Monday 25 February 2019

💐మారుతీ శతకము ***





💐మారుతీ శతకము💐 తేదీ:16-12-2019సం.
ఈ శతక కర్త పేరు గోపీనాథము వేంకటకవి. వీరునెల్లూరు జిల్లా, కావలి తాలూకాలోని లక్ష్మీపురాగ్రహార వాస్తవ్యులు. సాహిత్య పరిశోధకుల అభిప్రాయాన్నిబట్టి వీరు క్రీ.శ.1813
సం. శ్రీముఖ సంవత్సరమున జన్మించినట్లు తెలుస్తున్నది. వీరు తమ పదహారవ యేట వేదాద్రినరసింహస్వామిఉత్స వాలకు వెళ్ళగా అచ్చట ఒక మహాయోగి మంత్రోపదేశం
వలన వీరికి అనర్గళ కవితాధార యలవడినట్లుగా వీరి గ్రంధములవలన తెలుస్తున్నది. వీరు తన విద్వత్కవితా ప్రతిభ చేత వేంకటగిరి సంస్థానాధిపతులను మెప్పించి వారి ఆస్థానకవిగా నియమితులైనారు. వీరు రామభక్తులు. మారుతీ శతకము వీరి తొలి కృతి. దీనిని తమ పదహారవ
యేట రచించినారట. ఆతరువాత తన ఇరవయ్యవయేట శ్రీరామాయణ రచన ప్రారంభించి అయిదేండ్లకు ముగించి నారు. ఆ రామాయణమే గోపీనాథ రామాయణంగా ప్రసిద్ధి
కెక్కినది. తదనంతర కాలంలో వీరు చెసిన ఇతర రచనలు శ్రీకృష్ణజన్మఖండము, భగవద్గీతా శాస్త్రము,శ్రీరామస్తవము, బ్రహ్మానంద శతకము, శిశుపాలవధము(మాఘకావ్యము),
శ్రీరాధికాపరిణయము, తిరునాళదండకము మొllవి.

శార్దూల మత్తేభ ఛందస్సులలో వ్రాయబడిన'మారుతి శతకము'లో 116 పద్యాలు వున్నాయి. ఈ పద్యాలలో ఆంజనేయస్వామివారి చరిత్ర,పుట్టుక మొదలుకొనిస్వామి ని గూర్చిన విశేషాలు, స్వామి చేసిన మహత్కార్యాలు రస రమ్యంగా వర్ణింపబడినాయి. రోజుకు కొన్ని పద్యాలను
తాత్పర్య సహితంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ దలచాను. భక్తులు, మిత్రులు, సాహిత్యాభిమానులు చదువుదురుగాక!
శతకం చివరిపద్యంలోకవిచెప్పుకున్న దాన్ని బట్టి కవి గారి
తండ్రి పేరు పద్మనాభ శాస్త్రి గారని తెలుస్తున్నది.

ఇంక మారుతీ శతకంలోనికి ప్రవేసిద్దాము.

1)శా. శ్రీమద్రామ పదారవిందయుగళిన్‌ సేవించి, యస్మద్గురు,
స్వామిన్‌ వేడ్క భజించి, సత్కవి నమస్కారంబుఁ గావించి, వా,
గ్భూమప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్‌ భక్తి నర్పించెదన్‌,
నా మీదం గృపజేసి కైకొను మమంద ప్రీతి తో మారుతీ!

తాll సీతారామచంద్రమూర్తి యొక్క పద్మములవంటి పాద ద్వయమును భక్తితో పూజించి, వేదాద్రి క్షేత్రములో మంత్రో పదేశముతో నన్ను అనుగ్రహించిన యోగిపుం గవుడైన నా గురుదేవుని సంతోషముతో స్మరించి, నాకు పూర్వులూ సమకాలికులూ అయిన సత్కపు లందరకూ నమస్కరించి, నాకు దైవదత్తముగా లభించినపాండిత్య ప్రతిభా పాటవములతో , ఓమారుతీ (ఆంజనేయ స్వా మీ!) నీ ప్రతిభావిశేషాలను వర్ణిస్తూ స్తుతిస్తూ నీ గూర్చి ఒక పద్య శతకాన్ని రచించి నీకు సభక్తికంగా సమర్పించ దలచాను.నాయందు దయయుంచి నాయీ కృతినిప్రేమ పూర్వకంగా స్వీకరించి నన్ను కృతార్థుని చేయి స్వామీ!.

