Friday 22 May 2020



శ్రీ మదగ్ని మహాపురాణము - 3 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 1
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. ప్రశ్నమ్ - 1 🌻

మూలము :
శ్రియం సరస్వతీం గౌరీం గణేశం స్కన్దమీశ్వరమ్‌ |
బ్రహ్మాణం వహ్నిమిన్ద్రాదీన్వాసుదేవం నమామ్యహమ్‌.

ఆంధ్రానువాదము :
నత్వా శ్రీతాతపాదాదీన్‌ శాస్త్రమన్త్రాది సద్గురున్‌ |
మహాపురాణ మగ్గేయ మాన్ధ్య్రా మనువదామ్యహమ్‌.

శ్రీ మహాలక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమారస్వామికిని, మహేశ్వరునకును, అగ్ని దేవునకును, ఇంద్రాదులకును, శ్రీమహావిష్ణువు నకును నమస్కరించు చున్నాను.

నైమిషే హరిమీజానా ఋషయః శౌనకాదయః |
తీర్థయాత్రాప్రసజ్గేన స్వాగతం సూతమబ్రువన్‌.

నైమిషారణ్యమునందు హరిని ఉద్దేశించి యజ్ఞము చేయుచున్న శౌనకాది మహర్షులు తీర్థయాత్రాసందర్భమున అచ్చటికి వచ్చిన సూతునితో ఇట్లనిరి.

ఋషయ ఊచుః:

సూత త్వం పూజితోఅస్మాభిః సారాత్సారం వద్సవ నః |
యేన విజ్ఞాత మాత్రేణ సర్వజ్ఞత్వం ప్రజాయతే.

ఋషులు పలికిరి : ఓ సూతుడా! నీవు (మాచేత పూజింపబడినావు) మాకు పూజ్యుడవు. దేనిని తెలసికొనినంత మాత్రముచే (మానవునకు) సర్వజ్ఞత్వము కలుగునో అట్టి సారములలో కెల్ల సార మైనదానిని మాకు చెప్పుము.

సూత ఉవాచ :

సారాత్సారో హి భగవాన్విష్ణుః సర్గాది కృద్విభుః |
బ్రహ్మాహమస్మి తం జ్ఞాత్వా సర్వజ్ఞత్వం ప్రజాయతే.

సూతుడు పలికెను - సృష్ట్యాదులను చేసిన ప్రభువును, భగవంతుడును అయిన శ్రీమహావిష్ణువే సారములలో కెల్ల సారమైన వాడు. " నేనే ఆ పరబ్రహ్మస్వరూపుడను" అని ఆ విష్ణువును గూర్చి తెలిసికొన్నచో సర్వజ్ఞత్వము కలుగును.

ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్దబ్రహ్మపరం చ యత్‌ |
ద్వే విద్యే వేదితవ్యే హి ఇతి చాథర్వణీ శ్రుతిః.

శబ్దములకు గోచర మగు సగుణబ్రహ్మయు, పర మగునిర్గుణబ్రహ్మయు తెలియదగినవి. అథర్వవేదమునకు సంబంధించిన ముండకోపనిషత్తు గూడ -" రెండు విద్యలు తెలిసికొనవలెను" అని చెప్పుచున్నది.

అహం శుకశ్చ పైలాద్యా గత్వా బదరికాశ్రమమ్‌ |
వ్యాసం నత్వా పృష్టవన్తః సోఅస్మాన్సరమథాబ్రవీత్. 6

నేనును, శుకుడను, పైలుడు మొదలగువారును బదరికాశ్రమమునకు వెళ్ళి వ్యాసుని నమస్కరించి ప్రశ్నింపగా అపుడాతడు మాకు సారము నుపదేశించెను.

వ్యాస ఉవాచ:-

శుకాద్యైః శృణు సూత త్వం వసిష్ఠో మాం యథా బ్రవీత్‌ |
బ్రహ్మసారం హి వృచ్ఛన్తం మునిభిశ్చ పరాత్పరమ్‌. 7

వ్యాసుడు పలికెను: నేను మునులతో కలిసివెళ్ళి, పరముకంటె పరమును, సారభూతముము అగు బ్రహ్మను గూర్చి ప్రశ్నింపగా వసిష్ఠుడు ఏమని చెప్పెనో, ఓ! సూతా! నీవును శుకాదులును వినుడు.

వసిష్ఠ ఉవాచ :

ద్వివిధం బ్రహ్మ వక్ష్యామి శృణువ్యాసాఖిలానుగమ్‌ |
యథాగ్నిర్మా పురా ప్రాహ మునిభిర్దైవత్తెః సహ. 8

వసిష్ఠుడు పలికెను. ఓ వ్యాసా! పూర్వము అగ్ని దేవుడు మునులకును, దేవతలకును, నాకును ఏ విధముగా చెప్పెనో ఆ విధముగ సర్వవ్యాప్త మగు, ద్వివిధ మైన బ్రహ్మను గూర్చి చెప్పదను; వినుము.

పురాణం పరమాగ్నేయం బ్రహ్మవిద్యాక్షరం పరమ్‌ |
ఋగ్వేదాద్యపరం బ్రహ్మ సర్వదేవసుఖావహమ్‌. 9

బ్రహ్మవిద్య నాశనరహిత మగు పరవిద్య. అందుచే తత్ప్రతిపాదక మగు అగ్నే యపురాణము పరము. సర్వ దేవతలకును సుఖమును కలిగించు ఋగ్వేదాదికము అపర బ్రహ్మ. ఆపరబ్రహ్మను ప్రతిపాదించున దగుటచే దానికా పేరు.

అగ్నినోక్తం పురాణం యదాగ్నేయం బ్రహ్మసంమితమ్‌ |
భు క్తిముక్తిప్రదం దివ్యం పఠతాం శృణ్వతాం నృణామ్‌. 10

అగ్ని చెప్పిన పురాణము అగ్నేయపురాణము. ఇది వేదముతో సమానమైనది. చదువువారికిని, వినువారికిని భుక్తిముక్తుల నొసగునది.

సశేషం....
🌹 🌹 

శ్రీ మదగ్ని మహాపురాణము - 4 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సంపుటము - 1, అధ్యాయము - 1
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. ప్రశ్నము - 2 🌻

కాలాగ్ని రూపిణం విష్ణుం జ్యోతిర్బ్రహ్మ పరాత్పరమ్‌ | 11
మునిఖిః పృష్టవాన్దేవం పూజితం జ్ఞానకర్మభిః

కాలాగ్ని స్వరూపుడును. జ్యోతిఃస్వరూపుడును, పరాత్పరమైన బ్రహ్మయు, జ్ఞాన- కర్మలచే పూడింపబడువాడును ఆగు విష్ణుదేవుని మునిసమేతుడై (విసిష్ఠుడు) ప్రశ్నించెను.

వసిష్ఠ ఉవాచః

సంసారసాగరోత్తార నావం బ్రహ్మేశ్వరం వద |
విద్యాసారం యద్విదిత్వా సర్వజ్ఞో జాయతే నరః . 12

వసిష్ఠుడు పలికెను : సకల విద్యల సారమగు ఏ బ్రహ్మను గూర్చి తెలిసికొని నరుడు సర్వజ్ఞత్వమును పొందునో అట్టిదియు, సంసారసాగరమును దాటించుటలో నావయు, సర్వశ క్తమును అగు బ్రహ్మను గూర్చి చెప్పుము.

అగ్నిరూవాచ:

విష్ణుః కాలాగ్ని రుద్రోహం విద్యాసారం వదామి తే | విద్యాసారం పురాణం యత్సర్వం సర్వస్య కారణమ్‌. 13

అగ్ని పలికెను : విష్ణువు నైన నేనే కాలాగ్నిరుద్రుడను. సర్వస్వరూపమును, సర్వకారణమును, అతి ప్రాచీనమును అగు వద్యాసారమును గూర్చి నీకు చెప్పెదను.

