Wednesday 15 January 2020

సుందర కాండము-24

మిత్రులకు, శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-24
 
హనుమ సీత దేవి సమాచారమును శ్రీరామునకు చెప్పుట
వానరులు అంగదుని ముందుంచుకొని సీతమ్మ రావణాంతఃపురములో నిర్బంధించబడి యుండుటయు, రాక్షస స్త్రీలచే భయపెట్టుచుండుట, సీతమ్మకు రాముని యందు అనురాగము, రావణుడు ఆమెకు రెండు నెలల గడువు ఇచ్చుట మున్నగు విషయములు రామునికి తెలిపి సీత కుశలముగా యున్నదని చెప్పిరి. అప్పుడు రాముడు సీత విషయమై సవిస్తరంగా చెప్పవలసినదిగా కోరగా, హనుమ సీత యున్న దిక్కుకు నమస్కరించి ఇట్లు చెప్పుట ప్రారంభించెను.
"సముద్రమునకు దక్షిణ తటమున దురాత్ముడైన రాక్షస రాజు రావణుని లంకా నగరము కలదు. నేను నూరు యోజనముల సముద్రమును దాటి అట్టి లంకలో సీతమ్మను చూచుటకు బయిలుదేరితిని. అచట రామా! నీ యందే సర్వమును ఉంచుకొని జీవించుచున్న సీతమ్మను నేను చూచితిని. బహు దుఃఖమును పొంది యున్నది. రావణాంతఃపురమున నిరోధింపబడి రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్నది. ఒంటి జడ దాల్చి దీనురాలై నిన్నే ధ్యానించుతు నేలన పరుండి యున్నది. రావణాసురునుని పొందవలెనని కోరిక లేనిదై, భీతిల్లి మరణించుటకే నిశ్చయించుకొన్నది. అట్టి స్థితిలో నేను సీతను చూచితిని. ఇక్ష్వాకు వంశమును కీర్తించి ఆమెకు నాపై నమ్మకమును కల్గించుకొంటిని. తరువాత మాటలాడి జరిగిన విషయమును అంతయు తెలిపితిని. రామసుగ్రీవుల మైత్రికి ఎంతయో సంతోషించింది. చిత్రకూటమున జరిగిన కాకాసుర వృత్తాంతమును నీకు గురుతుగా చెప్పమన్నది. రామా! సీతమ్మ ఈ మణిని దాచి పదిలంగా నీకు ఈయమని చెప్పినది. మణిశిలల గంధముతో బొట్టు పెట్టిన సంగతి జ్ఞాపకము చేయమన్నది. ఒక మాసము గడిచిన తర్వాత జీవించి యుండను అని చెప్పి యున్నది. రామా! చూచిన దానిని చూచినట్లు వివరించితిని. సముద్రమును దాటుటకు ప్రయత్నము చేయుడు" అని చెప్పి చూడామణిని శ్రీరామునికి సమర్పించెను.  
హనుమ తాను వెళ్లి వచ్చిన వృత్తాంతమును వానరులకు, రామునికి తెలియ జేసెను. అందు భేదము గుర్తించాలి. వానరులతో తన విజయములను వర్ణింపక సీతమ్మకు సంబంధించిన వృత్తాంతమును మాత్రమే చెప్పెను. రాముని వద్ద అహంకారము వ్యక్తము కాకుండా వినయముతో రామునికి ఆవశ్యకమగు విషయమును మాత్రమే చెప్పెను. ఇది హనుమ యొక్క వినయమును, ఉచితజ్ఞతను సూచించు చున్నది.
శ్రీరాముడు ఆ మణిని హృదయమునకు హద్దుకొని సుగ్రీవునితో ఈ మణిని చూడగానే మా తండ్రియైన దశరథుడు, మామగారైన జనకుని చూచినట్లు యున్నది. ఈ మణిని సీత ధరించినప్పుడు ఆ మణి శోభలు ఇనుమడించెను. ఈ మణిని చూచి నేను ఆమెను పొందినట్లుగా భావించుచున్నాను.  "చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి, క్షణం సౌమ్య న జీవేయం వినా తా మ౭సితేక్షణామ్" సీతమ్మ నెలరోజులు బ్రతికినచో చాలా కాలము జీవించునన్నమాట. ఇక ఆమెను చూడక క్షణకాలం జీవింపలేను. హనుమా! ఆమె అన్న మాటలు యథార్థముగా చెప్పుము. రోగికి మందువలె ఆమె మాటలే నాకు జీవనము. "మధురా మధురా౭౭లాపా కి మా౭౭హ మమ భామినీ, మ ద్విహీనా వరారోహా హనుమన్ కథయస్వ మే" సీతమ్మ మధురము. ఆమె మాటలు మధురము. ఆమె మాటలు చెప్పుచున్న నీ మాటలు మధురము. ఇంకా సీతమ్మ ఏమనినదో చెప్పుము.
అప్పుడు హనుమ రామునితో, రామా! జానకీదేవి చిత్రకూటమిన జరిగిన కాకాసుర వృత్తాంతము యధాతధముగా నివేదించమన్నది. అస్త్రకోవిదులలో అగ్రగణ్యుడు, మహాబలశాలి అయినా శ్రీరాముడు నా విషయమున కనికరము యున్నచో వెంటనే రావణుని హతమార్చ వలెను. శత్రు భయంకరుడైనట్టి లక్ష్మణుడు అయినను నన్ను రక్షించుటకు ఏల వచ్చుట లేదు? వారు విస్మరించుటకు నాలో ఏమైనా దోషములు యుండవచ్చును. దిగులుగా యున్న సీతతో హనుమనైన నా వీపు ఎక్కినచో శీఘ్రముగా రామలక్ష్మణుల కడకు చేరుతును అని చెప్పాను. కానీ అది ధర్మము కాదని, కాలము ప్రతికూలమగుట వలన ఇదివరలో నిస్సహాయరాలునై రావణునితో తాకబడితిని అని చెప్పెను. ఇంకను మీ కుశలం అడిగినది అని చెప్పెను. ఇంకను ఈ మహాసముద్రమును దాటుటకు గరుత్మంతునికి, వాయువుకు, హనుమనైన నాకు మాత్రమే సాధ్యము కావున తగు ఉపాయమును ఆలోచింపమన్నది. ఈ కార్యమును సాధించుటకు నీవు ఒక్కడివే చాలును. కానీ అందువలన శ్రీరాముని ప్రతిష్ట పెరగదు అనియు చెప్పెను. శ్రీరామునికి భయపడి వంచనతో రావణుడు నన్ను అపహరించెను. కానీ ఇప్పుడు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకొనిపోవుటకు రాముడు ఇష్టపడడు, కావున రణరంగమున రావణుని హతమార్చి నన్ను తీసుకొని వెళ్ళుట శ్రేయస్కరము అనెను. అప్పుడు హనుమనైన నేను సుగ్రీవుని వానర భల్లూక సైనికులలో చాలా అల్పుడను. కావుననే నన్ను దూతగా పంపినారు. నాకన్నా బలవంతులు చాలా మంది కలరు అని చెప్పాను. కావున నీ శోకము త్వరలో తీరును అని అనునయించి వచ్చితిని.
సుందర కాండ సమాప్తము.
శ్రీరామ జయరామ జయజయ రామ
హనుమ పలికిన మంగళకరములగు వాక్కులచే సీతమ్మకు మనస్సున శాంతి లభించినట్లే ఈ కాండను చదివిన వారికి మన…

No comments:

Post a Comment