Thursday 16 January 2020

యుద్ధ కాండము-1 శ్రీరా0 ***

ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన  పత్రిక ..... 25/1 ( 
 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-1
శ్రీరాముడు హనుమను ఆలింగనము చేసుకొనుట
హనుమ సముద్రమును దాటి సీతమ్మను చూచి, లంకను చెరచి మరల అనాయాసముగా వెనుకకు వచ్చి శ్రీరామునితో తన సాగర లంఘనమును, సీతాన్వేషణ వృత్తాంతమును యథాతథముగా వివరించాడు. నియమించిన కార్యమును చక్కగా నెరవేర్చుకొని  వచ్చినప్పుడు ప్రభువు ఎట్లు ప్రవర్తించ వలెనో వాల్మీకి శ్రీరాముని ద్వారా  లోకమునకు తెలియ చేయుచున్నాడు.  గురువులను ప్రత్యక్షంగా స్తోత్రము చేయవలెను. మిత్రులను, బంధువులను పరోక్షంలో స్తుతించవలెను. దాసులను, భృత్యులను నియమించిన పని పూర్తి చేసిన వెంటనే ప్రశంసింప వలెను. పుత్రులను ఎన్నటికీ బైటికి ప్రశంసింప రాదు. మనసులోనే అభినందించు కొన వలెను. (ప్రస్తుతము తద్విరుద్ధముగా జరుగుట చూచుతున్నాము). ఈ నియమమును ఎరిగిన శ్రీరాముడు నియమించిన కార్యమును నెరవేర్చిన హనుమను సుగ్రీవుడు, వానరులు చూచుచుండగా ఇట్లు చెప్పు చున్నాడు.
 

కృతం హనుమతా కార్యం సుమహ ద్భువి దుష్కరమ్
మనసా౭పి య ద౭న్యేన న శక్యం ధరణీ తలే 6.1.2
 

ఈ భూమండలమున ఎవరును మనసులో కూడా చేయజాలని పనిని, చాలా గొప్ప పనిని హనుమ చేసినాడు. ఈ లోకములో వాయువు సహాయము ఉన్నచో గరుత్మంతుడు సాగరమును దాటగలడు. కానీ హనుమ ఎవరి సహాయము లేకుండా అట్టి దుష్కార్యమును నెరవేర్చినాడు. రావణుని పర్యవేక్షణలో యున్న దుర్భేద్యమైన లంకను పాడు చేయడము హనుమకు తప్ప ఎవ్వరి వలన సాధ్యమయ్యేది కాదు.  తన బలమునకు అనుగుణముగా, సేవకుడిగా తాను చేయవలసినది అంతయు చేసినాడు. ప్రభువును సేవించెడి భృత్యులు మూడు విధములుగా యుందురు. కార్యమును ప్రభువు నియోగించినప్పుడు ఆపనిని చేసి అనిని చేసిన దానికి సంబంధించిన వేరొక పనిని కూడా ప్రభు కార్యమునకు అనుకూలముగునట్లు చేయువారు రాజభృత్యులలో ఉత్తములు. అధికమైన సమర్థత యుండియు నియమించిన కార్యమును మాత్రమే చేయువాడు మధ్యముడు. సామర్థ్యము ఉండియు చేయవలెనని సిద్ధపడియు చేయక, చేయలేక పోయినవాడు అధముడు. హనుమ సీతాన్వేషణ, లంకాదహనము చేసి అందరిని ప్రాణత్యాగము చేయకుండా కాపాడినాడు. హనుమ, సేవకులలో ఉత్తముడు. అతను చేసిన ఉపకారమునకు ఏమి ఇచ్చి ప్రత్యుపకారము చేయగలను?

ఏష సర్వస్వ భూత స్తు పరిష్వ౦గో హనూమతః
మయా కాల మిమం ప్రాప్య దత్త స్తస్య మహాత్మనః      6.1.13
 

సాగరం తు సమాసాద్య పున ర్నష్టం మనో మమ          6.1.16
కథం నామ సముద్ర స్య దుష్పార స్య మహా౭మ్భసః
 

హరయో దక్షిణం పారం గమిష్యన్తి సమాహితాః 6.1.17
య ద్య౭ప్యేష తు వృత్తాన్తో వైదేహ్యా గదితో మమ
 

ప్రత్యుపకారము చేయవలసిన ఈ సమయమున నా వద్ద యున్నది దేహమే. ఇది నాకు అత్యంత ప్రియమైనది. నాకు ఎంతో భోగ్యమైనది. ఈతనికి ఏమి ఇచ్చినను స్వీకరింపడు. ఆనాడు లంకలో చనిపోవుటకు సిద్ధపడిన సీతమ్మను కాపాడినాడు. సీతాసందేశముతో నా ప్రాణములు కాపాడినాడు. ఈ విధముగా రెండు దేహములను కాపాడినాడు. కాన ఈ దేహముతో హనుమను ఆలింగనము చేసుకొనెదని, హనుమను గాడాలింగనం చేసుకొనెను. కాని అగాధమైన ఈ సముద్రమును దాటుట ఎట్లు అని దీర్ఘాలోచనలో పడిపోయినాడు.
 

శ్రీరాముడు శోకముతో యుండుట చూచి సుఖదుఃఖములలో మిత్రుడిగా రాముని శోకమును రూపుమాపుటకు సుగ్రీవుడు ఇట్లు శాంత, ధైర్య వచనములు పలుకుతున్నాడు. "రామా! సామాన్యుని వలెనే నీవు శోకించుట తగదు. సంతాపమును విడువుము. సీతమ్మ జాడ తెలిసినది. శత్రువు స్థావరం తెలిసినది. ఏది చేయరాదో, చేయదగునో నిర్ణయించ శక్తి గల బుద్ధిమంతుడవు. సముద్రమును దాటుట దుర్భరమని శోకింపకుము. అట్టి సముద్రమును దాటి లంకపై దూకి, రావణుని మేమందరము సంహరించ గలము.  నిరుత్సాహము సర్వ కార్య వినాశకరం.
 

నిరుత్సాహ స్య దీన స్య శోక పర్యాకులా౭౭త్మనః
సర్వా౭ర్థా వ్యవసీదన్తి వ్యసనం చా౭ధిగచ్ఛతి     
 

ఉత్సాహము లేనివాడు, దీనుడు, శోకముచే కలత చెందిన వాడు కార్యములను సాధింపజాలడు. సర్వార్థములు చెడిపోవును. ఆపదలు చుట్టుముట్టును. సర్వ ప్రయోజనములు నశించును. శోకము వలన నిరుత్సాహము ఏర్పడును. అందువలన దైన్యము వచ్చును. అప్పుడు పొందవలసిన ప్రయోజనము పొందకపోవుట వలన ఆపద వచ్చును. కావున సర్వదా శోకము దూరము చేయదగినది. రామా! మీ ఆజ్ఞచే ఉత్సాహవంతులైన అశేష మా వానర సేనాని సముద్రమును దాటుటయే కాదు అగ్నిలో దూకమన్న దూకేస్తారు. సముద్రమునకు సేతువు కట్టుటకు, లంకను చేరుటకు మీరు ప్రయత్నము చూపవలెను. ఇందుకు అనేకమైన సూచనలు కనబడుతున్నాయి. ఈ విధముగా సుగ్రీవుడు శ్రీరాముని శోకము బాపుటకు ప్రయత్నము చేసెను.
ఈ సాగరము దుస్తరమైన సంసార రూప సాగరము. అటువంటి సాగరమును దాటి లంకకు పోయి సీతను వెతికి, తిరిగి వచ్చునప్పుడు నియంత్రణలో యున్న ఆ లంకను హనుమాన్ సాధకుడు దహనము గావించెను. అనగా మాయను దహింప చేసెను.
 

"కింత్వం సంతర్యసే వీర యథాన్య: ప్రాకృత స్తథా,
మైవం భూస్త్యజ సంతాపం కృతఘ్న యువ సౌహృదం"  6 2 2 
 

సుగ్రీవుడు, శ్రీరామునితో సీతారూప సాత్విక అనుభూతుల కొరకై సాధారణ మానవుని వలె శోకమును పొందకుము అని చెప్తాడు. శ్రీకృష్ణుడు కూడా ఈ విధముగానే అర్జునునితో శోకము చెంద వద్దని చెప్పాడు.
 

"మయి సర్వాణి కర్మాణి సన్య స్యాధ్యాత్మ చేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్య స్వ విగత జ్వరః" (3 30 )

ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు అర్జునిడికి సంతాప రహితముగా యుండుమని చెప్తాడు. సుగ్రీవుడు "త్యజ సంతాపః" అంటారు. అంటే సంతాపమును త్యజింపమని పలికెను. సాధనా ఫల ప్రాప్తి నొందనిచో సాధకుని మనోబుద్ధుల సంతాపము వృద్ధి యగును. అటువంటి సంతాపమును దరిచేరనీయరాదు. ఈ దుర్లభమైన సాగరమును దాటుటెట్లు అని చింతించుచున్న రామునితో సుగ్రీవుడు అను చున్నాడు.
 

సముద్రం ల౦ఘయిత్వా తు మహా నక్ర సమాకులమ్
ల౦కా౦ ఆరోహయిష్యామో హనిష్యామ శ్చ తే రిపుమ్ 6 2 5
 

పెద్ద పెద్ద మొసళ్ళతో (శత్రువులతో) నిండియున్న సాగరమును (సంసారమును) దాటి లంకకు చేరి రాక్షసులను సంహరించ వలెను. సాగరమనగా దుర్గుణములతో కూడిన భవసాగరము. అదియే సంసార సాగరము. లేదా సంసారము. రావణాది రాక్షసులు అనగా చెడ్డ వృత్తులు. వీటిని సాధకుడు సంహరింప వలెను. వసిష్ఠ మహర్షి శ్రీరామునితో, దృశ్యాస క్తి యే సంసారము యొక్క మూల రూపము. సంసార అసక్తుడైన వాడు అనుభవించని దుఃఖము అంటూ వుండవు. సమ్యక్ జ్ఞానము జీవుని సంసార వ్యాధికి దివ్యమైన ఔషధము. సంసారమనెడు ఈ వాసనను చేధింపుము అని చెప్తారు. సుగ్రీవుని సంభాషణ ద్వారా వాల్మీకి సాధకుడు తన యందలి చెడ్డ వృత్తులను వదలి ఈ సంసార సాగరమును దాటవలెనని చెప్పాడు. అయినను రాముడు సీతా శోకమును నియంత్రణలో పెట్టుకోలేక పోయెను. శ్రీరాముడు వాల్మీకిచే రూపొందించబడిన ఆదర్శ పురుషుడు. పూర్వపు అనుభూతులు ప్రాప్తించక పోయినచో సాధకుడు గాబరా చెందును. ఈ సీతా శోకమున యున్న యోగ రహస్యము ఇదియే. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి రామ శోకము గురించి ఈ విధముగా చెప్పెను. "రామః పరాత్మా ఫై తతః స్వానుభూతిమ్ వియోగతః, ప్రాప్తో దీన దశాం దుఖిః సుశోచ విరహాతుర:" ఈ సీతాశోకము చూచినచో రాముడు అతి సాధారణ మానవునివలె వర్ణింపబడినాడు. మంచి ఎవరు చెప్పిన వినాలనే శృతి వాక్యమును శ్రీరాముడు పాటించి ఆదర్శ పురుషుడు అయ్యాడు. కానీ రావణుడు తనకు నచ్చినట్లు చెప్పే వారి మాటలే విని, మంచి మాటలు స్వీకరింపక పతనమును కోరి తెచ్చుకొన్నాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ

ప్రాంజలి ప్రభ " మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

1 comment: