Sunday 12 January 2020

సుందర కాండము-22

శ్రీరాముడు-యోగరహస్యము-
సీతను గూర్చి హనుమ చింతించుట
లంకయంతయును కాల్చి ఆ తోక యందలి నిప్పును హనుమ సముద్రములో చల్లార్చెను. కొండమీద నుండి జ్వలించుతున్న లంకా పట్టణమును చూచి హనుమ ఇట్లనుకొనెను. అయ్యో! ఈ లంకను కాల్చి నేను ఎంత తప్పు చేసితినో! కోపము ఓడలు తెలియకుండా చేసినది.
 
ధన్యా స్తే పురుష  శ్రేష్ఠా యే బుద్ధ్యా కోప ముత్థితమ్
నిరున్ధన్తి మహాత్మానో దీప్తమ్ అగ్నిమ్ ఇవా౭మ్భసా     5.55.4
 
 కృద్ధః పాపం న కుర్యా త్కః క్రుద్ధో హన్యా ద్గురూ న౭పి
కృద్ధః పరుషయా వాచా నర స్సాధూన్ అధిక్షిపేత్       5.55.5
 
వాచ్యా౭వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్
నా౭కార్య మ౭స్తి కృద్ధ స్య నా౭వాచ్యం విద్యతే క్వచిత్ 5.55.6
 
య స్సముత్పతితం క్రోధం క్షమ యిైవ నిరస్యతి
యథో రోగ స్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే            5.55.7
 
వచ్చిన కోపమును బుద్ధితో, నీటితో నిప్పును చల్లార్చినట్లు ఎవరు నిరోధించుకొందురో వారు ధన్యులు, పురుష శ్రేష్ఠులు. కోపము గలవారు ఎవడు పాపము చేయకుండును? కోపము వచ్చిన వాడు గురువులనైనను చంపును. కోపము వచ్చినవాడు పరుషమైన వాక్కులతో పెద్దలను ఆక్షేపించును. కోపము గలిగిన వానికి అనదగిన మాట, అనకూడని మాట తెలియవు. కోపము గలవానికి చేయకూడని పని యుండదు. వచ్చిన కోపమును ఓరిమిచే, పాము జీర్ణమైన చర్మమును (కుబుసము) విడుచునట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపము సైతము ఓర్పుతో అణచుకొనువాడే యథార్థముగా పురుషుడు[1]. దుర్భుద్ధిని, సిగ్గులేనివాడను, పాపాత్ముడను. ఛీ! ఆలోచించకుండా సీతమ్మకు కూడా నిప్పు పెట్టితిని. స్వామి ద్రోహమునకు పాల్బడితిని. సీతమ్మ కూడా తప్పక కాలియే యుండును. అట్లే అయినచో అజ్ఞానుడగు నాచే స్వామి కార్యము నాశనము అయినది. లంకను దహించుతూ సీతమ్మను కాపాడలేక పోయితిని. కార్యము అంతయు పూర్తి అయి కొంచెము మిగిలి యుండగానే ఇంత అనర్థము సంభవించినది. కోతుల చాపల్యమును చూపితిని. సీతమ్మను రక్షింప గలిగి యుండి కూడా రజోగుణముచే ఆగ్రహము వలన రక్షింప లేక పోతిని. సీత నశించినచో రామలక్ష్మణులతో సహా మొత్తము ఇక్ష్వాకు వంశము, సుగ్రీవునితో సహా మొత్తము వానర భల్లూకములు నశింతురు.  కోపముచే కార్యము మూల నాశనము చేసితిని. అని పరి పరి విధముల హనుమ దుఃఖించుతూ ప్రాణత్యాగమునకు సిద్ధపడెను. అప్పుడు హనుమకు శుభ శకునములు కనబడెను.  అప్పుడు హనుమ సీతా దేవి యొక్క తేజస్సుచే తాను రక్షింపబడినప్పుడు సీతను అగ్ని ఎట్లు దహించగలదు? ఈ విధముగా హనుమ చింతించు చుండగా ఆకాశముంచారణులు ఈ విధముగా పలుకుతున్నారు.
 
దగ్ధేయం నగరీ ల౦కా సాట్ట ప్రాకార తోరణా
జానకీ న చ దగ్ధేతి విస్మయోఽద్భుత ఏవ నః  5.55.33

"కోటబురుజులు, ప్రాకారములు, తోరణములతో సహా లంకా నగరమంతయు దగ్ధమైనది కానీ సీత మాత్రము దగ్ధము కాలేదు" ఇది ఎంతయో ఆశ్చర్యకరం. అమృత తుల్యమైన ఈ మాటలు వినినంతనే హనుమ ఆనందముతో స్వస్థత చెంది సీతమ్మను మరల ఒక్కమారు దర్శించి తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
 
[1] ఈ సందర్భమున వాల్మీకి మహర్షి హనుమ ద్వారా "కోపాతిరేకమునకు గురియైనవాడు ఎట్టి అనర్థములకు పాల్బడుదురో తెల్పుచు ఎవ్వరును కోపమునకు లోనుకారాదు"  అని లోకమునకు చక్కటి సందేశమును ఇచ్చుచున్నాడు. సుమతికారుడు కూడా ఇదే విషయమును చెప్పెను (తన కోపమే తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమె స్వర్గము, తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!)

No comments:

Post a Comment