సర్గస్య ప్రతిసర్గస్య వంశమన్వన్తరస్య చ | వంశానుచరితాదేశ్చ మత్స్యకూర్మాది రూపధృక్‌. 14

మత్స్యకూర్మాది రూపములను ధరించిన నేను సృష్టికిని, ప్రలయమునకు, వంశములకను, మన్వంతరములకును, వంశాను చరితము మొదలగుదానికిని కారణ మైనవాడను (ముని ఋష్యాదుల వంశముల వర్ణనము వంశము. ప్రధాన రాజవంశముల వర్ణనము వంశాను చరితము)

ద్వే విద్యే భగవాన్విష్ణుః పరా చైవాపరా చ హ | ఋగ్యజుఃసామాథర్వాఖ్యా వేదాఙ్గాని చ షట్‌ ద్విజ. 15

శిక్షా కల్పోవ్యాకరణం నిరుక్తం జ్యోతిషాం గతిః | ఛన్దోభిధానం మీమాంసా ధర్మశాస్త్రం పురాణకమ్‌. 16

న్యాయ వైద్యక గాంధర్వం ధనుర్వేదోర్థశాస్త్రకమ్‌ | అపరేయం; పరా విద్యా యయా బ్రహ్మాభిగమ్యతే. యత్తదదృశ్యమగ్రాహ్యమగోత్ర చరణం ధ్రువమ్‌. 17

పర, అపర అను ఈ రెండు విద్యలును విష్ణు స్వరూపములే. ఓ బ్రహ్మణా! ఋగ్యజస్సామాథర్వవేదములును, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను వేదాంగమూలారును, కోశము, మీమాంస, ధర్మ శాస్త్రము, పురాణము, న్యాయశాస్త్రము, అయుర్వేదము, సంగీతశాస్త్రము, ధనుర్వేదము, అర్థశాస్త్రము - ఇవన్నియు అపరవిద్య. చూడ శక్యము కానిదియు, పట్టుకొన శక్యము కానిదియు, గోత్రము గాని శాఖ గాని లేనిదియు, నిత్యమును అగు బ్రహ్మను బోధించు విద్య పరవిద్య,

విష్ణునోక్తం యథా మహ్యం దేవేభ్యో బ్రహ్మణా పురా! తథా తే కథయిష్యామి హేతుం మత్స్యాది రూపిణమ్‌. 18

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ప్రశ్నో నామ ప్రథమోధ్యాయః

పూర్వము బ్రహ్మ దేవతల కెట్లు చెప్పెనో, విష్ణువు నా కెట్లు చెప్పెనో ఆ విధముగ మత్స్యాదిరూపములను ధరించిన జగత్కారణభూతు డగు విష్ణువును గూర్చి నీకు చెప్పెదను.

అగ్ని మహాపురాణములో 'ప్రశ్నము' అను ప్రథమాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 19 🌻. సుందరాకాండ వర్ణనము 🌻


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 19  / Agni Maha Purana -1🌹
✍️. 
ప్రథమ సంపుటము, అధ్యాయము - 9
🌻. సుందరాకాండ వర్ణనము  🌻

అథ సున్దనకాణ్ణవర్ణనమ్‌.

నారద ఉవాచ:-

సమ్పాతి వచనం శ్రుత్వా హనుమానఙ్గదాదయః | అభ్ది దృష్ట్వా బ్రువం స్తే7బ్దిం ల ఙ్ఘయేత్‌ కో ను జీవయేత్‌.

హనుమంతుడును, అంగదాదులను నంపాతి మాటలు విని, సముద్రమును చూచి "ఈ సముద్రమును దాటి ఎవరు మనలనందరిని జీవింపచేయగలరు?" అని అనుకొనిరి.

కపీనాం జీవనార్థాయ రామకార్య ప్రసిద్ధయే | శతయోజన విస్తీర్ణం పుప్లువే7బ్ధి స మారుతిః 2

హనుమంతుడు కపులు జీవీంచుటకును, రామకార్యము సిద్ధించుటకును నూరు యోజనముల విస్తారము గల సముద్రమును లంఘించెను.

దృష్ట్వోత్థితం చ మైనాకం సింహికాం వినిపాత్య చ | లఙ్కాందృష్ట్వారాక్షసానాం గృహాణి వనితాగృహే.

దశగ్రీవస్య కుమ్భస్య కుమ్భకర్ణస్య రక్షసః | విభీషణస్యేన్ద్ర7జితో గృహేన్యేషాం చ రక్షసామ్‌. 4

నాపశ్యత్పానభూమ్యాదౌ సీతాం చిన్తాపరాయణః | అశోకవనికాం గత్వా దృష్టవాఞ్ఛంశపాతలే. 5

రాక్షసీరక్షితాం సీతాం భవ భార్తేతి వాదినమ్‌|రావణం శింశపాస్థో7థ నేతి సీతాం తు వాదినీమ్‌. 6

భవ భార్యా రావణస్య రాక్షసీర్వాదీనీః కపిః |

పైకి(సముద్రమునుండి) లేచిన మైనాకపర్వతమును చూచి, సింహికను చంపి, లంకను చూచి, రాక్షసుల గృహములను కూడ చూచెను. అచట రావణుని ఇంటి అంతఃపురము నందును, కుంభ - కుంభకర్ణ-విభీషణ-ఇంద్ర జిత్తలు గృహమునందును, ఇతర రాక్షసుల గృహములందును, పానభూమి మొదలగు ప్రదేశములందును కూడ సీతను చూడజాలకపోయెను. అపుడు ఆ హనుమంతుడు చింతాక్రాంతుడై అశోకవనమునకు వెళ్ళి శింశపావృక్షము నెక్కి దాని క్రింద రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న సీతను, "నా భార్యవు కమ్ము" అని పలుకుచున్న రావణుని, అందులకు నిరాకరించుచునన సీతను, ''రావణునికి భార్యవగుము" అని చెప్పుచున్న రాక్షసస్త్రీలను చూచెను.

గతే తు రావణ ప్రాహ రాజా దశరథో7భవత్‌. 7

రామో7స్య లక్ష్మణః పుత్రౌ వనవాసం గతౌ వరౌ | రామపత్నీ జానకీ త్వం రావణన హృతే బలాత్‌. 8

రామః సుగ్రీవ మిత్త్రస్త్వాం మార్గయున్‌ పై#్రషయచ్చ మామ్‌ |

సాభిజ్ఞానం చాఙ్గులీయం రామదత్తం గృహాణ వై. 9

రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట హనుమంతు డిట్లు పలికెను. దశరథుడనెడు రాజు ఉండెను. అతని శ్రేష్ఠు లైన పుత్రులు, రామలక్ష్మణులు, అరణ్యమునకు వెళ్ళిరి. రామ భార్య లైన సీత యగు నిన్ను రావణుడు బలాత్కార మున అపహరించెను. నుగ్రీవుని మిత్రుడైన రాముడు నిన్ను అన్వేషించుచు, నన్ను పంపెను. అనవాలుతో కూడిన, రాము డిచ్చిన ఉంగరమును గ్రహింపుము.

సీతాజ్గులీయం జగ్రాహ సాపశ్యన్మారుతిం తరౌ | భూయో7గ్రే చోపవిష్టం తమువాచ యది జీవతి.. 10

రామః కథం న నయతి శఙ్కితామబ్రవీత్కపిః |

సీత వృక్షముమీద ఉనన వానరుని చూచెను. ఆ ఉంగరమును తీసికొనెను. ఇంకను ఎదుట కూర్చొని ఉన్న అతనితో ఇట్లనెను- "రాముడు జీవించి ఉన్నచో నన్నేల తీసికొని వెళ్ళుటలేదు?" ఈ విధముగ శంకించుచున్న ఆమెతో హనుమంతు డిట్లు పలికెను.

హనుమానువాచ:-

రామః సీతే న జీనితే జ్ఞాత్వా త్వాం స నయిష్యతి.

రావణం రాక్షసం హత్వా సబలం దేవి మా శుచః | సాభి జ్ఞానం దేహి మే త్వం మణిం సీతాదదాత్కపౌ.

ఉవాచం మాం యథా రామో నయే చ్ఛీఘ్రం తథా కురు| కాకాక్షిపాతనకథాం ప్రతియాహి హి శోకహ. 13

హనుమంతుడు పలికెను: ఓ సీతాదేవీ! రామునికి నీ జాడ తెలియలేదు. ఇపుడు తెలిసకొని, సేనాసహితుడైన రావణుని సంహరించి నిన్ను తీసికొని వెళ్ళగలడు. ఓ దేవీ! విచారించకుము. అనవాలుతో కూడిన దేదైన నాకిమ్ము." అపుడు సీత హనుమంతునకు మణిని ఇచ్చెను. " నన్ను రాముడు శీఘ్రముగా తీసికొని వెళ్ళిపోవు నట్లు చేయుము" అని చెప్పెను. అతనికి కాకి కంటి కథను కూడ చెప్పి, "ఓ శోకవినాశకుడా! తిరిగి వెళ్ళుము" అని పలికెను.

మణిం కథాం గృహీత్వాహ హనూమానేష్యతే పతిః | అథవా తే త్వరా కాచిత్‌ పృష్ఠమారోహ మే శుభే. 14

అద్య త్వాం దర్శయిష్యామి ససుగ్రీవం చ రాఘవమ్‌| సీతా బ్రవీద్ధనూమన్తం నయతాం మాం హి రాఘవః.

