Wednesday 22 January 2020

యుద్ధ కాండము-7


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-7
విభీషణ శరణాగతి
యుద్ధకాండలోని విభీషణ శరణాగతి వేద సారమగు ఉపనిషత్తు. రక్షణమునకు శరణాగతియే సాధనమని విభీషణుడు నిరూపించాడు.

విభీషణుడు ఎంత ప్రయత్నించినను రావణునకు తన హితవాక్యములు రుచించలేదు.  అప్పుడు విభీషణుడు సోదరులను, భార్యాబిడ్డలను, పరివారమును, లంకను వీడి రాముని శరణాగతాభిలాషియై ఆకాశమునకు ఎగిరి వానరులు విడిది చేసి యున్న సముద్ర తీరమునకు అనలుడు, శరభుడు, సంపాతి, ప్రఘసుడు అను నలుగురు సచివులతో కలసి వచ్చి ఆకాశములో నిలబడెను. రామరక్షణమున జాగరూకులై యున్న వానరులు అందరూ ఒక్కసారే చూచిరి. రాముని యందు ప్రేమ అందరికి సమానమే. ఆ సన్నివేశమును చూచిన సుగ్రీవునకు శంక కలిగినది. సుగ్రీవుడు మనస్సులో అతను దూత కాదని, శత్రువే అని నిశ్చయించుకొని  హనుమంతాది వానరులతో వచ్చినవాడు మనలను చంపుటకు వచ్చినాడు కావున జాగరూకతతో యుండవలసినదిగా ఆదేసించెను. అంత విభీషణుడు సుగ్రీవాది వానర యోధులను చూచి బిగ్గరగా ఇట్లు నుడివెను.
 
రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వరః
తస్యా౭హమ్ అనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుతః   6.17.10
 
తేన సీతా జనస్థానా ద్ధృతా హత్వా జటాయుషమ్
రుద్ధా చ వివశా దీనా రాక్షసీభిః సురక్షితా            6.17.11
 
తమ్ అహం హేతుభి ర్వాక్యై ర్వివిధై  శ్చ న్యదర్శయమ్
సాధు నిర్యాత్యతాం సీతా రామా యేతి పునః పునః           6.17.12
 
న చ స ప్రతిజగ్రాహ రావణః కాల చోదితః
ఉచ్యమానో హితం వాక్యం విపరీత ఇవౌషధమ్     6.17.13
 
సోఽహం పరుషిత స్తేన దాస వచ్చా౭వమానితః
త్యక్త్వా పుత్రాం శ్చ దారాం శ్చ రాఘవం శరణం గతః           6.17.14
 
సర్వ లోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే
నివేదయత మాం క్షిప్రం విభీషణమ్ ఉపస్థితమ్   6.17.15
 
"మిగుల క్రూరుడైన రాక్షస రాజైన రావణునికి నేను తమ్ముడను. విభీషణుడను. దండకారణ్యము నుండి సీతాదేవిని అపహరించి, తనకు అడ్డుగా వచ్చిన జటాయువును సంహరించెను. నిస్సహాయురాలైన ఆ సాధ్వి ప్రస్తుతము రాక్షస స్త్రీల కాపలాలో నిర్బంధములో యున్నది. నేను సీతాదేవిని సాదరముగా అప్పగించమని అనేకములైన వచనములు యుక్తియుక్తముగా హితము చెప్పితిని. వాటినన్నింటిని పెడచెవిన పెట్టి నన్ను పరుషముగా దూషించాడు. అట్టి దురుసుతనమును సహింపలేక నేను భార్యాపుత్రులను వీడి రఘువీరుని శరణు జొచ్చుటకై వచ్చితిని. సమస్త లోకములకు రక్షకుడు, పరమాత్ముడు అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు విభీషణుడు శరణు గోరి తమ సమీపమునకు వచ్చి యున్నాడు" అని వెంటనే విన్నవించుడు. అప్పడు సుగ్రీవుడు త్వరగా రాముని యొద్దకు యేగి శత్రు పక్షము వాడైన విభీషణుడు వచ్చి యున్నాడు కావున తగిన వ్యూహ రచన చేసి ఆలోచన చేయవలసినదిగా విన్నవించాడు. శ్రీరాముడు సుగ్రీవుని ప్రేమను ఎరిగిన వాడు. విభీషణుడు తన యందు ధృడమైన విశ్వాసముతో ఉన్నాడని గుర్తించాడు. ప్రేమచే సుగ్రీవాదులు కాదనుచున్నారు కనుక వారిని అంగీకరింప చేసి వారి చేతనే చెప్పించవలెనని తలఁచెను. అప్పుడు శరణాగతవత్సలుడుగా వాసిగాంచిన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను విని అక్కడే చేరువలో యున్న హనుమదాది వానర ప్రముఖులతో ఇట్లు నుడివెను.
 
య దుక్తం కపి రాజేన రావణా౭వరజం ప్రతి
వాక్యం హేతుమ ద౭త్య౭ర్థం భవద్భిర౭పి త చ్ఛ్రుతమ్  6.17.30
 
సుహృదా హ్య౭ర్థ కృచ్ఛేషు యుక్తం బుద్ధిమతా సతా
సమర్థే నా౭పి సందేష్టుం శాశ్వతీం భూతి మిచ్ఛతా  6.17.31
 
"రావణుని తమ్ముడైన విభీషణుని గూర్చి, సుగ్రీవుడు సహేతుకంగా పలికిన మాటలు త్రోసిపుచ్చరానివి. కావున సందర్భమును అనుసరించి ఒక మిత్రుడు చెప్పినాడు గదా యని తక్కిన వారు మిన్నకుండరాదు. ప్రజ్ఞాశాలియు, సత్పురుషుడు, శ్రేయస్సును గోరువాడు, సమర్థుడు ఐన మిత్రుడు కార్యసంకటములు ఏర్పడినప్పుడు (సమస్యలు ఎదురైనప్పుడు) తగు సూచనలను అందించుట యెంతయేని యుక్తము. కనుక మీ ఆలోచనలను నిస్సంకోచముగా తెల్పుడు". అనెను. రాముడిట్లు అడుగగానే వానరులు తమ తమ అభిప్రాయములు తెలియ జేసినారు. అంగదుడు విభీషణుడు శరణాగతుడే గాని, శత్రుపక్షము నుండి వచ్చినాడు గావున శంకింప వలయును అని అన్నాడు. జాంబవంతుడు ఇంతకు మునుపు ఎప్పుడు రాకుండా సమయము కాని యుద్ధ సమయములో వచ్చినాడు గావున  శంకించ వలెను అని అన్నాడు. సకల శాస్త్ర కోవిదుడైన హనుమ ఈ విధముగా చెప్పు చున్నాడు. 
శ్రీరామ జయరామ జయజయ రామ

 

No comments:

Post a Comment