Tuesday 23 April 2019

ధరిత్రి' దినోత్సవం (22-04-2019)



ధరిత్రి' దినోత్సవం అంటే ఏమిటి?

ఏప్రిల్ '22' వ తేదీని 'ధరిత్రి' దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ దినం యొక్క నేపథ్యాన్ని, ఇది సాధకునికి ఎందుకు విశేషమైనదన్న విషయాన్ని వివరిస్తూ సద్గురు చెప్పిన ఓ కధను ఇక్కడ మీకు అందిస్తున్నాం .
ఏప్రిల్ '22' వ తేదీన ప్రపంచ 'ధరిత్రి' దినోత్సవం. ఈ సందర్భంగా ఈ దినం యొక్క నేపథ్యాన్ని, ఇది సాధకునికి ఎందుకు విశేషమైనదన్న విషయాన్ని వివరిస్తూ సద్గురు చెప్పిన ఓ కధను ఇక్కడ మీకు అందిస్తున్నాం .

1969వ సంవత్సరంలో అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని శాంటా బార్బరలో చమురు విస్పోటనం వల్ల జరిగిన విపరీతమైన నష్టాన్ని చూసిన తరువాత అమెరికా పార్లమెంట్ సభ్యుడు గేలార్డ్ నెల్సన్ (Gaylord Nelson) ఏప్రిల్ 22 వ తేదీని ధరిత్రి దినోత్సవంగా  ప్రకటించారు. తొలి ధరిత్రి దినోత్సవం United States Environmental Protection సంస్థ ఆవిర్భవానికీ,  పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ చట్టాల రూపకల్పనకూ దారి తీసింది.

ప్రతి సంవత్సరం దాదాపు ఒక నూరుకోట్ల మంది జరుపుకునే అతి పెద్ద వేడుకలలో ఈ ధరిత్రి దినోత్సవం ఒకటి. ఈ సంవత్సరం మనం జరుపుకునేది '45'వ ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఈ వారం మొత్తం, అలాగే ఏప్రిల్ 22వ తేదిన పర్యావరణ పరిరక్షణ పట్ల  సామాజిక స్పృహను,  స్పందనను పెంపొందించేందుకు ప్రపంచంలోని భిన్న జాతుల వారు, భిన్న విశ్వాసాలకు చెందిన వారు, భిన్న నేపధ్యం  కలిగిన వారు, అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులు,  కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ధరిత్రి దినోత్సవం రోజున మనం చేయగలిగిన పనులు

1) ఒక చెట్టు నాటడం

2) మనం సొంత నీటి సీసాను,కిరణా సంచిని మన వెంట తీసుకునిపోవటం

3) శాఖాహారిగా మారటం

4) స్థానికంగా పెరిగే కూరగాయలు కొనటం

5) 'ముద్రణ' (ప్రింటింగ్‌) ని  తగ్గించటం

6) మోటారు వాహనాలకు వాడకుండా నడవడం, సైకిల్ తొక్కడం

7) ప్రతి రోజునీ ధరిత్రి దినోత్సవంగానే భావించి, పై వాటిని పాటించడం

మానవ చైతన్యం(Consciousness), పర్యావరణ పరిరక్షణల గురించి సద్గురు

ఆద్యాత్మిక పథంలో ఉన్నవారు ప్రతి దాని గురించి ఎరుక(అవేర్‌నెస్)తో ఉండటం ఎంత ముఖ్యమో సద్గురు ఈ కథలో వివరించారు.

ఓ జెన్ గురువుకి సంబంధించిన ఒక అందమైన కథ ఉంది. ఆసియా ఖండంలో ప్రజలు సాధారణంగా  చన్నీటి స్నానం చేస్తారు. ఎప్పుడో ఒకసారి వేడి నీటితో స్నానం చేస్తారు.  అలా వేడి నీటితో స్నానం చేసేటప్పుడు కుర్చీపై  కూర్చొని ఒంటిని నూనెతో బాగా మర్దన చేయించుకుంటారు. దీనికి ఒకరిద్దరి సహాయం అవసరమౌతుంది.

ఇటువంటి పనినే ఒక ఇద్దరు శిష్యులు ఆ జెన్ గురువు గారికి చేసారు. స్నానం అయిపోయిన తరువాత మిగిలిపోయిన నీటిని ఆ శిష్యులు పారబోసారు. అది చూసిన ఆ జెన్ గురువు  ఆ నీటిని ఎందుకు పారబోసారని ప్రశ్నిస్తూ ఒక కర్రతో వారిద్దరిని దండించారు.

అప్పుడు ఆ శిష్యులు, "కొంచెం నీరే కదా ? మీరెందుకు గొడవ చేస్తున్నారు?" అని అడిగారు.

ఆ గురువు గారు “ఆ కొంచెం నీటిని ఒక చెట్టుకి పోయవచ్చు కదా” అని బదులిచ్చారు. “మీరు పోయమంటే మేము చెట్లకి నీరు పోసేవాళ్ళం కదా. ఆ కొంచెం నీటితో మునిగేదేముంది?" అని ఆ శిష్యులు ప్రశ్నించారు. అప్పుడు ఆ గురువు గారు “విషయం ఏమిటంటే  మీరు నడిచే భూమి, పీల్చే గాలి, త్రాగే నీరు అన్ని జీవాన్ని రూపొందించే పదార్దాలు. మీరు ఎప్పుడూ కూడా మీ చిన్న వేలుని, 'ఇది చిన్నవేలే కదా' అని విరిచి పారవేయలాని అనుకోరు. మీరు నిజంగా అన్నిటిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనుకుంటే(include చేసుకోవాలనుకుంటే) మీరు అన్నిటిని సమదృష్టితో చూడటం నేర్చుకోవాలి. ఇందుకు చైతన్యాన్ని(consciousness) పెంపొందించుకోవాలి. అది చాలా ముఖ్యం” అని సెలవిచ్చారు

ఇది లైట్‌ని ఆర్పటం, వేయటం గురించి కాదు. నీటిని, ఆహారాన్ని  పరిరక్షించటం గురించి కాదు. చేతనతో  జీవించటం ఎంత ముఖ్యమో తెలుసుకోవడం గురించి. మీ చుట్టూ ఏమి ఉన్నా, అది ఫ్యాన్ అయినా, బల్బ్ అయినా, ఏదైనా ఎరుకతో ఉపయోగించండి. ఎరుకతో ఉండడం మీకు ముఖ్యం. అంతేకానీ కరెంటు, ఫ్యాన్‌లకు కాదు.


Sunday 7 April 2019



ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

మదిలో మెదిలే స్వప్నమా
కలలో కదిలే మేఘమా
కథలో మెదిలే మోనమా
కళలే తెలిపే కాలమా

గానానికి మరిచే హృదయమా
శబ్ధానికి చెదిరే నిశ్శబ్దమా
గాయానికి మెరిసే ఔషధమా
ప్రాయానికి వలపే ప్రణయమా

తరుణానికి మనసే మందిరమా
వినయానికి వయసే కారణమా
ప్రళయానికి ప్రెయసే లోలకమా

తరించటానికి తపమే మూలమా
లోభించటానికి ధనమే మూలమా
శాశించటానికి ప్రేమయే మూలమా
ఆరోగ్యానికి దైవమే మూలమా


ఋణానుబంధమైనవారే తల్లిదండ్రులైనా , సంతానమైనా .

*ఋణానుబంధం*

ఒక యోగి ఒక్కనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి, మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో
అతని ఇంట పుత్రుడై, జన్మిస్తాడు.

రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు.

జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు.

ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు.

వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి.

వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు.

నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.

పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

పెద్దయ్యాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు.

రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు.

అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో.....

అనే అర్ధంలో ఇస్తాడు.
దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు.

ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు.

ప్రతి జాముకీ ఇలాంటి హితవు ఒకటి చెబుతుండేవాడు..

రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.

మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.

పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.

అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.

వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.
తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1*. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు.
కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర గృహ లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?


స్వస్తి.....

Friday 5 April 2019

శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ?



శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ? (1)

గమనిక : కొంత మంది మిత్రులు వారి విజ్ఞత మేరకు రామాయణం లో కూడా మానవత్వ రహిత చర్యలు , వర్ణ వర్గ విబేధాలు వుండినవి అన్న అభిప్రాయం వెలిబుస్తుండటం చూసి , నొచ్చుకుని , నా మాటలు కొన్ని వారి ముందు ఉంచుతున్నాను. 
_/\_






శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ?

శ్రీ రామునికి ఏనాడూ తాను విష్ణువు యొక్క అవతారమని తెలియదు. తాను దైవాంశ సంభూతుడనని యే నాడు చెప్పుకోలేదు.

కేవలం ఒక మానవ జన్మ నెత్తిన పురుషుడు సత్యం న్యాయం ధర్మం పాటిస్తూ జీవితం ఎలా జీవించాలి అన్న దానికి ప్రతీకగా, ఉపమానం గా నిలిచి పోయాడు , ఈ వసుధ మీద అడుగు బెట్టిన ప్రతి ఒక్క మానవునకు. నిజం ఒప్పుకోవాలి అంటే, వీరి చరిత్రకు దగ్గరగా వుండేది ఒక్క జీసస్ క్రీస్తు చరిత్ర మాత్రమే.

శ్రీ రాముడిని , ఒక్క మాట లో వర్ణించాలి అంటే చెప్పినది, " రామో విగ్రహాన్ ధర్మః " .
మామూలు వాడుక భాషలో చెప్పాలి అంటే , ధర్మము అన్న పదానికి ఒక రూపం అంటూ ఇస్తే అది రాముని రూపం లా వుంటుంది అని.

అయితే , కాల మాన పరిస్థితుల బట్టి ధర్మం , న్యాయం అన్న వాటి కొలమానం కొద్దిగా మార వచ్చు. ఇది సమాజ సహజ గుణం.

ఉదాహరణకు , దశరథ మహారాజు గారికి ముగ్గురు పత్నులు. అంటే ఆ రోజుల్లో వున్న సమాజం లో బహుభార్యలు వుండటం నేరం కాదు. దానికి కారణం , స్త్రీ జనాభా యెక్కువ గా వుండి, పురుష జనాభా తక్కువ గా వుండటం కావచ్చు. నేటికీ , ఆధునిక సమాజాలు కొన్నిటి లో ఇది నేరం కాదు గదా. నిజాం గారికి , మైసూర్ మహారాజా గారికి ఇలా కొందరు 300 పైచిలుకు భార్యలు వున్న వారిని మనం చూశాం. అలాగే తరువాతి యుగం లో ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండటమూ మనం ఎరిగిన విషయమే. ఏదో దుర్యోధనుడు, " పాంచాలీ , పంచ భర్త్రుకా ," అని స్వగతం లో సంబోధించి నట్లు చదివాము కానీ , ఆ నాటి సమాజం దీనిని నిందించినట్లు ఎక్కడా లేదు. అలాగే పరుల వల్ల సంతానం పొందటం కూడా, తప్పు కాదు.

ఇవన్నీ ఇక్కడ ఉదహరించడం కేవలం , ధర్మము , సామాజిక న్యాయము అన్నవి కాల మాన పరిస్థితుల బట్టి , కొద్దిగా రూపాంతరం చెందుతూ వుంటాయి అని వక్కాణించడం కోసమే.

శ్రీరాముడు , తన జన్మ కాలంలో వున్న ఋజు వర్తనను , ఇంకా మెరుగు పరిచి చూపించాడు. దీనికి తార్కాణం, ఏక పత్నీ వ్రతం , పశు పక్ష్యాదుల మీద, ఆఖరికి పశ్చాతాపం పొందిన రాక్షస జాతికి శిక్ష నివ్వక , శరణు ఇవ్వటం లాంటివి.

విమర్శ చేసే వారు, కేవలం ఆ దృష్టి తో చూస్తూ వుంటే చాలా ఉదాహరణలు కనిపించ వచ్చు. విమర్శకు ముందు, నాటి సమాజ పరిస్థితి, మనుగడ , ప్రవృత్తి , సత్య న్యాయ ధర్మాల కొలమానాలు బేరీజు వేసుకుంటూ పోతే , విమర్శకు అసలు తావు వుండక పోవచ్చు .

కాక పొతే కొందరు కేవలం రంగుటద్దాలతో మాత్రం చూడటం అలవరుచుకుని , అదే రంగు ఆపాదించడం జరుగుతున్నది, ఎక్కువగా నేటి రోజుల్లో...

ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇవ్వ వచ్చు , మద్యం మత్తులో ఒక చాకిలి వాడు పలికిన మాటకు మానవ చరిత్రలో నేటి దాకా యే రాజ్యాధి నేతా విలువ ఇవ్వలేదు ... దీనికీ , విమర్శా వాదులు, స్త్రీ కి అన్యాయం చేశాడు అంటూ మొదలు పెడ్తారు. రాజ్యాధినేతకు మచ్చ వుండకూడదు అన్న నియమం పాటిస్తూ , ఆ రాజు గారి భార్యకు కూడా ధర్మ పాలనలో భాగం వుంటుంది అని చెప్తూ , స్వార్థాన్ని , సుఖాన్ని త్యాగం చేయటం , ఈ విమర్శకుల దృష్టి కి రాదు.

ఇహ రాక్షస జాతి ద్రావిడులు , ఆర్యులు అంటూ నేటి అభ్యుదయ వాదుల వాదన. నేడు వచ్చిన ఆర్యులు , ద్రావిడులు అన్న బేధం ఆ రోజుల్లో ఎక్కడా వున్నట్లు లేదు, యే చరిత్ర లోనూ. దశరధుల వారు కొన్ని వేల సంవత్సరాల రాజ్యం చేశారట , మరి వారి వంశ పూర్వజులు...అంటే కనీసం వేల సంవత్సరాల మాట అన్న మాట నే గదా. అంత కాలం లో ఆర్యులు , ద్రావిడులు అన్న బేధం సమసిపోకుండా వుంటుందా ?
ఈ నాటికీ , ఎవరైనా ఒక అఘాయిత్యపు పని చేస్తే , రాక్షస చర్య అని మనం వర్ణించటం లేదూ ? అంటే ద్రావిడులు ఆర్యుల మీద దాడి చేసినట్లా ?

( సశేషం )

శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ? (2)
గమనిక : కొంత మంది మిత్రులు వారి విజ్ఞత మేరకు రామాయణం లో కూడా మానవత్వ రహిత చర్యలు , వర్ణ వర్గ విబేధాలు వుండినవి అన్న అభిప్రాయం వెలిబుస్తుండటం చూసి , నొచ్చుకుని , నా మాటలు కొన్ని వారి ముందు ఉంచుతున్నాను. 
_/\__

రాముడు మనూవాది !!!!
కులబేధం పాటించాడు !!!!
అన్న మాటకు..

నమ్మకం : ముందుగా మనిషి ఎంత విజ్ఞాన ఖనుడు అయినా, తనకి తెలియని విషయాలు, తను తన జీవితకాలం లో తెలుసుకోలేని విషయాలు ఈ విశ్వం లో చాలా వున్నాయి అన్నది గుర్తుంచుకుని , దానిని బట్టి అభిప్రాయాలు ఏర్పరుచుకునే అప్పుడు తగు జాగ్రత్త వహించాలి. అంటే కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మాలి. జన్మ ఇచ్చిన తల్లి ఒక పురుషుడిని చూపించి ఇతను నీ నాన్న అంటే నమ్మినట్లు. డీ యన్ ఏ పరీక్ష చేయించి గానీ నమ్మను నేను అని ఎంత మంది అంటారు ?

ఓ రెండు మూడు రోజుల క్రింద వార్తా పత్రికల లో వచ్చిన వార్త ఒకటి ఉదహరిస్తాను. విదేశాలలో ఒక స్త్రీ కి కవలలు అయిన ఇద్దరు పురుషులతో శారీరక సంబంధం వుండింది. ఒక రోజు ఆమె గర్భం దాల్చి కొడుకు పుట్టాడు. తరువాత వారితో ఆమె కు బెడిసింది. ఇప్పుడు ఆ కలిగిన కొడుకుకి తండ్రి మైంటేనన్స్ ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళింది. అయితే ఆ ఇద్దరిలో తండ్రి ఎవరూ అని నిర్ధారించు కోవడానికి డీ యన్ ఏ పరీక్ష చేయించారు..కవలలు కాబట్టి ఇద్దరి డీ యన్ ఏ ఒకటే విధం గా వుండి , తండ్రి ఎవరో తేల లేదు. చివరికి కోర్టు ఆ ఇద్దరూ ఇవ్వాలి అని తీర్పు ఇచ్చింది.
అంటే , శాస్త్రానికి కూడా అంతుబట్టని విషయాలు ఉన్నట్లేగా..
ఇంకో ఉదాహరణ , అంతరిక్ష శాస్త్రం , టెలిస్కోప్ లు, పెరిస్కోపులు , ఇవన్నీ రాక ముందే భారతీయులు ఏ పరికరం యొక్క సహాయం లేకుండా , భూమి కి సూర్యుడి కీ వున్నదూరం 4 కిలో మీటర్ల వ్యత్యాసం తో చెప్పారు . ఎలా సాధ్యం అయింది ?

ఆ రోజుల్లో ఈ రోజు లలో వున్న అతి సందేహ పీడితులు లేరు కాబట్టి , యెట్లా చెప్పారు అని అడగలేదు.

ప్రతి దానికీ శాస్త్రీయ రుజువు అడిగే వారు ఈ విషయాలను గమనించాలి.

పోనీ శాస్త్రీయం గానే అనుకున్నా , నాసా వారు ఉపగ్రహాల ద్వారా పరిశోధన చేసి , రామసేతు వారధి వుందని, మహా భారత కథ క్రీస్తుపూర్వం మూడు వేల పైచిలుకు సంవత్సరాల క్రిందట జరిగింది అని చెప్తున్నారు .
ఇది కూడా నమ్మము అంటే ...తివిరి ఇసుమున ...అన్న పద్యం జ్ఞాపకం చేసుకో వలసి వస్తుంది.

ఇటీవలే ఫేస్బుక్ లో ఒక జోకు చదివాను. అవటానికి జోకు అయినా , ఆలోచించాల్సిన విషయం అందులో వుంది.

" ఒక విద్యార్థి మాస్టారును అడుగుతాడు...ఆర్యభట్టు సున్నాను కనుగుంటే , ఆర్యభట్టు కలికాలం లో పుట్టాడు కాబట్టి, ద్వాపర త్రేతా యుగం లో పది, వంద అన్న సంఖ్యలు యెట్లా లెక్కబెట్టారు ,అని.."

ఆలోచిస్తే , శివునికి మూడు కళ్ళు , సహస్ర నామాలు , నాలుగు చేతులు ఇత్యాది ఎప్పడి నుంచో వున్నాయి లెక్కలో కాబట్టి , మిగతా ప్రపంచానికి నేటి సంఖ్యా శాస్త్రం భారతీయులు అందించిందే కదా అన్నది గ్రహించ వచ్చు.

వెరసి , ప్రశ్నించే ముందు , నమ్మకం వుండాలి. ప్రశ్నించే వారు వారి విజ్ఞత పరిధి ఎంతో ఎరిగిన వారు అయి వుండాలి.

అప్పుడే వారి ప్రశ్నల్లో తార్కిక ఆలోచన ప్రతిబింబిస్తుంది , ఒట్టి మూర్ఖత్వం కన్నా...

మనువు , మనువాదం :

మనువు చతుర్ వర్ణాలను సిద్ధాంతీ కరించింది యాదార్ధమే..అయితే ఈ వర్ణాలు వృత్తిని బట్టి విభజీకరించినవి.

దానికి చిలువలు , పలువలు కలిపి , అంటరానితనం , ఆనగదొక్కటం చేసింది మనువు కాదు.

మనువే చేసి వుంటే , రాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళను తినే వాడు కాదు. అలాగే తనను పడవ లో నదిని దాటించిన భద్రుడిని కావలించు కుని కృతజ్ఞతలు తెలిపే వాడు కాదు. తను తెగటార్చిన రాక్షసుల అంత్యక్రియలు చేసే వాడు కాదు. చివరికి , రావణుడు వధింప బడిన తరువాత విభీషణుడు ని అన్న అంత్యక్రియలు చేయ మని చెప్పి, అతను సంశయిస్తూ వుంటే , నీవు చేయక పోతే నేను చేస్తాను అని చెప్పేవాడు కాదు.
అలాగే శ్రీకృష్ణుడు యాదవ కులం లో పెరిగే వాడా ? విదురుని ఆతిథ్యం స్వీకరించే వాడా ?
అంతకు ముందు వామనావతారం లో బలి చక్రవర్తిని నాశం చేసినాక కూడా అనుగ్రహించే వాడా ?
గోవర్ధన పర్వతానికి పూజలు చేయించింది ఎవరు , దేవేంద్రుడికి గాక ? వరాహ అవతారం ఎత్తింది ఎవరు ?

అంటే అనాది హిందూ ధర్మం లో ఈ అంటరానితనం అవీ లేవు. కుల విబేధాలు కూడా లేవు.

తరువాతి అగ్రకులాల వారు , వారి ఆధిక్యత నిలుపుకోవడానికి, ఏర్పరిచిన విభేదాలు మాత్రమే . ( ఈ మాట నేను అంటే కొందరు అగ్రకులాల వారికి కూడా నేను చెడ్డవాడినే అవుతాను అని తెలుసు నాకు. )
సత్యము ఏనాటికి అయినా సత్యమే... వకుళా దేవి, గోదాదేవి , బీబీ నాంచారమ్మ , సతీ సక్కుబాయి , మీరా , తూకారం , తులసీదాస్ , కబీర్...ఇంకా చాలామంది...వీరి కులాలు చెప్పండి ఎవరైనా...వీరి కన్నా యే అగ్రకులపు మనిషి ఉన్నతులు ?

దానిని సరిచేయటానికే, ఆది శివుడు అంతటి వాడు, అహం బ్రహ్మాస్మి అని చాటిన ఆది శంకరులకు కనువిప్పు గావిస్తారు...

వీటన్నిటి ఆధారం తో...ఘంటాపథంగా ఒక్కటి చెప్పవచ్చు..

కులాల మధ్య తేడాలు వచ్చింది , మనూవాదం తో కాదు...భగవంతుడి వల్ల కాదు..

కాబట్టి , రాముడిని మనూవాది అని అనే వారు ముందర , కొద్దిగా తమలో తాము తర్కించు కుంటే , ఇటువంటి తప్పు ఇంకోసారి చేయరు , ......
ఆధారం లేని నింద వేయరు....

( సశేషం )

శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు ? (3)

గమనిక : కొంత మంది మిత్రులు వారి విజ్ఞత మేరకు రామాయణం లో కూడా మానవత్వ రహిత చర్యలు , వర్ణ వర్గ విబేధాలు వుండినవి అన్న అభిప్రాయం వెలిబుస్తుండటం చూసి , నొచ్చుకుని , నా మాటలు కొన్ని వారి ముందు ఉంచుతున్నాను.

_/\__

రాముడు ధర్మం పాటించ లేదు !!! సీతమ్మ పట్ల అన్యాయం చేశాడు !!!

అతి కొద్ది మంది మాత్రం అనే మాట ఇది. కొద్ది మందే అయినా , నాకు తెలిసిన రామ చరితతో , వున్న కొద్ది పాటి వివేకం తో కొన్ని వాదనలు తమ ముందుకు, ఆలోచిస్తారు అన్న నమ్మకం తో... తమరూ విజ్ఞులు , ఒక భావానికి మూఢత్వపు బానిసలు కారు అన్న ఆశ తో....

రాముని ధర్మ నిరతి కి ఒక ఉదాహరణ , మొత్తం రామాయణం లో , తాను అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అల్లా , ముందుగా కైకేయి , తరువాత సుమిత్ర , చివరికి కౌసల్య వద్దకు వెళ్లి వందనం చేసి కుశలం కనుక్కుని ఆశ్వీర్వాదం తీసుకోవటం..ఇక్కడ నిరూపింప బడేది తన వారు , పరాయి వారు అన్న వ్యత్యాసం చూపక పోవటం. అంతే కాక తనవారి కన్నా బయటి వారికి ప్రాధాన్యత ఇవ్వటం..నేటి రాజకీయ కుటుంబాలకు సమర్థత ఇచ్చేవారు ఇది గమనించాలి.

తనకు పట్టాభిషేకం కాకుండా ఆపిన , కైకేయి మీద, మందర మీద ఏనాడూ ఒక చిన్న మాట అన్నట్లు వాల్మీకి రామాయణం లో ఎక్కడా లేదు. పైగా వారి దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు అనే వుంది.

ఆ రోజున అయినా , నేటికీ అయినా , వివాహేతర సంబంధాన్ని సమాజం గౌరవం గా చూడదు అని అందరూ ఒప్పుకునే మాటే.

అట్లాంటిది , అన్ని వేల సంవత్సరాల క్రిందట , అహల్యకు శాప విమోచనం కలిగించటం చిన్న విషయం కాదు. రాముడి క్షమా గుణానికి, దయా గుణానికి పెద్ద నిదర్శనం ఇది.

అలాగే , రాక్షస స్త్రీల పట్ల కూడా , యే మాత్రం కఠోరత లేకుండా ప్రవర్తించటం. తాటకి తో కూడా నేను స్త్రీలతో యుద్ధం చేయను అని చెప్పటం , శూర్పణఖ తో నూ అనుచితంగా వ్యవహరించి నట్లు వాల్మీకి రామాయణం లో లేదు. ఆమె శ్రుతి మించి ప్రవర్తిస్తూ వుంటే శిక్షించిన వాడు లక్ష్మణుడు కానీ , రాముడు కాదు.

రాముడికి అందరికన్నా పెద్ద శత్రువు రావణుడు కదా,

నిర్వివాదంగా. మరి అటువంటి రావణుని కూడా క్షమిస్తాను అన్న మాట అనగలిగిన వాడు రాముడు. సరే యుద్ధం జరిగి , రావణ వధ అయినాక , మండోదరి తో రాముడు రావణుడి గురించి ఒక్క పరుష మాట అనలేదు , సరికదా , అతని అంత్యక్రియలు విభీషణుని తో జరిపించాడు.

అయోధ్యకు తిరిగి వచ్చినాక కూడా , కౌసల్య మాత అడిగితే, సాటి లేని శివ భక్తుడు తన అహం కారణం చేత వధింపబడ్డాడు అని చెప్తాడు కానీ , నా వల్ల చంప బడ్డాడు అని చెప్పడు...

దీనినే హ్యూమిలిటి ,

హాంబల్నెస్ కు పరాకాష్టగా భావిస్తే అతిశయోక్తి కాదు....

మనకు తెలిసిన మానవ చరిత్రలో ఇంత హంబల్ గా వున్న ఇంకొక వ్యక్తి జీసస్ మాత్రమే...గౌతమ బుద్ధుడు , మహావీర్ జైన్ ఉత్తమ పురుషులే కానీ , వారు వీరిరువురు పడ్డ కష్టాలను ఏనాడూ పడలేదు , యే పరీక్షను ఎదుర్కోలేదు.

ఇహ పోతే వాలి వధ.... దేవుడు కావల్సినంత వ్యవధి ఇస్తాడు , అయితే తప్పు గ్రహించి బాగు చేసుకోవడానికి కానీ , లేక తన చేతితో తన మరణం తెచ్చుకోవడానికి కానీ. అహంకార భరిత , స్వార్ధపు కోరికలతో యే తపస్సు , యే ప్రార్థన , యే పూజ చేసినా , దేవుడు కనికరించి వరం ఇచ్చినా , చివరి ఫలితం మాత్రం విషపు గుళిక గానే వుంటుంది. అదే రావణుడి విషయం లో కానీ , వాలి విషయం లో కానీ జరిగింది.

రావణుడు అహం తో వరం కోరినప్పుడు మానవ , వానరాలను చేర్చ లేదు. వారి కారణం గా నే నాశనం అయ్యాడు.

వాలీ అంతే...నా ముందు ఎవరు నుంచున్నా వారి బలం నాకు రావాలి , వారు నా చే ఓడింపబడాలి అని వరం పొంది, నీతి న్యాయం ధర్మం లేక పొగరుతో చరించాడు, అందుకే చెట్టు చాటు నుంచి చంపబడ్డాడు . వాల్మీకి రామాయణం ఆధారంగా తీసుకుంటే.....దృష్టి లోపం వున్న ఇతరులవి కాదు ...వాలి కూడా చనిపోయే ముందు రాముడి ధర్మ నిరతిని మెచ్చుకుంటాడు..శిక్ష పొందిన వాడు , శిక్ష న్యాయపరంగా వుంది అని ఒప్పుకున్నా , నేటి మన సంస్కారం విజ్ఞత ఆ శిక్షను ప్రశ్నించటం హాస్యాస్పదం.

చివరి గా సీతమ్మ వారిని అడవికి పంపటం....

ఆహా...ఆ అమ్మ వారికి లేని న్యాయ సందేహం , మన నేటి విజ్ఞులకు కలుగుతుంది , మానవత కాదని విమర్శ....

ప్రామాణికం....వాల్మీకి రామాయణం మాత్రమే...యే శ్లోకం లో కానీ ఆమె రాముని ధర్మ నిరతి ని ప్రశ్నించిందా , నిందించిందా ? లేదు...

ఒక పరిపాలించే ప్రభువుకు , తన పర బేధం వుండకూడదు , చిన్న పెద్ద అన్న తారతమ్యం వుండకూడదు , రాజు కు మచ్చలేని , మచ్చపడలేని నడవడిక , చరిత్ర వుండాలి అని ఆ దంపతులు ఇరువురికీ తెలుసు.

నేటి స్వార్థ పూరిత రాజకీయ నాయకులను కుల మత ఇతర కారణాల వల్ల సమర్థించే వారి కి ఈ విషయం అర్ధం చేసుకునే విజ్ఞత వుండదు అని వేరే చెప్పనవసరం లేదు అని భావిస్తున్నాను....

( ఇప్పటికి....సమాప్తం )