Tuesday 28 January 2020

*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-14*
*సీతను సరమ ఊరడించుట*
వానర రాజగు సుగ్రీవుడు ఫల, మూల, జలములు అధికముగా గల లంకా సముద్ర తీరమున సేనలను నిలిపెను. సేనాసహితముగా శ్రీరాముడు సముద్రమును దాటినపుడు రావణుడు శుక, సారణులను తన ఇరువురు మంత్రులతో వానర సేన యందు ప్రవేశించి వారి శక్తి, వారిలో ముఖ్యులు మొదలగు వివరములు తెలుసుకొనుమని ఆదేశిస్తాడు. వారు వానర సేనను ప్రవేశించగానే విభీషణుడు గుర్తు పట్టి వారిని శ్రీరాముడికి అప్పచెప్తాడు. వారి యొక్క దీనాలాపన విని సర్వ ప్రాణుల హితకారుడైన శ్రీరాముడు ఇట్లు పలికెను.
*పృచ్ఛమానౌ విముం చైతౌ చారౌ రాత్రి౦చరా ఉభౌ*
*శత్రు పక్షస్య సతతం విభీషణ వికర్షణౌ*  6 25 21
విభీషణా! ఈ ఇద్దరు రాక్షసులు రావణుని చారులు. ఇచటి రహస్యములను తెలుసుకొని శతృ పక్షము నందు తగవు పెట్టుటకై ప్రయత్నించు చున్నారు. వీరి గుట్టు తెలిసినది గావున వదిలి వేయుము. అంతట వారు శ్రీరామునికి జయము పలికి లంకాపురమునకు వచ్చి రావణునితో ఇట్లు పలికిరి.
*యాదృశం తస్య రామస్య రూపం ప్రహరణాని చ*
*వధిష్యతి పురీం ల౦కా౦ ఏక స్తిష్ఠన్తు తే త్రయః*  6 25 32
రాక్షసేశ్వరా! శ్రీరాముని రూపము, అతని అస్త్ర శస్త్రములు చూడ ఈ లంకాపురము నంతయు అతనొక్కడే భస్మీభూతము చేయగలడని తెలియుచున్నది. వానరులందరూ ఇప్పుడు యుద్ధమునకై ఉత్సుకతతో యున్నారు. కావున శ్రీరామునకు సీతను అప్పచెప్పి సంధి చేసుకునుడని శుకసారణులు చెప్పిరి. అప్పుడు రావణుడు ...
*యది మామ్ అభియు౦జీరన్ దేవ గన్ధర్వ దానవాః*
*నైవ సీతాం ప్రదాస్యామి సర్వ లోక భయా ద౭పి* 6 26 2
"దేవతలు, గంధర్వులు, దానవులు నాతో యుద్ధమొనర్చుటకు వచ్చినను, లోకమంతయు భయమును చూపసాగినను నేను సీతను ఇవ్వను" అని నిశ్చయముగా చెప్పెను. తదుపరి రావణుడు మహాబలవంతుడు, మహామాయావి, మాయావిశారదుడు అగు విద్యుత్ జిహ్వ ను వెంట పెట్టుకొని సీత ఉన్న ప్రమాదానవనమునకు పోయి మాయ ద్వారా సీతను మోహ పెట్టుటకై శ్రీరాముని మాయా శిరస్సును తీసుకొని వెళ్లి, శ్రీరాముడు ఇక లేడు గావున వశము కమ్మని సీతతో రావణుడు పలికి వెళ్లిపోయెను. రావణుడు వెళ్ళిపోగానే మాయాశిరస్సు అదృశ్యమయ్యెను. అప్పుడు "సరమ" (సరమ శైలూషుడు అను గంధర్వుని కుమార్తె, విభీషణుని భార్య. సీతాదేవికి సన్నిహితురాలు)అను రాక్షసి సీతకు ధైర్యము నూరిపోయుచు ఇట్లు పలికెను.
*న శక్యం సౌప్తికం కర్తుం రామస్య విదితాత్మనః*
*వధ శ్చ పురుష వ్యాఘ్రే తస్మి న్నై వోపపద్యతే*  6 ౩౩ 9
శ్రీరాముడు ఆత్మజ్ఞుడు. వారు సర్వజ్ఞుడైన పరమాత్మ. నిద్రించుచున్న వారిని వధించుట ఎవనికిని ఏవిధముగాను సంభవము గాదు. పురుష సింహుడగు శ్రీరాముని విషయమున ఈ ప్రకారమైన వధను గూర్చిన సంగతి యుక్తియుక్తముగా లేదు. రావణుని బుద్ధి, కర్మ రెండును చెడ్డవి. అతడు సమస్త ప్రాణులకును విరోధియు, కౄరుడును, మాయావియు అయి ఉన్నాడు. అతడు మీపై (సీతపై) ఈ విధమైన మాయను ప్రయోగించెను. నేను స్వయముగా లక్ష్మణ సహితుడగు శ్రీరాముని దర్శనము గాంచితిని. వారు సముద్ర తీరమున బస చేసి సుసంఘటితములైన తమ సేనలతో సురక్షితముగా యున్నారు. రావణుని వచనములచే బాధ నొందిన సీతకు సరమ తన పలుకులచే ఆహ్లాదమును కలుగ చేసెను. పిమ్మట శత్రునగరముపై విజయమును పొందు మహాబాహువగు శ్రీరాముడు శంఖధ్వని మిశ్రితమగు గొప్ప భేరి శబ్దముతో లంకపై ఆక్రమణము సల్పెను. ఆ భేరినాధమును విన్న రావణుడు మంత్రులనందరిని ఉద్దేశించి చెపుతూ .. "రాముని పరాక్రమములను గూర్చి వింటిమి అలాగే మీరు కూడా వీరులు అని చెప్పెను". అప్పుడు మాల్యవంతుడు (రావణుని బంధువు) ఈ ప్రకారముగా చెప్పెను.
*సందధానో హి కాలేన విగృహ్ణం శ్చ అరిభి స్సహ*
*స్వపక్ష వర్ధనం కుర్వన్ మహ దైశ్వర్య మ౭శ్నుతే*    6 35 8
*ధర్మో వై గ్రసతేఽధర్మం తతః కృత మ౭భూ ద్యుగమ్*
*అధర్మో గ్రసతే ధర్మం తత స్తిష్యః ప్రవర్తతే*            6 35  14
*త త్తు మాల్యవతో వాక్యం హిత ముక్తం దశాననః*
*న మర్షయతి దుష్టాత్మా కాలస్య వశమాగ౭౭తః*      6 36 1
సమయానుసారము అవసరము గలిగినప్పుడు శత్రువులతో గూడ సంధి, విగ్రహము చేయువాడును, తన పక్షము యొక్క అభివృద్ధి యందు లగ్నమై యుండు వాడును గొప్ప ఐశ్వర్యమును పొందగలడు. కావున రావణా! శ్రీరామునితో సంధి చేసుకొనుటయే నాకు ఉత్తమముగా తోస్తున్నది. ఎవతెకొరకై నీపై ఆక్రమణ జరుగుచున్నదో అట్టి సీతను రామునికి ఇచ్చివేయుము. కృతయుగము వచ్చినప్పుడు ధర్మము బలముగలదై అధర్మమును కబళించి వేయును. కలియుగములో అధర్మమే ధర్మమును అణచి వేయును. దుష్టాత్ముడైన రావణుడు కాలమునకు వశమగుతున్నాడు. కావున మాల్యవంతుడు చెప్పిన హిత వచనములు రావణుడు సహించ కుండెను. తదుపరి మంత్రులతో కూడి రావణుడు పరస్పరము విచారణ చేసి తత్కాలమున లంక యొక్క రక్షణను గూర్చిన ఏర్పాటు చేసెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

No comments:

Post a Comment