2)మ. అనఘా! నీవు జనించి నప్పుడె సముద్యద్భూరి తేజంబునన్‌, 
వినువీథిం గనుపట్టుబాలరవిసద్బింబంబు నీక్షించి, యె, 
ఱ్ఱని పండంచు గ్రసింప బత్రిపతిలీలన్‌ వేడ్క మున్నూరు యో,
జనముల్‌ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘ్యుండవై మారుతీ!

తాత్పర్యం:- ఓ ఆంజనేయ స్వామీ! నీవు అంజనాదేవీ గర్భాన జన్మించిన తొలిరోజులలోనే, ఆకాశంలో గొప్ప తేజస్సుతో ప్రకాశించే బాల సూర్యణ్ణి చూసి, ఎర్రని పండనుకున్నావు. దాన్ని పట్టుకొని తినాలనే ఆసక్తితో గరుత్వంతుని (పత్రిపతి)వలె అత్యంత వేగవంతుడవై,
భూమి నుండి మూడువందల యోజనాల దూరం ఎగురుతూ వెళ్ళావు ( ఆ సందర్భంలో ప్రమాదాన్ని పసిగట్టిన దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా స్వామి దవడలు దెబ్బతిన్నాయి). శౌశవంలోనే ఇంతటి అనితర సాధ్యమైన ప్రయత్నం చేసి, ముల్లోకాలలో
వుండే వారితో స్తుతింపబడినావు.
ఇంకావున్నాయి.,

 3)మll నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మతేజంబుఁ గూ, 
డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాట క్షేత్రమందర్థి నిం, చ, 
జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్‌ రహిన్‌ మిశ్రమై,
త్రిజగంబుల్‌ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్‌ మారుతీ!

తాత్పర్యం:- జగత్ప్రాణుడైన వాయుదేవుడు, అగ్నిదేవుని ద్వారా తనకందజేయబడిన శివతేజాన్ని, తన స్వతేజం తో మిళితం జేసి, వనంలో తపస్సుచేస్తున్న కేసరి అను
వానరుని భార్య దోసిటలో పడవేయగా ఆమె దాన్ని ఫల మని భావించి దైవప్రసాదంగా తలంచి భుజించినది. శివ వాయువుల ఉభయ తేజముల మహిమ వలన గర్భందాల్చిన అంజనాదేవికి, ముల్లోకాలలో కొనియాడబడెడి విశిష్ట వ్యక్తిగా జన్మించితివి గదా స్వామీ!
వైశాఖ మాసం కృష్ణ పక్షం లో దశమి నాడుశనివారం పూర్వా భాద్ర నక్షత్రం లో వైద్రుతీ యోగం లో మధ్యాహ్న సమయం లో ,కర్కాటక లగ్నం లో అంజనా దేవికి ఆంజనే యుడు జన్మించాడు. బంగారు రంగు, పింగళ వర్ణం గలనేత్రాలు, స్వర్ణ హారం, బంగారు యజ్ఞోపవీతం, మణుల
నూపురాలతో, ధ్వజము, వజ్రాయుధం, అంకుశం, గొడుగు, పద్మం అనే శుభ చిహ్నాలు పాదాలలో వున్నవాడు , పొడవైన తోక గల వాడు, వజ్ర దేహంతో ప్రకాశించే వాడు పెద్ద
దవడలు కలవాడు, కటి సూత్రం కౌపెనం (గోచి) తో వున్న గొప్ప బాహువులతో విరాజిల్లు తున్న కపిరూపం లో ఆంజనేయ బాలుడు విరాజిల్లాడు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు. అంజనకు పుట్టిన వాడు కనుక ఆంజనేయుడు పేరు .కేసరి కుమారుడు కనుక కేసరినందనుడు.
వాయువు వర ప్రసాదం తో పుట్టాడు కనుక వాయునందనుడు, అనిల సుతుడు అయ్యాడు..అగ్ని తేజం కూడావుండటం తో అగ్ని సంభవుడని, శివ పార్వతుల తేజస్సుకల్గివుండటం తో పార్వతీ నందనుడనీ, శంకర సుతుడనిపిలువ బడు తున్నాడు. సకల దేవతలతేజస్సుతోజన్మించి
నందున సర్వ దేవాత్మకుడు అన్నారు .

”ఆన్జనేయః పూజితేస్చేత్ –పూజిత సర్వ దేవతాః
”అందుకే ఆన్జనేయుడిని పూజిస్తేసకల దేవతలను పూజించినట్లే నని బ్రహ్మ దేవుడు చెప్పాడు .

4)మllఅనిమేషేభము తెల్లపండనుచుబాల్యక్రీడలన్‌మ్రింగనొ,
య్యన డాయం బవిచే బలారి నినుమూర్ఛాక్రాంతునిం జేయ బూ,
ర్వనగాధిత్యక మీఁద వామహనువున్‌ భగ్నంబుగా వ్రాలినన్‌,
హనుమంతుండను పేరు నాడమరె నీకన్వర్థమై మారుతీ!

తాత్పర్యం:- ఓ స్వామీ! నీవు చిన్నపిల్లవానిగావున్నప్పుడొకసారి ఆటగోలుగా, ఆకాశంలో తూర్పు దిక్కునఉదయ సూర్యుని చూచి, ఆతనిని ఒక తెల్లని పండుగా భావించి,మ్రింగాలనే తలంపుతో ఆకాశంలోకి ఎగిరిపోతూసూర్యనిసమీపించ బోయావు. అప్పుడు ప్రమాదాన్ని పసిగట్టిన
దేవేంద్రుడు తన వజ్రాయుధంచే ఎదురుపడి కొట్టగా,ఎడమ దౌడ భగ్నమై నీవు స్పృహ కోల్పోయి ఉదయాద్రిశిఖరతలాన పడిపోయినావు. అప్పటి నుండి నీ యొక్క
'హనువు' అనగా 'దౌడ' కొట్టవచ్చినట్లు కనిపించుచుడటంవలన నీవు హనుమంతుడనే పేరుగలవాడివయ్యావు.ఇంకావున్నాయి.,

5)మll అపుడా గంధవహుండు నీదయిన మూర్ఛావస్ థ వీక్షించి,
తా,గుపితుండై నిజమూర్తి వైభవము సంకోచిం పఁగాఁ జేయ న,
చ్చపు గూర్మిన్‌ నిఖిలాస్త్రశస్త్రముల బంచత్వంబు లేకుండ స,
త్కృపతో నీకు వరంబులిచ్చిరి గదా బృందారకుల్‌ మారుతీ!

తాత్పర్యం:- గత పద్య భావానకి కొనసాగింపుగా..
ఓ మారుతీ ! ఇంద్రుని వజ్రాయుధ ఘాతంతో దెబ్బతిన్న దవడ గలవాడై ఉదయాద్రి శిఖర తలాన నీవు మూర్ఛితుడవై పడిపోగా, అప్పుడది చూసిన, నీతండ్రియగు వాయు
దేవుడు (గంధవహుండు) కోపించన వాడై తాను వీచుటమాని స్థబించి పోయాడు. (వాయువు వీచనిదే జీవులప్రాణాలు నిల్వవు, క్షణంలోలోకాలుకల్లోలమైపోగా)బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై వాయుదేవుని శాంతపరచారు, నిజమైన ప్రేమతో కృపాళువులై ఏవిధమైన అస్త్రములతోగానీ,
శస్త్రములతో గానీ నీకు హాని (లేదా మరణము) సంభవింపదని వరములు ఇచ్చారు కదా స్వామీ!

6)మll ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే,
ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడిన్‌,
సకలామ్నాయము లభ్యసించిన భవచ్చా తుర్య మేమందు దా,
పక దివ్యోరుతర ప్రభావము నుతింపన్‌ శక్యమే? మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! బాల్యములో నీవు ఒక పాదాన్ని నూర్యోదయం అయ్యే ఉదయగిరిపైననూ, వేరొక పాదాన్ని సూర్యుడు హస్తమించే పశ్చిమగిరిపైననూవుంచి‌,సూర్యుని
ద్వారా సకల వేదవేదాంగములను నేర్చుకొనుటలో నీవు చూపిన ఓర్పూనేర్పలను గూర్చి ఏమని చెప్పగలము.దివ్య మైన అనితరసాధ్యమైన గొప్పదైన నీ ప్రతిభాపాటవము లను ఉన్నవి వున్నట్లుగా ప్రస్తుతించి చెప్పటం ఎవరికైనా సాధ్యమౌతుందా? అంటే సాధ్యముకాదని భావము.
ఇంకావున్నాయి.,

7)మల్ బలవంతుండగువాలి ప్రోలు వెడలింపం,
బత్నిఁగోల్పోయిమి క్కిలి దుఃఖంబున ఘోరకాననములం గ్రీడించి వర్తించు నా,
జలజాప్తాత్మజు నొజ్జ పట్టి యని యశ్రాంతంబుఁ జేపట్టి యా
బలభిత్సూతికిఁ జిక్కకుండ ననుకంపం బ్రోవవే మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! ఇంద్రుని అంశతో జన్మించినవాడు మరియు మహాబలవంతుడగు వాలి ( వానరరాజ్యమైనకిష్కిధాధిపతి) చేత కిష్కింధాపురము నుండి వెళ్ళగొట్టబడిన వాడగు సుగ్రీవుడు, తన భార్యను కోల్పోయి, తీరనిదుఃఖంతో కీకారణ్యములలో తిరుచున్నప్పుడు, అతడు నీగురువగు సూర్యదేవుని పుత్రుడగట వలన ఆతనిపై ప్రేమా భిమానాలూ చూపూతూ, అతణ్ణి ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని వుంటూ వాలికిచిక్కకుండాకాపాడితివికదా,స్వామీ!

8)మllతనపత్నిం దిలకింపుచున్‌ నిబిడకాంతారోర్వివర్తించు రా,
మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షువే షంబునన్‌,జని,
సుగ్రీవుని చందముం దెలిపి యాక్ష్మానాథుదోడ్తెచ్చి, మె,
ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్‌ సఖ్యసంబంధమున్‌ ,
వినయం బొప్ప ఘటింపఁ జేసినది నీవే కాదొకో మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! అపహరణకు లోనైన తనభార్య ను వెదకుచూ దట్టమైన అడవులలో తిరుగుచూ (ఋష్య మూక పర్వత సమీపానికి) వచ్చిన, శ్రీరామ రాజేంద్రుని కడకు, సుగ్రీవుడు పంపగా బిక్షకుని వేషంలో వెళ్ళి, (చక్క గా సంభాషించి, శ్రీరాముని మొప్పుబొంది) సుగ్రీవుని దుర వస్థను వివరించి, (శ్రీ రామ లక్ష్మణులను నీ రెండు భుజముల మీద ఎక్కించుకొని, కొండ మీద భయకంపితుడై కలవర పడుతున్న) సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళి, శ్రీరామ సుగ్రీవులకు అగ్నిసాక్షిగా మైత్రీబంధాన్ని కుదిర్చిన వినయశీలుడవు నీవే కదా స్వామీ!