామస్సకలేశ్వరో మమ పితా మాతాచ సీతా మమ
భ్రాతా బ్రహ్మ సఖా ప్రభంజనసుత: పత్నీ విరక్తి: ప్రియా
విశ్వామిత్ర విభీషణాదివశగా మిత్రాణి భొధస్సుతో
భక్తశ్శ్రీ హరి సంగతా రతిసుఖం వైకుంఠ మస్మత్పదం

సీ.
అఖిలేశ్వరుడు రాముడతడేను నా తండ్రి
అమ్మసీతమ్మయే నమ్మ నాకు!

అటనాభినింబుట్టి నబ్జాని నా భ్రాత!
ఆప్తుండు పవనజుండాత్మ నాకు

ఆత్మవైరాగ్యమే నమరిన నా పత్ని 
గాధిజుండే ప్రియగురువు నాకు

అరిరావణానుజుం డమితమిత్రుడు నాకు
ఆత్మబోధ నా కంగభవుడు

తే.
సడలని హరిభక్తి సరిరతీసరససుఖము 
రామ సంకీర్తనముజేయు రమ్యహృదయ
సదనమే నాదు శ్రీహరిసదనమనుచు 
రామ రామ రామమయము రామపథము!

సీ.
అఖిలజగన్నాథుడా రాముడే తండ్రి
అమ్మసీతమ్మయే నాదు మాత!

అట నాభినింబుట్టి ననుజుడాయెను బ్రహ్మ!
అనిలజుండాప్తుండు అత్మ నాకు

ఆత్మవైరాగ్యమే నన్నింట నా తోడు 
గాధిజుండందిన గురుడు హితుడు

అరిరావణానుజుం డమితమిత్రుడె నాకు
ఆత్మబోధయె సంతుగమరు వరము

తే.
వదలని హరిభక్తి సంసారసరససుఖము 
సత్యసంకీర్తనామృత సదనమైన
సరసిజాతహృదియె హరిసదనమనుచు 
రామ రామ రామమయము రామపథము!.

సీ.
అఖిలజగన్నాథుడా రాముడే తండ్రి
అమ్మసీతమ్మయే నాదు యమ్మ!

అంభోజజన్ముడై యనుజుడాయెను బ్రహ్మ!
అనిలజుండాప్తుండు నాత్మ నాకు

ఆత్మవైరాగ్యమే నన్నింట నా తోడు 
అటవిని గాధిజుం డాద్యహితుడు

అరిరావణానుజుం డమితమిత్రుడె నాకు
ఆత్మబోధయె సంతుగమరు వరము

తే.
నిత్యహరిభక్తి సంసార నిజపు సుఖము 
సత్యసంకీర్తనామృత సదనమైన
సరసిజాతహృదియె హరిసదనమనుచు 
రామ రామ రామమయము రామపథము!

(ముఖ్యార్థము - "సర్వేశ్వరుడైన శ్రీరాముడు నా తండ్రి, సీతమ్మ నా తల్లి, బ్రహ్మకు స్నేహితుడైన ఆంజనేయుడు నా సోదరుడు, విరక్తి నా భార్య, విశ్వామిత్రుడు,విభీషణుడు మొదలగు ఇంద్రియనిగ్రహముగలవారు నా మిత్రులు,ఙ్ఞానము నా పుత్రుడు,హరిపాదములందు భక్థి సం యోగసుఖము, వైకుంఠము నాకు నివాస స్థలం "మత్ సదనం" )

శ్రీ త్యాగరాజస్వామి "వసంత " రాగం లో ఆలపించిన "సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నాతండ్రి" కీర్తనకు శ్రీ ఆదిశంకరుల వారి ఈ శ్లోకమే మూలమని మిడి మిడి ఙ్ఞానం తో నాకున్న నమ్మకం


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {014/102}

శ్రీ రామామలపుణ్దరీకనయన శ్రీరామ సీతాపతే
గోవిందాచ్యుత నందనందన ముకుందానంద దామోదర,
విష్ణో రాఘవ వాసుదేవ నృహరే దేవౌఘచూడామణే
సంసారార్ణవకర్ణథారక హరే కృష్ణాయ తుభ్యం నమ:

సీ.
త్రేతరాముని తేటతెలిదమ్మికంటిని
త్రాతసీతాపతి రామవిభుని

గోవింద! అచ్యుత! గోపాల! ముకుంద!
అనంద! నందన! ఆదివంద్య!

రామ! దామోదరా! రాఘవ! నరహరే!
వాసుదేవా! విష్ణు! వహ్నిదేవ!

సంసారసాగర సంకటహరగమ్య
నావిక శ్రీకృష్ణ నాథనాథ!

తే.
సుందరాంగుని నరలోకసుందరతను
బృందగాన బృందావన భృంగరీతి
నందనందను డానందనందనుడన
రామ రామ రామమయమ రామపథము!

{ముఖ్యార్థము: పుండరీకనయనా! కమలాక్షా ! మనోహరా ! సీతాపతీ ! గోవిందా ! అచ్యుతా ! నందనందనా ! ముకుందా ! ఆనందస్వరూపా! దామోదరా ! విష్ణుదేవా ! రాఘవా ! వాసుదేవా ! నృసింహావతారా ! సకలదేవస్వరూపా ! సంసార్ణవకర్ణధారకా ! ఆదిదేవా ! శ్రీరామాచ్యుతా ! జానకీరమణా ! పాపసంహారకా ! పతితపావనరూపా ! హరీ ! శ్రీ రామా !
శ్రీకృష్ణావతారా తుభ్యం నమ : }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {015/102}

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్ స్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం,
రాజత్కుండలమండితాననరుచిం రాత్రించరధ్వంసినం
శంపాకోటిసమానకాంతివిలసన్మాయామృగఘ్నం భజే

సీ.
లక్ష్మణాగ్రజ రామ! లాక్షణ్యరఘవర!
లక్ష్మిసీతాపతే! లక్షణాంగ!

కాకుత్స్థవంశజా! కరుణాకర! ధర్మి!
సద్ధర్మగుణనిధే! సౌత్రదయిత!

వెలుగు కుండలకాంతి వెలిగించు ముఖమూర్తి!
వేల్పుదాయుల జంపు వేల్పవేల్పు!

కోటిమెఱుపులపట్టి కోటీరమునబెట్టి
మాయామృగంబుల మట్టుబెట్టు

తే.
మానసార్ణవశయనుండు మాధవుడని
మానవాంశగ మదిజేరు మనికిఱేని
మానసాలయమున నిల్పు మహితపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రఘుకులశ్రేష్ఠా ! ధరణీజాధిపతీ ! సుందరాకారా !
కాకుత్ స్థవంశాననా ! కరుణాకరా ! గుణనిధీ ! విప్రప్రియా ! ధర్మస్వరూపా ! రాజత్కుండలశోభితాంగా ! రాత్రించరసంహారా !
మాయామృగమును మర్ధించిన కోటిమెఱుపులతో సమానకాంతి గల లక్ష్మణాగ్రజుని , కృపాభ్రాజిష్ణుని, శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 016/102

రామం రత్నకిరీటకుండలధరం కేయూర హారాన్విత్వం
సీతాలంకృతవామభాగ మతులం సింహాసనస్థం ప్రభుం 
సుగ్రీవాదిసమస్తవానరవరై స్సంసేవ్యమానం సదా 
విశ్వామిత్రపరాశరాదిమునిభిస్సంస్తూయమానం భజే

సీ.
నవరత్నమకుటంబు నప్పుకుండలములు
శోభితభుజకీర్తి శుభదహార

పడతిసీత ఎడమపక్కన కూర్చుండ
పాహిరామప్రభు పట్టమెక్కి

సుగ్రీవ వానర స్తోత్రసేవలనంది
గాధేయ వాసవ గణుతిగొనుచు

మునిపరాశర పూజ్యమూర్తియై శ్రీరాము
డభయంబు వరమిచ్చి ఆర్తిదీర్చ

తే.
రామసుందరతనుగని రాత్రిదొలుగ
రామనామంబు మంత్రమై రసనమంది
రామమందిరమాయెను రమ్యమనము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము : రత్నకిరీటము రత్నకుండలములు ధరించి,
భుజకీర్తులు కల్గి, పొలుపొందు హారములు కంఠసీమను ధరించి,
సీత వామభాగమందు వసింపగా, సింహాసనస్థుడై, ప్రభువై,
సుగ్రీవాదిసమస్త వానరుల సేవలు,స్తోత్రములందుకొని, 
విశ్వామిత్ర పరాశరాది మునులు స్తుతింప వారికి అభయమొసగి,
నాకోరికలీడేర్చు శ్రీరాములవారిని సాదర భక్తితో ప్రార్థనచేసి ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 17/102

రామ స్సీతాసమేతో నివసతు హృదయే సానుజం రామ మీళే
రామేణ క్షీణపాపస్త్రి విధమపి కృతం కర్మ రామాయ దద్యాం
రామాదన్యం నజానే నహి కిమపి మహా రామ నామ్నస్సమానం
రామే పస్యామి విశ్వం భువన మనుదినం పాహి మాం రామచంద్ర

సీ.
సీతాసమేతుని శ్రీరామచంద్రుని
హృదయాలయంబుంచి హృదయమలర

అనుజులందరుగూడి నర్చించు రాముని
అర్చించుటొక్కటే అభిమతమని

పావననామమే పాపనాశనమని
కర్మలన్నియు పూజ కర్పణయని

పాదుకలంగాంచ పరచింతలేదని
పరమాత్మ శ్రీరామ పదము జేర్చ

తే.
అన్ని లోకంబులందుండి అలరు వాని
అన్ని కాలంబులందొక్క అమరనామ
మబ్బ శ్రీరామపదముల నర్థిగొలుతు
రామ రామ రామమయము రామపథము!!

(ముఖ్యార్థము: నా హృదయపీఠమందు వసించిన శ్రీ సీతా లక్ష్మణ భరత శతృఙ్ఞ సమేత శ్రీరామా ప్రణమిల్లుచున్నాను. శ్రీరామ స్మరణచే నాపాపములన్నియు క్షీణించినవి. మనోవాక్కాయకర్మములన్నియు శ్రీరామార్పణము. శ్రీరామ పాదుకలు తప్ప ఇతరములేవీ నాకు తెలియదు. సర్వలోకములన్నియు రామునియందున్నాయి. సర్వకాల సర్వావస్థలందు సదా నన్ను రక్షించు శ్రీరామచంద్ర ప్రభో !!! )


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {018/102}

రామం రాజ శిఖామణిం రఘుపతిం దేవారిదర్పాపహం
లోకానాం హితకారిణం గుణనిధిం కారుణ్యపుణ్యోదయం
ముక్తావిద్రుమరత్నశోభితతనుం సౌందర్యహస్తాంబుజం
కౌసల్యాతనయం భజామి సతతం శ్రీ జానకీనాయకం

సీ.
రాజశిఖామణి రఘువంశనృపమణి
రాక్షసమదనాశ రక్షకరణి

లోకహితకరుడు లోకోత్తరగుణుడు
కారుణ్యపుణ్యాద్యకమలధరుడు

పగడమౌక్తికకాంతి పరిఢవిల్లెడుమేని
పద్మసుందరహస్త పావనుడని

కౌసల్యకొమరుడు కలికిసీతాపతి
కరుణార్థభజనయే కరణమనుచు

తే.
తనువు తవపదాంబుజకీర్తి తరణినేగ
మనము తవభజాంబుజగతి మరిమరేగ
బయట లోపల "శ్రీరామ" భద్రగతుల
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రాజశిఖామణి,రఘువంశశ్రేష్ఠుడు, దేవారిదర్పాపహరుడు,
లోకహితకారకుడు, గుణనిధి, శమదమాద్యఖిలైకగుణాకరుడు,
మరకత రత్నసమ్మానిత తనువుచే శోభించున్న సుందరాంగుడు,
హస్తపద్మములను కలిగిన వారిజాక్షుడు, కౌసల్యాతనయుడు,
జానకీపతి శ్రీ రామచంద్రమూర్తిని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 19/102

రామం వీరాసనస్థం హృదయ గత పరోదంచిత "జ్ఞానముద్రం"
"జానున్యా సక్త హస్తం" క్షితివర తనయా భూషితం వామభాగే
"షట్కోణే వ్యాహరంతం" పవనసుత యుతం మానసే మాన యంతం
సుగ్రీవే సేవమానే ధృఢ శర ధనుషా దక్షిణే లక్ష్మణేన

సీ.
వీరాసనస్థిత శ్రీరామ కరముద్ర
నానాభయ నివార జ్ఞానముద్ర

మోకాలుదాకంగ ముచ్చటబడు చేయి
మురిసెడి సీతమ్మ ముద్దుతొడవు

ఆరుకోణంబుల ఆసనంబునరూపు
అనిలజుహృత్సీమ నమరు గొలువు

విల్లంబులంబట్టి వీరలక్ష్మణుజేయి,
సద్భక్త సుగ్రీవ సేవ్య రామ!

తే.
విమలధర్మగుణనిరతి విగ్రహుడని
విశదకీర్తనార్చితవరవితతి నుతుల
విమలహృదయాంబుజస్థిత విష్ణుపదము
రామ రామ రామమయము రామపథము!

( ముఖ్యార్థము: ధనుర్భాణములతో లక్ష్మణుడు మరియు ,సుగ్రీవాదు ల సేవలందుకొంటూ, వామాంకస్థమందు సీత, వీరాసనాధిష్టుడై, బాహువును మోకాలిపైనుంచి, ఉదర సమీపంలో ఙ్ఞానముద్రతో, షట్కోణపీఠమందుండి హనుమకు ఙ్ఞానోపదేశముజేయుచున్న రఘు రామచంద్రునికి మరి మరి మోకరిల్లుచున్నాను )


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {019/102}

రామం వీరాసనస్థం హృదయగతపరోదంచితజ్ఞానముద్రం
జానున్యాసక్తహస్తం క్షితివరతనయాభూషితం వామభాగే
షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం మానసే మానయంతం
సుగ్రీవే సేవమానే ధృఢశరధనుషా దక్షిణే లక్ష్మణేన

సీ.
వీరాసనస్థిత! విమలహృదోపరి
జ్ఞానముద్రుంచు అజ్ఞానహరుడు

మోక్షవామకరము మోకాటిపై నిల్పి
మోక్షకరిమహీజ ముదముసేయ

షట్కోణపీఠాన సుద్దుజెప్పి పవన
సుగ్రీవసేవల సూక్ష్మమెరిగి

మనసునందునే మరిమరి దీవించి
సౌమిత్రి కుడివైపు సౌరుజేయ

తే.
సుందరాంగుడు రాముని సుందరతను
కనుల పంచాయతనమైన కనులదెరిచి
కమలమైనట్టి కనుసేవ కరుణయనిన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సువీరాసనస్థిరుడు,హృత్సంస్థితభోధముద్రకరుడు,
జానున్యాసక్తహస్తుడు, (హస్తము మోకాలియందుంచిన) శ్రీక్ష్మాపుత్రి పార్శ్వస్థులై , షట్కోణపీఠనివాసియై,ఙ్ఞానముద్రకలిగి,హనుమకు ఙ్ఞానోపదేశం చేయుచు, సుగ్రీవ సేవలందుకుంటూ, దక్షిణమున శరచాపాన్వితుడైన లక్ష్మణుని తో వెలయుచున్న శ్రీరాముని మానసమందు చింతించి ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {020/102}

రామం సౌమిత్రిమిత్రం రఘుపతి మమలం రామచంద్రం రమేశం
రమ్యం శ్రీ రాఘవేశం శుభలలితముఖం శుద్ధసత్వం సువీరం,
సీతాసౌందర్యపాత్రం సురమునివినుతం నీరదేందీవరాభం
వందే వందారుపాలం రజనిచరహరం రమ్యకోదండరామం !

సీ.
సౌమిత్రిసన్మిత్ర! సుమనోజ్ఞరఘుపతే!
రామచంద్ర! రమేశ! రమణకాంగ!

శుభమంగళానన! శుద్ధసత్త్వ! సువీర!
రఘవంశనృపవీర! రణవిదారి!

సతిసీతరమణక ! సురమునిస్తుతకీర్త!
నీరదశ్యామాంగ! నిత్యరక్ష!

రాక్షసహరరామ! రక్షార్థహితరామ!
రక్షించు కోదండరామ రక్ష!

తే.
రాముడొక్కడు చాలును రక్షసేయ
రామనామంబు యొక్కటే రాత్రిపగలు
రాముడందెడి పదము "శ్రీరామ" దెలియ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సౌమిత్రి మిత్రుడు, రఘుపతి, నిర్మలుడు,
రామచంద్రుడు, శ్రీరమేశుడు, సుందరాంగుడు, శ్రీరాఘవేశుడు,
మంగళకర సుందరమోముకలవాడు, పరిశుధ్ధస్వరూపుడు, వీరుడు,
సీతామహాదేవి సౌందర్యపాత్రుడు, సురమునివినతుడు,వారిదశ్యాముడు,
నమస్కరించువారల నిరంతర రక్షకుడు, దైత్యవిరాముడు,
మనొహరుడైన కోదండరాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {021/102}

రామం చందనశీతలం క్షితిసుతామోహాకరం శ్రీకరం
వైదేహీనయనారవిందమిహిరం సంపూర్ణచంద్రాననం
రాజానం కరుణాసమేతనయనం సీతామనస్స్యందనం
సీతాదర్పణచారుగండలలితం వందే సదా రాఘవం

సీ.
శీతలచందన శీతలాంగుడు రామ!
క్షితిసుతామోహన క్షేత్రపాల!

పద్మాక్షికన్నుల పద్మబంధుడు రామ!
పున్నమిశశిమోము పూర్ణరూప!

రాజేక్షణ! కరుణారాజతేక్షణ రామ!
సీతామనోరథ సేవ్యమాన!

మైథిలిచెక్కిళ్ళ మెరయుటద్దమునందు
మదినేలు రాముని మెరుపుజూచు

తే.
కనులు కమలంబు వదనంబు కమలమేను
కరము కమలంబు హృదయంబు కమలమేను
కరుణ మేనెల్ల కమలమై కరణి దెలుప
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శ్రీచందన శీతలుడు శీతలస్వామి, శుభకరుడు, వైదేహీమోహకరుడు , ధరణీజాననకంజకంజహితుడు, {సీతాదేవి నేత్రపద్మములకు సూర్యుడు} సంపూర్ణచంద్రాననుడు, రాజాధిరాజు చక్రవర్తి, కరుణాసం యుతలోచనుడు, సీతామానసస్యందనుడు, { సీతమనస్సు రథముగా గల } మిథిలరాట్కన్యామణీదర్పణస్ఫురదత్యున్నతగండభాగుడు (సీతాదేవి అద్దముల వంటి సుందర చెక్కిళ్ళయందు ప్రకాశించు రాముడు } శ్రీ కరుడైన శ్రీ రాముని సదా ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {022/102}

రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటిసూర్యప్రకాశం
దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖశరధిం చారుకోదండహస్తం,
కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్చేదదక్షం
భీమం భీమాట్టహాసం సకలభయహరం రామచంద్రం భజేహం.

సీ.
శ్యామసుందరరామ! స్యోనచంద్రనయన!
కోటిసూర్యప్రభా కోమలాంగ!

దివ్యసుందరరూప! దివ్యాస్త్రకరదీప!
శరచాపశుభహస్త! శార్ఙ్గధన్వి!

కాలనేమి! భయదకాలాగ్నిరౌద్రేశ!
వైరిసంహార! దుర్విఘ్నదూర!

భీమ! భీతహసన! భీతభయహరణ!
భయము దీర్చుము రామ! భక్తిధామ!

తే.
అరుల కన్నుల భయభీతి ఆరుణరామ
శరము మొనజూపి వరమిచ్చు శమనరామ
తరుణభజనార్థ "శ్రీరామ" తారకంబు
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: ఘన శ్యామాంగుడు, రవిశశినయనుడు, కోటిసూర్యప్రకాశుడు,
విఖ్యాతపురుషుడు,దివ్యాస్త్రపాణి, శరచాపోజ్వ్జల హస్తుడు,కాలస్వరూపుడు, కాలాగ్నిరుద్రుడు, శత్రుకులనిస్తారుడు, విఘ్నసంహరుడు,భయంకరుడు, భీమాట్టహాసుడు, సకలభయహరుడు, శ్యామాభిరాముడైన శ్రీ రామ చంద్ర ప్రభువును ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {023/102}

రామచంద్రచరితాకథామృతం, లక్ష్మణాగ్రజగుణాను కీర్తనం
రాఘవేశ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మజన్మని

సీ.
రామచంద్రప్రభు రక్షచరితకథా
పావనామృతఝరీ పానమిమ్ము

లక్ష్మణాగ్రజరామ లాక్షణ్యగుణకీర్తి
పావనామృతగాన పానమిమ్ము

రఘువంశరాజన్య రామచంద్రా! నీదు
పాదసేవాభాగ్య పరమభక్తి

జగదభిరామ! నీ జన్మజన్మలజత
జతవీడక దొరకు జన్మ జన్మ!

తే.
స్మరణి రామనామామృత మథన శరధి
కరణి రామధర్మాచార కరణ తతరతి
ధరణి రామగానామృత ధరణ వితతి
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: దశరథాత్మజుని కథామృతం, లక్ష్మణాగ్రజుని గుణకీర్తనము,రాఘవేశా ! నీ పాదసేవయొనర్చుభాగ్యము నాకు జన్మ జన్మములందు సంభవించుగాక ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 024/102)

రామో మత్కుల దైవతం సకరుణం రామం భజే సాదరం
రామేణాఖిలఘోరపాపనిహతీ రామాయ తస్మై నమ:
రామాన్నాస్తి జగత్త్రయైకసులభో రామస్య దాసో స్మ్యహం 
రామే ప్రీతి రతీవ మే కులగురో శ్రీ రామ రక్షస్వ మాం

{ముఖ్యార్థము: రాముడు నా కులదైవం, దయాసముద్రుడైన రాముని ఆదరముతో సేవించుచున్నాను, రామ స్మరణచే ఎల్ల పాపములు నశించును, రామభర్తకై నే నాదరమున ప్రణుతించుచున్నాను, రఘువీరునికంటే సులభుడు లేడు, శ్రీ రామునికి నేనుదాసాను దాసుడను, రామునిపై నాకమిత ప్రీతి, నావంశ గురువైనా శ్రీ రామా నన్ను రక్షింపుము ! }

సీ.
కులపతి రాముడు కూరిమయ్యెను యింట
సాదరసేవనల సదయభజన

స్మరణచే పాపంబుమాపు మంత్రపు రామ!
రక్షకై ప్రణుతి ఆరక్షణంబు

సులభరామునికంటె సూక్ష్మమా జగతిని
పాదదాస్యతయందు పరమపదము

ప్రీతివర్థన రామ! ప్రాజ్ఞగురువు రామ!
ప్రాణంబు శ్రీరామపాదపథము!
తే.
తగని భారంబు తరిగించు తపము జపము
తెగని దూరంబు దరిదింపు తలపుపదము
తగిన మంత్రార్థసారంబు తరుణపదము
రామ రామ రామమయము రామపథము!

సీ.
ఇంటిదేవుండని ఇందిరారమణుని
సత్కరుణాదర సేవజేతు

అఖిలపాపహరుని ఆదిమూలాత్ముని
ఆధ్యాత్మహరి నమో ఆత్మరామ!

అఖిలలోకజనుల అతిసులభుడవని
దాసదాసుడనైతి దశరథాత్మ!

ప్రీతిపాత్ర రామ! ప్రేరణగురు రామ!
ప్రార్థరక్షణ రామ! పాహి పాహి!

తే.
తెగడు పాపంబు లొదలంగ తెలుసుకుంటి
నెగడు దీపంబు వెలిగింప నెలవుగంటి
పొగడు మనసున పులకింత పొలవరంటి
రామ రామ రామమయము రామపథము!
శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 025/102)

శ్రీ రామచంద్ర తవ కీర్తి సుర ద్రుమస్య
తారాగణ స్సుమనస: ఫల మిందు బింబం
మూలం ఫణాఫణిగతం గగనం చ మధ్యం
శాఖా దిశో భువనమండల మాలవాలం

సీ.
విమల రామవిభుడు వేల్పుమాను సమము
విరులాయె కీర్తులే విన్నుతార

శాఖాంతఫలసౌరు శశిబింబసదృశము
వేరుమూలములాయె వేలఫణులు

కాండమధ్యంబిల ఖంబుసరివితతి
కొమ్మలన్నియు దిక్కుకొనలుగాన

భువనమండలమాయె భూరివృక్షపు పాదు
భక్తిరేణువునైతి పదములంటి

తే.
కామితార్థము "శ్రీరామ" కల్పతరువు
భూమిజేశుడు శ్రీరామ భువనధారి
యామికుండగు శ్రీరామ యోగమూర్తి
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 26/102)

వైదేహీం ముదితోభిజాత పులకాంగాఢం సమా లింగయన్
వామేన స్తనక చూచుకం పులకిత వామం కరేణ స్పృశన్
తత్వం దక్షిణ పాణినా కలితయా చిన్ముద్రయా భోధయన్
రామో మారుతి సేవిత స్పరతు మాం సామ్రాజ్య సిమ్హాసనే

సీ.
పులకితవైదేహి పూరింప దరిజేర
పుర్రజేయినిబట్టి పులకలైన

కౌగిలింతలజేయి కొనబారునంజాచి
కొనవేలు శిశువార్తి కోర్కెదీర్చ

కుడిజేయిచిన్ముద్ర కామితసుజ్ఞాన
కలిమితత్త్వముజెప్పు కొలువుజూప

కపివరహనుమచే కోటిసేవలనొంది
కొలువుపీఠముపైన కొలువుదీరు

తే.
కోమలాంగుని కోమలి కొలువు కొలువు
కొలువునెరిగిన పావని కొలువు కొలువు
కొలువుదీరిన పరమాత్మ కొలువు కొలువు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {027/102}

వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండదండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే
భిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ద్నిస్థితం
కేయూరాదివిభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం

సీ.
వామాంక జానకి వాసి సంసేవ్యంబు
కోదండ చక్రంబు కుడియెడమను

శంఖంబు శరమును శాంతదక్షిణమందు
నళినపత్రపుసౌరు నయనమందు

భద్రపాదంబులు భద్రాచలమునందు
భుజకీర్తులను చతుర్భుజములగల

భువనైకమోహనా! భుజగశయనరూప!
రఘువరా! శ్యామలరామ! ప్రణుతి!

తే.
దండనాథుడవని గొల్చు దండునడుమ
దండమిడితిని నీవండదండవనుచు
దండగూర్చితి నీ నామదండకమున
రామ రామ రామమయము రామపదము!

{ముఖ్యార్థము: ఎడమతొడయందు ఆసీనమైన సీత సేవలందుకుని, ఒక చేత ధనువు, వేరొక చేత చక్రము, కుడిచేతులు రెండంటియందు శంఖము, శరము ధరించి, పద్మపురేకులవంటి నేత్రములు కలిగి, భద్రాచలశిఖరమందు కేయూరాది విభూషణములచే వెలుగొందుచు, శ్రీ చతుర్భుజములతోడ శ్యమాలాకారుడు, రఘువంశ రాజశ్రేష్ఠుడైన శ్రీ రాముని సత్యచరుతుని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 28/102)
వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్సుమిత్రాసుత
శ్శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో ర్వాయ్వాది కోణేష్వపి
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం

{ముఖ్యార్థము: వామభాగమున వైదేహి,ఎదుట మోకాలిపై వ్రాలిన హనుమ, వెనుక లక్ష్మణుడు ప్రక్కన భరత శత్రుఘ్నులు,
వాయవ్యాది మూలదిక్కున సుగ్రీవుడు,ఈశాన్యమున విభీషణుడు, ఆగ్నేయమున అంగదుడు,నైరుతియందు జాంబవంతుడుండగా మధ్యమందు నల్లకలువవలె సుందర శ్యామాంగుడైన శ్రీ రామచంద్రుని ప్రణమిల్లుచున్నాను }

సీ.
వామాంకమున సీత వాతాత్మజుడుబట్టి
వాసిపదములే నివాసమనిన

వెనుక లక్ష్మణమూర్తి వరుసను భరతుడు
వీచోపు శత్రుఘ్న వీచుచుండ

వీరసుగ్రీవుడు విమలవిభీషణ
విజయాంగద వృద్ధవెలుగుబంటి

వరమగు నలుదిశావాసధర్మము జూప
వరరాముడామధ్య వసనుడగుచు

తే.
వారిజశ్యామశోభల వొప్పుజుండ
వహ్ని పంచాయతనదర్శ వాసినెరిగి
వారిజాక్షుని పదగతే వాసమనగ
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {029/102}

వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పక మానసే మణిమయే వీరాసనే సంస్థితం 
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య: పరం
వ్యాఖ్యాంతం భరతాదిభి: పరివ్రుతం రామం భజే శ్యామలం

{ముఖ్యార్థము: కల్పవృక్షముక్రింద కనకమంటపమందు
పుష్పకమునడుమ మాణిక్యపీఠమందు సీతాసహితుడై,వీరాసనమందుండి,
ఎదుట నిష్ఠతో పావని ఙ్ఞానతత్వములు చదువుచుండ, పరతత్వములను మునులకు భోధించుచు భరతాది సోదరాన్వితుడై, శ్యామలాకారుడు, చిద్విలాసుడైన శ్రీ రామచంద్ర మూర్తిని ప్రణమిల్లుచున్నాను }

సీ.
కల్పవృక్షముకింద కనకమంటపమందు
కామితారూఢపు కొలువుమధ్య

కనకమణిఖచిత కామితాసనమందు
కలికిసీతమ్మను కాలునిల్పి

కైవల్యతత్త్వము కేసరిసుతునకు
కట్టడతత్త్వము కుటపులకును

కరుణచే బోధించి గమనానుజులగూడి
గతిదెల్పు శ్యామలాకార రామ!

తే.
కరుణజూపెడు "శ్రీరామ" గళమునింపు
శరణునేర్పెడు శ్రీరామచరణమందు
తరుణమొక్కటే తలరాత తరణమైన
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 30/102)

వైదేహీ పరిరభ్య జాత పులకాం లజ్జా వతీం సుస్మితాం
కాంచీ నూపుర హార కంకణ లసత్కర్ణావతంసోజ్వలాం
కస్తూరీ ఘన సార చర్చిత కుచాం చంద్రాననాం శ్యామలం
కందర్పాధిక సుందరం రఘుపతిం శ్రీ రామచంద్రం భజే

సీ.
పత్నిసీతనుజూడ పులకరించెడి మేను
పత్నిజూపులు తాక పడెడు సిగ్గు

పట్టుచిరునగవు పైడంచుమొలనూలు
పుత్తడిమువ్వలు పసిడిగొలుసు

పగడపు కడియంబు పొడవైనపోగులు
పసిడిమెరుపులచే పరగు ముఖము

పన్నీట కస్తూరి పొడికప్పురపు మిశ్ర
పరిమళపూతందు పద్మకుచము

తే.
పున్నమశశిముఖము కర్ణపూరమేని
పుష్పశరకోటి సుందరపూర్ణశుభుడు
పుడమికొమరిత పతిగూడ పూజలిడుదు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 31/102)

వైదేహీ రమణం విభీషణ విభుం విష్ణు స్వరూపం హరిం
విశ్వోత్పత్తి ప్రపత్తి పోషణ కరం విద్యాధరై రర్చితం,
వైరి ధ్వంస కరం విరించి జనకం విశ్వాత్మకం వ్యాపకం
వ్యాసాంగీ రస నారదాది వినుతం వందామహే రాఘవం

సీ.
వైదేహిరమణుడు విమతానుజహితుడు
విష్ణుస్వరూపుడు విదథపథుడు

విశ్వబీజాద్యుడు విశ్వరక్షాత్ముడు
విద్యాధరార్చిత విశ్వమూర్తి

వైరిగుణహరుడు వాగీశజనకుడు
విశ్వాత్మక! సకలవిశ్వవితతి!

వ్యాస అంగీరస వాక్సుతనారద
వినుత! నీ పదమంటి వేడుకొందు!

తే.
వాయునందను హృదయాన వారిజమని
వైరినాథుల గుణశేషవిదళితమగు
వారిజపదమేను హృదయావాసమైన
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 32/102)

వైదేహస్య పురే వివాహ సమయే కల్యాణ వేద్యంతరే
సామోదే విమలేందు రత్న ఖచితే పీఠే వసంతౌ శుభే
శృణ్వంతౌ నిగమాంతత్వ విధుషా మాశీర్గిర స్సాదరం
పాయాస్తాం సు వధూ వరౌ రఘుపతి శ్శ్రీజానకీ చానిశం

సీ.
వరవిదేహపురిని వధువు వైదేహిని
వరుడు రామునిజేర్చు వేడుకందు

వేదోచ్ఛరిత యాగవేదిక నడుమను
వేదపండితులు దీవెనలనివ్వ

వేలుపురారాళ్ళ వెలుగుపీటలపైన
వాసంతశోభల వధువు వరుడు

వదలక దీవించువారల దీవించు
వారని రక్షింప వరమడిగితి

తే.
వధువు సీతను జేరంగ వనము జేరి
విల్లునెత్తిన వధువని విల్లుదుంచి
వేడుకనగాను తమ పెళ్ళి వేడకనిన
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 33/102)

అసిత కమలభాసా భానయంతం త్రిలోకం
దశరథ కులదీపం దైవతాంభోజ భానుం
దినకరకులబాలం దివ్యకోదండ పాణిం
కనకఖచిత రత్నాలంకృతం రామ మీడే

సీ.
నీలోత్పలసదృశ నీలమేనిప్రభ
నిత్యము ముల్లోక నెగడుసేయ

దశరథకులదీప్తు ధర్మదీపప్రభే
దైవతకమలాప్తదీప్తికాగ

రవివంశజాత్ముడు రక్షకోదండంబు
రక్షింపగాబట్టి రక్షసేసి

రవ్వలూ రసనంబు రాశుల.జేరిన
రామచంద్రునిరూపు రక్ష రక్ష!

తే.
లోకరక్షణ నిలజూపు లోచనముల
యాగరక్షణ నెరవేర్చు యుక్తకరము
మోకరిల్లిన మనసుల ముక్తిసేయు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 34/102

సుస్నిగ్ధం నీలకేశం స్పుట మధుర ముఖం సుందర భ్రూ లలాటం
దీర్ఘాక్షం చారునాసాపుట మమల మణి శ్రేణి కాదంత పఙ్క్తిం
బింబోష్ఠం కంభు కంఠం కఠిన తర మహోరస్క మాజాను బాహుం
ముష్ఠి గ్రాహ్యావలగ్నం పృథు జఘన ముదారోరు జంఘాఘ్

సీ.
నునుపుదీరిన మేను నలుపుదట్టపు జుట్టు
నప్పుమోము మెరయునుదుట భ్రుకుటి

చెవులజేరు కనులు చక్కకోసున ముక్కు
చొక్కపుమణులంటి చక్కపళ్ళు

దొండపండ్లయెరుపు నిండిన పెదవులు
శంఖువొంపులజూప గొంతుయుండ

దిట్టపట్టుల రొమ్ము దీర్ఘబాహువులునూ
పిడికిట బట్టేటి పిట్టనడుము

తే.
ఘనపు జఘనంబు ఘనజంఘికోరువులును
ఘనపదకమల! కమలాక్ష! కమలనాభ!
ఘనత నీరూపు గాంచుటే కనుకొలనున
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 35/102)
మాతా రామో మత్పితా రామచంద్రో
భ్రాతా రామో మత్సఖా రాఘవేశ;
సర్వస్వం మే రామచంద్రో దయాళు:
నాన్యం దైవం నైవ జానే న జానే

సీ.
రాముడే నాతండ్రి రామచంద్రుడె తల్లి
రాముడే అనుజుడు రక్షవిభుడు

రాముడే చెలికాడు రాముడే సరిజోడు
రాముడే నడిపేను ప్రాణనావ

రాముడే అన్నింట "రామ"యే అందును
రామచంద్రుని దయే రాత్రిపగలు

రాముడేయని పరరక్షణమెరుగని
రాజ్యహృదయమందు రామ! రామ!

తే.
"రామ" ఎదలయగతి నాకు "రామ" శ్వాస
"రామ" కంఠశశబ్దము నాకు "రామ" ఎఱుక
"రామ" శ్రవణసారము నాకు "రామ" నడక
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {036/102}

జానాతి రామ తవ నామ రుచిం మహేశో
జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం,
జానాతి దోర్భల పరాక్రమ మీశచాపో
జానా త్యమోఘపటు బాణగతిం పయోధి:

{ముఖ్యార్థము: ఓ రామా ! నీ నామ మంత్రరుచి దక్షసుతారమణుడు మహేశ్వడెరుగును. నీ పావనపాదపంకజ ప్రభావము అహల్య ఎరుగును.
నీ భుజపరాక్రమము శివదేవుని చాపమెరుగును.నీ శరధాటి సముద్రుడెరుగును}

సీ.
తెలిసికొంటిని రామ! తేనెల నీనామ
మంత్రమహతిని ముక్కంటి దెలుప

తెలిసికొంటిని రామ! తెరవగు చరణంబు
తరుణిగౌతమి శిలై తాకి దెలుప

తెలిసికొంటిని రామ! తవ శరణాగతి
తాకిదుంచిన వింటితాడు దెలుప

తెలిసికొంటిని రామ! తీక్ష్ణధర్మపుధాటి
తిమురుసాగరుజీల్చు తెరగు దెలుప

తే.
తెలిసి నడిపెడి తత్వంబు తెరవు నీవు
తెలిసి మసలెడు తరుణంబు తెలివి నీవు
తెలియ పరమేల" శ్రీరామ" దెలియు జిహ్వ
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {037/102}

దివ్యస్యందనమధ్యగం రణరణచ్చాపాన్వితం భీషణం
కాలగ్నిప్రతిమానబాణకలితం ఘోరాస్త్రతూణీద్వయం,
సుగ్రీవాంగదరావణానుజమరుత్పుత్రాదిసంసేవితం
రామం రాక్షసవీరకోటిహరణం రక్తాంబుజాక్షం భజే

{ముఖ్యార్థము: దివ్యరథమునథిష్ఠించి రణగుణధ్వని చేయు ధనువు బట్టి,
ప్రళయాగ్నితోబోలు బాణము సంధించి, అస్త్రతూణీద్వయం గలిగి,
రాక్షస మూకలను రణమందు నిర్జించి, సాధుసజ్జనులను శాంతపరచి,
సుగ్రీవ,అంగద,విభీషణ,హనుమదాదులచే సేవింపబడుతున్న శ్రీ శుభాంగా!
శ్రీ రామా ! రక్తసరోజనేత్రుడైన నిన్ను స్మరించు వారల రక్షించు సారసాక్ష ! నీకివే నాప్రణతులు }

సీ.
విజయరథమునెక్కి విల్లెత్తు రవముచే
విహ్వలరిపు మనోవిరతి సలుపు

కాలాగ్నివేగపు ఖగముల చేబట్టి
ఘోరకోలల జంటఖోలి నిలుపు

అంగద సుగ్రీవ ఆంజనేయుల భక్తి
రావణానుజసేవ రమముదెలుపు

రాక్షసనృపకోటి రక్షామణీ! రామ!
రక్తోత్పలేక్షణా! రక్షరక్ష!

తే.
నా మనోరథారూఢుడై నాదు ప్రభువు
నియతభక్తిస్వరధనువు నిలిపిపట్టి
నామమంత్రపు బాణమై నాలుకనెను
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {038/102}

బ్రహ్మాద్యామరసిద్ధజన్మభువనం యన్నాభిపంకేరుహం
శ్రీనిర్వాణనికేతనం యదుదరం లోకైకశయ్యాగృహం
యద్వక్ష:కమలావిలాసభవనం యన్నామమంత్రం సతాం
వాసాగార మఖండమంగళనిధి: పాయా త్స వో రాఘవ:

{ముఖ్యార్థము: నళిననేత్రా ! నీనాభిపద్మంలో బ్రహ్మాదిదేవతలు ప్రభవించినారు
ఇందిరారమణీ లక్ష్మీదేవి వశించు నీవక్షస్థలము {నీగర్భకోశం} 14 లోకములకు శయ్యాగృహము. నీ రొమ్ము లక్ష్మీదేవికి విలాసమందిరం . సాదు సజ్జన మహాజనులకు నీ నామము నివాసగృహము. శ్రీ రామా సర్వ శుభాకారా ! సంసారబంధనముల చిక్కి తపించు దీనుడైన నన్ను రక్షించు రామచంద్రా ! }

సీ.
ధాతాదివేల్పుల ధాతవు పితవీవు
పొక్కిలికమలంబు పుట్టినిల్లు

కమలాంబ కొలువైన గర్భభాండంబేను
భువనభాండంబుల పడకటిల్లు

ఎడమేను కమలాక్షి కెడదనవ్వులయిల్లు
నామమే మునులకు నాకగృహము

సర్వమంగళరామ! సకలదుఃఖవిరామ!
భవసాగరము దాటు బాట రామ

తే.
మనసు నెలవుగ మౌనంబు మొదటిమాట
కనుల కొలనున కమలంబు కొలువుమూర్తి
అనవరతమున శ్రీరాము డాత్మయింట
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 039/102)

శృంగారం క్షితి నందనీ విహరణే వీరం ధనుర్భంజనే
కారుణ్యం బలి భోజనేద్భుత రసం సింధౌ గిరి స్థాపనే
హాస్యం శూర్పణఖా ముఖే భయవహే భీభత్స మన్యాముఖే
రౌద్రం రావణ మర్దనే ముని జనే శాంతం వపు: పాతున:

సీ.
ఇంతితో విహరింప నెంత శృంగారమే
విల్లంది దుంచుటే వీరరసము

కాకాసురునిపైన కరుణాఝరిందించు
అగములబ్దిన్నిల్ప నద్భుతంబు

రావణానుజ మోమురక్షైన హాస్యంబు
భీబత్సముఖ మన్యభీరువులకు

రావణాసురుజంప రౌద్రమా రూపంబు
మునివరుగన శాంతముప్పిరిగొను

తే.
అష్టరసముల కాద్యంబు నంతమైన
అఖిలలోకధరుని అనంతామృతాబ్ది
శయును నొదలక సేవించు శరణుగోర
రామ రామ రామమయము రామపథము!

శ్లోకముఖార్థం :(జానకీ దేవి తో విహరించునపుడు శృంగారరసం, శివధనుర్భంగమందు వీరరసం, కాకాసురునియందు దయారసం, సముద్రమున పర్వతములుంచునపుడు ఆశ్చర్యరసం,శూర్పణకమోమున హాస్యరసం,ఇతరస్త్రీలమోహమున ( అసహ్యత)భీభత్స రసం ,రావణసం హారమందు రౌద్రరసం, మునీశ్వరులయందు శాంతరసము కలిగిన స్వరూపము మమ్ము రక్షించు గాక !!! )


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసమ 040/102)

వందామహే మహేశాన చండ కోదండ ఖండనం
జానకీ హృదయానంద చందనం రఘునందనం

సీ.
సీతమ్మ కదిపిన శివుని విల్లును జూచి
ఎత్తిజూతముయన్న నెత్తలేని

ఎల్లరు వీరులే ఎవరితడంచును
ఎత్తని తలలను ఎత్తి నిలుప

అవలీలగనుయెత్తి అటుపైన విలుదుంచి
అవనిజ పూమాల అర్హుడతడు

ఎదనిండ దానుండి ఎరిగిన పత్నికి
ఎదనిండ ఎలమిడు ఏలికతడు

తే.
ఎదర సీతమ్మ రాముని ఎఱుకజెప్ప
ఎదను రఘునందనుడేను ఎదర తానె
ఎదను చందనమర్పింప పదము "రామ"
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 041/102)

మూలే కల్పధ్రుమస్యాఖిల మణి విలద్రత్న సింహాసనస్తం
కోదండే నాశుగేనోల్లసిత కర యుగేనార్చితం లక్ష్మణేన
వామాంకన్యస్త సీతం భరత భృత మహా మౌక్తిఛ్ఛత్ర కాంతిం
శత్రుఘ్నే చామరాభ్యాం సువిలసిత కరే రామచంద్రం భజేహం

సీ.
కల్పవృక్షపుమూల కమనీయ మణులన్ని
నింపిన పీఠంబు నింపురేడు

కోదండమును బట్టు కోమలాంగుని జేయి
జేరు లక్ష్మణు పూజజేయు వైపు

వామాంకమున సీత వరలక్ష్మిరూపమై
వరియించి నెదవైపు వలపుమీర

పట్టుముత్యాలతో బరగు ఛత్రంబును
భరతుడే బట్టిల భక్తి జూప

తే.
వీచి వింజామరలయక వినుతిసేయ
పట్టు శత్రుఘ్ను పరిధిని పరమసేవ
ప్రణుతరాముని కొలువేను ప్రణుతపథము
రామ రామ రామమయము రామపథము!

శ్లోకముఖ్యార్థం : (కల్పవృక్షం మొదట సర్వరత్నములతో గూడిన పీఠమందుగల శ్రీరాముని , ధనుర్భాణములచే సొగసైన హస్తములుగల లక్ష్మణపూజలందుకొంటున్న మా రాముని, ఎడమతొడయందుకూర్చున్న సీతా మాతతో ఉన్న మా సీతారాముని , భరతునిచే ముత్యాల గొడుగుపట్టించుకున్న మా రఘువంశ రాముని, శతృఘ్నునిచే వింజామరల సేవలనందుకుంటున్న శ్రీరామచంద్ర ప్రభువులకు నమస్కరించుచున్నాను )


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {041/102}

మూలే కల్పధ్రుమస్యాఖిలమణివిలద్రత్నసింహాసనస్థం
కోదండేనాశుగేనోల్లసితకరయుగేనార్చితం లక్ష్మణేన,
వామాంకన్యస్తసీతం భరతభృతమహామౌక్తిఛ్ఛత్రకాంతిం
శత్రుఘ్నే చామరాభ్యాం సువిలసితకరే రామచంద్రం భజే~హం !

సీ.
ముజ్జగంబులమూల ముప్పిరిగొనియున్న
మందారతరువాటికాంతరమున

మణిమయాలంకృత మాన్యాసనస్థిత
మోహవిరహితేశ! మోక్షణేశ!

విల్లంబువైపున వినయలక్ష్మణమూర్తి
వామాంకమున సీత వాసిమీర

ముదమార భరతుని మౌక్తికార్చితఛత్ర
మగ్ధమోహనకాంతి మోముజేర

తే.
పవనవింజామర శతృఘ్నుపాణమలర
పవనసూనుడు పాదంబుబట్టి గొల్చు
భువనమోహనరాముని భజన భజన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: నవరత్నఖచిత నవ్యపీఠమందు కల్పవృక్షముక్రింద
నెలకొని, విల్లంబులనుధరియించిన సొగసైన హస్తములుగల లక్ష్మణునిచే పూజలందుకుని, వామభాగమున సీత వఱలుచుండ , ముత్యాలగొడుగును భరతుడు పట్టగా, వింజామరములు వీచుచుశతృఘ్నుడు సేవింప, మందహాసముతో వెలుగొందు శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 042/102)

వామే కోదండ దండం నిజకర కమలే దక్షిణే బాణ మేకం
పశ్చాద్భాగే చ నిత్యం దధత మభిమతం చాప తూణీర భారం
వామే వామే లసద్భ్యాం సహమిళితతనుం జానకీ లక్ష్మణాభ్యాం
రామం శ్యామం భజేహం ప్రణత జనమన: ఖేద విఛ్ఛేద దక్షం

సీ.
ఎడమజేయినిజేరి ఏలు కోదండంబు
కుడిచేయికొన నొక్కకోల నిలిపి

వెన్నుభారముజేయు వీపునంబులపొది
విడువక యున్నట్టి వేద్యమూర్తి

తనతోటి నడిచేటి తనువుసీతమ్మయు
తమ్ముడు సౌమిత్రి తోడుయుండ

తరుణమంత్రముదెల్పి తనవారి దుఃఖము
తొలగించి రక్షించు తారకుడని

తే.
తరుణమొదలక కీర్తించి తన్మయమున
భరణ నీదను భజనార్థ భక్తజనుల
కరుణ జూపుము కమలాక్ష! కావుమిలను
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 043/102

అంభోధర శ్యామల మంబుజాక్షం ధనుర్ధరం వీర జటా కలాపం
పార్శ్వద్వయే లక్ష్మణ మైథిలీభ్యాం నిషేవ్యమాణం ప్రణమామి రామం

సీ.
నీలమేఘపురంగు నిలిపిన సిరిమేను
నళినాబ్జముద్రిత నయనములును

నిలువెత్తు వింటిని నిలిపెడి సరిచేయి
నాజూకు తలజుట్టు నడిమి కొప్పు

నిజభక్తి సౌమిత్రి నిలిచికొల్వ కుడిని
నిత్యశ్రీ జానకి నిల్చెనెడమ

నిజభక్తి శిరముంచి నిలిపితి పదముల
నినుగను నిత్యమే నిజము రామ!

తే.
నిన్ను నీవారమెరుగును నీరధెరుగు
నిన్ను నటరాజు నగజయే నెమ్మినెరుగు
నిన్నుగను దారి నెరుకను నేర్పు నేర్వ
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {044/102}

కోదండదీక్షాగురు మప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుం
ఆజానుబాహుం జగదేకవీర మనాథనాథం రఘునాథ మీడే

సీ.
కోదండమొదలని కఠినవ్రత గురువు
అమితవిశ్వాతీత అమరమూర్తి

అనుపమాహ్వయుడు అమితదయాళుడు
ఆజానుబాహుడు అమలమూర్తి

దశరథతనయుడు ధారుణీపాలుడు
జగదేకవీరుడు జహ్నుమూర్తి

ఒరులనెరుగమన్న ఓర్పునేర్పునగాచు
ప్రణవనాదాత్మక! ప్రణతి ప్రణతి

తే.
నమ్మువారల నడిపించు నయనకాంతి
నెమ్మిజూపెడి హృదయాబ్జ నిలయుడవని
నమ్మి సర్వము నీవంటి నాదు రామ!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: కోదండధారణ దీక్షయందు ఎల్లరకు గురువు, అప్రమేయుడు,
సలక్ష్మణుడు, దశరథపుత్రుడు, దయాళుడు,ఆజానుబాహుడు,
జగదేకవీరుడు, అనాథనాథుడు, రఘునాథుడు, శ్రీ శుభాంగుడైన శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామకర్ణామృతం - ప్రథమాశ్వాసము 045/102)

కర్పూరాంగ విలేపనం రఘువరం రాజీవ నేత్రం ప్రభుం
కస్తూరీ నికరా కృతిం ఖర ధృతి ప్రధ్వంసినం శ్రీహరిం
కందర్పాయుత కోటి సుంద తనుం కామారి సేవ్యం గురం
కాంతా కామద మప్రమేయ మమలం సీతా సమేతం భజే

సీ.
కర్పూరచందన కవరలేపనధారి
కమలాక్ష! రఘువర! కువలయేశ!

కస్తూరికానిధి కూడిన రూపసి
ఖరుని ధైర్యముజంపు ఖగపుశౌరి

కోటిమన్మధకోటికొమరు సుందరసౌరు
కైలాసవాసికి కొలువు గురువు

కాంతలు కామించు కందర్పమోహనుడు
కనశక్యమేగాని కఱ్ఱలేని

తే.
కలికిజానకీ సహితుడు కలిమిజేయ
కనులనిండెడి రూపమై కరుణగొనిన
కలిమికనులను కలలేల? కోర్కెలేల?
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 046/102)

నీలాబ్దబృందసదృశం పరిపూర్ణ దేహం
దిక్పాలకాది సుర సేవిత పాద పద్మం
పీతాంబరం కనక కుండల శోభితాంగం
సీతాపతిం రఘుపతిం సతతం భజామి

సీ.
నల్లకలువపూల ననువుగుత్తులనిగ్గు
నప్పేటి నిండైన నలుపుమేని

దిక్కని మొక్కంగ దివిజదిక్పాలక
దివ్యసన్నిధియైన దివ్యపదము

పసిడిచేలముగట్టి పసిడిపోగులబెట్టి
ప్రకటితార్చిసదీప్త ప్రకశితాంగ

అమ్మ జానకితోటి అయ్య రామునిజూడ
ఆత్మ భజనజేయు అనవరతము

తే.
భజన నీదయ శ్రీరామ! భక్తి నీది
బ్రతుకు నీదయ శ్రీరామ! భ్రమలు దొలుగ
తెరవు నీవని తెలిపేటి తెలివి నీవు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {047/102}

భర్గ బ్రహ్మసురేంద్రముఖ్యదివిజప్రాంచత్కిరీటాగ్రసం
సర్గానేకమణిప్రభాకరసహస్రాభం పదాంభోరుహే,
దుర్గాసంతతసంస్తుతాంఘ్రికమలం దుర్వారకోదండినం
గంగావిస్ఫుటమౌళిమానసహరం కల్యాణరామం భజే !

