Saturday 22 February 2020

యుద్ధ కాండము-36.2


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-36.2
ఆదిత్య హృదయము - భావార్థము
యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమర రంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను. యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.
అగస్త్య మహర్షి చెప్పుచున్నాడు:
ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.
ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము. అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.
(సూర్య నామావళి) :-
ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసంఖ్యాకములైన కిరణములు గలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించు చుండువాడు. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.
(సూర్య నమస్కార: ) :-
స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ! సూర్యభగవానుడా! నీకు నమస్కారము. జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.
బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము. రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రసాదించు చుండును. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే. ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.
(ఫలశ్రుతిః ):-
రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు. దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు. మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను. పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను. పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

No comments:

Post a Comment