Wednesday 15 January 2020

సుందర కాండము-23


"మిత్రులకు, శ్రేయోభిలాషులకు భోగి శుభాకాంక్షలు
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-23
 
హనుమ మరల సీతను దర్శించి సముద్ర లంఘనము చేయుట
 
తత స్తు శింశుపామూలే జానకీం పర్య౭వస్థితామ్
అభివా ద్యా౭బ్రవీ ద్దిష్ట్యా పశ్యామి త్వా మిహాక్షతామ్      5.56.1
సుఖముగా యున్న సీతమ్మను చూచుటకు హనుమ మరల అశోక వనమునకు యేగి సీతతో "అమ్మా! అదృష్టవశమున నిన్ను మరల చూడగలిగితిని". అని తిరుగు ప్రయాణమునకు సంసిద్ధుడాయెను. అప్పుడు సీత, హనుమతో "నీ బలము ప్రశంశనీయము. శ్రీరాముని పరాక్రమమునకు అనురూపమగు విధముగా నీవే కార్యమును సాధించవలెను". అని హనుమను ప్రేమపూర్వకంగా సాగనంపెను. ఇక్కడ హనుమ ఆచార్యుడుగా సీతారాముల సయోధ్యకు యత్నించెను. సాధకుడు కర్మయోగముచే పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడై ఆత్మావలోకనం నొనర్చి విషయములను, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని కామమును జయించి భగవత్ ప్రాప్తికై అభిముఖుడై ఎగుర ఇందు స్ఫురించును. తరువాత హనుమ శ్రీరామ దర్శనాభిలాషయై అరిష్టమనెడి పర్వతమును అధిరోహించి, శరీరమును పెంచి ఉత్తరాభిముఖుడై ఆకాశముపైకి ఎగిరెను. ఆ వానరోత్తముడు అంగద జాంబవంతాదులు యున్న మహేంద్ర పర్వతము సమీపించుచుండగా గంభీర నాదము చేసెను. అప్పుడు అక్కడ యున్న వానర సమూహము అంతయు హనుమ కార్యము సాధించాడని ఆనందముతో గంతులు వేసిరి. హనుమ వారి వద్దకు వచ్చి దృష్టా సీతా (సీత చూడబడెను) అని సంగ్రహముగా నివేదించెను. తరువాత నెమ్మదిగా హనుమ, అంగద జాంబవంతాదులకు తాను సముద్ర లంఘనము నుంచి సీత కొరకై రావణ భవనములలో అన్వేషణము, రావణాసురుడు కర్కశముగా సీతకు రెండు నెలల గడువు ఒసంగుట, త్రిజటా స్వప్నము, తాను సీతను ఊరడించుట, తాను రావణునికి రామసుగ్రీవుల సందేశము వినిపించి అతనికి మంచి మాటలు చెప్పుట,  లంకా దహనము మొదలగు విషయములన్ని వివరముగా చెప్పి, సీత శోక పరాయణయై యున్నది కావున  తదుపరి కర్తవ్యము గురించి రాముని ఆలోచన మేరకు మీరందరు ఆలోచన చేయమని కోరతాడు. సీత జాడ తెలిసినది అనే సంతోషముతో ఆ వానర సమూహము అంతయు కిష్కింధకు వెళ్లి సుగ్రీవునకు ప్రీతిపాత్రమైన మధువనమున ప్రవేశించారు. అందుకు కినుక వహించిన ఆ వనపాలకుడైన దధిముఖుడు రామలక్ష్మణులతో యున్న సుగ్రీవునకు ఈ వృత్తాంతమును తెలియ చేసెను. అందుకు వానర రాజైన సుగ్రీవుడు వారు సీతమ్మను దర్శించి యుండవచ్చును అందు ముఖ్యముగా హనుమయే కార్యసాధకుడు అని తలచి వేగముగా వారిని తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించెను. అంత దధిముఖుడు రాజాజ్ఞను అంగదునకు నివేదించెను. వెంటనే హనుమ సాధించిన కార్యముచే గర్వించి, గర్జించుతూ వానరులు రామలక్ష్మణ సుగ్రీవుల కడకు వచ్చిరి. మహాబాహుడగు హనుమ శిరసు వంచి రామునకు నమస్కరించి "హనూమాం శ్చ మహా బహుః ప్రణమ్య శిరసా తతః, నియతా మ౭క్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్, దృష్టా దేవీతి హనుమద్వద నాధామృతోపమమ్  ("నియమశీలయై సీతమ్మ సుఖముగా యున్నది") అని నివేదించెను.    అమృత తుల్యమైన ఆ వాక్కులకు రామలక్ష్మణులు పరమానంద భరితులైరి.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment