Tuesday 28 January 2020

యుద్ధ కాండము-12

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-12
సముద్రముపై సేతువును నిర్మించుట
సముద్రుడు చెప్పిన పిమ్మట నలుడు రామునితో ఇట్లు పలికెను. మందర పర్వతము నందున్న మా తల్లిని ప్రేమించి ఆమె యందు తన అంశచే నేను జనియించగా మా తల్లికి విశ్వకర్మ వరమొసగినాడు కావున నేను సేతువును నిర్మింప గలను. అందుకు వానరులందరూ సేతువు నిర్మాణమునకు సహకరింతురు" అని చెప్పగనే శ్రీరాముడు సేతువు నిర్మాణమునకు ఆజ్ఞాపించెను. అంత పర్వత సదృశులైన వానరులు అడవులలోని అనేక రకములైన చెట్లు, పెద్ద పెద్ద పాషాణములు, పర్వతములు సముద్రములో పడవైచిరి. కొందరు నూరు యోజనముల సముద్రముపై మార్గ నిర్ధేశము చేయుచు సూత్రము కట్టిరి. పర్వత శిఖరములను మొదలగు వాటిని ఎత్తి పడవైచి మధ్యలో కర్రలను, గడ్డిమొక్కలను వేసి బంధించిరి. నిర్మాణము మొదలిడిన మొదటి రోజున పదునాలుగు యోజనములు, రెండవ రోజున ఇరువది యోజనములు, మూడవ రోజున ఇరువది ఒక్క యోజనములు, నాలుగవ రోజున   ఇరువది రెండు యోజనములు ఐదవ రోజున ఇరువది మూడు యోజనములు నిర్మాణము చేసిరి. ఈ విధముగా నూరు యోజనముల పొడవు, పది యోజనముల వెడల్పుతో సేతు నిర్మాణము సమాప్తము చేసిరి. అది ఆకాశమున స్వాతీ పథము[1] వలె దర్శనీయముగా యుండెను. విభీషణుడు సచివులతో గూడి గదాపాణియై సముద్రము ఆవల శత్రుపక్షము నుండి కాపాడు చుండెను. సేతువు పూర్తి అయిన పిమ్మట రాముడు హనుమ భుజములపై, లక్ష్మణుడు అంగదుని భుజములపై కూర్చుని ధనుర్ధారియై సేనకు అగ్రభాగమున నిలిచి ముందుకు సాగెను.
Dr. Vedhavyasa, IAS, తన "శ్రీరామ చరితామృతము" గ్రంథములో రామాయణములోని లంకకు, ప్రస్తుతము మనకు కనిపించే సింహళ ద్వీపమైన శ్రీలంకకు సంబంధము లేదని పరిశోధనాత్మక చారిత్రాత్మక ఆధారములతో నిరూపించారు. అవి ఒక్కసారి గమనిద్దాము. రామాయణములో ఎక్కడ "సింహళము" అనే పేరు కనబడదు. వ్యాస మహర్షి రచించిన సంస్కృత భాగవత పురాణములో సింహళము వేరుగాను, లంక వేరుగాను వర్ణించబడినది. వాల్మీకి రామాయణము కిష్కింధ కాండ నాలుగవ సర్గలో సుగ్రీవుడు సీతను వెతుకుట కోసము హనుమాధులను దక్షిణ దిక్కుకు పొమ్మనెను. దక్షిణము నకు పోవు మార్గము తెలియ జేస్తూ వింధ్య పర్వత శ్రేణి మొదలుకొని దక్షిణ దిక్కుగా కన్యాకుమారి అగ్రము వరకు చేరవలెను. ఆ తర్వాత నూరు యోజనముల సముద్రమును దాటిన తర్వాత లంకకు చేరవచ్చును. దక్షిణ సముద్రము తాకు చోట మహేంద్రగిరి అను పర్వతము గలదు. హనుమ లంకకు ఆ పర్వతము నుంచియే మొదలిడెను. దానిని బట్టి చూడగా పోవలసిన దారిలో మహేంద్ర పర్వతము ముఖ్యమైన కొండ గుర్తు. పశ్చిమ కనుమలలో అరేబియా సముద్రము తీరము పొడవునా గల పర్వత పంక్తులలో మహేంద్ర పర్వతమే ఆఖరిది. దీనికి జరిగిన ముందు సంఘటనలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శ్రీరాముడు వాలి వధ తర్వాత ప్రస్రవణ పర్వతము (గిరి) వద్ధ నాలుగు నెలలు ఒక కొండ గుహలో యున్నాడు.  ఇది కిష్కింధకు పశ్చిమముగా అనగా కర్ణాటక రాష్ట్రములోని హాస్పెటకు ఎనిమిది మైళ్ళ దూరములో పదిహేను డిగ్రీల ఉత్తరముగా ప్రస్రవణగిరి అంచులు యున్నవి. ఈ కొండల్లో ఉత్తరంగా యున్న పర్వత శ్రేణిని "వింధ్య పర్వత శ్రేణి" అని పేరు. దీనిని బట్టి చూడగా పశ్చిమ కనుమలను నాలుగు భాగాలుగా చేయగా పదిహేను డిగ్రీల ఉత్తర కొండలను వింధ్య పర్వత శ్రేణి అని, పదిహేను డిగ్రీల దక్షిణంగా పాలఘాట్ లోయల వరకు కొండలను సహ్యాద్రి శ్రేణి అని, పాలఘాట్ నుండి తామ్రపర్ణి నది వరకు వరకు గల కొండలు మలయ పర్వత శ్రేణి అని తామ్రపర్ణి నది నుండి దక్షిణ సముద్రము వరకు వ్యాపించి యున్న పర్వత శ్రేణులకు మహేంద్ర పర్వత శ్రేణి అని చెప్పబడినది. ఈ మహేంద్ర పర్వతము కన్యాకుమారి వద్ద నుండి సముద్రములో కలియు చున్నది. ఇక్కడ నుండి నూరు యోజనములు రావణ పాలిత లంక. నూరు యోజనములు దూరము అనగా ఎంత? జ్యోతిష శాస్త్రము మరియు ఖగోళ గణిత శాస్త్రము లలో తెలిపిన మానమును బట్టి ఒక్క యోజనము 4.92 మైళ్లకు సమానము. అంటే నూరు యోజనములు 492 మైళ్లకు సమానము. భూమధ్య రేఖ నుండి కన్యాకుమారి అగ్రము ఎనిమిది డిగ్రీల దూరములో కలదు. కావున ఒక డిగ్రీకి అరువది తొమ్మిది (69 ) మైళ్ళు కాబట్టి కన్యాకుమారి నుండి 552 మైళ్ళ దూరములో భూమధ్య రేఖ కలదు. కావున లంక ఈ భూమధ్య రేఖకు ఉత్తరంగా ప్రారంభమై అక్కడ నుండి దక్షిణంగా వ్యాపించి యున్నది. కానీ ఇప్పటి శ్రీలంక అనే సింహళ దేశము కన్యాకుమారి అగ్రమునకు తిన్నగా దక్షిణముగా గాకుండా కొంచెము తూర్పుగా యున్నది.  ఇంతే గాక యుద్ధకాండము నాలుగవ సర్గలో దండయాత్రకు సంబంధించిన వివరణ ఇస్తూ శ్రీరాముడు వానర సేనతో కిష్కింధ నుండి పశ్చిమంగా ప్రయాణము చేసి దక్షిణంగా యున్న సహ్యాద్రి పర్వత శ్రేణిని, అక్కడ నుంచి దక్షిణంగా మహేంద్ర పర్వతములను దాటి సముద్ర తీరమునకు చేరెను అని చెప్తారు. అక్కడ నుంచి నలుడు తిన్నగా నూరు యోజనముల సేతువును నిర్మిస్తాడు. ఈనాటి రామేశ్వరము వద్ద కొండలుగాని, మహేంద్రగిరి పర్వత శ్రేణులు గాని లేవు. కావున శ్రీరాముడు నిర్మించిన సేతువు ఈనాటి రామేశ్వరము వద్ద కాదు. ఎందుకనగా రామేశ్వరము నుంచి సింహళమునకు దూరము ఏబది మైళ్ళ లోపే. జ్యోతిష్య శాస్త్ర గ్రంథములు చూడగా ఆర్యభట్టు, వరాహమిహరుడు, బ్రహ్మగుప్తులు లంకాపట్టణము భూమధ్యరేఖ వద్దనే యున్నట్లు వర్ణించబడినది. ఈ లంకాద్వీపము నిరక్షర రేఖకు సరిగ్గా నెత్తిమీద యున్నది. ఈనాటి సైన్సు లెక్కల ప్రకారము గ్రీన్విచ్ కు తూర్పుగా 77  డిగ్రీల వద్ద కన్యాకుమారి, ఉజ్జయిని, ఢిల్లీ యుండును. ప్రాచీన జ్యోతిష్యులు ఈ రేఖను "లంక రేఖ" గా చెప్పిరి. రావణాసురుని లంక రామాయణ కాలం తర్వాత జగత్ప్రళయము సంభవించి సముద్రములో మునిగిపోయినది. కాలానుగుణంగా యున్న నానుడిని బట్టి శ్రీరాముని ఆజ్ఞచే హనుమ సువర్ణమైన లంకను త్రేతాయుగము తర్వాత సముద్ర గర్భములో ముంచివేసెను.  జంబూద్వీప నవ వర్షములు ఈ క్రింద యీయబడిన రేఖాచిత్రము ద్వారా సూచించబడినది.
Note: ఈ రేఖా చిత్రం యొక్క పిడిఎఫ్ క్రింద అటాచ్ చేయబడినది.
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు ఆకాశమున పయనించు మార్గములను వాయు పురాణము మూడు విధములుగా పేర్కొనుచున్నది అవి క్రమముగా ౧. ఉత్తర మార్గము (అశ్వని, భరణి, కృత్తిక - నాగవీధి, రోహిణి, మృగశిర, ఆరుద్ర - గజవీధి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష - ఐరావతా వీధి), ౨. మధ్య మార్గము (మఖ, పుబ్బ, ఉత్తర - అర్షభీ వీధి, హస్త, చిత్త, స్వాతి - గోవీధి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ రాజగవీధి), ౩. దక్షిణ మార్గము (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ - అజవీధి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం - మార్గీ వీధి, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి - వైశ్వానరీ వీధి)

No comments:

Post a Comment