Friday 24 January 2020

యుద్ధ కాండము-8*



*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-8*

*శరణుగోరినవానికి ఆశ్రయము ఇచ్చుటయే యుక్తమని హనుమ పలుకుట*
సకల శాస్త్రములను అభ్యసించుట వలన చక్కని సంస్కారము అబ్బినవాడైన హనుమ అర్థవంతములైన మధుర వచనములను సంక్షిప్తముగా ఇట్లు పలికెను.

*న భవన్తం మతి శ్రేష్ఠం సమర్థం వదతాం వరమ్*
*అతిశాయయితుం శక్తో బృహస్పతి ర౭పి బ్రువన్*         
*న వాదా న్నా౭పి సంఘర్షా న్నా౭ధిక్యా న్న చ కామతః*
*వక్ష్యామి వచనం రాజన్ యథా౭ర్థం రామ గౌరవాత్*       
*అర్థా౭నర్థ నిమిత్తం హి య దుక్తం సచివై స్తవ*
*తత్ర దోషం ప్రపశ్యామి క్రియా న హ్యుపపద్యతే*
*ఋతే నియోగా త్సామర్థ్యమ్ అవబోద్ధుం న శక్యతే*
*సహసా వినియోగో హి దోషవాన్ ప్రతిభాతి మే*
*చార ప్రణిహితం యుక్తం య దుక్తం సచివై స్తవ*
*అర్థ స్యా౭సంభవా త్తత్ర కారణం నోపపద్యతే*   
*అదేశ కాల సంప్రాప్త ఇత్య౭యం య ద్విభీషణః*
*వివక్షా చా౭త్ర మేఽస్తీయం తాం నిబోధ యథా మతి*
*స ఏష దేశః కాల శ్చ భవ తీహ యథా తథా*   
*పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోష గుణావ౭పి*
*దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి*
*యుక్త మా౭౭గమనం తస్య సదృశం తస్య బుద్ధితః*
*అజ్ఞాత రూపైః పురుషైః స రాజన్ పృచ్ఛ్యతామ్ ఇతి*
*యదుక్త మ౭త్ర మే ప్రేక్షా కాచి ద౭స్తి సమీక్షితా*   
*పృచ్ఛ్యమానో విశ౦కేత సహసా బుద్ధిమాన్ వచః*
*తత్ర మిత్రం ప్రదుష్యేత మిథ్య పృష్టం సుఖా౭౭గతమ్*
*అశక్యః సహసా రాజన్ భావో వేత్తుం పరస్య వై*
*అన్తః స్వభావై ర్గీతై స్తై ర్నైపుణ్యం పశ్యతా భృశమ్*
*న త్వ౭స్య బ్రువతో జాతు లక్ష్యతే దుష్ట భావతా*
*ప్రసన్నం వదనం చా౭పి తస్మా న్మే నా౭స్తి సంశయః*       
*అశ౦కిత మతిః స్వస్థో న శఠః పరిసర్పతి*
*న చా౭స్య దుష్టా వాక్చా౭పి తస్మా న్నా౭స్తీ హ సంశయః*
*ఆకార శ్ఛాద్యమానోఽపి న శక్యో వినిగూహితుమ్*
*బలా ద్ధి వివృణో త్యేవ భావ మ౭న్తర్గతం నృణామ్*       
*దేశ కాలో పపన్నం చ కార్యం కార్య విదాం వర*
*స్వ ఫలం కురుతే క్షిప్రం ప్రయోగేణా౭భిసంహితమ్*         
*ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యా వృత్తం చ రావణమ్*
*వాలిన శ్చ వధం శ్రుత్వా సుగ్రీవం చా౭భిషేచితమ్*
*రాజ్యం ప్రార్థయమాన శ్చ బుద్ధి పూర్వమ్ ఇహా౭౭గతః*   
*ఏతావ త్తు పురస్కృత్య యుజ్యతే త్వ౭స్య సంగ్రహః*
*యథా శక్తి మయోక్తం తు రాక్షసస్యా౭౭ర్జవం ప్రతి*

*త్వం ప్రమాణం తు శేషస్య శ్రుత్వా బుద్ధిమతాం వర*  (6.17. 47 to 64)
రామా! నీవు గొప్ప ప్రజ్ఞాశాలివి, సర్వ సమర్థుడవు. నేను వాక్చాతుర్యమును ప్రకటించుటకు గాని, ఇతరులతో పోటీపడి బుద్ధిమంతుడను అని స్వాభిమానమును ప్రకటించుకొనుటకు గాని, ఏ విధమైన ప్రయోజనములు ఆశించి గాని కాకుండా ప్రస్తుత కార్యము యొక్క ప్రాముఖ్యమును దృష్టిలో పెట్టుకొని యదార్థములను పలుకుచున్నాను.
ఎవరినైనను రాజ కార్యము నందు నియోగించనిదే వారి సామర్థ్యమును తెలుసుకొనే వీలు కాదు. కొత్త వారికి కార్య భారమును అప్పగించుటయు సరికాదు. కావున విభీషణుని విషయమున ఈ ధర్మ సూత్రము  వర్తించును.
గూఢచారుల ద్వారా ఈయన యొక్క గుణదోషములను నిర్ణయించుట యుక్తమని తెలిపి యున్నారు. దూర ప్రదేశములు యందున్న శత్రువుల వృత్తాంతము తెలుసుకొనుటకు గూఢచారులను నియుక్తము చేయవచ్చు కానీ సమీపాన యున్న వారి విషయములో దీనివలన ప్రయోజనము శూన్యము.
విభీషణుడు ఇచ్చటికి వచ్చుట దేశకాలానుగుణము కాదని చెప్పి యున్నారు. కానీ వాస్తవముగా ఇదియే తగిన సమయము.

రావణుని లోని మరియు నీలోని గుణదోషములను ఎరిగి యున్నాడు గనుక విభీషణుడు ఇచ్చటికి వచ్చుట సమంజసమే మరియు ఇది అతని బుద్ధి కుశలతను నిదర్శనము.
అపరిచితులైన వ్యక్తుల ద్వారా ఇతని వృత్తాంతము తెలుసుకొనే వలెననే సూచన ప్రయోజన కారము కాదు ఏలనన అపరిచితులైన వ్యక్తులు అనువుగాని విధముగా ప్రశ్నించినచో అతని మనస్సు చివుక్కుమని మనకు సహాపడుటకు విముఖుడు కావుట వలన మనము ఒక మంచి మిత్రుని కోల్పోవుదము.

అంతియే గాక క్షణ కాలములో అతని యొక్క భావములను పసిగట్టుట అశక్యము. అతని ముఖము ప్రసన్నముగా యున్నది గావున అతని మాటలలో ఎట్టి కపటము కనబడుట లేదు కావున సందేహించ వలసిన పని లేదు. ప్రయత్నపూర్వకంగా మనోభావములను దాచుకొనుటకు ప్రయత్నించినను అవి ముఖకవళికలలో బయిట పడును. అవి కనబడుట లేదు.

కార్యములను చక్కగా దేశకాలములకు అనుగుణముగా ఆచరించినచో అవి వెంటనే సత్ఫలితములు ఇచ్చును. రావణుని మిథ్యాప్రవర్తనను, మీ కార్యదక్షతను, వాలిని వధించి సుగ్రీవుని పట్టాభిషేకము చేసిన విషయము ఎరింగియే యున్నాడు కావున ఇతను తనకు రాజ్యలాభము కలుగునని ఇచ్చటికి వచ్చి యుండవచ్చు.
ఈ విధముగా విభీషణుని సరళ స్వభావమును, నిర్దోషిత్వమును హనుమ రామునికి తెలియజేసి కార్యభారమును మీకు (రామునికి) నచ్చిన విధముగా ఆచరింపుమని చెప్పెను.

శరణాగతి చేయువారికి *"స ఏష దేశః కాల శ్చ భవతి"* అని హనుమ చెప్పిన మాట పరమ ప్రమాణము. శరణాగతి పొందుటకు దేశకాలములతో నిమిత్తము లేదు. ద్రౌపది సభలో రజస్వల అయినప్పుడు, అర్జునుడు ఏమి చేయలేని స్థితిలో యుద్ధభూమిలో ఉన్నప్పుడు, గజేంద్రుడు చివరి సమయములో, రాముని బ్రహ్మాస్త్రము వెంటాడుచుండగా కాకిని శరణాగతి చేయలేదా! అందుచేత శరణు పొందుటకు ధృడమైన విశ్వాసము ముఖ్యము గాని దేశకాలములు కాదు. ఇక రాముడు తన నిర్ణయము తెలియజేయుచున్నాడు.
*శ్రీరామ జయరామ జయజయ రామ*


No comments:

Post a Comment