సీ.
శశిశేఖర సనత శక్రాది సురలెల్ల
శిరమొంచి ప్రణుతిల్ల శీర్షకమున

శ్రేష్టరత్నప్రభ శ్రేయకమలపర్ణ
శోభమీర వెలుగు శోభితపద

శైలజాస్తుతికీర్త క్షేమపదాబ్జము
శత్రుదుర్వారమౌ శరధనుస్సు

శివమెత్తు సురగంగ శివుని తాకెడువేళ
శమనమానసశక్తి శరణమూర్తి

తే.
శరణసుమధామ! శరభీమ! శమనసోమ
శిఖరసద్ధర్మచరకామ! సేవ్యధామ!
శక్తకరుణాగుణోద్ధామ! శరణు రామ!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శివబ్రహ్మేంద్రాది దేవతల కిరీట మాణిక్యకాంతుల చే నొప్పుచున్న పాదద్వయముతో, జగన్మాత పార్వతీదేవి నిరంతర స్తోత్రముచేయబడిన పాద పద్మములుకలిగి , నివారింపశక్యముగాని కోదండధారివై, పరమేశ్వరుని మానసమును శాశ్వతముగ హరణమొనర్చి,{శంభు మానస హరుడవై} శ్రీ శుభాంగుడవై మనోహరుడై కల్యాణరాముడైన నిన్ను ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {048/102}

అగ్రే ప్రాంజలి మాంజనేయ మనిశం వీరం చ తారాసుతం
పార్శ్వే పఙ్క్తిముఖానుజం పరిసరే సుగ్రీవ మగ్రాసనే,
పశ్చాల్లక్ష్మణ మంతికే జనకజాం మధ్యే స్థితం రాఘవం
చింతాతూలికయా లిఖంతి సుధియశ్చిత్తేషు పీతాంబరం

సీ.
ఎదుట కైమోడ్పుతో ఎదసఖుడు హనుమ
వదలక పదముల వాలికొడుకు

పక్కటనుండగా పౌలస్త్య తమ్ముడు
పరిసరాసనమున పొద్దుగొడుకు

లక్ష్మణుడొకవైపు లక్ష్మియే మరువైపు
లసితవస్త్రుడు నడిమి సలక్షణుగని

మనముల లిఖియించు మధురచిత్రంబును
మది ధ్యానమదియని ముద్రవేయ

తే.
దుఃఖశమనము అంగదు దూరభక్తి
సుఖశరణయుక్తి హనుమంతు సూక్ష్మశక్తి
సఖ్యధర్మసాక్ష్యమెరిగి సాగిలబడ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము:ఎదుట అంజలి జోడించిన పవనుజుని, పార్శ్వమునందు వీరుడైన అంగదుని, సమీపమందు విభీషణుని, ఎదుటపీఠమందు సుగ్రీవుని, వెనుక లక్ష్మణుని, వామభాగమున భామ సీతాదేవిని, వీరిమధ్యన పీతాంబరధారియగు శ్రీ రాముడు ! ఙ్ఞానులీ ముద్రనెరిగి ధ్యానమను కలముచేత చిత్తమందు వ్రాసికొనుచున్నారు {ఇలా ధ్యానము చేయుచున్నారు } సౌమ్యనామా శ్రీ రామా
రమ్యగుణధామా నన్ను రక్ష్మింపుము }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {049/102}

క్షీరాంభోనిధిమధ్యవర్తిని సితే ద్వీపే సువర్ణాచలే
రత్నోల్లాసితకల్పభూరుహతలే జాంబూనదే మండపే
తేజోభ్రాజితవేదికే సురుచిరే మణిక్యసింహాసనే 
హేమాంభోరుహకర్ణికోపరితలే వీరాసనస్థం భజే

సీ.
పాలసంద్రపునడిమి పరగు వెండిదివిని
పరిఢవిల్లెడు నొక్కపసిడికొండ

పద్మరాగాదులు పూచేటి వనములు
పెద్దచెట్టందున పెరిగియుండ

పారు జంబూనదీ పక్కనే ఒకయిల్లు
పుత్తడివెలుగులపట్టమందు

పద్మరాగాసన పసిడిపద్మమునందు
పుడమియానకయుండు పూర్ణమూర్తి

తే.
పుడమికోర్కెల దీర్చేటి పూర్ణతరువు
పగటివెలుగుల దొలగించు పసిడిమెరుపు
పదము దెలియగ పరమాత్మపథము దెలియ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: పాలసముద్రము నడుమనున్న శ్వేతద్వీపమందు, కనకాద్రి యందు రత్నములచేత శోభించు కల్పకవృక్షములక్రింద కనకమంటపమందు కాంతులొసగు ప్మషట్పట్పప
గల మనోహరమైన మాణిక్య సిం హాసనమందు బంగారు పద్మమందు వీరాసనయుక్తుడు సుందరాంగుడు, రమణితోడ శోభించుచున్న అట్టి శ్రీ రామ స్వరూపమును ధ్యానించి ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {050/102}

దోర్దండేన చ మండలీకృతమహాకోదండచండాశుగై
ర్నిర్ఘాతై రవికోటితుల్యనిశితైర్బ్రహ్మాదిముఖ్యస్తుతై:,
సుగ్రీవాదిసమస్తవానరవరా నాజ్ఞాపయంతం గిరా
దైత్యాన్ తాడయ తాడయేత్యనుపదం శ్రీ రామచంద్రం భజే

సీ.
రణమేఘములజీల్చి రామకోదండము
రయమున పిడుగుశరఝరులొదల

రవికోటిసముడైన రామచంద్రునికీర్తి
బ్రహ్మాదిఘనులు స్తోత్రముల పొగడ

రవిసుతాదులు వానరులకెల్ల గిరులతో
రాక్షసహరణకై మ్రోతలిడుచు

రక్కసిమూకల రాజసంబునగూల్చు
రణవీరరాముడే రక్షరక్ష!

తే.
రక్షణార్థులు అరులైన రక్షసేయు
రక్షసైన్యము కపులైన రక్షసేయ
రక్షణార్థిగ పదమైతి రామచంద్ర!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: పిడుగులతో బోలు భీషణ బాణములు రవికోటికాంతులీనుచు బ్రహ్మాదులచే నుతింపబడి, భుజములచేలాగబడి, గుండ్రమైన ధనుర్భాణములచే నొప్పుచు, ఖలులు రాక్షసాళిని మర్దించమని సుగ్రీవాది వానరులనాఙ్ఞాపించు 
శ్రీ రాములను ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {051/102}

భూకంపం జనయ న్నభో విదళయ న్నంభోనిధిం క్షోభయన్
దైతేయాంశ్చ విమర్దయన్ గిరివరాన్ భిందన్ దిశ: పూరయన్
వైదేహీ మతిమోదయన్ సకలగీర్వాణాన్ శిర:కంపయన్
కల్యాణో రఘురామబాణవిలసత్కోదండచండధ్వని:

సీ.
విశ్వకంపనమగు విన్ను బద్దలగును
విషధులు క్షోభించు వైరి జచ్చు

వహ్నిపర్వతములు వట్టిబోవుచు కుంగు
వహ్నిదిక్కుల శూన్యవాసి నిండు

వైదేహిహృద్వీణ వినసొంపుగా మీటు
వేల్పుశిరములెల్ల విడువకూగు

వందితరామ కోదండచండధ్వని
వదలకన్నియుజేసి వసుధనేల

తే.
వ్యాప్తభుజశక్తిసులభుడు వ్యాపకుడని
విశ్వరూపుడు విజితాత్మవిదితహరిని
వేదవేద్యుని భక్తితో వేడుపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శుభప్రదుడగు రఘురామబాణవిలసత్కోదండచండధ్వని
భూకంపమును పుట్టించుచు ఆకాశము బ్రద్దలు చేయుచు,
సముద్రమును క్షోభింపజేయుచు రాక్షసులమర్దించుచు పర్వతములను బ్రద్దలుగొట్టుచు దిక్కులను నిండించుచు సీతను సంతసింపచేయుచు దేవతావళి తలలూచునట్టు చేయుచు వ్యాపించెను శ్రీ రామ భుజ శక్తికి ప్రణమిల్లుచున్నాను నన్ను రక్షించుగాక !}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 052/102)

విమల కమల నేత్రం విస్ఫురన్నీలగాత్రం
తపన కుల పవిత్రం దానవధ్వాంత మిత్రం
భువన శుభ చరిత్రం భూమిపుత్రీ కళత్రం
దశరథ వరపుత్రం నౌమి రామాఖ్యమిత్రం

సీ.
వికసితసరసిజా విమలపల్లవనేత్ర!
వరనీలోపలవర్ణ గాత్ర!

వెలుగువేలుపువంశ వెలుగైన సుపవిత్ర!
వైరిదానవనిశావిభవ మిత్ర!

విదితాఖిలభువన వేద్యధర్మచరిత్ర!
వసుధాసుతహృదయ వరకళత్ర!

వహ్నిధర్మాచరవరదశరథ పుత్ర!
వరయశోధర నాదు వహ్నిమిత్ర!

తే.
వాయునందన హృదయాబ్జవాస రామ!
విదళనార్థితదానవవైరి రామ!
వేదవేదాంగగురువంద్య వేద్యరామ!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సరసిజపత్రనేత్రుడు, నీలమణిశోభితగాత్రుడు, భాస్కరకులసత్పవిత్రుడు, దానవధ్వాంతమిత్రుడు ( రాక్షసులను చీకటికి సూర్యుడు) భువనశుభచరిత్రుడు, ధరణీసుతాకళత్రుడు, దశరథవరపుత్రుడు,
పుణ్యయశుడు, కోదండధారి నాకుమిత్రుడైన శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 053/102)

జననీ జానకీ సాక్షా జ్జనకో రఘునందన;
లక్ష్మణో మిత్ర మస్మాకం కో విచార: కుతో భయం
జనకో రామచంద్రో మే జననీ జనకాత్మజా
హనుమత్ప్రముఖాస్సర్వే హరయో మమ భాంధవా;

సీ.
మాతజానకి జగన్మాతగ రక్షించి
జగదభిరాముడు జనకుడగుచు

శేషులక్ష్మణమూర్తి సేమపు మిత్రుడై
పరగు మాకేలను బాధ? భయము?

నాతండ్రి రామయ్య నాతల్లి సీతమ్మ
నా తోటిజనులు వానరులు హితులు

బంధనంబులదాట బంధువర్గంబని
బతుకుబాటను సాగ బాధలేవి?

తే.
ఆత్మ రాముడు దెలియంగ అతివ బుద్ధి
భావపదగతి నడిపించు భాష హనుమ
బాధ దాటింప బలమైన భక్తి కపులు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {054/102}

జగతి విశద మంత్రం జానకీప్రాణమంత్రం
విబుధనుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రం
దశరథసుతమంత్రం దైత్యసంహారమంత్రం 
రఘుపతినిజమంత్రం రామరామేతి మంత్రం

సీ.
విశ్వధర్మములెల్ల విశదంబుగాజెప్పు
వైదేహి ప్రాణమై వినుతికెక్కు

విబుధజనగళము విడవనిదై యొప్పు
విశ్వంబు నొక్కటై వెలుగుజూపు

వరదశరథసూను వరనామమదియని
వధజేయు దైత్యుల వరమదనియు

వహ్నినెవ్వరుయన్న వాసిమోక్షముదక్కు
వరమంత్రపదము శివానిదెలుప

తే.
రామరామేతిమంత్రపు రమ్యతెరిగి
రామ రామ రామయనుచు రాత్రిపగలు
రక్షగోరెడు భజన నారక్షపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రామా రామా మంత్రం ప్రపంచమున నిర్మలమైన మంత్రం .
వైదేహికెప్పుడు ప్రాణమంత్రం. విబుధవరేణ్యుల స్తోత్రమంత్రము.
విశ్వవిఖ్యాతమంత్రము. దశరథసుతమంత్రము. రాక్షససం హారమంత్రము.
జగతీజనుల మోక్షసాధనమైన మంత్రము. రఘుపతీ, దాశరథీ , జానకీశ !
నీ స్వకీయమంత్రము మాకు ముక్తి చేకూరు మంత్రం }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము -055/102

సీతాయా దక్షిణే పార్శ్వే లక్ష్మణస్య చ పార్శ్వత:
తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరిం
చంద్రోపమం మలయచందనచర్చితాంగం
మందారపుష్పపరిపూజితపాదపద్మం
బ్రహ్మేంద్రవంద్య మనిశం మునిబృందసేవ్యం 
వందే~ అరవిందనయనం రఘురామచంద్రం

సీ.
సతిసీత కుడివైపు సౌమిత్రి ఎడమను
సరిమధ్య రాముడు సదనుడైన

శరచాపధరహరి శశినిభ శమనుడు
మలయచందనదేహ మోక్షణుడని

పారిజాతార్చిత పాదపద్మంబులే
పరమేష్టి పర్జన్య పూజితమని

మునిబృంద శిరములు మోకరిల్లగజూసి
పద్మాక్షుపదములే పారమంటి

తే.
పవనసూనుడు పదముల పట్టిజూప
పరమపదమను పథమును పట్టు పదము
"పాహిరామ"పదము నిత్యపఠనపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సీతాలక్ష్మణుల మధ్య ధనుర్బాణములనుధరించియున్న విష్ణురూపుడగు రాముని ప్రణమిల్లుచున్నాను. చంద్రునితో తుల్యుడు మలయపర్వతచందనచర్చితాంగుడు, మందారపుష్పసమ్మానిత 
పాదపద్మయుతుడు, నిరంతర సరస్వతీశ్వర దేవేంద్ర మునిజన వందితుడు, అరవిందాక్షుడైన రఘూద్వహుని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసమ {056/102}

ఇక్ష్వాకునందనం సుగ్రీవపూజితం
త్రైలోక్యరక్షకం సత్యసంధం సదా,
రాఘవం రఘుపతిం రాజీవలోచనం
రామచంద్రం భజే రాఘవేశం భజే !

సీ.
ఇక్ష్వాకునందనా ఇనకులచంద్రమా
ఇనసూను హితపూజితేశ రామ!

ముల్లోకరక్షకా! మూడుకాలంబుల
మడమతిప్పని సత్యమూర్తి రామ!

రఘవంశనరపాల! రాఘవా! రఘుపతే!
రాజీవలోచనా! రామచంద్ర!

రాఘవేంద్రా! రామ! రక్షమాం రక్షమాం
రామభక్తాశ్రయ రక్షధామ!

తే.
"రామ' రాక్షసగుణరజోరసవినాశ!
"రామ" రాజీవహృదయాంతరాళతోష!
"రామ" రాహిత్యమానసారాటపోష!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: మనువంశాబుధి పూర్ణచంద్రుడు,
సుగ్రీవసమర్చితాంఘ్రికమలుడు, త్రైలోక్యరక్షకుడు, సత్యసంధుడు, సత్యవాక్పాలకుడు, రఘురామస్వామి, కంజాయతనేత్రుడైన రామచంద్రుని, రాఘవుని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {057/102}

బ్రహ్మామృతానంద ఫలప్రదాయినం
వేదాంతవిఙ్ఞానసుగంధ పుష్పితం,
సీతాశుభాంగాంచితబాహుశాఖినం
శ్రీ రామకల్పద్రుమ మాశ్రయామ:

సీ.
బ్రహ్మజ్ఞానామృత బ్రహ్మానందఫలము
బ్రహ్మాండమునకిచ్చు బ్రహ్మపదము

వేదాంతసుజ్ఞాన విటపసుగంధంబు
విరితేనెలుగజేయు విష్ణుపదము

వరదేహివైదేహి వరదేహమునుజుట్టు
వృక్షశాఖల బాహువృత్తవరము

శ్రీరామచంద్రు నాశ్రితకల్పతరువని
శరణుగోరితి రామ! శరణమివ్వు

తే.
కామధేనువు "శ్రీరామ" కల్పతరువు
పారిజాతము శ్రీరామ పానసుధయు
మోక్షమంత్రము "శ్రీరామ" మోదపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము:అమృతరసము ఊటకారు బ్రహ్మానందమనెడు ఫలప్రదాయి, వేదాంతఙ్ఞానమనెడు సుగంధపుష్పితుడు, భూమిజాత విభుడు,
సీతదేవి శుభమైన దేహమందొప్పుచున్న చేయి అనేడికొమ్మ కలిగిన శ్రీ రామమూర్తి అను కల్పవృక్షమునాశ్రయించుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {058/102}

కనకనికషభాసా సీతయాలింగితాంగో
నవకువలయదామశ్యామవర్ణాభిరామ:
అభినవ ఇవ విద్యున్నండితో మేఘఖండ
శ్శమయతు మమ తాపం సర్వదా రామచంద్ర:

సీ.
ఒరపుగీటుమెరుపు ఒడిసిపట్టుపసిడి
ఒంటికాంతులసీత ఒడలుగలుప

నల్లకలువదండ నాదను వర్ణంబు
నీలమేఘశ్యామ! నిన్నుజేర

నూత్నవిద్యుత్ఖణి నారదంబునొదిలి
నారాయణాంశయై నెనరుసేయ

ఈతిబాధలనెల్ల ఇక్కట్లకథలెల్ల
ఇలనుండి తొలగించు ఈప్సితపద!

తే.
అమ్మసీతమ్మకౌగిలి అనువుసఖుడు
భక్తహనుమయ్యకౌగిలి భరణహితుడు
కనులగనిపించి కరుణించి కౌగిలిగొన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము:బంగారపు ఒరపుగీటు కాంతిగల సీతచె కౌగిలింపబడిన దేహము కలిగి, నల్లకలువదండవలె చామనచాయతో మనోహరుడై, క్రొత్తమెఱుపుతోకూడినమేఘపు (ఖండము) ముక్కయైనట్టి రామచంద్రుడు సదా నా సంసారబాధలను శాంతింపచేయుగాక! }

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {059/102}

అలం శాస్త్రాభ్యాసై రల మసకృదామ్నాయ పఠనై
రలం తీర్థస్నానై రల మఖిలయాగవ్రతజపై:
అలం యోగాభ్యాసై రల మపి మహాపాతకభియా
య దస్మాకం రామస్మరణమహిమా సో విజయతే

సీ.
శాస్త్రపాఠములేల? శబ్దబ్రహ్మములేల?
శ్రుతమోహస్వర శ్రవణమేల?

తీర్థమునకలేల? తిరుగంగ గుడులేల?
యజ్ఞవ్రతజపపు యోచనేల?

యోగపాఠములేల? యమబాధ భయమేల?
యిన్ని మాటలవేల? ఇనకులేశ!

ఒక్కటే మంత్రంబు ఒక్క "రామా" యన్న
నామస్మరణతోటి నాకమందు

తే.
ఎన్ని తిరిగితి ప్రతిచోట ఎదను వదిలి
ఎన్ని పలికితి నోటను ఎరుక మరచి
అన్ని నీవని తెలియంగ ఆత్మపథము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శాస్త్ర పాఠములేల ? వేదపఠనములేల? విచారమేల?
గంగానదీతీరస్నానములేల ? జప తపములు వ్రతములు సల్పుటేల?
యాగములు ఉపవాసములు తీర్థయాత్ర లేల ? మరణభయమేల ?పాపభీతియునేల ? రామనామస్మరణమాహాత్మ్యము మాకు తెలిసినపుడు వీటివిచారములేల ? }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {060/102}

సీతామనోమానసరాజహంస సంసారసంతాపహర క్షమావాన్,
శ్రీరామదైత్యాంతక శాంతరూప శ్రీతారకబ్రహ్మ నమోనమస్తే.

సీ.
సరసిజేక్షణసతీ సత్యమానససరో
రాజసాన్వితదీప్త రాజహంస

సంసారసాగర సంతాపతారణ
సహనవారధిశిలా శోభితపద!

సురవైరిహరరామ! సుమనశమనసోమ
సుగుణశరణధామ! సుకృతకామ!

సత్య తారక శుభ సచ్చిదార్ణవసోమ!
సన్నుతిగొనుభక్త శరణధామ!

తే.
సత్యధర్మములొదలని సత్యనామ!
సత్యపథమున నడిపించు సత్యధామ!
సత్యమొదలని స్వరమందు సత్యపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము:సీతాదేవి చిత్తమనెడు మానససరస్సునకు రాజహంసవైన ఓ శ్రీ రామా ! సంసారబాధలను మానుపు ఓ రామా ! శాంతస్వరూపా రామా ! దైత్యాంతకా ! శ్రీ తారకబ్రహ్మా శ్రీ రామా నమో నమస్తే! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {061/102}

కదా వా సాకేతే విమల సరయూతీరపులినే
సమాసీన శ్శ్రీమద్రఘుపతిపదాబ్జే హృది భజన్,
అయే రామస్వామిన్ జనకతనయావల్లభ విభో
ప్రసీదేతి క్రోశ న్నిమిషమివ నేష్యామి దివసాన్.

సీ.
సాకేతపురమందు సలిలసరయూతీర
సైకతశ్రేణుల శిఖరమందు

సీతతోకూర్చుండు శ్రీరామచంద్రుని
పాదపద్మంబుల పట్టుకొనుచు

ఎప్పుడుందును రామ? ఎన్నడందును రామ
ఎల్లకాలంబుల ఎరుకనెరిగి

దినములే నిముసమై దిక్కునీవనిజెప్పు
ఎల్లలెరుగని శాంతి ఎదురుజూడ?

తే.
ఎదర నీవని దెలిపేటి ఎరుక దెలిపి
మదిని నీవని దెలియంగ మౌనమిచ్చి
హృదయమంతయు నిండిన హృద్యపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: అయోధ్యలో నిర్మలమైన సరయూ తీరమందలి ఇసుక తిన్నెయందు కూర్చుండి శ్రీ రామచంద్రుని పాదపద్మములు సేవించుచు ఓ స్వామీ శ్రీ రామా ! సీతేశా ! నన్ను రక్షించుమని మొరలిడుచు బహుదినములు నిముసమువలె ఎప్పుడు వెళ్ళబుచ్చగలనో ??? }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {062/102}

కదా వా సాకేతే తరుణతులసీకాననతలే
త్య్ర పశ్యన్నవిహతవిశాలోర్ధ్వతిలకం,
అయే సీతానాథ స్మృతజనపతే దానవజయి
స్ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యమి దివసాన్.

సీ.
వరసీమసాకేత వనతులసీలతా
వరణమధ్యమునుండు వేదికందు

విశ్వమంత విశాల విశ్వరూపవదన
విమలకల్యాణ రవితిలకుగని

వరసీతాపతే! వారిజాప్తకులజా!
వైరిదానవహర! వారిజాక్ష!

వర్షంబు నిముసమై వెళ్ళబుచ్చుతునుంటి
వేళమార్చగ రామ! వేగరమ్ము

తే.
ఎదర వనముల పశువుల ఎరుకనగవు
ఎరుక దెలియని శిశువుల ఎదనునగవు
ఎదల ఫణితిగ వినిపించు ఎరుకపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: అయోధ్యలో లేతతులసీ వనమందుండి అవిచ్చిన్నమై విశాలమైన శ్రీ కల్యాణ ముఖమున నిలువు తిలకము కలిగిన రాముని చూచుచు ఓ సీతాపతీ ! విదేహజాధిపతి ! కాకుత్థేశ ! కౌసల్యాపుత్రా !హరీ ! స్మృతజనపతే ! దానవసం హారా ! నన్ను రక్షింపుమని మొరలిడుచు బహుదినములు నిముసమువలె ఎప్పుడు వెళ్ళబుచ్చగలనో ? }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {063/102}

కదా వా సాకేతే మణిఖచితసింహాసనతలే
సమాసీనం రామం జనకతనయాలింగితతనుం,
అయే సీతారామ తృటితహరధన్విన్ రఘుపతే 
ప్రసీదేతి క్రోశ న్నిమిషమివ నేష్యామి దివసాన్.

సీ.
సాకేతపుర సభాసదనపీఠమునందు
స్వర్ణసింహాసన వాసిబెంచి

సతిసీతనొదలక సఖ్యతజూపించి
శివునివిల్లుందుంచి సీతగెలుచు

రామచంద్రా! నన్ను రక్షింపుమని వేడు
దినములే నిముసమై దిక్కుదెలుప

ఎన్నినాళ్ళీగతి? ఎటులజేరను రామ?
ఎరుకనేర్పుము మదినేలికగుచు

తే.
ఎవరు నీవని అడుగుటే ఎచ్చుకోలు
ఎచట నీవని తిరుగుటే ఎడదనెగులు
ఎరుక నీవని తెలిపేటి ఏలికనిన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సాకేత సభాంతరస్థలి మణిఖచిత సింహాసనమందు కూర్చున్న శ్రీ రాముని, భూతనయాలింగితుడైన దేహముకలవానిని, ఓ సీతా రామా ! శివచాపఖండనా ! ధరాపుత్రీపతీ ! రఘుపతీ !నన్ను రక్షింపుమని మొరలిడుచు బహుదినములు నిముసమువలె ఎప్పుడు వెళ్ళబుచ్చగలనో ?}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {064/102}

మార్గేమార్గే శాఖినాం రత్న వేదీ
వేద్యాం వేద్యాం కిన్నరీబృందగీతం,
గీతే గీతే మంజులాలాపగోష్ఠీ
గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర.

సీ.
బాటబాటలవెంట బాహువులను చెట్లు
విటపిమూలము రత్నవేదికైన

వాసివేదికలందు వాద్యబృందకృతులు
వినెడికృతులసాగు వెలపుగోష్ఠి

వెలపుగోష్ఠివెలుగు వేల్పురాముని కథ
కథను కథను రామకరుణ దెలుప

తెలిసితెలియజెప్పు తెలివి అమృతమైన
తెలియనివి తెలుపు తెరగు రామ!

తే.
అధరమధురత అనవరతార్థమెరిగి
పదముపదమున పావనపదము పలుక
మరలిమరలి మదిమురళి మరులుగొనెడు
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సాకేతపురీ ప్రతి మార్గమందు ప్రతి తరువుక్రింద రత్నవేదికలు, ప్రతి వేదికయందు కిన్నరీ బృందగీతం, ప్రతిగీతమందు మృదువైన మధురగోష్టి ప్రతిగోష్ఠియందు శ్రీరామ ! నీ కథగలదు. అమృతధారగ్రోలు భక్తులకుమృతిలేదు.నీకథామృతము నాకిమ్మని ప్రణమిల్లుచున్నాను}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 065/102)

వృక్షేవృక్షే వీక్షితా: పక్షిసంఘా:సంఘేసంఘే మంజులామోదవాక్యం
వాక్యేవాక్యే మంజులాలాపగోష్ఠీ గోష్ఠ్యాగోష్ఠ్యాం తత్కథా రామచంద్ర

సీ.
చెట్టుచెట్టునజూడ చివురుకొమ్మలమీద
చేరిజుచెడి రామచిలుకగుంపు

గుంపుగుంపునమాట గుండెలింపగుపాట
తేనెలూరెడి రామ తీపిపాట

పాటపాటలనుండు పావనభావంబు
భావచర్చల రామభాగవతులు

భాగవతకథనంత భగవంతుడిలజూప
పక్షికీర్తన నాదు పదము రామ!

తే.
స్వరము అస్వరమున అనశ్వరము "రామ"
ప్రకృతి ఆకృతిగొనిజేయు ప్రణుతి "రామ"
భావరాగార్చకాభూష భాష "రామ"
రామ రామ రామమయము రామపథము!

(ముఖ్యార్థము: శ్రీ రామా !!!సాకేత పురీ మార్గమందు ప్రతి వృక్షమందు పక్షి సమూహాలు గాన వచ్చును.ప్రతి పక్షి సమూహమందు గాన మాధుర్య సంతోష వాక్యము గలదు.ప్రతి వాక్యమందు మృదువైన ప్రసంగము గలదు. ప్రతి ప్రసంగమునందు కర్ణపర్వమైన నీ కథా సుధ గలదు.)


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 076/102

లోకత్రాణానుకారీ దశవదన శిర:పజ్త్కి విఛ్ఛేద కారీ
లంకా లంకారహారీ భృగుతనయ మనస్సర్వ గర్వాప హారీ
సీతా సీమంత కారీ మణిమయ మకుటో దివ్యకొదండ ధారీ
శ్రీ రామ: పాప హరీ శమయతు దురితం భూమి భారాప హారీ

{ముఖ్యార్థము: లోకసంరక్షణము చేసి, రావణ దశశిరస్సులను తెగటార్చి, లంకాపట్టణశోభను హరించి, పరశురామ మనో గర్వమడచి , సీతాదేవి పాపటను దిద్ది ( అలంకారమొక యోగ విలాసము) మాణిక్య కిరీటంధరించి, దివ్యకోదండధారి, సర్వ పాపహారియై, భూభారం తగ్గించి మాదురితములన్ని పోగొట్టుచున్న శ్ర్రీ రామచంద్రునకు ప్రణమిల్లుచున్నాను}

సీ.
భువనరక్షణమెల్ల భుజధర్మముగజూపి
రావణు తలదొంతి రూపుమాపి

లంకరక్కసి జంపి లంకకు తలదీసి
ఖండపరుశు గండు దండిగణచి

సతిసీత నుదుటను సీమంత బొట్టెట్టు
మణిమయాలంకృత మకుటధారి

కోదండధనుధారి కుటిలాత్మసంహారి
పాపపంకిలహర పాదధారి!

తే.
అమరవందిత శరధారి! అసురవైరి 
అఖిలమునిజన అమలాత్మ అధరవారి
అధరమధువన "శ్రీరామ" అమృతమయము
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసమ 101/102

“రా” శబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకా:
పున:ప్రవేశభీత్యా చ “మ” కారస్తు కవాటవత్

{"రా" అను శబ్దము ఉచ్చరణ చే పాపాలన్నీ నోటినుండి వెడలిపోవును. ఆ పాపాలన్నీ మరల ప్రవేశించు నను భయముచే "మ" కారము తలుపువలె అడ్డును "}

సీ.
"రా" యను శబ్దమే రాజీవపుణ్యంబు
మహనీయమదియేను మానసంబు

రాముయనుచు పాపరాక్షసంబెల్లను
మారాడక విడును మోముదరిని

రావచ్చు మరియను రాక్షసభయమెల్ల
"మ"యనుచు బలుకంగ మరలిరాని

రాజమార్గద్వారరాహిత్యపథముగా
మా రాముడాపునే మనమునిండి

తే.
రామపదముల బట్టుటే రామరక్ష
రామ పదమును బలుకుటే రామరక్ష
రామ రామరామేతియే రాత్రహరము
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 102/102

శ్రీ రామాయణ మాది కావ్యమృషిణా వాల్మీకినా నిర్మితం
వేదాంతార్థ విశారదై రనుదినం స్త్యుత్యం సురైరర్చితం
శ్రోతౄణామఘనాశనం సురతరో స్తుల్యం తు ముక్తి ప్రదం
యే శృణ్వంతి పఠంతి రామచరితం తే యాంతి విష్ణో:పదం

సీ.
బుషియైన వాల్మీకి ఋక్కులంగలబోసి
రామాయణంబుగా వ్రాయనదయు

వేదాంతపరమార్థవిషయసారధనుల
కనుదినస్తోత్రంబు అమరనుతము

శ్రవణమాత్రంబునే శమలనాశముజేయు
మందారతరుసమ ముక్తిపథము

వినినంత యనినంత విష్ణుసాయుజ్యంబు
విధిగను బొందరే విమలజనులు

తే.
రామచరితంబు వినినంత రమము జెవుల
రామచరితంబు ననినంత రమము జిహ్వ
రామచరితంబు దెలియుటే రమము శమము
రామ రామ రామమయము రామపథము!

{"వాల్మీకి మహర్షి ప్రణీతమై, వేదాంతార్థ విశారదుల నిత్య ప్రార్థనా స్తోత్రప్రాయమై, దేవతలచే అర్చించబడి, విన్నవారి పాపప్రక్షాళనచేసి,కల్పవృక్షమై, మోక్షప్రదాయిని,రామ చరిత్రమైన రామాయణమను ఆది కావ్యమును ఏవరు వినుచున్నారో వారు విష్ణుసాయుజ్యమును పొందుచున్నారు "}

శ్రీ రామాయణ శ్రవణ ఫల సారాంశం శ్రీ ఆది శంకరులు అనుగ్రహించిన శ్లోకం -శ్రీ రామ కర్ణామృతం ప్రథమాశ్వాశం సంపూర్ణం- సర్వం శ్రీ సీతా రామచంద్ర పరబ్రంహార్పణమస్తు
--((**))--