Sunday 2 February 2020

*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-15*
*శ్రీరాముని యుద్ధ వ్యూహము*
శ్రీరాముడు సమస్త వానరసేనతో సహా లంకలో విడిది చేసిన తర్వాత యుద్ధ వ్యూహము గురించి ఆలోచన చేయ సాగిరి. అప్పుడు విభీషణుడు ఈ విధమైన సూచన చేసెను. "నాతో  (విభీషణుడు)  వచ్చిన నలుగురు రాక్షసులు నా ప్రేరణచే పక్షులుగా మారి లంకకు వెళ్లి వారు చూచి వచ్చిన విషయము వివరించెదను. తూర్పు ద్వారము వద్ద ప్రహస్తుడు, దక్షిణ ద్వారము వద్ద మహోదర మహాపార్షులు, పశ్చిమ ద్వారము వద్ద ఇంద్రజిత్తు, రావణుడు స్వయముగా ఉత్తర ద్వారము వద్ద, పట్టణ మధ్యమమున విరూపాక్షుడు అశేష సేనానితో యున్నారు. రావణుడు కుబేరునితో యుద్ధమునకు వెడలినప్పుడు అరువది వేల మంది మాహావీర్యులైన సైన్యము యున్నది. అప్పటి బలము కంటే ఈనాడు రావణుడు సిద్ధపరచిన సైన్యము చాలా అధికముగా యున్నది" అని చెప్పెను. శ్రీరాముడు అప్పుడు విభీషణుని సూచనతో ఈ విధముగా యుద్ధ వ్యూహమును రచించెను. అనేక వానరులతో కూడి నీలుడు లంక యొక్క తూర్పు ద్వారము వద్ద ప్రహస్తుని, అంగదుడు దక్షిణ ద్వారము వద్ద మహాపార్షుని, మహోదరుని, హనుమ పడమటి ద్వారమును, రావణుని వధకై ధృడ నిశ్చయముతో నున్న నేను (శ్రీరాముడు) లక్ష్మణునితో కూడి ఉత్తర ద్వారమును కబళించవలెను. సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు నగరము యొక్క మధ్య భాగమును ఆక్రమించ వలెను. వీరందరూ మహావీర్యులైన అనేక మంది వానర భల్లూక సేనలతో అప్రమత్తముగా యుండవలెను. యుద్ధము జరుగుతున్నంతసేపూ వానరులలో ఎవ్వరును మనుష్య రూపమును స్వీకరించరాదు. రాక్షసులు గూడ కామరూప ధారులే కానీ వారి దృష్టిలో నర, వానరములు హీనమైనవి. అందులోనూ వానర రూపము చాలా నిక్రుస్టమైనదిగా వారు భావించెదరు. అందుచే మనవారు గుర్తించుటకు వానరులు వానర రూపముతోనే యుండవలెను. మేము ఏడుగురము నేను (శ్రీరాముడు), లక్ష్మణుడు, విభీషణుడు మరియు వారి నలుగురు మంత్రులు తప్ప ఎవ్వరును మానవ రూపములో యుండరాదు.
*ఏకో హి కురుతే పాపం కాల పాశ వశం గతః*
*నీచే నాత్మా౭౭పచారేణ కులం తేన వినశ్యతి*  6.38.7
కాలము యొక్క పాశమున బంధింపబడిన ఏ ఒకానొకడో పాపము చేయుచున్నాడు కానీ ఈ నీచుని స్వకీయ దోషముచే కులమంతయు నశించి పోవుచున్నది. ఈ విధముగా సైన్య విభాగము చేసి సువేల పర్వతమును ఎక్కి లంకనంతయును చూడవలెనని సంకల్పించెను. ఇట్లు ఆలోచించి చిత్రములగు సానువుల గల సువేల పర్వతమును లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమ ఇత్యాది మహావీరులతో కూడి అధిరోహించిరి. ఆ రాత్రి యంతయు వారు ఆ పర్వత శిఖరముననే యుండి లంకానగర శోభను తిలకించిరి. సువేల పర్వత శిఖరమున నిలిచి రెండు యోజనముల విస్తారము గల ఆ పట్టణమును వానరులతో గూడి రామలక్ష్మణులు చూచిరి. ఆ పట్టణము విశ్వకర్మచే నిర్మింపబడినది. సువేలమున నిలచిన వీరికి త్రికూట పర్వతమున నిలచిన రావణుడు కనబడెను. అతను సంధ్యాకాలమందలి నల్లని మేఘము ఆకాశములో నిలిచినట్లున్నది. వానర రాజైన సుగ్రీవుడు ఇతర వానరములతో చెప్పకుండా రోషావేశుడై పర్వతాగ్రము నుండి ఎగిరి గోపురాగ్రమున దూకి రావణుని ఎదుట నిలిచెను. అంతే ఆవేశముగా అతని తలపై నున్న కిరీటమును క్రింద పడవైచెను. అప్పుడు రావణుడు సుగ్రీవుని చేతులతో పట్టుకొని క్రింద పడవైచెను. సుగ్రీవుడు నిలపడి బంతిలాలేచి ఒకరినొకరు పెనుగులాడుకొని బాహుయుద్ధమును చేసిరి. ఇంతలో రావణుడు తన మాయాబలమును ప్రదర్శించుటకు ప్రారంభించెను. అది గమనించి సుగ్రీవుడు వానిని వంచించి ఆకాశమున ఎగిరి రాముని వద్దకు వచ్చి నిలబడెను. అప్పుడు రాముడు నీవు సాహసివే అయినను ప్రభువులు ఇట్లు చేయరాదు అని చెప్పెను.
*త్వయి కించి త్సమా౭౭పన్నే కిం కార్యం సీతయా మమ*
*భరతేన మహా బాహో లక్ష్మణేన యవీయసా*
*శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వ శరీరేణ వా పున:*
నీవేమైనా అయినచో నాకు సీతమ్మతో ఏమి పని? భరతుడు గాని, శత్రుఘ్నుడు గాని, లక్ష్మణుడు గాని ఎందుకు? నీవు లేనినాడు నా శరీరమే అక్కరలేదు.  ఇది శ్రీరామునికి వానరుడైన వానితో గల మైత్రీ బంధమును సూచించును. *"ఆత్మానం సర్వదా రక్షేత్ దారైరపి, ధనైరపి"* భార్యను, ధనమును త్యజించి అయినను శరీరమును కాపాడుకొనవలెను. ధర్మాచరణమునకు మొదటి సాధనము శరీరమే! మిత్రుడు లేనిచో అట్టి శరీరము కూడా కాదనుకొనినాడు. ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు. "సుగ్రీవా! నేను మనసులో ఇట్లు నిశ్చయించుకున్నాను. నీవు మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడివని ఎరుగుదును. కానీ భయముచే శంకించితిని. ఒకవేళ నీవు మరలి రాకపోయినచో రావణుని పుత్రులతో, సైన్యముతో సహా చంపి విభీషణుని రాజుగా చేసి అయోధ్య యందు భరతుని రాజుగా నిలిపి నేను శరీరము త్యాగము చేయదలచుకొన్నాను. నీవు లేని నాకు ఈ దేహము ఏల?" అప్పుడు సుగ్రీవుడు రామునితో రామా! రావణుని చూడడముతో నాలోని ఆవేశమును ఆపుకొనలేకపోతిని. నేను ఒక వ్యక్తిగా యుండుటకు నీ దాస్యమే కదా! మన్నింపుము అని అనెను. తరువాత పర్వతమును దిగి యుద్ధమునకు సన్నద్ధమైరి.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

No comments:

Post a Comment