Monday, 30 December 2019

సుందర కాండము-10



 "మిత్రులకు శ్రేయోభలాషులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు"
 
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-10
రావణుడు అశోక వాటికకు వచ్చుట
మంగళకరమైన చతుర్వాద్య ధ్వనులచే వేకువనే మేల్కొన్న ప్రతాపశాలియైన రావణుడు కామ వికారముచే సీతాదేవిని చూచుటకు అశోక వనమున ప్రవేశించెను. అప్పుడు హనుమ ఆకుల మధ్య నక్కి పరికించి చూచుచుండెను. అప్పుడు సీతాదేవి తొడలతో ఉదరమును, బాహువులతో వక్షస్థలమును కప్పుకొని (ముడుచుకొని) ఏడ్చుతూ కూర్చొనెను. (ఆచ్ఛా ద్యోదర మూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ, ఉపవిష్టా విశాలా౭క్షీ రుదన్తీ వరవర్ణినీ). వైవాహికో విధిః స్త్రీణాం ఔపనాయనికః స్మృతః అను స్మృతి వాక్యమును అనుసరించి స్త్రీలకు వివాహము పునర్జన్మ. వివాహ సంస్కార ఫలితముగా సీత ఇక్ష్వాకు వంశమున మెట్టినది. రావణుడు సీతను చూచి "సీతా నీవు భయపడనవసరము లేదు. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా, ఏవం చైత ద౭కామాం చ న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి కామం కామః శరీరే మే యథా కామం ప్రవర్తతామ్ బలాత్కారముగా పరస్త్రీలను పొందుట రాక్షసులమైన మాకు స్వధర్మము. (మరి అయితే మానవ కాంతయైన సీత ధర్మములకు విలువ ఈయక పోవడంలో రావణుని నీచ ప్రవ్రుతిని తెలియజేస్తుంది. మన ధర్మము అనుసరిస్తూ పర ధర్మములను గౌరవించాలి. ప్రస్తుత కాలంలో ఇది పాటించబడుట లేదు. మిక్కిలి శోచనీయం) అయినను నేను కామాతురడను, కానీ బలాత్కారముగా నిన్ను తాకను. ఓ మైథిలీ! నీవు అనేకమైన దివ్యమైన సుగంధములు, వస్త్రములు ధరించి నన్ను చేరుము". ఈ విధముగా అనేక విధములుగా రావణుడు తన పరాక్రమమును చూపి, ప్రలోభములను పెట్టి సీతను తన వైపుకు త్రిప్పుకొనుటకు ప్రయత్నము చేసెను.
సీత రావణునికి హితవు పలుకుట
ఆ రాక్షసుని మాటలకు దుఃఖార్తియై, దీనురాలై శ్రీరాముని తలంచుతూ ఒక గడ్డి పరకను అడ్డుపెట్టుకొని ఇట్లు పలికెను. "నా నుండి మనసును మరల్చుకొని నీ వారిపై మనసును నిలుపుకొనుము. పాపము చేసినవాడు సిద్ధిని కాంక్షించుట ఎంత అయుక్తమో నీవు నన్ను 
కాంక్షించుట అంత అయుక్తము.
యథా తవ తథా౭న్యేషాం దారా రక్ష్యా నిశాచర 5.21.7
 
ఆత్మానమ్ ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతామ్
అకృతా౭౭త్మానమ్ ఆసాద్య రాజానమ్ అనయే రతమ్ 5.21.11
సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ
 
మిత్రమ్ ఔపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా        5.2119
వధం చా౭నిచ్ఛతా ఘోరం త్వయా౭సౌ పురుషర్షభః
 
విదితః స హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః                      5.2120
తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి
 
పరుని భార్యను అనుభవించవలెనని కోరిక కలిగినప్పుడు ఒక్కసారి తన విషయమున గూడ నా భార్యను వేరొకడు బలాత్కరించి చెరబట్టినచో ఎట్లుండును? ఆలోచించుకొనుము. ధృడ మనస్కుడు కాక పాపకార్యములను ఆచరించు రాజును పొందినచో ఎంతటి సమృద్ధములైన రాజ్యములు నశించక మానవు. లోకములో నిలకడ కావాలని కోరినచో రామునితో మైత్రి చేసికొనుము. ఘోరమైన చావు చావకుండుటకైనను రామునితో మైత్రి చేసికొనుము.  
రావణునకు సీతమ్మ చేసిన ఈ ఉపదేశము సంసారులకు అందరికి ఉపదేశమే. ఇట్లు పలికిన సీత వాక్కులను విని రావణుడు కోపముతో .. బ్రతిమాలుచున్న కొలది స్త్రీకి చులకన యగును. నీపై కల్గిన కామముచే నా కోపమును ఆపి వేయుచున్నది.
 
వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే
జనే తస్మిం స్త్వ౭నుక్రోశః స్నేహ శ్చ కిల జాయతే        5 .22 4
 
ఏ మనుజులపై కామము కలుగునో ఆ మనుజులు శిక్షింపదగిన వారైనను వారిపై దయా స్నేహములు కలుగును. నీవు నన్నాడిన పరుష వాక్యములకు నిన్ను క్రూరముగా సంహరింపవలసి యున్నది సీతా! నీకు సంవత్సరము గడువు ఒసగితిని. ఇంకా నీకు రెండు మాసములు మాత్రమే వ్యవధి యున్నది. అప్పటికి నీవు నన్ను అంగీకరింపనిచో నిన్ను  నాకు ప్రొద్దుటి భోజనమునకు వినియోగింతురు అని పరుషముగా మాట్లాడి వెడలిపోయెను. తరువాత రాక్షస స్త్రీలు, సీతకు నయానా, భయానా అనేక రకములుగా రావణుని పొందమని నచ్చచెప్పుటకు ప్రయత్నము చేసిరి. కానీ సీత వారి మాటలను నిరాకరించెను. అశోక వృక్షముపై యున్న హనుమ వీరి మాటలను నిశ్చలముగా వినెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

సుందర కాండము-9***




శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-9
హనుమ సీతను గుర్తించుట
 

హనుమంతుడు బలముగా కదపబడగా వృక్షముల నుండి ఆకులు, పూలు, పండ్లు పూర్తిగా రాలిపోయి బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరి వలె యున్నవి. "నిర్ధూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫల ద్రుమాః నిక్షిప్త వస్త్రా౭౭భరణా ధూర్తా ఇవ పరాజితాః 15" (జూదరులు మిక్కిలి వ్యసనమునకు లోనగుదురు. వారు వివేక భ్రష్టులై అమూల్యమైన వస్తువులను, తుదకు తమ వస్త్రములను కూడా జూదము నందు ఫణముగా పెట్టుదురు. వాటిని ఓడిపోయినను సిగ్గు పడరు. ధర్మరాజు కూడా ఇట్టి వ్యసనపరుడై తన రాజ్యమును, చివరకు భార్యను కూడా జూదములో ఓడిపోయినాడు. కావున జూదమాడుట ప్రమాదకరం).

 హనుమ అక్కడ ఆకులతో దట్టముగా యున్న ఒక శింశుపా వృక్షము నెక్కి  అటునిటు కలయ చూచెను. అప్పుడు అచట మలినమైన వస్త్రమును ధరించి, ఉపవాసములతో కృశించి, దీనురాలై రాక్షస స్త్రీల మధ్యలో ఉన్న స్త్రీమూర్తిని గాంచెను. జ్వాజ్వాల్య మానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కమ్మేసినప్పుడు దానికాంతి స్పష్టముగా గోచరించదు. అట్టి స్త్రీ మూర్తిని గుర్తించవలెను. (ఇప్పుడు హనుమ యుక్తియుక్తముగా తర్కించుకొని ఆమెను గుర్తించుటకై యత్నము చేయుచున్నాడు). ఆమె మలినమైన ఒకే ఒక వస్త్రమును ధరించి యుండెను. దుఃఖియై దీనావస్థలో యున్నది. జడగట్టిన ఆమె కేశపాశము నల్లత్రాచును బోలె కటిప్రదేశము వరకును వ్రేలాడుచుండెను. ఋష్యమూక పర్వతము మీదుగా వెళ్లుచున్నప్పటి అంగన రూపురేఖలే ఈమె యందు గోచరించుచున్నవి. ఈమె తన శోభలచే పున్నమినాటి వెన్నెలవలె అందరికి ఆహ్లాదము కలిగించునట్లున్నది కావున ఈమె సీతయే అయి ఉండవచ్చు. ఈ విధముగా సీతను చూచి హనుమ ఎంతయో సంతసించెను.  ఈమె కొరకే శ్రీరాముడు వాలిని సంహరించెను. నేను సముద్రమును దాటి లంకానగరమును చూచితిని.

ఇక శ్రీరాముడు సముద్ర పరివేష్టితమగు ఈ భూమండలమునే కాదు, జగత్తునంతయు తలక్రిందులు చేసినను సమంజసమే. (రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకా౭౭త్మజా, త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నా౭౭ప్నుయాత్ కళామ్.14). రాముని యందు ప్రీతిచే తన శరీరమును నిల్పుకొని యున్నది (నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫల ద్రుమాన్  ఏక స్థ హృదయా నూనం రామమ్ ఏవా౭నుపశ్యతి 25). హనుమ సీతను స్పష్టముగా చూడగోరి దృష్టిని అటు ప్రసరింప చేసెను. అప్పుడు ఆయనకు ఆ సమీపముననే భయంకరాకారమైన అనేకమైన రాక్షస స్త్రీలు కనబడిరి. వారు ఎలా ఉన్నారంటే ..
 

ఏకా౭క్షీమ్ ఏక కర్ణాం చ కర్ణ ప్రావరణాం తథా
అకర్ణాం శ౦కు కర్ణాం చ మస్తకో చ్ఛ్వాస నాసికామ్         5.17.5
అతి కాయో త్తమా౭౦గీం చ తను దీర్ఘ శిరో ధరామ్
 

ధ్వస్త కేశీం తథా౭కేశీం కేశ కమ్బళ ధారిణీమ్                5.17.6
లమ్బ కర్ణ లలాటాం చ లమ్బోదర పయోధరామ్
లమ్బౌష్ఠీం చిబుకౌష్ఠీం చ లమ్బా౭౭స్యాం లమ్బ జానుకామ్    5.17.7
 

హ్రస్వాం దీర్ఘాం చ కుబ్జాం చ వికటాం వామనాం తథా
కరాళా౦ భుగ్న వస్త్రాం చ పి౦గా౭క్షీం వికృతా౭౭ననామ్  5.17.8
వికృతాః పి౦గళా: కాళీ: క్రోధనాః కలహ ప్రియాః
 

కాలా౭౭యస మహా శూల కూట ముద్గర ధారిణీః           5.17.9
వరాహ మృగ శార్దూల మహిషా౭జ౭శివా ముఖీః
గజో ష్ట్ర హయ పాదా శ్చ నిఖాత శిరసో౭పరాః               5.17.10
 

ఏక హస్తైక పాదా శ్చ ఖర కర్ణ్య౭శ్వ కర్ణికాః
గోకర్ణీ ర్హస్తి కర్ణీ శ్చ హరి కర్ణీ స్తథా౭పరాః               5.17.11
 

అనాసా అతి నాసా శ్చ తిర్య ఙ్నాసా వినాసికాః
గజ సన్నిభ నాసా శ్చ లలాటో చ్ఛ్వాస నాసికాః            5.17.12
 

హస్తి పాదా మహా పాదా గో పాదాః పాద చూళికాః
అతిమాత్ర శిరో గ్రీవా అతిమాత్ర కుచోదరీః                   5.17.13
 

అతిమాత్రా౭౭స్య నేత్రా శ్చ దీర్ఘ జిహ్వా నఖా స్తథా
అజా ముఖీ ర్హస్తి ముఖీ ర్గో ముఖీః సూకరీ ముఖీః       5.17.14
 

హయో ష్ట్ర ఖర వక్త్రా శ్చ రాక్షసీ ర్ఘోర దర్శనాః
శూల ముద్గర హస్తా శ్చ క్రోధనాః కలహ ప్రియాః       5.17.15
 

కరాళా ధూమ్ర కేశీ శ్చ రాక్షసీ ర్వికృతా౭౭ననాః
పిబన్తీ స్సతతం పానం సదా మాంస సురా ప్రియాః  5.17.16
 

మాంస శోణిత దిగ్ధా౭౦గీ ర్మాంస శోణిత భోజనాః
తా దదర్శ కపి శ్రేష్ఠో రోమ హర్షణ దర్శనాః              5.17.17
 

ఈ విధముగా హనుమ సీతను గుర్తించుటలో రాత్రి గడచి వేకువ జాముఅయ్యెను. ఈమె దుఃఖమును తొలగించుటకు ఏమి చేయవలెనని ఆలోచింప సాగెను. అజ్ఞానము ఆవరించి సద్వస్తువగు ఆత్మ కనబడకుండా చేయు జన్మయే రాత్రి.
శ్రీరామ జయరామ జయజయ రామ
 

--((***))--

Sunday, 29 December 2019

సుందర కాండము-7



[6:06 AM, 12/29/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-7
రావణ అంతఃపురమున హనుమ ప్రవేశించుట
హనుమ లంకానగరములో అనేకమైన భవనములను, పతివ్రతలగు స్త్రీలు వారి భర్తలతో నిదురించుటను, ప్రియురాండ్రపై తమ హస్తములు వేసిన స్త్రీలను, అనేకమైన పరిశుద్ధ స్వభావులు, మహానుభావలు, సుప్రభావలు, కాంతిమతులు, లజ్జావతులు, ప్రియుల ఒడిలో కూర్చున్నవారు, బంగారు కాంతుల గలవారు, మేలిముసుగు లేనివారు ఇలా అనేకమైన స్త్రీలను చూచెను. తరువాత రావణ అంతఃపురములోను వారి మంత్రుల భవనములలోను సీతకై వెదికెను. కానీ ఎచ్చటను కానరాలేదు. ఇంతకు మునుపు తాను సీతను చూడలేదు కావున, హనుమ తన మనస్సున సీతాదేవి యొక్క ఊహాచిత్రమును నిర్మించుకొనెను. వాస్తవముగా పదునారు కళలతో గూడి చంద్రుని వలె భాసిల్లు సీతాదేవి, శ్రీరాముని ఎడబాటు వలన విదియ చంద్రుని వలె కాంతిహీనమై, ధూళిధూసరితమై, రావణుని వాగ్భాణముల గుర్తులు ఆమె ముఖ కవళికపై యుండును. అట్టి జానకిని ఎంత వెదికినను తరుణీమణులలో కానరాకుండెను. పిమ్మట హనుమ మేఘము వలె మహోన్నతమైన పుష్పక విమానమును దర్శించెను.
 
తత స్తదా బహు విధ భావితా౭౭త్మనః
కృతా౭౭త్మనో జనక సుతాం సువర్త్మనః
అపశ్యతో౭భవ ద౭తి దుఃఖితం మనః
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః  5 7 17
 
ఈ విధముగా అనేకవిధములుగా నిశిత బుద్ధితో ప్రయత్నమూ చేసినను సీత జాడ కాన రాకపోయేసరికి హనుమ మిగుల దుఃఖితుడు అయ్యెను. తరువాత నెమ్మదిగా రావణుని నిజ అంతఃపురమును చేరుకొన్నాడు. అందు రావణుడు అపహరించి తెచ్చిన కన్యలు, రావణుని పత్నులు, పానముచే అలసి యున్న స్త్రీ రత్నములు ఇలా అనేక మంది కనబడిరి. వారి మధ్య రావణుడు నక్షత్ర రాజు వలె యున్నాడు.
 

గౌరీం కనక వర్ణా౭౭భామ్ ఇష్టామ్ అన్తః పురేశ్వరీమ్
కపి ర్మన్దోదరీం తత్ర శయానాం చారు రూపిణీమ్  5.10.52
 
స తాం దృష్ట్వా మహాబాహు ర్భూషితాం మారుతా౭౭త్మజః
తర్కయా మాస సీతేతి రూప యౌవన సంపదా  5.10.53
 
హర్షేణ మహతా యుక్తో ననన్ద హరియూథపః
*ఆస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం
ననన్ద చిక్రీడ జగౌ జగామ*
 
స్తమ్భాన్ అరోహన్ నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్   5.10.54
 
అక్కడ శయ్యపై పరుండి బంగారు రంగును పోలిన స్త్రీ మూర్తిని (రావణుని పట్ట మహిషి అయిన మండోదరి) చూసి హనుమ సీతమ్మ అనుకొని భ్రమపడి కోతి చేష్టలు చేసెను. ఆనందముతో హనుమ జబ్బలు, తొడలు చరచుకొనెను. తోక ముద్దుపెట్టుకొనెను. పాటలు పాడెను. నృత్యము చేసెను. స్తంభములెక్కి దుమికెను. ఈ విధముగా సంతోషముతో పిల్లవాని చేష్టలు చేసెను. తరువాత బుద్ధిశాలియైన ఆ మహాకపి భర్తని ఎడబాసిన సీత ఇలా సర్వాలంకారణ భూషితయై నిదురించదు, ఈమె సీత కాదని వేరొక వనితయని  అని నిశ్చయమునకు వచ్చియుండెను. ఈ విధముగా అనేక మంది స్త్రీలను చూచినను సీత జాడ లేదు. ఈ విధముగా అనేకమైన భంగిమలలో స్త్రీలను చూచుటచే ధర్మ భంగమయ్యెనని ఒకింత చింతించెను. మరల తేరుకొని  …
 
మనో హి హేతుః సర్వేషామ్ ఇన్ద్రియాణాం ప్రవర్తనే
శుభా౭శుభా స్వ౭వస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్        5.11.41
 
మనస్సే కదా సర్వేంద్రియములను ప్రవర్తింపజేయుటలో కారణమైనది. కానీ నా మనస్సు నిలకడగా, ఎటువంటి వికారములు లోనుకాకుండా యున్నది. అయినను స్త్రీని వెతుకుటకు స్త్రీ సమూహములోనే వెతకాలి కదా! అనుకోని తాను ధర్మ భ్రష్టుడు కాలేదు అనుకొనెను. మరల ధైర్యము తెచ్చుకొని అనేకమైన లతాగృహములు మొదలుగాఁగలవి వెతుకుచుండెను.

అనిర్వేదః శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతం సర్వా౭ర్థేషు ప్రవర్తకః                5.11.10
 
కరోతి సఫలం జంతో:కర్మ య త్తత్ కరోతి సః
తస్మాత్ అనిర్వేద కృతం యత్నం  చేష్టే౭హ ముత్తమం 5.11.11
 
సర్వ విధముల అభివృద్ధికి నిర్వేదము లేకుండుటయే. ఉత్సాహము కలిగియుండుట ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమ సుఖము. నిరుత్సాహవంతుడు కానివాడే అన్నిపనులను ఆరంభింపగలడు. కావున ఉత్సాహముతో మరల ఏయే ప్రదేశములలో శ్రద్ధ చూపలేదో ఆయా ప్రదేశములలో వెతుకుటకు హనుమ నిశ్చయించుకొనెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Friday, 27 December 2019

సుందర కాండము-6 ***








శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-6
లంకలో హనుమ ప్రవేశము
 
సముద్ర లంఘనమున హనుమ చేసిన దుష్కర కార్యములు నాలుగు. అవి - నూరు యోజనముల సముద్రమును దాటి సీత జాడ కనుక్కొని వెనకకు రాగలనని సంకల్పించుకొనుట, మైనాకుని సగౌరవ విశ్రాంతిని సున్నితముగా తిరస్కరించుట, సురసను జయించుట మరియు సింహికను చంపుట. ఈ నాలుగు నాలుగు లక్షణములు. 1 ధృతి: సర్వ వ్యాపారములను ఆత్మోన్ముఖం చేయుట, 2 దృష్టి: దేనిని పొందవలెనో దాని యందే దృష్టి తప్ప ఇతరములపై ఉండకుండుట. 3 మతి: ఆచరించ వలసిన కర్మలను ఆచరించుతూ బంధనమున పడకుండా "ఆత్మస్వరూప జ్ఞానము" ఉండుట. 4 దాక్ష్యము: నిషిద్ధకర్మ త్యాగము. ఇట్లు హనుమ ఈ నాలుగు లక్షణములతో సముద్రమును లంఘించినట్లే ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు ముందుకు సాగుటకు ఈ నాలుగు ఆవశ్యకములు అని ఈ వృత్తాంతము సూచించును.
 
సూర్యాస్తమయ సమయమునకు, హనుమ నూరు యోజనముల సముద్రమును దాటి త్రికూట పర్వత శిఖరమున నిలిచి లంకను చూచెను. పరాక్రమశాలి అయిన హనుమ ఇటువంటి నూరు యోజనములు ఎన్నియైనను అవలీలగా దాటగలను అని హనుమ భావించెను. సాధన చేయువానికి ఇట్టి స్థితి ఆవశ్యకముగా నుండవలెను. ఆసనము పైనుండి ప్రాణాయామాదులు చేసి లేచిన తర్వాత శరీరము కానీ, మనస్సు కానీ బడలిక చెందరాదు. ఇంకను ఎంతకాలము చేసినను చేయగలనన్నట్లు ఉత్సాహము ఉండవలెను. ఇది కలుగు వరకు సాధన పూర్తి కాదు. అచ్చటి నుండి లంకా నగర శోభను, అచ్చటి రక్షణ వ్యవస్థను నిశితంగా పరికించి లంకా నగరమును జయించుటలోని పెక్కు ఉపాయములు ఆలోచించెను. ముందుగా సీతమ్మకై అన్వేషణ చేయవలెనని, అందుకు రాత్రి సమయమే సరియైనదని, అందుకు సూక్ష్మ రూపమున లంక నగరములో ప్రవేశించ వలెనని నిర్ణయించు కొనెను. నెమ్మదిగా లంకానగర ద్వారము వద్దకు వచ్చెను. అప్పుడు హనుమను కామరూపిణియగు లంక అడ్డగించెను. హనుమ లంకతో నీవెవ్వరివి అని అడగగా ..

అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః
ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీ మిమాం        5.3.28
 
అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ
సర్వతః పరిరక్షామి హ్యేత త్తే కథితం మయా   5.3.30
 
రాక్షస రాజైన రావణుని ఆజ్ఞను పాలించుతూ నేను ఈ లంకా నగరమును కాపాడు చున్నాను. నన్ను ధిక్కరించి ఇందు ప్రవేశించలేవు అనెను. అందుకు సౌమ్యముగా హనుమ, లంకతో .. "లంకానగర శోభను పరికించి వెడలెదను" అనెను. కానీ లంక తనను జయించనిదే నగరములో ప్రవేశించుట అసాధ్యము అని చెప్పుటతో హనుమ ఆడుది కదా యని ఎక్కువగా కోపము తెచ్చుకొనకుండా కొద్దిపాటి కోపముతో పిడికిలితో గద్దెను. దానికే నిశాచర, హనుమతో "నన్ను అనుగ్రహింపుము. నీచే ఓడింపబడితిని గాన బ్రహ్మ వర ప్రభావము వలన రాక్షసులకు కీడు కల్గు సమయము ఆసన్నమైనది. హాయిగా సీతమ్మను వెతుకు కొనుము" అని చెప్పెను. ఇక్కడ వాల్మీకి "అహం" అని రెండుమార్లు ప్రయోగము చేసినారు. ఈ 'అహం' దేహాత్మాభిమానాన్ని, అహంకారమును సూచించును. ఇట్టి అహంకారమును జయించిన నాడే  మనసులోని వాసనలు, చిత్తవృత్తులు నసించి సీతమ్మ దర్శనమగును. హనుమ లంకను జయించి ద్వారము గుండా కాకుండా ప్రాకారమును దాటి శత్రువుల తలపై మోపినట్లు తన ఎడమ పాదమును హనుమ ముందుగా పెట్టి  లోనికేగెను. (అద్వారేణ మహాబాహుః ప్రాకార మ౭భిపుప్లువే)   (గ్రామం వా నగరం వాపి, పత్తనం  వా పరస్య హి| విశేషాత్ సమయే సౌమ్య| న ద్వారేణ విశేనృప|| ప్రయాణ కాలే చ గృహప్రవేశే, వివాహ కాలే౮ పి చ దక్షిణాంఘ్రిమ్| కృత్వాగ్రతః శత్రుపుర ప్రవేశే, వామంనిదద్యా చ్చరణం నృపాలా|| ఓ రాజా! శత్రువు యొక్క గ్రామమును గాని, నగరమునుగాని, పట్టణమును గాని విశేష సమయమున ముఖ్య ద్వారము నుండి ప్రవేసింపరాదు, ప్రయాణము చేయుచున్నప్పుడు, గృహప్రవేశ సమయమున, వివాహ కాలము నందు కుడికాలు ముందుంచాలి. శత్రుపురమున ప్రవేశించునప్పుడు ముందుగా ఎడమ కాలు మోప వలెను. ఇది బృహస్పతి వచనము. ... నీతి శాస్త్రము.)
శ్రీరామ జయరామ జయజయ రామ
మిత్రులారా!
నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్ని పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి.

  • కనీసం పిలుపులో నయినా  మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం.....!


 🕉🕉🕉🕉🕉🕉


🌸 *పరమాత్మ ను చేరే సులభ మార్గాలు.* 🌸

పరమాత్మ సకల జీవరాసులలో అంతర్యామి గా కొలువైఉన్మాడు అన్నది శాశ్వత సత్యం. అది మనకి ఎరుక లేకపోతే అది మన అజ్ఞానం. ఆ పరమాత్మ ని చేరాలంటే నాలుగు విషయాలలో ఎరుక తో ఉండి మనము ఆచరించాలి.

*అవి*:

🌷 *1) సంతోషం:-*

మనతో ఉన్నత స్థితిలో ఉన్నవారి పట్ల మనం ఈర్ష అసూయలతో ఉంటాం, కానీ మనము సంతోషం తో ఉండాలి అటువంటి సందర్భంలో.

🌷 *2) కరుణ:*

మన చుట్టూ ఉన్నవారు కష్టాలతో ఉంటే మనకి చెప్పారాని ఆనందము. కానీ ఇలాంటి సందర్భములొ కావాల్సింది కరుణ.

🌷 *3) స్నేహము:*

మనతో సమానముగా ఉన్నవారి పట్ల మనకు పోటీ తత్వం ఉంటుంది. కానీ దీని బదులు స్నేహం ఉండాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం.

🌷 *4) ఉపేక్ష:*

మన చూట్టూ ఉన్నవారు పాపాలు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నవారు అయితే మనము వారి వెంటపడి వారిని మార్చే ప్రయత్నం లో నిరంతర జ్ఞాన బోధ చేస్తాం. కానీ పాపం వారు వినిపించుకునే దశలో ఉండరు. కానీ ఇలాంటి వారి పట్ల మనకి కావాల్సినది ఉపేక్ష. ఎందుకంటే సమయమే వారిలో మార్పు తెస్తుంది. మన ఇతిహాసాలు ఈ సత్యం నే చెప్తాయి.

చూశారా
సంతోషము, స్నేహము, కరుణ, ఉపేక్ష అన్నవి నిజముగా పరమాత్మ దగ్గరకు మనని చేరుస్తాయి.

బుద్ధ జయంతి సందర్భంగా ఆ మహానుబావుడి భోదల నుంచి గ్రహించి వ్రాసినది.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻


🕉🕉🕉🕉🕉🕉

--(())--
నేనుమొన్న
 పెట్టిన పోస్ట్ కి చి"రాధ కృష్ణ శాస్త్రీ సేకరించిన 15రాగాలపేర్లు గమనించగలరు.చి"రాధాకృష్ణ శాస్త్రీకి ఆశీస్సులు అభినందనలు ఇంత చిన్నవయసులోనే సంగీతంమీదున్న ఆసక్తి ఎంతైన ప్రశంసనీయం

అంబాపారాకు     నాటరాగం
అవతరించువయ్య  శ్రీ రాగం
రావోరావో       ...   కాంభోజి
చెలువారు          అఠాణ
తగదిదితగదిది   వసంత
ఈశునిదాసుగా  రీతి గౌళ
కానిపనిమదనా  బేగడ
చిలుకటటడి      సరస్వతి
సామగ సామగ  హిందోళ
ఇంతర్ లూడు  హంసధ్వని
విరులనియపూజ  సావేరి
అం బాయని          సామ
మనమే                  సామ
బిడియపడి   మధ్యమావతి
మంగళం          సురటి
-
-(())--
*మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కాదా,*
*మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది.*

అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట.
నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను.
మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాసారంట.
అర్చనలు, ఉపాసనలు కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు.

ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది.

ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకి కర్మఖాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు.
పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది.

పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు,
ఇతనికి 50 వ ఏట మరణ గండం ఉంది. ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించలేరని రాసాడు బ్రహ్మ.

అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు.

జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి  జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటే…
అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు…

 ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు.

కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది.

ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి.
అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది.

128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు.

కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు.
అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు.

*అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా… ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చెయ్యండి.*

ఈ విషయం అందరికి తెలియజేసి కొంత మీరు కూడా పుణ్యం మూట కట్టుకోండి.

Thursday, 26 December 2019

సుందర కాండము-5



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-5
సింహిక
 గరుడ వేగముతో హనుమ ఆకాశము నందు సాగు చుండగా ఎదురుగాలి చే మందగించిన ఓడ వలె హనుమ వేగము తగ్గెను
ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ
మనసా చిన్తయా మాస ప్రవృద్ధా కామ రూపిణీ 5.1.173
అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యా మ్య౭హమ్ ఆశితా
ఇదం హి మే మహత్ సత్త్వం చిరస్య వశమ్ ఆగతమ్      5.1.174
కామరూపియైన సింహిక నామ రాక్షసి ఆకాశమున పోవుచున్న హనుమను చూచి "ఆహా! చాలా కాలమునకు నాకు ఒక మహా జంతువు ఆహారముగా దొరకబోవుతున్నది" అని ఆలోచించి, హనుమ ఛాయను బట్టి హనుమను తన నోటిలోనికి ,లాగుకొనుచుండెను.  క్రిందికి చూడగా సముద్రములో హనుమ ఒక మహాభూతమును చూచెను.  సుగ్రీవుడు సముద్రములో నీడను బట్టి లాగెడి ఒక మహారాక్షసి గలదు అని చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చి హనుమ శరీరమును ఒక్కసారిగా పెంచెను. కానీ అందుకు తగిన పరిమాణంలో సింహికారాక్షసి గూడ పాతాళ కుహూరమును బ్రోలు తన నోరును పెంచెను. వెంటనే హనుమ తన శరీరమును సంకోచింప చేసి, దాని నోటిలో దూరి తన గోళ్ళతో దాని మర్మములను త్రుంచి మరల అంతరిక్షము చేరెను. హనుమ చేసిన ఈ కార్యమునకు సంతోషించి ఆకాశములోని  భూతములన్నియు బాగు, బాగు అనెను.
ఆధ్యాత్మిక మార్గములో పయనించువాడు విహిత కర్మలను ఆచరించవలెను. నిషిద్ధ కర్మలను పరిత్యజించి వలెను. శాస్త్రములో చెప్పని కర్మలను ఆచరించిన యడల అవి మనలను హింసించును. కావున అవి "సింహిక" అనబడును. సింహిక అనగా హింసించునది. నిషిద్ధ కర్మకు మనమెట్లు వశమగుదమో మనకే తెలియదు. చేయకూడదని తెలిసియు, చేయవలదను కొనుచునే దానికి వశమగుదుము. (ప్రస్తుత కాలములో మద్యపానము, ధూమపానం,  జూదము ఇత్యాది). వశమైన తర్వాత గాని వశపడినట్లు తెలియదు. అట్టి కర్మలు తెలియకుండా ఆక్రమించుట - సింహిక నీడను బట్టి లాగుట. అందుకనే సురసను చంపకుండా వదిలిన హనుమ సింహికను చంపెను.
హనుమానునిపై పడు సూర్యకిరణముల వలన తన నీడయే క్రిందనున్న సాగరముపై వ్యాపించెను. ఈ వర్ణన ద్వారా వాల్మీకి యోగ మార్గములో ప్రాప్తించే ఒక ఛాయా సిద్ధిని మనకందించెను. ఉపనిషత్తులలో ఈ ఛాయా పురుషుడు అంగుష్ఠ మాత్ర పురుషుడుగా వర్ణింపబడినాడు. ఈ అంగుష్ఠమాత్ర పురుషుడు ఎంతో బలవానుడు మరియు త్రికాలదర్శి. "కఠోర ఉపనిషత్" లో "ఈశాన" అని తెల్పినారు.
శ్లో|| అంగుష్ఠమాత్ర పురుషో జ్యోతి రివా  ధూమకః|
      ఈశానో భూత భవ్యస్య స ఎవాద్యసఉశ్వః||
ఈ ఛాయాపురుషుడు చాతుర్మాత్రాత్మక జగత్తున కతీతుడై, త్రికాలజ్ఞుడై, త్రిలోకగామియై యుండును.
శ్లో|| మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం|
      వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపధ్యే||
మారుతమనగా దేశకాలములకు అతీతము. కాలమునకు అతీతమగుట వలన ఛాయాపురుషుడు ఇతరులకు కనిపించడు. తాను ఏ వస్తువును తాకినను, ఆ వస్తువు కూడా అదృశ్యమగును. ఎవరైతే ఈ ఛాయాపురుషుని ఉపయోగము నీచకార్యములకు వినియోగింతురో అతడు తన అధఃపతనమును కొని తెచ్చుకొనును. సాధనలో ఛాయాపురుష అవస్థ చాలా ఉత్కృష్టమైనది. అధఃపతనము చెందిన సింహికా రాక్షసి అవస్థయే వేదమున ఈ విధముగా వర్ణింపబడినది.
య ఈ చకార్న సౌ అస్య వేదయ ఇద దర్శహిరుగిన్ను తస్మాత్,
సమాధుర్యోమ్ నా పరివీతో అంతర్బహు ప్రజా నిరుతిమా వివేశః  (ఋ.వే.1 164 32 )
అజ్ఞానముతో నున్న జీవి మాతృగర్భము ద్వారా అనేక జన్మలను ధారణ చేయును. జన్మలకు అతీతమైనను, సర్వజ్ఞమైనను, ఘోర కర్మలో పడి తానేమి చూచుచున్నదో ఏమి చేయుచున్నదో తెలియని అజ్ఞాన స్థితిలో యుండును.
దేహము నాలుగు రకాలు. మొదటిది - ఎముకలు, మాంసము, మజ్జ, రక్తముతో కూడుకొన్న "జడ దేహము". సుషుప్తావస్తలో సూక్ష్మ శరీరములో ఉండునది - "లింగ దేహము". ఇదియే ఛాయాపురుషుడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలములకు, దేశకాలములకు  అతీతము. తన యొక్క ఛాయవలె కనిపించే ఈ లింగ దేహము/శరీరము ను బంధనమున ఉంచి దాని ద్వారా సిద్ధులకు ఉపయోగించు సాధకుడు పతనము నొందును.   హనుమాన రూప సాధకుడు ఇట్టి బంధనమున చిక్కుకొనడు. మూడవది లింగ దేహము కన్నను ఉన్నతమైనది  - "కారణ దేహము". సంకల్ప మాత్రముననే కార్యము నెరవేరును. అంతకంటెను సూక్ష్మమైనది "మహాకారణ దేహము". ఈ సంసారమునకు కారణ బీజమైనది. యోగ వాసిష్ఠములో ఇట్టి అతివాహిక సూక్ష్మ దేహముతో లీల (సరస్వతి దేవి   భక్తురాలు), సరస్వతులు ఇద్దరు సమస్త బ్రహ్మాండములు తిరిగారని వసిష్ఠ మహర్షి చెపుతారు. సరియైన ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు హనుమ వలె ఛాయాపురుషునకు అతీతముగా యుందురు.
శ్రీరామ జయరామ జయజయ రామ

9)మll
మనుజగ్రామణి సత్కృపాత్త కపిసామ్రాజ్య స్థితుండయ్యుభూ,
తనయాన్వేషణ కార్యమున్‌ మఱచి కందర్పక్రియామత్తుఁడై,
తనివిం జెందక యున్న భానుజునిఁ దత్కాలార్హ నీత్యుక్తయు,
క్తిని బోధించిన నీతిశాలివి నినుం గీర్తించెదన్‌ మారుతీ!

తాత్పర్యం:- ఈ పద్యంలో మనుజ గ్రామణి అంటే ప్రజలకు రాజు =శ్రీరాముడు, భానుజుడు అంటే సూర్యుని కుమారు డు =సుగ్రీవుడు. సత్కృప + ఆత్త, సాంమ్రాజ్యము= గొప్ప దయచేత పొందబడిన సాంమ్రాజ్యము. కందర్ప క్రియా మత్తుడు = రతిక్రీడలో మదించి ప్రవర్తించు వాడు.
శ్రీరాముని యొక్క గొప్ప దయతో లభించిన(కిష్కింధా) రాజ్య పరిపాలకుడైన సుగ్రీవుడు, (ఈ వర్షాకాలం నాలుగు నెలలు గడచిన తర్వాత లోలాంగూలభల్లూక కపి సైన్యంతో) సీతాన్వేషణ జరిపిస్తానని (శ్రీరామునికి)ఇచ్చిన మాట మరచి; తార, రుమ మొదలైన భార్యలతో రతిక్రీడలలో
మునిగిపోయి మదించి తృప్తిచెందక ప్రవర్తిస్తున్న సందర్భం లో ( శ్రీరామునిచే పంపబడిన లక్ష్మణుడు అగ్రహోదగ్రుడై సుగ్రీవుని హెచ్చరించుటకు వచ్చిన సందర్భంలో) నీవు
యుక్తియుక్తముగా, మిత్రధర్మాన్ని అనుసరించాలనే విషయాన్ని సుగ్రీవునికి బోధించన నీతిశాలివి. అట్టి నిన్ను స్తుతించుచున్నాను స్వామీ!

10)
శాll లేరా కీశులనేకులుం? ద్రిజగముల్‌ వీక్షించి రా నేర్పరుల్‌
గారా? రాముఁడు జానకిన్‌ వెదక వీఁకన్‌ గీశులం బంపుచో
నారూఢిన్‌ భవదీయ దివ్యమహిమవ్యాపారముల్‌ సూచికా
దా!రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్‌ మారుతీ!

తాత్పర్యం:- కీశులు= కోతులు, వీకన్= పరాక్రమము గల, ఆరూఢిన్= నిశ్చయముగా, భవదీయ= నీయొక్క , రత్నాంగుళి =రత్మములచే పొదగబడిన ఉంగరం, భూషణం= ఆభరణం.
సుగ్రీవునిచే సీతాన్వేషణకు నియోగింపబడిన వాన రులు ఎంతమంది లేరు?. వారిలో అప్పటికే ముల్లోకాలను తిరిగి చూసిన వారెందరో వున్నారు కదా, అట్టివారు నేర్పరులూ, అనుభవ శాలురూ గారా? అటువంటప్పుడు ఓ మారుతీ! శ్రీరామచంద్రుడు ప్రత్యేకించి పిలిచి నీ చేతికి
తన రత్నాంగుళీయకం ఇచ్చి, సీతాదేవి కనిపించినప్పుడు ఆమెకు ఇవ్వమని చెప్పినాడంటే ( సీతాస్వేషణలో సఫల త నివ్వగల) నీయొక్క దివ్య శక్తిసామర్ధ్యాలను గమనించి యేకదా!
ఇంకావున్నాయి.,

11) మ. వనజాప్త ప్రియపుత్రుఁడెంతధిషణావంతుఁడొ,
సర్వంసహా,తనయాన్వేషణ మాచరింప గపులం దా
బంపుచో, గార్యసా,ధనమందీ వతి దక్షిణుండవని
కాదా! నేర్పుతో దక్షిణంబునకున్‌ నిన్నధికారిఁ జేసి
పనిచెన్‌ మోదంబునన్‌ మారుతీ!

తాత్పర్యం:- వనజాప్తప్రియపుత్రుడు= తామరలకు ఆప్తు డైన వాని (సూర్యుని) కి ఇష్టుడైన కుమారుడు అనగా సుగ్రీవుడు. ధిషణావంతుడు= మేధావంతుడు. సర్వసహా
తనయా= భూదేవి పుత్రిక అంటే సీతాదేవి. కార్యసాధనమందు+ ఈవు+ అతి దక్షిణుండవు= పనులు చేయుట యందు నీవు మిక్కిలి సామర్థ్యము గలవాడు. పనిచెన్= పంపెను.
ఓ మారుతీ ! వానరరాజైన సుగ్రీవుడు ఎంతటి మేధా శక్తి గలవాడో కదా,కనుకనే సీతాన్వేషణ చేయుటకు కోట్ల కొలది వానరులను తాను నలుదిక్కులకు పంపినసందర్భం
లో , నీవు కార్యసాధన చేయుటలో మిక్కిలి సామర్థ్యం గల వాడివని అప్పటికే తెలిసివున్నందునే కదా సంతోషముతో నిన్ను దక్షిణ దిక్కునకు పంపిన కపిసేనలో ప్రముఖునిగా నియోగించినాడు , స్వామీ!

12)శా.సీతన్‌ గానక,దప్పిచే బడలి గాసింజెందు శైలాటసం,
ఘాతంబుం గొని, శైలగహ్వర సుధాకల్పాంబువుల్‌,సత్ఫల,
వ్రాతంబుం దనివార నందఱ భుజింపంజేసి, తద్దేవతా,
ఖాతశ్వభ్రము వెల్వరించితివి యోగప్రౌఢిచే మారుతీ!

తాత్పర్యం:-గాసించెంది= అలసిపోయి. శైలాట + సంఘాత ము= కోతుల గుంపు. శైల గహ్వరము= పర్వతగుహ. సుధాకల్పాంబువుల్= అమృత ప్రాయమైన జలము.
సత్ఫల వ్రాతము= మంచి రుచిగల పండ్ల సమూహము. తనివార= తృప్తిగా. దేవత+అఖాత+శ్వభ్రము= దేవతచే ( అనగా మయునిచే) నిర్మింపబడిన బిలము. వెల్వరించు
= బయటకు తీసుకొని వచ్చు. యోగప్రౌఢి= యోగశక్తి. ఈ పద్యం చదువుతూవుంటే శ్రీవాల్మీకి రామాయణం, కిష్కింధా కాండ 50,51,52,53 సర్గలలో చెప్పబడిన స్వయంప్రభ కథ గుర్తుకొస్తుంది. అంగదుని నాయకత్వంలో దక్షిణదిక్కుగా సీతాన్వేషణ సాగిస్తున్న వానరసేన, ఒక దశలో అలసిసొలసి ఆకలిదప్పికలకు లోనై కనీసం నీళ్ళై నా తాగందే బతకలేమని నీళ్ళకొరకు వెతుకుతారు. ఒక బిలం నుండి తడిసిన రెక్కలతో ఎగురుతూ వస్తున్న పక్షుల
ను చూసి, ఆ బిలంలో నీళ్ళు వుంటాయని తలంచి వాన రులు అందులో ప్రవేశిస్తారు. అంతా చీకటి, ఒకళ్ళచేతులు మరొకళ్ళు పట్టుకొని ఆ వానరులంతా బిలంలో చాలా దూరం నడిస్తే వాళ్ళకొక రత్నఖచిత భవనం కనిపిస్తుంది. అది మయుడు, అప్సరస అయిన హేమ కొరకు నిర్మించిన భవనం. హేమ అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. ఆమె చెలికత్తె స్వయంప్రభ మాత్రం ఆ భవాన్ని సంరక్షిస్తూ ఎప్పు డూ అక్కడే తపస్సు చేసుకుంటూ వుంటుంది. వానరులు
ఆమెతో సీతాన్వేషణకు దారితీసిన కథంతా చెప్పారు. ఆమె మథుర ఫలాలతో , స్వచ్ఛజలాలతో ఇచ్చినఆతిథ్యం స్వీకరించి, ఆదమరచి నిద్రించారు. ఆ గుహ ఎటువంటి దంటే లోపలికి వచ్చిన వారిని వెలుపలకు పోనివ్వదు. సుగ్రీవుడిచ్చిన నెలగడువుముగిసిపోయింది. తమకుచావు తప్పదనుకున్నారు. వారిది రామకార్యం గనుక స్వయం ప్రభ దయదలచింది. "మీరంతా కళ్ళుమూసుకొంటే, తన యోగశక్తితో గహనుండి బయటపడవేస్తా" నన్నది. కళ్ళు
మూసి తెరిచేంతలో వానరులంతా బిలం బయట సముద్ర పు వొడ్డున పడివున్నారు.
ఓ మారుతీ! ఈ ఘట్టంలో ఆకలిదప్పులను లోనై ప్రాణా వశిష్టులైన వానరులకు పండ్లూనీళ్ళూ అందేలా చేసి, వృక్ష బిలంలో చిక్కుకొని పోయిన వారిని సురక్షితంగాబయటకు చేర్చుటలో నీవు చూపినప్రతిభాపాటవాలు,యౌగికశక్తులు అసాధారణమైనవి, అనితరసాధ్యమైనవి, స్వామీ!

13) మll.జనకక్ష్మాపతిపుత్రి యున్నవిధమున్‌ సర్వంబు
సంపాతిచే, విని, నీలాంగద ముఖ్యవా నరులు వేవే
గంబె ప్రాయోపవే, శనమున్‌ మాని భవత్సమేతులగు
చున్‌ సంప్రీతితో నా, మహేంద్ర నగారోహణ
మాచరించి రఁట విన్నాణంబుగా మారుతీ!

తాత్పర్యం:- జనకక్ష్మాపతిపుత్రి = జనకమహారాజు యొక్క కుమార్తె, వేవేగంబె = వెనువెంటనే, ప్రాయోపవేశనము= ఆమరణ నిరాహారదీక్ష, భవత్సమేతులగుచున్= నీతో గూడినవారై, నగారోహణం= పర్వతాన్ని ఎక్కటం, విన్నాణంబుగా= నేర్పుగా .గతపద్యంలో స్వయంప్రభ వృక్షబిలం నుండి బయట వేయబడిన వానరులందరూ దక్షిణ సముద్ర తీరంలో పడి లేచారు. సీతాన్వేషణకు సుగ్రీవుడు విధించిన నెలరోజుల గడువు తీరిపోయినది. తిరిగి వెళ్ళి సీతదేవి కనిపించలే దని చెబితే జరిగే అనర్థాలకు ఆస్కారం ఇవ్వడం కంటే, నిరాహారదీక్ష చేసి ఈ సముద్రపు వొడ్డున మరణించడం మేలనుకుంటూ, ఒక్కసారి వారిలో వారు అప్పటి వరకు
జరిగిన రామకథా సంఘటనలను గూర్చి మాట్టాడుకుం టారు. ఆ కథలో జటాయువు ప్రస్థావన, సీతాపహరణను అడ్డుకున్న ఆ జటాయవును రావణాసురుడు సంహరించటం, ఆ సముద్రానికి సమీపంలో వున్న కొండగుహలో నివసిస్తున్న సంపాతి అనే గృధ్రము (గద్ద పక్షి) వింటుంది.
వానరుల ద్వారా జరిగిన కథంతా అడిగి తెలుసుకుంటా డు. కొండమీద నుండి దక్షిణ దిశగా తేరిపారజూసి రావణా సురిచే అపహరించబడిన సీతాదేవి లంకలో అశోకవనంలో
రాక్షసస్త్రీల కాపలాలో వున్నట్లు చెబుతాడు. ఆవిషయం విన్న నీలుడు, అంగదుడు మొదలైన వానరవీరులందరూ, ఎవరైతే ఆమరణనిరాహారదీక్ష చేయ తలపెట్టినారో వారం
దరూ, వెనువెంటనే వారి ప్రయత్నాన్ని మానుకొని, ఓ ఆంజనేయా! నీ చుట్టూచేరి, నీతో కలిసి, ఆ సముద్రానికి దగ్గరిలో వున్న మహేంద్ర పర్వతాన్ని ఆనందోత్సాహాలతో అధిరోహించినారు కదా, స్వామీ!

14)మll శరధింగాంచి యలంఘనీయ మని తత్సంతారణా
దక్షులై, వరుసన్‌ గీశులు భీతిచేఁ గళవళింపన్‌ వారి
వారించి ని, న్నురుపాథోధి విలంఘన క్షమునిఁగా నూ
హించి ధీమంతుఁడా, పరమేష్ఠి ప్రియపుత్రుఁ డంచిత
గతిన్‌ బ్రార్థింపఁడే మారుతీ!

తాత్పర్యం:- శరధి= సముద్రం,అలంఘనీయం= దాటుటకు సాధ్యముకాని, తత్ + సంతారణ+అ దక్షులై= ఆ సముద్రా న్ని దాట చేతకానివారై, గళవళింపన్= కలతచెందగా, నిన్ను+ఉరు పాథోధి= నిన్ను గొప్పసముద్రం, విలఘన క్షమునిగా= బాగా దాటగలిగే సమర్థత గలవానిగా,
ధీమంతుడు= బుద్ధిమంతుడు, పరమేష్టి ప్రియపుత్రుడు= బ్రహ్మదేవుని కుమారుడైన జాంబవంతుడు, అంచిత గతిన్ = గౌరవనీయమైన పద్ధతిలో, ప్రార్థింపడే= ప్రార్థించినాడు కదా!
సముద్రం మధ్యలో వున్న లంకలో సీతాదేవి వున్నదని సంపాతి చెప్పటమైతే చెప్పాడు. అక్కడి చేరాలంటే నూరు యోజనాల దూరం సముద్రం లోనుండో పైనుండో ప్రయాణించాలి. వామ్మో.. ఇది మనకు సాధ్యమయ్యే పనిగాదు. వైనతేయ వంశస్థుడైన సంపాతి స్వయంగా తన కళ్ళతో
చూసి చెబుతున్నాను, " సీతమ్మ సమద్రం మధ్య నున్న రావణ లంకలో అశోకవనంలో రాక్షస స్త్రీల కాపలాలో బంధించబడివున్నది" అని చెప్పాడు గదా!. ఇటునుండి ఇటే వెనక్కు తిరిగి వెళ్ళి, ఇదే విషయం సుగ్రీవునితో, రామునితో చెబుదాం, అన్నారు కొందరు కపులు. జాంబ
వంతుడు అందుకు అంగీకరించ లేదు. మనల్ని సీతమ్మ ఎక్కడుందో వెతికి చూసి జాడ తెలిసికొని రమ్మన్నారు, అంటే దానర్థం ఎవరో చెప్పిన జాడను తెలుకొని వచ్చి
చెప్పమని కాదు. స్వయంగా మనకళ్ళతో మనల్ని చూసి; వీలైతే సీతమ్మతో మాట్లాడి; శ్రీరాముడు, సుగ్రీవుని సహా యంతో చేస్తున్న ప్రయత్నాల్ని సీతమ్మకువివరించి,సీతమ్మ
వున్న ప్రదేశానికి చేర్చే మార్గాన్ని తెలుసుకొని రమ్మని చెప్పి నట్లు. ఇలా, సముద్రాన్ని దాటి లంకకు చేర లేని చేతగాని వాళ్ళమైనామని దిగులుతో చింతాక్రాంతులైన కపిసేనకు
వివరించిన జాంబవంతుడు, కొద్దిదూరంలో నిర్వికారంగా కూర్చున్న, ఓ హనుమత్ ప్రభూ! నిన్ను సమీపించాడు. నీ శక్తి సామర్ధ్యాలను నీకు గుర్తుచేశాడు. నూరుయోజనాల
సముద్రాన్ని ఆకాశమార్గంలో అవలీలగా దాటగల దక్షుడ వు నీవే నని ప్రస్తుతించాడు గదా!

15) శాll
"ఏలా మీకు భయంబునేఁగలుగ,మీరిందుండుఁడేనొక్కఁడన్‌
వాలాయంబు పయోధి దాటి యనువొందన్‌లంకలోజానకిం
బోలం గన్గొని వత్తు, నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై
ర్యాలాపంబులు వల్కి తేర్చితివి గాదా కీశులన్‌ మారుతీ!

తాత్పర్యం:-వాలాయంబు=తప్పనిసరి,పయోధి=సముద్రం, అనువొందన్= నేర్పుగా, పోలం = స్థానము, పరమామోదం బు= మిక్కిలి సంతోషం, ధైర్యాలాపంబులు= ధైర్య వచనాలు, తేర్చు= శాంతింపజేయు. తామున్న దక్షిణతీరంనుండినూరుయోజనాలదూరంలో సముద్రం మధ్యలోవున్న లంకను చేరటం తమవల్లకాదనివానరులందరూ ఆందోళన చెందుతున్న సందర్భంలో, జాంబవంతుడు,కాస్త దూరంలో మౌనంగా కూర్చొని వున్న ఆంజనేయస్వామివారి వద్దకు వెళ్ళి,ఆ స్వామిని స్తుతించి, స్వామిలో వున్న అపరిమితమైన శక్తిని మేల్కిపినాడు.
ఇంతవరకు జరిగిన కథను ఇంతకు ముందటి పద్యభావం లో తెలుసుకున్నాం. జాంబవంతుని ప్రబోధతో ప్రచోదనతో ఉత్తేజితు డైన స్వామి, పలికిన పలుకులు కవి, ఈపద్యం లోవ్రాశారు.
"ఓ గోలాంగూలభల్లూకవానర మిత్రులారా! నేనుండగా, మీరెందుకు భయపడతారు. మీరిక్కడ (సముద్రపు వొడ్డు న) వుండండి. నేనొక్కణ్ణే తప్పనిసరిగాఈసముద్రాన్నిదాటి, నేర్పుతో లంకలో ప్రవేశించి సీతామాత ఎక్కడుందో వెతికి ఆ తల్లిని వుంచిన తావు తెలిసికొని ఎలా వెళ్ళానో తిరిగి
అలాగే వస్తాను. మీ అందరిరికీ అమితానందాన్ని కలిగించి తీరుతాను", అని ధైర్యవచనాలను పలికి, నిరాశానిస్పృహ లలో దిగులుపడుచున్న ఆ వానరాదులను ఓదార్చి, శాంతింపజేసితివి కదా మారుతీ!

16) మll
బలిబంధించిననాఁటివామనతనుప్రాబల్యముందాల్చి,యు
జ్జ్వల చంద్రోదయవేళఁ బొంగు తటినీశస్ఫూర్తినుప్పొంగి,ఘో
ర లయాభ్రంబు తెఱంగునన్‌ భయద గర్జారావముం జేసి,త
జ్జలధిందాటఁగఁబూనితీవుపరమోత్సాహమ్మునన్‌మారుతీ!

తాత్పర్యం:- ప్రాబల్యం= బలిష్టత, ఉజ్జ్వల= ప్రకాశించు, తటినీశ=సముద్రం, ఘోరలయాభ్రంబు= భయంకరమైన
ధ్వనితో ఉరుము, తెరంగునన్= విధముగా, భయదగర్జా
రావము= భయాన్ని పుట్టించేంతటి పెద్ద అరుపు,తజ్జలధిం = ఆ సముద్రాన్ని, పూనితి+ఈవు= తలపెట్టినావు, పరమోత్సాహమ్ము= దృఢప్రయత్నం. కవి ఈ పద్యంలో శ్రీఆంజనేయ స్వామి వారి సముద్రలం ఘన దృశ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించినాడు. పద్యప్రారం
భంలోనే, "బలి బంధించిన నాఁటి వామన తనుప్రాబల్య ముం దాల్చి", అని చదవగానే మహావిష్ణువు దాల్చిన వామానావతారం గుర్తుకొస్తుంది. మూడు అడుగుల నేల దానం అడిగి, ఇస్తానన్న బలిచక్రవర్తి సామ్రాజ్యాన్ని రెండుఅడుగులతో ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడపెట్టమం టావని వామనుడు అడుగడం, బలి తన తలమీద పెట్టమ నడం, అలాగే వామనుడు, బలితలమీద కుడిపాదాన్ని మోపి బలిని పాతాళానికి అణచివేయడం, పాతాళంలో
బలి బంధీకృతుడవ్వడం జరుగుతుంది. ఈ లీలలో పొట్టి వామనుడు, 'ఇంతింతై వడుడింతై' అన్నట్లుగాశరీరాకృతిని అనూహ్యంగా పెంచి తాను అనుకున్నకార్యాన్నిసాధిస్తాడు.
అలాగే ఓ ఆంజనేయస్వామీ! ఆనాడు బలిచక్రవర్తినిపాతా ళలోకంలోనికి అణచి వేసి, అక్కడ బంధీకృతుని చేయడం లో వామనావతారుడైన శ్రీమహావిష్ణువు తన ఆకృతిని పెంచినట్లగానే, నీవునూ నీ దేహాన్ని అపారంగాపెంచినావు. చంద్రుడు ఉదయించి తన వెలుగులను బాగా విజిమ్ముతు న్న వేళ, సముద్రం ఎలా పైకిలేస్తుందో, నీవునూ అలాగే మహేంద్రగిరి నుండి పైకి ఎగిరావు. ఆకాశం పెద్దధ్వనిచేస్తూ ఉరిమిన రీతిగా భయంకరమైన గర్జన చేసి,ఆ సముద్రాన్ని
ఆకాశమార్గంలో పయనించి దాటడానికి పరమోత్సాహం తో పూనుకొంటివి గదా స్వామీ!

17) మll
స్థిరసత్త్వంబున శైలరాజము ధరిత్రిం గ్రుంగఁ బాదంబులూ
ది, రహిన్‌ భూరిభుజోరు వేగమున ధాత్రీజాతముల్‌ పెల్లగి
ల్లి రయంబారఁగఁ దోడ రా,గగనమున్‌ లీలాగతిన్‌ మ్రింగ సు
స్థిరశక్తిం జనుమాడ్కి దాటితివి గాదే నింగికిన్‌మారుతీ!

తాత్పర్యం:- స్థిరసత్త్వంబున= చెదరని బలముతో, శైలరా జము= పర్వతరాజము ( అంటే ఇక్కడ మహేంద్ర పర్వత మని అర్థం), ధరిత్రి= భూమి, పాదంబులు+ ఊది= అరికా
ళ్ళతో అదిమిపట్టి, రహిన్= విధముగా, భూరి+భుజ+ఉరు వేగమున= విస్తారమైన భుజములను కదిలించుటవలన ఉత్పన్నమైన వేగమున, ధాత్రీజాతములు= చెట్లు, మాడ్కి= రీతిగా, గగనము= ఆకాశము ఓ మారుతీ! నీవు ఆకాశంలోనికి ఎగరడానికి ఉద్యుక్తుడ వైనప్పుడు, ఆ మహేంద్ర పర్వత శిఖరాన్ని గట్టిగాఅరికాళ్ళ తో బలంగా అదిమి పట్టినావు, అప్పుడా పర్వత పీఠం భూమి లోనికి క్రుంగి పోయింది. విస్తారమైన నీ భుజములు కదిలించుటవలన జనించిన వేగానికి, ఆ పర్వతాన్ని ఆశ్ర యించుకొని వున్న వృక్షాలు కూకటివ్రేళ్ళతో సహా పెల్లగిం
చబడి, కొన్ని నీ శరీరానికి చుట్టుకొన్నాయి.ఆకాశాన్నిమ్రింగ టానికి పోతున్నావా.. అన్నట్టు, ఆకాశానికి ఎగిరిప్రయాణిం చిన నీతోపాటే, నిన్నుచుట్టుకున్న ఆ వృక్షాలు కుడా ప్రయా
ణించాయి. అవి నీకు అదనపు భారమైనా , లెక్కచేయ కుండా స్థిరసంకల్పంతో నీవు మాత్రం ఆకాశంలోముందుకు దూసుకొని పోయావు కదా స్వామీ!

18) మll
అగజాలావృతమూర్తివై భుజరయోద్యద్వారివాహంబు లొ
ప్పుగ నిర్వంకల నంటి రా గదలి యంభోరాశిమధ్యంబునన్‌
గగనాధ్వంబున నేగు నిన్నమిషుల్‌, గంధర్వులున్‌ లంబప
క్ష గిరీంద్రంబును బోలె జూచిరికదా సంభ్రాంతులై మారుతీ!

తాత్పర్యం:-అగజాలావృతమూర్తివై= చెట్లూ పూలతో చుట్టి వేయబడిన శరీరము గలవాడై, భుజరయో+ ఉద్యత్+ వారివాహంబు= రెండు భుజముల యొక్క వేగముచేత రెండు ప్రక్కలకు తోసివేయబడిన మబ్బులు,ఒప్పుగ=చక్క గా, ఇర్వంకల= రెండు పక్కల, అంభోరాశి మధ్యంబునన్=సముద్రం మధ్యంలో, గగన + అధ్వనంబున=ఆకాశమార్గ మున, ఏగు= వెళ్ళు, నిన్+ అనిమిషుల్= నిన్ను దేవతలు, లంబపక్షి గిరీంద్రంబు= పెద్దపొడవైన పర్వతమంత పక్షి,
సంభ్రాంతులై= మిక్కిలి విభ్రమమునకు లోనైనవారై. ఓ మారుతీ! చెట్లూపూలతో చుట్టుకొనబడిన శరీరము తో, రెండుచేతులతో వేగంగా తోసివేయబడిన మేఘాల ను ఇరువైపుల వెంటనంటిరాగా, సముద్ర మధ్యానికి చేరు తున్న నిన్ను, అప్పడు ఆకాశంలో వెళ్ళుతున్న దేవతలు, గంధర్వులు చూచి, ఆహా.. ఏమిటిది, మనం ఎన్నడూ చూడని ఇంతపెద్ద పొడవైన పర్వతమంత పక్షి ఆకాశంలో ఎగురుతూ పోతున్నదేమిటో, అని వారిలో వారు అను
కుంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు గదా స్వామీ!
--(())--

Wednesday, 25 December 2019

సుందర కాండము-4*



*శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-4*
*సురసా రాక్షసి*
పిమ్మట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు నాగ మాత యగు సురసతో .. నీవు  ఆకాశమంత నోరుతో హనుమ కు విఘ్నము కలిగించి అతని కార్యసాధన దీక్షను పరీక్షించుము అనిరి. ఇట్లు వారు కోరగానే సురస హనుమ మార్గమును అడ్డగించి "ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారముగా ఒసగినారు కావున  నీవు నా ముఖమున ప్రవేశించుము" అనెను. అప్పుడు హనుమ "నేను రామకార్యార్థినై సీతాన్వేషణకు వెళ్లుచున్నాను కావున నేను సీతాదేవిని చూచి ఆ విషయము రామునికి ఎఱింగించి తర్వాత నీనోట పడుదును కావున నన్ను అడ్డగించవద్దు" అని కోరెను. అందుకు సురస ఒప్పుకొనకపోగా హనుమ సురసతో నా శరీరము పట్టగలిగినంత నీ నోరు తెరువుము అని, హనుమ తన శరీరమును వరుసగా పది, ముప్పది, తొంబది యోజనములు పెంచెను. సురస గూడ తన నోరును వరుసగా ఇరువది, నలుబది, నూరు యోజనములుగా పెంచెను. అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమ తన శరీరము సూక్ష్మముగా చేసి నోటిలో ప్రవేశించి వెంటనే బయిటకు వచ్చి నీ కోరిక తీరినది గాన నన్ను వెడలుటకు అనుమతిని ఈయమని కోరెను. అప్పుడు సురస తన స్వసరూపమును పొంది ..
*అర్థ సిద్ధ్యై హరి శ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యథా సుఖమ్*
*సమా౭౭నయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా*          5.1.162
"ఓ! వానర శ్రేష్టా! హాయిగా ముందునకు సాగి కార్యసిద్ధిని పొందుము. మహాత్ముడగు శ్రీరామునితో సీతమ్మను చేర్చుము". అని ఆశీర్వదించి చనెను,  ఆకాశములో నిలిచి యున్న భూతగణము లన్నియు భేష్ భేష్ అని ప్రసంశించెను.
ఇందలి యోగ రహస్యమును పరిశీలిద్దాము. రాక్షసి తన నోరును శతయోజనములు పెంచినదియట. మానవుని శరీరము అందునా నోరు శతయోజనముల యంతటి పెద్దదిగా యుండునా? వివేకము భ్రష్టమైనప్పుడు మానవుడు తన దుర్గుణములు తద్వారా వాని అధఃపతనము శత విధముల/శతముఖముల జరుగును. *"వివేక భ్రష్టానాం, భవతి విని పాతః శత ముఖః"*  ఈ సురస శత యోజన వృత్తి రూపము సాధకుని మ్రింగుటకై లాలస పడును. కానీ సాధకుడు అహంకార రహితుడై చిన్న వాడైనచో అటువంటి వాని ముక్తి జరుగును. సాధకునికి లభించు అష్ట సిద్ధులలో లఘిమ - అనగా అణువంత చిన్నవాడవడం, ప్రాకాయి - శరీరమును అతి విశాలముగా చేయడము - భాగములు.
యోగ మార్గములో సిద్ధులు అవశ్యముగా సిద్ధించును. అయితే సాధకుడు ఆ సిద్ధులకు బానిస కానిచో తదుపరి ప్రగతి సాధ్యమగును. కానిచో సిద్ధుల మాయలో పడి సాధకుడు అతి తీవ్రగతితో పతనమగును. సంసార మాయ నుండి విడుదలై సిద్ధుల మాయలో చిక్కుకొనిన సాధకుడు అక్కడి నుండి విడిపించుకొనుట కష్టము. ఈ సిద్ధుల యొక్క మాయ శత యోజనముల యంత పెద్దదిగా యుండి మహాసాధకులను కూడా మ్రింగి వేయును. అందుచే బుద్ధిమంతుడైన హనుమ అట్టి మాయ నుండి ముక్తమగుటకై నమ్రతతో సూక్ష్మ రూపుడై తనకు ప్రాప్తించిన సిద్ధులన్నియు పరమాత్మకు సమర్పించును. ఈ సూక్ష్మ శరీరము ద్వారా తనలోని అహంకారమును హనుమ వదిలెను. ఇదే కాండలో లంకలో సీతను అన్వేషించునప్పుడు గూడ హనుమ సూక్ష్మ రూపముతోనే తన అహంకారమును వదిలి సర్వము రామునిపై కార్య భారము మోపి, తనతో కార్యము రాముడే (భగవంతుడు) చేయించుచున్నాడు అని తలచి  అన్వేషించును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

Tuesday, 24 December 2019

***సుందర కాండము-3




శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-3
హనుమ సాగరయానము

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
 
అంగదాది వానరుల అభ్యర్థనను అనుసరించియు, జాంబవంతుని ప్రోత్సాహముతో హనుమ సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతమును అధిరోహించి సీతాన్వేషణకు చారణాది దివ్య జాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఇచట ఆకాశమున వెళ్ళుట యనగా బ్రహ్మనిష్ఠ కలిగి యుండుట. ఆకాశమనగా పరబ్రహ్మము (అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు). దాని యందు విహరించువాడే సంసార సముద్రమును తాను దాటి జీవులను తరింప చేయగలడు.
 
ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
 
ఆ మహాబలుడి చే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్లనుంచి బంగారు, వెండి, కాటుక ధారలను వెలిగ్రక్కును. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో [1]"మాధ్యమార్చి" అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు హనుమచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడ సాగెను. హనుమ పైకి ఎగుర సన్నద్ధుడై అంగదాది వానరులతో ఇట్లనెను.
 
వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః     5.1.39
 
గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్  5.1.40
 
అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః        5.1.41
 
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా       5.1.42
 
ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః         5.1.43
 
ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
 
రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను. అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను. ఆత్మీయులను వీడ్కోలినప్పుడు వారిని కొంతదూరము అనుసరించి, వాటి ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖాశ్రువులను రాల్చి శోక తప్తులగుదురు. అదేవిధముగా అచ్చటి మహావృక్షములు ఆయన వేగమునకు కొంతదూరము అనుసరించి పుష్పములను రాల్చుతూ సముద్రముపై పడిపోయెను.
 
దశ యోజన విస్తీర్ణా త్రింశ ద్యోజనమ్ ఆయతా            
ఛాయా వానర సింహస్య జలే చారుతరా౭భవత్ 5.1.76
 
సంధ్యా సమయము కావడం మూలాన మారుతి యొక్క శరీరచ్చాయ పొడవు పది యోజనములు, వెడల్పు ముప్పది యోజనములుగా కనబడెను. త్రోవలో సాగరుని యొక్క ప్రోద్బలముచే మైనాకుడు (సముద్రములో నున్న పర్వతము) హనుమను  కొంచెము తడవు విశ్రాంతి తీసుకొనమని ప్రార్ధించగా, అందుకు సున్నితముగా తిరస్కరించి హనుమ తన ప్రయాణమును కొనసాగించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Monday, 23 December 2019

***సుందర కాండము-2 సుందరకాండ సౌందర్యము



[

5:59 AM, 12/24/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-2
సుందరకాండ సౌందర్యము
శ్రీరామాయణము మహాకావ్యము. కావ్యమున శబ్దము, అర్థము, రసము - అను మూడు ఉండును. ఈ  మూడును సుందరములై యున్న ఆ కావ్యము మాహాకావ్యము. సుందర కాండలో ఇట్టి శబ్దార్థరస సౌందర్యములు అధికము. కావుననే ఇది సుందరకాండ.
ఇందలి కావ్యగతశబ్దార్థరస సౌందర్యములను పరిశీలింతుము.
1 శబ్ద సౌందర్యము
హంసో యథా రాజత ప౦జర స్థః
సింహో యథా మన్దరకన్దర స్థః
వీరో యథా గర్విత కుఞ్జర స్థః
చన్ద్రో౭పి బభ్రాజ తథా౭మ్బర స్థః      5 5 4
మున్నగు శ్లోకములలో వర్ణ, పద, అనుప్రాసలు అందము కనబడును.
2 "అర్థ సౌందర్యము*
ఇందలి వర్ణనలు, కథ, అలంకారములు కడు మనోహరములు. ఉదాహరణకు
ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమ్ అన్వయుః
ప్రస్థితం దీర్ఘమ్ అధ్వానం స్వబన్ధుమ్ ఇవ బాన్ధవాః    5.1.47
తమ్ ఊరు వేగోన్మథితాః సాలా శ్చా౭న్యే నగోత్తమాః
అనుజగ్ముర్ హనూమన్తం సైన్యా ఇవ మహీ పతిమ్            5.1.48
ఆ కపివరుని వేగమునకు ఆ మహావృక్షములన్నియు ఒక ముహూర్తకాలము అతనిని వెన్నంటి ఒక మహారాజును అనుసరించుచున్న సైన్యము వలె కాన వచ్చెను.
అటులననే రావణుని అంతఃపురంలో పెట్టిన దీపములు ఆరకుండా జూదములో ఓడిపోయినను వదలలేక అటువైపు చూచుచున్న జూదగాళ్ళతో పోల్చెను. (9 .32 ). ఇట్టి అనేకమైన అలంకారములు సముద్రతరణ, లంకాన్వేషణ, సీతాదర్శనము, అశోకభంజనము, రావణ దర్శనము, లంకాదహనాదులలో కావ్య సౌందర్యము వర్ణనాతీతము.
3 రస సౌందర్యము
ఈ కాండలో నవరసాలు చాలా అందముగా వర్ణింపబడినవి. సీతారాముల పరస్పరానురాగము, ఎడబాటును  వర్ణించుటలో "శృంగారము" గోచరించును.  రాక్షసులను జయించుటలో "వీరరసము" గానబడును. సురస, సింహిక, లంకిణీల వ్యర్థాటోపము "హాస్యరసమును" సూచించును. రాక్షసులను చంపుటలో "రౌద్రరసము" కనబడును. లంకాదహనములో "భయానకం" గోచరించును. సముద్ర లంఘనములో "అద్భుతము" గోచరించును. సీత కనబడక హనుమ నిర్వేదము చెందినప్పుడు "శాంతము" కనబడును.  రాక్షసుల వలన సీత పడిన బాధ "కరుణ" ను చూపును.
ఈ కాండ యందు మొదట నుండి చివర వరకు హనుమ కనబడును. పదిహేనవ సర్గ నుండి చాలా వరకు సీత కనబడును. చివరి సర్గలో శ్రీరాముడు కనబడును. ఈ ముగ్గురి యొక్క సౌందర్యములు ఇందు అభివ్యక్త మగుటచే దీనికి "సుందరాకాండ" అయినది.
సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా|
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం||"
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః|
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం||
అనునది ప్రాజ్ఞుల వచనము. పురుష మోహనాకారుడు, సుగుణగుణా సుందరుడు, శ్రీరాముడు. సర్వవిధముల భువనైక సుందరి సీతామాత. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమ పరమ సుందరుడు. అశోక వనము అతిలోక సుందరము. శ్రీసీతారామహనుమంతుల మహామంత్రములు దివ్యములు, సుందరములు. ఈ మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరము. ఈ సుందరాకాండము యొక్క బహువిధవైభవములను వర్ణించు కవిత్వము (కావ్యము) అంత్యంత సుందరము. ఈ సుందర కాండము నందు సుందరము కానిదేది లేదు. సీతాన్వేషణ మహాకార్యమున ప్రముఖ పాత్రను నిర్వహించిన మహాత్ముడు హనుమ. హనుమ యొక్క శక్తిసామర్థ్యములు, బలపరాక్రమములు అత్యద్భుతములు, నిరుపమానములు. ఈయన కార్యదీక్షతలు అపూర్వములు. అణిమాది అష్ట సిద్ధులు అన్నియు ఈయనకు కారతలామలకములు. బుద్ధి, వైభవము సాటిలేనిది. సమయస్ఫూర్తి  ఉగ్గుపాలతో అబ్బిన విద్య. ఇంత ఎందులకు ఈ మహాత్ముని విషిష్ఠ లక్షణము లన్నియు ఈ సుందర కాండము గోచరించును. అయినను ఎల్లప్పుడూ తనను దాసుడుగానే అభివర్ణించుకొన్నాడు గాని సర్వస్వతంత్రుడిగా భావించుకోలేదు. అహంకారము ఈషన్మాత్రము గూడ లేదు.
శ్రీరామ జయరామ జయజయ రామ

Sunday, 22 December 2019

సుందర కాండము-1* *హనుమ స్వరూపము*




ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: 
  • *శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-1*002 

*హనుమ స్వరూపము*
*వేదవేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే*
*వేద: ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా*

వేదములచే తెలియబడు పరమపురుషుడు దశరధునికి కుమారుడైనట్లుగా,వేదము,వాల్మీకి వలన , రామాయణ రూపముతో ఉండినది..

శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై మరల నసించిపోవు చున్న ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు గా అవతరించాడని  మన భారతీయుల ప్రగాఢ విశ్వాసము. శ్రీరాముని మీద మనకు లభించినన్ని పరిశోధనా గ్రంథాలు వేటి యందు లభించవు. శ్రీరాముడు మానవునిగా జన్మించి తన శిష్య ప్రజ్ఞచే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అకుంఠిత దీక్షతో ఆయా యోగ రహస్యాలను అభ్యాసం చేసి, తన సత్య సంధతతో భగవంతునిగా రూపాంతరము చెందినవాడు. తనను గూర్చి *"ఆత్మానాం మానుషం మన్యే"* (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న శ్రీరాముడు *"సత్యేన లోకాన్ జయతి"*  అను ప్రమాణము ననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడు అయినందున శ్రీరాముడు అన్ని లోకములను జయించ గలిగిన వాడై భగవంతునిగా ఈ లోకుల దృష్టిలో ఉండిపోయాడు. దుర్లభమైన మానవ జీవితమును వ్యర్థము చేసుకొనకుండా బాహ్యమున ధర్మాచరణమును, అంతరమున జ్ఞానము కలిగి ఉండవలెనని మనకు శ్రీరాముని ద్వారా తెలియు చున్నది.
రామలక్ష్మణులు సీతను అన్వేషించుతూ పంపా తీరమునకు వచ్చినప్పుడు, సుగ్రీవుని భయము పోగొట్టుటకై హనుమ సుగ్రీవునితో ఇది ఋశ్యమూకం గాన ఇక్కడికి వాలి, వాలి సంబంధీకులు రాలేరు అని చెపుతాడు. ఆ విధంగా రామాయణంలో హనుమ పాత్ర పరిచయము అయింది. రామసౌందర్యమును చూడగానే హనుమ ఆకర్షితుడయ్యెను. హనుమను చూచి, అతని సంభాషణ విని నంతనే రాముడు అతనిలోని గుణగణములను తెలుసుకొనెను. రాముడు లక్ష్మణుతో హనుమను గురించి చెపుతూ ..

వాక్యకుశలః,(వాక్యకుశలుడు),  ఋగ్వేదమునందు బాగుగా శిక్షణ పొందినాడు, యజుర్వేదమును ధారణ చేసినాడు,  సామవేదమును చక్కగా ఎరిగిన వాడు, వ్యాకరణమును అనేక మార్లు వినినాడు, మాట్లాడినప్పుడు సందిగ్ధము లేకుండా, తొందరగా గాని, మెల్లగా గాని గాకుండా ముఖము నందు ఎట్టి వికార భావములు లేకుండా, మధుర స్వరముతో, సంస్కారముగా, మంగళకరమైన మధుర స్వరముతో మాట్లాడినాడు అనెను. ఇట్టివాడు దూతగా ఉన్నచో కార్యము తప్పక సిద్ధించునని దూతగా హనుమ యొక్క విశిష్టతను  చెప్పినాడు.  హనుమ యొక్క ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్దమునకు హనుమతో గల సామ్యము గోచరించును. మనలోని ఒక భావమును ఆవిష్కరించ వలెనన్న కోరిక గలిగినచో శరీరములోని వాయువులలో కదలిక గల్గును. ఆ వాయువుచే అభిహతమై మూలాధార స్థానము నుండి శబ్దము బయలుదేరి నాభిని, హృదయమును, కంఠమును దాటి తిన్నగా శిరస్థానమును చేరును. అచట నుండి పైకి పోవ వీలు లేక కంఠము నుండి ముఖము గుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునప్పుడు నోటిలోని ఆయా స్థానములలో వాయువు యొక్క తాకిడిచే శబ్దముగా వెలికి వచ్చును. ఇందు హనుమకు, శబ్ధమునకు సాపత్యమును చూద్దాము.

1 హనుమ వాయువు వలన జన్మించాడు. శబ్దము కూడా వాయువు వలననే జనియించింది.
2 పుట్టగానే హనుమ సూర్య మండలము వైపు (సమాధి అవస్థ) కు పోయెను. శబ్దము కూడా ముందుగా శిరస్సు వైపు సాగును. అటు పోవ వీలుగాక నోటి నుండి వెలుపలికి వచ్చును. నోటిలోని ఆయా వర్ణముల అభివ్యక్త స్థానములే అంజన, కనుక అంజనాసుతుడు అయ్యెను.
3 సూర్యుని నుండి క్రిందకు పడిపోటచే దౌడలు సొట్ట  బోయి   హనుమ గా పేరు వచ్చినది. శబ్దము గూడ శిరఃస్థానము నుండి నోటిలోని దౌడల కదలికచే వర్ణ రూపమున వెలుపలికి వచ్చును గాన శబ్దము గూడ "హనుమ" అగును.
4 శబ్ద సామర్థ్యము వలన అవసరమైన కార్యములు నెరవేర్చుటలో మంత్రి వలే పని చేయును. స్వాధ్యాయన ప్రవచన శీలి యగు సుగ్రీవునకు హనుమ సచివుడు.
ఇట్టి హనుమయే రాముని సీతమ్మతో  కలుపును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
సీతారామ మనోభిరామ కళ్యాణ రామ 
సమస్త జనరక్షక పాలన రామ .. ఓం శ్రీరాం 
/మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

Saturday, 21 December 2019

*మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయము

ప్రాంజలి  ప్రభ ... రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (001) 
ఎందరో మహానుహవులు అందరికీ వందనములు ,, మూలం వాల్మీకి రామాయణము 
కార్తీక మాస సందర్భముగా సుందరకాండ పారాయణము చేయుట చాలా మంచిది అందుకని అందిరికి అందుబాటులో ఉండేవిధముగా వ్రాసిన రామాయణములో సుందరతత్వము పొందు పరుస్తున్నాను  

మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయము

శ్రీరాముడు-యోగ తత్వ రహస్యము (sundarakaanda)


శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము కర్కాటక లగ్నము నందు, భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమి నక్షత్రము మీన లగ్నము నందు, లక్ష్మణ, శత్రఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్రము కర్కాటక లగ్నము నందును జన్మించిరి. వారి వారి జనన కాలము నందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఉచ్చ దశలలో యుండిరి. జ్యోతిషశాస్త్ర ప్రమాణము ప్రకారము శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా, తక్కిన వారు జగత్ప్రసిద్ధులైరి.


సర్వే వేదవిదః శూరాః సర్వే లోక హితే రతాః
సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః   1 18  24

ఆ రాజకుమారులు వేదశాస్త్రములను అభ్యసించిరి. ధనుర్విద్య యందు ప్రావీణ్యము సంపాదించిరి. యుక్త వయస్కులైన తన పుత్రుల వివాహ విషయమై దశరథ మహారాజు ఆలోచించుచుండగా విశ్వామిత్ర మహర్షి వచ్చి యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంప వలసినదిగా కోరతాడు. ఆ కోరిక విని దశరథ మహారాజు విశ్వామిత్రునితో ..
ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః
న యుద్ధ యోగ్యతామ్ అస్య పశ్యామి సహ రాక్షసైః  1 20 2

రాముడు పదుహారు సంవత్సరముల ప్రాయము వాడు, క్రూర రాక్షసులతో యుద్ధము చేయలేడు. ఇక్కడ వాల్మీకి తన కావ్యములో శ్రీరాముడు జననము తర్వాత వారు పదునారు సంవత్సరముల ప్రాయములో సకల విద్యా పారంగతులైరి అని చెప్పెను. తరువాత శ్రీరాముని వైరాగ్యము, వసిష్ఠ మహర్షి చెప్పిన ఆత్మ విజ్ఞానము మనకు వాల్మీకి రామాయణములో కానరాదు. అది యోగ తత్వము నందు యున్నది  గావున గమనించ గలరు. 

రావణుడు అమోఘమైన తపఃసంపన్నుడు. అట్టి రావణుని సంహరించుటకు రావణుని మించిన తపఃశక్తిని  పొంది యుండవలెను.


వేదము - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము - అని మూడు భాగాలు. ఆరణ్యకంలో వివిధ తపస్సులు క్రింది విధంగా పేర్కొనబడినవి:

"ఋతం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యఙ్ఞం తపః, భూర్భువస్వుర్బ్రహ్మై తదుపాస్య తపః.
1. ఋతము = సూన్రుత భాషణము - వాక్కుతో సత్యము పలుకుట, 
2. సత్యము = త్రికాలలో - భూత-భవిష్యత్-వర్తమానాలలో - ఉండేది. యథార్థ వస్తు చింతనం చేయటం. సత్యం ఙ్ఞానం అనంతం బ్రహ్మ (తైత్తిరీయోపనిషత్తు), 
3. శ్రుతము = వేదాధ్యయనము, 
4. శాంతము = శాంతముగా నుండుట (ఓర్పు), 
5. దమము = ఇంద్రియ నిగ్రహము, 
6. శమము = కామక్రోధాదులు లేకుండుట, 
7. దానము = బ్రహ్మార్పణముగా ఇతరులకు ఇచ్చుట, 
8. యఙ్ఞము = దేవతారాధన. ఇవేకాకుండా బ్రహ్మను (అంటే సర్వమూ తానే అయి, సర్వత్రా, సర్వకాలములలో ఉండేవాడు) ఉపాసించుట కూడ తపస్సే. యఙ్ఞములు పలు రకాలు. వాటిలో తపోయఙ్ఞం ఒకటి. అదే ఆ పైన చెప్పబడినదియే యఙ్ఞం తపః.
శ్రీమద్భగవద్గీతలో శ్రీ క్రుష్ణ భగవానుడు ఐదు రకాలైన యఙ్ఞ భేదములను ఇట్లా వివరించాడు.

ద్రవ్య యఙ్ఞాస్తపోయఙ్ఞా, యోగ యఙ్ఞాస్తధాపరే|
స్వాధ్యాయ ఙ్ఞానయఙ్ఞాశ్చ, యతయః సంశితవ్రతాః||
(ఙ్ఞానయోగము: 4-28)

వాటిలో తపస్సు కూడా ఒక యజ్ఞమే. ఈ మాదిరి పుణ్య కార్యాలు, తపస్సులు చేస్తే దైవారాధన వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. మహర్షులు, సాధు పురుషులు తమ స్వార్థం కోసంగాక, లోక క్షేమం కోరి తపస్సు చేస్తారు. కామక్రోధాలను, రాగద్వేషాలను దరిజేరనీయక, జితేంద్రియులై, సత్వ గుణ ప్రధానులై త్రికరణ శుద్ధితో తపస్సు చేస్తారు. అట్టి తపోధనుల తపస్సంపద లోక కళ్యాణానికి దారి తీస్తుంది. శ్రీరాముడు లోకకళ్యాణార్థమై తపస్సు చేస్తాడు.
రామాయణము జాగ్రత్తగా మొదటి నుంచి చివర వరకు గమనించితే శ్రీరాముడు సాధించిన ఇట్టి తపః ప్రభావములు గనపడును. మానవుని పురోభివృద్ధి ఎలా యుండవలెనో/సాగవలెనో రామాయణము కాండల రూపములో శ్రీరాముని పాత్ర ద్వారా వాల్మీకి వివరించారు. 

ఉదాహరణకు బాలకాండములో శ్రీరాముడు గురుకులంలో విద్యాభ్యాసము, వసిష్ఠ మహర్షి వద్ద ఆత్మ జ్ఞానము, విశ్వామిత్రుని వద్ద అట్టి విద్యను సత్యధర్మములనే ఆయుధములుగా అభ్యాసము (ప్రాక్టీస్) చేసినాడు. అయోధ్యాకాండములో భరతునికి రాజ ధర్మమును బోధించుట ద్వారా ఆచార్యుడు (గురువు) గా దర్శనము చేసినాడు. అనగా తాను చదువుకున్నది అభ్యాసము చేసినవాడే సరియైన గురుస్థానమును పొందగలుగును. జాబాలి నాస్తిక వాదాన్ని ఖండించుట ద్వారా వేద ప్రమాణాన్ని నిలబెట్టాడు. (ఆది శంకరాచార్యులు ఇటులనే ప్రాచుర్యములో యున్న నాస్తిక వాదమైన బౌద్ధమును ఖండించడము గమనించ వచ్చు). అరణ్య కాండలో అసురభావములను నాశనము చేసి సత్య ధర్మములను ప్రతిష్టించవలెనని తన నడవడిక ద్వారా చాటెను. కిష్కిందా కాండలో అట్టి అసుర భావములను నాశనము చేయుటకు మిత్రుని తోడ్పాటు కూడా అవసరమని గ్రహించి సుగ్రీవునితో స్నేహము చేసినాడు. Finally యుద్ధ కాండలో దుష్ట సంహారం చేసినాడు.

ఈ విధముగా మానవుడు అభ్యుదయము పొందవలెనన్న పరిణామ క్రమము ఎలా ఉండవలెనో శ్రీరాముని పాత్ర ద్వారా మనకు వాల్మీకి అవగతము చేసినారు.
రేపటి నుంచి సుందర కాండలో హనుమ స్వరూపమును విహంగ వీక్షణము చేయుటకు ప్రయత్నిద్దాము.

శ్రీరామ జయరామ జయజయ రామ
ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 
ఓం శ్రీ రామ - ఓం  శ్రీ రామ - ఓం శ్రీ రామ - 
ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 

--(())--
సేకరణ రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