Saturday 21 December 2019

*మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయము

ప్రాంజలి  ప్రభ ... రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (001) 
ఎందరో మహానుహవులు అందరికీ వందనములు ,, మూలం వాల్మీకి రామాయణము 
కార్తీక మాస సందర్భముగా సుందరకాండ పారాయణము చేయుట చాలా మంచిది అందుకని అందిరికి అందుబాటులో ఉండేవిధముగా వ్రాసిన రామాయణములో సుందరతత్వము పొందు పరుస్తున్నాను  

మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయము

శ్రీరాముడు-యోగ తత్వ రహస్యము (sundarakaanda)


శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము కర్కాటక లగ్నము నందు, భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమి నక్షత్రము మీన లగ్నము నందు, లక్ష్మణ, శత్రఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్రము కర్కాటక లగ్నము నందును జన్మించిరి. వారి వారి జనన కాలము నందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఉచ్చ దశలలో యుండిరి. జ్యోతిషశాస్త్ర ప్రమాణము ప్రకారము శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా, తక్కిన వారు జగత్ప్రసిద్ధులైరి.


సర్వే వేదవిదః శూరాః సర్వే లోక హితే రతాః
సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః   1 18  24

ఆ రాజకుమారులు వేదశాస్త్రములను అభ్యసించిరి. ధనుర్విద్య యందు ప్రావీణ్యము సంపాదించిరి. యుక్త వయస్కులైన తన పుత్రుల వివాహ విషయమై దశరథ మహారాజు ఆలోచించుచుండగా విశ్వామిత్ర మహర్షి వచ్చి యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంప వలసినదిగా కోరతాడు. ఆ కోరిక విని దశరథ మహారాజు విశ్వామిత్రునితో ..
ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః
న యుద్ధ యోగ్యతామ్ అస్య పశ్యామి సహ రాక్షసైః  1 20 2

రాముడు పదుహారు సంవత్సరముల ప్రాయము వాడు, క్రూర రాక్షసులతో యుద్ధము చేయలేడు. ఇక్కడ వాల్మీకి తన కావ్యములో శ్రీరాముడు జననము తర్వాత వారు పదునారు సంవత్సరముల ప్రాయములో సకల విద్యా పారంగతులైరి అని చెప్పెను. తరువాత శ్రీరాముని వైరాగ్యము, వసిష్ఠ మహర్షి చెప్పిన ఆత్మ విజ్ఞానము మనకు వాల్మీకి రామాయణములో కానరాదు. అది యోగ తత్వము నందు యున్నది  గావున గమనించ గలరు. 

రావణుడు అమోఘమైన తపఃసంపన్నుడు. అట్టి రావణుని సంహరించుటకు రావణుని మించిన తపఃశక్తిని  పొంది యుండవలెను.


వేదము - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము - అని మూడు భాగాలు. ఆరణ్యకంలో వివిధ తపస్సులు క్రింది విధంగా పేర్కొనబడినవి:

"ఋతం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యఙ్ఞం తపః, భూర్భువస్వుర్బ్రహ్మై తదుపాస్య తపః.
1. ఋతము = సూన్రుత భాషణము - వాక్కుతో సత్యము పలుకుట, 
2. సత్యము = త్రికాలలో - భూత-భవిష్యత్-వర్తమానాలలో - ఉండేది. యథార్థ వస్తు చింతనం చేయటం. సత్యం ఙ్ఞానం అనంతం బ్రహ్మ (తైత్తిరీయోపనిషత్తు), 
3. శ్రుతము = వేదాధ్యయనము, 
4. శాంతము = శాంతముగా నుండుట (ఓర్పు), 
5. దమము = ఇంద్రియ నిగ్రహము, 
6. శమము = కామక్రోధాదులు లేకుండుట, 
7. దానము = బ్రహ్మార్పణముగా ఇతరులకు ఇచ్చుట, 
8. యఙ్ఞము = దేవతారాధన. ఇవేకాకుండా బ్రహ్మను (అంటే సర్వమూ తానే అయి, సర్వత్రా, సర్వకాలములలో ఉండేవాడు) ఉపాసించుట కూడ తపస్సే. యఙ్ఞములు పలు రకాలు. వాటిలో తపోయఙ్ఞం ఒకటి. అదే ఆ పైన చెప్పబడినదియే యఙ్ఞం తపః.
శ్రీమద్భగవద్గీతలో శ్రీ క్రుష్ణ భగవానుడు ఐదు రకాలైన యఙ్ఞ భేదములను ఇట్లా వివరించాడు.

ద్రవ్య యఙ్ఞాస్తపోయఙ్ఞా, యోగ యఙ్ఞాస్తధాపరే|
స్వాధ్యాయ ఙ్ఞానయఙ్ఞాశ్చ, యతయః సంశితవ్రతాః||
(ఙ్ఞానయోగము: 4-28)

వాటిలో తపస్సు కూడా ఒక యజ్ఞమే. ఈ మాదిరి పుణ్య కార్యాలు, తపస్సులు చేస్తే దైవారాధన వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. మహర్షులు, సాధు పురుషులు తమ స్వార్థం కోసంగాక, లోక క్షేమం కోరి తపస్సు చేస్తారు. కామక్రోధాలను, రాగద్వేషాలను దరిజేరనీయక, జితేంద్రియులై, సత్వ గుణ ప్రధానులై త్రికరణ శుద్ధితో తపస్సు చేస్తారు. అట్టి తపోధనుల తపస్సంపద లోక కళ్యాణానికి దారి తీస్తుంది. శ్రీరాముడు లోకకళ్యాణార్థమై తపస్సు చేస్తాడు.
రామాయణము జాగ్రత్తగా మొదటి నుంచి చివర వరకు గమనించితే శ్రీరాముడు సాధించిన ఇట్టి తపః ప్రభావములు గనపడును. మానవుని పురోభివృద్ధి ఎలా యుండవలెనో/సాగవలెనో రామాయణము కాండల రూపములో శ్రీరాముని పాత్ర ద్వారా వాల్మీకి వివరించారు. 

ఉదాహరణకు బాలకాండములో శ్రీరాముడు గురుకులంలో విద్యాభ్యాసము, వసిష్ఠ మహర్షి వద్ద ఆత్మ జ్ఞానము, విశ్వామిత్రుని వద్ద అట్టి విద్యను సత్యధర్మములనే ఆయుధములుగా అభ్యాసము (ప్రాక్టీస్) చేసినాడు. అయోధ్యాకాండములో భరతునికి రాజ ధర్మమును బోధించుట ద్వారా ఆచార్యుడు (గురువు) గా దర్శనము చేసినాడు. అనగా తాను చదువుకున్నది అభ్యాసము చేసినవాడే సరియైన గురుస్థానమును పొందగలుగును. జాబాలి నాస్తిక వాదాన్ని ఖండించుట ద్వారా వేద ప్రమాణాన్ని నిలబెట్టాడు. (ఆది శంకరాచార్యులు ఇటులనే ప్రాచుర్యములో యున్న నాస్తిక వాదమైన బౌద్ధమును ఖండించడము గమనించ వచ్చు). అరణ్య కాండలో అసురభావములను నాశనము చేసి సత్య ధర్మములను ప్రతిష్టించవలెనని తన నడవడిక ద్వారా చాటెను. కిష్కిందా కాండలో అట్టి అసుర భావములను నాశనము చేయుటకు మిత్రుని తోడ్పాటు కూడా అవసరమని గ్రహించి సుగ్రీవునితో స్నేహము చేసినాడు. Finally యుద్ధ కాండలో దుష్ట సంహారం చేసినాడు.

ఈ విధముగా మానవుడు అభ్యుదయము పొందవలెనన్న పరిణామ క్రమము ఎలా ఉండవలెనో శ్రీరాముని పాత్ర ద్వారా మనకు వాల్మీకి అవగతము చేసినారు.
రేపటి నుంచి సుందర కాండలో హనుమ స్వరూపమును విహంగ వీక్షణము చేయుటకు ప్రయత్నిద్దాము.

శ్రీరామ జయరామ జయజయ రామ
ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 
ఓం శ్రీ రామ - ఓం  శ్రీ రామ - ఓం శ్రీ రామ - 
ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 

--(())--
సేకరణ రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 
   

1 comment:

  1. 13/11/2023 ప్రాంజలి ప్రభ చదవగలరు

    ReplyDelete