హనుమంతుడు ఆ కథ విని, మణిని తీసికొని, ఇట్లు పలికెను. "ఓ శోభనస్వభావము గల దేవీ! నీ భర్తరాగలడు. లేదా, నీకు తొందర ఉన్నచో నా వీపు పైన ఎక్కుము. ఇపుడే నీకు సుగ్రీవసహితుడైన రాముని చూపించెదను. ఆ మాటలు విని సీత హనుమంతునితో - "రాముడే నన్ను తీసికొని వెళ్ళుగాక" అని పలికెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ మదగ్ని మహాపురాణము - 5 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సంపుటము - 1, అధ్యాయము - 2
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మత్స్యవతార వర్ణనము - 1 🌻

అథ మత్స్యావతార వర్ణనమ్‌

వసిష్ఠ ఉవాచ :

మత్స్యాదిరూపిణం విష్ణుం బ్రూహి సర్గాదికారణమ్‌ | పురాణం బ్రహ్మ చాగ్నేయం తథా విష్ణోః పురా శ్రుతమ్‌. 1

మత్స్యవతార వర్ణనము

విశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.

అగ్నిరూవాచ ః

మత్స్యావతారం వక్ష్యేఅహం వసిష్ఠ శృణు వై హరేః | అవతార క్రియా దుష్టనష్ట్యై .సత్పాలనాయ హి 2

అగ్ని పలికెను ః వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా?

ఆసీదతీతకల్పానై బ్రహ్మోనైమిత్తికో లయః | సముద్రోపప్లుతా స్తత్ర లోకా భూరాదికా మునే. 3

ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి.

మనుర్వైవస్వతస్తేపే తపో వై భుక్తిముక్తేయే | ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్‌.
తస్యాఞ్జల్యుదకే త్యల్పో మత్స్య ఏకోఅభ్యపద్యత|

వైవన్వత మనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను.

క్షేప్తుకామం జలే ప్రాహ న మాం క్షిప నరోత్తమ.
గ్రాహాదిభ్యో భక్షయం మేఅత్ర తచ్ఛ్రుత్వా కలశేఅక్షిపత్‌ |

ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను.

స తు వృద్ధః పునర్మత్స్యః ప్రాహ తం దేహి మే బృహత్‌ . 6

స్థానమేతద్వచః శ్రుత్వా రాజాథోదఞ్చనేఅక్షిపత్‌ |

ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను.

తత్రవృతద్దో7బ్రవీద్భూపం పృథుం దేహి పదం మనో. 7

సరోవరే పునఃక్షిప్తో వవృధే తత్ప్రమాణవాన్‌ |
ఊచే దేహి బృహత్‌ స్థానం ప్రాక్షిపచ్చామ్బుధౌ తతః 8

అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను. " ఓ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను.

లక్షయోజనవిస్తీర్ణః | క్షణమాత్రేణ సో అభవత్‌ |
మత్స్యం తమద్భుతం దృష్ట్యా విస్మితః ప్రాభ్రవీన్మనుః. 9

అది క్షణమాత్రమున లక్షయోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్
యము చెంది ఇట్లు పలికెను.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ మదగ్ని మహాపురాణము - 6 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 2
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మత్స్యవతార వర్ణనము - 2 🌻

కో భవాన్ననువై విష్ణుర్నారయణ నమోస్తుతే | మాయయా మోహయసి మాం కిమర్థం త్వ జనార్దన. 10

"నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయచేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"

మనునోక్తో అబ్రవీన్మత్స్యో మనుం వై పాలనే రతమ్‌ | అవతీర్ణో భవాయాస్య జగతో దుష్టనష్టియే. 11

మన వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపచేయటకును అవతరించినాను".

సప్తమే దివసే త్వబ్ధిః ప్లావయిష్యతి వై జగత్‌ | ఉపస్థితాయాం నావి త్వం బీజాదీని విధాయ చ. 12

సప్తర్షిభిః పరివృతో నిశాం బ్రాహ్మీం చరిష్యసి | ఉపస్థితస్య మే శృఙ్గే నిబధ్నీహి మహాహినా. 13

"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".

ఇత్యుక్త్వాన్తర్దధే మత్స్యోమనుః కాలప్రతీక్షకః | స్థితః సముద్ర ఉద్వేలే నావమారురుహే తదా. 14

ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను.

ఏకశృఙ్గధరో మత్స్యో హైమో నియుతమోజనః | నావం బబన్ధ తచ్ఛఙ్గే మత్స్యాఖ్యం చ పురాణకమ్‌ . 15

శుశ్రావ మత్స్యాత్పపఘ్నం సంస్తువన్‌ స్తుతిభిశ్చ తమ్‌ |

ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.

బ్రహ్మవేద ప్రహర్తారం హయగ్రీవం చ దానవమ్‌. 16

అవధీద్వేదమన్త్రాద్యాన్పాలయామాస కేశవః | ప్రాప్తే కల్పేఅథ వారాహే కూర్మరూపోఅ భవద్దరిః. 17

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే మత్స్యావతారో నామ ద్వితీయోధ్యాయః.

కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.

అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీ
యాధ్యాయము సమాప్తము.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ మదగ్ని మహాపురాణము - 7 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 3
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కూర్మావతార వర్ణనము - 1 🌻

అథ కూర్మావతారవర్ణనమ్‌.

అగ్ని రువాచ :-

వక్ష్యే కూర్మావతారం చ సంశ్రుతం పాపనాశనమ్‌ | పురా దేవాసురే యుద్దే దైత్యైర్దేవాః పరాజితాః. 1

దుర్వాససశ్చ శాపేన నిశ్రీకాశ్చాభవంస్తదా | స్తుత్వా క్షిరాబ్దిగం విష్ణుమూచుః పాలయ చాసురాత్‌. 2

అగ్ని పలికెను: పాపములను తొలిగించు కూర్మావతారమునుగూర్చి మొదట నేను ప్రతిజ్ఞచేసినవిధమున చెప్పెదను. పూర్వము దేవాసురయుద్దములో దేవతలు దూర్వాసుని శాపముచే దైత్యుల చేతిలో ఓడిపోయిరి. అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీరహితులై పోయిరి. క్షీరాబ్ధిపై ఉన్న విష్ణువును స్తుతించి ''మమ్ములను అసురులనుండి రక్షింపుము'' అని వేడికొనిరి.

బ్రహ్మాదికాన్‌ హరిః ప్రాహ సన్దిం కుర్వన్తు చాసురైః | క్షీరాబ్దిమథనార్థం హి అమృతార్థం శ్రియే సురాః. 3

అరయోపిహి సంధేయాః సతి కార్యార్థగౌదవే | యుష్మానమృతభాజో హి కరిష్యామి న దానవాన్‌. 4

మన్థానం మన్దరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్‌ | క్షీరాబ్దిం మత్సాహాయేన నిర్మథధ్వమతన్ద్రతాః. 5

శ్రీ మహావిష్ణువు బహ్మాది దేవతలతో ఇట్లనెను: ''సురలారా! క్షీరాబ్దిని మథించి అమృతమును లక్ష్మిని సంపాదించుటకై అసురులతో సంధి చేసికొనుడు. పని విడినపుడు శత్రువులతో కూడ సంధి చేసి కొనవలెను గదా !

అమృతము మీకే తక్కునట్లును, దానవులకు తక్కకుండు నట్లును చేసెదను. మందర పర్వతమును కవ్వముగ చేసి, వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి, నా సాహాయ్యముతో క్షిరాబ్ధిని మధింపుడు. మాంద్యము వలదు.

విష్ణూక్తాః సంవిదం కృత్వా దైత్యైః క్షీరాబ్దిమాగతాః | తతో మథితుమారబ్ధా యతః పుచ్ఛం తతః సురాః. 6

విష్ణువు ఇట్లు పలుకగా దేవతలు దైత్యలతో ఒప్పందము చేసికొని క్షీరాబ్ధికి వచ్చి మథింప ప్రారంభించిరి. వాసుకి తోక వైపు దేవత లుండిరి.

ఫణినిశ్శ్వాసన న్తప్తా హరిణాప్యాయితాః సురాః | మథ్యమానే ర్ణవే సోద్రిదనాధారో హ్యపోవిశత్‌. 7

సర్పము విడచు నిట్టూర్పుల వేడికి బాధపడుచున్న దేవతలను హరి సేదదీర్చెను. సముద్రమును మథించు చుండగా ఆ పర్వతముక్రింద ఆధార మేదియు లేకపోవుటచే నీటిలో మునిగిపోయేను.

కూర్మరూపం సమాస్థాయ దధ్రే విష్ణుశ్చ మన్దరమ్‌ | క్షీరాబ్ధేర్మథ్యమానాచ్చ విషం హాలాహలం హ్యభూత్‌. 8

విష్ణువు కూర్మరూపమును ధరించి మందరపర్వతమును నిలబెట్టెను. మథింపబడుచున్న క్షీరాబ్ధినుండి హాలాహల విషము పుట్టెను.

హరేణ ధారితం కణ్ఠ నీలకణ్ఠస్తతోభవత్‌ | తతోభూద్వారుణీ దేవీ పారిజాతస్తు కౌస్తుభః. 9

గావశ్చాప్సరసో దివ్యా లక్ష్మీర్దేవీ హరిం గతా | పశ్యన్తః సర్వదేవాస్తాం స్తువన్తః సశ్రియో7భవన్‌. 10

శివుడు ఆ విషమును కంఠమునందు ధరించెను. అందుచే అతడు నీలకంఠు డయ్యెను. పిమ్మట వారుణీదేవియు (సురయు), పారిజాతము కౌస్తుభము, గోవుల , దివ్యలగు అప్సరసలు పుట్టిరి. లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును చేరినది. దేవత లందరును ఆమెను చూచుచు స్తోత్రము చేయుటచే శ్రీమంతులైరి.

తతో ధన్వన్తరిర్విష్ణురాయుర్వేద ప్రవర్తకః |బిభ్రత్కమణ్డలుం పూర్ణమమృతేన సముత్థితః. 11

పిమ్మట ఆయుర్వేదమును ప్రచారములోనికి తీసికొని వచ్చిన ధన్వంతరి రూపుడైన విష్ణువు అమృతపూర్ణ మగు కమండలువును చేత ధరించి ఆవిర్బవించెను.

అమృతం తత్కరాద్దైత్యాః సురేభ్యో7ర్ధం ప్రదాయ చ | గృహీత్వా జగ్ముర్జమ్భాద్యా విష్ణుః స్త్రీరూపధృక్తతః. 12

జంభుడు మొదలగు దైత్యులు ఆతని చేతినుండి అమృతమును గ్రహించి, సగము దేవతల కిచ్చి, వెళ్లిపోయిరి. పిమ్మట విష్ణువు స్త్రీరూపమును ధరించెను.

తాం దృష్ట్వా రూపసంపన్నాం దైత్యాః ప్రోచుర్విమోహితాః |

భవ భార్యామృతం గృహ్య పాయయాస్మాన్వరాననే. 13

మంచి సౌందర్యము గల ఆమెను చూచిన దైత్యులు మోహము చెంది, ''ఓ వరాననా ! మాకు భార్యవు కమ్ము; ఈ ఆమృతమును తీసికొని మాకు (త్రాగించుము) పంచిపెట్టుము'' అని పలికిరి.

తథేత్యుక్త్వా హరిస్తేభ్యో గృహీత్వా పాయయత్సురాన్‌ | చన్ద్రరూపధరో రాహుః పిబంశ్చార్కేన్దునార్పితః. 14

అట్లే అని పలికి హరి వారి చేతినుండి అమృతమును గ్రహంచి దేవతలచే త్రాగించెను. రాహువు చంద్రరూపమును ధరించి అమృతము త్రాగుచుండగా సూర్యచంద్రులాతనిని పట్టి చూపిరి.

హరిణాప్యరిణా చ్ఛిన్నం తదా రాహోః శిరః పృథక్‌ | కృపయామరతాం నీతం వరదం హరిమబ్రవీత్‌ 15

రాహుర్మత్తస్తు చన్ద్రార్కౌ ప్రాప్స్యేతే గ్రహణం గ్రహః |


తస్మిన్‌ కాలే తు యద్దానం దాస్యన్తే స్యాత్తదక్షయమ్‌. 16

అప్పుడు విష్ణువు రాహుశిరస్సును చక్రముచే ఖండించి వేరు చేసి దయతో దానికి మరణము లేకుండునట్లు చేసెను. రాహువు వరము నిచ్చు హరితో ఇట్లు పలికెను : '' చంద్రసూర్యులు నాచే పట్టుబడుచుందురు. అది గ్రహణ మగును. ఆ కాలమునందు ఇచ్చు దానము ఆక్షయ మగుగాక''.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 8 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 3
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కూర్మావతార వర్ణనము - 2 🌻

తథేత్యాహాథ తం విష్ణుస్తతః సర్త్వెః సహామర్తెః | స్త్రీరూపం సంపరిత్యజ్య హరేణోక్తః ప్రదర్శయ. 17

''అటులనే ఆగుగాక'' అని విష్ణువు ఆతనితో పలికెను. పిమ్మట స్త్రీరూపమును త్యజించి దేవతలతో కలిసి యుండగా శివుడు '' ఆ స్త్రీ రూపమును చూపుము'' అని హరితో అనెను.

దర్శయామాస రుద్రాయ స్త్రీరూపం భగవాన్‌ హరిః |

మాయయా మోహితః శమ్భుర్గౌరీం త్యక్త్వా స్త్రియం గతః. 18

భగవంతుడైన శ్రీమహావిష్ణువు రుద్రునకు స్త్రీరూపమును చూపెను. శివుడు విష్ణుమయచే మోహితుడై పార్వతిని విడచి ఆస్త్రీని వెంబడించెను.

నగ్న ఉన్మత్తరూపో భూత్‌ స్త్రీయః కేశానధారయత్‌ |

అగాద్విముచ్చ కేశాన్‌ స్త్రీ అన్వధావచ్చ తాం గతామ్‌. 19

శివుడు ఉన్మత్తుడై, దిగంబరుడై ఆమె కేశపాశమును పట్టుకొనెను. ఆమె జుట్టు విడిపించుకొని వెళ్లిపోయెను. ఇతడు ఆమె వెంట పరుగెత్తెను.

స్ఖలితం యత్ర వీర్యచం కౌ యత్ర యత్ర హరస్య హి | తత్ర తత్రాభవత్‌ క్షేత్రం లిఙ్గానాం కనకస్య చ. 20

ఈశ్వరుని వీర్యము స్ఖలితమై భూమిపై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్ర మయ్యెను.

మాయేయమితి తాం జ్ఞాత్వా స్వరూపస్థో భవద్దరః | శివమాహ హరీ రుద్రజితా మాయా త్వయా హి మే. 21

న జేతుమేనాం శక్తో మే త్వదృతే7న్యః పుమాన్‌ భువి |

ఇది యంతయు మాయ యని గ్రహించి శివుడు స్వస్థచిత్తుయెను. అపుడు విష్ణువు శివునితో ఇట్లనెను : '' రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈ లోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింపజాలరు. ''

ఆప్రాప్యాథామృతం దైత్యా దేవైర్యుద్ధే నిపాతితాః.

త్రిదివస్థాః సురాశ్చాసన్‌ దైత్యాః పాతాలవాసినః | యో నరః పఠతే దేవవిజయం త్రిదివం వ్రజేత్‌. 23

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కూర్మావతారోనామ తృతీయోధ్యయః.

అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్ధములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి. దైత్యులు పాతళలోకనివాసు లయిరి. ఈ దేవి విజయకథను పఠించువాడు స్వర్గమును పొందను.

ఆగ్నేయ మహా పురాణములో కూర్మావతార మనెడు తృతీయాధ్యయము సమాప్తము.

సశేషం.....

🌹 🌹  




శ్రీ మదగ్ని మహాపురాణము - 10 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 4
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. వరాహావతార వర్ణనము - 2 🌻

వక్ష్యే పరశురామస్య చావతారం శృణు ద్విజ | ఉద్ధతాన్‌ క్షత్రియాన్‌ మత్వా భూభార హరణాయ సః. 12

అవతీర్ణో హరిః శాన్త్యై దేవవిప్రాదిపాలకః | జమదగ్నే రేణుకాయాం భార్గవః శస్త్రపారగః. 13

ఓ బ్రాహ్మణా! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూబారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతిని నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్రవిద్యాపారంగతు డైన భార్గవుడుగా (పరశురాముడుగా) ఆవతరించినాడు.

దత్తాత్రేయప్రసాదేన కార్తవీర్యో నృపస్త్వభూత్‌ | సహస్రబాహుః సర్వోర్యీపతిః స మృగయాం గతః. 14

కార్తవీర్యుడను రాజు దత్తత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.

శ్రాన్తో నిన్త్రితో7రణ్య మునినా జమదగ్నినా | కామధేనుప్రభావేణ భోజితః సబలో నృపః. 15

అరణ్యములో అలసిన సేనానమేతు డైన ఆ రాజును జమదగ్ని మహర్షి నిమంత్రించి కామధేనవు ప్రభావముచేత భోజనము పెట్టెను.

అప్రార్థయత్కామధేను యదా స న దదౌ తదా | హృతవానథ రామేణ శిరశ్ఛిత్వా నిపాతితః. 16

యుద్ధే పరశునా రాజా సధేనుః స్వాశ్రమం య¸° |

కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. ఆపుడాతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్దములో పరశువుచే అతని శిరస్సు ఛేదించి సంహరించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను.

కార్తవీర్యస్య పుత్త్రెస్తు జమదగ్నిర్ని పాతితః.
రామే వనం గతే వైరాదథ రామః సమాగతః | 17

 పితరం నిహతం దృష్ట్వా పితృనాశాభిమర్షితః. 18

త్రిఃసప్తకృత్వః పృథివీం నిఃక్షత్రామకరోద్విభుః |
కురుక్షేత్రే పఞ్చకుణ్డాన్‌ కృత్వా సన్తర్ప్య వై పితౄన్‌.
కశ్యపాయ మహీం దత్వా మహేన్ద్రే పర్వతే స్థితః | 19

పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరమువలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతముపై నివసించెను.

కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనమ్‌ |
అవతారం చ రామస్య శ్రుత్వా యాతి దివం నరః. 20

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వరాహనృసింహాద్యవతారో నామ చతుర్థోధ్యాయః.

కూర్మ, వరాహ, నరసింహ, పరశురామావతారగథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును.

అగ్ని మహా పురాణములో వరాహనృసింహాద్యవతార మనెడు చతుర్థాధ్యాయము సమాప్తము.

సశేషం
......
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 11 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 5
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. రామావతార వర్ణనము 🌻

అథ పంచమోధ్యాయః.
అథ శ్రీ రామావతారవర్ణనమ్‌.

అగ్ని రువాచ :-

రామాయణమహం వక్ష్యే నారదేవనోదితం పురా| వాల్మీకయమే యథా తద్వత్పఠితం భుక్తిముక్తిదమ్‌. 1

అగ్ని పలికెను : దేనిని పఠించినచో భుక్తియు ముక్తియు లభించునో అట్టి రామాయణమును, నాదరుడు వాల్మీకి చెప్పన విధమున చెప్పెదను.

నారద ఉవాచ :-

విష్ణునాభ్యబ్జజో బ్రహ్మా మరీచిర్ర్బహ్మణః సుతః | మరీచేః కశ్యపన్తస్మాత్సూర్యో వైవస్వతో మనుః. 2

తత స్తస్మాత్తథేక్ష్వాకుస్తస్య వంశే కకుత్థ్సకః | కకుత్థ్సస్య రఘస్తస్మాదజో దశరథస్తతః. 3

విష్ణువు నాభియందలి పద్మమునుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి కశ్యపుడును, ఆతనికి సూర్యుడును, సూర్యునకు వై వస్వతమనువును అతనికి ఇక్ష్వాకువును పుట్టిరి. ఆతని వంశమునందు కకుత్థ్సడు పుట్టెను. కకుత్థ్సునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడును పుట్టెను.

రావణాదేర్వధార్థాయ చతుర్ధాభూత్స్వయం హరిః | రాజ్ఞో దశరథాద్రామః కౌసల్యాయాం బభూవ హ.
కై కేయ్యాం భరతః పుత్రః సుమిత్రాయాం చ లక్ష్మణః | 4

శత్రుఘ్నః ఋష్యశృఙ్గేణ తాసు నంద త్తపాయసాత్‌.
ప్రాశితాద్యజ్ఞసంసిద్ధాద్రామాద్యాశ్చ సమాః పితుః | 5

శ్రీమహావిష్ణువు రావణాదులను వధించుటకై తాను నాలుగు విధములుగా అయి దశరథమహారాజు వలన కౌసల్య యందు రాముడుగను, కై కేయియందు బరతుడుగను, సుమిత్రయందు లక్ష్మణశత్రుఘ్నలుగను జనించెను. బుష్యశృంగుని సాహాయ్యముచే యజ్ఞమునందు లభిలంచిన పాయసమును కౌసల్యాదుల కీయగా, వారు దానిని భూజింపగా, తండ్రితో సమానులైన రామాదులు జనించిరి.

యజ్ఞవిఘ్నవినాశాయ విశ్వామిత్రార్థితో నృపః.
రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినా సహ | 6

విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిఘ్నములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను.

రామో గతో7స్త్రశస్త్రాణి శిక్షితస్తాడకాన్తకృత్‌.
మారీచం మానవాస్త్రేణ మోహితం దూరతోనయత్‌ | 7

సుబాహుం యజ్ఞహన్తారం సబలం చావధీద్బలీ. 8

తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందను. మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను.

సిద్ధాశ్రమనివాసీ చ విశ్వామిత్రాదిభిః సహ | గతః క్రతుం మైథిలస్య ద్రష్టుం చాపం సహానుజః. 9

సిద్ధాశ్రమమునందు నివసించినవాడై, విశ్వామిత్రాదులతో కలిసి, లక్ష్మణ సమేతుడై, జనకుని యజ్ఞమును, ధనస్సును చూచుటకై వెళ్ళెను.

శతానన్దనిమిత్తేన విశ్వామిత్రప్రభావతః | రామాయ కథితే రాజ్ఞా స మునిః పూజితః క్రతౌ. 10

శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను.

ధనురాపూరయామాస లీలయా స బభజ్ఞ తత్‌ | వీర్యశుల్కాం చ జనకః సీతాం కన్యాం త్వయోనిజామ్‌. 11

దదౌ రామాయ రామో7పి పిత్రాదౌ హి సమాగతే | ఉపయేమే జానకీం తామూర్మిలాం లక్ష్మణ స్తథా. 12

శ్రుతకీర్తిం మాణ్డవీం చ కుశధ్వజసుతే తథా | జనకస్యానుజస్త్యెతే శత్రుఘ్నభరతావుభౌ.
కన్యే ద్వే ఉపయేమాతే - 13

రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, ఆమోనిజయు అగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణనుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రఘ్నులును వివాహమాడిరి.

జనకేన సుపూజితః |
రామోగాత్స వసిష్ఠాద్యైర్జామదగ్న్యం విజిత్య చ |
అయోధ్యాం భరతోప్యాగాత్సశత్రుఘ్నో యుధాజితః.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామాయణ బాలకాణ్డ వర్ణనం నామ పఞ్చమోధ్యాయః.

ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి ఆమోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.

అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పంచమాధ్యయము సమాప్తము.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹





🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 13 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అయోధ్యకాండ వర్ణనము - 2 🌻

ప్రోత్సాహితా కుబ్జయా సా అనర్థే చార్థదర్శినరీ | ఉవాచ సదుపాయం మే కచ్చిత్తం కారయిష్యతి. 
క్రోధాగారం ప్రవిష్టథ పతితా భువి మూర్ఛితా | 16

ఈ విధముగ ఆ కుబ్జచే ప్రోత్సహింపబడిన కై కేయి, అనర్థమును లాభకర మని భావించినదై ''ఈ మంచి ఉపాయము దశరథునిచేత ఆ పని చేయించునా ?'' అని పలికి కోప గృహమును ప్రవేశించి, మూర్ఛితురాలు వలె భూమిపై పడి యుండెను.

ద్విజాతీనర్చయిత్వాథ రాజా దశరథస్తదా. 17

దదర్శ కై కయిం రుష్టామువాచ కథమీదృశీ | రోగార్తా కం భయోద్విగ్నా కిమిచ్ఛసి కరోమి తత్‌. 18

యేన రామేణ హి వినా న జీవామి ముహూర్తకమ్‌ | శపామి తేన కుర్యాం వై వాఞ్ఛీతం తవ సున్దరి. 19

రాజు బ్రాహ్మణులను పూజించి, కోపించి ఉన్న కై కేయిని చూచి ఇట్లు పలికెను. '' ఇట్లున్నావేమి? రోగముతో బాదపడుచున్నావా ? భయపడినావా ? నీ కేమి కావలెను. చెప్పుము. అది చేసెదను. ఏ రాముడు లేకున్నచో ముహూర్తకాల మైనను జీవింపజాలనో ఆ రామునిపై ఒట్టుపెట్టుచున్నాను. ఓ సుందరీ ! నీ కోరికను నెరవేర్చెదను.''

సత్య బ్రూహీతి సోవాచ నృప మహ్యం దదాసి చేత్‌ |
వరద్వయం పూర్వదత్తం సత్యాత్తవ్వం దేహి మే నృప. 20

చతుర్దశ సమా రామో వనే వసతు సంమతః | సంబారై రేభిరద్యైవ భరతో త్రాభిషేచ్యతామ్‌. 
విషం పీత్వా మరిష్యామి దాస్యసి త్వం న చేన్నృఫ | 21

ఆమె పలికెను. ''ఓ రాజా ! సత్యము పలుకుము. నీవు ఇచ్చుటకు అంగీకరించెద వేని పూర్వము నా కిచ్చిన రెండు కరములను, సత్యమును పాలించుచు నాకిమ్ము. రాముడు పదునాలుగు సంవత్సరములు నియమవంతుడై వనమునందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంబారములతో భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను. ఈ వరముల నీయకున్నచో విషమ త్రాగి మరణించెదను.

తచ్ర్ఛుత్వా మూర్ఛితో భూమౌ వజ్రాహత ఇవాపతత్‌. 
ముహూర్తాచ్చేతనాం ప్రాప్య కై కేయి మిదమబ్రవీత్‌. 22

ఆ మాట విని, మూర్ఛితుడై, వజ్రముచే కొట్టబడినవాడు వలె భూమిపై పడెను. ముహూర్త కాలమున స్మృతి చెంది కై కేయితో ఇట్లనెను.

దశరథ ఉవాచ :

కిం కృతం తవ రామణ మయా వా పావనిశ్చయే.

