Thursday 6 February 2020

యుద్ధ కాండము-21

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-21
రావణ పరాభవము
రణరంగమున మూర్ఛితుడై యున్న రావణుడు స్పృహలోకి వచ్చెను. పిమ్మట వాడియైన తన శరములను, ధనస్సును గ్రహించి భీకరముగా పోరుసల్పగా వానర వీరులందరు పలాయనం చిత్తగించిరి. అప్పుడు హనుమ శ్రీరాముని వద్దకు వెళ్లి విష్ణుభగవానుడు, గరుత్మంతుడిపై కూర్చొని దైత్యులను సంహరించినట్లు, నా (హనుమ) భుజములపై కూర్చొని రావణునకు దండన ఒసగమని కోరెను. అందుకు సమ్మతించిన శ్రీరాముడు హనుమ భుజములపై నెక్కి ధనుస్సు టంకారనాదము గావించెను. ఆ టంకారము వానరులలో ఉత్సాహమును, రాక్షసులు లో భీతిని గొల్పించెను.  శ్రీరాముడు రాక్షసరాజగు రావణునితో ఇట్లు పలికెను.
య దీన్ద్ర వైవస్వత భాస్కరాన్ వా
స్వయమ్భు వైశ్వానర శంకరాన్ వా
గమిష్యసి త్వం దశ వా దిశో వా
తథా౭పి మే నా౭ద్య గతో విమోక్ష్యసే     6 59131
తతో రామో మహా తేజా రావణేన కృత వ్రణమ్
దృష్ట్వా ప్లవగ శార్దూలం క్రోధస్య వశ మేయివాన్  6.59.136
యో వజ్ర పాతా౭శని సన్నిపాతాన్
న చుక్షుభే నా౭పి చచాల రాజా
స రామ బాణా౭భిహతో భృశా౭౭ర్తశ:
చచాల చాపం చ ముమోచ వీరః          6 59139
రావణా! నీవు ఇంద్రుడు, యముడు, సూర్యుడు - వీరి యొద్దకు కానీ, బ్రహ్మ, అగ్ని, శంకరుడు - వీరి సమీపమునకు గాని, లేక దశ దిక్కులకు గాని పరుగిడి పోయినను ఇప్పుడు నా చేతి నుండి కాపాడబడజాలవు. శ్రీరాముని వచనములు విని రావణుడు రాముని మోయుచున్న హనుమను తీవ్రమగు బాణములతో కొట్టెను. రావణ బాణములతో దెబ్బతిన్న కొలది సహజమగు తేజస్సు గల హనుమ అంతకంతకును తేజస్వంతుడయి విజృంభించు చుండెను. రాముడు సుందరమగు రూపము గలవాడు. ఇతరులకు ఆనందం గలిగించువాడు. అట్టివాడు రావణుని దెబ్బలు తిని రక్తముతో తడిసి యున్న హనుమను జూచి కోపమునకు వశుడయ్యెను. ఈ శ్లోకము రామ స్వభావమును నిరూపించును. ఎప్పుడు పడితే అప్పుడు అతనికి కోపము రాదు. కోపము వచ్చినను అతని మాటలలో పౌరుష్యముగాని, అశ్లీలముగాని కనబడదు. తనకంటే, తనవారికి బాధ కలిగినప్పుడు సహింపజాలడు. కొట్టినవాడు రావణుడు. దుష్టమైన మాటలు మాటలాడుటయే అతని స్వభావము. "రావయతి అసత్ ప్రలాపాన్ కారయతి" చెడుమాటలను పలికెడివాడు, పలికించెడివాడు రావణుడు. సేవకునికి కలిగిన వేదనను చూచి రాముడు క్రోధుడాయెను. ఇది రామ స్వభావము. కోపము వచ్చెడి పద్ధతి ఇది. పిదప శ్రీరాముడు రావణునిపై ఆక్రమణ సలిపి రథము, గుఱ్ఱములు, ఛత్రము, పతాకం, సారథి మున్నగు వాటితో కూడిన అతని రథమును చేధించెను. ఏ రావణుఁడైతే వజ్రము యొక్క అఘాతముచే కూడా క్షోభ పొందకుండెనో, అట్టి రావణుడు శ్రీరాముని బాణఘాతములచే గాయపడి కంపితుడై పోయి సాయంకాలమున ప్రభ తగ్గిన సూర్యుని వలననే తేజోరహితుడయ్యెను. అట్టి స్థితి యందు యుద్ధభూమిలో రాక్షసరాజైన రావణునితో శ్రీరాముడు ఇట్లు చెప్పెను.
కృతం త్వయా కర్మ మహత్ సుభీమం
హత ప్రవీర శ్చ కృత స్త్వయా౭హమ్
తస్మాత్ పరిశ్రాన్త ఇతి వ్యవస్య
న త్వం శరై ర్మృత్యు వశం నయామి   6.59.142
గచ్ఛా౭నుజానామి రణా౭ర్దిత స్త్వం
ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం
ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ
తదా బలం ద్రక్ష్యసి మే రథస్థ:  6.59.143
రావణా! ఇతరులకు అసాధ్యమైన రీతిలో నీవు యుద్ధము చేసి యుంటివి. ఫలితముగా నా పక్షమున యున్న పెక్కు గట్టి వీరులు నెలకొరిగిరి. ప్రస్తుతము నీవు మిగుల అలసి యుంటివి.అందువలన నేను ఇప్పుడు నిన్ను మృత్యుముఖమునకు పంపను. కావున నీవు లంకకు వెళ్లి సేద తీర్చుకొనుము. పిమ్మట రథముపై ధనుర్బాణములను తీసుకొని రణరంగమునకు తిరిగి రమ్ము. అప్పుడు నీకు నా బలమెంతయో తెలియగలదు అని చెప్పెను. రావణుడు, గర్వమును, సంతోషమును కోల్పోయినవాడై లంకకు పోయెను. ఆ రాక్షసరాజు లంకలో ప్రవేశించిన పిమ్మట రాముని బాణములకు మిక్కిలి భీతిల్లి ఆందోళన పడ సాగెను. ఇది మన భాగ్యము. రాముడు ఆయుధము లేనివానిని, పరిగెత్తుచున్న వానిని, వెనుతిరిగిన వానిని, రక్షించు అని అనక పోయినను తనను రక్షించుకొను ప్రయత్నము చేయని వాడిని తగిన ఆయుధ సామాగ్రి లేక నిర్వీర్యుడై చలించి పోవుచు నేలపై యున్నవానిని కొట్టడు. లోకములో అందరి ద్వేషమును పొంది జీవించు చున్నాడు రావణుడు. పొందవలసిన శ్రీరామసన్నిధి పొందుటకు అవకాశము లభించియు జారవిడుచుకొన్నాడు. ఇది అంతయు మన జీవితములో జరుగుచునే యుండును.
(ఈ 59 వ సర్గ మకుట భంగము అనగా కిరీటము విరుగుట ప్రధానముగా నిరూపించిన సర్గ కావున దీనిని పారాయణ చేసినచో దీర్ఘకాలం నుండి చికిత్సకు లొంగక భాధించుచున్న రోగములు తప్పక తగ్గును. ఎన్నడును నేలపడని కిరీటము ఎట్లు నేలపడెనో, అదే విధముగా ఎప్పటి నుండియో వదలని రోగములు శరీరమును వీడిపోవును. సందేహము లేదు అని ప్రవచన శిరోమణి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు సెలవు ఇచ్చి యున్నారు).
త్రేతాయుగ ధర్మము ప్రకారము రాముడు నిరాయుధుడైన రావణుని సంహరించకుండా విడిచి పెట్టెను. ద్వాపరయుగములో మహాభారత యుద్ధములో నిరాయుధుడైన కర్ణుని యొక్క అకృత్యములను గుర్తుచేస్తూ కర్ణుని సంహరించమని అర్జునుని ప్రోత్సహించాడు భగవానుడైన శ్రీకృష్ణుడు. ఈ యుగ ధర్మము ప్రకారము అకర్మణత్వము అనగా శత్రువుపై జాలితో అతనిని వదులుట మంచిది కాదు. భారతీయ రాజనీతి యందటువంటి నిస్సహాయ అహంకారము మరియు అకర్మణత్వము చరిత్రలో చోటుచేసుకున్నది. ఈ అకర్మణత్వమును పృద్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీ పట్ల ప్రదర్శించెను. పదహారు పర్యాయములు మహమ్మద్ ఘోరిని  పృద్వీరాజ్ చౌహాన్ ఓడించెను. మరింత కఠినముగా ఉండకపోవుట వలన అనేక మార్లు తిరిగి తిరిగి భారత దేశముపై దండయాత్ర చేసి పదిహేడవ పర్యాయము ఘోరీ పృద్వీరాజ్ చౌహాన్ ను ఓడించి చివరకు సంహరించెను.  వ్యూహాలకు మారుపేరైన చాణక్యుడు, ఈతనినే కౌటిల్యుడు అని అంటారు. ప్రజారంజకంగా పాలించని నందులను రాజ్యభ్రష్టులను చేసి చంద్రగుప్తుని సింహాసనము అధిస్టింప జేశాడు. గొప్ప మహోన్నత మానవతా వాది. ప్రజలకు పాలన దగ్గర కావాలని చెప్పిన ఆయన ప్రజలే రాజ్య నిర్మాతలని తెలిపారు.  ప్రజారంజకము కానీ రాజులను కుటిల నీతితోనైనను సంహరించవచ్చు అని చెప్తాడు.  విదేశీయులు పరిపాలిస్తే ధనం వారి దేశానికి తరలించుకుని పోతారు... కాబట్టి మంత్రులు, ఉన్నతాధికారులుగా విదేశీయులకు అవకాశం ఇవ్వరాదని అన్నారు.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment