Sunday 26 January 2020

యుద్ధ కాండము-11


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-11
శ్రీరాముడు సముద్రునిపై బ్రహ్మాస్త్రమును సంధించుట
 
హనుమ, సుగ్రీవుడు విభీషణునితో ఈ సాగరమును దాటుటకు అశక్యముగా యున్నది గావున తగిన ఉపాయము సూచించుమని కోరెను. సుగ్రీవుడు ఇట్లు పలుకగానే విభీషణుడు తనకు తెలిసిన ఉపాయము శరణాగతియే గావున రామచంద్రప్రభువు సముద్రుని శరణాగతి చేసినచో సముద్రుడు తప్పక దారి ఇచ్చునని అంతియేకాక ఇక్ష్వాకు ప్రభువుల వలన తనకు కలిగిన మేలును గుర్తు పెట్టుకొని అయినా సముద్రుడు సహాయము చేయునని సూచించాడు.
 
అన్ని ఉపాయములు కంటే శరణాగతి తప్పక ఫలమును ఇచ్చెడిదే కానీ ఎవరు ఎవరిని చేయవలెను అను నియమము యున్నది. శ్రీరాముడు సర్వసమర్థుడు కనుక విభీషణుని శరణాగతి ఫలించింది. అంతియేగాక శ్రీరామునికి తనను తాను రక్షించుకోవడమే గాక సకల లోకములను రక్షించు సామర్థ్యము కలదు. సముద్రుని శక్తి శ్రీరాముని శక్తితో ఏ విధముగానూ సరిపోలదు. అటువంటప్పుడు శ్రీరాముడు సముద్రుని శరణాగతి చేయుట ఏ విధముగానూ సమర్థనీయము, ఆచరణ సాధ్యము కాదు. అయినను సుగ్రీవుని కోరిక మేరకే (సుగ్రీవుని చిన్నబుచ్చడము ఇష్టములేక) రాముడు సముద్రుని శరణు పొందుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు రాముడు చిన్నచిన్న గులక రాళ్లతో, గండ్ర ఇసుకతో నిండిన సముద్ర తీరము నందు నేలపై దర్భలు పరచుకొని సముద్రునకు నమస్కరించి పరుండెను. సర్వలోకములను రక్షించు సమర్ధుడైన రాముడు, లోకులందరిచే రక్షణకై నమస్కరింపబడువాడైన రాముడు తన రక్షణకై సముద్రునకు నమస్కరించి ప్రాయోపవేశము చేయ సిద్ధపడెను. ఏవ ముక్తః కుశా౭౭స్తీర్ణే తీరే నద నదీపతేః సంవివేశ తదా రామో వేద్యా మివ హుతాశనః ఈ విధముగా మూడు రాత్రులు ఉపాసించెను. శరణాగతి స్వరూపమును లోకమునకు విశదీకరించుటకై ఆ విధముగా ఉపాశించినాడు గాని శక్తిలేక గాదు. మూడు రాత్రులు అయినను సముద్రుడు రాకపోవుటచే రాముడు క్రుద్ధుడాయెను.
 
ప్రశమశ్చ క్షమా చైవ ఆర్జవమ్ ప్రియవాదితా,
అసామర్థ్యం ఫలన్త్యేతే నిర్గుణేషు సతాం గుణాః  6.21.14

ఆత్మ ప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకమ్
 సర్వత్రో త్సృష్ట దణ్డం చ లోకః సత్కురుతే నరమ్ 6.21.15
 
 న సామ్నా శక్యతే కీర్తి ర్న సామ్నా శక్యతే యశః
 ప్రాప్తుం లక్ష్మణ లోకేఽస్మిన్ జయో వా రణ మూర్ధని 6.21.16
 
చాపమ్ ఆనయ సౌమిత్రే శరాం శ్చా౭౭శీ విషోపమాన్
సాగరం శోషయిష్యామి పద్భ్యాం యంతు ప్లవ౦గమా:
అద్యా౭క్షోభ్య మ౭పి క్రుద్ధః క్షోభయిష్యామి సాగరమ్ 6.21.22
 
సత్పురుషులు మంచి గుణములు గలిగి యుందురు. ఓరిమి, ఇంద్రియ నిగ్రహము, మనోవాక్కాయములలో ఋజుత్వము, ప్రీతీ గలిగించు మాటలు వారికి సహజముగా యుండును. కానీ గుణహీనులు ఆ సత్పురుషుల మంచి గుణములను లెక్కజేయరు. వారిని అసమర్థులుగా జూతురు. చూడుము సముద్రుని గర్వము. క్రోధము లేకుండా ఎదుటి వారి అపరాధమును ఓర్చుకొనుచు ఎదుటి వారి మనసును అనుసరించి మాయలేక ప్రియముగా మాటలాడెడివాడిని అసమర్థులు అని తలతురు. ఎవడు తనను తాను స్తోత్రము చేసుకొనుచు తన గొప్పలు తానే చెప్పుకొనుచు ఇతరులను వంచించుతూ దయలేని వాడై తన దుష్టవ్యాపారములచే అందరూ తనను చూచి పారిపోవునట్లు చేయుచుండునో, మంచివారిని చెడ్డవారిని కూడా ఎవడు హింసించుచుండునో వానిని లోకము గౌరవించును. మంచి మాటలచే కీర్తి, యశస్సు రాదూ. పరాక్రమముచేతనే అది సిద్ధించును. లక్ష్మణా! నేను ఓర్చి నిరీక్షించుట వలన సముద్రుడు నన్ను చేతగాని వానిగా తలచుచున్నాడు. సౌమిత్రీ! నా ధనస్సును, విషసర్పముల వలే భయంకరములైన నా బాణములను అందించుము. క్షణములో ఈ సముద్రమును శుష్కింప చేయుదును. అప్పుడు వానరులు అందరూ నడచియే వెళ్ళగలరు. సముద్రము ఎన్నడూ శుష్కింపదు అనునది లోక ప్రశిద్ధి. దానిని వమ్ము చేసెదను. ఇట్లు పలికి రాముడు కోదండము చేపట్టి ప్రళయకాలములొ ప్రజ్వరిల్లుచున్న అగ్నివలె ఎవ్వరిచేతను చేరుటకు శక్యము కానివాడై వజ్రము లాంటి బాణములను సముద్రములోనికి వదిలెను. అప్పుడు మొసళ్ళు, తిమింగలములు మున్నగు భీకర సత్వములతో నిండిన ఆ మహాసముద్రము క్షోభించెను. లక్ష్మణుడు వారించినను ఆపకుండా శ్రీరాముడు అమోఘమైన శరమును సంధించి బ్రహ్మాస్త్ర మంత్రమును పాటించుతూ వింటినారిని లాగెను. అంతటా భూమ్యాకాశములు బ్రద్దలగుచున్నట్లు లోకమంతయు కంపించెను. ఆ మహాసముద్రము తన పరిధిని ధాటి ఒక యోజన పర్యంతము అతిక్రమించెను. సముద్రము కొన్ని యోజనముల వరకు లోలోపలకు పోసాగెను. అప్పుడు సముద్రుడు మధ్యభాగమున ఒక్కసారి పైకెగసి రాముని సమీపమునకు చేరి దోసిలి యొగ్గి ఇట్లు విన్నవించెను. "నేను జలములకు స్థానమగు సముద్రమును. అగాధముగా యుండుట నా స్వభావము. దాటుటకు శక్యము గాకుండా యుండుట నా లక్షణము.లోతు తగ్గి మెత్తగా యున్నచో అది నా స్వభావమునకు విరుద్ధము. ఒక కోరిక వలన గాని, లోభము వలన గాని, భయము వలన గాని నేను అగాధములగు జలములను మెరకగా చేయజాలను. కావున సేతువును నిర్మాణము చేసి నన్ను దాటవలెను. అట్టి సేతు నిర్మాణమునకు ఎట్టి విజ్ఞములు కలుగకుండా చేయగలను. నాకు ఉత్తరపు దిక్కున పవిత్రము అయిన ధ్రువకల్పము అనేది ప్రదేశము యున్నది. అక్కడ క్రూరకర్మలు చేయువారు పెక్కు గలరు. వారిపై నీ బాణమును ప్రయోగించుము. నీ సేనలో "నలుడు" అను వాడు విశ్వకర్మ కుమారుడున్నాడు. అతడు సముద్రముపై సేతువును నిర్మింపగలడు. దానిని నేను నిలిచి యుండేటట్లు చేయగలను" అని చెప్పిప్పి సముద్రుడు అంతర్థానము అయ్యాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
 

No comments:

Post a Comment