Sunday 1 March 2020

యుద్ధ కాండము-45

: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-45

అగ్నిదేవుడు సీతాదేవి పాతివ్రత్య వైభవమును వెల్లడించుట
బ్రహ్మదేవుడు వచించిన ఈ శుభవచనములు విని అగ్నిదేవుడు విదేహనందిని యగు సీతను ఒడిలో నిడుకొని చితి నుండి పైకి లేచెను.

అబ్రవీ చ్చ తదా రామం సాక్షీ లోకస్య పావకః
ఏషా తే రామ వైదేహీ పాపమ్ అస్యా౦ న విద్యతే      6.121.5

నైవ వాచా న మనసా నైవ బుధ్యా న చక్షుషా
సువృత్తా వృత్తశౌణ్డీరా న త్వామ్ అతిచచార హ     6.121.6

అపుడు లోకసాక్షియగు అగ్ని శ్రీరామునితో "శ్రీరామా! ఈమె మీ ధర్మపత్నియగు విదేహరాజకుమారి యైన సీత. ఈమె యందు ఏ పాపమును, ఏ దోషమును లేదు. ఉత్తమ ఆచరణ గల ఈ శుభలక్షణమగు సీత మనస్సు, బుద్ధి, వాక్కు, నేత్రములు వీని ద్వారా మిమ్ము తప్ప మరియొక పురుషుని ఆశ్రయించ లేదు.  ఈమె సదా సదాచారపరాయణుడవగు మిమ్ములనే ఆరాధించింది. సత్యమును ఆశ్రయించి యున్నవాడవగుటచే ఈమె అగ్నిహోత్రములో ప్రవేశించుచున్నను, మూడు లోకములను నమ్మించుటకై ఊరుకొంటివి. పిదప మహాతేజస్వియు, ధైర్యవంతుడు, గొప్ప పరాక్రమము కలవాడును, ధర్మాత్ములలో శ్రేష్ఠుడగు శ్రీరాముడు అగ్నిదేవునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

అన౭న్య హృదయాం భక్తాం మ చ్చిత్త పరివర్తినీమ్
అహ మ౭ప్య౭వగచ్ఛామి మైథిలీం జనకా౭౭త్మజామ్  16.121.15

మిథిలేశనందినియైన, జనక కుమారి యగు సీత యొక్క హృదయము సదా నా యందే లగ్నమై యున్నదని నాకు తెలియును. నానుండి ఎప్పుడును వేరుగా నుండదు. ఆమె ఎల్లప్పుడూ నాయందే మనస్సును నిలుపును. నా ఇచ్చానుసారమే ప్రవర్తించును. కానీ ముల్లోకములు యందలి ప్రాణుల మనంబున విశ్వాసము కలుగజేయుట కొరకు ఏకమాత్రమగు సత్యమును తీసుకొని అగ్నియందు ప్రవేశించుచున్న విదేహాకుమారి యగు సీతను అడ్డు పెట్టలేదు. ఈ ప్రకారముగా చెప్పి తన పరాక్రమము వలన ప్రశంసితుడగు మహాబలశాలియు, మహాయశస్వియు, విజయవంతుడును, వీర్యుడు అగు శ్రీరాముడు తన ప్రియురాలగు సీతను బడసి పరమ సుఖమున నుండెను. శ్రీరాముడు చెప్పిన ఈ శుభ వచనములు విని, ఇంతకంటే మంగళకరం వాక్యములను మహేశ్వరుడు పలికెను. శ్రీరామా! మీరు ధర్మాత్ములలో శ్రేష్ఠులు, మీరు రావణవధయను కార్యమును ఒనర్చితిరి. ఇది చాలా సౌభాగ్యకరమైన విషయము. ఇంకా నీవు దీనుడగు భరతుని ఓదార్చి, అయోధ్యలో రాజ్యమును స్వీకరించి ప్రజలను ఆనందింప జేయుము. అశ్వమేథ యాగమును జేయుము. మీ తండ్రి దశరథ మహారాజు విమానంలో నిన్ను చూచుచున్నాడు. నీవు అరణ్యమునకు రాజ్యమును వదలి వచ్చినావని ఖేదముచే వెనుకకు మరలిరాని పరమపదమునకు వెళ్లక ఇంద్రలోకములో రావణ వధ చేసిన నిన్ను చూచుటకై ఇంతకాలము వేచియున్నాడు. ఇట్లు మహేశ్వరుడు చెప్పగానే విమానము నందున్న తండ్రికి లక్ష్మణునితో కలసి నమస్కరించెను. విమానంలో కూర్చున్న దశరథ మహారాజు ప్రియమైన పుత్రుని దగ్గరకు చేర్చుకొని, ఒడిలో కూర్చుండబెట్టుకొని గాఢముగా ఆలింగనము చేసుకొనెను. అప్పుడు శ్రీరాముడు అంజలి ఘటించి దశరథ మహారాజుతో, భరతుని, కైకేయిని నీచే ఆదరింపబడవలెనని కోరగా అందుకు సమ్మతించాడు. తరువాత స్వస్వరూపముతో ప్రకాశించుతూ విమానంలో ఏగెను. దశరథ మహారాజు వెడలిన పిదప ఇంద్రుడు అంజలి ఘటించి శ్రీరామునితో - శ్రీరామా! మేము నీ యడల చాలా ప్రసన్నులమైతిమి. కావున నీ మనస్సు నందు ఏ కోరిక కలదో దానిని నాకు చెప్పుడు. అపుడు శ్రీరాముని మనంబున చాలా సంతోషము కలిగెను. వారు హర్షాన్వితులై ఇట్లు చెప్పిరి.

మమ హేతోః పరాక్రాన్తా యే గతా యమ సాదనమ్
తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠన్తు వానరాః           6.123.5

దేవేశ్వరా! నా కొరకు యుద్ధమున పరాక్రమము చూపి మరణించిన ఆ వానరులందరూ మరల జీవించునట్లు చేయుము. ఎందుకనగా వారు నా కొరకై పరాక్రమించి మృతి చెందినవారు. అంతియేగాక వారు సంతోషముగా తమ బంధువులతో కలసి ఆనందించునట్లు, వారికి ఏ శారీరక పీడలు, వ్రణములు లేక బలపౌరుషములతో ఉండునట్లు అనుగ్రహింపుము. అట్లే వారు ఎక్కడికి ఏగినను, కాలము కాకపోయినను, వారికి తృప్తినిచ్చు వృక్ష మూలములు, ఫలములు సమృద్ధిగా ఉండునట్లు అనుగ్రహింపుము. రాముడిట్లు చెప్పగానే ఇంద్రుడు పరమ ప్రీతితో ఆయా వరములను అనుగ్రహించెను. అప్పుడు వానరులందరూ గాయములు మానినవారై నిద్ర నుండి లేచినట్లు లేచిరి. అప్పుడు శ్రీరాముడు విభీషణునితో ఈ వానరులు యుద్ధము నందు అనేక విధములుగా విజయమునకై కష్టపడ్డారు గావున వారికి అమూల్యమైన రత్నములు, ధనము మొదలగు వానితో సత్కరింపుము అని చెప్పగా విభీషణుడు అట్లే చేసెను. మరునాడు విభీషణుడు  రామునకు జయము పలికి స్నానము చేసి, తగిన ఆభరణములను, చందనమును పూసుకోను వలసినదిగా కోరగా అందుకు శ్రీరాముడు సున్నితముగా తిరస్కరించి, భరతుడు నాకొరకై వేచిచూస్తున్నాడు కావున వెంటనే ప్రయాణమునకు తగు ఏర్పాటు చేయమని అడిగెను. అప్పుడు విభీషణుడు పుష్పకమును సిద్ధముచేసినాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment