Monday 2 March 2020

యుద్ధ కాండము-46

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-46
శ్రీరాముడు సీతకు ఉత్తర తీరము వరకు గల ప్రదేశములు వివరించుట
ఆ వానరులందరికి విభీషణుడు రత్నధనాదులుచే సత్కరించటం చూచి సంతోషముతో శ్రీరాముడు సిగ్గుతో నున్న సీతను వెంటబెట్టుకొని, పరాక్రమవంతుడు, ధనుర్ధరుడు, సోదరుడుయగు లక్ష్మణునితో గూడి అచ్చట నున్న పుష్పక విమానమును అధిరోహించెను. విమానమున కూర్చుండి వానరులందరిని ఆదరించుచు శ్రీరాముడు విభీషణ సహితముగా యున్న సుగ్రీవునితో ఇట్లు పలికెను.
య త్తు కార్యం వయస్యేన స్నిఘ్దేన చ హితేన చ
కృతం సుగ్రీవ తత్ సర్వం భవతా ధర్మ భీరుణా 6.125.15
సుగ్రీవా! హితైషియు, ప్రేమియునగు ఒక మిత్రునకు చేయదగిన కార్యమంతయు మీరు పరిపూర్ణముగా చేసి చూపించితిరి. ఏలయన మీరు అధర్మమునకు భయపడువారు. వానరరాజా! ఇక మీరు మీ సేనతో గూడ శీఘ్రముగా కిష్కింధ నగరమునకు పోవుడు. విభీషణా! మీరును లంకకు పోయి నాచే నొసఁగఁబడిన రాజ్యమున స్థిరముగా నుండుడు. ఇపుడు ఇంద్రాది దేవతలు కూడా మీకు అపకారము చేయజాలరు. శ్రీరాముడిట్లు పలుకగా వానర సేనాపతులు, రాక్షస రాజగు విభీషణుడు చేతులు జోడించి; రాజశ్రేష్టా! మేమందరము అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం సమయమున మంత్రపూరితమగు జలములచే తడిసిన మీ యొక్క స్వరూపమును దర్శించి, మాతృదేవియైన కౌసల్య చరణములపై శిరస్సు వంచి తదుపరి శీఘ్రముగా మా ఇండ్లకు తిరిగి వెళ్ళెదము. విభీషణ సహితముగా వానరులందరూ ఈ విధముగా విన్నవించగా అపుడు శ్రీరాముడు వారితో; మిత్రులారా! ఇది నాకు మహాప్రియమైన విషయము. మిత్రులగు మీ అందరితో గూడి నేను అయోధ్యాపురమునకు పోగల్గుచో, అది నాకు పరమ ప్రియమైన వస్తువు లభించినట్లే భావించగలను. నాకు చాల సంతోషము గల్గును. తదుపరి వారందరు విమానము ఎక్కగా, కుబేరుని ఆ పుష్పక విమానము శ్రీరాముని ఆజ్ఞను పొంది ఆకాశమున ఎగిరెను. అందరూ ఆ విమానంలో ఇరుకు లేకుండా హాయిగా కూర్చొండిరి. విమానంపై నుండి శ్రీరాముడు సీతమ్మకు ఆయా ప్రదేశములు వివరములు చెప్ప దొడగెను. సీతా! త్రికూట పర్వతముపై కైలాస శిఖరము వలె నున్న లంకను చూడుము. ఇది విశ్వకర్మ నిర్మించియున్నాడు. యుద్ధ భూమిని చూడుము. ఎంతమంది రాక్షస వీరులు చనిపోయినారో చూడుము. ఇక్కడే రావణకుంభకర్ణులు నీ కొరకై చంపబడినారు. రావణ పుత్రులైన ఇంద్రజిత్తు, అతికాయుడు, ప్రహస్తులను లక్ష్మణుడు సంహరించాడు. దేవాంతకుడును హనుమ సంహరించాడు. నరాంతకుడిని అంగదుడు, త్రిశిరుడ్ని నీలుడు  సంహరించారు. సముద్రమును దాటి ఆ రాత్రి మేము విడిది చేసిన ప్రదేశము ఇదియే. సముద్రములో నీ కొరకై నలుని వలన సేతువు నిర్మింపబడినది చూడుము. అదిగో ఆ కన్పించుచున్నది హిరణ్యనాభము అను పేరుగల మైనాక పర్వతము. ఇది బంగారు కాంతులీనుచున్నది. హనుమ నిన్ను అన్వేషించుటకై సముద్రమును లంఘించునప్పుడు ఆ మారుతికి విశ్రాంతి నొసగుటకై సముద్రమును చీల్చుకొని బయిటకు వచ్చినది. ఇది సముద్ర మధ్య భాగమున సేతువు మీద సేన విడిది చేసిన భాగము. సేతుబంధమని వ్యవహరింపబడు పవిత్రమగు తీర్థము. మూడు లోకములలో ఇది పూజింపబడుచుండును. సముద్రముపై సేతువు నిర్మించుటకు సముద్రుని అనుమతిని పొంది సేతు నిర్మాణము చేసితిమి. ఈ దర్భశయన స్థానము పరమ పవిత్రము. మహా పాతక నాశనము.
అత్ర పూర్వం మహా దేవః ప్రసాద మ౭కరోత్ ప్రభుః              6.126.16
అత్ర రాక్షస రాజోఽయమ్ ఆజగామ విభీషణః
పూర్వము ఈ పవిత్ర ప్రదేశము నందే పరమ శివుడు నన్ను అనుగ్రహించెను. రాక్షస రాజైన విభీషణుడు నన్ను శరణు జొచ్చినదియు ఈ ప్రదేశమే! కూర్మ పురాణములో శ్రీరాముడు ఇచ్చట సేతు నిర్మాణమునకు పూర్వమే లింగ ప్రతిష్ట చేసినట్లు కనబడుచున్నది. (సేతుమధ్యే మహాదేవం ఈశానమ్ కృత్తివాసనమ్, స్థాపయామాస వై లింగం పూజయామాస రాఘవః). అంతట పరమేశ్వరుడు పార్వతీసహితుడై ప్రత్యేక్షమయి ఈ లింగ దర్శనము సర్వ పాప క్షయకరము. ఈ భూమండలం, ఈ సేతువు స్థిరముగా యున్నంతవరకు అదృశ్య రూపమున ఉండి ఇచ్చట స్నానము, జపము, దానము, శ్రాద్ధము మొదలగు విధులను ఆచరించిన వారు అక్షయ పుణ్య పాహలములు పొందుదురని పరమశివుడు  వరము ఇచ్చెను. అదియే పద్మ పురాణము నందు అయోధ్యకు తిరిగి వెళ్లునప్పుడు శివ లింగ ప్రతిష్ట చేసినట్లు తెలియు చున్నది. ఈ క్షేత్రమే "రామేశ్వరము" అను పేరుతో నేటికిని కీర్తింపబడుచున్నది. ఇతిహాస పురాణములలో, పురాణముల కంటే ఇతిహాసము వేదము వలె ప్రమాణము. వాల్మీకి నుండి వెలువడిన ఈ రామాయణము ఇతిహాసము. పురాణములకు, ఇతిహాసములు విరోధము ఏర్పడినప్పుడు ఇతిహాసమును ప్రమాణముగా తీసికొనవలెను. ఇచ్చట "మహాదేవ" శబ్దము ”సముద్రుడు” అని కొందరు వ్యాఖ్యాతలు తెలుపు చున్నారు. శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-12 లో శ్రీరాముడు నిర్మించిన సేతువు ఈనాటి రామేశ్వరము వద్ద కాదని, కన్యాకుమారి అగ్రమున ఉండవచ్చునని విశ్లేషణాత్మకంగా తెలియజేయడమైనది. శ్రీరాముడు నిర్మించిన సేతువు పది యోజనముల వెడల్పు, నూరు యోజనముల పొడవు కలదు.  అనగా 49.2 మైళ్ళ వెడల్పు, 492 మైళ్ళ పొడవు కలదు.  Space images taken by NASA reveal a mysterious ancient bridge in the Palk Strait between India and Sri Lanka. This is also popularly known as "Rama Sethu" or named as Adam’s Bridge, approximately at a distance of 30 miles and 1.87 miles width. Archeological studies reveal that the first signs of human inhabitants in Sri Lanka date back to the primitive age, about 1,750,000 years ago and the bridge’s age is also almost equivalent since, Ramayana, was supposed to have taken place in treta yuga (more than 1,700,000 years ago). So, there is much debate whether the Rama Sethu at Rameswaram is built by Bhagavan Srirama or not. I am not going into controversy into it. అన్నియు ఎవరి నమ్మకము. ఎవరి అభిప్రాయము వారివి.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment