Saturday 4 January 2020

సుందర కాండము-14



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-14
సీత కోరికపై హనుమ శ్రీరాముని గుణగణములను వివరించుట
సీతాదేవి కోరికపై శ్రీరాముని శరీర చిహ్నములను, గుణగణములను ఈ విధముగా వివరిస్తున్నాడు.
జానన్తీ బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి
భర్తుః కమల పత్రా౭క్షి సంఖ్యానం లక్ష్మణ స్య చ  5.35.6
రామః కమల పత్రాక్షః సర్వ భూత మనోహరః
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకా౭౭త్మజే  5.35.8
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకా౭౭త్మజే                              
తేజసా౭౭దిత్య సంకాశః క్షమయా పృథివీ సమః
బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః  5.35.9
రక్షితా జీవలోక స్య స్వజన స్య చ రక్షితా
రక్షితా స్వస్య వృత్త స్య ధర్మ స్య చ పరంతపః 5.35.10
రామో భామిని లోక స్య చాతు ర్వర్ణ్య స్య రక్షితా
మర్యాదానాం చ లోక స్య కర్తా కారయితా చ సః  5.35.11
అర్చిష్మాన్ అర్చితో౭త్య౭ర్థం బ్రహ్మచర్య వ్రతే స్థితః
సాధూనామ్ ఉపకారజ్ఞః ప్రచారజ్ఞ శ్చ కర్మణామ్   5.35.12
రాజ విద్యా వినీత శ్చ బ్రాహ్మణానామ్ ఉపాసితా
శ్రుతవాన్ శీల సంపన్నో వినీత శ్చ పరంతపః  5.35.13
యజుర్వేద వినీత శ్చ వేదవిద్భిః సుపూజితః
ధనుర్వేదే చ వేదే చ వేదా౦గేషు చ నిష్ఠితః      5.35.14
సత్య ధర్మ పరః శ్రీమాన్ సంగ్రహా౭నుగ్రహే రతః
దేశ కాల విభాగజ్ఞః సర్వ లోక ప్రియం వదః   5.35.21
తల్లీ! రామలక్ష్మణుల రూపములను, వారి చిహ్నములను నీకు తెలిసినను నన్నడిగావు కనుక చెపుతున్నాను. రాముడు తామర పూరేకుల నేత్రములు గలవాడు, సమస్త ప్రాణులకు ఆనందమును చేకూర్చువాడు, పుట్టుకతోనే చక్కని దేహ సౌందర్యము, గుణ సంపద గలవాడు. తేజస్సును సూర్యుడివంటివాడు, సహనము నందు భూదేవి, బుద్ధి యందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. సర్వ ప్రాణులకు రక్షకుడు, శరణాగతి వత్సలుడు, ధర్మ రక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు. లోక మర్యాదలను పాటించుతూ ఇతరులచే పాటింప చేయువాడు, నాలుగు వర్ణములను రక్షించువాడు. జ్ఞాన సంపన్నుడు, లోక కళ్యాణమునకై తాను కర్మలను ఆచరించుతూ ఇతరులచే ఆచరింప చేయువాడు. (యద్యదా చరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే .. భ.గీ. 3 /21 శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తనని లోకులు పాటింతురు) సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రు భయంకరుడు. మూడు వేదములు, వేదాంగముల యందు నిష్ణాతుడు, వేద పండితులచే పూజింప బడువాడు. బ్రహ్మచర్యా దీక్షితుడు. (వివాహమైన తర్వాత కూడా ఋతుకాలమున తప్ప, స్త్రీతో రమింపకుండుట బ్రహ్మచర్యము. శివ గీత అష్టమాధ్యాయము లో ఈ విధంగా చెప్పారు.  స్త్రీ ఋతుస్నానము నాలుగవ రోజున చేయును. ఆ రోజు నుండి పదునారవ రోజు వరకు ఋతుకాలముగా నిర్ధేశించబడినది. అప్పుడు మాత్రమే సంతానము కల్గును. మిగిలిన రోజులలో సంతాన ప్రాప్తి ఉండదు. అంటే ఋతుకాలములో స్త్రీ సంగమము వంశాభివృద్ధి కొరకుగానే పరిగణించబడినది). శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు, సత్య భాషణము నందును, ధర్మాచరణము నందును నిరతుడు, ధర్మ మార్గమున ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు. అందరితోడను ప్రియముగా మాట్లాడు వాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment