Wednesday 4 March 2020

-యుద్ధ కాండము-48

[04:46, 05/03/2020] +91 96180 14862: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-48
శ్రీరామ పట్టాభిషేకమునకై నదీ, సముద్ర జలములను తెప్పించుట
తదుపరి హనుమ మథుర వాక్యముల ద్వారా శ్రీరాముని వృత్తాంతమును విని భరతునికి చాల సంతోషము గలిగినది. అప్పుడు భరతుడు, శత్రుఘ్నునికి ఈ విధముగా ఆజ్ఞ యొసగెను. "జనులు శుచిర్భూతులై నగరమందలి దేవస్థానములను అలంకరించి వాయిద్యములను వాయించుచు సుగంధ పుష్పములతో దేవతలను పూజించుదురు గాక". రాజాజ్ఞచే, శత్రుఘ్నుడు నందిగ్రామము నుండి అయోధ్య వరకు మార్గము అంతయు చల్లటి నీటితోను, సుగంధ పుష్పములతోను ఏర్పాటు గావించెను. అప్పుడు అయోధ్య ప్రముఖులు, మంత్రులు, తల్లులు, మొదలగు వారు ఉత్సాహముగా నందిగ్రామమునకు చేరిరి.  తదుపరి భరతుడు ప్రజాసహితముగా, శిరస్సుపై రామపాదులలు ధరించి, శ్వేత ఛత్రమును దాల్చి రాముని కొరకై ఎదురు చూడగా హర్షపరవశమగు వానరుల ధ్వని, ఆ వెనుకనే పుష్పక విమానము, అందు సత్యపరాక్రముడైన సీతాలక్ష్మణ సహితముగా శ్రీరాముడు కనబడినారు. భరతుడు ఆనందముతో శ్రీరాముని చెంతకు వెళ్లి సాష్టాంగము చేయగా శ్రీరాముడు ఆనందముతో భరతుని కౌగలించుకొని తన ఒడి యందు కూర్చుండ పెట్టుకొనెను. పిమ్మట భరతుడు, వానర రాజగు సుగ్రీవుని కౌగలించుకొని ఇట్లనెను..
త్వ మ౭స్మాకం చతుర్ణాం తు భ్రాతా సుగ్రీవ పంచమ:  6.130.45
సౌహృదా జ్జాయతే మిత్ర మ౭పకారో౭రి లక్షణం
సుగ్రీవా! మీరు మా నలుగురికి ఐదవ సోదరులు. ఏలయన స్నేహపూర్వకమగు ఉపకారము చేయుటచే మిత్రుడగు చున్నారు. అపకారము చేయుట శత్రువు యొక్క లక్షణము.
పిమ్మట భరతుడు విభీషణునితో; "రాక్షస రాజా! మీ యొక్క సహాయమును పొంది శ్రీరాముడు మహాదుష్కరమైన కార్యమును పూర్తి చేసెను. ఇది చాలా సౌభాగ్యదాయకమైన విషయము. అనంతరము ధర్మజ్ఞుడగు భరతుడు స్వయముగానే శ్రీరాముని పాదుకలను తీసుకొని వెళ్లి ఆ మహారాజగు శ్రీరాముని పాదములకు తొడిగి చేతులు జోడించుకొని ఇట్లు చెప్పెను. "ప్రభూ! నాకు అప్పగించిన ఈ సమస్త రాజ్యమును నేడు మీ చరణములందు తిరిగి సమర్పించుచున్నాను." అటుపిమ్మట శ్రీరాముని ఆజ్ఞను పొంది పరమోత్తమగు ఆ పుష్పక విమానము ఉత్తర వైపునకు పోయి కుబేరుని స్థానమును చేరెను. అపుడు భరతుడు, శ్రీరామునితో రాజ్య పరిత్యాగం, వనవాసమునకు కారణము దైవ ప్రేరణయే గాని, కైకేయి నిమిత్తమాత్రురాలు. (కైకేయి ధీర వనిత. ఆమె వరముల యొక్క అంతరంగమును మరియు మంథర యొక్క యోగ రహస్యమును గూర్చి *అయోధ్య కాండము-4 & 6 లో వివరించడమైనది). అన్నా! రాజ్యపరిత్యాగము చేసి వనవాసమును అంగీకరించుటచే మా అమ్మ నీచే ఆరాధింపబడినది. ఆమె మనసు సంతసించినది. (శ్రీరాముడు కైకేయి అంతరంగమును అర్థము చేసుకున్నట్లుగా ఎవరును అర్థము చేసుకోలేదు. కైకేయి సంతసించుటలోని భావార్థము గ్రహించవలెను). చిత్రకూటమి నందు ఈ రాజ్యమును నాకు న్యాసముగా అప్పగించారు. మీరు వచ్చువరకు ఈ రాజ్యమును కాపాడినాను. ఇప్పుడు మీకు సమర్పించవలసిన బాధ్యత నాపై యుండినది. లోకమునంతను గుణములచే వశపరచుకొనినవారు. మీ రాజ్యమును మీరే పరిపాలించవలెను. మీ యొక్క రాజ్యాభిషేకము ప్రజలందరూ చూచి తరించుదురు అనెను.  
యావ దా౭౭వర్తతే చక్రం యావతీ చ వసుంధరా
తావత్ త్వమ్ ఇహ సర్వస్య స్వామిత్వమ్ అభివర్తయ 6.131.11
ఎంతవరకు జ్యోతిష్య చక్రము పరిభ్రమించు చుండునో, ఎంతవరకు ఈ భూమండలము ఉండియుండునో, అంతవరకు మీరీ భూమండలమునకు ప్రభువుగా ఉండుదురు గాక!. (అనగా ఇప్పుడు కూడా శ్రీరాముడు అద్రుశ్యముగా యుండి ఈ భరత దేశమును పరిపాలించు చున్నారు అని భావము. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యములో ఈ భరత దేశము ప్రజల మన్ననలు పొందిన వారితో  పరిపాలింప బడుట విదితమే కదా! శ్రీరాముడు కూడా ప్రజా పాలకుడు. ప్రజాభిప్రాయం మేరకే సింహాసనాధీష్టుడు అయినాడు) భరతుడు స్వయముగా రామలక్ష్మణులకు వనవాస దీక్ష విరమింప జేసినాడు. వానర స్త్రీ సమూహముతో సహా సీతమ్మ సర్వాలంకారణ భూషితయై అయోధ్యా నగరమునకు బయలుదేరిరి. సహస్రాక్షుడగు ఇంద్రుడు పచ్చని గుఱ్ఱములను అధిరోహించినట్లు శ్రీరాముడు శ్రేష్ఠమైన రథమును నందిగ్రామములో అధిరోహించి బయలుదేరెను. ఆ రథమునకు భరతుడు సారథ్యము వహించెను. శత్రఘ్నుడు ఛత్రమును ధరించెను. లక్ష్మణుడు వ్యజనము వీచుచుండెను. విభీషణుడు కూడా తెల్లని చామరమును పట్టుకొని ముందు నిలిచెను. ఆకాశమున దేవ, గంధర్వులు స్తోత్రము చేయుచుండిరి. సుగ్రీవుడు శత్రుంజయము అనెడి ఏనుగును అధిరోహించెను. రాముడు అయోధ్యా పురములో ప్రవేశించెను. అయోధ్యాపుర ప్రజలు హర్షముతో పొంగిపోవుచుండిరి. మహాత్ముడగు శ్రీరాముడు తల్లులకు నమస్కరించెను. అనంతరము భరతుని విన్నపముపై సుగ్రీవుని ఆజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు, గవయుడు, సుషేణుడు, నలుడు  జలపూర్ణములగు కలశములతో సముద్రజలములను, ఐదు వందల నదులలో జలములను సేకరించి తీసుకొనిరాగా శత్రఘ్నుడు వానిని రామపట్టాభిషేకము నిమిత్తము పురోహితులకు అప్పగించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
Only admins can send messages

No comments:

Post a Comment