Friday 6 March 2020

యుద్ధ కాండము-49


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-49
శ్రీరామ పట్టాభిషేకము
తతః స ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ
రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్ 6.131.59
వసిష్ఠో వామదేవ శ్చ జాబాలి: అథ కాశ్యపః
కాత్యాయనః సుయజ్ఞ శ్చ గౌతమో విజయ స్తథా 6.131.60
అభ్యషి౦చన్ నర వ్యాఘ్రం ప్రసన్నేన సుగన్ధినా
సలిలేన సహస్రా౭క్షం వసవో వాసవం యథా 6.131.61
మహర్షులలో శ్రేష్ఠుడు, వంశ పురోహితుడు ఐన వసిష్ఠ మహర్షి ఋత్విజులైన బ్రాహ్మణులతో గూడి సీతాసహితుడైన రామచంద్రుని రత్న సింహాసనముపై ఆసీనుని గావించెను. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలమైన సుగంధ జలములతో, సహస్రాక్షుడగు ఇంద్రుని అష్టవసువులు అభిషేకించినట్లు అభిషేకించిరి. ఆకాశము నందు నిలిచిన లోకపాలకులు, దేవతలు సకల ఓషధీ రసములతో అభిషేకించిరి. పూర్వము మనువును రాజుగా ప్రతిష్టించునప్పుడు బ్రహ్మ రత్న శోభితమగు కిరీటమును నిర్మింప జేసి ధరింప జేసినాడు. ఆ కిరీటమునే వసిష్ఠ మహర్షి శ్రీరామునికి ధరింప జేసెను.
ఛత్రం తస్య చ జగ్రాహ శత్రుఘ్నః పాణ్డురం శుభమ్
శ్వేతం చ వాల వ్యజనం సుగ్రీవో వానరేశ్వరః 6.131.65
అపరం చన్ద్ర సంకాశం రాక్షసేన్ద్రో విభీషణః
సింహాసనముపై కూర్చున్న శ్రీరామునకు శత్రఘ్నుడు శ్వేత ఛత్రమును, సుగ్రీవుడు తల్లటి వింజామరను, విభీషణుడు చామరమును పట్టుకొనిరి. ఇంద్రుని ప్రేరణచే వాయుదేవుడు నూరు బంగారు కమలములు గల మాలను, వివిధ రత్నములలో, మణులతో భాసిల్లుతున్న ముత్యాల హారమును రామునికి సమర్పించెను. శ్రీరామ పట్టాభిషేక సమయములో దేవ గంధర్వులు పాడిరి. అప్సరసలు నృత్యము చేసిరి. లోకమంతయు హర్షపారవశ్యములో యుండిరి. శ్రీరాముడు ఆ సమయములో బ్రాహ్మణులకు భూరి విరాళములు ఇచ్చెను. సుగ్రీవునకు దివ్య బంగారు మాలను ఇచ్చెను. అంగదునికి చంద్ర కిరణాలు గల రెండు కేయూరములను ఇచ్చెను. తనకు వాయుదేవుడు ఇచ్చిన ముత్యాల హారమును సీతాదేవి మెడలో వేసెను. 
తామ్ ఇ౦గితజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకా౭౭త్మజామ్ 6.131.77
ప్రదేహి సుభగే హారం యస్య తుష్టా౭సి భామిని
పౌరుషం విక్రమో బుద్ధి ర్యస్మి న్నేతాని సర్వశ:                   6.131.78
దదౌ సా వాయు పుత్రాయ తం హారమ్ అసితేక్షణా
సీతమ్మ తన మెడలో రాముడిచ్చిన ఆ హారమును తీసి చేతపట్టి వానరుల వైపు, రాముని వేపు పరి పరి చూచుచుండెను. అప్పుడు సీత అభిప్రాయమును చూపులచే గుర్తించిన రాముడు, సీతతో కల్యాణీ! నీకు పౌరుషముచే, పరాక్రమముచే, బుద్ధిచే ఎవరు నీకు సంతోషమును కలిగించిరో వారికి ఆ హారమును ఒసగమని చెప్పెను. ఆ శుభాంగి ఆ హారమును హనుమకు ఇచ్చెను. హనుమ ఆ హారముతో అధికముగా శోభించెను. ఈ విధముగా వాయుదేవుడు ఇచ్చిన హారము, వాయుసుతుడైన హనుమకు చేరెను. శ్రీరాముడు - విభీషణుడు, సుగ్రీవుడు, హనుమ, జాంబవంతుడు మొదలగు శ్రేష్ఠమైన వారికి మనోవాంఛితములగు వస్తువుల ద్వారా, అనేకమైన రత్నముల ద్వారా సత్కరించెను. వానరులు, సుగ్రీవుడు ఆనందముతో రామునికి నమస్కరించి కిష్కింధకు ఏగిరి. విభీషణుడు మాత్రము లంకారాజ్యము లభించినను తృప్తి నొందక నిలిచి యుండెను. శ్రీరాముడు అతని మనోరథమును ఎరిగి లంకకు అతనిని మరలించవలెననే యోచనతో బ్రహ్మచే ఒసగబడిన శ్రీరంగము అను పేరుగల రంగనాధుడు వేంచేసి యుండెడి విమానమైన తమ కులదైవమును విభీషణునికి ఇచ్చెను.  లబ్ధ్వా కుల ధనం రాజా లంకాం ప్రాయాన్మహా యశా: ఇక్ష్వాకు ప్రభువుల కులదైవమైన శ్రీరంగనాథ మూర్తిని గ్రహించి తన ఆరాథ్య దైవమైన శ్రీరాముని తన హృదయము నందు నిలుపుకొని లంకకు విభీషణుడు బయలుదేరెను. (శ్రీరాముడు, విభీషణుని తో సూర్యచంద్రులు, భూమండలం, రామాయణ గాథ ఉన్నంతవరకు దర్మనిరతితో రాజ్యపాలన చేయమని, అప్పటివరకు ఇక్ష్వాకుల కులదైవం ను అరాధించమని చెప్పెను. హనుమ, విభీషణుడు ప్రళయ కాలము వరకు ఉందురని చెప్పెను. ..ఉత్తరాకండము: 108 వ సర్గ) 
అయితే లంక కు వెళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు. కానీ సూర్యునికి అర్ఘ్యము ఇచ్చే సమయము కావడముతో ఈ విగ్రహాన్ని శ్రీరంగము, కావేరి నది ఒడ్డున పెడతాడు. కాసేపయినాక తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తుతాడు. కానీ ఆ విగ్రహం లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు. అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు (లంక దక్షిణ దిక్కున కలదు). ఈ అర్చామూర్తి ఉభయ కావేరి మధ్య భాగమున ఉండి పోయెను. లంక వైపు చూచుచు రంగనాధుడు ఆలయములో శయనించి యుండును. ఆ విమానము ప్రణవాకారముగా యుండును. విమానము పైన కూడా శ్రీరంగనాథుని మూర్తి లంకను చూచుచు వేంచేసి యుండును. ఈ క్షేత్ర మహత్యము, విభీషణుని చిరంజీవత్వము గురించి పూజ్యశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు రామాయణ ప్రవచనము చెపుతూ ఇలా తెలియ జేశారు. విభీషణుడు ఇప్పటికిని సముద్ర గర్భములోని కాంచన లంకలో చిరంజీవిగా యున్నారని అందుకు ఉదాహరణ చెపుతూ .. శ్రీరంగము యొక్క గుడిలో ఒకాయన రాత్రి నిద్రపోగా, విభీషణుని రామపూజకై  రాక్షసులు ఆ గుడిలోని పూలు తీసుకొని వెళుతూ పొరపాటున పూలతో పాటు నిద్రపోతున్న ఆ వ్యక్తిని కూడా తీసుకొని వెళ్లి పూజా మందిరములో పెడతారు. విభీషణుడు రామపాదములను ఆ పూలతో పూజ చేయుచుండగా వాటిలో ఈ వ్యక్తి కూడా వచ్చాడు. అపుడు విభీషణుడు హడలిపోయి, వాని దీనావస్థను చూచి జాలిపడి మరల రాక్షసులు విభీషణుని ఆదేశముతో శ్రీరంగములో దిగబెట్టి వచ్చారు. 
వానరులు రాక్షసులు అందరూ వారివారి స్థానములకు ఏగిన తర్వాత శ్రీరాముడు పరమ ఔదార్యముతో, పరమానందముతో రాజ్యమును పరిపాలించాడు. లక్ష్మణుడు యువరాజ్యపదవిని నిరాకరించగా, శ్రీరాముడు భరతుని యువరాజుగా చేసెను. శ్రీరాముడు పౌండరీకము, అశ్వమేథము, వాజపేయము మొదలగు యజ్ఞములను తరచుగా నిర్వహించెను. శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకూ వధవ్యము లేకుండెను. ప్రజలకు క్రూరమృగముల బాధ లేదు. రోగగ్రస్తులు గాకుండిరి. దొంగల భయము లేకుండెను. ఎటువంటి అనర్థములు లేకుండెను. పెద్దలు బ్రతికి యుండగా వారి పిల్లలు మృత్యువాత పడకుండిరి. ప్రజలెల్లరు ధర్మనిరతులై యుండిరి. ప్రజలందరూ దీర్గాయువులై, సంతాన సమృద్ధి కలిగి, శోక రహితులై, ఆరోగ్యముతో వర్ధిల్లిరి. వృక్షములు పుష్ప, ఫల భరితములై యుండెను. సకాలములో వర్షములు గురియు చుండెను. వాయువు హాయిని గొల్పుచు వీచుచుండెను. అన్ని వర్ణముల వారు దురాశ లేక తమ తమ కర్మలచే ప్రవర్తిల్లుచు, సంతుష్టులై యుండిరి. ఎవరి నోటా విన్నాను రాముని గాధలు, రామనామము మాత్రమే వినబడుచుండెను.
రామో రామో రామ ఇతి ప్రజానా మ౭భవన్ కథా:
రామభూతం జగద౭భూ ద్రామే రాజ్యం ప్రశాసతి 6.131.99
రాముడు పాలించు కాలము నందు ప్రజలందరూ "రాముడు, రాముడిని" రాముని గూర్చియే ముచ్చటించుకొనిరి. అంతారామ మయం, జగమంతా రామమయం
దశ వర్ష సహస్రాణి దశ వర్ష  శతాని చ
భ్రాత్రుభి: సహిత: శ్రీమాన్ రామో రాజ్య మ౭కారయత్  6.131.103
ఈ విధముగా శ్రీరాముడు 11,000 సంవత్సరములు (9,974 సంవత్సరముల 10 నెలలు సీతాదేవితో కూడి, 1,025 సంవత్సరముల 2 నెలలు సీతా వియోగముతో) సోదరులతో కూడి  రాజ్య పాలన చేసి వైకుంఠమునకు ఏగెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment