Friday 27 December 2019

సుందర కాండము-6 ***








శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-6
లంకలో హనుమ ప్రవేశము
 
సముద్ర లంఘనమున హనుమ చేసిన దుష్కర కార్యములు నాలుగు. అవి - నూరు యోజనముల సముద్రమును దాటి సీత జాడ కనుక్కొని వెనకకు రాగలనని సంకల్పించుకొనుట, మైనాకుని సగౌరవ విశ్రాంతిని సున్నితముగా తిరస్కరించుట, సురసను జయించుట మరియు సింహికను చంపుట. ఈ నాలుగు నాలుగు లక్షణములు. 1 ధృతి: సర్వ వ్యాపారములను ఆత్మోన్ముఖం చేయుట, 2 దృష్టి: దేనిని పొందవలెనో దాని యందే దృష్టి తప్ప ఇతరములపై ఉండకుండుట. 3 మతి: ఆచరించ వలసిన కర్మలను ఆచరించుతూ బంధనమున పడకుండా "ఆత్మస్వరూప జ్ఞానము" ఉండుట. 4 దాక్ష్యము: నిషిద్ధకర్మ త్యాగము. ఇట్లు హనుమ ఈ నాలుగు లక్షణములతో సముద్రమును లంఘించినట్లే ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు ముందుకు సాగుటకు ఈ నాలుగు ఆవశ్యకములు అని ఈ వృత్తాంతము సూచించును.
 
సూర్యాస్తమయ సమయమునకు, హనుమ నూరు యోజనముల సముద్రమును దాటి త్రికూట పర్వత శిఖరమున నిలిచి లంకను చూచెను. పరాక్రమశాలి అయిన హనుమ ఇటువంటి నూరు యోజనములు ఎన్నియైనను అవలీలగా దాటగలను అని హనుమ భావించెను. సాధన చేయువానికి ఇట్టి స్థితి ఆవశ్యకముగా నుండవలెను. ఆసనము పైనుండి ప్రాణాయామాదులు చేసి లేచిన తర్వాత శరీరము కానీ, మనస్సు కానీ బడలిక చెందరాదు. ఇంకను ఎంతకాలము చేసినను చేయగలనన్నట్లు ఉత్సాహము ఉండవలెను. ఇది కలుగు వరకు సాధన పూర్తి కాదు. అచ్చటి నుండి లంకా నగర శోభను, అచ్చటి రక్షణ వ్యవస్థను నిశితంగా పరికించి లంకా నగరమును జయించుటలోని పెక్కు ఉపాయములు ఆలోచించెను. ముందుగా సీతమ్మకై అన్వేషణ చేయవలెనని, అందుకు రాత్రి సమయమే సరియైనదని, అందుకు సూక్ష్మ రూపమున లంక నగరములో ప్రవేశించ వలెనని నిర్ణయించు కొనెను. నెమ్మదిగా లంకానగర ద్వారము వద్దకు వచ్చెను. అప్పుడు హనుమను కామరూపిణియగు లంక అడ్డగించెను. హనుమ లంకతో నీవెవ్వరివి అని అడగగా ..

అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః
ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీ మిమాం        5.3.28
 
అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ
సర్వతః పరిరక్షామి హ్యేత త్తే కథితం మయా   5.3.30
 
రాక్షస రాజైన రావణుని ఆజ్ఞను పాలించుతూ నేను ఈ లంకా నగరమును కాపాడు చున్నాను. నన్ను ధిక్కరించి ఇందు ప్రవేశించలేవు అనెను. అందుకు సౌమ్యముగా హనుమ, లంకతో .. "లంకానగర శోభను పరికించి వెడలెదను" అనెను. కానీ లంక తనను జయించనిదే నగరములో ప్రవేశించుట అసాధ్యము అని చెప్పుటతో హనుమ ఆడుది కదా యని ఎక్కువగా కోపము తెచ్చుకొనకుండా కొద్దిపాటి కోపముతో పిడికిలితో గద్దెను. దానికే నిశాచర, హనుమతో "నన్ను అనుగ్రహింపుము. నీచే ఓడింపబడితిని గాన బ్రహ్మ వర ప్రభావము వలన రాక్షసులకు కీడు కల్గు సమయము ఆసన్నమైనది. హాయిగా సీతమ్మను వెతుకు కొనుము" అని చెప్పెను. ఇక్కడ వాల్మీకి "అహం" అని రెండుమార్లు ప్రయోగము చేసినారు. ఈ 'అహం' దేహాత్మాభిమానాన్ని, అహంకారమును సూచించును. ఇట్టి అహంకారమును జయించిన నాడే  మనసులోని వాసనలు, చిత్తవృత్తులు నసించి సీతమ్మ దర్శనమగును. హనుమ లంకను జయించి ద్వారము గుండా కాకుండా ప్రాకారమును దాటి శత్రువుల తలపై మోపినట్లు తన ఎడమ పాదమును హనుమ ముందుగా పెట్టి  లోనికేగెను. (అద్వారేణ మహాబాహుః ప్రాకార మ౭భిపుప్లువే)   (గ్రామం వా నగరం వాపి, పత్తనం  వా పరస్య హి| విశేషాత్ సమయే సౌమ్య| న ద్వారేణ విశేనృప|| ప్రయాణ కాలే చ గృహప్రవేశే, వివాహ కాలే౮ పి చ దక్షిణాంఘ్రిమ్| కృత్వాగ్రతః శత్రుపుర ప్రవేశే, వామంనిదద్యా చ్చరణం నృపాలా|| ఓ రాజా! శత్రువు యొక్క గ్రామమును గాని, నగరమునుగాని, పట్టణమును గాని విశేష సమయమున ముఖ్య ద్వారము నుండి ప్రవేసింపరాదు, ప్రయాణము చేయుచున్నప్పుడు, గృహప్రవేశ సమయమున, వివాహ కాలము నందు కుడికాలు ముందుంచాలి. శత్రుపురమున ప్రవేశించునప్పుడు ముందుగా ఎడమ కాలు మోప వలెను. ఇది బృహస్పతి వచనము. ... నీతి శాస్త్రము.)
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment