Tuesday 3 March 2020

యుద్ధ కాండము-47

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-47
శ్రీరాముడు భరద్వాజాశ్రమమునకు చేరిన సంగతి హనుమ ద్వారా భరతునికి తెలియజేయుట
శ్రీరాముడు, సీతమ్మకు ఉత్తర తీరమున చిత్ర విచిత్రములగు కాననములతో నిండిన సుగ్రీవుని కిష్కింధ రాజధానిని చూపెను. సీతమ్మ అప్పుడు శ్రీరామునితో చనువుతో సుగ్రీవుడు మనకెంతయో మేలుచేశాడు కావున వారి భార్యలు, అంతఃపుర స్త్రీలతో అయోధ్యకు వెళ్లవలెనని కోరికను తెలియజేయగా శ్రీరాముడు అందుకు అంగీకరించెను. అప్పుడు విమానమును క్రిందకు దింపగా వారందరు విమానమును అదిరోహించిరి. తరువాత ఋష్యమూక పర్వతము వద్దకు విమానము రాగా సీతకు అక్కడనే తాను సుగ్రీవునితో మైత్రిని చేసుకొని వాలిని సంహరించితినని శ్రీరాముడు చెప్పెను. తరువాత శ్రీరాముడు, ధర్మచారిని యగు శబరిని చూచిన ప్రదేశమును, కబంధుడు సంహరించిన ప్రదేశము, ఖరదూషణాదులను సంహరించిన జనస్థానమును, పంచవటిని, శరభంగాశ్రమమును, అగస్త్యాశ్రమమును, విరాధుడు నేలకూలిన ప్రదేశమును, చిత్రకూటమిని, భరద్వాజాశ్రమమును, దూరమున నున్న అయోధ్యను సీతమ్మకు చూపెను. ఆనాడు చైత్ర శుద్ధ పంచమి. పదునాలుగు సంవత్సరముల క్రితము వనవాసము ప్రారంభమయ్యెను. షష్ఠి నాడు  శృంగిభేరపురము, సప్తమి నాడు వటవృక్ష మూలమున నివాసము, అష్టమి నాడు భరద్వాజాశ్రమమున, నవమి నాడు యమునా నాదీ తీరమున యుండి దశమి నాడు చిత్రకూటమికి బయలుదేరిరి. వనవాసము పదునాలుగవ సంవత్సర ప్రారంభమున రావణుడు, సీతమ్మను పంచవటిలో అపహరించాడు. చైత్ర మాసములో సీతాపహరణము, వైశాఖంలో సుగ్రీవ సమాగమము, ఆషాడములో వాలి వధ, ఆశ్వయుజములో సీతాన్వేషణ, ఫాల్గుణ అమావాశ్య నాడు రావణ వధ, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు రావణ సంస్కారము, విదియనాడు విభీషణ పట్టాభిషేకము, తదియనాడు లంక నుండి తిరుగు ప్రయాణము, చవితినాడు కిష్కింధలో ఆగుట, పంచమినాడు భరద్వాజాశ్రమమునకు వచ్చిరి. ఈనాటికి పదునాలుగు సంవత్సరములు నిండినవి. మరునాడు తెల్లవారేసరికి భరతుని చూడవలెను. భరద్వాజాశ్రమమున శ్రీరాముడు మహర్షికి నమస్కరించి అయోధ్యాపుర విషయములు, భరతుని రాజ్యపాలన, తమ తల్లుల క్షేమము అడిగెను. అప్పుడు మహర్షి శ్రీరామునితో అందరూ క్షేమమేనని చెపుతూ భరతుడు మీ ఆగమమునకై వేచియున్నాడు, మీరు ఈరోజు మా ఆతిథ్య సత్కారమును స్వీకరించుడు, మేము మీకు ఒక వరము ఈయగలను అనెను. అప్పుడు శ్రీరాముడు ఇచట నుండి అయోధ్యకు పోవు మార్గమంతయు వృక్షములన్నియు సమయము కానప్పటికీ ఫలములు, మధువు ఉత్పన్నమవవలెనని కోరగా మహర్షి అందుకు అంగీకరించెను. పిమ్మట తేజస్వియగు, శ్రీరాముడు తనలో విచారణ సలుపుకొని హనుమతో శీఘ్రముగా అయోధ్యకు వెళ్లి వారి క్షేమసమాచారములు తెలుసుకొని, శృంగిభేరపురమున గుహుని కలుసుకొని అతని కుశలం తెలుసుకొని, భరతుని కుశలం తెలుసుకొని నేను సీతాలక్ష్మణ సహితముగా తిరిగి వచ్చిన వార్తను తెలియజేయమని చెప్పెను. రామాజ్ఞను గైకొని గుహునికి శ్రీరాముని క్షేమ వార్త తెలియ జేసి, దీనుడై, కృశించి, ఆశ్రమవాసియై, జటాధారియై యున్న భరతుని చూచెను.  

తం ధర్మమ్ ఇవ ధర్మజ్ఞం దేహవన్తమ్ ఇవా౭పరమ్
ఉవాచ ప్రా౦జలి ర్వాక్య౦ హనూమాన్ మారుతా౭౭త్మజః        6.128.34

దేహమును ధరించి వచ్చిన ధర్మము వలె కనబడే ఆ ధర్మజ్ఞుడైన భరతుని యొద్దకు వెళ్లి హనుమ చేతులు కట్టుకొని శ్రీరాముడు రావణుని సంహారము చేసి, సీతమ్మను పొంది, మహాబలశాలురగు మిత్రులతో కూడి సీతాలక్ష్మణులతో కూడి ఈ ముహుర్తములోనే మిమ్ములను చూచుటకు వచ్చుచున్నాడు. మీ కుశలం అడిగినాడు అని చెప్పెను. భరతుడు హనుమ చెప్పిన వార్తను విని సంతోషముతో ఇట్లు చెప్పెను.

కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే
ఏతి జీవన్తమ్ ఆనన్దో నరం వర్ష శతా ద౭పి 6.129.2

"మనుష్యుడు జీవించి యుండినచో ఎపుడో ఒకపుడు నూరేండ్ల అయిన పిదప కూడా ఆనందము సంప్రాప్తించును". అను ఈ శుభ ఆర్యోక్తి యదార్థమని తెలియు చున్నది. (సుందరకాండ 34 వ సర్గ లో హనుమ రామలక్ష్మణుల కుశల వార్త చెప్పినప్పుడు ఈ ఆర్యోక్తి చెపుతుంది) భరతుని కోరికపై హనుమ, వనవాసము మొదలుగా రావణ సంహారము, విభీషణ పట్టాభిషేకము వరకు రామచరితమును సంగ్రహముగా వివరించెను.  
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment