Wednesday, 31 August 2022

హనుమంతుడు - 🐍కుండలినీ యోగ సాధకుడు🧘‍♂️ తత్త్వం

హనుమంతుడు - 🐍కుండలినీ యోగ సాధకుడు🧘‍♂️ 

        యోగి, కుండలినీశక్తిని మూలాధారము నుండి పైకి ప్రయాణింపజేసి, స్వాధిష్ఠాన - మణిపూర - అనాహత - విశుద్ధ -ఆజ్ఞా చక్రములను అతిక్రమించి, చివరికి సహస్రారపద్మాతర్గత బిందు స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమున పొందుతాడు.అదే యోగ సిద్ధి. 

        హనుమంతుడు జితేంద్రియుడు. అంటే ఇంద్రియ చాపలం లేనివాడు.

బుద్ధిమతాంవరిష్ఠుడు.... అనగా ఇతర విక్షేపములు లేని బుద్ధి, లక్ష్యశుద్ధి కలవాడు.

1. మూలాధారం:-

        హనుమంతుడు మహేంద్రపర్వతం నుండి ఆకాశంలోకి ప్రయాణించడం అంటే మూలాధారంనుంచీ కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం.

2. స్వాధిష్ఠాన చక్రం:-

        మైనాకుడు సహాయం చేయవచ్చినా అదికూడా గమనానికి అవాంతరమే కదా! ప్రలోభాలకీ సుఖాలకీ ఆశించక, ఆటంకాన్ని దాటటం స్వాధిష్ఠానాన్ని అతిక్రమించడం.

3. మణిపూర చక్రం:-

       తనని సురస మ్రింగెదనని, తన నోట ప్రవేశింపమని అడ్డగించింది. ఆ సురస నోట ప్రవేశించి, బయటపడి తప్పించుకొనడం మణిపూర చక్రాన్ని అతిక్రమించడం.

4. అనాహత చక్రం:-

       సింహిక ఛాయాగ్రహణం చేయగా, దానిని సంహరించటం అనాహతాన్ని దాటి పైకి సాగటము.

5. విశుద్ధి చక్రం:-

       లంకా ప్రవేశానికి లంకానగర అధిష్థాన దేవత అడ్డువచ్చింది.

      ఆమెను గెలవటం విశుద్ధి చక్రాన్ని అతి క్రమించడం.

6. ఆజ్ఞా చక్రం:-

          మండోదరిని చూచి సీతయే అని పరమానందం పొందాడు.

        కానీ లక్షణాలనిబట్టీ, వివేచనచేనూ ఆమె సీత కాదనుకొన్నాడు.

        ఆజ్ఞా చక్రాన్ని చేరిన కుండలిని, అదే గమ్యమనుకొని ఆనందపడి, మరల విచక్షణా జ్ఞానంచే,  గమ్యానికి ఇంకా ప్రయత్నం చేయవలసి ఉందని గ్రహించడం ఆజ్ఞా చక్రాన్ని దాటటం. 

7. సహస్రార చక్రం:-

         అశోకవనంలో సీతాదేవిని చూచి, ఆనందించడం సహస్రార చక్ర ప్రవేశం.

         ఆరు చక్రాలనీ జయించుకొని వచ్చిన సిద్ధపురుషునికి సహస్రార చక్రాంతర్గత బిందురూపిణి అయిన శ్రీ భువనేశ్వరీ దర్శనమైనదని అర్థం.

        చివరకు సీతారాములను తిరిగి కలిపి అయోధ్య చేర్చిన ఆంజనేయ సమారాధనలో సర్వేశ్వరి సాయుజ్యం గోచరిస్తుంది.

          ఈ విధంగా మారుతి యోగసిద్ధుడు.

****

తాత్త్వికదృష్టితో రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది. ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి.

 ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతికార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే.

శ్రీ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు:- 

మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు. 'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ' మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శన మనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమో పేతుడు శ్రీ విద్యోపాసకుడు "శ్రీఆంజనేయుడు".

పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం.

వానరరూపం - వాయుతత్త్వం.

 గరుడరూపం - ఆకాశతత్త్వం.

నరసింహరూపం - అగ్నితత్త్వం.

 వరాహరూపం - భూమితత్త్వం.

హయగ్రీవరూపం - జలతత్త్వం.

ఆంజనేయుడు ఆధ్యాత్మిక సాధకులకు ఆచార్యుడు.

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ /

ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 

నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'.

తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'.

సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి.

ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదనారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించ వచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి.

వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించ గలిగే దక్షతను కలిగి యుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనా సమర్ధుడు.

అఖిల లోకోపకారి ఆంజనేయుడు

యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు.

{అష్టసిద్ధులు - వివరణ }:-

అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'. పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజో వాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతముల యందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మ తత్వములయందును, వాని స్థితుల యందును, ఇంద్రియముల యందును, వానికర్మల యందును, అంతఃకరణముల యందును, తత్ప్రకాశ రూపములైన వృత్తుల యందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,

ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి. 

అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి. 

పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, 

విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి. 

ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి. 

లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి.

భూతము లన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం".

అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితి లయములకు కారణభూతుడగుట "ఈశత్వం."}


లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా /

ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //


తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?

ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి.

గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //

భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించు చుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును).

 దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును.

రామ - హనుమల బంధం ఏమిటంటే - ప్రభు - సేవకుడు;భగవానుడు - భక్తుడు; గురువు - శిష్యుడు

అటుపై వీరి బంధం "ఏకత్వం".

ఓసారి రామునితో హనుమ ఇలా అంటాడు -

దేహదృష్ట్యా తు దాస్యోహం జీవదృష్ట్యా త్వదంశకః /

ఆత్మదృష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి: //

ఈ శ్లోకం పరిశీలిస్తే సాధకునికి అన్నీ అవగతమౌతాయి. బలం ధైర్యం నేర్పు ఓర్పు బుద్ధి శక్తి సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన 'కర్మయోగి' ఆంజనేయుడు.

 రామభక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న 'భక్తియోగి' ఆంజనేయుడు. సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న 'జ్ఞానయోగి' ఆంజనేయుడు. భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి, జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గ్రహించి, నిష్కామ కర్మాచరణలతో "భవిష్యద్బ్రహ్మ" అయినాడు ఆంజనేయుడు.

****


No comments:

Post a Comment