Wednesday 15 January 2020

యుద్ధ కాండము



[6:14 AM, 1/16/2020] యోగవాసిష్టం: మిత్రులకు, శ్రేయోభిలాషులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము- విచారణ
మానవుడు కామక్రోధాలుతొ చుట్టబడి ఉంటాడు. అహంకారంతో ఆవేశింపబడి ఉంటాడు. అనేక రకాలైన మాయాజాలంతో చుట్టుకొని ఉంటాడు. ఇతడు నవరంధ్రాలు ద్వారా, పైన ఉండే పదో రంద్రం ద్వారా "పది తలకాయలతోటి" కోరికలను అనుభవిస్తూ యుంటాడు. అతడే దశకంఠుడైన రావణాసురుడు. ఎనిమిది దిక్కులు, పైన, క్రింద కలసి పది దిక్కులు కోరికలు, కామము ప్రజ్వరిల్లి శరీరముతో ఉండే అవిద్యా సంబంధమైన రాజ్యాన్ని పరిపాలించేవాడే దశకంఠుడు. తపస్సుతో వేద జ్ఞానము సాధించాననే అహంకారము. కాని అహంకారమును జయించలేక పోయాడు. రవైతీతి రావణః బిగ్గరగా తన జ్ఞానమును అందరికి చాటును. జీవుడు ఆత్మజ్ఞానం కలుగక సంసార సాగరము చేత చుట్టబడి ఉండుటచేత అతని ఉనికి లంకాపురి అన్నారు. అటువంటి లంకాధీశునికి పరమాత్మ సాన్నిధ్యము కలగాలంటే ఈ సంసార సాగరాన్ని దాటి అతనికి భగవత్ సందేశము అందించే వారు కావాలి. కోరికలతో యుండి అవిద్యలో ఉన్నవానికి భగవంతుడి సాన్నిధ్యము కావాలంటే సాధన కావాలి. అంటే ప్రాణాయామ, ప్రత్యాహార మొదలగు అష్టాంగ యోగాలుతో శ్వాసను బంధించాలి (ఈ విషయము ఉపోద్ఘాతములో చెప్పుకొన్నాము). శ్వాస నిగ్రహము అంటే వాయువు మీద జయం. అప్పుడు గాని పరమాత్మ సాన్నిధ్యము లభ్యము కాదు. ఇక్కడే రామ రామ అంటూ ఉచ్చ్వాస, నిశ్వాస లతో వ్యవహరించే వాయుపుత్రుడైన హనుమ ప్రవేశిస్తాడు. ఈ వాయుపుత్రుడే ప్రాణ స్వరూపుడు. "రా" అంటే "రావణ" "మ" అంటే "మర్దన", ఎవరైతే "రామ రామ" అని అంటారో వారు రావణ మర్దన కోరుతున్నట్లు. బ్రహ్మ భావము నందు సదా చరించే వాడు వాయుపుత్ర హనుమ. ఉచ్చ్వాస, నిశ్వాసల ద్వారా బ్రహ్మాండము లోని ప్రాణాన్ని (శ్వాస లేక ప్రాణవాయువు) తీసుకొని, అట్టి ప్రాణాన్ని తిరిగి బ్రహ్మాండము లోనికి ప్రవేశపెట్టడం ద్వారా  ఇటు శరీరములోని జీవాత్మతోను అటు బ్రహ్మాండములోని పరమాత్మతోను సంబంధము నడిపేదే శ్వాస. అదియే దూత అయిన హనుమ. అందుకనే ఇతనికి "రామదూత" అని కూడా పేరు. ఈ రామదూత చేసేటటువంటి   ప్రాణాయామమే "సాగర లంఘనము". ఈ విధముగా జీవాత్మ, పరమాత్మల సంబంధము ఏర్పడినప్పుడు సంసార సాగరముతో చుట్టబడిన లంకలో ప్రవేశించి పరమాత్మ అయిన రాముని క్షేమము తెలియ చేస్తాడు.
యోగి ప్రాణాయామము చేసినప్పుడు అతనికి భ్రూమధ్యమములో, రెండు కళ్ళ మధ్య ఉండే ఆజ్ఞాచక్రములో కాంతి చక్రమైన ఒక జ్యోతి దర్శనము అవుతుంది. అదియే సీతమ్మకు చూపిన రాముని అంగుళీయకము. అంటే పరమాత్మ ఉనికిని ఋజువు చేస్తాడు. అప్పుడు జీవుడు ఊరట చెంది భగవత్ సాన్నిధ్యము కలుగబోతున్నది అను భావన కలుగును. జీవుడు ప్రాణాయామము ప్రారంభించుట తోడనే శరీరములోని దోషములన్ని తపింపబడి అగ్నిలో జాజ్వల్యమానంగా మండిపోతాయి. అదియే హనుమ లంకా దహనము. ఎప్పుడైతే శరీరములోని పాపపురుషుడు దహింపబడతాడో అప్పుడు జీవాత్మకు పరమాత్మకు సంబంధము అనే నిచ్చెన ఏర్పడును. తద్వారా జీవుడు భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలడు.  అదియే లంకకు కట్టిన సేతువు. అప్పుడు నిరంతర యోగసాధన, సత్యనిష్టలతో భగవంతుడుగ రూపాంతరము చెందిన  రాముడు సంసార సాగరమైన లంకలోకి ప్రవేశించి,  జీవ, బ్రహ్మల భావన కలుగ జేసి జీవుడితో (సీతతో) ఐక్యం పొందుతాడు. అప్పుడు అవిద్యా పురుషుడైన దశకంఠుడు నశించి సీతారాముల అంటే జీవ, పరమాత్మల ఐక్యం జరుగును. ఈ ఐక్యత నిజమా! కాదా! అంటే కష్టాలకు, సుఖాలకు చలించకుండా ఉండేటటువంటి బ్రహ్మానుభూతి. అదియే సీత యొక్క అగ్ని పరీక్ష. ఈ విధముగా రామాయణము అంతా ఒక యోగ రహస్యము, ఒక ఆధ్యాత్మిక సాధన. ఒక ఆంతరంగిక రహస్యము. ఇదియే రామాయణ రహస్యము.
రేపటి నుంచి యుద్ధ కాండలో ఏ విధంగా సాత్విక అహంకార రూప విభీషణుని సహాయంతో రాముడు తామస రూప అహంకార కుంభకర్ణుని, రాజస రూప అహంకార రూప రావణాదులను నాశనము గావించి బ్రహ్మరూప సాత్విక అహంకారియైన రావణ బంధము నుండి స్వానుభూతి రూప సీతను విడిపించుకొని రాముడు తన వృత్తి రూపమైన సీతతో ఇంటికి తిరిగి వచ్చి స్వరూప సామ్రాజ్య రూప సింహాసనాభిషిక్తుడగునో తెలుసు కొనుటకు ప్రయత్నము చేయుదము.
శ్రీరామ జయరామ జయజయ రామ
 
V.A.Durga Prasad Chintalapati
Only admins can send messages

No comments:

Post a Comment