Saturday 11 January 2020

సుందర కాండము-21

శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-21
లంకా దహనము
రావణుని ఆదేశము కాగానే రాక్షసులు నూలు బట్టలను హనుమ తోకకు చుట్టి నూనెతో తడిపి నిప్పంటించితిరి. అప్పుడు వారు హనుమను పట్టణము అంతయు త్రిప్పిరి. హనుమ - రాత్రిళ్ళు తిరిగి నందు వలన దుర్గములను బాగుగా చూడలేదు. మరొకసారి అన్నియు చూచి వీరి బలమును, బలగములను అంచనా వేయుదునని అలోచించి మిన్నకుండెను. ఈ విషయము తెలుసుకొన్న సీత హనుమకు మంగళము కలుగ వలెనని అగ్నిహోత్రుని ఈ విధముగా ఉపాశించెను.
యద్య౭స్తి పతి శుశ్రూషా యద్య౭స్తి చరితం తపః
యది చా స్త్యేక పత్నీ త్వం శీతో భవ హనూమతః    5.53.28
యది కించి ద౭నుక్రోశ స్తస్య మయ్య౭స్తి ధీమతః
యది వా భాగ్య శేషో మే శీతో భవ హనూమతః           5.53.29
యది మాం వృత్త సంపన్నాం త త్సమాగమ లాలసామ్
స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః            5.53.30
యది మాం తారయే దా౭ర్యః సుగ్రీవః సత్య సంగరః
అస్మా ద్దుఃఖా౦బు సంరోధా చ్ఛీతో భవ హనూమతః 5.53.31
"నేనే పతి శుశ్రూష చేసిన దానినైనచో, నేను ఆచరించిన తపము యున్నచో, పతివ్రతను అయినచో, నా యందు రామచంద్రునకు దయ యున్నచో, నాకేమైనా భాగ్య శేషము యున్నచో, హనుమ నా పాతివ్రత్యమును గుర్తించిన వాడే అయినచో, నన్ను రామునితో కలుపు వలెనని ఆరాట పడుచున్నచో, సత్యవ్రతుడు, పూజ్యుడు అగు సుగ్రీవుడు నన్నీ దుఃఖము నుండి తరింప జేయువాడైనచో ఓ అగ్నిదేవా! ఈ హనుమను చల్లగా చూడుము".  అని ప్రార్థించెను. అప్పుడు హనుమ లాంగూలము దహింపబడుచున్నను బాధ కలుగకపోవుట గమనించి హనుమ ఇట్లు ఆలోచింపసాగెను. "సీతమ్మకు నాపై గల జాలి, రాముని తేజస్సు, మా తండ్రి వాయుదేవునికి అగ్నితో గల స్నేహము వలన నన్ను అగ్ని  దహించడము లేదు". వెంటనే హనుమ ఒక్కసారి గర్జించి పైకి లేచి అక్కడి దుర్గములు, భవనములు, మొదలగునవి అన్నియు దహించి వేసెను. వేగముగల హనుమ లంకాపురము నంతయును రుద్రుడు త్రిపురములను భస్మము చేసినట్లు భస్మము చేసెను. ఈ విధముగా అనేకులగు రాక్షసులను చంపి, వనమును పాడు చేసి, రాక్షస భవనములను అగ్నికి ఆహుతి చేసి, మనసులో శ్రీరాముని స్మరించి నిలిచెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment