Sunday 26 January 2020

యుద్ధ కాండము-10



శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-10

విభీషణుడు రావణుని బల సంపదలు తెలుపుట
శ్రీరాముడు అభయము ఒసగినాడని తెలియుట తోడనే విభీషణుడు, రామదాస్యము లభించిందనే మహా ఆనందముతో ఆకాశము నుండి నిలబడి సాష్టాంగము ఒనర్చినాడు. తనను ఆదరించి, తన యందు యున్న ప్రేమను ప్రకాశింప జేసినప్పుడు ఆనందము పట్టలేక ఆర్తితో పాలు త్రాగెడి శిశువు తల్లి పాలిండ్లమీదనే పడినట్లు రాముని పాదములపై పడినాడు. సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళం. రాముడు శరణాగతి చేయుటకు తగిన గుణములు గలవాడు. విభీషణుడు శ్రీరామునితో ఇట్లు చెప్పుచున్నాడు. రామా! నేను రావణుని తమ్ముడను. ఇట్లు అనుటచే భగవత్ప్రాప్తికి వలసిన యోగ్యత తనకు లేదేమోనని సూచించాడు. రావణుడు నన్ను అవమానించాడు. లోకములోని సకల ప్రాణులకు నీవే శరణమని, రక్షింప సమర్థుడని ఎరిగి నిన్ను శరణు పొందినాను. రావణునికి అతని అహంకారము వలన ఈ భాగ్యము కలుగలేదు. నీకంటే వేరొకటి పొందుటకు వేరే ఏమి లేదని జన్మభూమిని, మిత్రులను, కుటుంబమును, సకల సంపదలను వదలి వచ్చినాను. అప్పుడు రాముడు మృదుమధురంగా, ఓదార్చుతూ రాక్షసుల యొక్క బలాబలముల గురించి యథాతథముగా తెలియ చేయ వలసినదిగా అడుగుతాడు.

రాముడట్లు అడుగగానే విభీషణుడు రావణుని బలమును చెప్పుటకు ఆరంభించెను. రావణునకు సర్వావధ్యత్వము అనగా ఎవరి చేతను చావులేకుండా బ్రహ్మ వరమును ఒసగినాడు. గంధర్వులు, అసురులు, రాక్షసులు మొదలగు సర్వ భూతములచే అతడు అవధ్యుడు. రావణునికి తమ్ముడు, నాకు అన్న అయిన కుంభకర్ణుడు మహాయోధుడు, మహాబలశాలి. ప్రహస్తుడు రావణుని సేనాధిపతి. అతడు కుబేరుని సేనాధిపతియైన మణిభద్రుని ఓడించెను. ఇంద్రజిత్తు యుద్ధసమయము నందు చేతి వ్రేళ్ళకు బలమైన తొడుగులు దాల్చును.అతని కవచము అభేధ్యము. యుద్ధములో అతడు ఎదుటి వారికి కనబడకుండా మాయమగును. యుద్ధ సమయములో అదృశ్యుడై అగ్నిహోత్రుని హోమముచే తృప్తి పరచి వచ్చి శత్రువులను చంపును. ఇంకా రావణుని సైన్యములో ఇంద్ర, యమ, వరుణాది లోకపాలకులతో సమానులగు మహోదరుడు, మహాపార్శ్వుడు, అకంపనుడు మొదలగు వారున్నారు. అంతియే గాక కోట్లకొలది రాక్షసులు కామరూపులు, రక్తమాంసములను భక్షించువారు. రావణుడు లోకపాలకులను, దేవతలను జయించెను.
 
ఏవ ముక్త స్తు సౌమిత్రి ర౭భ్యషి౦చ ద్విభీషణమ్
మధ్యే వానర ముఖ్యానాం రాజానం రామ శాసనాత్ 6.19.26

అందుకు రాముడు సంతసించి, రావణుని శక్తిసామర్థ్యములను బాగుగా వివరించితివి. రావణుని, అతని బంధుమిత్రులను, ప్రహస్తుడుతో సహా అందరి యోధులను రణభూమికి బలి ఇచ్చి నిన్ను లంకకు రాజును చేసెదను అని చెప్పి లక్ష్మణునితో సముద్ర జలమును తెప్పించి, ఆ సముద్ర జలముతో విభీషణుని లంకకు రాజుగా అభిషేకము చేసెను.

రావణ రాజ్యమును విభీషణుడు కోరలేదు. అతడు కోరినది రామకైంకర్యమే. శత్రుపక్షము నుండి వచ్చినాడు, శంకింపదగినవాడు అని అనుకొనిన వాడు రాజుగా మారినాడు. ఇది రాముని కటాక్షము. ఇదియే శరణాగతి యొక్క విశేషము. రాముడు ఇంకను సైన్యముతో సముద్రమును దాటలేదు, యుద్ధము చేయలేదు, రావణుని చూడలేదు, చంపునో లేదో తెలియదు, ముందే విభీషణునికి పట్టాభిషేకము చేసినాడు. ఇది రాముని సర్వ శక్తిత్వమును ప్రకాశింప చేసినది.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment