Thursday 9 January 2020

సుందర కాండము-17




శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-17

అశోకవన విధ్వంసము, రాక్షస వధ
కార్యే కర్మణి నిర్దిష్టో యో బహూన్య౭పి సాధయేత్
పూర్వ కార్య విరోధేన స కార్యం కర్తుమ్ అర్హతి    5.41.5

న హ్యేకః సాధకో హేతుః స్వల్ప స్యా౭పీ హ కర్మణః
యో హ్యర్థం బహుధా వేద స సమర్థోఽర్థ సాధనే     5.41.6 

చేయవలసిన పని పూర్తియైన తర్వాత ఆ పనికి విరోధము కలుగకుండా దానికి సంబంధించిన అనేక కార్యములు చేయగలవాడే నిజమైన కార్యకర్త, సేవకుడు, దూత.  హనుమ చేయవలసిన ప్రధమ కార్యము సీతా దర్శనము. ఈ సందర్శన కార్యము రావణాసురుని శక్తి సామర్థ్యములు తెలుసుకొన్నప్పుడే ఆమెను రక్షించుట ద్వారా పూర్ణత చెందును. కావున సీతను చూచుట యను ప్రధమ కార్యమునకు హాని కలుగకుండా రావణ బలాదులను తెలుసుకొనుట వంటి ఇతర కార్యములను చేయుట అవసరమని హనుమ భావన. ఈ ప్రపంచమున పని స్వల్పమైనను ఒకే ఒక్క మార్గము ద్వారా దానిని సాధించుట కష్టము. కాబట్టి కార్యమును సాధించుటకు అనేక ఉపాయములను చూడగలిగిన వాడే సమర్ధుడైన సాధకుడు.

ఈ విధముగా హనుమ శత్రు బలము తెలుసుకొనగోరి, యుద్ధము జరిగినచో వారి బలములు తెలియగలవు అని  నిశ్చయించుకొనెను. అందుకు రావణునికి ప్రీతిపాత్రమైన ఈ అశోక వనము యొక్క ధ్వంసమే మేలు అని ఆలోచించి ఆ వనమును ధ్వంసము చేసెను. అక్కడ కాపలా యున్న రాక్షస స్త్రీలు పరుగు పరుగున సీతమ్మ దగ్గరకు వచ్చి ఆ మహాబలుడైన కోతి ఎవరని అడిగిరి. అందుకు సీత "అహి రెవ హ్యహేః పాదాన్ విజానాతి న సంశయః" (పాము జాడ పామే ఎరుగును. కామ రూపముతో వచ్చిన రాక్షసుడే అనుకొంటిని). ఇచ్చట సీత అసత్యము ఆడ వచ్చునా? హనుమ సీతకు ప్రాణ రక్షకుడు. సత్యము పలికినందువలన అతనికి అపాయము కలుగును కావున అట్లు చెప్పినది. ఇట్లే రాముడు కూడా అయోధ్య నుండి బయల్వెడలునప్పుడు దశరథుడు సుమంత్రుని రథము ఆపుమని అనెను. కానీ రాముడు సందడిలో వినపడలేదని మరునాడు రాజుకు చెప్పమని సుమంత్రునికి చెప్పెను. ఈ విధముగా రాముడు కూడా అసత్యము ఆడినాడు కదా. ఇది దోషము కాదా అను సందేహము వచ్చును. ఇచ్చట గమనించితే తండ్రి ఇచ్చిన సత్యవాక్యమును నిలుప వలెను. దశరథుడు ఆ దేశమునకు రాజు. అట్టి రాజు అసత్య వచనుడు కారాదు. అతని సత్యమును నిలుపుటకై కుమారుడైనను, మంత్రియైనను అసత్యమాడుటలో దోషము లేదు.  ఒక గొప్ప సత్యమును నిలబెట్టుటకు అవసరార్థము ఒక అసత్యము చెప్పుటలో దోషము లేదు. కానీ సీత మాత్రము హనుమను కాపాడవలెననే ఆదుర్దాతో, అతని శక్తి సామర్థ్యముల మీద పూర్తిగా నమ్మిక లేక అసత్యము ఆడి తన స్త్రీ సహజమైన బేలత్వమును చాటుకొన్నది. అంతియే గాక అరణ్య కాండలో మారీచుని మాయా అక్రనాదము విన్న తర్వాత రాముని శక్తి సామర్థ్యములపై రవ్వంత అపనమ్మకంతో, సంశయముతో రామునికి సహాయము చేయవలసినదిగా సీత, లక్ష్మణుని ఆదేశించి పరుష పదజాలంతో దూషించి కష్టములను కొనితెచ్చుకొన్నది. అట్టి సంశయమును రావణుడు తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. ప్రస్తుత కాలములో ఎదుటివాని శక్తిని తగిన అంచనా వేయకుండా  స్త్రీ స్వతంత్రముగా వ్యవహరించినచో ఇట్టి కష్టములే తనకు తన కుటుంబమునకు కలుగును. దేశ కాల పరిస్థితులను బట్టి స్త్రీ స్వభావము మారుతుండునని, మెరుపు లోని చాంచల్యము స్త్రీకి సహజము కానీ సీతకు అట్టి దోషములు లేవని అగస్త్య మహర్షి అరణ్య కాండలో శ్రీరామునికి చెప్పి యున్నాడు.  కానీ మాయా ప్రభావము వలన సీత కూడా అందుకు అతీతురాలు కాదని తెలియు చున్నది. తరువాత రాక్షస స్త్రీలు రావణుని వద్దకు యేగి ఒక మహావానరము అశోక వనమును ధ్వంసము చేసినదని, అది సీతతో మాట్లాడినదియని చెప్పిరి. ఆ మాటలు విన్న రావణుడు "దీప్తాభ్యా మివ దీపాభ్యాం సార్చిషస్నేహ బిందవః" కోపము కలిగిన అతని నేత్రములు నుండి కన్నీటి బిందువులు మండుచున్న దీపముల నుండి మంటతో నూనె బొట్లు పడినట్లు పడెను. వెంటనే రావణుడు హనుమను నిగ్రహించుటకు ఎనుబదివేల కింకరులను నియమించెను. వారిని చూచి తన మహాకాయమును పర్వతములాగా పెంచి తోరణముపై నుండి ఈ విధముగా జయధ్వానము చేసెను. (ఇది జయమంత్రము. నిత్యము చదువుకొన్నచో శత్రుబాధలు లేక విజయము చేకూరును).

జయ త్య౭తి బలో రామో లక్ష్మణ శ్చ మహా బలః
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణా౭భిపాలితః    5.42.33

దాసోఽహం కోసలేన్ద్రస్య  రామ స్యా౭క్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతా౭౭త్మజః 5.42.34

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్
శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః        5.42.35

అర్దయిత్వా పురీం ల౦కా మ౭భివాద్య చ మైథిలీమ్
సమృద్ధా౭ర్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ 5.42.36

మహాబల సంపన్నులైన రామలక్ష్మణులకు జయము. రాముని రక్షణలో యున్న సుగ్రీవునకు జయము. అట్టి రామునకు నేను దాసుడను. శత్రుసైన్యములను దునుమాడ సమర్థత గల వాయుపుత్రుడనైన నేను హనుమంతుడను. వేయిమంది రావణులు వచ్చినను నన్ను యుద్ధములో ఎదిరింపలేరు. వారిని శిలలతో, వృక్షములతో సకల రాక్షసులను నాశనము చేసి లంకాపురిని మర్దించి, మైథిలికి నమస్కరించి కార్యమును సాధించి అందరూ చూచుచుండగా వెళ్లెదను.  ఈ విధముగా ఘోషణము చేసి గరుత్మంతుని వేగమున వారి నందరిని హతమార్చెను. శత్రువులను చంపుట అను కార్యము చేయువాడను తాను కాదనియు, ఆ కర్మ తనది కాదనియు, దాని వలన కలుగు కష్టనష్టములు తనివి కాదనియు భావించుతూ, అహంకారమును వీడి హనుమ కర్మ చేయుచుండెను. భగవద్గీత లో కూడ శ్రీక్రుష్ణుడు నిష్కామ కర్మ చేయమని చెప్తాడు. భగవాన్ రమణులు చెపుతూ .. "నేను" అనే అహంకారము ను వదలి మౌనము, శాంతి (limitless contentment) అనే సాధనాలతో అత్మస్వరూపమును ఎరిగి, ఆత్మసాక్షాత్కారము పొంద వలసి ఉన్నది. దీనినే భగవత్ స్వరూపము, భగవత్ సాక్షాత్కారము అనవచ్చు. జీవుని యొక్క సహజ ప్రశాంత స్థితియే"శివము" గా గుర్తించవచ్చు. ధాన్యము యొక్క పొట్టును వేరు చేస్తే, దానినే బియ్యము గా గుర్తించవచ్చు. Similarly, so long as one is bound by karma one remain as "jiva". When the bond of ignorance is broken, one shines as "SIVA", కావున జీవునికి, శివునికి బేధము లేదు. దీనిని సూచించుటకు హనుమ తోరణముపై కూర్చుండెను. మానవునికి విరోధులు ముఖ్యముగా మువ్వురు. అవి నేను స్వతంత్రుడను అనుకొనుట, తనను తాను రక్షించుకోగలను అనుకొనుట, తాను చేయు కర్మలు తనకొరకు అనుకొనుట. ఈ మూడింటిని జయించుటయే విరోధి విజయము. గుమ్మమునకు గల నాలుగు కమ్ములలో హనుమ పై కమ్ముపై నిలిచి యుండును. అదియే తోరణమునకు చిహ్నము. ఆ తర్వాత యుద్ధమునకు వచ్చిన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలినిని, మంత్రి సుతులైన ఏడుగురిని, విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘసు, భాసకర్ని మొదలగు సేనాగ్ర నాయకులను వారి వారి సైన్యముతో సహా సంహరించెను. అప్పుడు రావణుని ఆజ్ఞ మేరకు అక్షకుమారుడు యుద్ధమునకు బయలుదేరెను. అక్షకుమారునికి హనుమను చూడగానే అతనిపై గౌరవమేర్పడెను. అప్పుడు అతను హనుమ వేగమును, బలమును, పరాక్రమమును నిర్ధారించుకొని హనుమతో యుద్ధమునకు పూనుకొనెను. మహాపరాక్రమముతో పోరాడుతున్న బాలుడైన ఆ అక్షకుమారుడిపై జాలిగల్గినా, శత్రువుపై జాలి గూడదని తలచి, హనుమ అతని పాదములు పట్టుకొని గరుత్మంతుడు పామును కొట్టినట్లు, ఆ అక్షకుమారుడిని పలుమార్లు నేలకేసి కొట్టి చంపెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment