Friday 10 January 2020

సుందర కాండము-19

శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-19
హనుమ రావణునికి హితమును ఉపదేశించుట

భీమ పరాక్రముడగు హనుమ రోషముచే ఎర్రబారిన కన్నులతో రావణుని చూచెను. హనుమ అతని తేజస్సుచే మోహము నొందెను.
అహో రూప మ౭హో ధైర్య మ౭హో సత్త్వ మ౭హో ద్యుతిః
అహో రాక్షస రాజస్య సర్వ లక్షణ యుక్తతా   5.49.17
 
య ద్య౭ధర్మో న బలవాన్ స్యా ద౭యం రాక్షసేశ్వరః
స్యా ద౭యం సుర లోకస్య సశక్ర స్యా౭పి రక్షితా 5.49.18

ఆహ! ఏమి రూపము? ఏమి ధైర్యము? ఏమి బలము? ఏమి కాంతి? సర్వ లక్షణములతో ఒప్పుతున్న ఈ రాక్షస రాజు అధర్మవర్తి గాకున్నచో మూడులోకములకు పాలకుడై యుండెడివాడు. అలానే హనుమను చూచి రావణుడు ఇతను మారు రూపమున వచ్చిన నందీశ్వరుడా! లేక బాణాసురుడా! అని అనుకోని అక్కడి మంత్రులతో "ఈతను ఎవరు, ఎచ్చట నుండి వచ్చాడు, ఏమి పని, వనమును పాడు చేయుటకు ఏమి హేతువు, యుద్ధము చేయుట వలన ఏమి ప్రయోజనము తెలుసుకొనుము" అనెను. అప్పుడు ప్రహస్తుడు హనుమతో తను రాకకు కారణమడిగెను. కాని హనుమ తాను సమాధానము చెప్పుటకు ప్రహస్తుడు తగడని అనుకొని రావణునితోనే, రామ సందేశమును చెప్పుటకు ఉద్యుక్తుడాయెను. హనుమ రావణునితో "నేను వానరుడిని. నీ దర్శనము దుర్లభమని, నీ దర్శనము కొరకై వనమును పాడు చేసితిని. యుద్ధము చేయుటకు రాక్షసులు రాగా దేహ రక్షణకై వారిని ఎదిరించి యుద్ధము చేసితిని. బ్రహ్మ వర ప్రభావము  వలన నన్ను ఎట్టి అస్త్రములు బంధించలేవు. నిన్ను చూడవలెనని కోరికతో బ్రహ్మాస్త్రమునకు కట్టుబడితిని. రాజ కార్యముచే, రాముని దూతగా నీ వద్దకు వచ్చితిని. నీకు మేలు కల్గించు కొన్ని మాటలు చెప్పెదను వినుము" అనెను. మహాబలుడగు రావణుని చూచి ఎట్టి తొట్రుబాటు లేక అర్థవంతములగు వాక్యములతో వానరోత్తముడు దశాననుని గూర్చి ఇట్లు పల్కెను.
మహాతేజశాలి అయిన రధాశ్వగజ బలములు గల దశరథుడు అను రాజు గలడు. సర్వసమర్థుడు, మహాపరాక్రమోపేతుడు, ధర్మానుమార్గానువర్తుడు అగు శ్రీరాముడు అతని పెద్దకొడుకు. తండ్రి ఆజ్ఞానుసారం అతను సోదరుడైన లక్ష్మణుడు. భార్యయైన సీతతో కలసి దండకారణ్యమున ప్రవేశించెను. మహాసాద్వి అయిన, అతని భార్య అపహరింపబడినది. రామలక్ష్మణులు సీతను వెతుకుచు ఋష్యమూక పర్వతమున ఉన్న సుగ్రీవునితో మైత్రిని చేసుకొని వాలిని ఒకే ఒక్క బాణముతో సంహరించి సుగ్రీవుని వానర, భల్లూకములకు ప్రభువుగా నియమించెను. సుగ్రీవుని ఆనతితో అశేష వానర సేనాని సకల దిశల యందును, భూమండలం నందును, పాతాళమున, ఆకాశమున వెతుకుతున్నారు. వారు మహాపరాక్రములు, అడ్డులేని గమనము గలవారు. నా పేరు వాయు పుత్రుడనైన  హనుమంతుడు. సీతాదేవి కొరకై తీవ్రవేగముతో నూరు యోజనముల సముద్రమును లంఘించి లంకకు వచ్చితిని. ఇచ్చట నాకు ఆమె కనబడినది. ధర్మార్థములను ఎరిగిన వాడివి. తపస్సుచేసి అనేక వరములు పొందిన వాడివి. అట్టి నీవు ధర్మవిరుద్ధముగా నీ మూలమునకే విచ్చిత్తి కలుగు పరసతులను బంధించుట తగదు. రామలక్ష్మణుల తీవ్ర బాణములకు ఎదురొడ్డి నిలబడుట ఎవ్వరికిని సాధ్యము కాదు. ముల్లోకములలోను రామునికి కీడు తలబెట్టినవారిని ఎవ్వరు రక్షింపలేరు. అందువలన ధర్మబద్ధముగా జానకిని శ్రీరామునికి అప్పచెప్పుము. సీత నీ పాలిట మృత్యుదేవత సుమా! నీ తపస్సు చేజేతులారా వ్యర్థము చేసుకొనుట ఉచితము కాదు. సుగ్రీవుడు కపీశ్వరుడు, శ్రీరాముడు మానవుడు. నీవు నరవానరుల వలన మరణము లేకుండా వరమును పొందలేదు కావున నిన్ను నీవు రక్షించుకోం జాలవు. ధర్మము, అధర్మము ఎప్పుడును కలసి యుండవు. ధర్మకార్యము వలన అధర్మ కార్యము నశించదు[1]. ఖరదూషణాదుల  వధను, వాలి వధను రామసుగ్రీవుల మైత్రిని గుర్తుచేసుకొని నీ హితమును గూర్చి బాగుగా ఆలోచించుము. నేనొక్కడినే నీ లంకను సర్వ నాశనము చేయుటకు సమర్థుడను. కాని నాకు శ్రీరాముని అనుమతి లేదు. సీతాదేవి తేజస్సుతో దగ్ధమైన ఈ లంకా నగరమును చూసి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొనుము. సకళత్ర, పుత్ర, మిత్ర, బాంధవ్యుల వినాశనమును కోరి తెచ్చుకొనకుము. నేను రామదూతను. విశేషించి వానరుడను కావున నాకు ఎట్టి పక్షపాతము లేదు. నా సత్య వచనమును ఆలకింపుము. శ్రీరాముడు రుద్రుని వలె సకల లోకములను సంహరించ గలడు మరల సృష్టించ గలడు. శ్రీరాముని ఎదిరించి యుద్ధము చేయుటకు ఏ విధముగానైనను, ఎవ్వరైనను, ఎచ్చటనైనను, ఏ కాలము నందును సమర్థులు కారు. శ్రీరాముని యెడల అపరాధమును జేసిన నీవు జీవించి యుండుట అసాధ్యము. ఈ విధముగా హనుమ నిర్భయముగా సహేతుకములైన మాటలు మాట్లాడెను. అప్రియములైన ఆ హితవచనములు వినిన రావణుడు హనుమను చంపుటకు ఆదేశించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] "ఆవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభామ్" అను ఆర్యోక్తి అనుసరించి జనులు పాపకర్మముల నివృత్తి కొరకై కొన్ని దాన ధర్మములు చేయుచుందురు. కాని అట్లు జరుగదు. అనన్య భక్తితో భగవంతుని సేవించిన మాత్రముననే వారు పాప ప్రవృత్తి నుండి బయిట పడుదురు.

No comments:

Post a Comment