Sunday 19 January 2020

యుద్ధ కాండము-4*


*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-4*
*కుంభకర్ణుని ధర్మ వచనములు*

విభీషణుని ఉపదేశముచే వ్యాకులుడైన రావణుడు, మరునాడు ముఖ్యులైన మంత్రులతో, మహావీరులతో, మిత్రులతో లోతుగా ఆలోచించ దలచి వారినందరిని తన ఆలోచనామందిరమునకు పిలిచెను. విచ్చేసిన వారందరితో ఇట్లు పలికెను. "ధర్మము, అర్థము, కామము సాధించుచున్నప్పుడు కొన్ని విషమ పరిస్థితులు సంభవించును. ఏది సేవింప వలెనో, ఏది సేవింపరాదో నిర్ణయించుకొనుట కష్టము. మీరందరు సమర్థులు, లాభము;నష్టము, హితము;అహితము, ప్రియము;అప్రియము అనువాటిని వివేకించి ఎరుగ గలవారు కావున మనము ఏమి చేయవలెనో నిర్ణయించుడి" అని అడిగెను. రాముని భార్యను లంకకు తీసుకొని రాబడినది. కుంభకర్ణుడు ఇప్పుడే నిద్ర నుండి లేచివచ్చినాడు కావున అతనికి కూడా తెలియ చెప్పుటకు మరల చెప్పుచున్నాను. ఆమె నాతో కూడి భోగములు అనుభవించుటకు ఇష్టపడుట లేదు. ఆమెను చూచి కామపరవశుడనైతిని. ఆ కామముచే క్రోధము, హర్షము కలుగు చుండును. శోకము, సంతాపము విడువక బాధించుటచే మనసు చెదిరిన వాడనై యున్నాను. ఆమె నన్ను ఒక సంవత్సరము గడువు ఇమ్మని కోరినది[1]. అందుకు అట్లే అని ప్రతిజ్ఞ చేసితిని. దుర్లభమైన సముద్రమును దాటి ఒక కోతి మహత్తరమైన యుద్ధము చేసినది. ఒక మనుష్యుని వలన నాకు భయము లేదు. కానీ కార్యములు ఎట్లుండునో, ఏమి జరుగునో తెలియ రాకున్నది. రామలక్ష్మణులు సుగ్రీవుడు మొదలగు వానర సేనలతో సముద్రము ఆవల యున్నారు. సీతమ్మను వారికి ఒసగ రాదు. రామలక్ష్మణులను ఇరువురిని సంహరింపవలెను. అందుకు ఏమి చేయవలెనో బాగుగా ఆలోచించుడి" అని రావణుడు పలికెను.

కామాతురుడైన రావణుని మాటలను విని కుంభకర్ణుడు మిక్కిలి క్రుద్ధుడై ఇట్లు పలికెను.

*యదా తు రామస్య సలక్ష్మణస్య*
*ప్రసహ్య సీతా ఖలు సా ఇహా౭౭హృతా*

*సకృత్ సమీక్ష్యైవ సునిశ్చితం తదా*
*భజేత చిత్తం యము నేవ యామునం* 6.12.28

*సర్వ మేత న్మహా రాజ కృత మ౭ప్రతిమం తవ*
*విధీయేత సహా౭స్మాభి: ఆదావే వా౭స్య కర్మణ:*   6.12.29

ప్రభూ! (అన్నా!) రామలక్ష్మణులను వంచించి, వారి ఆశ్రమము నుండి సీతాదేవిని అపహరించి తీసుకొని రాకముందే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకొనిన బాగుండెడిది. నీవు సీతాహరణాది కృత్యములను ముందు వెనుక ఆలోచించక చేసితివి. ఇప్పుడు దానిని గూర్చి చర్చించుట గతజలసేతు బంధనము వంటిదే కదా! (నీరంతయు ప్రవహించి పోయిన పిమ్మట దానికి అడ్డుకట్ట వేయుట వృధా కదా) నిశ్చయాత్మక బుద్ధిగల ప్రభువు రాజకార్యమును బాగుగా ఆలోచించి నిర్వహించినట్లయితే తర్వాత పశ్చాత్తాపము పడవలసిన పని యుండదు. యుక్తాయుక్తములు ఎరుగని వాడే ముందుగా చేయవలసిన కార్యములను తర్వాత, తరువాత చేయవలసిన పనులు ముందుగా చేయుదురు. నేనే బలవంతుడిని అని విర్రవీగుచు తొందరపాటుతో వ్యవహరించెడి చపలచిత్తుని లోపములను శత్రుపక్షము వారు గమనించి వానిని దెబ్బతీయుదురు. ఇప్పటివరకు శ్రీరాముడు నిన్ను చంపకుండుట నీ అదృష్టముగా భావింపుము. అయినను మహారాజా! నీవు దుఃఖితుడవు కాకుము. నేను వారిని అందరిని సంహరించి నీకు మోదము కలుగ జేతును. నా చేతిలో రాముడు మృత్యుముఖమున చేరిన పిమ్మట సీత నీకు శాశ్వతముగా వశమగును  అని రావణునికి స్వంతన వాక్యములు పలికెను.
రావణుని సోదరుడైన కుంభకర్ణుడు గొప్ప సమర్దశీలుడు, పరాక్రమము, వివేకము కలవాడు. తీవ్ర తపస్సుచే బ్రహ్మను ప్రత్యక్షము చేసుకొనినాడు. బ్రహ్మను ఈ ప్రపంచ వ్యవహారములకు దూరముగా యుండవలెనని కోరుటకు బదులుగా అన్ని వేళలా నిద్రను ప్రసాదించమని కోరినాడు. (కుంభకర్ణుని వ్రుత్తాంతము ఉత్తర కాండము లో వివరించబడింది. ఈ కాండము లో శ్రీరామునికి, విభీషణుడు ద్వారా కుంభకర్ణుని వ్రుత్తాంతము చెప్పబడింది) భోగాలు - భోగసాధనాలు మరియు బలానికి నిలయమైన భగవంతుని జాగృతి పరచకుంటే మనమేమి పొందగలం? లోకమెప్పుడు నిద్రిస్తూ వుంటుంది. నిద్రించేవాడు ఎవరినైనా ఎప్పుడైనా జాగృతపరచగలడా? జ్యోతి స్వరూపుడైన పరమాత్మ జాగరూకుడుని మాత్రమే మేల్కొల్పగలడు. *'జాగృవాంసః సమింధతే'* అని మంత్రం. దీనినే ఋగ్వేదం మరియు కఠోపనిషత్తు. *'దివేదివ ఈడ్యో జాగృవద్భిః'* అని ప్రబోధించాయి. భగవద్గీత కూడా- *యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః*  ''ప్రాణులన్ని నిద్రించే సమయంలో యోగులు మేల్కొని యుంటారు. యోగులు నిద్రించే సమయంలో ప్రాణులు నిద్రిస్తాయి'' అని ఇదే విషయాన్ని సమర్థించింది. సామాన్య జనులు భోగానుభవం నుండి బయటపడలేరు. వారి జీవితమంతా ఆహార పానీయాది సామగ్రిని సమకూర్చుటయందే గడిచిపోతుంది. కాని ఎవరీ శరీరాన్ని ఇచ్చాడో అతడే దీనిని రక్షణ చేసే సామగ్రిని కూడా తప్పక ఇస్తాడని జ్ఞానికి మాత్రమే తెలిసియుంటుంది. అతనిని ఈ జన్మలోనే తప్ప మరో జన్మలో పొందడం మాత్రమే సాధ్యపడదు.

కుంభకర్ణుడు జ్ఞాని. అందుచే వాల్మీకి వాని నామమును "కుంభకర్ణుడు" (కుంభము వలె కర్ణములు కలవాడు) అని పేరిడెను. శ్రవణము ద్వారానే జ్ఞానమును గ్రహించెడి వాడు. మంచి ఆలోచనలు యున్నప్పటికీ కుంభకర్ణ సాధకుడు ఇతరుల ప్రోద్బలంతో తన సత్కర్మను విడిచి చెడు కర్మను ఆచరించెడి వాడు. భవసాగరమును దాటగల సమర్థుడు. చెడ్డ ఆలోచనలు విను స్వభావము గలవాడు గనుక రావణునికి సహకరించెదనని మాట ఇచ్చెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

[1] ఇచ్చట రావణుడు సభాసదుల ఎదుట తన ఔదార్యమును ప్రకటించుకొనుచు బొంకుచున్నాడు.
*శృణుమైథిలి! మధ్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని! కాలేనా౭నేన నా౭భ్యేషి యది మాం చారుహాసిని! తతస్త్వామ్ ప్రాతరాశార్థం సూదా: చేత్స్యంతి లేశశః*  (అరణ్య కాండ సర్గ 56 శ్లోకములు 24 - 25 )
ఓ! మైథిలి నా మాట వినుము. నీకు పండ్రెండు మాసములు గడువును ఇచ్చుచున్నాను. ఈ లోపల నా యెడల సుముఖురాలివి గాకున్నచో గడువు తీరిన మరునాడే ప్రాతఃకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చేయుదురు.


No comments:

Post a Comment