Thursday 26 December 2019

సుందర కాండము-5



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-5
సింహిక
 గరుడ వేగముతో హనుమ ఆకాశము నందు సాగు చుండగా ఎదురుగాలి చే మందగించిన ఓడ వలె హనుమ వేగము తగ్గెను
ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ
మనసా చిన్తయా మాస ప్రవృద్ధా కామ రూపిణీ 5.1.173
అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యా మ్య౭హమ్ ఆశితా
ఇదం హి మే మహత్ సత్త్వం చిరస్య వశమ్ ఆగతమ్      5.1.174
కామరూపియైన సింహిక నామ రాక్షసి ఆకాశమున పోవుచున్న హనుమను చూచి "ఆహా! చాలా కాలమునకు నాకు ఒక మహా జంతువు ఆహారముగా దొరకబోవుతున్నది" అని ఆలోచించి, హనుమ ఛాయను బట్టి హనుమను తన నోటిలోనికి ,లాగుకొనుచుండెను.  క్రిందికి చూడగా సముద్రములో హనుమ ఒక మహాభూతమును చూచెను.  సుగ్రీవుడు సముద్రములో నీడను బట్టి లాగెడి ఒక మహారాక్షసి గలదు అని చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చి హనుమ శరీరమును ఒక్కసారిగా పెంచెను. కానీ అందుకు తగిన పరిమాణంలో సింహికారాక్షసి గూడ పాతాళ కుహూరమును బ్రోలు తన నోరును పెంచెను. వెంటనే హనుమ తన శరీరమును సంకోచింప చేసి, దాని నోటిలో దూరి తన గోళ్ళతో దాని మర్మములను త్రుంచి మరల అంతరిక్షము చేరెను. హనుమ చేసిన ఈ కార్యమునకు సంతోషించి ఆకాశములోని  భూతములన్నియు బాగు, బాగు అనెను.
ఆధ్యాత్మిక మార్గములో పయనించువాడు విహిత కర్మలను ఆచరించవలెను. నిషిద్ధ కర్మలను పరిత్యజించి వలెను. శాస్త్రములో చెప్పని కర్మలను ఆచరించిన యడల అవి మనలను హింసించును. కావున అవి "సింహిక" అనబడును. సింహిక అనగా హింసించునది. నిషిద్ధ కర్మకు మనమెట్లు వశమగుదమో మనకే తెలియదు. చేయకూడదని తెలిసియు, చేయవలదను కొనుచునే దానికి వశమగుదుము. (ప్రస్తుత కాలములో మద్యపానము, ధూమపానం,  జూదము ఇత్యాది). వశమైన తర్వాత గాని వశపడినట్లు తెలియదు. అట్టి కర్మలు తెలియకుండా ఆక్రమించుట - సింహిక నీడను బట్టి లాగుట. అందుకనే సురసను చంపకుండా వదిలిన హనుమ సింహికను చంపెను.
హనుమానునిపై పడు సూర్యకిరణముల వలన తన నీడయే క్రిందనున్న సాగరముపై వ్యాపించెను. ఈ వర్ణన ద్వారా వాల్మీకి యోగ మార్గములో ప్రాప్తించే ఒక ఛాయా సిద్ధిని మనకందించెను. ఉపనిషత్తులలో ఈ ఛాయా పురుషుడు అంగుష్ఠ మాత్ర పురుషుడుగా వర్ణింపబడినాడు. ఈ అంగుష్ఠమాత్ర పురుషుడు ఎంతో బలవానుడు మరియు త్రికాలదర్శి. "కఠోర ఉపనిషత్" లో "ఈశాన" అని తెల్పినారు.
శ్లో|| అంగుష్ఠమాత్ర పురుషో జ్యోతి రివా  ధూమకః|
      ఈశానో భూత భవ్యస్య స ఎవాద్యసఉశ్వః||
ఈ ఛాయాపురుషుడు చాతుర్మాత్రాత్మక జగత్తున కతీతుడై, త్రికాలజ్ఞుడై, త్రిలోకగామియై యుండును.
శ్లో|| మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం|
      వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపధ్యే||
మారుతమనగా దేశకాలములకు అతీతము. కాలమునకు అతీతమగుట వలన ఛాయాపురుషుడు ఇతరులకు కనిపించడు. తాను ఏ వస్తువును తాకినను, ఆ వస్తువు కూడా అదృశ్యమగును. ఎవరైతే ఈ ఛాయాపురుషుని ఉపయోగము నీచకార్యములకు వినియోగింతురో అతడు తన అధఃపతనమును కొని తెచ్చుకొనును. సాధనలో ఛాయాపురుష అవస్థ చాలా ఉత్కృష్టమైనది. అధఃపతనము చెందిన సింహికా రాక్షసి అవస్థయే వేదమున ఈ విధముగా వర్ణింపబడినది.
య ఈ చకార్న సౌ అస్య వేదయ ఇద దర్శహిరుగిన్ను తస్మాత్,
సమాధుర్యోమ్ నా పరివీతో అంతర్బహు ప్రజా నిరుతిమా వివేశః  (ఋ.వే.1 164 32 )
అజ్ఞానముతో నున్న జీవి మాతృగర్భము ద్వారా అనేక జన్మలను ధారణ చేయును. జన్మలకు అతీతమైనను, సర్వజ్ఞమైనను, ఘోర కర్మలో పడి తానేమి చూచుచున్నదో ఏమి చేయుచున్నదో తెలియని అజ్ఞాన స్థితిలో యుండును.
దేహము నాలుగు రకాలు. మొదటిది - ఎముకలు, మాంసము, మజ్జ, రక్తముతో కూడుకొన్న "జడ దేహము". సుషుప్తావస్తలో సూక్ష్మ శరీరములో ఉండునది - "లింగ దేహము". ఇదియే ఛాయాపురుషుడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలములకు, దేశకాలములకు  అతీతము. తన యొక్క ఛాయవలె కనిపించే ఈ లింగ దేహము/శరీరము ను బంధనమున ఉంచి దాని ద్వారా సిద్ధులకు ఉపయోగించు సాధకుడు పతనము నొందును.   హనుమాన రూప సాధకుడు ఇట్టి బంధనమున చిక్కుకొనడు. మూడవది లింగ దేహము కన్నను ఉన్నతమైనది  - "కారణ దేహము". సంకల్ప మాత్రముననే కార్యము నెరవేరును. అంతకంటెను సూక్ష్మమైనది "మహాకారణ దేహము". ఈ సంసారమునకు కారణ బీజమైనది. యోగ వాసిష్ఠములో ఇట్టి అతివాహిక సూక్ష్మ దేహముతో లీల (సరస్వతి దేవి   భక్తురాలు), సరస్వతులు ఇద్దరు సమస్త బ్రహ్మాండములు తిరిగారని వసిష్ఠ మహర్షి చెపుతారు. సరియైన ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు హనుమ వలె ఛాయాపురుషునకు అతీతముగా యుందురు.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment