Sunday 26 January 2020

యుద్ధ కాండము-9


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-9
 
విభీషణునికి శరణాగతి నిర్ణయము శ్రీరాముడు ప్రకటించుట
శ్రీరాముడు సుగ్రీవాదుల యొక్క మాటలకు ఎట్టి వికారములుకు లోను కాకుండా హనుమ వచనములకు ప్రసన్న చిత్తుడయ్యెను. ఆ మహాత్ముడు స్థిరచిత్తముతో తనలోని భావములను ఇట్లు వెల్లడించెను.
 
మిత్ర భావేన సంప్రాప్తం న త్యజేయం కథం చన
దోషో యద్య౭పి తస్య స్యాత్ సతామ్ ఏత ద౭గర్హితమ్  6.18.3

న సర్వే భ్రాతర స్తాత భవంతి భరతోపమా:
మద్విధా వా పితు: పుత్రా స్సుహృదో వా భవద్విధా:      6.18.15
 
సుదుష్టో వా౭ప్య౭దుష్టో వా కిమేష రజనీచర:
సూక్ష్మ మ౭ప్య౭హితం కర్తుం మమా౭శక్త:కథంచన           6.18.22
 
పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృధివ్యాం చైవ రాక్షసాన్
అంగుళ్య౭గ్రేణ తాన్ హన్యా మిచ్ఛన్ హరి గణేశ్వర        6.18.23

బద్ధా౭౦జలి పుటం దీనం యాచంతం శరణా౭౭గతం         
న హన్యా దా౭౭నృశంసా౭ర్థ మ౭పి శత్రుం పరంతప        6.18.27
 
ఆర్తో వా యది వా దృప్త: పరేషాం శరణాగత:
అపి ప్రాణాన్ ప్పరిత్యజ్య రక్షితవ్య: కృతాత్మనా          6.18.28
 
న చే ద్భయా ద్వా మోహా ద్వా  కామా ద్వా౭పి న రక్షతి
స్వయా శక్త్యా యథా సత్త్వం త త్పాపం లోక గర్హితం        6.18.29
 
వినష్ట: పశ్యత స్తస్యా రక్షిణ శ్శరణా౭౭గత:
ఆదాయ సుకృతం తస్య సర్వం గచ్ఛే ద౭రక్షిత:            6.18.30
 
సకృదేవ ప్రపన్నాయ తవా౭స్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదా మ్యేత ద్వ్రతం మమ       6.18.33
 
మిత్ర భావముతో (శరణుగోరి) నా కడకు వచ్చిన వానిని ఏదిఏమైనను త్యజింపను (నిరాకరింపను). ఒకవేళ అతనిలో దోషమేమి యున్నను దానిని పట్టించుకొనరాదు. సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పు కాదు. ఇక్కడ హనుమ విభీషణునిలో దోషములు కనబడుట లేదు కావున స్వీకరించ వచ్చు అన్నాడు కాని శరణాగతుడు గనుక స్వీకరింపవలెను అని రాముని భావము. శరణాగతిలో దోషములు ఎంచరాదు. అంతియే గాకుండా అతను శరణాగతుడు అనకుండా మిత్రుడు అన్నాడు. వానిని వదలను అని అనకుండా వదలలేను, వదలుటకు నాకు శక్తి చాలదు అన్నాడు. రాముని శరణాగత రక్షణ న త్యజేయం కథం చన ఏమైనను వదలలేను అనుటలో తెలియు చున్నది.  నిర్మల హృదయులైన జ్ఞాతులు తమ బంధువులను హితైషులుగానే భావింతురు. కాని సహజముగా జ్ఞాతి అయిన విభీషణుని రావణుడు శంకించినాడు. యీతడు మనలను వదలడు. మనము అతని కులము వారము కాము. వారి రాజ్యముపై మనకు ఆశ లేదు. యీతడు మన సహాయముతో రావణుని రాజ్యమును పొందవలెనని కోరి యుండవచ్చు. రక్షణకై మన వద్దకు వచ్చినాడు. కనుక ఈతనిని స్వీకరింప వచ్చును. ప్రపంచములో భరతుని వంటి పుత్రులు యుండరు. తండ్రికి నా వంటి పుత్రులుండరు. సుగ్రీవుని వంటి మిత్రులు ఉండరు. (రామాయణములో మనకు ముగ్గురు సోదరులు కనబడును. ఒకటి రామలక్ష్మణభరతశత్రుఘ్నులు - పరస్పరానురాగముతో అన్యోన్యముతో ప్రపంచమునకు ఆదర్శులైనారు, వాలిసుగ్రీవులు - వాలి తమ్ముడి వచనములపై అపనమ్మకంతో అతని దోషము ఏమియులేకున్నను,  కుశ్చిత బుద్ధితో రాజ్యమును అపహరించినాడు అనే అనాలోచనతో రాజ్య బహిష్కరణయే గాకుండా,చంపవలెనని కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినాడు.  రావణకుంభకర్ణవిభీషణులు పరస్పర విరుద్ధ భావములు గలవారు. రావణుని అహంకారము, కామము వలన సర్వ రాక్షస జాతి నాశనమునకు కారణమైనాడు. సోదరుల అభిప్రాయమునకు రావణుడు విలువ నీయలేదు. ఇంకను సుగ్రీవుని మాటలలోని మర్మమును ఎరిగిన రాముడు శరణాగతుడైన విభీషణుని తప్పక రక్షించవలెనని నిశ్చయించుకొని మేలైన వచనములు చెపుతూ  ... సుగ్రీవా! ఈ రాక్షసుడు దుష్టుడైనను, దుష్టుడు గాకున్నను, ఏవిధముగా నైనను, ఏకొంచెముగా నైనను నాకు కీడు చేయగలడా? వానరేంద్రా! నేను తలచుకొన్నచో ఈ లోకమున గల పిశాచములు, దానవులను, యక్షులను, రాక్షసులను కొన గోటితోనే మట్టుపెట్టెదను.  అయినచో నీవెందుకు లంకలో యున్న ఒక రాక్షసుని చంపక ఊరకుంటివి అందువేమో! ఇచ్ఛన్ సంకల్పించినచో చంపగలను. కానీ వారిని ధర్మ మార్గమున నడచునట్లు చేయుటయే నా ప్రయత్నము. శత్రువైనను అంజలి ఘటించి, దీనుడై శరణు జొచ్చి, అనుగ్రహింపుమని ప్రార్థించినచో అతనికి హాని చేయరాదు. శత్రువు ఆర్తుడైనను, గర్వించినవాడైనను, తన ప్రతిపక్షం వారిని శరణు జొచ్చినప్పుడు వారు నిశ్చయ బుద్ధితో తమ ప్రాణములను ఒడ్డియైనను అతనిని కాపాడవలెను. భయపడిగాని, ఆపద్ధర్మమును ఎరుగక గాని, స్వార్ధబుద్ధితో గాని, శక్తిగలవాడై యుండియు ఏదేని నెపముతో ఆ శరణు జొచ్చిన వాడిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందలపాలగుటయే గాక మీదు మిక్కిలి నరక బాధలను గూడ పొందును. శరణు జొచ్చిన వానిని రక్షింపకుండా యుండినచో ఆ శరణాగతుడు నష్టపోవుటయే గాక ఇతని సమస్త సుకృతములను తీసుకొనిపోవును. అనగా శరణాగతుని రక్షింపని వారియొక్క సుకృతములన్ని నశించును. శరణాగతులను రక్షింపకుండుట మహాదోషము.  "నేను నీవాడను" అని పలుకుచు ఎవ్వరైనను ప్రపత్తితో నన్ను శరణుగోరినచో వారికి (సకల ప్రాణులకు) అభయమిత్తును (వారిని రక్షింతును) ఇది నా వ్రతము.  అందుకు సంతృప్తి చెందిన సుగ్రీవుడు, రాముని ఆనతిపై విభీషణుని సమాగమునకు త్వరపడెను.
 
శ్రీరామ జయరామ జయజయ రామ
 

No comments:

Post a Comment