Wednesday 25 December 2019

సుందర కాండము-4*



*శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-4*
*సురసా రాక్షసి*
పిమ్మట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు నాగ మాత యగు సురసతో .. నీవు  ఆకాశమంత నోరుతో హనుమ కు విఘ్నము కలిగించి అతని కార్యసాధన దీక్షను పరీక్షించుము అనిరి. ఇట్లు వారు కోరగానే సురస హనుమ మార్గమును అడ్డగించి "ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారముగా ఒసగినారు కావున  నీవు నా ముఖమున ప్రవేశించుము" అనెను. అప్పుడు హనుమ "నేను రామకార్యార్థినై సీతాన్వేషణకు వెళ్లుచున్నాను కావున నేను సీతాదేవిని చూచి ఆ విషయము రామునికి ఎఱింగించి తర్వాత నీనోట పడుదును కావున నన్ను అడ్డగించవద్దు" అని కోరెను. అందుకు సురస ఒప్పుకొనకపోగా హనుమ సురసతో నా శరీరము పట్టగలిగినంత నీ నోరు తెరువుము అని, హనుమ తన శరీరమును వరుసగా పది, ముప్పది, తొంబది యోజనములు పెంచెను. సురస గూడ తన నోరును వరుసగా ఇరువది, నలుబది, నూరు యోజనములుగా పెంచెను. అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమ తన శరీరము సూక్ష్మముగా చేసి నోటిలో ప్రవేశించి వెంటనే బయిటకు వచ్చి నీ కోరిక తీరినది గాన నన్ను వెడలుటకు అనుమతిని ఈయమని కోరెను. అప్పుడు సురస తన స్వసరూపమును పొంది ..
*అర్థ సిద్ధ్యై హరి శ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యథా సుఖమ్*
*సమా౭౭నయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా*          5.1.162
"ఓ! వానర శ్రేష్టా! హాయిగా ముందునకు సాగి కార్యసిద్ధిని పొందుము. మహాత్ముడగు శ్రీరామునితో సీతమ్మను చేర్చుము". అని ఆశీర్వదించి చనెను,  ఆకాశములో నిలిచి యున్న భూతగణము లన్నియు భేష్ భేష్ అని ప్రసంశించెను.
ఇందలి యోగ రహస్యమును పరిశీలిద్దాము. రాక్షసి తన నోరును శతయోజనములు పెంచినదియట. మానవుని శరీరము అందునా నోరు శతయోజనముల యంతటి పెద్దదిగా యుండునా? వివేకము భ్రష్టమైనప్పుడు మానవుడు తన దుర్గుణములు తద్వారా వాని అధఃపతనము శత విధముల/శతముఖముల జరుగును. *"వివేక భ్రష్టానాం, భవతి విని పాతః శత ముఖః"*  ఈ సురస శత యోజన వృత్తి రూపము సాధకుని మ్రింగుటకై లాలస పడును. కానీ సాధకుడు అహంకార రహితుడై చిన్న వాడైనచో అటువంటి వాని ముక్తి జరుగును. సాధకునికి లభించు అష్ట సిద్ధులలో లఘిమ - అనగా అణువంత చిన్నవాడవడం, ప్రాకాయి - శరీరమును అతి విశాలముగా చేయడము - భాగములు.
యోగ మార్గములో సిద్ధులు అవశ్యముగా సిద్ధించును. అయితే సాధకుడు ఆ సిద్ధులకు బానిస కానిచో తదుపరి ప్రగతి సాధ్యమగును. కానిచో సిద్ధుల మాయలో పడి సాధకుడు అతి తీవ్రగతితో పతనమగును. సంసార మాయ నుండి విడుదలై సిద్ధుల మాయలో చిక్కుకొనిన సాధకుడు అక్కడి నుండి విడిపించుకొనుట కష్టము. ఈ సిద్ధుల యొక్క మాయ శత యోజనముల యంత పెద్దదిగా యుండి మహాసాధకులను కూడా మ్రింగి వేయును. అందుచే బుద్ధిమంతుడైన హనుమ అట్టి మాయ నుండి ముక్తమగుటకై నమ్రతతో సూక్ష్మ రూపుడై తనకు ప్రాప్తించిన సిద్ధులన్నియు పరమాత్మకు సమర్పించును. ఈ సూక్ష్మ శరీరము ద్వారా తనలోని అహంకారమును హనుమ వదిలెను. ఇదే కాండలో లంకలో సీతను అన్వేషించునప్పుడు గూడ హనుమ సూక్ష్మ రూపముతోనే తన అహంకారమును వదిలి సర్వము రామునిపై కార్య భారము మోపి, తనతో కార్యము రాముడే (భగవంతుడు) చేయించుచున్నాడు అని తలచి  అన్వేషించును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

No comments:

Post a Comment