Thursday 26 December 2019


9)మll
మనుజగ్రామణి సత్కృపాత్త కపిసామ్రాజ్య స్థితుండయ్యుభూ,
తనయాన్వేషణ కార్యమున్‌ మఱచి కందర్పక్రియామత్తుఁడై,
తనివిం జెందక యున్న భానుజునిఁ దత్కాలార్హ నీత్యుక్తయు,
క్తిని బోధించిన నీతిశాలివి నినుం గీర్తించెదన్‌ మారుతీ!

తాత్పర్యం:- ఈ పద్యంలో మనుజ గ్రామణి అంటే ప్రజలకు రాజు =శ్రీరాముడు, భానుజుడు అంటే సూర్యుని కుమారు డు =సుగ్రీవుడు. సత్కృప + ఆత్త, సాంమ్రాజ్యము= గొప్ప దయచేత పొందబడిన సాంమ్రాజ్యము. కందర్ప క్రియా మత్తుడు = రతిక్రీడలో మదించి ప్రవర్తించు వాడు.
శ్రీరాముని యొక్క గొప్ప దయతో లభించిన(కిష్కింధా) రాజ్య పరిపాలకుడైన సుగ్రీవుడు, (ఈ వర్షాకాలం నాలుగు నెలలు గడచిన తర్వాత లోలాంగూలభల్లూక కపి సైన్యంతో) సీతాన్వేషణ జరిపిస్తానని (శ్రీరామునికి)ఇచ్చిన మాట మరచి; తార, రుమ మొదలైన భార్యలతో రతిక్రీడలలో
మునిగిపోయి మదించి తృప్తిచెందక ప్రవర్తిస్తున్న సందర్భం లో ( శ్రీరామునిచే పంపబడిన లక్ష్మణుడు అగ్రహోదగ్రుడై సుగ్రీవుని హెచ్చరించుటకు వచ్చిన సందర్భంలో) నీవు
యుక్తియుక్తముగా, మిత్రధర్మాన్ని అనుసరించాలనే విషయాన్ని సుగ్రీవునికి బోధించన నీతిశాలివి. అట్టి నిన్ను స్తుతించుచున్నాను స్వామీ!

10)
శాll లేరా కీశులనేకులుం? ద్రిజగముల్‌ వీక్షించి రా నేర్పరుల్‌
గారా? రాముఁడు జానకిన్‌ వెదక వీఁకన్‌ గీశులం బంపుచో
నారూఢిన్‌ భవదీయ దివ్యమహిమవ్యాపారముల్‌ సూచికా
దా!రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్‌ మారుతీ!

తాత్పర్యం:- కీశులు= కోతులు, వీకన్= పరాక్రమము గల, ఆరూఢిన్= నిశ్చయముగా, భవదీయ= నీయొక్క , రత్నాంగుళి =రత్మములచే పొదగబడిన ఉంగరం, భూషణం= ఆభరణం.
సుగ్రీవునిచే సీతాన్వేషణకు నియోగింపబడిన వాన రులు ఎంతమంది లేరు?. వారిలో అప్పటికే ముల్లోకాలను తిరిగి చూసిన వారెందరో వున్నారు కదా, అట్టివారు నేర్పరులూ, అనుభవ శాలురూ గారా? అటువంటప్పుడు ఓ మారుతీ! శ్రీరామచంద్రుడు ప్రత్యేకించి పిలిచి నీ చేతికి
తన రత్నాంగుళీయకం ఇచ్చి, సీతాదేవి కనిపించినప్పుడు ఆమెకు ఇవ్వమని చెప్పినాడంటే ( సీతాస్వేషణలో సఫల త నివ్వగల) నీయొక్క దివ్య శక్తిసామర్ధ్యాలను గమనించి యేకదా!
ఇంకావున్నాయి.,

11) మ. వనజాప్త ప్రియపుత్రుఁడెంతధిషణావంతుఁడొ,
సర్వంసహా,తనయాన్వేషణ మాచరింప గపులం దా
బంపుచో, గార్యసా,ధనమందీ వతి దక్షిణుండవని
కాదా! నేర్పుతో దక్షిణంబునకున్‌ నిన్నధికారిఁ జేసి
పనిచెన్‌ మోదంబునన్‌ మారుతీ!

తాత్పర్యం:- వనజాప్తప్రియపుత్రుడు= తామరలకు ఆప్తు డైన వాని (సూర్యుని) కి ఇష్టుడైన కుమారుడు అనగా సుగ్రీవుడు. ధిషణావంతుడు= మేధావంతుడు. సర్వసహా
తనయా= భూదేవి పుత్రిక అంటే సీతాదేవి. కార్యసాధనమందు+ ఈవు+ అతి దక్షిణుండవు= పనులు చేయుట యందు నీవు మిక్కిలి సామర్థ్యము గలవాడు. పనిచెన్= పంపెను.
ఓ మారుతీ ! వానరరాజైన సుగ్రీవుడు ఎంతటి మేధా శక్తి గలవాడో కదా,కనుకనే సీతాన్వేషణ చేయుటకు కోట్ల కొలది వానరులను తాను నలుదిక్కులకు పంపినసందర్భం
లో , నీవు కార్యసాధన చేయుటలో మిక్కిలి సామర్థ్యం గల వాడివని అప్పటికే తెలిసివున్నందునే కదా సంతోషముతో నిన్ను దక్షిణ దిక్కునకు పంపిన కపిసేనలో ప్రముఖునిగా నియోగించినాడు , స్వామీ!

12)శా.సీతన్‌ గానక,దప్పిచే బడలి గాసింజెందు శైలాటసం,
ఘాతంబుం గొని, శైలగహ్వర సుధాకల్పాంబువుల్‌,సత్ఫల,
వ్రాతంబుం దనివార నందఱ భుజింపంజేసి, తద్దేవతా,
ఖాతశ్వభ్రము వెల్వరించితివి యోగప్రౌఢిచే మారుతీ!

తాత్పర్యం:-గాసించెంది= అలసిపోయి. శైలాట + సంఘాత ము= కోతుల గుంపు. శైల గహ్వరము= పర్వతగుహ. సుధాకల్పాంబువుల్= అమృత ప్రాయమైన జలము.
సత్ఫల వ్రాతము= మంచి రుచిగల పండ్ల సమూహము. తనివార= తృప్తిగా. దేవత+అఖాత+శ్వభ్రము= దేవతచే ( అనగా మయునిచే) నిర్మింపబడిన బిలము. వెల్వరించు
= బయటకు తీసుకొని వచ్చు. యోగప్రౌఢి= యోగశక్తి. ఈ పద్యం చదువుతూవుంటే శ్రీవాల్మీకి రామాయణం, కిష్కింధా కాండ 50,51,52,53 సర్గలలో చెప్పబడిన స్వయంప్రభ కథ గుర్తుకొస్తుంది. అంగదుని నాయకత్వంలో దక్షిణదిక్కుగా సీతాన్వేషణ సాగిస్తున్న వానరసేన, ఒక దశలో అలసిసొలసి ఆకలిదప్పికలకు లోనై కనీసం నీళ్ళై నా తాగందే బతకలేమని నీళ్ళకొరకు వెతుకుతారు. ఒక బిలం నుండి తడిసిన రెక్కలతో ఎగురుతూ వస్తున్న పక్షుల
ను చూసి, ఆ బిలంలో నీళ్ళు వుంటాయని తలంచి వాన రులు అందులో ప్రవేశిస్తారు. అంతా చీకటి, ఒకళ్ళచేతులు మరొకళ్ళు పట్టుకొని ఆ వానరులంతా బిలంలో చాలా దూరం నడిస్తే వాళ్ళకొక రత్నఖచిత భవనం కనిపిస్తుంది. అది మయుడు, అప్సరస అయిన హేమ కొరకు నిర్మించిన భవనం. హేమ అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. ఆమె చెలికత్తె స్వయంప్రభ మాత్రం ఆ భవాన్ని సంరక్షిస్తూ ఎప్పు డూ అక్కడే తపస్సు చేసుకుంటూ వుంటుంది. వానరులు
ఆమెతో సీతాన్వేషణకు దారితీసిన కథంతా చెప్పారు. ఆమె మథుర ఫలాలతో , స్వచ్ఛజలాలతో ఇచ్చినఆతిథ్యం స్వీకరించి, ఆదమరచి నిద్రించారు. ఆ గుహ ఎటువంటి దంటే లోపలికి వచ్చిన వారిని వెలుపలకు పోనివ్వదు. సుగ్రీవుడిచ్చిన నెలగడువుముగిసిపోయింది. తమకుచావు తప్పదనుకున్నారు. వారిది రామకార్యం గనుక స్వయం ప్రభ దయదలచింది. "మీరంతా కళ్ళుమూసుకొంటే, తన యోగశక్తితో గహనుండి బయటపడవేస్తా" నన్నది. కళ్ళు
మూసి తెరిచేంతలో వానరులంతా బిలం బయట సముద్ర పు వొడ్డున పడివున్నారు.
ఓ మారుతీ! ఈ ఘట్టంలో ఆకలిదప్పులను లోనై ప్రాణా వశిష్టులైన వానరులకు పండ్లూనీళ్ళూ అందేలా చేసి, వృక్ష బిలంలో చిక్కుకొని పోయిన వారిని సురక్షితంగాబయటకు చేర్చుటలో నీవు చూపినప్రతిభాపాటవాలు,యౌగికశక్తులు అసాధారణమైనవి, అనితరసాధ్యమైనవి, స్వామీ!

13) మll.జనకక్ష్మాపతిపుత్రి యున్నవిధమున్‌ సర్వంబు
సంపాతిచే, విని, నీలాంగద ముఖ్యవా నరులు వేవే
గంబె ప్రాయోపవే, శనమున్‌ మాని భవత్సమేతులగు
చున్‌ సంప్రీతితో నా, మహేంద్ర నగారోహణ
మాచరించి రఁట విన్నాణంబుగా మారుతీ!

తాత్పర్యం:- జనకక్ష్మాపతిపుత్రి = జనకమహారాజు యొక్క కుమార్తె, వేవేగంబె = వెనువెంటనే, ప్రాయోపవేశనము= ఆమరణ నిరాహారదీక్ష, భవత్సమేతులగుచున్= నీతో గూడినవారై, నగారోహణం= పర్వతాన్ని ఎక్కటం, విన్నాణంబుగా= నేర్పుగా .గతపద్యంలో స్వయంప్రభ వృక్షబిలం నుండి బయట వేయబడిన వానరులందరూ దక్షిణ సముద్ర తీరంలో పడి లేచారు. సీతాన్వేషణకు సుగ్రీవుడు విధించిన నెలరోజుల గడువు తీరిపోయినది. తిరిగి వెళ్ళి సీతదేవి కనిపించలే దని చెబితే జరిగే అనర్థాలకు ఆస్కారం ఇవ్వడం కంటే, నిరాహారదీక్ష చేసి ఈ సముద్రపు వొడ్డున మరణించడం మేలనుకుంటూ, ఒక్కసారి వారిలో వారు అప్పటి వరకు
జరిగిన రామకథా సంఘటనలను గూర్చి మాట్టాడుకుం టారు. ఆ కథలో జటాయువు ప్రస్థావన, సీతాపహరణను అడ్డుకున్న ఆ జటాయవును రావణాసురుడు సంహరించటం, ఆ సముద్రానికి సమీపంలో వున్న కొండగుహలో నివసిస్తున్న సంపాతి అనే గృధ్రము (గద్ద పక్షి) వింటుంది.
వానరుల ద్వారా జరిగిన కథంతా అడిగి తెలుసుకుంటా డు. కొండమీద నుండి దక్షిణ దిశగా తేరిపారజూసి రావణా సురిచే అపహరించబడిన సీతాదేవి లంకలో అశోకవనంలో
రాక్షసస్త్రీల కాపలాలో వున్నట్లు చెబుతాడు. ఆవిషయం విన్న నీలుడు, అంగదుడు మొదలైన వానరవీరులందరూ, ఎవరైతే ఆమరణనిరాహారదీక్ష చేయ తలపెట్టినారో వారం
దరూ, వెనువెంటనే వారి ప్రయత్నాన్ని మానుకొని, ఓ ఆంజనేయా! నీ చుట్టూచేరి, నీతో కలిసి, ఆ సముద్రానికి దగ్గరిలో వున్న మహేంద్ర పర్వతాన్ని ఆనందోత్సాహాలతో అధిరోహించినారు కదా, స్వామీ!

14)మll శరధింగాంచి యలంఘనీయ మని తత్సంతారణా
దక్షులై, వరుసన్‌ గీశులు భీతిచేఁ గళవళింపన్‌ వారి
వారించి ని, న్నురుపాథోధి విలంఘన క్షమునిఁగా నూ
హించి ధీమంతుఁడా, పరమేష్ఠి ప్రియపుత్రుఁ డంచిత
గతిన్‌ బ్రార్థింపఁడే మారుతీ!

తాత్పర్యం:- శరధి= సముద్రం,అలంఘనీయం= దాటుటకు సాధ్యముకాని, తత్ + సంతారణ+అ దక్షులై= ఆ సముద్రా న్ని దాట చేతకానివారై, గళవళింపన్= కలతచెందగా, నిన్ను+ఉరు పాథోధి= నిన్ను గొప్పసముద్రం, విలఘన క్షమునిగా= బాగా దాటగలిగే సమర్థత గలవానిగా,
ధీమంతుడు= బుద్ధిమంతుడు, పరమేష్టి ప్రియపుత్రుడు= బ్రహ్మదేవుని కుమారుడైన జాంబవంతుడు, అంచిత గతిన్ = గౌరవనీయమైన పద్ధతిలో, ప్రార్థింపడే= ప్రార్థించినాడు కదా!
సముద్రం మధ్యలో వున్న లంకలో సీతాదేవి వున్నదని సంపాతి చెప్పటమైతే చెప్పాడు. అక్కడి చేరాలంటే నూరు యోజనాల దూరం సముద్రం లోనుండో పైనుండో ప్రయాణించాలి. వామ్మో.. ఇది మనకు సాధ్యమయ్యే పనిగాదు. వైనతేయ వంశస్థుడైన సంపాతి స్వయంగా తన కళ్ళతో
చూసి చెబుతున్నాను, " సీతమ్మ సమద్రం మధ్య నున్న రావణ లంకలో అశోకవనంలో రాక్షస స్త్రీల కాపలాలో బంధించబడివున్నది" అని చెప్పాడు గదా!. ఇటునుండి ఇటే వెనక్కు తిరిగి వెళ్ళి, ఇదే విషయం సుగ్రీవునితో, రామునితో చెబుదాం, అన్నారు కొందరు కపులు. జాంబ
వంతుడు అందుకు అంగీకరించ లేదు. మనల్ని సీతమ్మ ఎక్కడుందో వెతికి చూసి జాడ తెలిసికొని రమ్మన్నారు, అంటే దానర్థం ఎవరో చెప్పిన జాడను తెలుకొని వచ్చి
చెప్పమని కాదు. స్వయంగా మనకళ్ళతో మనల్ని చూసి; వీలైతే సీతమ్మతో మాట్లాడి; శ్రీరాముడు, సుగ్రీవుని సహా యంతో చేస్తున్న ప్రయత్నాల్ని సీతమ్మకువివరించి,సీతమ్మ
వున్న ప్రదేశానికి చేర్చే మార్గాన్ని తెలుసుకొని రమ్మని చెప్పి నట్లు. ఇలా, సముద్రాన్ని దాటి లంకకు చేర లేని చేతగాని వాళ్ళమైనామని దిగులుతో చింతాక్రాంతులైన కపిసేనకు
వివరించిన జాంబవంతుడు, కొద్దిదూరంలో నిర్వికారంగా కూర్చున్న, ఓ హనుమత్ ప్రభూ! నిన్ను సమీపించాడు. నీ శక్తి సామర్ధ్యాలను నీకు గుర్తుచేశాడు. నూరుయోజనాల
సముద్రాన్ని ఆకాశమార్గంలో అవలీలగా దాటగల దక్షుడ వు నీవే నని ప్రస్తుతించాడు గదా!

15) శాll
"ఏలా మీకు భయంబునేఁగలుగ,మీరిందుండుఁడేనొక్కఁడన్‌
వాలాయంబు పయోధి దాటి యనువొందన్‌లంకలోజానకిం
బోలం గన్గొని వత్తు, నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై
ర్యాలాపంబులు వల్కి తేర్చితివి గాదా కీశులన్‌ మారుతీ!

తాత్పర్యం:-వాలాయంబు=తప్పనిసరి,పయోధి=సముద్రం, అనువొందన్= నేర్పుగా, పోలం = స్థానము, పరమామోదం బు= మిక్కిలి సంతోషం, ధైర్యాలాపంబులు= ధైర్య వచనాలు, తేర్చు= శాంతింపజేయు. తామున్న దక్షిణతీరంనుండినూరుయోజనాలదూరంలో సముద్రం మధ్యలోవున్న లంకను చేరటం తమవల్లకాదనివానరులందరూ ఆందోళన చెందుతున్న సందర్భంలో, జాంబవంతుడు,కాస్త దూరంలో మౌనంగా కూర్చొని వున్న ఆంజనేయస్వామివారి వద్దకు వెళ్ళి,ఆ స్వామిని స్తుతించి, స్వామిలో వున్న అపరిమితమైన శక్తిని మేల్కిపినాడు.
ఇంతవరకు జరిగిన కథను ఇంతకు ముందటి పద్యభావం లో తెలుసుకున్నాం. జాంబవంతుని ప్రబోధతో ప్రచోదనతో ఉత్తేజితు డైన స్వామి, పలికిన పలుకులు కవి, ఈపద్యం లోవ్రాశారు.
"ఓ గోలాంగూలభల్లూకవానర మిత్రులారా! నేనుండగా, మీరెందుకు భయపడతారు. మీరిక్కడ (సముద్రపు వొడ్డు న) వుండండి. నేనొక్కణ్ణే తప్పనిసరిగాఈసముద్రాన్నిదాటి, నేర్పుతో లంకలో ప్రవేశించి సీతామాత ఎక్కడుందో వెతికి ఆ తల్లిని వుంచిన తావు తెలిసికొని ఎలా వెళ్ళానో తిరిగి
అలాగే వస్తాను. మీ అందరిరికీ అమితానందాన్ని కలిగించి తీరుతాను", అని ధైర్యవచనాలను పలికి, నిరాశానిస్పృహ లలో దిగులుపడుచున్న ఆ వానరాదులను ఓదార్చి, శాంతింపజేసితివి కదా మారుతీ!

16) మll
బలిబంధించిననాఁటివామనతనుప్రాబల్యముందాల్చి,యు
జ్జ్వల చంద్రోదయవేళఁ బొంగు తటినీశస్ఫూర్తినుప్పొంగి,ఘో
ర లయాభ్రంబు తెఱంగునన్‌ భయద గర్జారావముం జేసి,త
జ్జలధిందాటఁగఁబూనితీవుపరమోత్సాహమ్మునన్‌మారుతీ!

తాత్పర్యం:- ప్రాబల్యం= బలిష్టత, ఉజ్జ్వల= ప్రకాశించు, తటినీశ=సముద్రం, ఘోరలయాభ్రంబు= భయంకరమైన
ధ్వనితో ఉరుము, తెరంగునన్= విధముగా, భయదగర్జా
రావము= భయాన్ని పుట్టించేంతటి పెద్ద అరుపు,తజ్జలధిం = ఆ సముద్రాన్ని, పూనితి+ఈవు= తలపెట్టినావు, పరమోత్సాహమ్ము= దృఢప్రయత్నం. కవి ఈ పద్యంలో శ్రీఆంజనేయ స్వామి వారి సముద్రలం ఘన దృశ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించినాడు. పద్యప్రారం
భంలోనే, "బలి బంధించిన నాఁటి వామన తనుప్రాబల్య ముం దాల్చి", అని చదవగానే మహావిష్ణువు దాల్చిన వామానావతారం గుర్తుకొస్తుంది. మూడు అడుగుల నేల దానం అడిగి, ఇస్తానన్న బలిచక్రవర్తి సామ్రాజ్యాన్ని రెండుఅడుగులతో ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడపెట్టమం టావని వామనుడు అడుగడం, బలి తన తలమీద పెట్టమ నడం, అలాగే వామనుడు, బలితలమీద కుడిపాదాన్ని మోపి బలిని పాతాళానికి అణచివేయడం, పాతాళంలో
బలి బంధీకృతుడవ్వడం జరుగుతుంది. ఈ లీలలో పొట్టి వామనుడు, 'ఇంతింతై వడుడింతై' అన్నట్లుగాశరీరాకృతిని అనూహ్యంగా పెంచి తాను అనుకున్నకార్యాన్నిసాధిస్తాడు.
అలాగే ఓ ఆంజనేయస్వామీ! ఆనాడు బలిచక్రవర్తినిపాతా ళలోకంలోనికి అణచి వేసి, అక్కడ బంధీకృతుని చేయడం లో వామనావతారుడైన శ్రీమహావిష్ణువు తన ఆకృతిని పెంచినట్లగానే, నీవునూ నీ దేహాన్ని అపారంగాపెంచినావు. చంద్రుడు ఉదయించి తన వెలుగులను బాగా విజిమ్ముతు న్న వేళ, సముద్రం ఎలా పైకిలేస్తుందో, నీవునూ అలాగే మహేంద్రగిరి నుండి పైకి ఎగిరావు. ఆకాశం పెద్దధ్వనిచేస్తూ ఉరిమిన రీతిగా భయంకరమైన గర్జన చేసి,ఆ సముద్రాన్ని
ఆకాశమార్గంలో పయనించి దాటడానికి పరమోత్సాహం తో పూనుకొంటివి గదా స్వామీ!

17) మll
స్థిరసత్త్వంబున శైలరాజము ధరిత్రిం గ్రుంగఁ బాదంబులూ
ది, రహిన్‌ భూరిభుజోరు వేగమున ధాత్రీజాతముల్‌ పెల్లగి
ల్లి రయంబారఁగఁ దోడ రా,గగనమున్‌ లీలాగతిన్‌ మ్రింగ సు
స్థిరశక్తిం జనుమాడ్కి దాటితివి గాదే నింగికిన్‌మారుతీ!

తాత్పర్యం:- స్థిరసత్త్వంబున= చెదరని బలముతో, శైలరా జము= పర్వతరాజము ( అంటే ఇక్కడ మహేంద్ర పర్వత మని అర్థం), ధరిత్రి= భూమి, పాదంబులు+ ఊది= అరికా
ళ్ళతో అదిమిపట్టి, రహిన్= విధముగా, భూరి+భుజ+ఉరు వేగమున= విస్తారమైన భుజములను కదిలించుటవలన ఉత్పన్నమైన వేగమున, ధాత్రీజాతములు= చెట్లు, మాడ్కి= రీతిగా, గగనము= ఆకాశము ఓ మారుతీ! నీవు ఆకాశంలోనికి ఎగరడానికి ఉద్యుక్తుడ వైనప్పుడు, ఆ మహేంద్ర పర్వత శిఖరాన్ని గట్టిగాఅరికాళ్ళ తో బలంగా అదిమి పట్టినావు, అప్పుడా పర్వత పీఠం భూమి లోనికి క్రుంగి పోయింది. విస్తారమైన నీ భుజములు కదిలించుటవలన జనించిన వేగానికి, ఆ పర్వతాన్ని ఆశ్ర యించుకొని వున్న వృక్షాలు కూకటివ్రేళ్ళతో సహా పెల్లగిం
చబడి, కొన్ని నీ శరీరానికి చుట్టుకొన్నాయి.ఆకాశాన్నిమ్రింగ టానికి పోతున్నావా.. అన్నట్టు, ఆకాశానికి ఎగిరిప్రయాణిం చిన నీతోపాటే, నిన్నుచుట్టుకున్న ఆ వృక్షాలు కుడా ప్రయా
ణించాయి. అవి నీకు అదనపు భారమైనా , లెక్కచేయ కుండా స్థిరసంకల్పంతో నీవు మాత్రం ఆకాశంలోముందుకు దూసుకొని పోయావు కదా స్వామీ!

18) మll
అగజాలావృతమూర్తివై భుజరయోద్యద్వారివాహంబు లొ
ప్పుగ నిర్వంకల నంటి రా గదలి యంభోరాశిమధ్యంబునన్‌
గగనాధ్వంబున నేగు నిన్నమిషుల్‌, గంధర్వులున్‌ లంబప
క్ష గిరీంద్రంబును బోలె జూచిరికదా సంభ్రాంతులై మారుతీ!

తాత్పర్యం:-అగజాలావృతమూర్తివై= చెట్లూ పూలతో చుట్టి వేయబడిన శరీరము గలవాడై, భుజరయో+ ఉద్యత్+ వారివాహంబు= రెండు భుజముల యొక్క వేగముచేత రెండు ప్రక్కలకు తోసివేయబడిన మబ్బులు,ఒప్పుగ=చక్క గా, ఇర్వంకల= రెండు పక్కల, అంభోరాశి మధ్యంబునన్=సముద్రం మధ్యంలో, గగన + అధ్వనంబున=ఆకాశమార్గ మున, ఏగు= వెళ్ళు, నిన్+ అనిమిషుల్= నిన్ను దేవతలు, లంబపక్షి గిరీంద్రంబు= పెద్దపొడవైన పర్వతమంత పక్షి,
సంభ్రాంతులై= మిక్కిలి విభ్రమమునకు లోనైనవారై. ఓ మారుతీ! చెట్లూపూలతో చుట్టుకొనబడిన శరీరము తో, రెండుచేతులతో వేగంగా తోసివేయబడిన మేఘాల ను ఇరువైపుల వెంటనంటిరాగా, సముద్ర మధ్యానికి చేరు తున్న నిన్ను, అప్పడు ఆకాశంలో వెళ్ళుతున్న దేవతలు, గంధర్వులు చూచి, ఆహా.. ఏమిటిది, మనం ఎన్నడూ చూడని ఇంతపెద్ద పొడవైన పర్వతమంత పక్షి ఆకాశంలో ఎగురుతూ పోతున్నదేమిటో, అని వారిలో వారు అను
కుంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు గదా స్వామీ!
--(())--

No comments:

Post a Comment