Thursday 9 January 2020

సుందర కాండము-16





శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-16
 
సీతాదేవిచే కాకాసుర వృత్తాంతము, చూడామణి ప్రధానము
సీతాదేవి ఆనందించినదియై హనుమతో రామలక్ష్మణుల కుశలములు, వారి కార్యసన్నద్ధత గురించి అడిగెను. జనస్థానములో శ్రీరాముడు ఒక్కడే పదునాలుగు వేల మంది రాక్షసులను సంహరించెను. అట్టి పురుష శ్రేష్ఠుడు ఆపదలచే చలించు వాడు కాడు. నాకు ఇంకా రెండు నెలల సమయము మాత్రమే యున్నది. కావున రాముని త్వరగా తీసుకొని వచ్చి నన్ను చెర నుంచి విడిపింపుము అని అనెను. అప్పుడు హనుమ సీతతో నీ అనుమతి అయితే ఇప్పుడే నేను నిన్ను రాముని దగ్గరకు చేర్చగలను అని అనగా సీత రవ్వంత హనుమ శక్తి సామర్థ్యములకు శంకించినను, తరువాత అతని శక్తిని చూసి ఉత్తమ పతివ్రత అయిన సీత అందుకు మృదువుగా నిరాకరించెను.
 
(ఇక్కడ గమనించితే రావణుడు సీతను బలముతో తీసుకొని వచ్చెను కానీ తనంతట తానుగా పరపురుషుని స్పర్శ ఇష్టపడదు. ఆధ్యాత్మిక శాస్త్ర దృష్టితో సీత నిర్ణయము సరియైనదే. పరపురుషుడనగా ఇచ్చట పరధర్మము లేదా పరవృత్తి. అటువంటి పరధర్మము యొక్క భుజములపై కూర్చొని స్వస్థానమునకు వెళ్ళుట యోగ్యము కాదు. గీతలో ఈ పరధర్మ స్వీకారం నిషేధించబడినది.
 
శ్లో|| శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
      స్వధర్మో నిథనం శ్రేయః పరధర్మో భయావహః
 
పరవృత్తి రూప హనుమానుని స్పర్శ సీత స్వీకరించదు. రామ రావణుల వృత్తి సంఘర్షణ జరిగి, రావణ వృత్తిని జయించి, రాముడు తనదైన సీతావృత్తిని స్వీకరింప వలెను. అదియే శ్రేయస్కరమైనది).
అందుకు హనుమ మిక్కిలి సంతోషించి రాముడు గుర్తింపగల ఏదైనా అబిజ్ఞానమును ఒసగమని కోరెను. అప్పుడు సీత గద్గద స్వరముతో కాకాసురుని కథను రామునికి గుర్తుగా ఈ విధముగా తెలియ చేయు చున్నది.
 
శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా                 5.39.12
తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుణ్డయత్
తమ్ అహం లోష్టమ్ ఉద్యమ్య వారయామి స్మ వాయసం  5.39.15
 
దారయన్ స చ మాం కాక  స్త త్రైవ పరిలీయతే
న చా౭ప్యుపారమ న్మాంసా ద్భక్షా౭ర్థీ బలి భోజనః          5.39.16
ఆసీనస్య చ తే శ్రాన్తా పున రుత్స౦గమ్ ఆవిశమ్
 
క్రుధ్యన్తీ చ ప్రహృష్టేన త్వయా౭హం పరిసాన్త్వితాః     5.39.19
బాష్ప పూర్ణ ముఖీ మన్దం చక్షుషీ పరిమార్జతీ
లక్షితా౭హం త్వయా నాథ వాయసేన ప్రకోపితా            5.39.20
 
పరిశ్రమాత్ ప్రసుప్తా శ్చ రాఘవా౭౦కే ప్య౭హమ్ చిరం
పర్యాయేణ ప్రసుప్త శ్చ మ మా౭౦కే భరతా౭గ్రజః          5.39.21
స తత్ర పునరే నాథ వాయస స్సముపాగమత్
 
తత సుప్తప్రబుద్దాం మాం రామాస్యాంకా త్సముత్థితామ్  5.39.22
వాయస స్సహసాగమ్య విదధార స్తనాంతరే
పునః ్పున రథోత్పత్య విదధార స మాం భృశమ్    5.39.23
స దర్భ సంస్తరా ద్గృహ్య బ్రహ్మణోఽస్త్రేణ యోజయత్ 5.39.30
స దీప్త ఇవ కాలా౭గ్ని ర్జజ్వాలా౭భిముఖో ద్విజమ్
స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి         5.39.31
 
తత స్తం వాయసం దర్భ స్సో౭మ్బరే౭నుజగామ హ
అనుసృష్ట  స్తదా కాకో జగామ వివిధాం గతిమ్               5.39.32
న శర్మ లబ్ధ్వా లోకేషు త్వా మేవ శరణం గతః              5.39.35
మత్కృతే కాక మాత్రేఽపి బ్రహ్మా౭స్త్రం సముదీరితమ్   5.39.39
 
కస్మా ద్యో మాం హరే త్త్వత్తః క్షమసే తం మహీపతే
తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్   5.39.69
ప్రదేయో రాఘవా యేతి సీతా హనుమతే దదౌ
 
"చిత్రకూటమిలో ఒకనాడు నేను అలసి రాముని తొడపై పరుంటిని. అప్పుడు మాంసము నందు ఆసక్తి గల ఒక కాకి నా గుండెలపై గీరుచు కొరికెను. ఈ విధముగా అది నేను ఎంత ప్రయత్నించినను పోకుండెను. ఆ విధముగా అలసి పోతిని. కొంతతడవకు రాముడు నా ఒడిలో పరుండెను. మరల ఆ వాయసము ఎగిరి వచ్చి నా వక్ష స్థలమును గోళ్ళతో గీరగా, నా గుండెల నుండి వచ్చిన రక్త బిందువులతో తడిసి రాముడు మేల్కొనెను. అందుకు రాముడు మిగుల కోపించి అక్కడి ఒక దర్భను (గరిక) బ్రహ్మాస్త్రమున అభిమంత్రించి వాయసముపై వదిలెను. ఇంద్రుని కుమారుడైన ఆ వాయసమునకు ముల్లోకములలో ఎవరును రక్షించ లేకపోయిరి. చివరకు అది తిరిగి రాముని శరణు జొచ్చినది. శరణు పొందిన కాకము ఒక కంటిని మాత్రమే ఆ అస్త్రమునకు ఇచ్చి దాశరథునికి నమస్కరించి వెడలి పోయెను. అట్టి కాకము మీద నాడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన రాముడు ఈనాడు నన్ను రక్షించుటలో జాగు యేల?".  ఇట్లు చెప్పి వస్త్రములో దాచి యుంచిన దివ్యమగు చూడామణిని[1] తీసి రామునికి ఒసగమని సీత హనుమకు ఇచ్చెను అట్లా మణిని పుచ్చుకొని హనుమ సీతకు నమస్కరించి వెనుకకు వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను. 
 
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] రత్నాకరం నందు పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు, వరుణనునికి ఇవ్వగా అతడు జనకునికి ఇచ్చెను. జనకుడు ఈ మణిని వివాహకాల సమయమున తన భార్య ద్వారా సీతకు ఇచ్చెను
--(())--

No comments:

Post a Comment