యన్మామేవం బ్రవీషి త్వం సర్వలోకాప్రియం కరి | కేవలం త్వత్ర్పయం కృత్వా భవిష్యామి సునిన్దితః. 24

యా త్వం భార్యా కాలరాత్రిర్భరతో నేదృశః సుతః | ప్రశాధి విధవా రాజ్యం మృతే మయి గతే సుతే. 25

ఓ పాపనిశ్చయవంతురాలా ! నీకు రాముడు ఏమి అపకారము చేసినాడు ? నేనేమి చేసినాను ? సకల ప్రపంచకమునకును అప్రియమును ఆచరించుచు నీవు ఇట్లేల పలుకుచున్నావు ? కాలరాత్రి వంటి భార్య వైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడ నగుదును. భరతుడు ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యచమునకు వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవవై రాజ్యము నేలికొనుము.

సత్యపాశనిబద్ధ స్తు రామమాహూయ చాబ్రవీత్‌ | కై కేయ్యా వఞ్చీతో రామ రాజ్యం కురు నిగృహ్య మామ్‌. 
త్వయా వనే తు వస్తవ్యం కై కేయి భరతో నృపః | 26

సత్యపాశముచే బద్ధుడైన ఆతడు రాముని పిలచి ఇట్లు పలికెను. ''రామా ! నేను కై కేయిచే వంచింపబడితిని. నన్ను బంధించి రాజ్య మేలుము. నీవు వనములో నివసింపవలెను. కై కేయీ కుమారు డైన భరతుడు రాజు అగును. ''

పితరం చైవ కై కేయిం నమస్కృత్య ప్రదక్షిణమ్‌ . 27

కృత్వా నత్వా చ కౌసల్యాం సమాశ్వాస్య సలక్ష్మణః |
సీతయా భార్యయా సార్థం సరథః ససుమన్త్రకః. 28

దత్త్వా దానాని విప్రేభ్యో దీనానాథేభ్య ఏవ సః |
మాతృబిశ్చైవ విప్రాద్యైః శోకార్తైర్నిర్గతః పురాత్‌. 29

రాముడు తండ్రికిని, కై కేయికిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, కౌసల్యకు నమస్కరించి, ఓదార్చి, సీతాలక్ష్మణసమేతుడై, బ్రాహ్మణులకును, దీనులకును, అనాధులకును దానములు చేసి, సుమంత్రినతో కూడినవాడై, రథము నెక్కి శోకార్తులైన తల్లులతోను, బ్రాహ్మణాదులతోను కూడి పట్టణమునుండి బయలువెడలెను.

ఉషిత్వా తమసాతీరే దాత్రౌ పౌరాన్‌ విహాయ చ | ప్రభాతే తమపశ్యన్తోయోధ్యాం తే పునరాగతాః. 30

రాత్రి తమసా తీరమున నివసించి, పౌరులను విడచి వెళ్ళిపోయెను. ఆ పౌరులు ప్రాతఃకాలమున రాముని గానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 14 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అయోధ్యకాండ వర్ణనము - 3 🌻

రుదన్రాజాపి కౌసల్యాగృహమాగాత్సుదుఃఖితః | పౌరా జనాః స్త్రియః సర్వా రురుదూ రాజయోషితః. 31

మిక్కిలి దుంఖితు డైన దశరథమహారాజు ఏడ్చుచు కౌసల్యాగృహమునకు వెళ్ళెను. పౌరులును. స్త్రీలును, రాజస్త్రీలును ఏడ్చిరి.

రామో రథస్థశ్చీరాఢ్యః శృఙ్గబేరపురం య¸° | గుహేన పూజిత స్తత్ర ఇఙ్గదీమూలమాశ్రితః. 32

నారచీరలను ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా అచ్చట గుహుడు ఆతనిని పూజించెను. ఆచట రాముడు ఇంగుదీవృక్షమూలమున నివసించెను.

లక్ష్మణః సగుహో రాత్రౌ చక్రతుర్జాగరం హితౌ | సుమన్త్రం సరథం త్యక్త్వా ప్రాతర్నావాథ జాహ్నవీమ్‌.

రామలక్ష్మణసీతాశ్చ తీర్ణా ఆపుః ప్రయాగకమ్‌ | భరద్వాజం నమస్కృత్య చిత్రకూటం గిరిం యయుః. 34

లక్ష్మణుడును, గుహుడును ఆ రాత్రి యంతయు మేల్కొనియే యుండిరి. పిదప, సీతారామలక్ష్మణులు ప్రాతఃకాలమున నావచే జాహ్నవిని దాటి ప్రయాగ చేరిరి. భరద్వాజుని నమస్కనరించి చిత్రకూటపర్వతము చేరిరి.

వాస్తుపూజాం తతః కృత్వా స్థితా మన్దాకినీ తటే | సీతాయై దర్శయామాస చిత్రకూటం చ రాఘవః. 35

పిమ్మట వాస్తుపూజ చేసి, మన్దాకినీ నదీతీరమున నివసించిరి.ప రాముడు సీతకు చిత్రకూటపర్వతమును చూపెను.

నఖై ర్విదారయన్తం తాం కాకం తచ్చక్షురాక్షిపత్‌ | ఐషీకాస్త్రేణ శరణం ప్రాప్తో దేవాన్విహాయసః. 36

గోళ్ళచే సీతను గీరిన కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచి మరల రామునే శరణుజొచ్చినది.

రామే వనం గతే రాజా షష్ఠే7హ్ని నిశి చాబ్రవీత్‌ |
కౌసల్యాం స కథాం పౌర్వాం యదాజ్ఞానాద్దతః పురా. 37

కౌమారే సరయూతేరే యజ్ఞదత్తకుమారకః | శబ్దభేదాచ్చ కుమ్భేన శబ్దం కుర్వంశ్చ తత్పితా. 38

శశాప విలపన్మాత్రా శోకం కృత్వా రుదన్ముహుః | పుత్రం వినామరిష్యావస్త్వం చ శోకాన్మరిష్యసి. 39

పుత్రం వినా స్మరన్‌ శోకాత్‌ కౌసల్యే మరణం మమ | కథాముక్త్వాథ హా రామేత్యుక్త్వా రాజా దివం గతః.

రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. నేను కౌమారవయస్సులో ఉన్నప్పుడు సరయూ తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము చేయుచున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్ధవేధిని ఉపయోగించి చంపితిని. అతని తల్లిదండ్రులు చాల విలపించిరి. 

అతని తండ్రి ''మే మిరువురము పుత్ర శోకముతో మరణించుచన్నాము. నీవు కూడ పుత్రశోకముతో పుత్రుని స్మరించుచు మరణించెదవు '' అని నన్ను శపించెను. కౌసల్యా ! నా కీ విధముగ మణము రానున్నది. '' ఈ విధముగ కథను చెప్పి హా రామా! అని అనుచు రాజు స్వర్గము పొందెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీ మదగ్ని మహాపురాణము - 15 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అయోధ్యకాండ వర్ణనము - 4 🌻


సుప్తం మత్వాథ కౌసల్యా సుప్తా శోకార్తమేవ సా | సుప్రభాతే శయానం తం సూతమాగధబన్దినః. 41

ప్రబోధకా బోధయన్తి న చ బుధ్యత్యసౌ మృతం | కౌసల్య తం మృతం జ్ఞాత్వా హా హాతాస్మీతి చాబ్రవీత్‌.

అతడు శోకపీడితుడై నిద్రించినా డని తలచి కౌసల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధబందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినా డని గ్రహించి కౌసల్య ''అయ్యో! చచ్చితిని '' చచ్చితిని అనుచు ఏడ్చెను.

నరా నార్యో7థ రురుదురానీతో భరత స్తదా | వసిష్ఠాద్యైః సశత్రుఘ్నః శీఘ్రం రాజగృహాత్‌ పురీమ్‌. 43

పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి. వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా ఆయోధ్యకు రప్పించిరి.

దృష్ట్వా సశోకాం కైకేయీం నిన్దయామాస దుఃఖితః | అకీర్తిః పతితా మూర్థ్ని కౌసల్యాం స ప్రశస్య చ. 44

పితరం తైలద్రోణిస్థం సంస్కృత్య సరయూతటే | వసిష్ఠాద్యైర్జన్తెక్తో రాజ్యం కుర్వితి సో7 బ్రవీత్‌. 45

శోకముతో నిండిన ఆ నగరిని చూచి, దుఃఖితుడై, బరతుడు ''అపకీర్తి వచ్చి నెత్తిమీద పడినది కదా!'' అని కై కేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూనదీ తీరమున సంస్కారము చేసెను. ''రాజ్యము చేయుము' అని వసిష్ఠాదులు పలుకగా ఇట్లనెను.

వ్రజామి రామమానేతుం రామో రాజా మతో బలీ | శృఙ్గిబేరం ప్రయాగం చ బరద్వాజేన భోజితః. 46

నమస్కృత్వ భరధ్వాజం రామం లక్ష్మణమాగతః | పితా స్వర్గం గతో రామ అయోధ్యాయాం నృపో భవ.

అహం వనం ప్రయాస్యామి త్వదాదేశ ప్రతీక్షక ః | రామః శ్రుత్వా జలం దత్వా గృహీత్వా పాదకే వ్రజ. 48

రాజ్యయాహం న యాస్యామి సత్యాచ్చీరజటాధరః | రామోక్తో భరతశ్చాయాన్నన్దిగ్రామే స్థితో బలీ. 49

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామాయణ యోధ్యాకాణ్డ వర్ణనం నామ షష్ఠోధ్యాయః.

రాముని తీసికొని వచ్చుటకు వెళ్లెదను. బలశాలియైన రాముడే ఆందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు. శృంగి చేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగవెళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరెను. ''రామా! మన తండ్రిగారు స్వర్గస్థులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. 

నేను నీ ఆదేశమును ఎదురు చూచుచు వనమునకు వెళ్లెదను '' అని పలికెను. రాముడా మాటలు విని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ఇట్లనెను. ''నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. 

సత్యపాలనమునకై జటలను నార చీరలును ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.'' రాముడు ఈ విధముగా పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నందిగ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించెను.

ఆగ్ని మహాపురాణములో రామాయనకథలోని అయోధ్యాకాండ వర్ణన మను షష్ఠాధ్యాయము సమాప్తము.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹




శ్రీ మదగ్ని మహాపురాణము - 16 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 7
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అరణ్యకాండ వర్ణనము - 1 🌻

అథ అరణ్యకాణ్డ వర్ణనమ్‌.

నారద ఉవాచ :

రామో వసిష్ఠం మాతౄ శ్చ నత్వాత్రిం చ ప్రణమ్య చ | అనసూయాం చ తత్పత్నీం శరభఙ్గం సుతీక్‌ష్ణకమ్‌. 1

అగస్త్యభ్రాతరం నత్వా అగస్త్యం తత్రప్పసాదతః | ధనుః ఖడ్గం చ సంప్రాప్య దణ్డకారణ్యమాగతః. 2

రాముడు వసిష్ఠుని, తల్లులను నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటమునుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రిమహామునిని, ఆతని భార్య యైన అనసూయను, శరభంగుని, సుతీక్‌ష్ణని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. ఆగస్త్యుని అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.

జనస్థానే పఞ్చవట్యాం స్థితో గోదావరి తటే | తత్ర శూర్పణఖా యాతా భక్షితుం తాన్బయజ్కరీ. 3

రామం సూరపం దృష్ట్వా సా కామినీ వాక్యమబ్రవీత్‌ |

జనస్థానమునందు గోదావరీతీరమున, పంచవటిలో నివసించెను. భయంకరులా లైన శూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపము గల రాముని చూచి ఆమె కామమోహితురాలై ఇట్లు పలికెను.

శూర్పణఖోవాచ :

కస్త్వం కస్మాత్సమాయాతో భర్తా మే భవ చార్థితః. 4

ఏతౌ చ భక్షయిస్యామి ఇత్యుక్త్వా తం సముద్యతా | తస్యా నాసాం చ కర్ణౌచ రామోక్తో లక్ష్మణోచ్ఛినత్‌. 5

శూర్పణఖ ఇట్లు పలికెను. '' నీవు ఎవరవు ? ఎక్కడనుండి వచ్చినావు ? నేను కోరుచున్నాను. నాకు భర్త వగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. ఇట్లు పలికి ఆమె సీతాలక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను. అపుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసివేసెను.

రక్తం క్షర న్తీ ప్రయ¸° ఖరం భ్రాతరమబ్రవీత్‌ | మరిష్యామి వినా సాహం ఖర జీవామి వైతదా. 6

రామస్య భార్యా సీతాస్తి తస్యాసీల్లక్ష్మణో7నుజః | తేషాం యద్రుధిరం కోష్ణం సాయయిష్యసి మాం యది. 7

రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో ఇట్లనెనను. '' ఖరుడా ! ముక్కు లేని నేను మరణించెదను. కాని రాముని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు. నీవు వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను.

ఖర స్తథేతి తాముక్త్వా చతుర్దశసహస్రకైః | రక్షసాం దూషణనాగాద్యోద్ధుం త్రిశిరసా సహ. 8

రామం రామో7పి యుయుధే శ##రైర్వివ్యాధ రాక్షసాన్‌ | హస్త్యశ్వరథపాదాతబలం నిన్యే యమక్షయమ్‌. 9

త్రి శీర్షాణం ఖరం రౌద్రం యుధ్యన్తం చైవ దూషణమ్‌ |

అట్లే చేసెదను అని పలికి ఖరుడు పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ - త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళెను. రాముడు కూడ యుద్ధమునందు బాణములచే రాక్షసులను కొట్టి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిశిరన్కుని, భయంకరుడైన ఖరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపెను.

య¸° శూర్పణఖా లఙ్కాం రావణాగ్రే7పతద్భువి. 10

అబ్రవీద్రావణం క్రుద్ధా న త్వం రాజా చ రక్షకః | ఖరాది హన్తూరామస్య సీతాం భార్యాం హరస్వ చ. 11

రామలక్ష్మణరక్తస్య పానాజ్జీవామి నాన్యథా |

శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపై బడి, క్రుద్ధురాలై రావణునితో ఇట్లు పలికెను. ''నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. ఖరాదులను చంపిన రాముని భార్య యైన సీతను హరించి భార్యను చేసికొనుము. రామలక్ష్మణుల రక్తము త్రాగిన యడలనే జీవించెదను. అట్లు కానిచో జీవింపను.

తథేత్యాహ చ తచ్ర్ఛుత్వా మారీచం ప్రాహ చ వ్రజ. 12

స్వర్ణచిత్రమృగో భూత్వా రామలక్ష్మణ కర్షకః | సీతాగ్రే తాం హరిష్యామి అన్యథా మరణం తవ. 13

ఆ మాటలను విని రావణుడు ''అటులనే చేసెదను'' అని పలికి మారీచునితో ఇట్లు పలికెను. బంగారు చిత్రవర్ణమైన మృగ రూపము ధరించి, రామలక్ష్మణులను దూరముగా తీసికొను బోవువాడవై సీత ఎదుటకు వెళ్ళుము. నే నామెను హరించెదను. ఇట్లు చేయ కున్నచో నీకు మరణమే. ''

మారీచో రావణం ప్రాహ రామో మృత్యుర్దనుర్ధరః | రావణాదపి మర్తవ్యం రాఘవాదపి. 14

అవశ్యం యది మర్తవ్యం వరం రామో న రావణః | ఇతి మత్వా మృగో భూత్వా సీతాగ్రే వ్యచరన్ముహుః. 15

మారీచుడు రావణునితో ఇట్లు పలికెను (అనుకొనెను). ధనుర్దారియైన రాముడు సాక్షాత్తు మృత్యుదేవతయే. రావణుని చేతిలో నైనను మరణింపవలసినదే; రాముని చేతిలో నైనను మరణించవలసినదే. 

మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు. ఈ విధముగ తలచి, మృగరూపము ధరించి మాటిమాటికిని సీత ఎదుట సంచరించెను.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

17.🌻. అరణ్యకాండ వర్ణనము - 2 🌻

సీతయా ప్రేరితో రామః శ##రేణాథావధీచ్చతమ్‌ | మ్రియమాణో మృగః ప్రాహ హా సీతే లక్ష్మణతి చ. 16

సీతచే ప్రేరితుడైన రాముడు (కొంత దూరము దానిని వెంబడించి) బాణము చేత దానిని చంపెను. మరణించుచు ఆ మృగము హా సీతా! హా లక్ష్మణా! అని అరచెను.

సౌమిత్రిః సీతయోక్తో7థ విరుద్ధం రామమాగతః | రావణో7ప్యహత్సీతాం హత్వా గృధ్రం జటాయుషమ్‌.

పిమ్మట సీత ప్రేరేపింపగా లక్ష్మణుడు, తన కిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను రావణుడు జటాయువును చంపి సీతను హరించెను.

జటాయుషా న భిన్నాజ్గో అఙ్కేనాదాయ జానకీమ్‌ | గతో లఙ్కామశోకాఖ్యే దారయామాస చాబ్రవీత్‌. 18

జటాయువుచే చీల్చబడిన శరీరము గల ఆతడు జానకిని అంకముపై కూర్చుండ బెట్టుకొని తీసికొని పోయి లంకచేరి, ఆమెను అశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను.

రావణ ఉవాచ :

మమ భార్యా భవాగ్ర్యా త్వం రాక్షస్యో రక్ష్యతామియయ్‌ |

రామో హత్వా తు మారీచం దృష్ట్వా లక్ష్మణమబ్రవీత్‌.

రావణుడు పలికెను. ''నీవు నాకు ప్రముఖురాలైన భార్యవగుము''. ''ఓ రాక్షసస్త్రీలలారా! ఈమెను రక్షింపుడు.'' రాముడు మారీచుని చంపి, లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను.

శ్రీరామ ఉవాచ :

మాయామృగో7సౌ సౌమిత్రే యథా త్వామిమచాగతః | తథా సీతా హృతా నూనం నాపశ్యత్స గతో7థతామ్‌.

శ్రీ రాముడు పలికెను. ''లక్ష్మణా! అది మాయామృగము. నీవు కూడ వచ్చివేసినావు. అందుచే సీతను తప్పక అపహరించి యుందురు. '' పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడలేదు.

శుశోచ విలలాపార్తో మాం త్వక్త్వా క్వ గతాసి వై | లక్ష్మణాశ్వాసితో రామో మార్గయమాస జానకీమ్‌. 21

రాముడు దుఃఖించుచు ''నన్ను విడచి ఎక్కడికి పోతివి'' అని పలుకుచు దుఃఖార్తుడై విలపించెను. లక్ష్మణునిచే ఊరడింపబడి జానకిని అన్వేషించెను.

దృష్ట్వా జటాయుస్తం ప్రాహ రావణో హృతవాంశ్చ తామ్‌ | మృతో7థ సంస్కృతస్తేన కబన్దం చావధీత్తతః.

శాపముక్తో7బ్రవీద్రామం స త్వం సుగ్రీవమావ్రజ |

ఇత్యాది మహా పురాణ ఆగ్నేయే రామాయణ ఆరణ్యకాణ్డ వర్ణనం నామ సప్తమోధ్యాయః.

జటాయువు రాముని చూచి ''సీతను రావణుడు అపహరించెను'' అని చెప్పి ప్రాణములు విడచెను. రాముడు ఆతనికి అంత్య సంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహరించెను. ఆతడు శాపవిముక్తుడై ''సుగ్రీవుని వద్దకు వెళ్లుము'' అని రామునితో పలికెను.

అగ్ని మహాపురాణములోని రామాయణ కథలో ఆరణ్యకాండవర్ణన మనెడు సప్తమాధ్యాయము సమాప్తము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


18. 🌻. కిష్కిందా కాండ వర్ణనము  🌻

అథ కిష్కిన్ధాకాణ్డ వర్ణనమ్‌.
నారద ఉవాచ :

రామః పమ్పాసరో గత్వా శోచత్స శబరీం తతః | హనూమతాథ సుగ్రీవం నీతో మిత్రం చకార హ. 1

కిష్కన్ధాకాణ్డవర్ణనము. నారదుడు పలికెను. రాముడు పంపాసరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరివద్దకు వెళ్లెను. పిమ్మట హనుమంతడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రినిగ చేసికొనెను.

సప్త తాళాన్వినిర్భిద్య శరేణౖ కేన పశ్యతః | పాదేన దున్దుబేః కాయం చిక్షేవ దశయోజనమ్‌. 2

సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజనముల దూరము విసరెను.

తద్రిపుం వాలినం హత్వా భ్రాతరం వైరకారిణమ్‌ | కిష్కిన్ధాం కపిరాజ్యం చ రుమాం తారాం సమార్పయత్‌.
బుశ్యమూ కే హరీశాయ కిష్కిన్ధేశో బ్రవీత్స చ | సీతాం త్వం ప్రాప్స్యసే యద్వత్తథా రామ కరోమి తే. 4

ఆతని సోదరుడును, వైరము చేయుటచే శత్రవును ఆగు వాలిని చంపి ఋశ్యమూకముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానరరాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. సుగ్రీవుడు ఇట్లు పలికెను. ''రామా! నీకు సీత లభించు నట్లు చేసెదను.

తచ్ర్ఛుత్వా మాల్యవత్‌పృష్ఠే చాతుర్మాస్యం చకార సః |
కిష్కిన్ధాయాం చ సుగ్రీవో యదా నాయాతి దర్శనమ్‌. 5

తదా బ్రవీత్తం రామోక్తం లక్ష్మణో వ్రజ రాఘవమ్‌ | న స సఙ్కుచితః పన్థా యేన వాలీ హతో గతః. 6

సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలిపథమన్వగాః.

రాముడు ఆ మాటలు విని మాల్యవత్పర్వతముపై వర్షాకాలము నాలుగు మానములను గడపెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా లక్ష్మణుడ రాముడు చెప్పిన విధమున ఆతనితో ఇట్లు చెప్పెను. ''నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబడుము. వారి మార్గమును అనుసరించకుము''.

సుగ్రీవ ఆహ సంసక్తో గతం కాలం న బుద్దవాన్‌ | ఇత్యుక్త్వా స గతో రామం నత్వోవాచ హరీశ్వరః. 7

వానరాధిపతి యైన సుగ్రీవుడు ''కార్యాసక్తుడనైన నేను గడచిన కాలమును గుర్తించ జాలకపోతిని'' అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు పలికెను.

సుగ్రీవ ఉవాచ :

ఆనీతా వానరాః సర్వే సీతాయా శ్చ గవేషణ

త్వన్మతాత్ర్పేషయిష్యామి విచిన్వన్తు చ జానకీమ్‌ | పూర్వాదౌ మాసమాయాన్తు మాసాదూర్ధ్వం నిహన్మి తాన్‌. 9

సుగ్రీవుడు పలికెను: వానురరులనందరిని పిలిపించితిని. నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణమ నిమిత్తమై పంపగలను. వారు తూర్పుదిక్కు మొదలైన దిక్కులందు సీతను మానములోపున అన్వేషించవలెను. మాసము దాటినచో వారిని చంపెదను.

ఇత్యుక్తా వానరాః పూర్వపశ్చిమోత్తరమార్గగాః | జగ్మూ రామం ససుగ్రీవమపశ్యన్తస్తు జానకీమ్‌. 10

ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వానరులు తూర్పు-పశ్చిమము, ఉత్తరము వైపు వెళ్లి అచట సీతను గానక రామ సుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి.

రామాఙ్గులీయం సఙ్గృహ్యా హనుమాన్‌ వానరైః సహ | దక్షిణ మార్గయామాస సుప్రభాయా గుహాన్తికే. 11

హనుమంతుడు రాముని అంగుళీయకమును తీసికొని, వానరసమేతుడై దక్షిణ దిక్కునందు సుప్రభ గుహ సమీపమున అన్వేషించెను.

మాసాదూర్ధ్వం చ విన్ధ్యస్థా అపశ్యన్తస్తు జానకీమ్‌ | ఊచుర్వృథా మరిష్యామో జటాయుర్ధన్య ఏవ సః. 12

సీతార్థే యో త్యజత్ర్పాణాన్‌ రావణేన హతో రణే |

మాసము దాటిన తరువాత కూడ వింధ్యపర్వతమునందు ఉండి సీతను చూడజాలని ఆ వానరులు ఇట్లు అనుకొనిరి. ''మన మందరము వ్యర్థముగా మరణించనున్నాము. యుద్దమునందు రావణునిచే చంపబడి, సీత నిమత్తమై ప్రాణములు విడచిన ఆ జటాయువు ధన్యుడు కదా!''

తచ్ర్ఛుత్వా ప్రాహ సమ్పాతిర్విహాయ కపిభక్షణమ్‌. 13

భ్రతాసౌ మే జటాయుర్త్వె మయోడ్డీనో7ర్కమణ్డలమ్‌ | అర్కతాపాద్రక్షితో గాద్దగ్ధపక్షో హమభ్రగః. 14

రామవార్తాశ్రవాత్పక్షౌ జాతా భూయోథ జానకీమ్‌ | పశ్యామ్యశోకవనికాగతాం లఙ్కాగతాం కిల. 15

శతయోజనవిస్తీర్ణే లవణాబ్దౌ త్రికూటకే | జ్ఞాత్వా రామం ససుగ్రీవం వానరాః కథయన్తు వై. 16

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రామాయణే కిష్కిన్ధాకాణ్డ వర్ణనం

నామాష్టమోధ్యాయః.

ఆ మాటలు విని సంపాతి వానరులును భక్షించుట మాని ఇట్లు పలికెను. ఆ జటాయువు నాసోదరుడు , నాతో కలిసి సూర్య మండలము వైపు ఎగిరెను. అతనిని నేను సూర్యుని వేడవిమినుండి రక్షించగా భూమి పై పడెను. ఆకాశము పైనున్న నా రెక్కలు కాలిపోయినవి. 

రాముని కథ వినుటచే నా రెక్కలు మరల మొలచినవి. ఓ వానరులారా! శత యోజనవిస్తీర్ణమైన లవణ సముద్రమున,. త్రికూటపర్వతముపై నున్న లంకాపట్టణమునందు అశోకవనములో ఉన్న జానకి నాకు కనబడుచున్నది. ఈ విషయము తెలిసికొని రామసుగ్రీవులకు తెలుపుడు.

అగ్ని మహాపురాణమునందు రామాయణ కథలో కిష్కిన్దాకాండ వర్ణనమును అష్టమాధ్యమాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