Sunday 22 March 2020

*శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.5*
*అగస్త్య ముని ప్రభావము*

అగస్త్య ముని ఆశ్రమానికి వెళుతూ శ్రీరాముడు ఆ ముని యొక్క ప్రభావమును లక్ష్మణునికి చెప్పుచున్నాడు........
పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, తన సోదరుడైన వాతాపిని శాకరూపమున మార్చి, శ్రాద్ధమునకు తగినట్లుగా కూరగా వండి విధివిధానంగా శ్రాద్ధ భోజనంలో ఆ కూరను వడ్డించే వాడు. భోజనము పూర్తి అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి  హస్తోదకం వేసి ' వాతాపి! రా........' అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.
ఇలా చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి 'వాతాపి! రా.....' అన్నాడు.

*కుతో నిష్క్రమితుం శక్తి: మయా జీర్ణ స్య రక్షసః*
*భ్రాతు స్తే మేష రూప స్య గతస్య యమ సాదనమ్* 3.11.64

“నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా " అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు. ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా" అని రాముడు అన్నాడు.

*అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా*
*ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాన్త శ్రమ అపహః*      3.11.79
*మార్గం నిరోద్ధుం నిరతో భాస్కర స్యా౭౭చలోత్తమః*
*సందేశం పాలయం స్తస్య విన్ధ్య: శ్శైలో న వర్ధతే*     3.11.85

తన తపః ప్రభావముచే వింధ్య పర్వతమును స్థంబింప చేసినాడు కావున ఈయనకు అగస్త్య మహర్షి అని పేరు వచ్చినది. ("అగమ్ (పర్వతం) స్థంభయతీతి అగస్త్య"). సూర్యుని మార్గమునకు (గమనమునకు) అడ్డు వచ్చుచున్న ఈ మహా పర్వతము అగస్త్యుని ఆదేశానుసారం పెరుగుట మానివేసింది. అట్టి ప్రభావశాలి అయిన అగస్త్య మహర్షి ఆశ్రమము లోకి సీతారామలక్ష్మణులు వెళ్లి సాదర నమస్కారములు చేసిరి. అగస్త్యుడు స్త్రీల స్వభావమును వివరించుతూ .... స్త్రీల స్వభావము సృష్టి మొదలు ఎల్లకాలముల యందు ఒకే విధముగా ఉండును. ఎంత ప్రేమింతురో అంత తొందరగా వారి మనసు మారును. పరిస్థితులు అనుకూలముగా ఉన్నచో ఎక్కువగా ప్రేమింతురు. విషమము అయినచో ప్రియుని కూడా విడుతురు. మెరుపు లోని చాంచల్యము, శస్త్రము లోని తీక్షణత, వాయువు యొక్క, గరుడుని యొక్క వేగము స్త్రీలకూ ఉండును. కానీ సీత అందరి వాటి స్త్రీ కాదు. ఈమెకు ఇట్టి దోషములు లేవు.

*త ద్ధను స్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద*
*జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా*   3.12.35

మహర్షి రాముడికి విష్ణు ధనుస్సుని (పూర్వము ఈ వైష్ణవ ధనుస్సు పరశురాముని నుండి శ్రీరామునికి చేరెను. అతడు దీనిని వరుణునికి ఇచ్చెను. ఆ వరుణుడు దీనిని అగస్త్యునికి ఇచ్చెను. ఇప్పుడు మరల అగస్త్యుడు రామునకు ఇచ్చెను), బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. శ్రీరాముని కోరిక మేరకు మహర్షి ... ఇక్కడికి దగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. నువ్వు సీతమ్మను భద్రంగా కాపాడుకో " అన్నారు. ఇక్కడ "సీతమ్మను భద్రంగా కాపాడుకో" అనడంలోనే మహర్షి రాబోవు సీతాపహరణమును సంకేతముగా సూచిస్తున్నారు.

స్పందన లేని శూన్య అవస్థకు *"అగస్త్యుడు"* అని పేరు. నిర్వికల్ప సమాధి అవస్థకు చేరిన తర్వాత ఈ శూన్య అవస్థ ప్రాప్తమగును. వృత్తి రహిత శూన్య అవస్థ యందు ఎల్లప్పుడును ఉండెడి ఉచ్చసాధకుని రామాయణకారుడు *"అగస్త్యుడు"* అని పేరిడెను. సంసారమును సాగరముతో పోల్చినారు. అలాంటి సాగరమును ఒకే ఆచమనముతో త్రాగినాడు. అటువంటి పరాక్రముడు, పురుషార్థి అగస్త్య మహర్షి. మూడు పగళ్లు, మూడు రాత్రులు శ్రీరాముడు అగస్త్యుని ఆశ్రమమున ఉండెననగా రామసాధకుడు శూన్య నిర్వికల్ప అవస్థ యందు మూడు రోజులు ఉండెను. పంచ ప్రాణముల సాధనయే పంచవటి.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

==***---

శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.6
పంచవటి
పంచవటి ప్రస్తుతము నాసిక్ ప్రాంతమందు ఉన్నట్లుగా కొందరి నమ్మకము. ఇక్కడ ఐదు వటవృక్షాలు ఉండుట వలన ఇది పంచవటిగా ప్రసిద్ధి చెందినది. అయితే కొంత శోధన చేసిన తర్వాత తెలియునది ఏమనగా ...  శ్రీరాముడు దండకారణ్యములో ఉన్న సమయములో సీతాపహరణ తర్వాత కలత చెంది, దుఃఖించుతూ లక్ష్మణునితో కలసి ఘోర అరణ్యములు తిరుగుతూ కర్తవ్యము పాలుపోక ఉన్న స్థితిలో అగస్త్య మహాముని శ్రీరాముని సమీపించి మోహము వీడమని చెప్పి విరజా దీక్ష (పాశుపత. శివ దీక్ష) ఇచ్చెను. ఆ మహర్షి ఆనతిన శ్రీరాముడు రుద్రాక్షలు, త్రిపుండరములు ధరించి గోదావరి తీరమున రామగిరి యందు శివ లింగము ప్రతిష్టించి శివానుగ్రహము కొరకు చాతుర్మాస్య దీక్షలో తపస్సు చేసెను. అందుకు శివుడు సంతోషించి పార్వతి పరివార సమేతంగా దర్శనము ఇచ్చి గొప్ప ధనస్సును, అమ్ములపొదిని, పాశుపతాస్త్రమును అనుగ్రహించి ఆశీర్వదించెను. సంశయాత్మ కలిగిన శ్రీరాముడు పరిపరి ప్రశ్నలు వేయగా శివుడు అతని మోహము పోగొట్టుటకు సమాధానాలు చెప్పెను. ఈ శ్రీరామ పరమేశ్వర సంవాదమే "శివ గీత". ఇది వ్యాస మహర్షి చేత వ్రాయబడిన పద్మ పురాణాంతర్గత ఉత్తర ఖండములోగల ఈ శివ గీత లో 779   శ్లోకాలు ఉన్నవి.   శ్రీరాముడు శివుని కోసము తపస్సు చేసిన రామగిరి ప్రదేశము భద్రాచలమునకు 55  కి.మీ.దూరంలో కూనవరం దగ్గర రామగిరి కొండలలో గోదావరి నదీతీరంలో శివాలయము ప్రతిష్టించబడినది. ఇది భైరవ క్షేత్రంగా ఆరాధించబడుతున్నది.  భద్రాచలం దగ్గర ఉన్నటువంటి పర్ణశాలయే పంచవటిగా మన తెలుగు ప్రజల ప్రగాఢ విశ్వాసము. సీతాపహరణము తర్వాత శోకతప్తుడైన రామునికి ఈ ప్రదేశము నందే పరమ శివును గురించి చాతుర్మాస్య దీక్షను తీసుకొనెను. అక్కడ నుంచి సీతాన్వేషణతో జటాయు మరణించిన ప్రదేశమునకు వెళ్లెను అదియే ఆంధ్ర ప్రదేశ్ అనంతపూర్ జిల్లాలోని లేపాక్షి (లే పక్షి అదియే కాలాంతరమున లేపాక్షిగా నామాంతరం చెందింది). అక్కడ నుంచి ఋష్యమూక పర్వతము నకు వెళ్లెను. అది ప్రస్తుతము కర్ణాటక లోని హంపి దగ్గర ఉన్నది. ఆయా ప్రదేశములన్నియు లేఖకుడు (దుర్గా ప్రసాద్ చింతలపాటి) దర్శించియున్నాడు. ఇక్కడ ఇంకొక విషయము గమనించ వలసినది. సీతను అశోక వనములో పెట్టునప్పుడు, రావణుడు సీతకు పండ్రెడు మాసముల గడువు ఇచ్చినాడు (శృణు మైథిలి, మాద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని). అక్కడ నుంచి గమనించితే శ్రీరాముడు నాలుగు నెలలు పరమ శివుడుని గురించి తపస్సు చేయుచు చాతుర్మాస్య దీక్షలో యున్నాడు. తరువాత వర్ష ఋతువు కారణంగా (మూడు నెలలు) సీతాన్వేషణకై  సుగ్రీవాదులు  ప్రయత్నము చేయలేదు.  తరువాత సీతాన్వేషణకై ఒక నెల గడువు వానరులకు సుగ్రీవుడిచ్చెను. దక్షిణమునకు ఏగిన అంగదాదులు మరియొక మాసము అదనంగా తీసుకొనిరి. హనుమ సీతామాత దర్శనము చేసుకున్నప్పుడు, రావణుడు ఇచ్చిన గడువు రెండు నెలలే ఉంది అనును. ఇవి మొత్తము 11 నెలలు అయినది. కావున భద్రాచలం వద్ద ఉన్న పంచవటీయే నిజమైన పంచవటి అని మదీయ ప్రగాఢ విశ్వాసము. (శబరి నదీరూపమున ప్రవహించెనని కొందరి అభిప్రాయము. కానీ రామాయణకారుడు ఇట్టి విషయము చెప్పలేదు గావున గమనించవలసినది) ఏదైనా ఎవరి విశ్వాశములు వారివి.
శ్రీరామ జయరామ జయజయ రామ

==(())--

శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.7
పంచవటి నివాసము, లక్ష్మణునికి జ్ఞాన బోధ
అచట గృధ్ర రాజైన "జటాయువు" శ్రీరాముని కలిసి అత్యంత మైత్రిని దృఢపరచు కొనెను. ఒకసారి శ్రీరాముడు సుఖాసీనుడై ఉన్న సమయమున జ్ఞాన వైరాగ్య మాయా స్వరూపములను, ఈశ్వరునికి జీవునకు గల బేధములను, మిమ్ములను సేవించు మార్గము ఉపదేశించి వలసినదిగా శ్రీరాముని, లక్ష్మణుడు కోరెను. అప్పుడు శ్రీరాముడు ఈ విధముగా వివరించెను[1].
లక్ష్మణా! మనస్సు, బుద్ధి, చిత్తములను స్థిరముగా ఉంచి వినుము. నేను, నాది, నీవు, నీది అను భావమే "మాయ". ఇదియే జీవులను తన వశము నందు ఉంచుకొనును. ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, మనోగతులు - ఇవి అన్నియు "మాయా స్వరూపములే". ఈ మాయ రెండు విధములు. ఒకటి విద్య, మరియొకటి అవిద్య. వీటిలో అవిద్య దుష్టమైనది, మిక్కిలి దుఃఖ ప్రదమైనది. దీనికి వశమైన జీవుడు సంసార కూపమున పడును. రెండవది విద్య. ఇది త్రిగుణాత్మకమైనది. అందరిలో సమత్వ బుద్ధితో పరమాత్మ రూపమునే "జ్ఞానము" అనబడును. సకల సిద్ధులను, మూడు గుణములను గడ్డిపోచ వలె భావించు వాడే పరమ "విరాగి". జీవుడు ఈశ్వరాంశ, కనుక సచ్చిదానంద జ్ఞాన స్వరూపుడు. కానీ మాయాజానితమైన అవిద్య (అజ్ఞాన) ప్రభావమున జీవుడు తన స్వరూపమును గాని, ఈశ్వరుని మాయను గాని ఎరుంగ లేక యున్నాడు. కావున వివిద లౌకిక కర్మాసక్తుడై జీవుడు బంధములో చిక్కు కొనుచున్నాడు. ఈ బంధముల ఛిజ్జడ గ్రంధి నుండి విముక్తుడై మోక్షమును పొందుటకు సర్వాతీతుడు, మాయా ప్రేరకుడైన పరమేశ్వరుని అనుగ్రహము ఆవశ్యకము. దీనికి భక్తియే సాధన మార్గము. ధర్మాచరణము వలన వైరాగ్యము, యోగాభ్యాసము వలన జ్ఞానము జనించును. జ్ఞానము వలన మోక్షము లభించును. ఈ విధముగా వేదములలో చెప్పబడినది. సోదరా! నా హృదయమును త్వరగా ద్రవింప చేయునది భక్తి. ఇదియే నా భక్తులకు పరమానందమును పంచి ఇచ్చును. ఈ భక్తి స్వతంత్రమైనది. దీనికి ఇతర సాధనములు అవసరము లేదు. జ్ఞానవిజ్ఞానములు దీనికి అధీనములు. ఇది సర్వ సుఖములకు మూలము. సజ్జన సాంగత్యము వలననే ఇది లభించును. ఇప్పుడు భక్తి సాధన రీతులను సవిస్తరంగా వివరించెదను. మొదట పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి ఉండవలెను. వేదోక్తముగా విధులను నిర్వర్తించవలెను. తత్ప్రభావము వలన విషయవాంఛలపై విరక్తి ఏర్పడును. విరక్తి వలన నా ధర్మము (పూజ) నందు అనురాగము కల్గును. అప్పుడు శ్రవణాది నవవిధ భక్తి మార్గముల యందు మనస్సు దృఢమై ఉండును. మనస్సు నా లీలలు యందు అనన్య ప్రేమతో నిమగ్నమగును. అట్టి నా భక్తులకు సజ్జన పాదపద్మములపై అత్యంత ప్రేమ యుండును. అతడు త్రికరణ శుద్ధి కలిగి నియమ పూర్వకముగా నన్ను భజించు చుండును. నన్నే గురువు, తల్లి, తండ్రి, సోదరుడు, పతి, దైవము అని భావించుతూ సేవించు చుండును. నా గుణములు కీర్తించు చున్నప్పుడు అతడు పులకిత గాత్రుడగును. అతని కంఠము గద్గదమగును. నేత్రములు నుండి ప్రేమాశ్రువులు ప్రవహించు చుండును. అతని యందు కామము, మదము, దంభము మొదలుగునవి ఏ మాత్రము ఉండవు. అట్టి అనన్య భక్తునకు నేను సర్వదా వశుడనై ఉందును.
దో-బచన కర్మ మన మోరి గతి, భజను కరహి ని:కామ|
తిన్హ  కే   హృదయ కమల మహు, కరఉ సదా బిశ్రామ||  (దో|| 16 )
మనోవాక్కర్మల యందు సర్వదా నన్నే స్మరించుతూ నిష్కాముడై నన్ను భజించు వాని హృదయమే నా నివాస స్థానము.
యోగవాసిష్ఠములో వసిష్ఠుడు శ్రీరామునికి అవిద్య, బంధ మోహములు, మోక్షము మున్నగు వాటి గురించి వివరించెను. అవి ... ఎల్లపుడు ఉండునది బ్రహ్మతత్వమే అని, అస్థిరమైన మనస్సు, అవిద్యచే ఈ ప్రపంచము సత్యముగా తోచుటయే బంధమని కానీ నిజముగా ఆత్మ శుద్ధ మైనది అని పూర్వ కర్మలు లేని వానిని మృత్యువు కూడా ఏమిచేయలేదని ఆకాశజో పాఖ్యానమున వివరింపబడినది. పరమాత్మ యొక్క మాయాశక్తి అయిన మనస్సే జగమును సృజించు చున్నది కానీ వాస్తవంగా ఈ జగత్తంతా మాయ అని లీలోపాఖ్యానమున వివరింపబడినది. బ్రహ్మమే సత్యము, జీవుడు ఆ పరబ్రహ్మమే ఇరువురికి భేదము లేదు. మనస్సు నందు జనించిన సంకల్ప వికల్పాలే ప్రపంచముగా తోచును. కావున అట్టి మనస్సును నిగ్రహించి పరమాత్మ జ్ఞానం వలన ముక్తిని పొందాలి అని పరమాత్మ వస్తువు ఒక్కటే సత్యమని కర్కటోపాఖ్యానమున వివరించారు. జగద్రూపముగా ఉన్న మాయాస్వరూపాన్ని దాశురోపాఖ్యానములో వివరించారు. ఉపశమ ప్రకరణము నందు మనస్సు ఎలా శాంతి పొందుతుందో దానికి ఉపాయాలు ఏమిటో వివరించారు.  చిత్తాన్ని జయించనంత వరకు మాయ తొలగదు అని గాధి ఉపాఖ్యానములో చెప్పారు. చిత్త విశ్రాంతి కోసము సంగాన్ని త్యజించాలని, ప్రాణ నిరోధము చేయాలి అని వీతహవ్యోపాఖ్యానములో తెలియ చేసారు.
ఈ విధముగా జ్ఞాన వైరాగ్య గుణ నీతి చర్చలతో కొంత కాలము గడచెను.
శ్రీరామ జయ రామ జయజయ రామ
[1] ఈ కధాంశము శ్రీ తులసీదాసు విరచిత "శ్రీ రామచరిత మానసము" లోనిది. వాల్మీకి రామాయణములో లేదు. కావున గమనించ గలరు.
--(())--

శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.8
శూర్పణఖ శృంగభంగము
జ్ఞాన వైరాగ్య గుణ నీతి చర్చలతో ఆనందముగా కాలము గడుపుతున్న సమయములో రావణుని సోదరి అయిన శూర్పణఖ రామలక్ష్మణులను చూచి కామాతుర అయ్యినది. ధర్మజ్ఞాన హీనులైన, కామాంధలైన స్త్రీలు సుందర పురుషుడిని చూడగానే అతడు సోదరుడు, తండ్రి, పుత్రుడు అను వివక్షతను కోల్పోయి మనోవైకల్యము పొందుదురు. ఆమె సుందర రూపమును దాల్చి రాముని తనను పెండ్లియాడుమని, శ్రీరామునితో ఉన్న స్త్రీని (సీతను) వదలమని కోరెను. అందుకు శ్రీరాముడు తిరస్కరింపగా సీతపై దాడికి దిగెను. శ్రీరాముని సూచనపై లక్ష్మణుడు శూర్పణఖను విరూపను గావించెను. పరాభవం పాలైన శూర్పణఖ తన సోదరులైన ఖర దూషణాదులను ఆశ్రయించెను. (ఖర దూషణ త్రిశురులు పూర్వజన్మలో యాజ్ఞవల్క్య శిష్యులు. వారు పరమశివుని ఆగ్రహమునకు గురై రాక్షసులుగా జన్మించిరి. శ్రీరాముని చేతిలో హతమైన తర్వాత వారికి శాపవిముక్తి కల్గినది).
ఖరదూషణాదుల వధ
ఖరదూషణాదులు పదునాలుగువేల సైన్యము, మంత్రులతో ప్రాతఃకాల బాలసూర్యుని ఒంటరిగా చూచి మందేహాది రాక్షసులు[1] చుట్టుముట్టినట్లు వారు శ్రీరాముని చుట్టుముట్టిరి. అప్పుడు శ్రీరాముని రూపము పినాకము పట్టిన ప్రళయకాల రుద్రుని వలె ఉన్నదని వాల్మీకి వర్ణించెను.
రూపం అప్రతిమం తస్య రామస్య అక్లిష్ట కర్మణ:
బభూవ రూపం క్రుద్ధ స్య రుద్ర స్యేవ పినాకిన:[2]         3.24.25
అర్థ అధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః|
చతుర్ దశ సహస్రాణి రక్ష్సాం కామ రూపిణాం|
ఖర దూషణ ముఖ్యానాం నిహతాని మహామృధే||  3.30.34/35
రాముడు ఆ 14,000 మంది రాక్షసులని ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జరుగుతోందో అని కంగారుపడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగుపరుగున వచ్చి రాముడిని ముందునుంచి గట్టిగా కౌగలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి, వెనక నుంచి, మళ్ళి మళ్ళి కౌగలించుకుంది. అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. చంద్రుడివంటి ముఖంతో సీతమ్మ కౌగలించుకునేసరికి రాముడు తన కష్టాన్నంతా మరిచిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు.
ఖరదూషణుల వధలోని అంతరార్థమును గ్రహించుదాము. రామలక్ష్మణులనే ఇరువురు వ్యక్తులు వేల మంది రాక్షసులను ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించి గలరా! సాధకుని జీవాత్మరూప రాముడు, వివేక రూప లక్ష్మణుడు బలగముగా యున్నచో అంతఃకరణము నందు యున్న వేలకొలది దుర్గుణా రూప రాక్షసులను సంహరించ వచ్చును. ఖర దూషణులు ఎవరు? "క్షర" ము నుండి "ఖర" శబ్దము ఉత్పన్నమయినది. సాధనలలో కలుగు అనుభవములలో మునిగి పోయినచో ఆధ్యాత్మిక ఉన్నతి కలుగదు. పాత అనుభవములు (ఖరము) వదలి వేసినచో సాధకునకు క్రొత్త అనుభవములు కల్గును. ప్రారంభ దశలో ఉన్న సాధకుడు ఆ అనుభవములు (క్షరము) వదిలి వేయుటకు ఇష్టపడడు. రామునిగా మారవలెనన్నచో తన యందున్న అనుభవములు వదలలేని గుణములను సంహరింపవలెను. అంతేకాకుండా లోకుల నుండి కలుగు దూషణములు కూడా వదిలి వేయాలి. సామాన్యముగా సాధకుడు దూషణములకు భయపడి తాను చేయు సాధనమును వదులును. దూషణములు వదిలి సాధనములో ముందుకు పోవాలి. రామలక్ష్మణులు ఈ విధముగా ఖరదూషణాదులను వారి సైన్యముతో సహా సంహరించిరి.
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] మందేహాది రాక్షసులు సూర్యుని బాధించు చుందురు. సంధ్యోపాసన చేయువారు తమ సంధ్యావందన కార్యక్రమము నందు సూర్యునకు మూడు పర్యాయములు అర్ఘ్యమును సమర్పించుదురు. ఆ అర్ఘ్యములు బ్రహ్మాస్త్ర, బ్రహ్మదండాస్త్ర, బ్రహ్మశిరోనామకాస్త్రములై ఆ మందేహాది రాక్షసులను పారద్రోలును. ఆ విధముగా సూర్యునికి రాక్షస బాధ తొలగును. కనుక ఈ అర్ఘ్య ప్రధాన ప్రభావమును గ్రహించి, సంధ్యోపాసకులు తమ సంధ్యావందనమును విధిగా ఆచరింపవలెను. అర్ఘ్య ప్రధాన ప్రభావమును విస్మరించరాదు. దానిని ముఖ్య కర్తవ్యముగా భావించవలెను. లేనిచో సూర్యుని బాధ తమకు బాధాకరంగా మారును. ఇది సార్వకాలిక సత్యము.
శ్లో|| తస్మాన్నోల్లంఘనం కార్యం, సంధ్యోపాసన కర్మణః| స హంతి సూర్యం సంధ్యాయాం, నో పాస్తిమ్ తు యః||  (విష్ణుపురాణం  2/8)
[2] స్కంద పురాణమున ఈ ఘట్టమున శ్రీరాముని రూపమును ఈవిధముగా వర్ణింప బడినది.
శ్లో|| శంఖం చక్రంచ శూలంచ  పినాకం ఖేటమేవ చ| ఖట్వామ్ ఘంటాం చ  ఢమరుమ్ బాణపాశాంకుశాం తథా|| చాపం వజ్రంచ ఖడ్గంచ పరశుమ్ త్రాసకారణం| జయ శ్రియంచ గంగాంచ దదృశు: సిద్ధచారణా||

==(())--

శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.9
ఖరదూషణాదులు శ్రీరాముని చేతిలో హతులైన విషయము అకంపనుడు రావణునికి తెల్పుట
‌అకంపనుడు ఆ యుద్ధమును చూచి రాముని దివ్యత్వమును, పరాక్రమమును గుర్తించి అతనితో విరోధించుట రావణునికి హితము కాదు అని గుర్తించినాడు. శూర్పణఖ అహంకారగ్రస్త. కామప్రవృత్తియే కానీ వేరొకటి ఆమెకు తెలియదు. కావున ఆమె రావణుని కలసి తప్పుదారి పట్టించుటకు ముందే కలవవలెనని యోచించి ముందుగా రావణుని కలసినాడు. జనస్థానములోని ఖరదూషణాదులతో సహా సమస్త రాక్షసులు శ్రీరాముని చేతిలో నిహతులైనారు అని చెప్తాడు. శ్రీరాముడు అశేష బలపరాక్రములు గలవాడు, జయింప శక్యము కానివాడు అని చెప్పెను. అయితే మూర్ఖుడైన రావణుడు వినడని యోచించి లౌకిక దృష్టితో శ్రీరాముని సంహరించుటకు ఉపాయమును తెలియచేయుచున్నాడు. రాముని యొక్క భార్య అయిన సీత జగత్తున ప్రసిద్ధురాలు, సౌందర్యవతి, స్త్రీలలో శ్రేష్ఠురాలు. రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో " అన్నాడు.
యోగదృష్టితో అకంపనుడి వివరము తెలుసుకొందాము. "అకంపనము" అనగా కంపన రహితమైన శూన్య అవస్థ. అదే ఆత్మావస్థ. ఆత్మ రూపమును తెలుసుకొనగోరు సాధకుడు తన సీతావృత్తిని త్యజించి బ్రహ్మార్పణము గావింప వలెను. సీత వృత్తి బ్రహ్మ రూప రావణుని యందు లీనము కావాలి. అప్పుడే రామ రూప సాధకుడు బ్రహ్మ రూపముగా మారగలడు. కానీ మనస్సు తన పూర్వ సంస్కారములను త్యజించుటకు ఇష్టపడదు. అందుచే అటువంటి మనస్సును బ్రహ్మ వృత్తియే హరణము చేయ వలసి యున్నది. సీతారాముల మధ్య ఉన్న అవినాభావ సంబంధము పూర్వ సంస్కారములు వలన విడదీయరానిది. సాధకుని బ్రహ్మ వృత్తి అయిన రావణుడు ఆక్రమణ ద్వారా సీతా వృత్తిని అపహరించుటకై సంకల్పించెను. అయితే రాముడు పరాక్రమశాలి. సీతను విడువడు. సీత కూడా రాముని తప్ప అన్య ప్రవృత్తిని అంగీకరింపదు. "అకంపన" అనే శూన్య అవస్థ బ్రహ్మరూపమును (రావణుని) సీతావృత్తిని అపహరింపుమని ప్రోత్సహించెను. సీతావృత్తిని ఒక్కసారిగా బ్రహ్మరూపము గావించుట సాధ్యము కాదు కావున తగిన యోజన ప్రారంభమయ్యెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
==(())--


*శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.10*
*శూర్పణఖ రావణ దర్శనము, శ్రీరాముడు మాయ లేడిని సంహరించుట*
అకంపనుడు చెప్పిన తర్వాత సీతాపహరణము నకు సహాయము చేయవలసినదిగా రావణుడు మారీచుని దగ్గరకు వెళ్లెను. మారీచుడు శ్రీరాముని పరాక్రమము గురించి వివరించి అతనితో సీతాపహరణము ద్వారా శత్రుత్వమును కొనితెచ్చుకోవద్దని సలహా ఇస్తాడు. అంత రావణుడు లంకకు మరలి వెళతాడు. ఇంతలో శూర్పణఖ రావణుని రెచ్చగొట్టుచు విషయసుఖములో మునిగి సరిఅయిన గూఢచారి వ్యవస్థ లేకుండా రాజ్యములోని తన ప్రజల రక్షణ చూడకుండా మునిగిపోయావని నిందించును. రావణుని వలెనే శూర్పణఖ మూర్ఖురాలు, దుష్టురాలు, కామాతుర. రావణుడు తన విషయమును పట్టించుకొనుటకై అతనిని రెచ్చగొట్టినది. రామలక్ష్మణులపై అతనిలో ద్వేషమును పెంచినది. సీతాపహరణమునకు ప్రోత్సహించింది. అంతటితో ఆ రావణుడు సీతాపహరణకై నిశ్చయించుకొని మరల మారీచుని వద్దకు వెళ్లెను. అప్పుడు మారీచుడు సీతాపహరణ ప్రయత్నము మాని పరాక్రమము కలిగినచో రామునితో ఎదురుగా నిలిచి పోరుసల్పమని సలహా ఇచ్చెను. అందుకు రావణుడు క్రుద్ధుడై  సహాయము చేయక పోయినచో తన చేతిలో మరణము సంభవించునని చెప్పెను. అందుకు మారీచుడు ధర్మాత్ముడైన రాముని చేతిలో మరణమే మేలు అని అలోచించి సహాయపడుటకు నిశ్చయించుకొనెను. మారీచుడు మాయ (బంగారు) లేడి రూపములో పంచవటి ప్రాంతములో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించెను. సీత దానిని చూచి ముచ్చటపడి తెచ్చి ఇమ్మని రాముని కోరెను.  ఆమె కోర్కెను తీర్చుటకై సీత రక్షణ భారమును లక్ష్మణునికి అప్పగించి లేడిని తీసుకొని వచ్చుటకై శ్రీరాముడు ఏగెను. ఆ లేడి శ్రీరాముని అరణ్యములో చాలా దూరము తీసుకొని వెళ్లెను. చివరికి శ్రీరాముడు ఆ లేడిని సంహరింపగా మారీచుడు తన రాక్ష రూపము ప్రకటించుతూ *"హా లక్ష్మణా!, హా సీతా!"* అని రాముని స్వరముతో అనుచు ప్రాణములు వీడెను. అట్టి మారీచుని మాయా అక్రనాదము విన్న తర్వాత ఆందోళన చెంది రామునికి సహాయము చేయవలసినదిగా సీత, లక్ష్మణుని ఆదేశించెను. రామునికి ఎట్టి అపాయము కలుగదని ఇది రాక్షస మాయ అని లక్ష్మణుడు సీతను వదలి వెళ్ళుటకు సిద్ధపడడు. అప్పుడు సీత తీవ్ర శబ్దజాలమును లక్ష్మణునిపై ప్రయోగించెను. 
*తమ్ ఉవాచ తత స్తత్ర కుపితా జనకా౭౭త్మజా*          3.45.4
*సౌమిత్రే మిత్ర రూపేణ భ్రాతు స్త్వమ౭సి శత్రువత్*
*య స్త్వమ్ అస్యామ్ అవస్థాయాం భ్రాతరం నా౭భిపద్యసే*  3.45.5
*ఇచ్ఛసి త్వం వినశ్యన్తం రామం లక్ష్మణ మత్కృతే*
*లోభా న్మమ కృతే నూనం నా౭నుగచ్ఛసి రాఘవం*      3.45.6
*వ్యసనం తే ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తి తే*
*తేన తిష్ఠసి విస్రబ్ధ స్తమ్ అపశ్యన్ మహా ద్యుతిమ్*                   3.45.7
లక్ష్మణా! రాముని సహాయమునకై పోకుండా ఉండుటలోని నీ కుటిల ఆలోచన నాకు తెలిసినది అని పరుషముగా మాట్లాడును. అందుకు నిస్సహాయుడై లక్ష్మణుడు రాముని వద్దకు వెళతాడు.
ఇందలి యోగ రహస్యమును పరిశీలిద్దాము.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
--((***))--

