Wednesday 22 January 2020

యుద్ధ కాండము-6


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-6
శరణాగతి
భగవంతుని చేరడానికి ముఖ్యమైన అడ్డంకి అహంభావం. ఆ అహంకారాన్ని వీడి శరణు వేడితే ఆ భగవంతుడే దిగివచ్చి, భక్తుని వశమౌతాడు. సంపూర్ణ శరణాగతి పొందడమే ఆయన్ని చేరే సూటిమార్గం. అని చెప్పే కథే గజేంద్రమోక్షం. 
అజ్ఞానముచే ప్రత్యక్షంగా కనబడే శరీరమునకు, శరీర సౌఖ్యమునకు కావలసిన వాటినే మనస్సు కోరుకొనును. ఇట్టి కోరికలని కామము అందురు. కామములలో ఎక్కువగా మానవుడిని లొంగదీసుకొనెడివి స్త్రీకి పురుషుని విషయమున, పురుషునకు స్త్రీ విషయమున కలిగేది కామము. అయితే అట్టి కామములు శాస్త్ర విహితముగా యుండవలెను. అజ్ఞానముచే కలిగిన అహంకారము వలన శరీరమే తాను అనుకొనుట, శరీరమునకు సంబంధించినవి అన్నియు తనవి అనుకొనుచు, శరీరమునకు సంబంధించిన సుఖమును పొందవలెనని మనస్సు ఆరాట పడును. అట్టి మనస్సును వశపరచుకొనుటకు మానవుడు ప్రయత్నింప వలెను. శ్రీరామాయణము వాచ్యార్థమైన రామచరితములో ఆత్మ, పరమాత్మల కథను, మనసును జయించవలసిన విధానమును నిరూపించింది. అందుకనే శ్రీరామాయణము వేదము. మనస్సును జయించి మానవుడు పురుషార్థమును పొందుటకు, ఎవరు ఇట్టి భవసాగరమును దాటుటకు సమర్థులో యోచించి శరణాగతి పొందవలెను. భగవంతుని పొందుటకు ఎన్నియో ఉపాయములు యున్నవి. భగవంతునికి ప్రీతి కలుగునట్లు ధర్మబద్ధముగా జీవించుట, అహంకారము వీడుట మొదలగునవి. కానీ ఇవి అన్నియు ఆచరణలో కష్టము. అన్నింటికన్నా ప్రధాన ఉపాయము భక్తి, శరణాగతి. శరణాగతియే అన్నింటికన్నా ముఖ్యము. అదియే సర్వ ఉపనిషత్ సారము. శరణాగతిని పొందవలసిన వాడు రాముడే. కానీ ఒక సందేహము వచ్చును. రాముడు మానవుడు కాన ఎట్లు శరణాగతి చేయగలడు? రాముడు సత్యనిష్ఠాగరిష్ఠుడు అయినందున సర్వ సమర్థుడు అని ఇంతకు ముందు చర్చించుకొన్నాము. శరణాగతికి పూర్తి నమ్మకము, విశ్వాసము ముఖ్యము. అట్టి నమ్మకము కలిగిన రాయి, రప్ప, చెట్టు, చేమ అన్నియు శరణాగతి చేయగలవు. మూఢ భక్తితో గ్రామీణులు, ఆదివాసీలు అలాగుననే చేయుదురు.  శరీరభావము తనది కాదు అనుకున్నప్పుడు అన్నియు శరణాగతికి సమర్థములే.

( ఉదాహరణకు పూర్తి నమ్మకంతో మనము కొలుచుచున్న గురుస్వరూపులైన సాయిబాబా, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు గాని, క్రిస్టియన్స్ కొలుచుచున్న ఏసుక్రీస్తు కానీ, ముస్లిమ్స్ కొలుచుచున్న అల్లా కానీ బౌద్ధము ఆరాధించుచున్న బుద్ధుడు కానీ శరణాగతి చేయదగినవారే.  వేదమే సత్యమని వేదకాలపు మహర్షులు, పరమాత్ముడే ఎకైక సత్యమని త్రేతాయుగ, ద్వాపరయుగంలలో, ఆత్మయే సత్యము కఠోరమైన తపస్సు ద్వారా ఆత్మ సుదర్శనం అగునని మహావీరుడు, నిర్వాణము ద్వారా ఉన్నత స్థితి పొందవచ్చని గౌతమ బుద్ధుడు, ప్రార్థన వలన ఈశ్వరుడుని పొందవచ్చని జీసస్, సర్వాంతర్యామి అయిన అల్లా తప్ప వేరొక భగవంతుడు లేడని మహమ్మద్ ప్రవక్త, రామ నామమే స్థిరమైనది అని సంత్ కబీర్ దాస్, ఇంకా అనేక మంది గురువులు బోధించారు. (స్వామి అడగడానంద "యథార్థ గీత నుంచి సేకరణ). తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత!, తత్ప్ర సాధాత్పరాం శాంతిం స్థానం ప్రాప్సయసి శాశ్వతమ్ (భ.గీ.18/62) హే భారతా! సంపూర్ణ భావంతో ఈశ్వరుడుని శరణు పొందు. ధ్యానం హ్రుదయం లో చేయండి. ఇది తెలిసి కూడా గుడి, మసీదు, చర్చి లేదా ఇతరత్రా వెతకడం, సమయాన్ని హ్రుథా చేయడమే.
హిందూ మతము వేదకాలం నుంచి కొనసాగుతున్న ఒక మహావ్రుక్షము లాంటిది. ఇతర మతాలు, ధర్మాలు ఆ మహావ్రుక్షమునకు కొమ్మలు లాంటివి. అశాశ్వతమైన అట్టి కొమ్మలను చూచి వ్రుక్షమూలము అసూయ పడునా? ద్వేషించునా? ద్వేషించినచో భగవత్ సాన్నిధ్యము కలుగునా? అహంకారం, ద్వేషము,అసూయ లేనప్పుడు అందరూ భాగవుతులుగా గోచరిస్తారు.
శ్రీరామాయణములో శ్రీరామునికి ఏ వర్ణము నందు కానీ, వర్గము నందు కానీ బేధభావము లేదు. మానవులను (తక్కువ జాతియైన శబరి, గుహుడు తో సహా), పశుపక్ష్యాదులు, వానరులను, తిర్యక్కులను, రాక్షసులను ఒకే విధముగా చూచారు. నేటి సమాజములో అట్టి బేధభావము నాశనము చేసి రాముని ఆదర్శముగా తీసుకోవలసిన అవసరము ఎంతైనా యున్నది. 
ఇట్టి విభీషణుడు శరణాగతి రేపు అవలోకించుకొందాము.)
శ్రీరామ జయరామ జయజయ రామ

 

No comments:

Post a Comment