Saturday 18 January 2020

యుద్ధ కాండము-3 om sriraam ***



[5:55 AM, 1/19/2020] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-3
 
రావణుడు యుద్ధమునకై మంత్రాలోచన
హనుమ లంకానగరమున ఒనర్చిన ఘోరకృత్యములకు రావణుడు ఎంతయో ఖిన్నుడయ్యెను. పిమ్మట సిగ్గుతో తలవంచుకొనినవాడై రాక్షసులతో ... "ఎవరును ప్రవేశింప వీలుకాని లంకానగరములో ఒక వానరుడు జానకిని దర్శించి అనేక విధములుగా లంకానగరమును అల్లకల్లోలం చేసెను. కావున ఇప్పుడు మీ క్షేమముకై చేయవలసిన కర్తవ్యమును తెలుపుడి. ఇక్కడ రావణుడు తన అపరాధమును కప్పి పుచ్చుకొనుచు తాను ప్రజల కోసమే అని అంటున్నాడు. శ్రీరాముడు మన లంకానగరముపై దాడి చేయుటకు వేలకొలది వానరులతో రాబొవుతున్నాడు. అతను తన బలముతో గూడి యుక్తియుక్తముగా సాహసము చేసి, తన పరాక్రమముతో సేతువును నిర్మించిగాని, జలములను ఇంకించి గాని సముద్రమును దాటగలడు. కావున తగిన సూచనలు చేయుడు". అనెను. అప్పుడు రాక్షసులు తమ తమ వైభవములను, పరాక్రమములను ప్రస్తుతించుకొని, రావణుని పరాక్రమమును గుర్తు చేసి, ఇంద్రజిత్తు యొక్క పరాక్రమమును గుర్తు చేసి రాముడు నీకు సరిసాటి కాదని చెపుతూ ఇంద్రజిత్తు ఒక్కడే ససైన్యముగా శ్రీరాముని హతమార్చగలడని రావణునికి విన్నవించిరి. ప్రహస్తుడు మున్నగు వారు ఎవరికీ వారే తానొక్కడినే రాముని జయించగలమని ప్రగల్బములు పలికిరి. విభీషణుని ఉపదేశము

రాక్షసుల యొక్క సమరోత్సాహమును చూచి విభీషణుడు వినమ్రముతో ఇట్లు పలికెను.
"రాజనీతిని అనుసరించి ముందుగా సామ, దాన, భేదోపాయములను ప్రయోగించవలెను. ఈ మూడిటితో శత్రువిజయము లభించనప్పుడు చివరిదైన దండోపాయమును చేపట్టవలెను. శత్రువులు ఇంద్రియ సుఖములకు లోనై జాగరూకులు కానివారి పైనను, విరక్తులై రాజ్యపాలన పైన శ్రద్ధ చూపనప్పుడు, సామంత రాజులు వలన చిక్కులు పాలైనప్పుడు, దైవ వశముచే సంపదలు కోల్పోయిన వారిమీదను, రాజ్య పాలన బాలుర మరియు వృద్ధుల చేతిలో యున్నప్పుడు మంత్రులతో సంప్రదించి యుద్ధము చేసి విజయము సాధించవచ్చును. (ఇరువది రకముల శత్రువులతో సంధి చేసుకొనుటకు అంగీకరింప కూడదని కామందక నీతిశాస్త్రము చెప్పుచున్నది అవి వరుసగా .. బాలుడు, వృద్ధుడు, దీర్ఘరోగి, జ్ఞాతులచే వెలివేయబడినవాడు, పిరికివాడు, పిరికి పరిజనము గలవాడు, లోభము కలవాడు, లోభముగల పరిజనము గలవాడు, ప్రజల యొక్క అనురాగము కోల్పోయినవాడు, విషయభోగములపై ఆసక్తి గలవాడు, మంత్రిమండలిలో భిన్నాభిప్రాయము ఉన్నప్పుడు, దేవతలను, బ్రాహ్మణులను నిందించువాడు, దైవము ప్రతికూలంగా యున్నప్పుడు, అంతయు దైవమే చేయునని పౌరుషమును వదలినవాడు, కరువు, అపపదలు ముంచెత్తినవాడు, సైన్యములో కలతలు ఉన్నవాడు, తన దేశములో తాను లేనివాడు, పెక్కుమంది శత్రువులు ఒక్కమారు చుట్టినవాడు, మరణము ఆసన్నమైనవాడు, సత్యధర్మములను వీడినవాడు) కానీ శ్రీరాముడు కామక్రోధములను జయించి అజేయుడై, యుద్ధమునకు సన్నద్ధుడై యున్నాడు. దుస్సాధ్యమైన సముద్రమును లంఘించి హనుమ లంకకు చేరెను కావున ఈ విషయము కూడా ఆలోచించవలసినది”. 

కిం చ రాక్షస రాజస్య రామేణా౭పకృతం పురా
ఆజహార జనస్థానా ద్యస్య భార్యాం యశస్వినః     6.9.13

ఖరో యద్య౭తివృత్త స్తు రామేణ నిహతో రణే
అవశ్యం ప్రాణినాం ప్రాణా రక్షితవ్యా యథా బలమ్ 6.9.14
 
అ యశస్య మ౭నాయుష్యం పర దారా౭భిమర్శనం
అర్థ క్షయ కరం ఘోరం పాపస్య చ పునర్భవం     6.9.15
 
త న్నిమిత్తం వైదేహీ భయం నః సుమహ ద్భవేత్
ఆహృతా సా పరిత్యాజ్యా కలహా౭ర్థే కృతే న కిమ్ 6.9.16
 
ఇంతకు రాముడు, రావణునికి చేసిన అపరాధము ఏది? మనప్రభువే జగత్ప్రసిద్ధుడైన రాముని భార్యను అపహరించెను. ఖరుడు రాముని వధించుటకు సిద్ధపడినప్పుడు, రాముడు ప్రాణాపాయస్థితి కలిగినది కావున తనను తాను రక్షించుట కొరకై రాముడు ఖరుని సంహరించెను. పరస్త్రీని తాకుట వలన కీర్తిప్రతిష్టలు దెబ్బతినును. ఆయువు క్షీణించును, సమస్త సంపదలు హరించును, అట్టి పాపాత్మునకు నీచ జన్మ ప్రాప్తించును. కావున అపహరించిన సీతాదేవిని వారికి అప్పగించుట సముచితము.  రావణుడు విభీషణుని పలుకులు విని తన భవనములోనికి వెళ్లెను. పిమ్మట విభీషణుడు రావణ భవనమునకు ఏగి మృదువుగా ఇట్లు విన్నవించాడు. "అన్నా! సీతమ్మను తెచ్చిన దగ్గరనుంచి అనేకమైన అశుభ సూచనలు గోచరించుచున్నవి. కావున నీకు సమ్మతి యైనచో శ్రీరామునికి సీతను అప్పగించుము. అదియే  మన తప్పిదములకు ప్రాయశ్చిత్తము" అందుకు రావణుడు క్రోధావేశుడై మైథిలిని అప్పగించుటకు ఇష్టపడక సోదరుడిని అచట నుండి పంపివైచెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
ప్రాంజలి ప్రభ ---  మల్లాప్రగడ రామకృష్ణ 

మల్ల 

No comments:

Post a Comment