Monday 6 January 2020

సుందర కాండము-15




"మిత్రులకు, శ్రేయోభిలాషులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు"
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-15

సీత కోరికపై హనుమ శ్రీరాముని రూపమును  వివరించుట
శ్రీరాముని ఆత్మ గుణ గుణములను వర్ణించిన తరవాత, హనుమ, శ్రీరాముని రూపమును ఈ విధముగా వర్ణించు చున్నాడు.
 
విపులా౭౦సో మహా బాహుః కమ్బు గ్రీవః శుభా౭౭ననః
గూఢ జత్రుః సుతామ్రా౭క్షో రామో దేవి జనై శ్శృతః  5.35.15
 
దున్దుభి స్వన నిర్ఘోషః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్
సమ స్సమ విభక్తా౭౦గో వర్ణం శ్యామం సమాశ్రితః  5.35.16
 
త్రిస్థిర స్త్రిప్రలమ్బ శ్చ త్రిసమ స్త్రిషు చోన్నతః
త్రి తామ్ర స్త్రిషు చ స్నిగ్దో గంభీర స్త్రిషు నిత్యశః   5.35.17
 
త్రి వలీవాం స్త్ర్యవణత శ్చతు ర్వ్య౭౦గ స్త్రి శీర్షవాన్
చతుష్కల శ్చతు ర్లేఖ శ్చతు ష్కిష్కు శ్చతు స్సమః  5.35.18
 
చతుర్దశ సమ ద్వన్ద్వ శ్చతుర్ద౦ ష్ట్ర శ్చతుర్గతిః
మహౌ ష్ఠ హను నాస శ్చ ప౦చ స్నిగ్ధో౭ష్ట వంశవాన్  5.35.19
దశ పద్మో దశ బృహ త్త్రిభి ర్వ్యాప్తో ద్వి శుక్లవాన్
షడు న్నతో నవ తను స్త్రిభి ర్వ్యాప్నోతి రాఘవః   5.35.20

సీతా మాతా! శ్రీరాముడు విశాలమైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము, సుందరమగు ముఖము, దుందుభి దానిని పోలిన కంఠస్వరం, మెఱయుచున్న దేహచ్చాయతో అన్ని అవయవములు సమముగా కలవాడు, నీలమేఘశ్యాముడు.
 
1. త్రిస్థర; వక్షం, మనిబంధము, పిడికిలి స్థిరముగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
2. త్రిప్రలంబ: కనుబొమలు, బాహువులు, వృషణములు పొడవుగా యున్నవాడు. ఇవి సంపన్నుల లక్షణములు,
3. త్రిసమః: కేశాగ్రములు, వృషణములు, జానువులు సమముగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
4. త్రిషుచోన్నత: ఉదరము, నాభి చుట్టుభాగము, హృదయము ఎత్తుగా గలవాడు. ఇవి రాజ లక్షణములు,
5. త్రితామ్రః: నేత్రాంతములు, గోళ్లు, అరచేతులు ఎర్రగా నున్నవాడు. ఇవి సుఖపురుషుని లక్షణములు,
6. త్రిషుస్నిగ్ధః: పాదరేఖలు, శిరోరుహములు, లింగము ఈ మూడును నునుపుగా నున్నవాడు. ఇవి భాగ్యవంతుని లక్షణములు,
7. త్రిషు గంభీరః: స్వరము, నడక, నాభి ఈ మూడును గంభీరంగా నున్నవాడు. ఇవి ప్రసంశాపాత్రుని లక్షణములు,
8. త్రివలీవాన్: కడుపుపై మూడు మడతలు కలవాడు,
9. త్రవ్వనతః: స్థనములు. చూచుకములు, పాదరేఖలు లోతుగా యున్నవాడు,
10. చతుర్వ్యంగః: నరములు తేలని పాదములు, ఒక్కొక్క వెంట్రుక కల రోమ కూపము, దీర్ఘముగా లేని లింగము, మాంసము కాని పొత్తికడుపు కలవాడు, 
11. త్రిశీర్షవాన్: మూడు సుడులు గల్గిన శిరస్సు కలవాడు,
12. చతుష్కలః: బొటన వ్రేలి మొదట నాలుగు రేఖలు కలవాడు. ఇవి ఎన్ని రేఖలు ఉండునో అన్ని వేదముల యందు ప్రావీణ్యము యుండును,
13. చతుర్లేఖః: నుదిటి యందు నాలుగు రేఖలు, పాదము నందు చేతి యందు నాలుగు రేఖలు కలవాడు. లలాటముపై నాలుగు రేఖలు యున్నచో 200 యేండ్లు ఆ పైన, మూడు రేఖలు యున్నచో 100 యేండ్లు, రెండు రేఖలు యున్నచో 60 యేండ్లు, ఒక రేఖ యున్నచో 20 యేండ్ల లోపు ఆయుర్దాయము యుండును,
14. చతుష్కిష్కుః: తొంబదియారు అంగుళముల ఎత్తు కలవాడు,
15. చతుస్సమః: బాహువులు, జానువులు, ఊరువులు, గండ స్థలములు సమముగా యున్నవాడు,
16. చతుర్దశసమద్వన్ద్వః: కనుబొమలు, ముక్కుపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్థనాగ్రములు, ముంజేతులు, మణికట్లు, మోకాళ్ళు, వృషణములు, పిరుదులు, చేతులు, పాదములు మడమలు. ఈ పదునాలుగు సమముగా యున్నవాడు,
17. చతుర్దంష్ట్రః: దంతములు మెరియుచు గట్టివై, వాడివై, సమములై ఉండువాడు. రెండు పలువరసలలో మధ్యగల నాలుగు దంతములకును పక్కనున్న నాలుగు పండ్లకును 'దంష్ట్రలు' అని పేరు. కాంతి గలవి, నునుపైనవి, పెద్దవి, మొనదేలినవి, సమములు ఐన దంష్ట్రములు మంగళకరములు,
18. చతుర్గతిః: సింహము, శార్ధూలము, గజము, వృషభము అను నాలుగు జంతువుల నడక వంటి నడక గలవాడు,
19. మహౌష్ఠహనునాసః: పెదవి, దౌడ, ముక్కు, ఎత్తుగా బొద్దుగా యున్నవాడు. ఇవి రాజ లక్షణములు,
20. ప౦చస్నిగ్ధః: చూపులో, దంతములో, చర్మములో, కేశములలో, పాదములలో స్నిగ్ధత కలవాడు,
21. అష్టవంశవాన్: వెన్నెముక, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్లు, చేతులు, ముక్కు, కన్నులు, చెవులు, లింగము. పొడవైన ఈ ఎనిమిది అవయవములు గలవాడు,
22. దశపద్మ: ముఖము, నేత్రములు, పెదవి, అంగుడు, స్థానములు, గోళ్లు, చెవులు, పాదములు. పద్మాకారములగు అవయవములు ఈ పది గలవాడు,
23. దశబృహత్: శిరస్సు, లలాటము, చెవులు, మెడ, గుండెలు,  ఉదరము, చేతులు, పాదములు, వీపు, హృదయము అను పది అవయవములు పెద్దవిగా యున్నవాడు,
24. త్రిభిఃవ్యాప్తః: తేజస్సు, యశస్సు, కాంతి అను ఈ మూడిటిచే అంతటా వ్యాపించినవాడు,
25. ద్విశుక్లవాన్: దంతములు, నేత్రములు తెల్లగా యున్నవాడు,
26. షడున్నతః: కక్షము లేదా చంక, కక్షి, వక్షస్థలం, ముక్కు, మూపు, నుదురు అను ఈ ఆరు అవయవములు ఎత్తుగా యున్నవాడు,
27. నవతమః: కేశములు, గోళ్లు, చర్మము, లింగము, వ్రేళ్ళు, గుంపులు, బుద్ధి, గడ్డము, వెంట్రుకలు అను ఈ తొమ్మిది సూక్ష్మముగా యున్నవాడు,
28. త్రిభిః వ్యాప్నోతి: ధర్మార్థకామములను మూడింటిని పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్ణవముల యందు అచ్చరించు వాడు.
ఇట్లు సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన సర్వ లక్షణములు గలవాడు శ్రీరాముడు. ఇట్టి లక్షణములు గల రామునకు అన్ని విధముల సమానముగా యుండు వాడు లక్ష్మణుడు.
అమ్మా! రామలక్ష్మణులు ఇద్దరు నిన్ను చూడవలెనని చాలా కుతూహలంతో యున్నారు. వారు వానర రాజైన సుగ్రీవునితో మైత్రి చేసుకొని యున్నారు. అమ్మా! హనుమ అను పేరుగల నన్ను ఇచ్చటికి దూతగా పంపినారు. రాత్రివేళ లంకలో ప్రవేశించి రావణుని చూచితిని. శోకముతో బాధపడుచున్న నిన్ను చూచితిని. దేవి! నేను రామదూతను. సుగ్రీవ సచివును. కార్యార్థినై వచ్చిన నాతో మాట్లాడుము. అమ్మా! నీవు దిగులు వీడుము. నీకెట్లు ఇష్టమైన అట్లు చేయుము. ఈ విధముగా చెప్పి సీతమ్మకు నమ్మకము కలుగుటకై వినయముతో ఇట్లు పలికెను.
 
వానరో౭హం మహాభాగే దూతో రామ స్య ధీమతః
రామ నామా౭౦కితం చేదం పశ్య దేవ్య౭౦గుళీయకమ్  5.36.2
 
ప్రత్యయా౭ర్థం తవా౭౭నీతం తేన దత్తం మహాత్మనా
సమా౭౭శ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖ ఫలా హ్య౭సి      5.36.3
 
అమ్మా! నేను వానరుడను. రామ దూతను. రామనామాంకితమగు ఈ అంగుళీయకమును చూడుము. నీకు విశ్వాసము కలుగుటకై శ్రీరాముడు ఒసగిన దీనిని తెచ్చినాను. అశ్వాసము నందుము. నీ దుఃఖము పోవుచున్నది. నీకు మంగళము అగుగాక. అని హనుమ సీతతో విన్నవించి ఊరకుండెను. సీతమ్మ ఆ ఉంగరమును గ్రహించి రామదర్శనము అయినట్లు మిక్కిలి ఆనందించింది.
శ్రీరామ జయరామ జయజయ రామ
--(())--

No comments:

Post a Comment