Friday 10 January 2020

సుందర కాండము-18




శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-18
ఇంద్రజిత్తు హనుమల యుద్ధము-హనుమ బ్రహ్మాస్త్రముచే బంధింప బడుట
తరువాత రావణుడు మహాబలశాలి, ఇంద్రుని జయించిన తన కుమారుడైన ఇంద్రజిత్తును పిలిచి దేశకాల విభాగము నెరిగి వివేకముతో నీ అస్త్రబలము, తపోబలముతో విజయము పొందుము అని చెప్పి పంపెను. మహావీరుడగు ఇంద్రజిత్తు యుద్ధమునకు వచ్చి హనుమపై అనేకమైన తీక్షణమైన బాణములను తీవ్ర వేగముతో పుంఖాను పుంఖాలుగా వదిలెను. హనుమ తనకు ఆ బాణములు తగులకుండా అతివేగముతో వాటి మధ్య తిరిగెను. వీరిద్దరి మధ్య యుద్ధము భయంకరముగా కొనసాగెను. హనుమను కొట్టుటకు ఇంద్రజిత్తునకు అవకాశము లభించుట లేదు. ఇంద్రజిత్తును కొట్టుటకు హనుమకు అవకాశము లభించుటలేదు. అంత ఇంద్రజిత్తు ఈ హనుమ అవధ్యుడు గా తోస్తున్నది అని అలోచించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. తేన బద్ధ స్తతోఽస్త్రేణ రాక్షసేన స వానరః, అభవన్ నిర్విచేష్ట శ్చ పపాత చ మహీ తలే (ఆ బ్రహ్మాస్త్రమునకు కట్టుబడిన వాడై హనుమ నిశ్చేష్టుడై భూమిపై పడిపోయెను. కానీ బ్రహ్మ వర ప్రభావము వలన ఆ అస్త్ర ప్రభావము క్షణకాలంలో తొలగిపోయెను. అయినను బ్రహ్మకు తనపై అనుగ్రహమునకు గుర్తుగా మిన్నకుండిపోయెను. ఇందువలన తనకు రావణునితో మాట్లాడే అవకాశము వచ్చునని తలఁచెను. అంతట అక్కడి రాక్షసులు హనుమను జనపనార త్రాళ్లచేత, వల్కములచేత బంధితుని చేసి రావణుని సముఖమునకు తోడ్కొని పోయిరి. అప్పుడు రాజసభలోని మంత్రులు హనుమను తన రాకకు గల కారసనమేమని అడుగగా, హనుమ తాను సుగ్రీవుని దూతగా వచ్చినానని చెప్పెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
నోట్: పూజశ్రీ శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు సుందరాకాండలోని ఈ 48 వ సర్గ పారాయణము చేసినచో శనిగ్రహ దోషము    శమించునని చెప్పియున్నారు.

No comments:

Post a Comment