Friday 17 January 2020

యుద్ధ కాండము-2 om sri raam ***


[6:04 AM, 1/18/2020] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-2
వానర సేనల యుద్ధ యాత్ర
 
శ్రీరాముడు నీతి శాస్త్రమును అనుసరించి తాము దండెత్తవలసిన రాజ్యము యొక్క దుర్గములను, రక్షణ విధానమును తెలుసుకోనుయుటకై అందుకై చూచి వచ్చిన హనుమతో భౌతిక సాధనముతో సముద్రమును దాటుటకు ప్రయత్నము చేసేదెము. అలాకానిచో వేగముగా సముద్రమును దాటునట్లు చేయగలను. కావున అంతకు ముందు లంక యొక్క రక్షణ వ్యవస్థను సవివరముగా ఉన్నది ఉన్నట్లుగా చూచినావు గనుక చెప్పవలసినదిగా అడుగుతాడు. అప్పుడు హనుమ రామునితో "రామా! రాక్షసులు రావణుని యెడల మిక్కిలి భక్తి విశ్వాసములు గలవారు, పరాక్రమ మంతులు, లంక యొక్క సమృద్ధి అనవధికము, సమగ్రము, భయంకరం. వాని సేన చక్కని విభాగములతో అమర్చబడినది. ఆ బలముల సంఖ్య అత్యధికం. లంకలో జనులు హర్షముతో, ఆనందముతో, నిర్భయులై యున్నారు. వారికి ఏ విధమైన మానసిక తాపములు లేవు. రథ, గజ, తురగములతో సైన్యము అత్యధికముగా యున్నది. దుర్భేద్యమైన ద్వారములు, ప్రాకారములు, అగడ్తలు, ద్వారముల వద్ద బాణములను, శిలలను చిమ్ము యంత్రములు, శతఘ్నులతో రక్షణ వ్యవస్థ బలముగా యున్నది గావున ప్రవేశించుటకు శక్యము కానిది. పట్టణ ప్రాకారము సువర్ణ మయము, మణులు, వైడూర్యములు, పగడములు ముత్యములు ప్రాకారమును అమర్చ బడినవి. నాలుగు ద్వారముల వద్ద సంక్రమములు యున్నను ఉత్తర ద్వారము వద్ద యున్న సంక్రమము మహా ధృడమైనది. రావణుడు ఎల్లవేళలా యుద్ధమునకు సంసిద్ధుడై యుండును. ద్యూతాది వ్యసనములకు లోనుకాకుండా అప్రమత్తముతో ఎల్లప్పుడూ సైన్యమును పర్యవేక్షించు చుండును. లంక త్రికూట పర్వతమున యున్నది. అందువలన అక్కడకు చేరుకొనుట చాలా కష్టసాధ్యము. ఆ పట్టణమునకు నాడి దుర్గము, పర్వత దుర్గము, వన దుర్గము, కృత్రిమ దుర్గము అను నాలుగు దుర్గములు కలవు. అవికాక శిల్పులచే నిర్మింపబడిన ప్రాకార పరిఘాధులు యున్నవి. సముద్రమునకు దూరముగా యుండుటచే అక్కడికి నౌకామార్గము లేదు. తూర్పు ద్వారము వద్ద అయుత సంఖ్యలో అనగా పదివేల మంది రాక్షసులు, దక్షిణ ద్వారము వద్ద నియత సంఖ్య గల సైన్యము అనగా ఏబది వేలమంది, పశ్చిమ ద్వారమున లక్ష రాక్షస సైన్యము, ఉత్తర ద్వారము వద్ద కోటి మంది సైన్యము,  ఇక మధ్య భాగమున ఎవరును ఎదిరింప శక్యము కాని నూరువేల రాక్షసులు కోటి సంఖ్య గల సైన్యము  రథ, గజ, తురగ, పదాతి దళములతో సర్వాయుధ ధారులై యుద్ధమునకు సన్నద్ధముగా యుందురు.  నేను నా శక్తి కొలది చాలా మందిని అంతమొందించి రక్షణ వ్యవస్థను ఛిద్రము చేసితిని. మనము ఏదోవిధముగా సముద్రమును దాట వలెను. దాటితిమా మన వానరులు లంకను అంతమొందించుట నిశ్చయము. అంగదుడు, ద్వివిదుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, నీలుడు ఎగిరి లంకకు చేరుకోగలరు. మిగిలిన వారు చేరలేకపోయినను లంకా నగరమును నాశనము చేయగలరు. రామా! నీ ఆజ్ఞ కొరకు వానర సైన్యము సర్వ సన్నద్ధముగా యున్నది" అని చెప్పెను. అప్పడు రాముడు, ఇది ఎంత పని. ఇప్పుడు సూర్యుడు ఆకాశ మధ్యమము యున్నాడు. ఇది "విజయము" అను ముహూర్తము, చాలా శ్రేష్టమైనది, ఈనాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రము. ఫాల్గుణ పూర్ణిమ. నాకు సాధన తార. మంచి శుభ శకునములు కనబడుతున్నవి కావున సుగ్రీవునితో ప్రయాణమునకు సన్నద్ధము కావలెనని నిర్ణయించాడు. అందుకు లక్ష్మణ సుగ్రీవునితో సహా  అందరూ వానరులు హర్షించారు.

రాముడప్పుడు ఇట్లు చెప్పు చున్నాడు. నీలుడు సేనానాయకుడు, సైన్యమునకు మార్గదర్శనం చేయవలెను. అతనితో నూరువేల మంది సైన్యము ఉండవలెను. మార్గమున జలము, ఫలములు తో కూడి యుండవలెను. రాక్షసుల యెడల అప్రమత్తతో యుండవలెను. కిష్కింధలో దుర్బలమైన సైన్యమును ఉంచి పరాక్రమము గలవారు ప్రయాణము కావలెను. గజుడు, గవయుడు, గవాక్షుడు సైన్యము ముందు నడువ వలెను. ఋషభుడు సైన్యమునకు దక్షిణ భాగమున, దుర్ధర్షుడు, గంధమానుడు ఎడమ వైపు, నేను (శ్రీరాముడు) హనుమంతునిపైన, లక్ష్మణుడు అంగదుని పైన అందరికి కన్పించుతూ సైన్యమునకు హర్షమును కల్గించుదుము. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి సైన్య మధ్య భాగమున ఉందురు. రాముడు ఇట్లు ఆజ్ఞాపించగా అందరూ హర్షాతిరేకములు చేసిరి. రాముని ఆజ్ఞానుసారము అందరూ పల్లెలకు, పట్టణములకు ఉపద్రవములు కల్గించకుండా దక్షిణ దిక్కుకు ప్రయాణము సాగించిరి.శుక్రుడు మేష రాశి యందు యున్నాడు. జన్మరాశి రామునకు కర్కాటకము, మేషరాశి నందు శుక్రుడు దశమ స్థానమున యుండుట వలన శుభప్రదము బృహస్పతి మొదలగు గ్రహములు ఆయా రాశులలో అనుకూలముగా యున్నవి. రామునకు యుద్ధయాత్రకు బయిలుదేరునాటికి ముప్పది ఆరు సంవత్సరముల వయస్సు. అందుచే గురువు సింహ రాశిలోను, శని మకర రాశిలోను, శని కేతువులు జన్మరాశికి షష్టమ స్థానములోను, పంచమమగు వృచ్చికమున కుజుడు, చంద్రుడు నవమములోను, సూర్యుడు అనుకూలురు.  రాహువు మిధున రాశిలో యుండుటచే కొద్దిగా బాధను కల్గించినను మొత్తము మీద రామునకంతయు గ్రహ బలము బాగుగా యున్నది. రాక్షసులకు ప్రతికూలంగా యున్నది. ఈ విధముగా వానర లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు సమరోత్సాహముతో దక్షిణ సముద్రమున యున్న మహేంద్ర పర్వతమును సమీపించిరి. సముద్రము యొక్క ఆవలి ఒడ్డు కానరానిదై అపారంగా యుండెను. శ్రీరాముని అనుమతితో సుగ్రీవుడు వానర సేనలను సాగర తీరము నందు నిలిపెను. సీతావియోగముచే లోకరీతికి భిన్నముగా శ్రీరాముని దుఃఖము అధికమయ్యెను.
 
న మే దుఃఖం ప్రియా దూరే న మే దుఃఖం హృతేతి చ      
ఏత దేవా౭నుశోచామి వయోఽస్యా హ్య౭తివర్తతే            6.5.5
 
వాహి వాత యతః కాంతా  తాం స్పృష్ట్వా మా మ౭పి స్పృశ
త్వయి మే గాత్ర సంస్పర్శ శ్చన్ద్రే దృష్టి సమాగమః          6.5.6
 
సీతమ్మ యవ్వనము రోజు రోజుకి గడచి పోవుచున్నదని, ఆమెను స్పుశించి, తనను స్పృశించమని వాయువును, చంద్రుడిని ప్రార్థించుచున్నాడు.
యుద్ధ కాండము నందలి రెండు, మూడు, ఐదవ సర్గలు ఇట్టి సీతా శోకముచే నిండి శ్రీరాముడు అతి సాధారణ మానవుని వలె వర్ణింపబడినాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
ప్రాంజలి ప్రభ .. మల్లాప్రగడ రామకృష్ణ 
--(())--

No comments:

Post a Comment