 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.11
మారీచ వధ లోని యోగ రహస్యము
మారీచుడు ఎవరో వాల్మీకి భావనలో చూచెదము.
రకారా౭౭దీని నామాని రామ త్రస్త స్య రావణ
రత్నాని చ రథా శ్చైవ త్రాసం సంజనయన్తి మే   3.39.17

"ర"  శబ్దమును ఉచ్చరించిన మాత్రముననే కష్టమును పొందువాడు మారీచుడు.  "రామ" అను మంత్రము లో "ర", అ, మ" అనే అక్షరాలు ఉన్నాయి. "ర" అంటే అగ్ని, "అ" అంటే సూర్యుడు, "రా" అనగా జ్ఞానము, "మ" అంటే చంద్రుడు, మనస్సు.  "రామ" అనే మంత్రములో లోకానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయి. అట్టి "రామ" శబ్దము లోని "ర" శబ్దము వినలేని వాడు మారీచుడు. జ్ఞానము అనగానే మనస్సు ఆందోళన చెందువాని భయముగా, మారీచ వృత్తిగా గమనించ వచ్చు. అట్టి వాడు ‌మానసిక ఉన్నతికి అనర్హుడు. రావణ ప్రవ్రుతిని ఇష్టపడును.  సాధన చేయుట వలన మారీచుడు కొన్ని సిద్ధులు పొందగలిగినా ఆత్మ జ్ఞానం పొందలేదు. మాయామోహితుడైన సాధకుడు ఈ సిద్ధులందు మోహితుడై ఆత్మ జ్ఞానము నుండి (జ్ఞాన మార్గము నుండి) మరలును. యోగావాసిష్ఠములో వసిష్ఠ మహర్షి శ్రీరామునికి వివరించుతూ ....ఆత్మ జ్ఞానము గలవానికి సిద్ధుల యందు వాంఛ ఉండునేగాని, సంపూర్ణమైన ఆత్మ జ్ఞానికి ఇటువంటి ఇచ్ఛ ఉండదు. పుర్యష్టకము, జీవునికి, ప్రాణం అనే పేరు గల కుండలిని ఆధారంగా ఉంది. పూరకం అనే అభ్యాసం చేత, శరీరం యొక్క స్థిరత్వం, గురుత్వం లభిస్తుంది. శరీరాన్ని మూలాధారం నుండి బ్రహ్మ రంద్రం వరకు తిన్నగా నిలిపి ప్రాణవాయువుని పైకి ఆకర్షించి, కుండలిని సంవిత్తుని పైకి పంపితే, దీర్గత్వాన్ని పొందిన కుండలిని, నాడులన్నిటిని తనతో తీసుకొని పైకి పోతుంది. ఇదే యోగి యొక్క ఆకాశగమనం. ఇక, రేచక ప్రాణాయామ ప్రయోగం చేత కుండలిని శక్తి సుషుమ్నా నాడిలో ప్రాణవాయు ప్రవాహం చేత శిరస్సు యొక్క  ఇరుకవాటాల  సంధిరూపమైన కవాటానికి 12  అంగుళాల దూరంలో ఉన్న షోడశాంతం అనే స్థానంలో ముహూర్తకాలం ఉంటె అప్పుడు ఆకాశంలో సంచరించే సిద్ధుల దర్శనము అవుతుంది. తత్వజ్ఞాని ఈ అల్ప సిద్ధుల్ని అధికంగా తలచక నిరతిశయానంద రూపమైన తన ఆత్మనే అధికంగా తలుస్తాడు. సిద్ధుల మాయలో పడి జ్ఞాన మార్గము నుండి తప్పిన వాడు "మారీచుడు".
తమ సిద్ధులను ప్రజల ఎదుట ప్రదర్శించి బ్రహ్మ జ్ఞానులమని తమ నేర్పరితనంతో ప్రజలను మభ్య పెట్టే కుహనా స్వాములను చూస్తుంటాము. అట్టివారు "మారీచులు, అకర్షకులు, ఆకర్షకులు". సీత వంటి పతివ్రత కూడా మోహితురాలై బంగారు జింక (మాయావి మారీచుని) ప్రాప్తికై వివేకము కల్గిన రామలక్ష్మణ సాధకులను ఇబ్బందులలో పడవైచును. ధనము, సంపద, ఆకర్షణ, కీర్తి ఇత్యాది మాయల నుండి అతీతులుగా ఉండుట చాలా కష్టము. గీతలో ఈ విధముగా చెప్పబడినది.
"దైవీ హ్యేషా గుణమయీ మమ మయా దురత్యయా!" (chapter 7 Verse 14) మాయ త్రిగుణాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. అటువంటి మాయలో పడి ఆత్మజ్ఞానము నుండి మారీచుని వలె వంచించబడుదురు. వైదేహి కూడా ఇటువంటి మాయలో పడి మోసపోవును. ఇట్టి మాయను శ్రీరాముడు గ్రహించును. కానీ సీతావృత్తికి ఎంత చెప్పినను మోహము వలన వివేకమును కోల్పోయి తన కాయవృత్తి (సీతావృత్తి)  అయిన రామసాధకుని కూడా బందీ చేయును. "యతతో హ్యపీ కౌంతేయ పురుషస్య విపశ్చితః! ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః!” (chapter 2 Verse  60) ఇంద్రియములు మహాశక్తి కలవి, మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగిపోనంతవరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంముగా లాగికొని పోవుచునే యుండును. వివేకము (లక్ష్మణుని) తో కూడిన రామసాధకుడు కూడా సీతా రూప ఇంద్రియ వృత్తి ఆధీనములో పడి మారీచ రూప మాయతో వెనుక పరిగెత్తును. ఇది విపత్తు లక్షణము. అందువలనే బ్రహ్మ వృత్తి రూప రావణుడు సీతను అపహరించెను. అయితే రామ సాధకుడు అటువంటి మాయను చేధించెను. ఇట్టి మారీచ మాయను సంహరించుట ఆవశ్యకము. మారీచుడు స్వార్థముతో రాముని చేతిలో మరణించిన స్వర్గ ప్రాప్తి కలుగునని రావణుని యోచనను అంగీకరించును. ఇతరులపై జరిగెడి అన్యాయమును లెఖ్ఖ చేయక స్వార్థముతో తాను స్వర్గము చేరెదని భావించుట ఆధ్యాత్మికత కాదు. అందుచే మారీచుడు ఇట్టి షడ్యంత్రములో భాగమయ్యెను. అది కాంచన మృగము కాదు, చంచల లక్ష్మి అని రాముడు గ్రహించెను. కర్మ ఫలితము, మోహము కలసి ఉండును. కర్మ యొక్క గతిలో బుద్ధి ఏమి చేయును? చంచల లక్ష్మి వెనుక త్యాగి అయిన సాధకుడు పరిగెత్తెను.
శ్రీరామ జయరామ జయజయ రామ


*శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.12*
*సీతాపహరణము*
మానవులుగా జీవించెడి వారికి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అను రెండు మార్గములు ఆవశ్యకముగా ఎరుంగ దగినవి. శరీరేంద్రియ మనోబుద్ధులతో ఈ లోకములో ధర్మార్థ కామములను పొందుటకు ప్రవర్థించుట ప్రవృత్తి మార్గము. భగవత్సేవ చేయుచు, భగవానునికి చెందిన ఈ విశ్వమును ప్రేమించుతూ, కర్మ జ్ఞానములను వానికే ఉపయోగ పరచుచు పొందవలసిన ఫలము భగవత్ప్రాప్తియే అని నిశ్చయించి దీనికి సాధనము భగవానుడే అను పూనిక తో ఈ లోకమున ప్రవర్తించుట నివృత్తి మార్గము. ఈ రెండు మార్గములను ఎరింగి, ఆచరించి, విశ్వమును ప్రేమించి సేవించి విశ్వాత్మకుడగు భగవానుని పొంది సేవించుచు ఆనందింప చేసి తాను ఆనందించుటకు ఎట్లు ప్రవర్తించ వలెనో ఎరుంగు వారందరకు శ్రీరామాయణమే శరణ్యము.  
తగిన అవకాశము కోసము ఎదురు చూచుచున్న దశగ్రీవుడు (రావణుడు) లక్ష్మణుడు అటు వెళ్ళుట గమనించి వెంటనే సన్యాసి వేషములో సీత ఎదుట నిలిచెను. యతి రూపములో ఉన్న క్రూరుడైన రావణుడు, రామపత్నిని చంద్రుడు లేని రోహిణిని క్రూర గ్రహము[1] వలె చూచెను. *(రోహిణీం శశినా హీనాం గ్రహవత్ భృశ దారుణః)*.
యతి రూపములో ఉన్న రావణుడు సీత యొక్క సౌందర్యమును వర్ణించుతూ, సీతతో ..  భయంకరమైన రాక్షసులకు  ఆలవాలమైన  ఈ అరణ్యము నందు నీవు నివసింప తగదు. అప్పుడు సీత, రామలక్ష్మణులకై ఎదురుచూచుచు, యతి వేషములో ఉన్న రావణునికి అతిధి మర్యాదలు చేసెను. ఇంకను తన మరియు శ్రీరాముని వృత్తాంతమును, వారి వనవాస కారణమును వివరించెను. వనవాసము ప్రారంభించే సమయానికి శ్రీరాముని వయస్సు 25 సంవత్సరములు అని తన వయస్సు 18 సంవత్సరములు అని చెప్తుంది. *(మమ భర్తా మహాతేజా వయసా ప౦చ వింశకః,  అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే 3.47.10)* తరువాత సీత, రావణునితో తన పరిచయము అడుగగా, యతి వేషములో యున్న రావణుడు తీవ్రమైన స్వరముతో తాను రాక్షసరాజైన రావణుడను, తనను పతిగా స్వీకరించవలసినదిగా కోరతాడు. అందుకు సీత తిరస్కరించగా ..రావణుడు క్రుద్ధుడై తన నిజరూపమును ప్రదర్శించెను. అప్పుడు దుష్టాత్ముడైన రావణుడు కామాతురుడై *(కామాతురాణాం న భయం న లజ్జా)* సీతాదేవి జుట్టును ఎడమ చేతితోను, ఆమె తొడలను కుడి చేతితోను పట్టుకొనెను. *(వామేన సీతాం పద్మా౭క్షీం మూర్ధజేషు కరేణ సః  ఊర్వో స్తు దక్షిణే నైవ పరిజగ్రాహ పాణినా 3.49.17)* అనంతరము రావణుడు పరుష వచనములతో సీతను భయపెట్టుచు ఒడిలోకి తీసుకొని రధము పైన ఉంచెను *(తత స్తాం పరుషై ర్వాక్యై ర్భర్త్సయన్ స మహా స్వనః,  అ౦కేనా౭౭దాయ వైదేహీం రథమ్ ఆరోపయ త్తదా* 3 49 20 )*. రథముతో ఆకాశ మార్గమున పయనించుచుండగా సీతాదేవి ఆర్తురాలై, నిస్పృహతో కలవరపడుచు బిగ్గరగా ఏడవ సాగెను. ఆ ఆర్తనాదములు విని పక్షిరాజైన జటాయువు రావణునికి అనేక హితవచనములు చెప్పెను. రావణుడు వాటిని వినక పోవడముతో రావణునితో యుద్ధము చేసెను. యుద్ధములో రావణుడు జటాయువును సంహరించెను. అక్కడ నుంచి నేరుగా రావణుడు, సీతను లంకా నగరంలోని తన భవనమునకు తీసుకొనిపోయి తన వైభవమును చూపించి ప్రలోభ పెట్టుటకు ప్రయత్నించగా సీతాదేవి విముఖత ప్రదర్శించును. అయినను రావణుడు సీతను తనను పతిగా స్వీకరించ వలసినదిగా ప్రాధేయ పడును. అందుకు సీత శ్రీరాముని చేతిలో రావణుని మరణము తధ్యము అని చెప్పును. అందుకు క్రుద్ధుడైన రావణుడు ఆమెకు ఒక సంవత్సరము గడువు విధించి, ఆమె రక్షణ భారము రక్కసులకు అప్పగించి ఆమెను అశోక వనమునకు చేర్చెను. తరువాత బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పిలిచి దేవకార్యము సిద్దించుటకై సీతా దేవి బ్రతికి యుండుట ఆవశ్యకము, ఎందుకనగా శ్రీరాముని పైన దిగులుతో ఆమె అన్నపాదులు స్వీకరించుట మానివేసినది. కావున ఆమెకు దివ్య పాయసాన్నము (హవిష్యాన్నము) ఈయవల్సినదిగా తద్వారా ఆమెకు ఆకలి దప్పులు ఉండవని చెప్తాడు. ఇంద్రుడు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం సీత దగ్గరకు వచ్చి ఆమెకు నమ్మిక కలుగుట కోసము అతని దివ్య దేవ చిహ్నములను ప్రకటించి ఆ దివ్య పాయసాన్నము ఇస్తాడు. సీత దానిని రామలక్ష్మణులకు నివేదన చేసి తాను భుజించెను.  ఇందలి యోగ రహస్యమును గమనిద్దాము.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

[1] క్రూర గ్రహములు (అంగారకుడు, శని మొదలుగునవి) రోహిణిని చూచుట లోకమునకు అనర్థదాయకం


[5:28 AM, 11/20/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.13
సీతాపహరణము యోగ రహస్యము
రావణుడు సన్యాసిగా "భవతి బిక్షామ్ దేహి" అనుచు ఆశ్రమ ద్వారమున నిలబడెను. సీత బిక్ష తెచ్చిన క్షణముననే మాయతో ఆమెతో సహా ఆకాశమార్గమున పరారయ్యెను. సామాన్య రూపములో, స్థూల దేహముతో ఆకాశ మార్గమున పోవుట సాధ్యము కాదు. సూక్ష్మ శరీరముతోనే సాధ్యము. ఆకాశమార్గమనగా ధ్యాన మార్గములో ఆకాశతత్వ ప్రాప్తిని చేరుకొనుట. ధ్యాన మార్గము ద్వారా రావణుడు సీతా వృత్తిని అపహరించెను. వృత్తుల హరణము ధ్యానము ద్వారా, చింతన ద్వారా జరుగును. చింతన మంచి చెడు వృత్తులలో ఏదైనా ఉండవచ్చు.  సీతా వృత్తి కేవలము రాముని (ఆనందము) మాత్రమే ఇష్టపడును. సీతకు శోకము కలుగకుండా ఉండుటకు రావణ వృత్తి ఆమెను అశోక వనములో ఉంచెను. కానీ సీత సాత్విక ఆనంద రూప రాముని మాత్రమే కోరుకొనును. బ్రహ్మ రూప రావణుని తిరస్కరించును. రావణుడు పూర్ణమైన బ్రహ్మరూపుడు కాడు. తన దశగ్రంధుల ముఖ రూపముల యందు అమితమైన ప్రేమ. రావణ శబ్దము "రవైతీతి  రావణః". తపస్వాధ్యాయ నిరతమైన రామరూప ఆనందము ముందు రావణ వృత్తిని సీత నిరాకరించింది. రాముని ప్రాణప్రియము చేసుకొనెను. పత్నికి పతి ప్రాణప్రియము కదా! పతివ్రతగా సీత ఆదర్శవంతురాలు. తన విద్వతను, ఆధ్యాత్మికతను ప్రచారములో పెట్టి కీర్తి రూప బలమును పెంచుకొనేడి వృత్తియే రావణుడు. ఈ విధమైన డాంబిక వృత్తి వలన తన చిత్తము మార్గము నుండి తప్పినదై రావణ వృత్తి యందే ఏకాగ్ర మగును. అటువంటి రావణ వృత్తిని సీత ఎందుకు ఇష్టపడును?    రావణుడు సీతను ఆకాశమార్గములో తీసుకొని వెళ్లునప్పుడు జటాయు  అడ్డుకొనును. "జటాయు" అనగా వేదజ్ఞానము. డాంబిక వేదజ్ఞానము రావణుఁడైతే, వాస్తవమైన వేదజ్ఞానము జటాయు. ఆకాశ మార్గములో నున్న రావణుని అడ్డుకొనవలెను కనుక అంతటి విశాల రూప జటాయు పక్షి రూపము ఎన్నుకొనబడెను. రావణ-జటాయు యుద్ధము నందు వాస్తవ వేద జ్ఞానము అపజయము నంది మరణించెను. ఇక్కడ రెక్కల రూపములో నున్న వేదవిహిత జ్ఞానము నష్టమై మృత్యువును ఎదుర్కొనుచు జటాయు పడిపోవును. అటువంటి వికాలావస్థలో యున్న జటాయును (వేదజ్ఞానము) రామ లక్ష్మణులు చూసి దుఃఖించుదురు. సీతా వృత్తిని తీసుకొని రావణ రూప అహంకార బ్రహ్మ వృత్తి పారిపోయెనని జటాయు (వేదజ్ఞానము) ద్వారా తెలియును. సాధకునకు నిరహంకార వృత్తి ఆవశ్యకము. లంక అనగా మాయావస్థ. అందువలన లంక సువర్ణమయము. ఈ సంసారము నందు సువర్ణము ఉన్నత శ్రేణి మాయ. రావణుని మాయాలంక సాగరమునకు ఆవలి వైపున ఉన్నది. ఇది సంసార సాగరము. కొందరు ఈ సంసారమును విడిచి ఆధ్యాత్మికత వైపు మాట్లాడెదరు. కానీ అంతఃకరణము నందు త్యాగము చేయక రావణ వృత్తితో కూడుకొన్న కామిని, కాంచనము, కీర్తి వీటి యందు అభిలాషతో ఉందురు. రావణుడు అదే విధముగా చూపబడెను. కాంచ రూపమందలి మోహముతో సీత ఈ మాయారూప లంకలో చిక్కుకొనెను. సీతావృత్తిని విడిపించుటకై ఈ మాయారూప లంక పైన రామ సాధకుడు యుద్ధము చేయును. బ్రహ్మ్మము నందు చరించే బ్రహ్మచారియైన హనుమంతుడు సీతను వెదుకుటకై ఈ లంకకే పోవును. కాంచన (చంచల) మృగము నందు సీత మోహితురాలైనది. సీతను రావణుడు సంపూర్ణ సువర్ణమయమైన నగరమునకు తీసుకొని పోయెను. సహజముగా సీత ఆనంద పరవశురాలు కావాలి. అనగా శోకము కలుగ కూడదు. అందుచేత సీతను అశోక వనము (శోక రహిత వనము) నందుంచెను. కానీ సీత (వృత్తి) యొక్క సంస్కారము రామ సాధకునితో ముడిపడి యున్నది. కనుక సీత అశోక వనమున శోకించుట చూపబడినది. రామరావణ వృత్తి యుద్ధమే రామాయణము. వాసుదేవానంద సరస్వతి ఆదిగా గల కొంతమంది మహానుభావులు ఈ సత్యము ఎరింగి యుండిరి. (ఈ విషయము స్థూలంగా ఉపోద్ఘాతములో చెప్పుకొన్నాము).
మాయ అనునది జీవుని ఆవరించును. ఆ మాయయే మృగముగా వచ్చిన మారీచుడు. మృగమరీచి అనగా ఎండమావి. మాయ ఆత్మను ఆవరించినప్పుడు భగవత్ స్వరూపము మరుగున పడును. అందుకనే కాంచన మృగమును చూడగానే మాయ వలన కోరిక కలిగి రాముని దూరము చేసుకొనును. రజోగుణముతో నిండిన మనస్సు ఆత్మను బంధించును. ఇది బంధనమునకు మూలము. కానీ సీతమ్మకు అట్టి బంధనమును వీడవలెనని స్ఫురణ గల్గును. రామునే స్మరించు చుండును.
శ్రీరామ జయరామ జయజయ రామ
Only admins can send messages



*శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.14*
*శ్రీరాముని శోకము-జటాయు మరణము*
జటాయు మరణించిన ప్రదేశము వాల్మీకి రామాయణములో రామలక్ష్మణులు ప్రయాణించిన మార్గము ప్రస్తుతము ఆంధ్ర ప్రదేశ్ లోని లేపాక్షి గా గుర్తించవచ్చు. (లే పక్షి కాలక్రమములో లేపాక్షి గా నామాంతరం చెందినది). ఇంకొక ప్రచారములో నమ్మకము ప్రకారము, జటాయుపాక  ప్రదేశాన్ని ఏట పాక అని కూడా అంటారు, ఇది భద్రాచలానికి రెండు కి. మీ.ల దూరం లో కలదు. సీతాపహరణ సమయం లో ఆమె కేకలు విన్న జటాయువు రావణుడి తో ఈ ప్రదేశం లో యుద్ధం చేసాడని ఇక్కడే తన ప్రాణాలు కోల్పోయాడని, అయితే, తన ఒక రెక్క మాత్రం విరిగి ఎగిరి వెళ్లి ఇక్కడకు 55 కి. మీ. ల దూరం లో కల రెక్కపల్లి లో పడిందని చెపుతారు. తర్వాత రాముడు జటాయువు ద్వారా సీతాపహరణను తెలుసుకున్నాడని చెపుతారు.

రామలక్ష్మణులు పంచవటి నుంచి సీతాన్వేషణకై పశ్చిమము నుంచి దక్షిణ దిక్కుగా వెళతారు (పంచవటి నాసిక్ అని భావన చేసినట్లయితే పశ్చిమ నుంచి దక్షిణ కు వెళితే ఋష్యమూకము రాదు. కావున గమనించ గలరు)
లేడి వెంట వెళ్లిన రాముడు కామరూపి అయి అ
డవిలో పరిగెత్తుచున్న లేడి రూపములో ఉన్న మారీచుని చంపి వెనుకకు ఆశ్రమునకు వచ్చుటకు మరలెను. అప్పుడు రామునకు అనేకమైన దుర్నిమిత్తములు కనబడెను. ఆందోళనతో ఉన్న రామునకు లక్ష్మణుడు ఎదురు వచ్చుచు కనపడెను. రాముడు లక్ష్మణుడితో ... నీ మీద నమ్మకంతో సీతమ్మను అప్పగిస్తే ఆమెను ఆపదలో పడవేసి నా ఆజ్ఞను ధిక్కరించి రావడము తగదని చెప్పెను. రామలక్ష్మణులు ఇద్దరు ఆశ్రమమునకు వచ్చుసరికి ఆశ్రమములో సీత జాడ కనబడలేదు. సీత కనబడక పోవుసరికి రాముడు పరిపరి విధముల దుఃఖించెను. రాముడు సుక్షత్రియుడు. మాహాపరాక్రమశాలి. ముల్లోకములలోను రామునికి ఎదురుగా నిలబడగలిగిన వారు ఎవరూ లేరు. అటువంటి రాముని భార్యను దొంగ లాగ రావణుడు ఎత్తుకొని పోయినాడు. ఇప్పుడు రామునికి సీతమ్మను ఎవరైనా రాక్షసులు కానీ క్రూర మృగములు గాని భక్షించాయా! లేక ఎవరైనా శత్రుత్వముతో కానీ లేక వేరొక కారణము వలన గాని ఏ రాక్షసుడైన తీసుకొని వెళ్లాడా! అతనికి సమాచారం ఈయడానికి ఎవరూ లేరు. సర్వ శక్తివంతుడైనప్పటికీ భార్యను రక్షించు కోలేక పోయినాడనే అపప్రధ రాముని ఇంకనూ బాధించు చున్నది. ఇట్టి కష్టము ఎవ్వరికీ రాకూడదు. రామలక్ష్మణులకు అగమ్య గోచరంగా ఉన్నది. ఈ విధముగా అరణ్యము అంతయు సీతమ్మ జాడకై వెతుకుచు రాముడు ఆ అరణ్యములో కాన వచ్చిన పశు పక్ష్యాదులను, చెట్లను, పుట్టలను, పర్వతములను, గోదావరి నదిని  అన్నింటిని అడుగుచున్నాడు ... *"సీత కనిపించిందా?"*.  అలా వెళ్ళు చుండగా మృగము లన్నియు దక్షిణ దిశగా తల ఎత్తి పైకి చూచుచూ పోవుటను సూక్ష్మ బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు చూచెను. అప్పుడు రామునితో అన్నా! ఈ మృగముల సంకేతమును బట్టి మనము రాక్షసులకు ఆలవాలమైన నైరుతి దిశగా సీత జాడ కోసము వెదుకుదాము *(సాధు గచ్ఛావహే దేవ దిశం ఏతాం హి నైఋతిం)*  అని అటు ప్రయాణమైరి. అప్పుడు రాముడు భూమిపై పడి ఉన్న పుష్ప పరంపరను చూచి అవి సీత తన కురులపై ధరించినవిగా గుర్తించెను. అప్పుడు సెలయేళ్ళతో ఒప్పుచున్నట్టి ప్రస్రవణ పర్వతమును గమనించెను. ఆ పర్వతముతో  *కచ్చిత్ క్షితి భృతాం నాథ దృష్టా సర్వాంగ సుందరీ, రామా రమ్యే వనోద్దేశే మయా విరహితా త్వయా*  3 64 29 (పర్వత రాజ! సీతను చూచితివా అని అడిగెను). ఎక్కడ నుంచి సమాధానము రాకపోయే సరికి రాముడు క్రుద్ధుడై .. *మమ బాణా౭గ్నినిర్దగ్ధో భస్మీ భూతో భవిష్యసి, అసేవ్యః సతతం చైవ నిస్తృణ ద్రుమ పల్లవః*  నా బాణాగ్ని జ్వాలలలో మొత్తము భస్మీపటలనము చేస్తాను అంటాడు. ఇంతలో సమీపములోనే రాక్షసుడి పాదముద్రలు మరియు సీతమ్మ కాలిజాడలు కనుగొనెను. ఇంకా కొద్ది దూరములో విరిగిన బంగారు రథము, హతుడై యున్న సారధి, బాణములు కనపడెను. అది చూచి రాముడు కుపితుడై ఈ మహారణ్యమున సీతను ఎవ్వరును రక్షించలేదు. నాకు అప్రియము చేసి నన్ను అసమర్థునిగా చూచిన ఈ ఇంద్రాది దేవతలను, రాక్షసులను ఈ ముల్లోకములను ప్రళయ స్థితిని కలిగించుదును అని లోకములను ధ్వంస మొనర్చుటకు పూనుకొనెను. అప్పుడు లక్ష్మణుడు శాంత వచనములతో అన్నా! ఇక్కడ భయంకరమైన యుద్ధ చిహ్నములు కనబడుచున్నవి. మనము సావధానులమై ముందుకు సాగుదాము అనెను. కొంత తడవకు పర్వత శిఖరము వలె రక్తసిక్తముతో యున్న జటాయువు కనబడెను. అప్పుడు ఆ పక్షి రాజు నేను నీ తండ్రి ప్రియ మిత్రుడను. సీతను రావణుడు అపహరించాడు, నా రెక్కలను  ఆ రావణుడు ఖండించాడు అని చెప్పెను.  అయితే రావణుడు సీతను అపహరించుకు పోయిన సమయము *"వింద ముహూర్తము[1]"* అనగా నీనుండి దూరమైన సీతారూప ధనము తప్పక లభించును
*విన్దో నామ ముహూర్తో౭యం స చ కాకుత్స్థ నా౭బుధత్*
*త్వత్ ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వర:*
*ఝషవ ద్బడిశం గృహ్య క్షిప్రమ్ ఏవ వినశ్యతి*  3 68 13         
ఈ విధముగా చెప్పి జటాయు నేలకొరిగి ప్రాణములు అనంత వాయువులో కలసి పోయెను. రావణుని చేతిలో తీవ్రముగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకొన్న జటాయు శ్రీరాముడు వచ్చు వరకు బ్రతికి ఉండుటకు గల కారణము సీతా దేవి అనుగ్రహమే అని స్కాంద పురాణము చెప్పుచున్నది *(దేవీ మాం ప్రాహ రాజేంద్ర యావత్ సంభాషణం మమ, భవతాస్థావదాసన్ మే ప్రాణా ఇత్యాహ జానకీ)*
తరువాత జటాయుకు శ్రీరాముడు అంత్య క్రియలను ఒనర్చెను. నాచే దహన సంస్కారములను పొంది ఉన్నందున నీవు మోక్ష ప్రాప్తికి అర్హుడవు[2] అనెను. *(మయా త్వం సమ౭నుజ్ఞాతో గచ్ఛ లోకాన్ అనుత్తమాన్)*.  
అశోక వనములో నున్న సీత రాముని కొరకై శోకించు చుండగా దండకారణ్యములో రాముడు సీతకై దుఃఖించు చుండును. అది సాత్విక వృత్తులకై పడిన శోకము గాని సీత అనే భౌతిక అస్థిత్వము కొరకు కాదు. సాధనాకాలములో పూర్వపు సాత్విక వృత్తులను కోల్పోయినప్పుడు సాధకుడు గాబరా చెంది విలపించడము జరుగును వాసుదేవానంద సరస్వతి మాటలలో...
*రాజస స్వానుర్భూతిం తాం సీతాం యత్నాజ్ఞ హారః|*
*రామః పరాత్మామి తతః స్వాను ర్భూతిం వియోగతః||*
సీతా రూప స్వానుభూతులకై రాముడు విలపించెను. రామాయణములో తగినంత భాగము ఈ సీతా శోకమునకే వినియోగించ బడినది. రావణుడు పోయిన మార్గమును రామునకు తెలిపి జటాయు దేహత్యాగము చేసెను. చనిపోవుటకు ముందు జటాయు రామలక్ష్మణులకు పంపాసరోవరమునకు పోయి హనుమ, సుగ్రీవుల మిత్రత్వమును పొందుమని తద్వారా సీతను పొందవచ్చునని సలహా ఇచ్చెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

[1] "నష్టం ధనం విందతి (లభతే) అస్మిన్ - ఇతి  వింధః"  వింద ముహూర్త కాలమున నష్టమైన ధనము యజమానికి తప్పక లభించును.

శ్లో|| రౌద్ర: శ్వేతశ్చ మైత్రశ్చ తథా సారభటః స్మృతః|
సావిత్రో వైశ్వదేవశ్చ గాంధర్వః కుతపస్తథా||

రౌహినస్తిలకశ్చైవ 'విజయో' నైఋతస్తథా|
శంబరో వారుణశ్చైవ భగః పంచదశః స్మృత||

ఈ పదునైదు పగటి ముహూర్తములు. పదునొకండుధైన విజయ ముహూర్తమునకే 'విందము'  అని నామాంతరము.  

[2] తనను గూర్చి "ఆత్మానాం మానుషం మన్యే" (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న శ్రీరాముడు మోక్షమును ఎట్లు ప్రసాదించును? "సత్యేన లోకాన్ జయతి"  అను ప్రమాణము ననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడు అయినందున శ్రీరామునకు సర్వలోకములు అధీనములో ఉండును. కనుక శ్రీరాముడు మోక్షమును అనుగ్రహించుటలో విప్రతిపతి లేదు.

Note: సీతాపహరణం గ్రీష్మ ఋతువు లో జరిగింది. దక్షిణ భారతదేశంలో పగలు షుమారు 12 గంటలు. సీతాపహరణ సమయం పగటి ముహూర్తంలో 11వది. అంటే సీతాపహరణ సమయం ‌షుమారు పగలు మూడు గంటలకు కావచ్చు.

--(())-- 

శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.15
 

అయోముఖి
అరణ్య కాండములో అరణ్యములో సంచరించుచున్న రామలక్ష్మణులకు ఎదురు అయిన మొదటి రాక్షసుడు విరాధుడు. చివరి వాడు కబంధుడు. స్వాధీన ప్రవృత్తి, స్వార్ధ ప్రవృత్తి ఆత్మకు సహజములు కావు. శరీర సంబంధముచే అజ్ఞానము, జ్ఞానమును ఆవరించగా కలుగును. జీవుడు తాను చేయు చున్నాను, తన కొరకు చేయు చున్నాను అని శరీర భావముతో ప్రవర్తించును. అజ్ఞానముచే పరాధీనమై ప్రవర్తించుతూ స్వాధీన ప్రవృత్తి గల వాడను అని అనుకొనుట అజ్ఞాన విజృంభితము. ఈ విధముగా స్వాధీన ప్రవృత్తి, స్వార్ధ ప్రవృత్తి తో భగవంతునకు చెందిన వాడినని భావించుట అసురత్వము. వాని ప్రీతి కొరకై వాని అధీనమై ప్రవర్తించు చున్నానని భావించుట మానవత్వము. విరాధుడు అనగా అప్రీతిని కలిగించువాడు. అప్రీతిని కలిగించు స్వార్ధ ప్రవృత్తిని, స్వాధీన ప్రవృత్తిని అంతమొందించి భూమిలో పాతిపెట్టును. కానీ కబంధుని దహించినారు. కర్మ వలన, పుణ్య పాపముల వలన ఈ  శరీరము లభించును. రజస్తమో గుణములు విజృంభించినప్పుడు శాస్త్రములను లెక్క చేయక, పరహింసతో, స్వార్థముతో, అహంకారంతో ప్రవర్తించ వలెనని అనిపించును. ఇట్టి అసుర ప్రవృత్తికి చివరి హద్దు కబంధుడు. శరీర పోషణయే పరమ ప్రయోజనము అని అనుకొనెడి వాడు కబంధుడు.    యోగవాసిష్ఠములో వసిష్ఠుడు చెపుతూ ...   ఇందుకు గాను పూర్వ వాసనలను (పూర్వ కర్మలను) పురుష ప్రయత్నముతో జయించాలి, శుభ వాసనలను అభివృద్ధి చేసుకోవాలి అని చెప్తారు. ఇంకా చెపుతూ .. ప్రపంచ వాసనలన్నీ సన్నగిలిపోవుటమే మోక్షం. ఆ వాసనలు అభివృద్ధి కావటమే బంధం. అభ్యాసం వలనే వాసనలు బలపడు తున్నాయి. ఆత్మతో మనస్సు ఏకత్వం పొందితే, అందులోని రాగ ద్వేషాలు, వాసనలు తొలగిపోతాయి. ఎవరి చిత్తం లో వాసనలు నశించినాయో అతడే జీవన్ముక్తుడు.
ఇక కథా విషయానికి వస్తే ...
 

రామలక్ష్మణులు సీతమ్మను వెతుకుచు ఘోరముగా, ప్రవేశింప శక్యము కానట్టి క్రౌంచారణ్యమున ప్రవేశించిరి. అందు భయంకర రూపముగల వికృతమగు ముఖము గల ఒక రాక్షసి కనపడెను. ఆమె అయోముఖి. ఆమె లక్ష్మణుని  పట్టుకొని రమ్ము రమింతము (ఏహి రంస్యావహేతి ఉక్త్వా సమాలంబత లక్ష్మణం) అనుచు కౌగిలించుకొని తన వైపు లాగికొని పోవుచుండెను. అప్పుడు లక్ష్మణుడు కోపించిన వాడై ఆమె ముక్కు చెవులు కోయగా పెద్దగా అరుచుచు పారిపోయెను. సాధకుని వివేకమును నష్టపరచు వివేకహీన వృత్తులే అయోముఖి. సాధకుడు తన లక్ష్మణ రూప వివేకమును నష్టపరుచక అటువంటి సందర్భములలో అయోముఖి వృత్తులను సంహరించ వలెను. అయోముఖ వధ తర్వాత రామలక్ష్మణులు ముందుకు సాగిరి.
శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.17
శబరి
శ్రీరాముని దర్శించిన తర్వాత శబరి నదీరూపముగా మార్పు చెందినదని, ప్రస్తుతము ఉన్న శబరి నదియే రామాయణ కాలములోని శబరి అని చాలా ప్రచారములో ఉన్నది. వాస్తవముగా వాల్మీకి రామాయణములో ఆ విధముగా వర్ణించ బడలేదు. రామలక్ష్మణులు జటాయు మరణము (లేపాక్షి) తర్వాత కిష్కింధకు వెళతారు. ఋష్యమూక పర్వతము ప్రస్తుతము కర్ణాటకలోని హంపి వద్ద ఉన్నది.  అక్కడ సుగ్రీవుని గుహ, ఆంజనేయుని జన్మస్థానము కలవు.
 

జీవుని పరమాత్మలో చేర్చెడి వాడు, చేర్చెడి మార్గమును సిద్ధము చేసెడివాడు ఆచార్యుడు/గురువు. అందుచే భగవత్ప్రాప్తికి ఆచార్యాభిమానమే ముఖ్యమని ఎరుంగ చేయుటకు శబరి వృత్తాంతము చెప్పబడినది. శబరిని దర్శించుటచే రామునకు జీవుడు పరమాత్మను పొందుటకు జీవుని సాధన, పరమాత్మ ప్రయత్నము కంటే ముఖ్యమైనది ఆచార్య కటాక్షము అని తెలియును. అందుచే ముందుగా శబరి దర్శనము చేసి ఆచార్య కటాక్షముచే ఆమె మోక్షమునిపొందు వృత్తాంతము రాముడు గుర్తించెను. సీతమ్మను పొందుటకు కూడా అట్టి ఆచార్యుడు కావలెనని రాముడు గుర్తించెను.
తదుపరి రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన పంపా సరోవర మార్గమును జేబట్టి  పశ్చిమ దిశగా పయనమయిరి. అక్కడ పంపా తీరములో మతంగ శిస్యుల పరిచర్యలు చేయుచు ఒక శబరి జాతి స్త్రీ తపస్సు చేయుచు వసించి యుండెను. ఆమె సన్యాసిని. ఆమెను శబరి అని పిలిచెదరు. ఆమెకు గురుసేవయే నిత్యము ఆచరించు ధర్మము. గుర్వాజ్ఞచే చిరకాలంగా శ్రీరామ దర్శనమునకై వేచి యున్నది.
రామలక్ష్మణులు ఆశ్రమములో శబరిని చేరిరి. యోగసిద్ధిని పొందిన ఆ శబరి రామలక్ష్మణులను చూచి........
 

తౌ తు దృష్ట్వా తదా సిద్ధా సముత్థాయ కృతా౦జలిః
పాదౌ జగ్రాహ రామ స్య లక్ష్మణ స్య చ ధీమతః
పాద్యం ఆచమనీయం చ ప్రాదాత్ యథా విధి  3 74 6
రామలక్ష్మణులకు పాదాభివందనం చేసి అర్ఘ్యపాద్యాదులతో అతిథి మర్యాదలు గావించెను. అప్పుడు శబరిని రాముడు అడుగుతున్నాడు.
 

కచ్చి త్తే నిర్జితా విఘ్నాః కచ్చి త్తే వర్ధతే తపః   3 74  7
కచ్చి త్తే నియతః కోప ఆహార శ్చ తపో ధనే
 

కచ్చి త్తే నియమాః ప్రాప్తాః కచ్చి త్తే మనసః సుఖమ్
కచ్చి త్తే గురు శుశ్రూషా సఫలా చారు భాషిణి  3 74 8
 

రామేణ తాపసీ పృష్ఠా సా సిద్ధా సిద్ధ సమ్మతా
శశంస శబరీ వృద్ధా రామాయ ప్రత్యుప స్థితా  3 74 9
 

ఓ మృదుభాషిణీ! గురుసేవలో కృతార్థురాలివి అవుతున్నావా! అప్పుడు శబరి రామా!  మా గురువులైన మతంగ మహర్షి నీవు చిత్రకూటమిలో ఉన్నప్పుడు పరమపదించినారు. వారి ఆజ్ఞానుసారం నేను నీ రాక కోసము నిరీక్షిస్తున్నాను. ఈనాడు నీ దర్శనము వలన నా తపస్సు, సిద్ధిచినది. మా గురువులు ఉపవాస నియమములు కారణంగా సప్త సముద్రముల దగ్గరకు వెళ్లలేక చింతన చేయగా అవియే ఇక్కడకు వచ్చినవి. అదిగో ఆ కనపడేదే "సప్తసాగర తీర్థము", (ఇదియే తిరుపతి లో యున్న కపిల తీర్థం అని ఒక నానుడి). అని చెప్పి ఆ పంపాతీరమున లభ్యమయ్యేది మధురమైన పదార్థములను రామునికి భక్తితో సమర్పించింది. తరువాత శ్రీరాముని అనుమతితో శరీరమును అగ్నిహోత్రములో అర్పించి దివ్య శరీరముతో పైకి వచ్చినది.  అక్కడ నుంచి రామలక్ష్మణులు కిష్కింధ లోని ఋష్యమూక పర్వతము వేపు సాగినారు.
 

శ్రీరామ జయరామ జయజయ రామ

--(())--
[5:28 AM, 11/25/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-అరణ్యకాండ.18
అరణ్య కాండ - సింహావలోకనము
లోకములో స్వార్ధము, అహంకారము పెరిగి దేహాత్మాభిమానంతో శరీర పోషణకై లోకులను హింసించుచు జీవించెడి అసుర స్వభావము పెరిగిపోయిననాడు దానిని అణచుటకు ఆచరణముచే స్వస్వరూపమును అనగా మానవత్వమును లోకమున ప్రకాశింపచేయుటకు శ్రీరాముడు తన అకుంఠిత సత్యసంధత, ఏకపత్నీవ్రతము, యోగదృష్టి ద్వారా మానవుడు దైవముగా మారి లోకములోని అసురభావమును రూపుమాపవచ్చని నిరూపించించి, లోక కళ్యాణమునకై తాను కర్మలను ఆచరించుతూ ఇతరులచే ఆచరింప చేయించాడు. (యద్యదా చరతి శ్రేష్ఠ: తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే .. భ.గీ. 3 /21 శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తనని లోకులు పాటింతురు). సీతమ్మను స్వార్థమునకై స్వతంత్రుడయి తనకై వినియోగించవలెనని యత్నించుట లోకవినాశకారము. ఇది రావణ తత్వము. దీనిని అంతమొందించుట రామతత్వము. ఇట్టి అసుర భావములను ధ్వంసము చేసి మానవత్వమును లోకమునకు చాటుటకు శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యమునకు ప్రవేశించాడు. చేసిన కర్మలకు దండముగా అనగా ఫలితముగా అనుభవించెడి సుఖ దుఃఖములతో నిండినదియే సంసారము. అదియే దండకారణ్యము. అందు దైవ స్వభావులైన తాపసులు, అసుర భావాలు కల్గిన రాక్షసులు ఉందురు. అటువంటి తాపసుల రక్షణకై అసురకోటి మధ్యకు తానే వచ్చి ప్రవేశించి నాడు (స్వజనస్య రక్షితా) దండకారణ్యము ఎవరును ప్రవేశింప వీలుకానిది. కానీ రాముడు దుర్ధర్షుడు కనుక ప్రవేశించెను. శరణాగత రక్షణయే రాముని దీక్ష. రామాయణము అంతయు ఇట్టి శరణాగతయే కన్పట్టును.  ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తుల మూడు రూపాల్లో శక్తి స్వరూపిణిగా సీత యున్నది.  సీతాదేవి మూలప్రకృతి స్వరూపిణి అందుకు ఆమెను ప్రకృతి గా పిలవబడుతున్నది. (ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం, తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వ ముపాస్మహే, మూల ప్రకృతి రూపత్వాస్ త్సాసీతా ప్రకృతి:) అట్టి సీత తన ఆనంద వృత్తి రూపమైన రాముని మాత్రమే కోరుకొనును. (వృత్వామ్ సీతాం స్వానుభూతిమ్ సుఖమాస్తే ద దేవతః, సంసార విపినం ప్రతిపాహంకారౌ రావణాభిధ్యాహ్). సాధకుడైన జీవాత్మకు సీత రాజస అనుభూతి అటువంటి స్వానుభూతి రూపమైన సీతాసహిత రామరూప సాధకుడు సుఖముగా ఉండును. సంసారము ఒక విపినము అనగా దండకారణ్యము. అందు రావణ రూప అహంకారము ప్రవేశించును. (రాజసః స్వానుభూతింతాం సీతాం యత్నాజ్ఞ హారహ, రామః పరాత్మపి తతః స్వానుభూతి వియోగతః). సాధనాయత్నము ద్వారా ప్రాప్టించినది రాజస వృత్తి అయిన సీత. ఈ రాజస వృత్తి రూప సీతను బ్రహ్మ రూప రావణుడు హరించినాడు. రామ జీవాత్మ పరమాత్మ స్వరూపుడైనప్పటికీ, రాజస వృత్తి హరింపబడినప్పుడు సీతావియోగమనే కారణముతో దుఃఖితుడు అయ్యాడు. మానవ జీవనమునకు అత్యావశ్యకమైనది వివాహ సంబంధము. వివాహము ద్వారా తక్కిన సంబంధము లన్నిటి కంటెను పతి-పత్నిల శారీరక సంబంధము మహత్వపూర్ణముగా నిలబడును. ఇదియే పరిణామమునకు మూలము. దైనందిన వ్యవహారములకు తోడు, పతి-పత్నుల జీవాత్మల యందు పరస్పరము సంస్కార పరిణామము జరుగును. శరీరమునకు పరిణామము (మార్పు) ఎట్లు జరుగునో, జీవాత్మ కూడా ప్రగతి నొందును. అటువంటి జీవాత్మలు పరస్పరము ప్రగాఢ ప్రేమతో జీవనము సాగించినచో జీవాత్మల పరస్పర ఉన్నతి జరిగి ముక్తిని పొందుటలో అగ్రేసరులగుదురు. వైదిక పరంపరలో వేలకొలది సంవత్సరములుగా కొనసాగుతున్న అతీంద్రియ అనుభవమిది. జన్మ జన్మాంతరముల యందు ఈ ప్రేమ సంబంధము రెండు జీవాత్మలను ఉన్నతి వైపునకు తీసుకొని పోవుట అనునదియే వైజ్ఞానిక సత్యము. సీతారాముల జీవనము అటువంటి పరిణామ జీవన విజ్ఞానమే. విద్య, పరాక్రమము, సంపత్తి, అంగబలం ఇత్యాది యందు రావణుడు, రాముని కంటెను అధికునిగా చూపబడెను. రావణుడు తన స్వభావంతో సీతను భార్యగా చేసుకొనవలెనని, తన ఆధికారముగా భావించెను. ఈ పురుష ప్రవృత్తి కారణముగనే అనేక స్త్రీ విషయక ప్రకరణములు సాగుచున్నవి. రావణుని చరిత్ర ఈ విధముగానే చూపబడినది. కానీ శూర్పణఖ, అయోముఖి  వంటి స్త్రీలు రామలక్ష్మణులను  మోహించినను వైదిక పరంపర ననుసరించి స్త్రీ మోహితులు గాలేదు. సుసంస్కారయుత స్త్రీ అయిన సీత తనను మోహించిన అన్య పురుషుడు ఎంతటి సౌందర్యవంతుడు, బలవంతుడు, సంపద పరుడు అయినను పతి ప్రేమ యందు లోపము చూపించదు. ఈ ఆదర్శమును వాల్మీకి సీత ద్వారా ప్రపంచ ప్రజల ముందుంచి వైదిక ధర్మము యొక్క ఉన్నతిని చాటినాడు. సీతారాముల అన్యోన్య ఆదర్శము ప్రపంచమునకు ఆదర్శము.
అరణ్య కాండ సమాప్తము
శ్రీరామ జయరామ జయజయ రామ
V.A.Durga Prasad Chintalapati
Only admins can send messages




*V.A.Durga Prasad Chintalapati*
--(())+-

No comments:

Post a Comment