Tuesday 28 January 2020

యుద్ధ కాండము-13

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-13
సేతు నిర్మాణములోని యోగ రహస్యము
 
రావణుని యుద్ధ సన్నాహములను చూచినవాడై ఇటు రాముడు కూడా తగినట్లుగా యుద్ధసన్నాహము ప్రారంభించెను. ముందుగా సాగరమును దాట వలెను. ఇది భవ సాగరము.  ధ్యాన మార్గము ద్వారా సాధించుటకై రాముడు దక్షిణ సాగర తీరము నందు కుశాసనముపై ఆసీనుడై మూడు దినములు, మూడు రాత్రుళ్ళు గహన ధ్యాన సమాధి అవస్థ యందు గడిపెను. అయినను మనస్సు శాంతించలేదు. భగవద్గీత షోడశోధ్యాయములో సాధకుని సత్వగుణము భగవానుడు ఈ విధముగా తెలియ జేయుచున్నాడు.
 
అభయం సత్వసంశుద్ధి ర్ జ్ఞానయోగవ్యవస్థితిః
దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్||
 
అహింసా సత్యమక్రోధ స్త్యా గశ్శాన్తిరపై శునమ్
దయాభూతే ష్వ లోలత్వం మార్దవం హ్రీరచాపలమ్||
 
తేజస్సమా దృతిశ్శౌచమద్రోహోనాతిమానితా
భవంతిసంపదందైవిమభిజాతస్యభారత ||
 
భయము లేకుండుట, అంత్ఃకరణశుద్ధి, జ్ఞానయోగమునండుట, దానము, బాహ్యేంద్రియనిగ్రహము, ఇతరుల యందు దోషములను చూడకుండుట, దయకలిగి యుండుట, విషయముల యందు ఆసక్తి లేకుండుట, మృదుత్వము, ధర్మవిరుద్ధమగు కార్యములు చేయకుండుట, చంచల స్వభావము లేకుండుట, జ్ఞానయజ్ఞము, శాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము, ఏప్రాణికి బాధ జేయకుండుట, నిజము పలుకుట, కోపములేకుండుట, త్యాగబుద్ధి కలిగి యుండుట, శాంతి స్వభావము, ప్రతిభ,  బ్రహ్మతేజస్సు, ఓర్పు, ధైర్యము, బాహ్యాంతర శుచిత్వము, ఎవనికిని ద్రోహము చేయకుండుట, స్వాతిశయము లేకుండుట ఇవన్నియు సద్గుణములు. సాధకుడు ఈ ఇరువది ఆరు సద్గుణములను అలవరచుకొనవలెను. పట్టువదలని ప్రయత్నముచే చివరకు రాముని మనస్సు శాంతించి సమాధి అవస్థను పొందెను. అయినను సంసార రూప సాగరమును దాటలేక పోయెను. రాముడు తన ధనుస్సు యందు బాణమును ఎక్కుపెట్టి సంసార రూప సాగరమును వధించుటకై సిద్దపడెను అయినచో ఆ ధనస్సు, శరములనగా ఇవి ఎట్టివి? ఎటువంటి సాగరముపై వాటిని వదలవలెను. "ప్రణవో ధను: శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే" (సాధనారూప) ప్రణవ రూప ధనుస్సుతో ఆత్మరూప శరమును ఎక్కుపెట్టి బ్రహ్మరూప లక్ష్యముపై గురిపెట్ట వలెను. రాముడు ఆ విధముగా చేయ దలఁచెను. దానితో సంసార రూప సాగరము భీతి నొంది రాముని చరణములపై పడెను. అనగా రాముడు సంసార సాగరమును జయించెను. ఇక అట్టి సాగరముపై వారధి కట్టి వానర సేనతో సహా దాటవలసి యున్నది. ఏ వారధి? ఎటువంటి వానరులు? ఏ లంకపై ఆక్రమణ చేయుదురు?
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి మాటలలో
 
సేతుం బధ్వా సుజలధౌ సాధనాశ్మ భిత్కటైహ్,
తతోభవాబ్ధి ముల్లంఘ్య దీప జ్ఞానాగ్నినాభృశమ్.
సూక్ష్మే దెహాఖ్యలంకాంచ దగ్దవోపనిషధ స్రతః,
కామక్రోధాది రక్షామ్సి హత్వాబుద్ధే సహస్రతః.
 
ఆంతర్యమేమన, సాధనా రూప రాళ్ళ ద్వారా వారధి కట్టి సంసార రూప సాగరమును దాటవలెనని, తన వృత్తి రూప వానరులను సేతువుపై నడిపి మాయారూప లంకలో నివసించెడి కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాది రాక్షసులను సంహరించవలెనని రాముడు తలఁచెను. ప్రారంభమున రాముడు సాగరముపై బాణమును వేయుదమనుకొనుసరికి సంసార రూప సాగరము రామునికి వశమై శరణు వేడెను. క్రోధ రూప బాణమునకు గాక, సాధనారూప రాళ్లతో వారధి కట్టి లంకను ఆక్రమించుమని చెప్పెను. నలుడను ఇంజినీరు ఆ వానరులలో ఒకడు. "అనల" అనగా అగ్ని. అనలము కానిది "నల" అగ్ని లేదా తేజస్తత్వమునకు మనకు క్రింద నున్న అపతత్వ సాధకుడు నలుడు. అపతత్వ మనగా అణురచనావస్థ లేదా ఎలక్ట్రానిక్ అవస్థగా చెప్పవచ్చు. అనేక ఎలెక్ట్రానుల సాపేక్ష సంధానము ద్వారా పరమాణువు తయారగును. ఆ పరమాణువే వాస్తు రూప జడ జగత్తుకు మూలము. విస్తారమైన జడజగత్తు యొక్క మూలావస్థయే అపతత్వము. సాధనా రూప రాళ్ళతోనే భవసాగరము దాటవలెను. అపతత్వము ద్వారానే జగత్తు నందలి సాధనలు ప్రారంభమగును. రామరూప సాధకుడు భవ సాగరమును దాటుటకు నలుడను అపతత్వ ఇంజినీరు సాధనారూప రాళ్లతో సేతువును నిర్మించును. రామాయణము నందు ఎటువంటి యోగ విజ్ఞాన రహస్యము దాగి యున్నదో ఉత్కృష్ణ సాధనానుభవము ద్వారాను, పరిణామము చెందిన బుద్ధి ద్వారాను అటువంటి రహస్యములు అవగాహనకు వచ్చును. ఈ ఆంతర్యము సాధారణ సమాజమునకు ప్రకటితమవాలి. మహాపరాక్రముడు, తేజస్వి అయిన నలుడు సంసార సాగరమును దాటుటకు వారధిని నిర్మించిన మహాసాధకుడు.

ఐదు దినములలో ఈ సేతువు నిర్మింపబడెను. పంచతత్వముల ద్వారానే ఈ ఘటన లేదా కార్యము గావించబడెను. పంచతత్వ సాధనతో ఈ ఐదు దినముల ప్రణాళిక రచించిరి. దానిపై వృత్తి రూప వానరులు దాటుట ప్రారంభించిరి. రాముడు సంతోషించెను. అటువంటి సేతువును రాక్షస వృత్తులు ఆటంక పరచకుండా విభీషణుడు ఆవలి వైపున తన సత్ వృత్తి రూప శూలముతో నిలుచుండెను. ఇదియే ఈ సేతువు నిర్మాణములోని యోగ రహస్యము.   
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment